తిరిగొచ్చిన సైనికుడు

 

పంకజం: ఒక వేశ్య

పైడినాయుడు: ఆమె మాజీ విటుడు

దొరస్వామి: ఇప్పటి ప్రియుడు

సత్తి: ఆమె దాసి

 

సత్తి:      (పరుగెత్తుకుంటూ వచ్చింది) అమ్మా, కొంప మునిగింది. పైడినాయుడు యుద్ధభూమి నుంచి వచ్చేశాడు. అతనొక పొడుగాటి కోటు తొడుక్కొని చుట్టూ చాలా మంది సేవకుల్ని పెట్టుకొని ఉన్నాడు. అతన్తో మాట్లాడటం కుదరలేదు. అతని స్నేహితుడు భిక్షపతిని కదిలించాను. ‘చెప్పవయ్యా భిక్షపతీ, మీ యజమాని మాకోసం విలువైన కానుకలేవైనా తెచ్చాడా?’ అని అడిగాను.

పంక:     అది తప్పు. నువ్వు అలాంటి మాటలు వాడకూడదు. దానిబదులు, ‘దేవుడి దయవల్ల మీరు క్షేమంగా ఉన్నారు. మా అక్క మీ క్షేమ సమాచారం కనుక్కోమంది’ అనాలి. దాంతో పాటు, పైడినాయుడి గురించి మా అక్క ఆలోచించని క్షణం లేదు, రోదించని రోజు లేదు’ అని చెప్తే మరింత పసందుగా ఉండేది.

సత్తి:      ముందు పలకరించగానే అట్లాంటి మాటలే అన్నాను. సరిగ్గా ఏమన్నానో ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. నిన్ను హెచ్చరించాలనే ఆత్రం ఎక్కువై పోయింది. అప్పుడు నేనేమన్నానంటే, ‘ఏమయ్యా భిక్షపతీ, యుద్ధంలో ఉన్నప్పుడు మీ చెవులకు మా అక్క మాటలేమీ వినిపించ లేదా? మీరు వెళ్ళిందగ్గర్నుంచీ మా అక్క రోజూ మిమ్మల్ని తలచుకోవడమే! ఎవరైనా యుద్ధం వార్తలు మోసుకొచ్చి చాలామంది చచ్చిపోయారని చెప్పగానే మా అక్క జుట్టు పీక్కోవడం, గుండెలు బాదుకుంటూ ఏడవడం. కొట్లాటలంటే మా అక్కకి చచ్చేంత భయం’.

పంక:     చక్కగా సరైన మాటలు చెప్పావే సత్తీ!

సత్తి:      తర్వాత బహుమతుల్ని గురించీ, ఇతర విషయాల గురించీ అడిగాను. ‘సత్తీ! బ్రహ్మాండంగా కొట్టుకొచ్చాం’ అన్నాడు భిక్షపతి.

పంక:     ఐతేనూ సత్తీ, ‘పైడినాయుడు మీ అక్కను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తహతహలాడు తున్నాడు’ అని అనలేదుటే ఆ భిక్షపతి?

సత్తి:      అచ్చంగా కాదుగానీ అలాంటి మాటలేవో అన్నాడు. ఐతే, నీ గురించి కంటే, వాళ్ళు కొట్టు కొచ్చిన డబ్బు గురించే ఎక్కువ మాట్లాడాడు. డబ్బు, బంగారం, బట్టలు, బానిసలు, దంతపు సామాన్లు… వీటి గురించి తెగ చెప్పాడు. డబ్బు… వేలూ, లక్షల్లో తెచ్చినట్టు కన్పిస్తోంది. భిక్షపతి చిటికెన వేలికి వజ్రపుటుంగరమొకటి మెరుస్తోంది. యుద్ధంలో వాళ్ళ ప్రతాపాన్ని గురించి ఏదో సోది చెప్పటం మొదలెట్టగానే, నేనిక అతన్ని వదిలి నీకు కబురందించాలని పరుగెత్తుకొచ్చాను. వాళ్ళిక్కడికి వచ్చేలోగా ఏం చెయ్యాలో నువ్వు ఆలోచించుకోవాలి కదా! పైడినాయుడిక్కడికి వచ్చేసరికి దొరస్వామి ఇక్కడే ఉంటే ఏం కొంప మునుగుతుందోనని నాభయం.

పంక:     ఇట్లాంటి విపత్కర పరిస్థితి తప్పుకోవాలంటే మంచి ఉపాయమొకటి పన్నాలి. దొరస్వామిని వదిలెయ్యటం అంత తెలివైన పని కాదు. నిన్న గాక మొన్న అతను మనకు ఆరువేల వరహా లిచ్చాడు. పైగా అతను పెద్ద వర్తకుడు. తరవాత్తరవాత ఇంకా చాలా ఇచ్చే అవకాశ ముంది. మరోవైపు పైడినాయుడు అంత డబ్బుతో తిరిగొచ్చినప్పుడు అతన్ని కూడా తిరస్కరించకూడదు. పాత విటుల్ని గౌరవించాలి. అది పద్ధతి. పైడినాయుడు మహా అసూయాపరుడు. అతను దరిద్రంలో ఉన్నప్పుడే భరించడం కష్టమయ్యేది. యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత ఇప్పుడెలా ఉంటాడో ఊహించగలను.

సత్తి:      అదుగో వచ్చేశాడు.

పంక:     ఓరి దేవుడా, ఇప్పుడెలా? నాకేమీ తోచట్లేదు. సత్తీ, వణుకు పుట్టుకొస్తోంది. ఏం చెయ్యాలో ఆలోచించు.

సత్తి:      దొరస్వామి కూడా వచ్చేశాడక్కా!

పంక:     వామ్మో, నాఖర్మ ఇట్లా కాలింది. కాళ్ళ కింది భూమి చీలిపోయి నన్ను మింగేస్తే బాగుండు.

దొర:      (దగ్గరికొస్తూ) పంకజం, మనం అలా వెళ్లి కాస్త వైను తాగొద్దాం!

పంక:     అయ్యో నా మిండమగడా, చంపేశావు కదరా! (పెద్దగా) పైడినాయుడూ, ఇన్నాళ్ళూ ఎక్కడికి పోయావు?

పైడి:      పంకజాన్ని మద్యానికి ఆహ్వానించేంత ధైర్యం ఎవరికుందిక్కడ?

పంక:     (మౌనంగా ఉంది)

పైడి:      నువ్వేమీ మాట్లాడట్లేదు. మంచిది. ఇట్లాంటి ఆడదాని కోసం పదిరోజుల ప్రయాణాన్ని ఐదు రోజుల్లో పడుతూ లేస్తూ ముగించుకొచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఆహ్వానం నాకు దొరుకుతుందనుకోలేదు. ఈ క్షణం నుంచీ నువ్వెవడి వొళ్లైనా తోమొచ్చు.

దొర:      మిత్రమా! మీరెవరు?

పైడి:      ఏంటీ, సర్దార్ పైడినాయుణ్నే ఎరగవా? ఒకప్పుడు బుద్ధిలేక ఈ పంకజాన్ని ఉంచుకున్న వాణ్ణి.

దొర:      మంచిది సర్దార్! పంకజం ఇప్పుడు నాది. ఆమె కిప్పటికే ఆరువేల వరహాలు కట్నమిచ్చాను. రేపు ఇంకా ఇస్తాను. వెళ్దాం రా పంకజం. మన సర్దార్ గారు తనకు నచ్చిన చోట యుద్ధం చేసుకుంటాడు.

సత్తి:      మా అక్క తనకు నచ్చిన వారితో వెళ్తుంది.

పంక:     (చిన్నగా) ఏం చేద్దామే సత్తీ?

సత్తి:      ప్రస్తుతానికి లోపలికెళ్ళడం మంచిది. కొత్త విటుడితో కలిసి పాతవాడి కెదురుగా నిల్చోవటం మంచిపని కాదు. వాడికి అసూయ మరింత పెరగడం తప్ప ప్రయోజనం లేదు.

పంక:     సరే, లోపలికెళ్దాం పద!

పైడి:      ఇదే చెప్తున్నా! మీరిద్దరూ మరోసారి కలిసి తాగడానికి వీల్లేదు. యుద్ధంలో అంత మారణకాండ జరిగినా జయించుకొచ్చింది ఏదో ఆట కోసం కాదు. చంపేస్తా! భిక్షపతీ, భూపతివర్మా, సైనికుల్ని ఈ ఇంటి చుట్టూ మోహరించండి.

దొర:      ఏమోయ్ సర్దార్, మేము చిన్నపిల్లల్లాగా కన్పిస్తున్నామా నీకు? మమ్మల్ని భయపెట్టగలననే అనుకుంటున్నావా నువ్వు? మాటలు కోటలు దాటించేశావే! మనుషుల్ని కాదు, కోడిపుంజు నన్నా చంపినా మొహమేనా నీది? ఎక్కడ చేశావ్ యుద్ధం? చేస్తే గీస్తే ఏదైనా గార్డుగా పనిచేసుంటావ్! అదీ అనుమానమే!

పైడి:      యుద్ధం ఎక్కడ చేశానో నీకు త్వరలోనే తెలుస్తుంది. నేను కత్తి పట్టుకొనే దాకా ఆగు.

దొర:    సరే, రా చూసుకుందాం! నీ దండును కూడా తెచ్చుకో! నేనూ, నాస్నేహితుడూ కలిసి నీకు రాళ్ళదాడి ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. ఎందుకు పరుగెత్తుతున్నావో, ఎటు పారిపోతున్నావో కూడా తెలియకుండా దూసుకుంటావు!

మీ మాటలు

*