మనిషి పగిలిన రాత్రి

షాజహానా 
shajahanaఆఫీసు నుంచి వచ్చేసరికి మంచం మీద నాకోసం ‘రాత్రి రావడానికి లేటవుతుంది’ అనే నోట్‌ రాసి పెట్టి ఉంచాడు తను. ఎప్పుడు ఇంటికి రాకపోయినా అలా రాసి వెళ్ళి పోవడం అలవాటు. ఇవాళ నా దోస్తులతో తాగి తందనా లాడతానని దానర్ధం. ఇక నేను మౌనినై లేదా టివీ చూస్తూ సజీవ సమాధినై పోతాను. నాకు లేని దోస్తులతో మాట్లాడుతూ నేను పిచ్చిదానినవుతాను. కాసేపు రాక్షసిని కాసేపు దేవతని అవుతాను. తొలి యవ్వనంలోనే వెంటపడ్డ ఏ వెధవతోనో లేచిపోనందుకు, ఉండి ఉండి వీడిని కట్టుకున్నందుకు బాధపడతాను. ఇప్పుడు కూడా లేచి ఎవరింటికైనా ఎందుకు వెళ్ళలేక పోతున్నానో.. ఆలోచిస్తాను.
చాలా సార్లు ఇలా చేసి చేసి విసుగేసింది. జీవితంలో ఒంటరితనం నాచు ఎంతలా పేరుకు పోయిందంటే.. నేను అసలు కనపడడం లేనంత. ఇవాళ నేనేం చేయను? ఈ ప్రశ్న నన్ను కొన్ని ఒంటరి సంవత్సరాలుగా వేధిస్తున్నా నన్ను కాదనుకొని నాలో నేనే దాక్కొంటూ.. ఒంటరిగా దాగుడుమూతల ఆట. ఒక్కోసారి ఇల్లంతా సర్దేస్తాను. అప్పుడు, ఎపుడో దాచిన బొమ్మలో, డబ్బులో దొరికి కొంతసేపు ఆనందపడతాను. ఒక్కోపుడు ప్రేమగా తొడుక్కున్న పాత డ్రస్సు దొరికి అది వేసుకుని కొత్త డ్రస్సు వేసుకున్నంత ఆనందాన్ని పొందుతూ…!! ఈరోజు అలాక్కాదు. కొత్తగా గడపాలి. వీలైతే తను ఎలా గడుపుతాడో అలా! మొత్తం ఇల్లంతా వెదకగా తను ఎపుడో తాగి మిగిల్చిన క్వార్టర్‌ బాటిల్‌ కనిపించింది. ఎందుకు తాగుతారో, సాయంత్రాలను తాగడానికి ఎందుకు తాకట్టు పెడతారో తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం.. ఫ్రిజ్‌లో ఉన్న బిస్‌లరి సోడా ఆమ్లెట్‌ అన్నీ తనలాగే… టీపాయ్‌ మీద పెట్టుకుని… ఏయ్‌ నువ్వొక్కడివే తాగగలవా? నేనునూ తాగగలను? చీర్స్‌!
భూగోళం తిరగడం మానేసింది. ఇప్పుడు నేనే భూగోళాన్ని! ఎవరో నన్ను బొంగరంలా తిప్పేస్తున్నారు. అందరూ నోరెళ్ళపెట్టుకుని చూస్తున్నారు… అబ్బా వాంతొచ్చేలా వుంది.. ఎందుకిలా.. పట్టుకో వాణ్ణి.. గోడెక్కుతున్నాడు.. లాగెయ్‌ కిందికి.. వాడు ఇప్పుడే రాడు… ఎపుడో తెల్లారు ఝామున వస్తే వస్తాడు… లేదంటే… అంతే…
అర్ధరాత్రి.. గోడమీద వాడి మొహం కాక సుధీర్‌గాడి మొహం కనిపిస్తోంది… చేతిలో గ్లాసుని సూటిగా చూసి కొడ్తే సుధీర్‌గాడి మొహానికి బదులు గ్లాసు బద్దలైనది.. మరో గ్లాసుని విసరగా అది కూడా పగలబడి నవ్వింది.. అసలు వీడి మీద తనకెందుకు కోపం? ఎందుకంటే వీడు తన మగనికి (లోపల ఎవరో పగలబడి నవ్విన శబ్దం) వచ్చే ఉద్యోగాన్ని రాకుండా చేశాడు.. చేయడంలో సఫలీకృతు డయ్యాడు.. వాడిని బొందపెట్ట.. అవును, హాయిగా ఊరి బూతులన్నీ తిట్టుకోవచ్చుగా.. ఈ గదిలో పక్క గదిలో గూడా ఎవర్లేర్‌.. ఎవరూ ఉండరు గూడా.. మరి ఎవరూ ఉండని ఈ సముద్ర గర్భమున ఎందుకు ఆక్సిజన్‌ కోసం ఎదుర్చూపులు?
ఎందుకంటే నాకంటూ ఒకళ్ళుండాలి.. గ్యారంటీ కార్డు ఇచ్చే షాపు ఓనర్లలా నీతోనే ఉంటాను చెలీ.. నిను వీడి వెళ్ళను మరి అంటూ మన చుట్టూనే తిర్గుతూ ఉండాలి.. దాని కోసం ఎన్ని జన్మలైనా.. ఈ జన్మలోనే- ఎన్ని జన్మలైనా ఎదుర్చూస్తూనే ఉంటాన్‌.. ఎవరన్నా వస్తారన్న గ్యారంటీ ఉంటే కదా చూసినా లాభం.. అదేంటి ప్రతీది లాభం.. దీన్ని చేసుకుంటే పది లక్షల రూకలు.. అమెరికా పోవుటకు సరిపోవును.. ఆ తర్వాత మరల మరల అదే ఫేస్‌ను.. ఏం చూస్తాం.. చంపేయ్‌..  బతికి చేసేదేం ఉంది.. అసలందుకే టీవీలు పేపర్లు చూడకూడదు.. అధవా చూసినా.. అధవా ఏంటి వెధవ లాగా.. ఎందుకనగా ఏ ఎన్నారై వెధవ ఎలా భార్యలను చంపింది, చంపబోతుంది, మానసికంగా రోజుకు గ్రాముల చొప్పున ఎలా మెర్సీలెస్‌ కిల్లింగ్‌ చేస్తున్నది.. తెలిసిపోతుంది.. అపుడు మనకనవసరంగా బాధేస్తుంది.. మనలని మనం కాసేపు తిట్టుకోవటమో లేదా మనం ఎంత మంచోల్లమో తలచుకోవటం.. వాక్‌.. తాగాక కక్కొచ్చి నట్టుంటది.. ఎందుకంటే ఇక్కడి ప్రబుత్వాలే కాదు తెల్లోడి గవర్నమెంటూ అంతే.. నేరస్తులను ఎవరేం చేయలేరు.. అసలు రింగిచ్చావా.. రింగు రింగు బిళ్లా రూపాయి దండా దండ కాదురా దామర మొగ్గ మొగ్గ కాదుర.. ఏదో ఉంది.. గుర్తుకు రావట్లే.. గుర్తుకు.. ఆఁ.. గూట్లో రూపాయ్‌.. నీ మొగుడు సిపాయ్‌.. అసలెవరి మొగుడైనా సిపాయేనే ఎర్రి మొహమా.. రింగిస్తే బయట బండి ఆగిన శబ్దం కావాలె కదా..
Kadha-Saranga-2-300x268
గోడ మీద కూకోనున్నాడు ఎందులకు? ఎయ్యి ఒక్క గ్లాసు సూటిగా సూసి ఏస్తే గోళీకాయ పగిల్నట్టు పగలాల వాడి ముక్కుదూలం.. భళ్ళున బద్దలయినది.. చార్మినారులో ఇష్టపడి మోజుపడి కొనుక్కున్న గ్లాసుల్లోంచి ఒక్కొక్కటే గోడకేసి తలకొట్టుకుంటున్నాయి.. మనం ఏదికొన్నా అంతే మన టేస్టుకు దగ్గట్టుగా అందంగా చాలా కాలం మన్నేలా.. కొనుక్కుని పెట్టుకుంటాం కదా.. మొగుళ్ళని పెళ్ళాలు పెళ్ళాలని మొగుళ్ళు కొనుక్కున్నట్టు! అందులో ప్రేమతో కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు సుమండీ! వీరికి పొగరెక్కువ.. పేమ పెపంచకాన్ని జయిస్తదని ఎర్రినమ్మకం.. ఉత్తదే ! అసలెప్పటికీ ఎవర్నీ.. దేనితోని జయించ లేము.. ఇది నిజం.. నిఝంగా అర్ధగంట్లో  ఇంట్లో ఉంటానన్న నా మగధీరుడు ఎటుపోయెను.. ఏ రాజ్యము లేలుచుండెను?
అదిగో మళ్ళీ మధ్యలో అతనెందుకు.. అయినా అతను అనాలా? వాడు గదా! అవును మనం గూడా.. ఎక్కించుకుని ఉన్నాం కదా..! గాలిలో తేలిపోతున్నాం గదా! వాడికి మనకి తేడా ఏం లేదు.. తేడా ఏం లేదూ? ఏమోలే తరువాత కొలుచుకుందుము! ఇప్పుడు పన్చూసుకో.. ఓహో చార్మినారుతో గొడవపడి బేరమాడి కొనుక్కున్న కప్పులు సాసర్లు.. సాసర్లంటే గుర్తొచ్చింది.. ఫారినర్లంతా వేరే గ్రహాలను, అక్కడ జీవజాలాన్నీ జలాన్నీ ఊహిస్తుంటారెందుకు.. మరల వారితో యుద్ధ ములు.. వారితోనూ ప్రేమ వ్యవహారములు.. (అహో మనకి  ఊహలలోనూ పాతివ్రత్యమే!) ఎందుకంటే ఇక్కడివారితో గడిపి బోరుకొట్టి బీరుపట్టి.. వారు సినిమాలు తీయుదురు.. అట్లా ఒక సాసరు వస్తే ఎంత బావుండు.. ఆ సాసర్లో ఒక.. ఆఁ, ఒక? ఒక.. అసలెవరుక్కావాలి నీకు..!
ఏమో? మరి సాసరెందుకు? అవును సాసరెందుకు? కాబట్టి.. అందుచేత.. పనికిరాని సాసర్లు ఉంటే ఏం లేకపోతేం.. సాసర్లని ఒకసారి ఫ్లైయింగ్‌ చేయి.. ఎంత బాగా ఎగుర్తున్నయి..? ఎగిరి దుంకి చిన్న చిన్న సాసర్లైతున్నయి.. భలే ఉంది కదూ.. ఈ సాసర్లలో చాయినే ఎందుకు తాగాలి? ఇంకేమైనా ఎందుకు తాక్కూడదు? ఇంకేమైనా అంటే ఏంటి? మరే, ఇంకా రాలేదేం? ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిం చిందా.. ఇంకంతే.. అసలు అందంగా కనిపించకపోయినా పర్లేదు.. అమ్మాయైతే చాలు.. ఎంత బ్రాడు మెదడ్లు.. సొంగకార్తా ఉంటది.. సొమ్మల రోగం ఉన్నోళ్ళకు మల్లే.. ఇంట్లో ఒకత్తే ఒంట్లో వేడితో కంట్లో దు:ఖంతో కాలిపోతా నలిగిపోతా ఉంటే.. వాడక్కడ కార్చుకుంటా ఎదురింట్లో కుక్క మాదిరి.. కుక్కే కాదు అక్క కూడా ఉందాయింట్లో.. నాకు అక్క, వాడికి.. వీడే కుక్క.. ఇక అక్కెలా అవుద్ది? సొ.. ఓయ్‌ అసలు నీకేం కావాలి.. ఏమైనా కావాలా? అవును ఏదో కావాలి.. ఎవరో రావాలి సాసర్లో! పిల్లి ఎవరూ ముఖ్యంగా నేను చూడట్లేదనుకుని, పాలన్నీ.. హాయిగా తాగేసింది.. తాగుబోతు పిల్లి.. నేనేం చెయ్యలేదు.. ఎందుకంటే నేను పిల్లిని  కాను, కనీసం పాలన్‌ కూడా కాను.. మరి  నేనెందుకు భాధ పడటం.. పిల్లి కూడా పాలు తాగింతర్వాత ఇలా వొత్తుల్‌ దీర్గాల్‌ మార్చి మాట్లాడ్‌తుందా?
mandira1
అతనిలాగే.. అతనేంటి? వాడు! అదిగో.. మళ్ళీ మధ్యలో వారి ప్రస్తావ నెందుకు? పరాయివాళ్ళ నెందుకు తల్చుకోవడం, రింగులివ్వడం? మాట్లాడ్డానికి ఎవరైనా దొరికితే బాగుండు! ఎందుకు? మాటలు తర్వాత చూపులు తరువాత రాసుకోటం గేదెలు గోడలకేసి రాసుకున్నట్లు! అంతే.. అదే ప్రేమ! దానికోసమే.. తన్నుకులాట! పునుకులాట! ఏం వెదుకుతున్నావు, విడిచిపెట్టిన వెన్నెలకుప్పలాటలో పుల్లను  ఈ జీవితకాలంలో నువ్‌ తేలేవ్‌! ఆ పుల్ల ఈ ధూళిలో దుమ్ములో కలిసి ఎక్కడ మాయమైందో.. మనం మాత్రమే మిగిలామ్‌. మనం ఏంటి రాణిలాగ! నేను అనుకోలేవా? లేను, ఇప్పుడంతే నేనే రాణి సేవకి పడక మంచం కంచం మెతుకులు సాసరు కుక్క అక్క దూదుంపుల్ల పిల్లిపిల్ల అన్నీ నేనే అన్నీ మనమే!
 డాక్టరు నవ్వమని చెప్పాడు! ప్రిస్కిప్షన్‌లో నవ్వమని  చెప్పిన మొదటి డాక్టరతను పేషంట్‌ నేను అయ్యుంటామ్‌. అప్పటివరకు తనకు తెలీనే లేదు… తాను నవ్వక ఎన్ని సంవత్సరాలైందో.. నవ్వి ఎన్నేళ్లయిందో.. రెండూ ఒకటేనే ఎంకట్లచ్మీ.. అయినా కోల్పోయిన నవ్వుల్‌ పప్పటికలో దొరుక్తయా నా శాంతనం కాపోతే? డాక్టరేంటి మొగుడికంటే కరెక్ట్‌గా చెప్పేస్తున్నడూ.. మొగుళ్ళ కంటే డాక్టర్లే నయం లాగుందే.. అలాక్కాదే ఎర్రిపప్పా.. ఈ డాక్టరుకి పెళ్ళాం ఉంటుంది కదా.. ఆమెక్కూడా వేరే డాక్టరు దగ్గరే.. ట్రీట్‌మెంట్‌.. సొంత పెళ్లానికి ఏ సైంటిస్ట్‌ మందు కనుక్కోలేడు.. ఒక డాక్టరు మొగుడు కాలేడు.. మొగుడయిన డాక్టరు వేరేవాళ్లకు డాక్టరు.. పెళ్లానిక్కాదు.. అసలే లెక్కల్లో పూరు.. ఏప్పియస్సి చూయింగమ్ము బిట్లు మనక్కెందుకు చెప్పు? అవునూ ఇప్పుడు ఉద్యోగం మనిషి లక్షణమయిన తర్వాత ఉద్యోగాలు తరాజులో పెట్టేసి పెచ్చాపలో.. అనమ్ము కుంటున్రు.. గదా.. లేదంతావేటి?
నిజం చెప్పవే అమ్ములు? అయినా నీదేం పోయింది.. చదువుంతా పోయింది.. కదా.. నీదేం పోయింది.. ముక్కు కళ్లు చెవులూ అన్నీ మూసుకో.. ఛీ.. ఈ సలహా బాలేదు.. అసలు తెరిచిందే.. ఇందాక.. అపుడే మూసేయాలా.. మూసుకోవాలమ్మా.. లేకపోతే దుంపనాశినం.. ఆయేషాను చేసినట్లు చేస్తారు తెలుసా? నిఝంగా.. ఆ తరువాత నీ శవం మీద క్కూడా పేలాలకు బదులు ఉద్యోగాలు జల్లుతారు.. సాక్ష్యాల్లేకుండా హత్యలు చేయించబడును.. అంతర్జాతీయ మార్కెట్‌లో తాజా బోర్డ్‌.. ఒసేవ్‌ నోర్మూసుకో.. గట్టిగా మాట్లాడబోకు.. గోడ్లకి చెవుల్‌ ముక్కు నోరు.. కండ్లు అన్నీ ఉంటయ్‌.. వేలిముద్రల్‌ తప్ప.. ఏం దమ్మీ సెప్తా ఉంటే నీక్కాదూ.. అందుకే టీవీలు పేపర్లు సూడకూడదనేది.. అయినా ఎవరింటున్నరు.. గట్టిగా చద్దరు ముసుగు తన్ని ఏ విషయం లోపట్కి దూరకుంట పండు! చద్దరికి చిల్లుల్లేవు.. ఎన్ని విషయాలు దూరుకుంటొత్తన్నయో..! ఆ అమ్మాయి అంతందమైన సున్నితమైన అమ్మాయి.. నిండా ఇంకా పద్నాలుగేళ్లు నిండా లేనమ్మాయి.. ఎవడి కోసమో యాసిడ్‌ తాగిం దాట! అదేమైనా కొబ్బరి బొండామా లట్టలట్ట తాగడానికి.. పెద్దాపరేషనై.. మంచాని కతుక్కుపోయి.. నీళ్లు తాగినంత వీజీగా విషం తాగుతున్న సీరియళ్లు చూసుకుంటా శేష జీవితాన్ని గడిపేయి నా చిట్టితల్లీ..! ఎవరో లబోదిబో మొత్తుకుంటున్రు.. ఎవరబ్బా.. మొన్నే పెళ్లి చేసి అమెరికాకు ఎగుమతి చేసిన కూతుర్ని.. శవంగా మార్చి దిగుమతి చేశాడంట.. అల్లుడు.. అమ్మా అబ్బా అయ్యుంటారు.. అమెరికాంటని అసూయపడ్డ బందుగుల్‌.. స్నేయితుల్‌.. వాక్‌.. అంతా శవాలమయం! అమెరికా అంటే చాలు.. పొర్లు దండాలు పెడ్తా అమ్మాయిల నిచ్చేస్తారు! నవ్వుతా తుళ్లుతా చలాగ్గా తేలిగ్గా కంప్యూటర్‌ కోర్సులు చదివేస్తుందా.. అయితే మీ అమ్మాయిన్‌ గూడా అమెరికా పంపించండీ! మౌనంగా.. దీనంగా.. దిక్కు లేకుండాగా.. మీ అమ్మాయి పెట్లో పడుకుని వచ్చేస్తుంది.. ఇవన్నీ చేసేందుకు గాను.. ఆ రౌడినాకొడ్కులకి మళ్లీ కట్నం డబ్బుల్‌ గుడా ఇవ్వండేం మర్చిపోకండి…
ఇంతకీ మంది మొగుళ్ల గురించి నీకెందుకే.. అసలు నీ మొగుడేడి? ఏం చేయుచున్నాడు.. ఎక్కడ తప్పిపోయినాడు? ఏ గుర్రాల మీద తిరుగుతున్నాడు? అదిగో మళ్లీ వాడి గురించి.. నీకెందుకు? నువ్వు కావాలన్న రాడు.. వద్దనుకుంటే పోడు.. వాడిష్టం వాడిది.. నీ ఇష్టం నీది! అంతే కదా.. మళ్లీ ఎందుకు ఆలోషన పట్టాలు తప్పుతుంది.. విడిపోదామనుకునే కాడికి ఏడికి పోతేంది.. పోకుంటేంది? వస్తేంది.. రాకుంటేంది..? అసలేంటి నీ సదుద్దేశం.. ఇంత జరిగాక మళ్లీ అదే ముఖాలతో ఎలా కాపురం.. కాపరమా అదేంటి? ఎలా ఉంటుంది? ప్రపంచ మంతా ఇంతే.. సరిగ్గా కాపురం చేయడమే సమాజంలో బతకడానికి అర్హతనుకుంటుంది.. అన్నీ దొంగ కాపురాలు దగా కాపురాలు..! ఎవని కాపురం సొక్కంగుందో జర సెప్పు సెల్లె నీ బాంచన్‌ కాళ్ళిరగ్గొట్ట.. దుడ్డు.. రొక్కం.. రూకలు.. మనీ.. పైసా.. మేక్స్‌ మెనీ థింగ్స్‌.. అంతేనంటావా.. ఎక్కడా స్త్రీలు సంపబడని సోటు.. పోనీ అవమానింపబడని సోటు ఎక్కడైనా ఉందా ఇలా తలంలో.. అని.. సజలాం.. సరక్తాం.. గాహే.. తవ జయగాధా.. గాహే.. ఎహే.. ఇన్ని సప్పుళ్ళకి పక్కింటివాళ్ళు లేవరెందుకు? లేస్తారు.. మనం.. ఇప్పుడు.. మనసు ఖరాబు చేసుకుని లేదా పరిశుద్ధం చేసుకుని సుకంగా నిద్రమాత్రలు మింగేమే అనుకో.. అప్పుడు తెల్లారి నేనెందుకు తలుపు తీయలేదా అన్న క్యూరియాసిటి మొదలవుద్ది.. ఆ తర్వాత.. దుర్వాసన రావడం మొదలవుద్ది.. వాసనే రాకపోతే ఎన్ని శవాలు అనామకమయ్యేవో.. తట్టుకోలేక పోలీసుల కుప్పందిత్తారు.. అంతే.. ఎందుకంటే పెజానీకం పోలీసుల్తో సత్సంబంధాల్‌ పెట్టుకునేంత తెలివి తక్కువగా లేరిప్పుడు.. ఎలాగు తరువాత పట్టించుకోవాల గదా.. ఆ మాత్రం దానికి ఇప్పుడు పట్టిన నిద్రని పోగొట్టుకోవడం దేనికి?
మిగిలిన ఒకే ఒక కప్పు.. లతలతో.. అందంగా కనిపిస్తుంది.. ఇంతందంగా ఎందుకు పుట్టావే..? అదీ పింగాణీవై ఎందుకు పుట్టావే.. హఠాత్తుగా దానిమీద ఎక్కడలేని పేమ ముంచుకొస్తుందెందుకో? వదిలెయ్‌.. నీకే దిక్కు దివాణం లేదు.. దానిమీద నీకెందుకు మమకారం? అదేమైనా నీ కడుపున పుట్టిందా? కడుపునే పుట్టాలా? పుట్టితీరాలా? పుట్టడమో చావడమో ఏదో ఒకటి చేసి తీరాలి! అయితే దీని గురించి రాద్దామా? రాసి తీరాలి కానీ రాయడానికి కూడా స్వేచ్ఛలేదు నీకు!
mandira1నేనేం రాయాలి రాసి ఎవరికివ్వాలి ఎవరితో మాట్లాడాలి అన్నీ వాళ్ళే  నిర్ణయిస్తారు.. అలా ఉంటే ఏం లేదు.. లేదంటే లం..లైపోతారు.. నా కొ…రా అని నేననలేనా? సాహిత్యముతో కూడా పగలు తీర్చుకోవచ్చు.. అయినా ఈ ఎదవలకి మనస్సాక్షి ఉండదా? రేపటి కూచిపూడి డాన్సరుకి సాక్షి అట..పేద్ద హోర్డింగు.. ఎక్కిరిత్తంది.. ఆయేషా! నువ్వు దేనికమ్మా సాక్షి? ఆహా! అపర సత్యవతీ.. ఏ కాలంలో మాటలాడుచున్నావు తల్లో.. తీసుకున్నోడు తీసుకున్నానని చెప్పడు.. చంపినోడు చంపినా అని చెప్పడు.. సపోర్టిచ్చినోడు ఇచ్చినా అని చెప్పడు.. దోచుకున్నోడు దోచుకున్నా అని చెప్పడు.. అదే పెజాస్వామ్యం! అన్నీ అర్దమవుతానే ఉంటయ్‌.. నిజం.. నిప్పులాగా ఔపడతా ఉంటది.. అయినా అంతే మనం వింత చూసేలోపు దొంగ దొరవుతాడు.. దొర దొంగవుతాడు.. నువ్వు నేను ఇట్లా మంచాల మధ్యలో ఉద్యోగాల వేటలో రోజూవారి సోదిలో పడి కొట్టుకు పోతుంటాం.. ఐదేళ్ళకోపాలి ఏలికింత రంగేయిచ్చుకుని.. ఆ తర్వాత నెత్తికింత బుర్ద రాయిచ్చుకుని.. అసలు ఈ కుర్చీల కూర్చి గురించి ఒక నవల రాస్తే బాగుంటదేమో.. ఒక మానవ దేహం ఫలానా కుర్చీలో కూర్చోగానే.. ఎందుకట్టా మారిపోద్ది.. అప్పటి వరకున్న లక్షణాలన్నీ మరచిపోయి.. కుర్చీ లక్షణాలన్నీ ఔపోసన పట్టించేద్ది.. మనిషి అనుకరించటంలోంచే పైకొచ్చాడప్పా.. ఈ నిజం చెప్పినోడెవరోగని ఇది కుర్చిలో కూసోంగనే తెలిసిపోద్ది.. అసలు ముందు మనం.. మనం అంటే మనం కాదుగానీ.. కుర్చీ టేబులు ముందు కూర్చునే వాళ్ళుంటారే.. చూసి చూసి ఎంత ఇసుగేసి పోయినాదంటే.. టేబుళ్ళతోని కుర్చీలతోని అతుక్కుని పుట్టినారేమి?
పని గురించి ముందుకుపోయి  నిలబడినామంటే చాలు నాయాళ్ళ/ల్దికి కూర్చోమనే సంస్కారం కూడా ఉండక పోగా నువ్వేదో వాడి జన్మజన్మల సొమ్మంతా నొక్కేసినట్లు.. వాడి ఆముదం ముఖంలో నా….! నిజం.. వాడి కాలికింద ఏదైనా ఉద్యోగమే ఉందనుకో.. ఇంకంతే భూగోళం చివర్న కుర్చీ ఏసుకుని కూర్చున్నట్లు ఫీలింగు.. ఒరే.. ఎన్ని రకాల కుర్చీలు కావాలంటే బంగారం ప్లాటినం కుర్చీ ఏసుకుని ఫెవికాలంతా ఎనక్క్రాసుకుని కూసున్నా ఆ కుర్చీ భూగోళం పైన ఆగదు కన్నా.. భూమిలోకే పోద్ది.. నువ్వూ అంతే.. ఏకాలం ఏలుకుంటా కూచ్చోవు..
మా నాన్న చెప్పేవాడు.. సిన్నప్పుడు.. నీతన్న మాట.. అంటే ఏంలేదు.. ఏది నిలవదురా కన్నా బుజ్జీ.. నువ్వు చేసిన మంచో చెడో అదే నిలబడుతుందని.. ఇప్పుడ్‌ గూడ చెప్పాలనుంటది గామోసు.. మనం పెద్దగయిపోయినం గదా! పెపంచమంతా చిన్నప్పటి నీతులు తుచ తప్పకుంట పాటిస్తే ఎంత బాగుండు.. కానీ ఇప్పుడు మనం చేసేది మంచా చెడా? ఇదంతెందుగ్గానీ.. శాశ్వతం గానీ కుర్చీల మీద శాశ్వతం గానీ శరీరాలను పడేసి.. ఇంద్రుణ్ని చంద్రుణ్ని.. ఫోజులు కొట్టమాకండ్రా.. కుక్కక్కూడా మంచి రోజొస్తుందట.. మరి నీకు రాటంలో పెద్ద ఆశ్చిర్యం ఏం లే.. అయినా సరే ఇప్పటికిప్పుడు నా దగ్గరున్న అత్యంతాధునిక.. పురాతనాయుధం ఇదొక్కటే కాబట్కి.. నేను తిట్టకుంట దుమ్మెత్తి పోయకుంట ఉండన్రా.. దొంగనాయాళ్లారా.. నోటికాడి కూడు లాక్కోని మీరేం సుఖపడి పోతార్రా.. మీ చేతులకి పక్షవాతం రాను.. ఆ నోటితోనే కదా.. కుట్రలు కుతంత్రాలు చేసేది.. మీ నోరు పడా.. మీ నోట్లో.. అది.. ఇది.. అన్నీ..! ఒరే కళ్లు సల్లపడ్డయా.. ఇంకేమైనా మంటుందేమో.. రండ్రా.. మొన్న ఆపరేషనయిన అమ్మాయి మూత్రం ఇంకా బాటిళ్ళలోనే పడుతున్రు..!
నిజం, మనుషుల్లో మనసున్నోల్లు షానా తక్కువ! నిజం దోస్త్‌..పెద్ద కుర్చీల్లో కూసోనున్నం కదాని మనుషులమనే విషయం మర్చిపోకూడదు గదా.. ముఖ్యంగా మా తాత చెప్పేటోడు.. ఏడన్నా కొట్టు గని పొట్ట మీద మాత్రం కొట్టమాకు..! ఎదవలు ఎఫెక్ట్‌ రావాలని ఆడ్నే కొడుతుర్రు.. కంత్రీలు.. ఎఫెక్టంటే గుర్తొచ్చింది.. ఒంటరిగా ఉంచి ఈ కప్పుని ఎందుకు జీవహింస చేయడం.. జీవాత్మని పరమాత్మలో కలిపేస్తే పోలె..! ఏస్కో.. కప్పు.. పేద్ద కుర్చీ కనపడతందా.. వేసేయ్‌ పపంచంలోని కుర్చీలన్నీ విరిగిపోవాల.. అందరూ కింద కూర్చుని ఉద్యోగాల్‌ చేయాలె.. ఊళ్ళేలాలె దేశాలేలాలె! అయ్యో ఆమ్టే చచ్చిపోయాడు కదా .. మళ్ళింకెందుకు పుడతాడు.. ఈ పాపిష్టి లోకంలో..!
అయినా కప్పిసిరితే.. ఇంత మార్పు వస్తుందంటవా.. ఇసిరి చూస్తే పోలా.. భళ్ళున శబ్దం.. అయినా లోకం కిక్కురు మన్లా! కిక్కెక్కిందేమో..! అబ్బా.. లోకమంతా నా కళ్ల ముందున్నా.. వీడు మాత్రం లేడు రాడు పోడు! పోరా.. ఎన్ని పోయాయ్‌? చిన్నప్పుడు నాదే ననుకున్న ఇల్లు పోలే.. పెంచుకున్న పూలతోట.. కరిగిపోలే.. పెంచుకున్న పేమ తోట.. రాలిపోలే.. పూయించిన స్నేహ కుసుమాల్‌ వాడిపోలే.. నాదనుకున్న ప్రతీది రాలి మాడి వాడి మసైపోయాక.. ఇంకేంది నాది.. ఇప్పుడు తాగావే నీటి చుక్కలు అవి నీవే.. నిన్న పొద్దున్నెప్పుడో.. పుల్సిపోయిన పిండితో వేసుకుని తిన్నవే.. దోశే.. అది కూడా నీదే.. నువ్వెవరి మోచేతి నీళ్లు తాగట్లేదమ్మా.. కానీ ఎవరిదో.. ఒకరి మోచేయి కింద బతికి ఉండాలి! అదీ జీవితం.. నీకింకా సొతంత్రం రాలేదు.. రాదు.. రానివ్వరు! నీకెంత సొతంత్రం ఉందోనని అనుకుంటుర్రు.. ఉత్తదే.. పైకే.. షాపూర్‌కాడ.. ఆడపిల్లలాని.. చంపకుండనే బొందపెడ్తున్నరంటా! ఆడాడ్నో.. ఆడపిల్లలనమ్మే రాకెట్‌ బయటపడ్డదంట.. మనకెంత పరిజ్ఞానమో.. ఎన్ని రాకెట్లు చేయడం వచ్చో..! అన్నీ పీడకలలే వస్తాంటే దేన్ని గురించి కలలు కనమంటారు కలామ్‌ గారు?
ఏందమ్మీ టీవి పెడుతున్నవ్‌.. అప్పుడే ఎలచ్చన్‌ల మురిక్కంపు గొడవలన్నీ బయటికొచ్చేస్తా ఉంటయ్‌.. ఎందుకు చెప్పు.. అయినా ఏ పార్టీ ఇంతవరకు లేడీ ముఖ్యమంత్రిని చేద్దామని ఒక్కపాలి గూడ అనలేదెందుకని? ఎక్వతక్వ నఖరాల్‌ చేయబాకు.. బేనజీర్‌ ఆరిపోయిన రక్తం చింది మీద పడి పగలబడి నవ్వగలదు! ఆడ ముక్యమంత్రిణినా? గీ సంవత్సరపు పేలని జోకు.. విరగబడి నవ్వు అదే జీవితం ఎక్కడేది క్లిక్కవ్వుద్దో ప్లాపవ్వుద్దో.. ఏదీ ఎటూ తేలని రాయికట్టిన బెండు బతుకు! అడుగులో అడుగునై నవ్వులో నవ్వునై అన్న మొనగాడు.. కిడ్నీలు పాడవుతున్నయంటే ఏడికి పారిపోయిండో.. జీవితం నుంచి ఇట్లా తప్పించుకుంటే ఎట్లనబ్బ.. స్కూలి పిలకాయలమా? క్లాసు బాలేదని దెంకపోనీకి? అమ్మా బాపుల్ని బస్టాండులో దొబ్బేసినాడంటెదవనాయాలు.. పాపం అడుక్కుని తింటున్రు.. ముసిలోల్లు.. అగ్రరాజ్యాల సరసన భారత్‌.. పేపర్లో భలే సరసం చదివినానబ్బ.. ఏయ్‌ నిన్నెవరు పేపరు చదవమంది! ఒక్క కేసు రెండుక్కేసులు.. ఇలా జరిగితే ఇక దేశాన్నంతా తిట్టుడేనా? నీ మొగడు మంచోడు కాపోతే.. మగాళ్ళంతా గంతేనా! ఏమోనబ్బ.. పపంచంల ఒక పెద్ద కోర్టు, దాన్ల ఒకే ఒక కేసు.. ఒకేపంతా ఆడ.. ఒకేపంతా మగ! ఎవరు మంచోరన్నది కేసు, ఇద్దరు జడ్జిలు ఒక ఆడ మగ ఇద్దరు లాయర్లు ఆడ మగ ఇగ ఇది తేలినప్పడు తేలిద్ది లేకపోతే మగ జడ్జి ఆడజడ్జిని బెదిరించి మగ లాయరు ఆడ లాయర్ను చంపేసి, కేసు విత్‌ డ్రా..! న్యాయ శాస్త్రంలో ఎంత సౌకర్యం ఉందంటే ఆడ మగ ఇద్దరూ కలిసి ఉన్నా పిల్లల్ని కన్నా.. అది పెళ్ళి కాదంటా.. మరి పెళ్ళంటేందో.. కొద్దిగన్ని నిర్వచనాలు ఇచ్చుకుంటే బావుండు..  సినిమా నాన్నే కాదు.. మీ నాన్నయినా మా నాన్నయినా అంతే.. ఎంత విశాల భారద్దేశం అయినా మళ్ళీ అంతా ఇరుకే.. అవునూ ఆకలేయట్లే.. ఇప్పుడు మనం విషాదంలో అలకలో కోపంలో దు:ఖంలో ఉన్నాం కదా.. కంట్లో నుంచి ఏడుపు.. ఎవరైనా తినిపించే వాళ్ళు బుదగరించే వాళ్ళు.. నా తల్లీ బంగారు కొండ.. ఒక్క ముద్ద తిను.. అబ్బా- ఎవరైనా పుట్టించడానికే కాదు పుట్టాక్కూడా సరోగేట్‌ మదర్సు ధెరిస్సాలుంటే ఎంత బాగుండు.. అవునూ సరోగేటు ఫాదర్సుండరెందుకని? లేనిదే కావాలెప్పుడు దీనికి!
ప్లేట్లో అన్నం, ఎప్పటిదో వారాలనాటి పప్పు ఫ్రిజ్జులో.. మనలాగా ఫ్రీజయిపోయింది.. పొయ్యి మీద పెట్టు.. వేడయ్యిద్ది.. తినిపించుకో.. చూస్తావేంటి నా కన్నవు కదూ.. ఏడవకు కళ్ళు తుడుచుకో.. ఇదుగో.. ఇది అమ్మ ముద్ద నాన్న తాత కాలేజిలో సునంద ముద్ద.. చేతికి గోరింటాకు పెట్టించుకున్న పూలుపళ్ళప్పటి అత్త ముద్ద పెళ్ళప్పటి ముద్ద పెళ్ళయిన కొత్తల్లో మొగుడి ముద్ద.. అయినా మనకు మనమే బతిమిలాడుకుని మనమే తినిపించుకోవడం.. ఎంత గొప్ప అనుభూతం! సింకులో వేసేయ్‌.. ఈ భూగోళం కూడా సింకులో పడితే బాగుండు.. నర్సమ్మకు చెప్పి బాగా రుద్దిస్తే బాగుపడిపోయేది!
మంచం ఉరుకుతుందేంటలా.. పట్టుకో.. యా ఇలాగే.. ఇప్పుడు గది తిరుగుతుంది.! దీన్నే గది తార్కిక వాదం అంటరు.. అయినా ఎప్పడూ ఏదో ఒకటి తిరుగుతూ ఉండాలి.. అప్పుడే చలన శీలతున్నట్లు.. మరేమో మా ఆయనకి ఈ శీలతెక్కువ! ఎహే ఎవడి గురించి నీకెందుకు? తల పగిలి పోయే నొప్పితో ఉండి.. నిద్రపోతే తప్ప ఇంకేలాగూ తగ్గదు.. నిద్ర.. రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా.. ఇలా అంటే వస్తుందా.. ఏక్‌బార్‌ ఆజా ఆజా.. ఎందుకొస్తాడు? ఎందుకొస్తుందీ నిద్ర.. కిడ్నీలో నొప్పి.. గుండెలో నొప్పి.. కీళ్ళ నొప్పి కాళ్ళ నొప్పి.. కళ్లు దేహమంతా మనసుతో పాటు నొప్పులమయం! కిడ్నీలమ్ముతున్రు.. మనుషుల్నమ్ముతున్రు.. భూమినమ్ముతున్రు.. అమ్మని దేదైనా ఉందా? నిద్రపో తల్లీ.. సుఖంగా.. వాడు రాలేదు.. రాకపోతే పోనీ.. టైమెంతయ్యిందో.. నాలుగో ఐదో.. పడుకోమ్మా నా తల్లివి కదూ.. తరతరాల నుంచి కోపాల్‌ తాపాల్‌ అణచిపెట్టి నిద్రబుచ్చడమే గదా మన జాతిలో 99.99 శాతాన్ని చేయిస్తున్నది.. పడుకోమ్మా.. నా పండువి కదూ.. నా దానివి కదూ… నేనే కదూ ఇంకెవరి దానని కాదు కదూ.. నిద్రపో తల్లి నీలాల నీ కంట నీరు నే చూడలేను… ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు కదూ! మా బంగారు కదూ! నా చిన్నారి కదూ..!
*

మీ మాటలు

 1. కొట్టం రామకృష్ణా రెడ్డి says:

  పుట్టాక గూడా సరోగేట్ తల్లులు.నిజంగా నాకు కావాలి.
  గ్రేట్ ఎక్స్ప్రెషన్.
  అద్భుతమైన చైతన్య స్రవంతి.
  హాట్స్ ఆఫ్.

 2. Rishi Srinivas says:

  మంచి కధ, గొప్ప కధనం, అద్భుతమైన నవ్యత, అత్యద్భుతమైన రచయిత్రి !

 3. g.venkatakrishna says:

  కథ ఒక అంతరంగ వేదన ,ఒక విముక్తి ,ఈ కథే కాదు , ఎ కథ అయినా ఇంతే ……

 4. Santosh Pericherla says:

  కొడితేనే కాదు కొన్ని చదివితే కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అని ఈ కధ చదివిన తరువాత అర్ధమయ్యింది.

  I never expected this kind of narration from WOMEN..Double THUMS UP :)

 5. Aranya Krishna says:

  చాలా మంచి కథ. ఒక ఏకాకిరాత్రిన ఒక కల్లోల మానస కథనం. జీవనచిత్రణ, సంఘటనలు లేకుండా ప్రత్యేకంగా ఆలోచనా స్రవంతిని కథగా మలచటమ్ చిన్నవిశయమైతే కాదు. కానీ కొంచెం ఎడిట్ చేసుంటే ఇంకా బాగుండేది.

 6. చందు తులసి says:

  విషయం మీద…..భాష మీద సాధికారత ఉన్నపుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి…
  షాజహానా గారు సూపర్
  గది తార్కిక వాదం, సరోగేట్ ఫాదర్స్ ….ఒక్కటని కాదు….మొత్తం బావుంది.

 7. saakya maharaj says:

  మొత్తం మీద అంటా కక్కేశారు. ఆడవాళ్ళు తాగితే తప్ప ఇలా మాట్లడలేరా అలోచించలేరా! ఇంతకన్నా ఎక్కువే మాట్లాడుతారు కావొచ్చు. షాజహానా గారు, చాల కాలానికి మంచి కథ రాసారు. సంతోషం.

 8. venu udugula says:

  షాజహానా అక్క i loved alot …. నేకేడ్ ట్రూత్ / షాక్ వేల్యూ /షార్ప్ ఎక్ష్ప్రెశన్ విత్ raw ఫుల్ నేరేషన్ / వండర్ఫుల్ ఎమోషనల్ కంటిన్యుటీ / fancy లాంగ్వేజ్ …..overall it’s a mixture potlam of women feelings. kudos to you !

 9. skybaaba says:

  అలా అంటే ఎలా సాక్య మహారాజా!
  మొదటి రెండు వాక్యాలు తీవ్ర అభ్యంతరకరం..
  రచయిత రాసిందంతా చేసిందే అయి ఉండాలా ?
  సాహిత్య విమర్శకులయ్యీ స్త్రీల రచనల పట్ల అలా చులకన చేసే coment పెట్టవచ్చా ???

 10. rajani patibandla says:

  డార్లింగ్ కదా చాల బావుంది చదవగానే కళ్ళ కరువు… కసి… తీరినట్లు ఉంది . పాపం కధానాయకి తాగడం వలన చెప్పాలనుకున్నవి చాలా చెప్పలేక పోఇన్దని తెలుసుకోన్ది శాక్య మారాజా…….

 11. buchireddy gangula says:

  చాలా బాగుంది కథ
  excellent.వన్
  నా అబిమాన రచయిత్రి గారే రాయగలరు అలా ??
  —————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 12. Dr. Rajendra prasad Chimata says:

  మాంఛి మందు మ్యూజింగ్స్

 13. Mamatha K says:

  సూపర్బ్ షాజహానా!! అందరూ చదివితీరాల్సిన కథ/మ్యూజింగ్స్ ఇది. One more unforgettable piece from you. Kudos.

 14. చందు తులసి says:

  స్కై బాబా గారు బాగున్నారా….?
  రచయిత చేసిందే రాయాలని ఏం లేదు…..
  కానీ చేసింది రాసినా అభ్యంతరం లేదు. ఏం చేశారని కాదు….ఏం రాశారన్నదే ముఖ్యం..
  థాంక్యూ

 15. గోర్ల says:

  షాజహాన గారు అద్భుతమైన కథ రాశారు. తెలుగులో ఇంత బలమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఇటీవలి కాలంలో వచ్చిన కథ ఇదే. మంచి శైలీ, భాషా ప్రావీణ్యం అన్ని క్లియర్ గా కన్పిస్తున్నాయి. కేవలం మహిళా దృష్టే కాదు. ఇందులో పొలిటకల్, ఎకనమిక్, కెరీరిజం అన్ని డైమెన్షన్ ను విమర్శనాత్మకంగా రాశారు. మీరు కవిత్వం బాగా రాస్తారని తెలుసు. కానీ కథ కూడా ఇంత బాగా రాస్తారని ఇది చదివిన తరువాత తెలిసింది.

 16. Krishna Veni Chari says:

  చాలా బాగా రాసేరు.

 17. ఇది అటు వస్తుపరమైన ప్రధానతా ఇటు శిల్పపరమైన ప్రధానతా రెండూ వున్న కథ కావటం విశేషం. మంచి ప్రయత్నం చేసి, దాదాపు పూర్తిగా సఫలమైనందుకు అభినందనలు.

 18. కథకు పెట్టిన పేరు బాగుంది. అందుకు కూడా మీరు అభినందనీయులే.

 19. ఎంత గొప్ప అనుభూతం

 20. shajahana says:

  ఈ కథ ఏకబిగిన రాసాను. ప్రచురణకు ఇవ్వవచ్చో లేదోననే సందేహం నన్ను వెంటాడింది.
  ‘సారంగ’లో అచ్చయ్యాక వచ్చిన రెస్పాన్స్ కి ఆశ్చర్యమేసింది.. చాలా హాప్పీ గా ఫీలయ్యాను..
  కామెంట్ పెట్టినవారందరికీ మెనీ మెనీ థాంక్స్. ఇంతమంది పాజిటివ్ గా అర్ధం చేసుకోవడం సంతోషం..
  కొందరు నాకు పెర్సనల్ గా మెసేజ్ లు పెట్టారు.. అందులో ఒకటి-
  “వండర్ ఫుల్ స్టొరీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం.. లాంగ్ లైవ్ యువర్ రైటింగ్ స్కిల్స్ షాజహానా !”
  కథ చదివిన కొంతమంది కామెంట్ పెట్టటానికి భయపడి ఉంటారు. వారికి కూడా థాంక్స్..
  ఈ కథను పంపగానే ‘సారంగ’లో ప్రచురించినందుకు అఫ్సర్ గారికి షుక్రియా …

 21. shajahana says:

  facebook లో కొన్ని coments :
  Prabhakar Ak :
  ఎందరు మనుషులో … ఎన్నిరాత్రులో… ఎన్ని పగుళ్ళో …. పగలకుండా గడ్డ కట్టినరాత్రులెన్నో!?

  Sameer Sammu :
  chala bagundi katha….

  Shamshad Mohammed :
  Chala chala bavundi katha

  Joopaka Subadra :
  పక్కన company వుండక పోవడం వల్లనే పగిలే అవకాశం స్వేచ్చ సాద్యమైంది.చాన మంచిగుంది కత షాజ్

  Manasa Yendluri ·:
  అక్కా కథ SUPER. మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్!! ONLY musings!!

మీ మాటలు

*