వాళ్ళ ‘ఇడా’, మన ‘దువిధా’!

 

ల.లి.త.

lalitha parnandiఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు గతవైభవాల స్మరణా, భజనా చేస్తున్నాయి.  కాస్త పెద్ద బడ్జెట్ అయితే చాలు ఒకప్పటి అద్భుత మానవుల సంశయాలు, విజయాలే కథా వస్తువులు. Period films పేరుతో  ప్రేమ, ఈర్ష్య, బానిసత్వం, దురాశ లాంటి మానవ లక్షణాలు అన్నిట్నీ ముదురు రంగుల్లో ముంచి తీసి సినిమాకు పులుముతున్నారు.  ఆ కాలానికి చెందిన కుండా, చట్టీ, చెప్పూ, కారూ సినిమాలోకి ఎంత కరెక్ట్ గా తెచ్చి చూపించామా అన్నది  అసలు సినిమా కంటే పెద్ద గొడవై కూచుంది.  దాని తర్వాతది రక్తధారలు ధారాళంగా కురిపించటం. ఒక్క మాటలో Period,  Detail,  Graphic violence… ఈ మూడిటి మధ్యే  ఈనాటి సినిమా కుదించుకు పోయింది. 

ఈమధ్య ప్రపంచానికి అమెరికా ‘Game of Thrones’ అనే మహత్తర టీవీ సీరియల్ ను ప్రసాదించటంతో ఈ మూడు దినుసుల గిరాకీ మనకీ మరింత ఎక్కువ కాబోయే ప్రమాదం  కనిపిస్తోంది.  ఇంత పెద్ద పెద్ద డైనోసార్లలాంటి దేశ విదేశ సినీ హీరోల సినిమాల, సీరియళ్ళ హంగామా మధ్య వింతగా ఓ చిన్ని కుందేలు పిల్ల లాంటి  సినిమా మన వొళ్ళోకి వచ్చి కూర్చుని అలరించింది.  అది  2014 సంవత్సరానికి ఉత్తమ విదేశీ చిత్రంగా అకాడమీ అవార్డ్ అందుకున్న పోలిష్ సినిమా ‘ఇడా’. ఆస్కార్ ఆర్భాటాలే గానీ  ఉత్తమ విదేశీ చిత్రం అవార్డ్  పొందే సినిమాలు మన సినిమా హాళ్ళలోకి రావు. నిజానికి కొన్నిసార్లు ఇవే ఆస్కార్ లు గెల్చిన అమెరికన్ సినిమాల కంటే బాగుంటాయి.

‘ఇడా’ గురించి సినిమాప్రియుల్లో  చర్చ బాగా జరిగింది.  ఇదీ గతకాలపు కథనే చెప్పినా, ఇప్పటి గ్రాఫిక్ మహిమల మహా గాథలకూ ఏ అలంకారాలూ లేని ‘ఇడా’ కథకూ పోలికే లేదు.  దర్శకుడు పావెల్ పావ్ లోవ్ స్కీ, సినిమాటోగ్రాఫర్  లుకాస్ జాల్ కలిసి ఈ సినిమాను బెర్గ్ మన్,  బ్రెస్సోఁ  ల పక్కన కూచోబెట్టే ప్రయత్నం చేశారు. ఆ మహా దర్శకులను గుర్తుకు తీసుకొచ్చింది ‘ఇడా’.

తనవారు ఎవరూ లేని ‘ఇడా’ ఓ కాన్వెంట్ లో పెరుగుతుంది. సన్యాసినిగా ప్రతిజ్ఞలు తీసుకోబోయే ముందు ఆమెకున్న ఒకే ఒక్క బంధువు, ఆమె పిన్నిని ఓసారి చూసి రమ్మని పంపిస్తుంది కాన్వెంట్ మదర్.  తనకో పిన్ని ఉందని తెలియటం ఇడా కు పెద్ద ఆశ్చర్యం అయితే, తన  తల్లిదండ్రులు యూదులనీ,  రెండో ప్రపంచ యుద్ధకాలంలో బలైపోయారనీ తెలియటం ఊహకందని మరో వ్యథ.  వాళ్ళు ఎలా చనిపోయారో, ఎవరు చంపారో తెలుసుకునే అన్వేషణలో ఈ ఇద్దరు ఆడవాళ్ళూ బయలుదేరుతారు. ఒద్దికైన ఇడాకు పూర్తి వ్యతిరేక స్వభావం ఆమె పిన్నిది. ఈ ఇద్దరి అనుభవాలూ, భావాలూ, సహానుభూతులూ వైరుధ్యాల కెలైడోస్కోప్ ఈ సినిమా.

 

photo 2ఫ్రేమ్ ల పొదుపరితనంలో బ్రెస్సోఁ స్థాయి పరిపక్వతకు దగ్గరగా వచ్చేసింది ‘ఇడా’. మరి మొత్తమంతా ఓల్డ్ మాస్టర్స్ లాగే తీసేస్తే మన ముద్ర ఏదని ఆలోచించుకున్నారో ఏమో, ఫొటోగ్రఫీలో ఈ మధ్య ఎక్కువగా వాడుతున్న  ‘negative space’ ను సినిమాలోకి తెచ్చిపెట్టారు దర్శకుడూ సినిమాటోగ్రాఫర్ కలిసి.  జాగ్రత్తగా వాడకపోతే బెడిసికొట్టే మందు ఈ ‘negative spacing’.  ఫ్రేమ్ లో సబ్జెక్టు ఆక్రమించిన ప్రాంతం తప్ప, ఖాళీగా ఉన్న మిగతాదంతా negative space.   ఫ్రేమ్ లో సబ్జెక్టు (positive space) సైజు కంటే ఎక్కువగా వదిలేసిన ఆ ఖాళీకి సరైన అర్థం, తూగు ఇవ్వగల్గితే మంచి ఫోటో అవుతుంది.  ఇవ్వలేకపోతే అది అతి మామూలు  ఫోటోగా కూడా కాదు, వెర్రి ఫోటోగా మిగుల్తుంది.  ఇడా లో ఈ  ‘negative spacing’ సరిగ్గా సమకూడింది.  ప్రారంభంలోనే  ఇడా క్రీస్తు బొమ్మకు రంగేస్తూ సినిమా ఫ్రేమ్ కు కిందున్న ఎడమ మూలలో కనిపిస్తుంది. ఇలా సినిమా అంతా చాలావరకూ మూలల్లోనూ, ఫ్రేమ్ కి అడుగుభాగానా సర్దుకుంటారు ఇద్దరు ఆడవాళ్ళూ.  వాళ్ళ ఒంటరితనం, నిస్సహాయ పరిస్థితిని తోపింపచేయటం ఈ  ఫ్రేమ్ ల లక్ష్యం అనిపిస్తుంది. చివర్లో ఇడా తన బ్రతుకు గురించిన నిర్ణయాన్ని తీసుకుని అడుగులు వేసేటప్పుడు ధీమాగా  ఫ్రేమ్ లో సరిగ్గా కనిపిస్తుంది.

photo 3

సినిమా అంతా ఉట్టిపడే  పిక్టోరియల్ ఫోటోగ్రాఫిక్ దృశ్యాల గురించి చెప్పనే అక్కర్లేదు. వాటితో వచ్చే క్లాసిసిజం తిరుగు లేనిది.  అందులోనూ మళ్ళీ అందంగా కొత్తరకంగా పిక్టోరియల్ నియమాలు దాటేస్తూ వచ్చారు.  ఒక్కటి కూడా అనవసరమైన ఫ్రేమ్ కనిపించదు. 1:1.33 academy ratio లో తీయటం వల్ల ఈ పోకడలన్నీ సాధ్యపడ్డాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమా స్కోప్ (దీర్ఘ చతురస్రం) కాకుండా పాత సినిమాల్లాగ నలుచదరంగా అన్నమాట. ఇంకా, ఒక సీన్లో మంచు మధ్యలో గుండ్రటి గట్టు మధ్య నిలబడి ఉన్న క్రీస్తు విగ్రహాన్ని  “Christ is the Key” అని తోచేట్లుగా తీసిన కెమెరా కోణం ఎంతటి ఊహ ఉంటే సాధ్యపడుతుంది?  ‘ఇడా’ కు వాడిన లైటింగ్ పధ్ధతి కూడా సినిమాటోగ్రాఫర్ లకు తెలిసిన పాఠాలనే మళ్ళీ కొత్తగా నేర్పుతుంది.  Linear narrative  గా ఉంటూనే  ‘ఇడా’ రూప ప్రధానమైన సినిమా కూడాను.  ఈ సినిమాటోగ్రఫీ విధానం చాలా ఆకర్షణీయంగా కొత్తగా ఉండటంతో ‘ఇడా’ ప్రేమలో పడి ఎడాపెడా దాన్ని చాలామంది దర్శకులూ సినిమాటోగ్రాఫర్ లూ వాడే అవకాశం కూడా ఉంది.  ఆ పని ఇప్పటికే మొదలైపోయి ఉండవచ్చు.

photo 4 (1)

 

మన దర్శకులూ, సినిమాటోగ్రాఫర్ లలో తెలివికి ఏ లోటూ లేదు. ‘ఇడా’ను సృష్టించినవాళ్ళు పడిన కష్టంలో పదోవంతైనా వీళ్ళు ఎప్పుడైనా పడి మనదైన సినిమాను తీస్తారా? ఏమో !

మనదైన సినిమా కోసం తపన పడ్డ దర్శకుడు రిత్విక్ ఘటక్.  ప్రాచీనం కాని సినిమా మీడియంలో ప్రాచ్యాన్ని దర్శింపజేయాలన్న ఆశయం ఆయనది.  భారతీయ సినిమాలో మణి కౌల్, కుమార్ సహానీలది రిత్విక్ ఘటక్ స్కూల్.  ఇది రూప(form) ప్రధానం. దీన్ని సాధించి ఒప్పించటం కష్టం.  ‘మో’ కవిత్వంలా, త్రిపుర కథలా సరిగ్గా కుదిరితే formalist  సినిమా బ్రహ్మానందాన్నిస్తుంది.  ఏపాటిగా అటుదిటైనా తేలిపోయి నవ్వులపాలై పోతుంది. కుమార్ సహానీ తీసిన ‘మాయా దర్పణ్’, మణి కౌల్ తీసిన ‘ఉస్కీ రోటీ’  1970ల్లో formalist సినిమాలు గా చెల్లిపోయినా ఇప్పుడు చూస్తే అర్థంపర్థం లేనట్టు ఉంటాయి. అనురాగ్ కాశ్యప్ 2007 లో తీసిన ‘నో స్మోకింగ్’ ఓ మంచి formalist సినిమా.  కానీ కాశ్యప్ కు మన కళలతో, భారతీయాత్మతో పెద్దగా అనురాగం లేదు.

‘ఇడా’ చూశాక మణి కౌల్ పూర్తిగా శిల్ప ప్రాధాన్యతతో  ఏ తడబాటూ లేకుండా 1970 ల్లో తీసిన ‘దువిధ’ గుర్తుకు వచ్చింది. ‘దువిధ’ ఒక రాజస్తానీ జానపద కథ.  విజయ్ దన్ ధేతా కథనం. ఈయన కథలన్నీ ‘సందిగ్ధ’ పేరుతో సంకలనంగా తెలుగులోకి కూడా అనువాదం అయాయి.  దువిధ అంటే సందిగ్ధత. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి, అబ్బాయి పల్లకీలో వెళ్తుండగా చెట్టునున్న ఒక దయ్యం చూసి, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు.  ఎంతసేపటికీ కాసులు లెక్క పెట్టుకునే ఆ అబ్బాయి కొత్త పెళ్లి కూతుర్ని తన తల్లిదండ్రులతోనే వదిలేసి వేరేచోటికి వ్యాపారం చెయ్యటానికి వెళ్ళిపోతాడు. ఈ అవకాశం పోగొట్టుకోకూడదని ఆలోచించిన దయ్యం ఆ అబ్బాయి రూపంలో ఈమె దగ్గరకు వచ్చి భర్తగా ఉండిపోతాడు. (నిజాయితీగా తానెవరో ఆమెకు చెప్పి మరీ).  కొన్నేళ్ళు దయ్యంతో సుఖంగా గడిపేక ఆమె గర్భవతి అవుతుంది. తమ వంశం కొత్త చిగురు వేస్తోందని పెద్ద షావుకారు ఊరందరికీ బెల్లం పంచుతాడు.  ఈమె పురిటి నొప్పులు పడుతున్న సందర్భంలో అసలు భర్త తిరిగొస్తాడు. ఈ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు తన కొడుకో పోల్చుకోలేక గాభరా పడతాడు పెద్ద షావుకారు.  చివరకు ఒక గొర్రెల కాపరి తన జిత్తులమారితనాన్నంతా ఉపయోగించి, దయ్యాన్ని పట్టిస్తాడు.  ప్రేమను ఇచ్చి పుచ్చుకున్న దయ్యం అంతమైతే ఆమె మాటలేక మౌనమైపోతుంది.

photo 5

photo 6

ఈ కథను formalist cinema గా తీయటానికి పూనుకున్నాడు మణి కౌల్. భారతీయ చిత్రకళ అతను ఎంచుకున్న form.  మన చిత్రకళలో పొడవూ, వెడల్పేగానీ మూడో కొలత అయిన లోతు కనిపించదు. ఈ చిత్రకళా రూపాన్ని సినిమాలోకి తర్జుమా చెయ్యాలంటే ఎలా?  దానికోసం ఎక్కువగా లాంగ్ ఫోకస్ లెన్స్ ను వాడాడు.  అది ఫ్రేమ్ లో ‘లోతు’ కొలతను అసలు రానివ్వదు. అంటే  ఫ్రేమ్ లో దగ్గరగానూ దూరంగానూ ఉన్న వస్తువులూ, మనుషులూ, బ్యాక్ గ్రౌండ్, అన్నీ కూడా మన పెయింటింగ్స్ లా ఒకే తలంలో కనిపిస్తాయి.  ఈ flatness మీద  గాఢమైన రంగులు, విభిన్నమైన కెమెరా కోణాలు ప్రయోగించి మేజిక్ చేశాడు మణి కౌల్.  (కాఫీని ‘వట్టి గోధుమరంగు వేడి ఊహ’ గా మార్చిన త్రిపురలా)  ‘హై కీ’ ఫోటోగ్రఫీని వాడటంతో లేతరంగు గోడలు, ఆర్చ్ లూ నీటి రంగుల చిత్రంలో తడి ఆరుతున్న కుంచె గీతల్లా కానవస్తాయి. కదిలే ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్ లా ఉంటుంది ‘దువిధ’ సినిమా.  వేదనా భరితమైన రాజస్తానీ జానపద గీతాలూ, రంగుల తలపాగాలూ పెయింటింగ్ లోని ముఖ్యమైన డీటెయిల్స్ లాగా భాసించాయి.  ఇన్ని చేసీ,  ఇంత గొప్ప డ్రమటిక్ కథలోంచి ‘డ్రామా’ ను (డ్రామా మన భారతీయ పద్ధతే అయినా!) పూర్తిగా బైటకు గెంటేసి non-narrative style ను అనుసరించాడు మణి కౌల్.  అయినా ‘దువిధ’ చూస్తుంటే విషాదాన్నీ ఆనందాన్నీ తూలికతో మనసుమీద ఎవరో తేలికగా అద్దిన భావనకు లోనవుతాం. అలా అది ఓ అర్థవంతమైన formalist  సినిమాగా నిలుస్తుంది. తూర్పుమీద కాస్తగా పడమరను పూసి  తనదైన కళ నిండిన సినిమాను సృష్టించాడు మణి కౌల్.

photo 7

photo 8

‘ఇడా’, ‘దువిధ’ … రెండూ తీరికగా ఆలోచించి, ధ్యానించి తీసిన సినిమాలు.  రెండిటిలోనూ స్త్రీ ‘సందిగ్ధ’ యే.  రెండిటిలోనూ రూప సారాలు ఒకదానికొకటి మంచి నేస్తాల్లా నిలబడ్డాయి.  రెండిట్లోనూ అవి పుట్టిన నేల వాసన బలంగా  వస్తుంది. ‘ఇడా’ కొన్ని క్లాసిక్ ఫోటోల కూర్పులా ఉంటే దువిధ పెయింటింగ్ ల సమాహారంలా ఉంటుంది.  తేడా ఒకటే. ‘ఇడా’ మామూలు పద్ధతిలో చెప్పిన కథ. ‘దువిధ’ non narrative గా మరింత ఎక్కువగా మేథో విన్యాసం చేస్తుంది.

ఆఖరుగా దర్శకుడు రాబర్ట్ బ్రెస్సోఁ ని మరోసారి స్మరిద్దాం. ఆయన అభిప్రాయంలో ఫిల్మ్ మేకర్ పని సృష్టించటం కాదు. జరుగుతున్నదాన్ని గుర్తించటం. కెమెరా ఆన్ చేసి దృశ్యాన్ని, కదలికలనూ చూస్తూ పోతుంటే ఎక్కడో ఒక సరైన కదలిక, ఒక సరైన ఫ్రేమ్,  చాలా యాదృచ్చికంగా వస్తుందట. దాన్ని గుర్తించటమే  ఫిల్మ్ మేకర్ పని అంటాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ గ్రహణం సినిమాను కమ్మేస్తున్న రోజుల్లో ఇంతటి జెన్ ధ్యానం చెయ్యగల సినీ మహానుభావులు నూటికి ఒకరైనా ఉంటారా? ఉండకపోరు. వాళ్ళ వల్లే ఇలాటి సినిమాలు ఎప్పుడైనా ఓసారి వస్తుంటాయి.

*

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. A nice read. Just realised that Duvidha also had been remade into “Paheli” in 2005 ( https://en.wikipedia.org/wiki/Paheli )
    I am very fond of your writing :)

  2. Aranya Krishna says:

    An excellent film appreciation. Thank you Lalitha garu!

  3. Bhavani says:

    చక్కని విశ్లేషణ

  4. అక్షర says:

    ఈ తరం లో ఉండి ఈ తరానికి తెలయాని రెండు గిప్ప సినిమా ల గురించి చక్కగా చెప్పారు మేడమ్

  5. Dr. Vijaya Babu, Koganti says:

    Duvidha was a nice movie infact. Similarly Ida. But to our audiences who are being swept away in the flow of meaningless visuals, will they really appeal? Nice presentation.Congrats!

  6. paresh n doshi says:

    succinct narrative in 2D. keep it అప్.

  7. ఎన్నో కోణాల్లో ఏంతో అవగాహన, లోతైన పరిశోధన, పరిశీలన !! వాక్యాల్లో వెలుగు నీడల్ని చూడడం బావుందండీ, its great !

  8. మంజరి లక్ష్మి says:

    మీ వ్యాసం చదివి artist వేసిన బొమ్మల్లా ఉన్న దువిధ సినిమా చూడాలనుంది. youtube లో ఉంటుందా? ఇడా సినిమాలో అనలు రంగులే లేవు. అది అంతా black & white సినిమానా?

  9. Narayanaswamy says:

    చాలా బాగుంది వ్యాసం లలిత గారూ! ఇటువంటి చక్కని విశ్లేషణ అందించిన వ్యాసాన్ని మీకూ ప్రచురించిన సారంగ కు నెనర్లు! సినిమా అనగానే గూగుల్ చేసి వికిపీడియా సమాచారాన్ని తమకున్న మిడిమిడి గ్నానానికి జత చేర్చి రాయడం కాదు – దాన్ని చాలా లోతుగా పరిశీలనాత్మకంగా చూడాలి, అందుకు విశ్లేషించే శక్తి, కళాత్మక దృష్టి , చారిత్రిక దృష్టి అవసరం అని మీరు నిరూపించారు. ఇట్లాంటి మరిన్ని ఆణిముత్యాల్ని మాకందించండి దయచేసి.
    మీ రన్నట్టు మణి కౌల్, కుమార్ సహానీ రిత్విక్ ఘాటక్ ని గురువుగా అంగీకరించినప్పటికీ వారిద్దరూ పూర్తిగా రూపవాదం వైపు వెళ్ళిపోయారు. రిత్విక్ దా తన సినిమాల్లో సాధించిన అద్భుతమైన రూప సారాల సమతుల్యాన్ని వదిలేసి కేవలం రూపానికి ముఖ్యంగా రాబర్ట్ బ్రెసో లాంటి దర్శకుల ప్రబావం తో సినిమాలు తీసారు బ్రెసో కి మణి కౌల్ సహాయ దర్శకునిగా పనిచేసాడు కూడా!

  10. సినిమాల గురించి మీ పరిజ్నానం చాలా లోతుగా ఉంది. దువిధ నేను చూశానండి. అప్పుడెప్పుడో దూరదర్శన్ లో వచ్చింది. అప్పుడు చాలా మంచి సినిమాలు వచ్చేవి.

  11. Lalitha P says:

    స్పందించిన అందరికీ ధన్యవాదాలు. ఔను. ప్రజ్ఞా, దువిధ అమోల్ పాలేకర్ దర్శకత్వంలో పహేలీ గా వచ్చింది. కానీ షారుఖ్ వంటి స్టార్ తీసిన సినిమా కావటంతో అమోల్ కొంత రాజీ పడ్డాడు. ముగింపును మార్చేసి విషాదాన్ని పల్చన చేశాడు. చూడదగ్గ పాపులర్ సినిమానే అది.
    మంజరి గారూ, ‘ఇడా’ నలుపు తెలుపుల్లో తీసిన సినిమానే. torrents లో డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. అదృష్టవశాత్తూ ‘దువిధా’ కు సినిమాటోగ్రాఫర్ గా చేసిన నవ్ రోజ్ కాంట్రాక్టర్ ఆ ప్రింట్ నూ రంగుల్నీ సరిచేసి పెట్టిన వెర్షన్ యు ట్యూబ్ లో దొరుకుతోంది subtitles తో సహా.
    నారాయణ స్వామి గారూ, బ్రెస్సో కు సహాయ దర్శకుడిగా పని చేసింది మణి కౌల్ కాదు. కుమార్ శహానీ. మీరు చెప్పినట్టు వీరిద్దరూ రూప వాదం వైపు వెళ్ళిపోయినా ‘దువిధా’ కథా బలానికి మణి కౌల్ ప్రయోగాలు తోడయి ఆ సినిమా రూప సారాల సరైన మేళవింపు అయింది.

  12. naresh g says:

    A very enlightening study of films Ida and Duvidha. Both are great work of art , Ida contemplative in its austerity and minimalist realism and Duvidha being true to the soul and style of Indian art form. I would like to believe both the directors knew they were creating unique cinema, “cinema as an art” . I am not so sure the directors of the period films you spoke of have any such lofty ideas , other than making a spectacle or a successful money-spinning franchise.

    “The lives of others ” , ” English patient” are also great period film, which will make for intense emotional, cinematic experience.

  13. Narayanaswamy says:

    లలిత గారూ – అవును మీరే కరక్ట్ కుమార్ సహానీ బ్రెసో వద్ద పని చేసారు మణి కౌల్ కాదు – నేను పొరపాటుగా రాసాను – సరిద్దినందుకు నెనర్లు

  14. సినిమాల మీద ఈ ఆర్టికల్ చూడడం సంతోషకరం. నాకు మణి కౌల్ సినిమాలు చాల ఇష్టం. నాకు ఐడా పెద్దగా నచ్చలేదు visually బావుంది కాని చాలా cliched కదా. మీరు Bela Tarr సినిమాలు చూస్తే అయన style కి మణి style కి పోలికలు కనపడతాయి. మీరు ఇంకా ఇలాంటి articles రాయాలని ఆశిస్తున్నాను.

    • Lalitha P says:

      ఈ వ్యాసం మీద చాలా మంది స్పందించటం చాలా సంతోషంగా ఉంది నాకు. మంజుల గారూ, నేనీ వ్యాసంలో ‘ఇడా’ ను ప్లాట్ పరంగా విశ్లేషించలేదు. అది మరో పెద్ద వ్యాసం అయిపోతుంది. ఒక organised మతంలో శాంతిని వెదుక్కోవటం cliched గానే ఉంటుంది. కానీ ‘ఇడా’ లో ‘వాండా’ పాత్ర ఇడా కంటే కూడా సంక్లిష్టమైనది. వాండా ఈ సినిమాకు ప్రాణం. ఈమె ఇడా కు కౌంటర్ పాయింట్. ఈ ఇద్దరి కలయికలో సంఘర్షణలో ఎన్నో గ్రే షేడ్స్… ఈ hues ప్లాట్ లోని cliche ను పలచన చేస్తాయి. Pavelovsky seems comfortable in not crossing the theological confines in spirit and intent.

  15. One thing I forgot to mention, duvidha is modelled after puppet shows. Hence the flatness. You also hear that flatness in the dialogue as well.

    • Lalitha P says:

      మీ వ్యాఖ్య ఆలస్యం గా చూశాను మంజుల గారూ. ధన్యవాదాలు.

      పప్పెట్ షోలు చురుగ్గా ఉంటాయి. తోలుబొమ్మలాటలతో సహా. వెలుగు నీడల సయ్యాటలు, depth , సూత్రధారి మాటల్లో పంచ్, డ్రామా అన్నీ ఉంటాయి. మీరు పప్పెట్ షోల లాగా తీశాడని చెప్పినది బహుశా ఆ బొమ్మల ధాతు వర్ణాలకీ దువిధ కలర్ స్కీం కీ ఉన్న పోలిక గురించి అయివుంటుంది. నిజానికి మణి కౌల్ మన miniature పెయింటింగ్ లోని two డైమెన్షనల్ flatness ని మాత్రమె ఇంచుమించు తన సినిమాలన్నిటి లోనూ వాడుతూ దానికి తన visual imagination ను జోడించాడు. దువిధ లో ధాతు వర్ణాలు, హై కాంట్రాస్ట్ ఫోటోగ్రఫీ ఉన్నాయి. ఇక సంభాషణల్లోని flatness కి కారణం ఆయన డ్రమాటిక్ ఎలిమెంట్ కు ఆసలు చోటివ్వక పోవటమే.

      bela tarr కీ మణి కౌల్ కీ పోలిక నాన్ నెరేటివ్ లక్షణాల వరకే. ఇద్దరిదీ contemplative cinema. నిరర్థకత, నిరాశావాదాలను కళాత్మకం గా అత్యున్నత స్థాయికి తీసుకెళతాడు bela tarr . Whereas Mani Kaul’s cinema is celebration of our art and heritage.

  16. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    ‘ఇడా’, ‘దువిధ’ … రెండూ తీరికగా ఆలోచించి, ధ్యానించి తీసిన సినిమాలు. రెండిట్లోనూ అవి పుట్టిన నేల వాసన బలంగా వస్తుంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ గ్రహణం సినిమాను కమ్మేస్తున్న రోజుల్లో ఇంతటి జెన్ ధ్యానం చెయ్యగల సినీ మహానుభావులు నూటికి ఒకరైనా ఉంటారా? ఉండకపోరు. వాళ్ళ వల్లే ఇలాటి సినిమాలు ఎప్పుడైనా ఓసారి వస్తుంటాయి. మంచి విశ్లేషణ.

Leave a Reply to Rekha Jyothi Cancel reply

*