కొనాలి

మొయిద శ్రీనివాస రావు

 

పొద్దున్నే… పదిగంటలకే

పండు మిరపకాయలా

ఎండమండిపోతుంటే

అంతవరకూ … ఆ ఊరిలో

కాకిలా తిరిగిన నేను

తాటికమ్మల కింద

తాబేలులా వున్న

ఓ బడ్డీ కాడ

కాసేపు కూర్చున్నాను

ఎండిన రిట్టకాయ రంగున్న

ఓ పిల్లాడు

ఒత్తైన జుత్తు బొమ్మలున్న

రెండు ‘చిక్’ షాంపూలు పట్టుకెళ్ళాడు

పలచగా పలకర్రలా వున్న

ఓ పిల్ల… డొర్రి పల్లెల్లబెట్టి నవ్వుతూ

‘క్లోజప్’ లా కదిలిపోయింది

శొంటి కొమ్ములాంటి

ఓ ముసలాయిన

‘నవరత్న’ ప్యాకెట్ లా నడిచిపోయాడు

సగముడికిన కూరలాంటి

ఓ ముసాలామె

‘ప్రియా’ పచ్చడి ప్యాకెట్టై

వడివడిగా ముందుకు సాగిపోయింది

లేగదూడకు సైతం పాలివ్వలేని

గోమాతలాంటి ఒకామె  ‘విశాఖ డైరీ’

పాల ప్యాకెట్టై పరుగులు తీసింది

నోట్లోంచి నువ్వుగింజే నాననట్టున్న

ఒకాయిన

‘రిలయన్స్’ రీచార్జ్ కార్డై

రింగుటోనులా రివ్వున పోయాడు

పల్లె కొట్లలో… చిన్న ప్యాకెట్లలో దాగిన

వ్యాపార సూత్రం వడగాలై తాకి

నా గొంతెండిపోతుంటే

‘ఇప్పుడన్నీ చిన్నవేలాగున్నాయ’న్న  నా ప్రశ్నకు

‘అందరూ కొనాలి కద సార్’ అన్న సమాదానం

ఓ స్మాల్ ‘కోలా’ డ్రింకై

కూలుగా నా చేతిలో వాలింది

       * * *

Moida

మీ మాటలు

  1. venugopala naidu k says:

    పల్లె పురోగతి! వినియోగదార్ల ఆధునికత, దిగజార్చబడ్డ పల్లె సీమల ప్రక్రుతి. చాలాబాగుంది శ్రీనివాస రావు.

  2. రెడ్డి రామకృష్ణ says:

    కవిత కొత్తగవుంది.మారుతున్న అవసరాలు ,మార్కెట్ మాయజాలపు విధనాలను కొత్తగా చెప్పారు.బాగుంది.మరికొంచెం జాగ్రత్త పడితే బలమైన ముగింపు వచ్చివుండేది.

    • moidasrinivasarao says:

      ఓకే థ్యాంక్ యు రామకృష్ణ గారు. మీ సలహాను తప్పక దృష్టిలో ఉంచుకుంటాను.

  3. ” కోలా ” ఒక్క గుక్కలో తాగీసుంటారు – అందుకే ఈ కవిత తన్నుకొచ్చింది – కవిత బాగుంది. ఈ విశాల ప్రపంచం లో విఫణి స్వైర విహారాన్ని కొండని అద్దంలో చూపినట్టు ఉంది – గొరుసు

  4. సమయానికి తగ్గ కవిత. ప్రపంచీకరణ విపరీత పరిణామాలను చక్కగా చూపించారు. అభినందనలు శ్రీను.

మీ మాటలు

*