ఇరవయ్యేళ్ళ తరవాత కూడా…ధ్యేయం!

 

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

సుమారు పాతికేళ్ళకు పైగా సాహిత్య రంగాన్ని ప్రభావితం చేసిన ఓ సుప్రసిద్ధ రచయిత రచించిన పుస్తకాలలో ఏది మంచిది లేదా ఏది ఉత్తమమైనదనే ప్రశ్న తలెత్తినప్పుడు పాఠకులందరూ ఒకే నవలని లేదా ఒకే పుస్తకాన్ని ది బెస్ట్‌గా పేర్కొనడం చాలా అరుదు.

యండమూరి వీరేంద్రనాథ్! ఈ పేరు చదవగానే ఎన్నో అద్భుతమైన నవలలు మనసులో మెదులుతాయి. వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందోబ్రహ్మ, అంతర్ముఖం, అంకితం, యుగాంతం, చీకట్లో సూర్యుడు, కాసనోవా 99, ఆఖరి పోరాటం, 13-14-15, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, డబ్బు మైనస్ డబ్బు, మరణ మృదంగం, రాక్షసుడు, అనైతికం, రెండు గుండెల చప్పుడు, ప్రార్థన, నల్లంచు తెల్లచీర, ప్రేమ, డేగ రెక్కల చప్పుడు, ఓ వర్షాకాలం సాయంత్రం… ఇలా నవల ఏదైనా… విభిన్నమైన ఇతివృత్తాలతో చదువరులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఆసక్తి కలిగేలా వ్రాయగలడంలో దిట్ట శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. కమర్షియల్ నవలలోనూ చక్కని సందేశాన్ని అంతర్లీనంగా జొప్పించి పాఠకులకు, ప్రచురణకర్తలకూ ఉభయతారకంగా ఉండేలా వ్రాయగల నేర్పరి ఆయన.

యండమూరి గారు నవలలతో పాటు మనోవిశ్లేషణ/వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు కూడా రచించారని పాఠకులందరికీ తెలుసు. “మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?” అనే మనోవిశ్లేషణా రచన వెలువడిన తర్వాత సుప్రభాతం పక్షపత్రికకి ధారావాహిక వ్రాయాల్సి ఉన్నప్పుడు – “నాకు కమర్షియల్ గిమ్మిక్కులు లేకుండా సామాజిక ప్రయోజనం ఉండేట్లు నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఒక నవల వ్రాయండి” అని ఆ పత్రికాధిపతి రత్తయ్య గారు అడిగారట! ఫలితమే “ధ్యేయం” అనే నవల!

20 జనవరి 1993 నుంచి 5 మార్చి 1994 వరకు, కథనానికి తగ్గ బొమ్మలతో (చిత్రకారుడు ‘గడియారం శ్రీ’) సుప్రభాతం పత్రికలో సీరియల్‌గా వెలువడింది [సీరియల్‌ పూర్తయ్యాక ఈ నవలని నేను బైండ్ చేసి ఉంచుకున్నాను… ఈ తేదీల వివరాలన్నీ అందులోంచే…]. తొలిసారి ప్రచురితమై దాదాపు 21 ఏళ్ళు దాటినా నవల ప్రాసంగిత ఏ మాత్రం తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు.

సీరియల్ ఆఖరి భాగంలో ‘ఇదీ కథ’ అనే బాక్స్ ఐటమ్‌లో “చెట్టుని చూసి మనిషి నేర్చుకోవలసింది చాలావుంది. కాండాన్ని కత్తిరించినా పక్కనుంచి చిగురేస్తుంది. కానీ మనిషి – చిన్న కష్టానికే బెంబేలు పడిపోతాడు. అలా పడకూడని శక్తి, పిల్లలకి పెద్దలే ఇవ్వాలి. .. పెద్దలకే ఆ శక్తీ, అవగాహన లేకపోతే మరి పిల్లల భవిష్యత్? తన లక్ష్యాన్ని చేరుకోడానికి మనిషేం చేయాలన్నదే ‘ధ్యేయం’ ఇతివృత్తం.” అంటూ నవల సారాంశాన్ని క్లుప్తంగా చెప్పారు.

***

పిల్లల ఎదుగుదలలో కౌమార, యవ్వన దశలు అతి ముఖ్యమైనవి. వారి జీవితాలను నిర్దేశించే దశలు కూడా ఇవే. ‘చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు’ అనుకునే తల్లిదండ్రులు కొందరు; ‘పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే, వాళ్ళే నేర్చుకుంటారు’ అనుకునే అమ్మానాన్నలు మరికొందరు. ఇద్దరిదీ తప్పే!

తాము చేరుకోలేని గమ్యాలకి తమ పిల్లలని చేర్చి తృప్తి పడాలనుకునే తల్లిదండ్రులది మరో రకం తప్పు. తాము తప్పులు చేస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, ఎదుటి వారి గోరంత పొరపాట్లను కొండంత చేసి ఎగతాళి చేసే పెద్దలది మరో తరహా తప్పు.

ఇన్ని తప్పుల మధ్య ఒప్పుగా పిల్లలని పెంచడం అతి తక్కువ మందికే సాధ్యమవుతుంది. పిల్లల బాల్య, యవ్వన దశలు తల్లిదండ్రులకే కష్టమైన కాలం. పిల్లల వయసుని దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలోనే ఆలోచించాలి.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో పెద్దల ప్రేమా, ఆప్యాయతల మధ్య హాయిగా గడిచేది బాల్యం. కౌమార యవ్వనాలలో ఇబ్బందులు ఎదురైనా తమవారంటూ కొందరున్నారనే భరోసాతో సమస్యలని ఎదుర్కునేవారు.

మారుతున్న కాలంతో పాటు (.. నిజానికి ఈ పద ప్రయోగం సరైనది కాదు. కాలం ఎన్నడూ ఒకేలా ఉంటుంది. మారేది మనుషులే.) సమిష్టి కుటుంబాలు అంతరించి, వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాకా బంధాలు సడలుతున్నాయి. జీవనాన్ని వేగవంతం చేసుకుని, బ్రతుకుని దుర్భరం చేసుకుంటున్నారు జనాలు. పిల్లలకి మార్గదర్శకులుగా ఉండాల్సిన పెద్దలే దారి తప్పుతున్నారు.

పిల్లలకి మొదటి పాఠశాల ఇల్లు. తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్న సత్యాన్ని ఈ నవల మరోసారి చాటుతుంది.

***

Yandamooriఒకే కాలనీలో నివాసముండే ఐదు జంటలు, వారి పిల్లల చుట్టూ నడిచే కథ ఇది. దశరథ్, కౌసల్య ఒక జంట. రాము, నిఖిత వీరి సంతానం. విశ్వేశ్వర్, అన్నపూర్ణ మరో జంట. మహతి, సుకుమార్ వీళ్ళ పిల్లలు. కృష్ణమూర్తి, రుక్మిణి ఇంకో జంట. ప్రియతమ్, ప్రీతి వీళ్ళ పిల్లలు. శంకరం, పార్వతి నాల్గవ జంట. అవినాష్ వీళ్ళ కొడుకు. విష్ణు, శ్రీలక్ష్మిలది ఐదవ జంట. ధాత్రి వీళ్ళ అమ్మాయి.

నిఖిత, రాము, ప్రీతి, ప్రియతమ్, ధాత్రి, అవినాష్, సుకుమార్, మహతిల బాల్యం ఒకే చోట గడచినా, కొన్నేళ్ళ పాటు వాళ్ళంతా ఒకే కాలనీలో పెరిగినా వాళ్ళ ఆలోచనలు, దృక్పథాలు వేర్వేరు. పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది.

చదువు పేరుతో కొడుకుని పుస్తకాలకే పరిమితం చేసి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి తమ అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తారు శంకరం, పార్వతి. నృత్యం, టెన్నిస్ పేరుతో కూతురికి ఊపిరాడనివ్వదు శ్రీలక్ష్మి.  విష్ణు సెక్స్ పర్వర్ట్. కృష్ణమూర్తి, రుక్మిణిల ప్రవర్తన వాళ్ళ సంతానం అదుపు తప్పేలా చేస్తుంది. మగపిల్లాడిపై మోజుతో తొలి కాన్పు ఆడపిల్ల పుట్టిన తర్వాత, అబార్షన్లు చేయించుకుని చివరికి కొడుకుని కంటారు విశ్వేశ్వర్, అన్నపూర్ణ. వీళ్ళందరికి భిన్నంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పిల్లలకి అనురాగం పంచుతారు దశరథ్, కౌసల్య.

ప్రేమించిన ముగ్గురు కుర్రవాళ్లూ మూడు రకలుగా మోసం చేస్తే – వారి మీద పగబడుతుంది ప్రీతి. తనకన్న పదిహేనేళ్లు పెద్దయిన ‘ఆంటీ’ని మంచి చేసుకుంటే ‘జేబు ఖర్చుకు’ లోటుండదని భావిస్తాడు పద్నాలుగేళ్ల ప్రియతమ్. తాను చెడిన ప్రియతమ్ సుకుమార్‌నీ చెరుపుతాడు. ప్రియతమ్‌తో స్నేహం చేసి అతనితో బాటు తాను ఊబిలో కూరుకుపోతాడు సుకుమార్. ప్రియతమ్ చేతిలో వంచనకి గురవుతుంది ధాత్రి. చిన్నప్పుడు తనని నిర్లక్ష్యం చేసినందుకు, గొప్పింటి కోడలుగా వెళ్ళి తల్లిదండ్రులను సాధించాలనుకుంటుంది మహతి. సర్వనాశనమైపోయాడనుకున్న స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నిస్తాడు అవినాష్. తల్లిదండ్రులిద్దరూ అయిదు నిముషాల వ్యవధిలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణిస్తే, అన్న చదువులకు భంగం రాకుండా తన కర్తవ్యం నిర్వర్తిస్తుంది నిఖిత.

***

తను నిరంతరం శ్రమిస్తూ, ఎదుగుతూ, తనతో పాటు మరికొందరికి ఎదిగే మార్గం చూపించిన నిఖిత లాంటి వ్యక్తులు ప్రస్తుత యువతరానికి ఎంతో అవసరం. “When the going gets tough, the tough get going” అనే నానుడిని నిజం చేస్తుంది నిఖిత పాత్ర!

అలాగే తక్కువ నిడివి ఉన్నా, తన పరిధిలో ఒక ప్రయోజన కార్యాన్ని సాధించి, సమాజం పట్ల తన నిబద్ధతని చాటుకుంటుంది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర. ఆమె పేరు సాధన. ఎంసెట్ ర్యాంకుల భాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెట్టి అక్రమార్కులను జైల్లో పెట్టిస్తుంది. కోచింగ్ సెంటర్ల మోసాలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పైరవీలు… ఇలా వ్యవస్థలోని లోపాలని ప్రస్తావిస్తూ తన పరిధిలో తాను చేయగలిన పనిని సక్రమంగా చేస్తుందీ పాత్ర.

“జీవితంలో ఏదో ఒక ఎదురుదెబ్బ తగిలే వరకూ మనిషి ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో తెలియడానికి తరాలు, అంతరాలు ఉంటాయా?” అని అడుగుతుందో పాత్ర. అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇది.

***

యండమూరి గారి నవలలు చదివాక, అందులోని కొన్ని వాక్యాలను కోట్స్‌గా వ్రాసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఈ నవలలోనూ అలాంటి అద్బుతమైన వాక్యాలున్నాయి. ఎన్నో విధాలుగా ప్రేరణిస్తాయి. మచ్చుకు కొన్ని:

జ్జానం పుస్తకాల్లో ఉండదు. అనుభవాల్లో ఉంటుంది. అనుభవాలన్నీ కూర్చి గుచ్చిన జీవితపు దండతో ఉంటుంది.

కష్టం గురించి నిరంతరం ఆలోచించడం కన్నా, దాంట్లోంచి బయటపడే మార్గం ఆలోచించడం మంచి పద్ధతి. కానీ, చాలామందికి మానసికంగా అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే తమకొచ్చిన కష్టాల్ని భవిష్యత్తులో విజయాలకి సోపానాలుగా వాడుకుంటారు.

విజయం సాధించాలంటే నిరంతర ఘర్షణ ఉండాలి. ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం వైపు సాగిపోవాలన్న కృషి, దీక్ష ఉండాలి. కష్టపడాలి.

అస్థిత్వం ఋజువు చేసుకోడం జీవిత ధ్యేయం అయినప్పుడు మనిషి సిన్సియర్‌గా కష్టపడతాడు. అందులో ఆనందం పొందుతాడు.

పరమపద సోపానంలో పెద్ద పాము చేత మింగబడి మొదటికి వచ్చిన వ్యక్తి ఆట మానేస్తే నష్టం అతనికే. చిన్న చిన్న మెట్లు మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళడానికి ప్రయత్నించడమే జీవితం.

వర్షిస్తే బరువు తగ్గి మేఘం తేలికపడుతుంది. రోదిస్తే బరువు తగ్గి మనసు తెరిపిన పడుతుంది.

ముందుకు పోవడం తప్ప వెనుకడుగు వేయడం కాలానికి తెలియదు. అందుకే జరిగిన దాన్ని గురించి విచారించకు. జరగబోయేదాని గురించి ఆలోచించు.

***

వయసులో పెద్దలైనా, బుద్ధులలో పిల్లల కంటే హీనంగా ప్రవర్తించేవారున్నట్లే, వయసులో చిన్నవారైనా పెద్దరికం ఆపాదించుకుని హుందాగా ప్రవర్తించేవారు అరుదుగానైనా ఉంటారని చెబుతుంది ఈ నవల.

ఆధునిక జీవితాలకు అద్దం పడుతూ… మధ్యతరగతి మనస్తత్వాలను చిత్రిక పడుతూ… ఎదిగొస్తున్న బాల్యానికి… భవిష్యత్ చిరునామాను వెతుక్కుంటున్న యవ్వనాలకు భాష్యం చెప్పిన నవల ఇదని “సుప్రభాతం” పత్రిక పేర్కొంది. ఏ మాత్రం అతిశయోక్తి లేని వ్యాఖ్యానం ఇది.

టీనేజ్ పిల్లలు… కొత్త కొత్త ప్రలోభాల బారిన పడే ప్రమాదం ఒకప్పటికంటే ఇప్పుడు మరింత అధికంగా ఉంది కాబట్టి ఈ నవల ఇప్పటికీ ఉపయుక్తమనే అనే భావించాలి.

విజయవాడ నవసాహితి బుక్ హౌస్ వారు ప్రచురించిన “ధ్యేయం” నవల అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. పుస్తకం వెల రూ. 90/-

గమనిక:

సీరియల్‌లో ప్రీతి అని ఉన్న పేరు నవల పుస్తకంగా ప్రచురితమయ్యాకా, వరూధిని అని మారింది.

~

 

మీ మాటలు

  1. నాకు చాలా నచ్చిన యండమూరి గారి నవలల్లో ఇదీ ఒకటి. తమిళంలో “నిఖిత”అన్న పేరిట వెలువడి ఉంది. నేను అనువాదం చేసిన నవలల్లో నాలుగవది.

  2. గౌరి కృపానందన్ గారు,
    మీ స్పందనకి ధన్యవాదాలు.

మీ మాటలు

*