ఓ అపురూపమైన కానుక: హౌస్ సర్జన్                         

 

కృష్ణ మోహన్  బాబు

mohanbabu“ మెడిసిన్ ఓ మహా సముద్రం.  లోతు తెలియని, అవతలి ఒడ్డు తెలియని ఒక మహా సముద్రం.  దాని లోతు పాతులు తెలుసుకోకుండా బయట నిలబడి చూస్తే, అందులో ఈదటం చాలా తేలికనిపిస్తుంది.  లోనికి దిగామా ?  ఆ ఆరాటానికి అవధుల్లేవు.  విజ్ఞానం మీద తృష్ణే గాని, తృప్తి అనేది లేదు.

మెడిసిన్ ! మెడిసిన్ !! మెడిసిన్ !!!  అవే నా కలలు.  అదే నా ఆశా జ్యోతి.  అదే నా జీవిత పరమావధి. “

డా. ఎస్. మధుకర రావు, అప్పుడే చదువు పూర్తి చేసుకుని, హౌస్ సర్జన్సీ లో చేరిన కుర్రాడు.  సామాన్య కుటుంబం, తండ్రి లేకపోతే తల్లే వున్న ఆస్తి అమ్మి డాక్టరు చదివించింది.  ఓ చిరునవ్వుతో చుట్టు పక్కల అందర్నీ ఆకట్టు కోగలిగిన ఈ కుర్రాడి హౌస్ సర్జన్సీ అనుభవాలే డా. కొమ్మూరి వేణుగోపాల రావు గారు రాసిన “హౌస్ సర్జన్.”  ఇదొక మెడికల్ డైరీ .

ఆర్దర్ హైలీ అనే బ్రిటిష్ కెనడియన్ రచయిత 1965 ప్రాంతాల్లో “హోటల్ “  లాంటి ఇన్వెష్టిగేషన్ రచనలు చేస్తున్న సమయంలో వచ్చిన పుస్తకం ఇది.  ఈ తరహా రచన తెలుగులో ఇదే మొదటిది.  ఈ నవల అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడింది .  అప్పట్లో చాలా మందిలో ఈ పుస్తకం డాక్టర్ కావటానికి ప్రేరణ అయిందని చెప్తారు.  ఇంకో విషయం యేమిటంటే, హైలీ రాసినా, ఆ తర్వాత తెలుగు లో మరి కొంత మంది రచయితలు రాసినా, ఇన్వెష్టిగేషన్ రచనల కోసం ఒక వస్తువుకి సంబంధించిన కథలు ఎత్తుకోవటం, దానిలో అనేక మలుపులు తిప్పుతూ తాము చెప్పదలుచుకున్న సవివరణలని అందులో యిమిడ్చారే గాని ఏ విధమైన వంకర, టింకరాలూ లేకుండా, వైద్యం లోని ప్రతి విభాగాన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ, దాని మీద ఏ మాత్రం ఆశక్తి తగ్గకుండా, ఎత్తిన పుస్తకాన్ని దించకుండా చదివించే నవల ఇది.  చాలా మంది వేణుగోపాల రావుగారి మొదటి నవల “ పెంకుటిల్లు” గొప్ప రచన అని మెచ్చుకుంటారు.  అయితే అలాంటి నవలల్ని, అతని సమకాలీకులు ఆ తర్వాత కూడా చాలా మంది  రాశారు.  కాని,
“హౌస్ సర్జన్” లాంటి నవల ఎవరూ ఇప్పటికీ రాయలేదు.

నవలలోకి తీసుకెళ్ళటం కొంచెం కష్టమైన పని.  ఎందుకంటే, కథ అంటూ ఏమీ లేదు.  మెడికల్ హౌస్ సర్జన్సీ చేసేప్పుడు మెడికల్ వార్డులు, పీడియాట్రిక్స్ , ఇ.ఎన్.టి , చెస్టు డిపార్టుమెంట్లలో పోస్టింగ్సు వుంటాయి.  సర్జికల్ హౌస్ సర్జన్సీ టైములో అన్ని సర్జికల్ వార్డులు, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీలలో పోస్టింగ్సు వుంటాయి.  ఇవి కాక గైనిక్, కాజువాల్టీలలో పోస్టింగ్సు వేరే వుంటాయి.  డా. మధు హౌస్ సర్జన్సీ ప్రయాణం మెడికల్ వార్డు, ఔట్ పేషంట్లతో ప్రారంభమై , తర్వాత సర్జికల్ పోస్టింగ్ , ఆ తర్వాత గై నిక్ , ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ నుంచి స్పెషల్ పోస్టింగ్ లోకి వచ్చి, కాజువాల్టీ, దాన్నుంచి రేడియాలజీ లతో హౌస్ సర్జన్సీ పూర్తి చేసి, టైఫాయిడ్ తో సిక్ అయి, స్టూడెంట్ సిక్ రూములో రోగిగా చేరి, ఆ అనుభవం కూడా కూడగట్టుకొని, పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు.  ఒక్కొక్క విభాగంలో చూసిన రోగాలు, వాటి ట్రీట్ మెంట్, రోగులు, వాళ్ళ మనస్తత్వాలు, ఎమర్జన్సీలు, అసిస్టెంట్లు, డాక్టర్లు, నర్సులు, చీఫ్ లు అలా ప్రతీ అంశాన్ని తడుముకుంటూ నడుస్తుంది ఈ యాత్ర.

2213_front_cover

ఓ మంచి డాక్టరుకి సహనం, సమయస్ఫూర్తి, ధైర్యం, అంతకుమించి మానవత్వం చాలా అవసరం.  మెడిసిన్ మీద శ్రధ్ధా శక్తులున్న ఎవరికైనా హౌస్ సర్జన్సీ పీరియడ్ మహత్తర దశ అని నమ్మిన డా. మధు తనకెదురైన ఎన్నో అనుభవాల్ని మనతో పంచు కుంటాడు.  సెలైన్ ఎక్కించడానికి వెయిన్ దొరక్కపోతే మొదటిసారి ‘ఓపెన్ మెథడ్ ‘ లో చర్మం కోసి రక్తనాళం బయటికి తీసి ఎక్కించటంతో డాక్టరుగా సాహసం మొదలవుతుంది.  మరో రోజు డిఫ్తీరియాతో వచ్చి ఊపిరాడక విల విల లాడుతున్న ఓ మూడేళ్ళ కుర్రాడికి, వైద్యం చేయవలసి వస్తుంది.  ఆన్టీ  డిఫ్తీరిక్ సీరం ఇచ్చి ఇ.ఎన్.టి. సర్జనుకి కబురు పెడ్తాడు.  గంట లోపల ట్రెకియాటమీ చేయక పోతే పిల్లాడు బతకడు.  ఇ.ఎన్.టి. డాక్టరు డ్యూటీ అయిపోయి ఏదో సినిమాకి వెళ్తాడు.  ఏం చేయాలి?  విద్యార్థి గా వుండగా ఒకటి, రెండు సార్లు చూసిన జ్ఞాపకంతో తప్పని పరిస్థితులలో ఆపరేషన్ కి సిధ్ధ పడ్తాడు డా. మధు.  చెయ్యక పోతే పిల్లాడు బతకడు.  సరిగా  చెయ్యక పోయినా బతకడు.  ప్రాణం కాపాడటం కోసం సాహసం చేసి నెగ్గుతాడు.  డా. మధు ఎదుర్కొన్న యిలాంటి ఎన్నో అనుభవాలని రచయిత మనల్ని దగ్గరకు తీసుకెళ్ళి, చూపించి విడమరచి మరీ చెప్తాడు.  అదీ ఇన్వెష్టుగేషన్ రైటింగ్ అంటే. మనల్ని కూడా యిందులో లోతుగా మునిగి పోయేలా చేయటం రచయిత సాధించిన విజయం.

ఓ రోజు అంబిలికల్ హెర్నియాతో ఓ రోగి వస్తాడు.  ఆలస్యం చేసి పీకల మీదకు తెచ్చుకుంటాడు.  రోగికి చావు బతుకుల సమస్య.  ఆపరేషన్ చేయడానికి మంచి కేస్ దొరికిందని డా. మధు సంతోషిస్తూ, “ఒక రకంగా వైద్య వృత్తి అతిక్రూరమైనది.  హార్టు కేసు చూసిన ఫిజీషియన్, ‘ఆహా వినండి, వినండి మర్మర్  ఎంత బ్యూటీఫుల్ గా వినిపిస్తోందో ‘ అంటాడు.  ఈ వృత్తిలో ఎంత దారుణం  దాగి వుంది” అని స్వగతంగా అనుకుంటాడు.  ఇది వైద్య వృత్తిలోని మరో కోణం.

డా. మధు తో పాటు వచ్చే పోయే పాత్రలు, చీఫ్, డా. రంగనాధం, డా. కామేశ్వరి, హాస్పిటల్ సూపరింటెండెంట్, డా.దయానంద రాజు, మెడికల్ అసిస్టెంట్స్, డా.నాయుడు, డా. రామదాసు మొదలైన వాళ్ళంతా ఒకటి, రెండు పేరాల పరిచయమే అయినా పుస్తకం మూశాక మనల్ని వదలరు.  తోటి డా.మృదుల ప్రేమ, నర్సు నళినీ ఆరాథన ఈ మెడికల్ డైరీ కి కాస్త తడిని కలిగించి ఈ రచనని నవలగా మారుస్తాయి.  డాక్టరుకి  నర్సుకీ వుండే చిత్రమైన రిలేషన్, పరిధులు దాటే కొంతమంది నర్సులు, వాళ్ళతో తిరిగే డాక్టర్లు, రకరకాల మనస్తత్వాల రోగులు, హాస్పటల్ని నడిపే నియమ నిబంధనలు, ఇవన్నీ మరో ప్రపంచం.  ఈ ప్రపంచంలోని ప్రతి మూలకీ తీసుకెళ్తుందీ రచన.

ఇవన్నీ పాత జ్ఞాపకాలు.  హాస్పిటల్ అంటే ప్రభుత్వాసుపత్రి మాత్రమే అనుకొనే రోజులు.  ఇప్పుడు అన్నీ మారి పోయాయి.  వైద్యం కార్పొరేట్ పరం అయింది.  వేల ల్లో , లక్షల్లో ఖర్చు.  వుచితం వూహకందని విషయం.   ఫ్యామిలీ డాక్టర్లు మాయమయి, అవయవానికో డాక్టరు వచ్చాడు.  కనీసం రక్త పరీక్ష లేకుండా ఫ్లూ జ్వరానికి కూడా మందు రాయలేని కాలం.  మున్నాభాయిలు ‘వ్యాపమ్’ లో డిగ్రీలు కొనుకుంటున్నది నిజం.  వైద్యం లోను అనేక మారులు వచ్చాయి.  కొత్త కొత్త రోగాలు వచ్చాయి.  వాటికి కొత్త కొత్త మందులూ వచ్చాయి.  అవయవాలు తీసి అమర్చటం అవలీల గా జరుగుతోంది.  చెడు ఎక్కువగా కనబుడుతున్నా, మంచి కూడా చాలా వుంది.  ఎందుకంటే మనుషుల్లో భావోద్వేగాల్ని ఎవరూ తీసేయ లేరు.  ఆపరేషన్ ఫెయిలు అయితే ఆందోళన పడే డాక్టర్లు ఎప్పటికీ వుంటారు.  అందుకే ఈ నాటి విషయాలతో ఎవరైనా మళ్ళీ యిలాంటి రచనకు ప్రయత్నించ గలిగితే అది కొమ్మూరి వేణుగోపాల రావుగారి కిచ్చే అధ్భు తమైన నివాళి అవుతుంది.

*

 

మీ మాటలు

 1. Satyanarayana Rapolu says:

  ఆర్యా! వైద్యశాల పదానికి బదులు ఆసుపత్రి అనే పడికట్టు పదం విపరీతంగ ప్రచారంలోనికి వచ్చింది. రచయితలు, భాషా నిపుణులు కూడా గుడ్డిగ అనుకరిస్తున్నరు. ఆసుపత్రి అసలైన తెలుగు పదమైనట్లు భావిస్తున్నరు. బ్రిటిష్ పాలనలో క్రిస్టియన్ మిషనరీలు ప్రజలలోనికి చొచ్చుక పోయెటానికి ఇంగ్లిష్ పదాలను దేశీ పదాలవలె మార్పు చేసినయి. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన ‘ఆస్పతాల్’ అని, దక్షిణాదిన ‘ఆసుపత్రి’ అని మార్పు చేసిండ్రు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, స్వచ్ఛమైన పదం ‘వైద్యశాల’ ఉండగా ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. ‘వైద్య కళాశాల’ను వ్రాస్తున్నట్లే, ‘వైద్యశాల’ను వ్రాయాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమీ కాదు. కనుక, యధాతథంగ ‘హాస్పిటల్’ అని లిప్యంతరీకరణ చేయవచ్చు. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన సరియైన పదాలు! ప్రజలు మీద రుద్దబడిన అవకర పదం ఆసుపత్రి ని పరిహరించాలె. అచ్చమైన పదం ‘వైద్యశాల’ మాత్రమే వ్యవహారంలో ఉండే విధంగ ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె.
  ~డా.రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణ

 2. మణి వడ్లమాని says:

  ధన్యవాదాలు కృష్ణ మోహన్ గారు మొన్న ఈ మధ్యనే ప్రముఖ రచయిత్రి నందుల సుశీల గారిని కలిసినప్పుడు. ఈ నవల గురుంచి అడిగితె ఆవిడ అన్నారు. అప్పట్లో 100 ఏమ్స్చో పుస్తకాలలో ప్రముఖంగా కనిపించే పేరు. ఒక డాక్టర్ తన వృత్తి మీద కదా రాయడం నిజంగా గ్రేట్ అని చెప్పారు. కళ్ళు కట్టినట్లు ఉంటుంది. ఆ జీవితం. మొన్న ఆమధ్య వ్యక్తిత్వం లేని మనిషి చద్వుతున్నప్పుడు అనిపించింది. ఈ పుస్తకం చదవాలని.

  నవలని బాగా పరిచయం చేసారు పుస్తకం చదవాలనే కోరిక ఇంకా బలపడింది

  మణివడ్లమాని

 3. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  చాలా కాలం తర్వాత మంచి నవలను జ్ఞాపకం చేశారు. మరోసారి చదవాలనిపిస్తోంది మీ సమీక్ష చదివాక. ధన్యవాదాలు.

 4. మంచి నవలని పరిచయం చేసారు . రాబిన్ కుక్ కల్పిత కథలు ఎన్నో చదివినా , ఈ పుస్తకం ఇంకా బావుంటుందన్న భావం కలిగింది మీ పరిచయం చదివాకా . తప్పక చదవాలి .
  లైఫ్ ఓకే – హెచ్ డి చానెల్ లో రోషిని అని ఒక సీరియల్ వస్తోంది . ఇప్పటి సమకాలీన వైద్య ప్రపంచాన్ని పరిచయం చేస్తూ బాగుంటోంది చాలా .

 5. కె.కె. రామయ్య says:

  డా. కొమ్మూరి వేణుగోపాల రావు గారి “హౌస్ సర్జన్” తో పాటు ఆర్దర్ హైలీ ‘ది ఫైనల్ డయాగ్నోసిస్’ (The Final Diagnosis) కూడా చదవదగిన పుస్తకం.

 6. madhubabu says:

  మంచి నవల.చదివిన తర్వాత చాలా రోజులు మనసుని పట్టి పీకుతూనే ఉంటుంది హీరో యి న్ ఆరాధన .

మీ మాటలు

*