“చింటూ.. అమ్మెక్కడ?”

వినోద్ అనంతోజు 

 

Vinod Anantojuఇల్లు దగ్గరపడుతున్నా కొద్దీ సౌజన్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. కారు వాళ్ళింటి మట్టిరోడ్డులోకి ప్రవేశించింది. రోడ్డు మీది గతుకులకి కారులోని సామానంతా కదిలిపోతోంది. వాటిలో సగానికి పైగా చింటూగాడి కోసం తెచ్చిన బొమ్మలే. వాడికిప్పుడు రెండు నెలలు తక్కువ రెండేళ్ళు.

ఆ రోజు Airport లో వాడి ఏడుపు ఆపడం దాదాపు అసాధ్యమయ్యింది. ఆకలేస్తోందేమో అని సౌజన్య పాలు కూడా పట్టింది. శ్రీధర్ వాణ్ని ఎత్తుకుని అటూ ఇటూ ఒక అరగంట నడిచాడు. ఇమ్మిగ్రేషన్ అనౌన్సుమెంటు వస్తోంది. వాడింకా ఏడుపు ఆపలేదు. చేసేది లేక ఏడుస్తున్న వాడినే అమ్మ చేతికి అప్పగించి ట్రాలీ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరూ. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది.  ఇప్పుడు వాడు నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, బోలెడు మాటలు చెపుతున్నాడు.

గేటు తెరుచుకున్న చప్పుడు అవ్వగానే ఇంట్లోంచి హైమావతి గబగబా బయటికొచ్చింది. తడి చేతులు కొంగుతో తుడుచుకుంటూ కూతురిని కౌగిలించుకుంది. శ్రీనివాసరావు అల్లుడికి సామాను దించడంలో సాయం పట్టడానికి కారు దగ్గరికి వెళ్ళాడు. సంవత్సరం తరవాత వచ్చారు కూతురు అల్లుడు. హైమావతి కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని కూతురుని తేరిపార చూస్తోంది. ఆవిడ సంతోషానికి అవధుల్లేవు. సౌజన్య కళ్ళు మాత్రం చింటూ గాడి కోసం వెతుకుతున్నాయి.

“ఏడి వాడు? నిద్రపోతున్నాడా?” అడిగింది సౌజన్య.

“లేదమ్మా.. లేచే ఉన్నాడే.. దొడ్లో ఆడుకుంటున్నాడు అనుకుంటా. చింటూ…!!” కేకేసింది హైమావతి.

దొడ్డి గుమ్మంలోంచి కర్రపుల్ల ఒకటి పట్టుకుని ఊపుతూ వచ్చాడు చింటూ. తనని చూడగానే “అమ్మా” అని ఎగిరి గంతేసి వాటేసుకుంటాడు అనుకుంది సౌజన్య. కాని వాడి కళ్ళలో ఎవరో కొత్త మనుషులని చుసిన బెరుకు కనపడింది. దగ్గరికి రాకుండా అమ్మమ్మ కాళ్ళ వెనకాలే దాక్కున్నాడు. సౌజన్య గుండె కలుక్కుమంది.

“ఛీ.. ఎంత సినిమాటిక్ గా ఉహించుకున్నాను.” అని తనలో తాను సిగ్గుపడింది.

వాణ్ని దగ్గరికి తీసుకుని “నేను చింటూ… అమ్మని” అని పరిచయం చేసుకునేటప్పుడు ఎందుకో ఆమె గొంతు వణికింది. శ్రీధర్ కూడా దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించాడు. చింటూ ఇబ్బందిగా మూలుగుతూ వాళ్ళ చేతులు విడిపించుకుని అమ్మమ్మ వెనక పరిగెత్తాడు.

“అమ్మా నాన్నా వచ్చారమ్మా.. దగ్గరికెళ్ళూ..” హైమావతి అల్లుడికి కుర్చీ వెయ్యాలి, ఫ్యాన్ స్విచ్ వెయ్యాలి, మంచి నీళ్ళివ్వాలి అనే హడావిడిలో ఉంది. చింటూ దూరంగా నిలబడి పుల్ల నోట్లో పెట్టుకుని బెరుకుగా చూస్తున్నాడు.

“ఏమయ్యింది వీడికి? రోజు Skype లో బాగానే మాట్లాడుతాడు కదా!” సౌజన్యకి దుఃఖం కలుగుతోంది.

chinnakatha

నడవడం కూడా రాని బిడ్డని వదిలి అమెరికా వెళ్ళడం సౌజన్యకి అంతగా ఇష్టంలేదు. కానీ తప్పలేదు. శ్రీధర్, సౌజన్య ఇద్దరూ ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకేసారి Onsite కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. ఎంత అదృష్టం ! ఈ అవకాశాన్ని వదులుకోవడం శ్రీధర్ కి ఎంతమాత్రం ఇష్టం లేదు. “ఒక్క సంవత్సరం ఓపిక పడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎంత కాదనుకున్నా ఇద్దరి మీదా కలిపి యాభై లక్షలు అయినా మిగుల్చుకుని రావొచ్చు.” అన్నాడు శ్రీధర్. సౌజన్యకి కూడా అమెరికా వెళ్లాలని డ్రీమ్. కాకపొతే బాబు గురించి ఆలోచిస్తోంది.

“బాబుని ఇక్కడే ఉంచుదాం. అక్కడ మనిద్దరం ఆఫీసు కి వెళితే బాబు నెవరు చూసుకుంటారు?” అన్నాడు శ్రీధర్.

“మంచి Babysitter ని పెడదాం. ఏమంటావ్?” అడిగింది సౌజన్య.

“వద్దు టీవీల్లో చూస్తున్నాం కదా. Babysitter లు పసి పిల్లల మీద ఎలాంటి అకృత్యాలు చేస్తారో. అయినా మన బిడ్డని పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎందుకు? మీ అమ్మా నాన్నా ఉన్నారు కదా !”

“ఉన్నారులే కానీ….”

“ఒక్క సంవత్సరమేగా… కావాలంటే నేను అడుగుతాను మీ అమ్మానాన్నలని“

అమ్మానాన్నా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇంట్లోకి ఒక కంప్యూటర్ పెట్టించి, నాన్నకి Skype Call ఎలా మాట్లాడాలో నేర్పించింది సౌజన్య.

అమెరికాలో ఎంత ఉరుకులు పరుగులు ఉద్యోగమయినా కనీసం రెండు మూడు రోజులకి ఒకసారయినా Skype Call మాట్లాడేది సౌజన్య. మొదట్లో అమ్మానాన్న మాత్రమే మాట్లాడేవారు.

“ఈరోజు చింటూ నన్ను ‘అమ్మా’ అన్నాడమ్మా!”, “లేచి కాళ్ళమీద నిలబడ్డాడమ్మా”, “పడిపోకుండా అంత దూరం నడిచేశాడమ్మా!”, “వాళ్ళ తాతయ్య చెప్పులేసుకుని డింగ్ డింగ్ అని పరిగెత్తాడమ్మా!” అని హైమావతి చెపుతుంటే సౌజన్యకి ఆనందంతో కళ్ళు చెమర్చేవి. అదే సమయంలో ఇవన్నీ చూడటానికి తను చింటూ దగ్గర లేనే అని బాధ కలిగేది. తన ప్రమేయం లేకుండానే తన బిడ్డ పెరిగిపోతున్నాడనే భావన ఆమెని చాలా కాలం వెంటాడింది.

రాను రాను Call లో అమ్మానాన్నల మాటలు తగ్గిపోయి చింటూ గాడి కిలకిలలు పెరిగిపోయాయి. ఎన్ని కబుర్లు చెప్తున్నాడో వాడు! Skype Call లో సౌజన్య తో మాట్లాడకపోతే అన్నం తినేవాడు కాదు. అందుకని సౌజన్య ప్రతిరోజూ తప్పకుండా Call మాట్లాడేది.

ఇండియా కి వచ్చెయ్యడానికి ఇంకా నెల ఉండగానే సౌజన్యలో చింటూ గాడిని కలవబోతున్నాననే ఆత్రుత మొదలయ్యింది. ఎన్నెన్నో ఉహించుకుంది. ఎన్నో రకాల ఖరీదైన బొమ్మలు, చాక్లెట్లు కొనింది. వాటన్నిటినీ వాడికిచ్చి సంవత్సర కాలంగా పెరిగిన దూరాన్ని ఒక్క క్షణంలో చెరిపెయ్యాలనుకుంది.

ఆరోజు సాయంత్రానికి గానీ చింటూ దగ్గరికి రాలేదు. నలుగురూ చెప్పగా సౌజన్యని అమ్మా అని పిలిచాడు. బొమ్మలు, చాక్లెట్లు అన్నీ ఇచ్చి నవ్వించారు. వాడి నవ్వు సౌజన్యకి వర్షంలో తడిసిన అనుభూతినిచ్చింది. వాణ్ని గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకుంది.

“చింటూ.. ఆం తిందూరామ్మా!” హైమావతి పిలిచింది.

చింటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కంప్యూటర్ ముందు కూచున్నాడు.

“ఏంటి నాన్నా అక్కడ కూచున్నావు… ఇక్కడికి రా”

చింటూ కంప్యూటర్ మౌస్ ని ఆడిస్తూ “అమ్మని చూపిచ్చూ…” అన్నాడు.

సౌజన్యకి ఏమి అర్థం కాలేదు. చింటూని ఎత్తుకుంది. హైమావతి దగ్గరికొచ్చి వాడి బుగ్గ పట్టుకుని “అమ్మని చూపించేదేంట్రా వెర్రి నాగన్నా ! ఇదిగో అమ్మా!”

“ఉహు.. ఈ అమ్మ కాదు కంప్యూటర్ లో అమ్మ చూపిచ్చూ!” అన్నాడు సౌజన్య చేతుల్లోంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ.

“నేనే నాన్నా ఆ అమ్మని… ఇటూ చూడు…” అంటూ సౌజన్య చింటూని వదలకుండా వాడి తల తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది.

“ఉహు.. ఊహు… ఊ…..హు…” చింటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఆ తల్లి మౌనంగా ఉండిపోయింది.

 

****

మీ మాటలు

 1. చాలా చాలా సింపుల్ గా మంచి ఆర్ద్రమైన చిన్న పదాలతో ఒక feel ని sprinkle చేస్తోంది కధంతా !! ఇక్కడ అందరూ మంచి వాళ్ళే …. కానీ , తప్పనివి ఏవో పసిమనసుల్లో అలా కొన్ని ఖాళీలు ఏర్పరుస్తాయి, దేనితోనూ పూరించలేనట్టుగా !! So nice.

 2. chaalaa baagundi, neti samaaja sthithilo oka konaanni kallaki kattinattu choopinchaaru.. ee kadhaki baagaa daggaragaa unde jeevitaalni kallaara choosaanu

 3. uday viswanadhuni says:

  ప్రస్తుత సమాజానికి మీరు రాసినటువంటి కధలు యంతో అవసరం. ప్రతిది కళ్ళకు కట్టినట్లు చూపించారు

 4. vasavi pydi says:

  ఈ కథ కథ గానేఉండాలి చాల బాగుంది

 5. Vasundhara says:

  సూపర్ వినోద్..నిజం గ ఇది చాలా బాగుంది

 6. అందరికి ధన్యవాదాలు

 7. Rajashekar agurla says:

  బాగుంది … చాలా బాగా వ్రాసారు ……!

 8. చందు తులసి says:

  పిట్ట కొంచెం….అన్నట్టు..కథ చిన్నదైనా విషయం
  పెద్దది. వినోద్ గారు భలేగా పట్టుకున్నారు.

 9. Chinna maatallo arthavantamaina katha

 10. Dr.Vijaya Babu, Koganti says:

  పిల్లవాడు మెకానికల్ డివైస్ కు అలవాటుపదిన వైనం , కనుల ముందు కనపడిన అమ్మ సంఘర్షణ , కాలప్రవాహంలో పడి నిస్సహాయంగా కొట్టుకుపోయే ఈనాటి అమ్మ ప్రేమ – బాగా చెప్పారు. అభినందనలు

 11. Krishna Veni Chari says:

  చాల బావుంది.

 12. Wonderful story. ఒకే కథ లో అమ్మ ప్రేమ, mechanical living, a child’s innocence – అన్ని చూపించారు. Nice narration and flow. I liked the story :)

 13. Swapna Peri says:

  Hey Vinod ,

  జీవితం బాగుపడలి అని ఒక్క ధ్యేయంతో , చిన్న చిన్న ఆనందాలు తెలియకుండా కోల్పోతున్న ఈతరం జంటలకి వారు తెలియకుండా మిస్ ఔతున్న చాలా చాలా ముఖ్యమైన క్షణాలని జస్ట్ ఒక చిన్న పిల్లాడి రియాక్షన్ తో చూపించారు. ఇది అనుభవపూర్వకంగా ఉన్న ఒప్పుకోలేని చేదు నిజాలు

  Thankyou so much for a short crisp yet thought provoking story….

 14. సూపర్బ్ !!!!! అత్యద్భుతంగా ఉంది …

 15. Vanaja Tatineni says:

  సింప్లీ సుపర్బ్ .

 16. భరత్ టోని says:

  This is Life…..
  అని యెంత సింపుల్ గా చెప్పారు…
  కొన్ని కావాలంటె కొన్ని వదులుకొవాలి…

 17. Venu Nakshathram says:

  వినోద్ గారు,

  ఆల్మోస్ట్ నా పిలుపు స్టోరి but లొకేషన్ మారింది. Very impressive .

  Here is the my movie trailer
  http://youtu.be/yTHG9Bf6FUM

మీ మాటలు

*