వెలుగు కాదు, నీడ గురించి…

 

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఒక ప్రశ్న తరచూ ఎదురవుతుంది.
ఎంతకాలం? అని!
ఎంతమందీ? అని!

దైనందిన జీవితం ఎప్పుడూ ఒక ప్రవాహమే కదా? అందులో ఎన్ని చిత్రాలు తీస్తూ ఉంటావని!
మనుషుల గురించి రాయడం అన్నదానికి ఒక పరిమితి ఏమైనా ఉంటుందా? ఎంతమందిపై రాయడం అని!

తలవంచుకుని తమ మానాన తాము పనిచేసుకునే ఎవరికైనా ఇలాంటి ప్రశ్నలు చికాకు పెడతాయి.
కానీ జవాబు వేస్టు. చెప్పడం వేస్టే.

రోజూ వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టే స్త్రీ ఏమి ఆలోచిస్తుందని చెబుతాం?
ప్రతి రోజూ వండివార్చి ఇంటిల్లీపాది కోసం జీవించే గృహిణి ఏందుకని నిర్విరామంగా ఆ పని చేస్తుందని వివరించాలి!

ఇష్టం అనీ చెప్పలేం.
కర్మా అనీ అనలేం.

కొన్ని పనులు ప్రశ్నతో జవాబుతో నిమిత్తంగా జరగాలి.
అంతే. జరగాలి.

అయితే ఒక మాట.

కొందరు ఒక శతాబ్ద కాలానికి సరిపడా ముద్ర వేస్తారు.
మరికొందరు కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునే మార్పూ తెస్తారు.
ఇంకొందరు ఏండ్ల పాటూ మరచిపోని స్థితిని కలగజేస్తారు.
అటువంటివారిని గుర్తు పెట్టుకోవడం మన ధర్మం. వారు ప్రాతఃస్మరణీయులు.
నిజమే వారిని కొలుచుకుందాం.

ఒక కలాం గారు పోతే, మరొక చలసాని ప్రసాద్ గారు మరణిస్తే జాతి జీవనం ఒక్కపరి ఆగి గుండె తీవ్రంగా కొట్టుకుంటుంది. కలాలు, గళాలూ గోషిస్తాయి. వారంతా కొన్ని బృందాలకో లేదా కొన్ని భావజాలాలలో లేదా మరే దానికో ప్రాతినిథ్యం వహించే మనుషులు. అందువల్ల వారు ఎంచుకున్న బాటలో… నడిచిన దారిలో మరిన్ని అడుగులు వేయాలనుకునే చాలామంది చాలా కదిలిపోయి రాస్తారు. బాగుంటుంది చదివితే!

వారు ప్రతినిధులు. మహనీయులు. సామాన్యులు కానేకాదు.
తమ అసామాన్య కార్యాలతో, జీవన శైలితో, నిరాటంకమైన పనితీరుతో చరిత్రలో వారు చిరస్మరణీయులుగా గుర్తింపు పొందుతారు. కానీ, వారెంతమంది ఉంటారు? నూటికి ఇరవై ఉంటే మహా ఎక్కువ.

కానీ, మిగతావారి సంగతేమిటి?
వారంతా మామూలు వాళ్లు. ద్వితీయులు. వారివి సాధారణమైన జీవితాలు.
అద్వితీయమైన కార్యమేదీ చేపట్టనందున వారి బ్రతుకూ, మరణమూ వార్త కాదు..వార్తా కథనం కాదు.. లైవ్ టెలికాస్ట్ కానేకాదు.
నిజం.

ఎక్కడా తమ ఉనికి గురించి ఎవరికీ తెలియకపోవచ్చు.
అలా అని వారు లేరా?

ఒక న్యూస్ లేదీ ఈవెంట్ లేదా ఒక ఇంపార్టెంట్ సిట్యుయేషన్.
ఈ మూడింటికీ చెందని జీవన కథనం వారిది.

సెలబ్రిటీ స్టేటస్ వారికి ఎన్నడూ దక్కకపోవచ్చు.
దక్కాలన్న ఆశా అక్కర్లేదు.
అలా అని వారిది జీవితం కాదా?

గుండె స్పందిస్తూ ఉంటే, లబ్ డబ్ అని అంటూ ఉంటుందని చెప్పుకుంటాం.
ఇందులో నీకు లబ్ ఇష్టమా? డబ్ ఇష్టమా? అంటే ఏం చెబుతాం?
అన్ని కలిస్తేనే శృతి తప్పని జీవితం కదా!
అందుకే దైనందిన జీవితంలో పనిముట్ల గురించిన పని అన్నది జరుగూతూ పోవాలె.
ఎంతమందిపై అనీ, ఎంతకాలమనీ అంటే ఏం చెబుతాం?

మరెందుకో కలాం గురించి రాస్తారు?
విరసం నేతల గురించి వ్యక్తి పూజను మరిపించేలా రాస్తారు?

వారి గురించి రాయద్దొనికాదు. కానీ, ప్రశ్నలు అడగడమే చికాకు.
సామాన్యుల వద్దకు రాగానే అమూర్తంగా ఉండటం ఎందుకని ఒక మాట.
ఏం చేసినా- అది ఎవరికో ఒకరికి, దేనికో ఒకదానికి… ప్రాతినిథ్యం వహించేది కావాలన్న స్వార్థం ఎందుకో?

అయినా ఇవ్వన్నీ ఎందుకుగానీ, ఒక మాట.

మీ వాడకట్టులో చనిపోయిన ఒక మనిషి గురించి ఈ వారం రాశారా?
తమరు నివసించే ప్రాంతంలో ఒక స్మశానం ఉంటుంది. అక్కడ అంత్యక్రియలు జరిగిన ఒక సామాన్యుడి జీవితకాలం కృషి గురించి ఒక పూట ఆలోచించారా?

పోనీ, ఇదిగో…. వీరు ఉదయాన్నే పనికి వెళుతున్నారు?
వారు ధరించిన పనిముట్ల నీడ వారి భుజంపై పడగా ఎప్పుడైనా చూశారా?

చూడకపోతే చూడండి.
శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదివి స్ఫూర్తిపొందడం గొప్ప విషయమే…
కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ తో ఉత్తేజితులు కావడం మంచిదే.
కానీ కండ్లెదుట… కష్టం, సుఖం మాదిరిగా వారిని అంటిపెట్టుకునే నీడ కూడా సాహిత్యమే.
వారిని వెన్నంటి నిలిచే కళ కూడా జీవకళే…
కడమదంతా నాకు నిరర్థకమే.

– కందుకూరి రమేష్ బాబు

మీ మాటలు

  1. Rajasekhar Gudibandi says:

    నేను కొద్దిరోజుల నుండి మధనపడుతున్న విషయం ఇదే ….మీర్రాసింది చూడగానే ప్రాణం లేచివచ్చినట్లే అయింది….
    ఈ మధ్య మా పొలం చూసుకొనే సాల్మన్ రాజు భార్య (పాము కాటు తో )అకాల మరణం నన్ను కలచివేసింది..ముగ్గురు పిల్లలు..అందరికి పెళ్లిల్లు చేసి చక్కగా స్థిరపరచింది..ఈ క్రమం లో ఆమె ఎంత రెక్కల కష్టం చేసిందో , అంత సులువుగా మర్చిపోయే విషయం కాదు…
    నిజమే నీడల గురించి ఆలోచించాలి …
    ఇప్పుడు వెల్తురు నుండి కాదు …నీడల నుండి స్ఫూర్తి పొందడం నేర్వాలి….

  2. ”రోజూ వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టే స్త్రీ ఏమి ఆలోచిస్తుందని చెబుతాం?
    ప్రతి రోజూ వండివార్చి ఇంటిల్లీపాది కోసం జీవించే గృహిణి ఏందుకని నిర్విరామంగా ఆ పని చేస్తుందని వివరించాలి!”

    రమేష్ గారు చాలా బాగా చెప్పారు. నా భార్య రోజూ ఇంటి ముందర ముగ్గేస్తున్నా నాకు ఈ ఆలోచన తట్టలేదు. ఆ ముగ్గును కావాలని తుడిచేసి, కేరింతలు కొట్టే మా ఎదురింటి రెండేళ్ల పిలగాడు కూడా నాకు పెద్ద పజిల్.

    ఈ రైటప్ నాకు కొంత బాధ కలిగించిన అంశాలూ ఉన్నాయి.

    ”మరెందుకో కలాం గురించి రాస్తారు?
    విరసం నేతల గురించి వ్యక్తి పూజను మరిపించేలా రాస్తారు?”

    కలాంను అభిమానించేవాళ్లు ఆయన గురించి రాస్తే తప్పేముంది. అలాగే చలసాని ప్రసాద్ గురించి రాస్తే అభ్యంతర మేముంది? మీరు గుండెనిండుగా ప్రేమించే సామాన్యుల కోసం పడ్డ తపన విషయంలో కలాం చలసాని కాలి గోటికి కూడా సాటిరాడు. చలసానిని స్మరిస్తే మీకు కోపం రావొచ్చేమో కానీ, చలసాని సామాన్యుల్లోకెల్లా సామాన్యుడు. విరసం నేతల స్మరణ వ్యక్తిపూజ కిందకు రాదు. సామాన్యుల కోసం జీవితాన్ని అర్పించిన వారి గురించి రాయడం వారి సేవలను గుర్తించుకోవానికే. విరసం వ్యక్తిపూజకు వ్యతిరేకమన్న విషయం మీకు తెలుసనుకుంటాను. సారంగలో కానీ, ఇతర పత్రికల్లో కానీ నాకు తెలిసి చనిపోయిన విరసం నేతల గురించి మీరన్న వ్యక్తిపూజ భావనతో రాసిన సందర్భాలు లేనేలేవు. ఇంకా చెప్పాలంటే, సామాన్యులకు చోటు రాజకీయాల్లో మునిగితేలే ప్రజాద్రోహులు చచ్చిపోతే వ్యక్తిపూజను మరపించేలా రాసిన సందర్భాలు కొల్లలు. తెలంగాణ జాతిపిత అని ఒకరినికాదు ఇద్దరిని పొడుగుతుండడం మీకు తెలిసిందే.
    ఇంకో విషాదం. చలసాని నుంచి సాయం, బోలెడన్ని పుస్తకాలు అందుకున్న తెలంగాణ మేధావులు, చరిత్ర పరిశోధకులు ఆయన చచ్చిపోతే కనీసం ఫేస్ బుక్ లోకూడా నాలుగు మాటలు రాయలేదు. ఈ మేధావులే.. సామాన్యుల చేతికి చిప్ప ఇచ్చిన రాజకీయ నేతల గురించి చాటభారతాలు రాసి శోషొచ్చి పడిపోయారు.

  3. కవి , కలాం , రచయిత, వ్యాఖ్యాత , విమర్శకుడు , చిత్రకారుడు , గాయకుడు ,దర్శకుడు ,దార్సినికుడు , తత్వవేత్త , శాస్త్రకారుడు , శస్త్రకారుడు.. ఎవరైతేనేమి ? అందరు ఆ వాస్తవ జీవితం నుంచి ప్రేరణ పొందవలిసిందే .
    సాలెల మగ్గం కుమ్మరి చక్రం సమస్త వృత్తుల సమస్త చిహ్నాల వాసన అవపోసన పట్టకుండా పై గుర్తింపు
    పేర్లతో చెలామణి కాలేరు . ఎంతో కొంత ప్రేమ గలవారే ఆ మేధో శ్రమ తో గుర్తింపు పొందుతారు . అంత మాత్రాన వేరు గొప్ప కాదు . వారు తక్కువ కాదు . మేదోశ్రమను శారీరక శ్రమను (విలువ కాదు ) ఒకే గౌరవం
    గొడుగు క్రిందకు తేవడం అనేది ఒక సుదూర కల . ఏది ఏమైనా మీ దృష్టి కోణానికి అభినందనలు

  4. kandukuri ramesh babu says:

    మేదోశ్రమను శారీరక శ్రమను (విలువ కాదు ) ఒకే గౌరవం
    గొడుగు క్రిందకు తేవడం అనేది ఒక సుదూర కల . బాగా అర్థం అయ్యేలా రాసారు. థాంక్ యు సర్.

Leave a Reply to P Mohan Cancel reply

*