అన్నం మెతుకు ఆత్మఘోష!

 

అరణ్య కృష్ణ

 

మహాశయా!
అద్భుతమైన కలలాంటి జీవితాన్ని చూపించి వెళ్ళిపోయావు
అందమైన కలల్ని దేశానికి దానం చేసి మరీ పొయావు

అది సరేకానీ
దేశమంటే ఎవరు మహాశయా?
వీధుల్లో పడవల్లా కార్లు తిరిగే నగరాలేనా?
విరిగిపోయిన తెడ్లతో బురద నదుల్ని దాటలేక
తిరగబడిపోయిన తెప్పల్లాంటి పల్లెలు కాదా!

ఇక్కడి చిన్నారుల కళ్ళు కలలు కనగలిగేవేనా?
పొయ్యిలో పడుకున్న గండుపిల్లి కళ్ళలాంటి ఆకలి
వీళ్ళ కన్రెప్పల్ని ఎత్తిపట్టి వుంచుతుంటే
ఇక నిద్రెలా పట్టేది చెప్పు!
గేదెల్ని కడుగుతూ గొర్రెల్ని మేపుతూ
సొమ్మసిల్లిన పసి కడుపుల్లో పసికర్లు నిండిపోతుంటే
ఆవులింతలు మాత్రం ఎలా వస్తాయి
అయ్య వలసపోతేనో అమ్మ కూలికెళ్తేనో
తమ్ముళ్ళని లాలించే పసితల్లులకి
నీ కలల మెరుపుల గురించి ఏం తెలుస్తుంది?

విశాల ప్రాంగణాల్లాంటి నువ్వు బోధించే కాన్వెంట్ కలలు
కూలే కప్పుల కింద పడిపోయిన బడిగోడల మధ్యనేం వికసిస్తాయి
మడత నలగని యూనిఫారాలతో తళతళలీనే టెర్లిన్ కలలు
ముడ్డిమీద పిగిలిపోయి మట్టిగొట్టుకు పోయిన
బట్టలమీదేం తళుక్కుమంటాయి
కాఫీ షాపుల్లో లాప్ టాప్ మీద అసైన్మెంట్లు చేయాలన్న కలలు
పశువుల కొట్టాల్లో కార్ఖానాల్లో ఏం కళకళలాడ గలవు?

చికెన్ పకోడా మంచూరియాల టిఫిన్ బాక్సులకి అర్ధమయ్యే నీ ఆదర్శాలు
అక్షరాలకోసం కాక అన్నం మెతుకుల కోసం బడికెళ్ళే
చిల్లులుపడ్డ సత్తు ప్లేట్లకేం బోధపడతాయి

జాతిద్రోహాల్ని ప్రశ్నించని క్షిపణిమహాత్మా!
నువ్వు ఆదర్శాలు మాత్రమే మాట్లాడే నిజాయితీపరుడివి
అందుకేనేమో
దేశం మొత్తం నీ కలల క్షిపణి మీదెక్కి
భ్రమల అంతరిక్షంలోకి చక్కర్లు కొడుతుంది.

*

మీ మాటలు

  1. Narayanaswamy says:

    అద్భుతమైన కవిత అరణ్యా!

  2. N Venugopal says:

    అరణ్యకృష్ణ గారూ,

    బాగుంది.

  3. p v vijay kumar says:

    Great wall poster ..RIP

  4. nagaraju says:

    good poem

  5. అరణ్య కృష్ణ గారు చాల బాగా రాసారు అనడం రొటీన్ గా ఉంటుంది. కాని ఇంతకంటే మంచి పదం దొరకడమ లేదు. ఆకలి ఆత్మఘోష ని కళ్ళకు కట్టినట్లు రాసారు. మీరు గాయాలను స్పృశించి మీ వేదనను లేపనంగా పూస్తారు. ఉన్నతమైన కలలు కనండి అని చెప్పే మహనీయునికి ”నిద్రపోనివ్వని ఆకలికి కలలు రావని తెలీదేమో? లేక వారి ఆకలి ఈయనకు ఎహ్ సాస్ కాలేదేమో?

    ”పొయ్యిలో పడుకున్న గండుపిల్లి కళ్ళలాంటి ఆకలి
    వీళ్ళ కన్రెప్పల్ని ఎత్తిపట్టి వుంచుతుంటే
    ఇక నిద్రెలా పట్టేది చెప్పు!
    గేదెల్ని కడుగుతూ గొర్రెల్ని మేపుతూ
    సొమ్మసిల్లిన పసి కడుపుల్లో పసికర్లు నిండిపోతుంటే
    ఆవులింతలు మాత్రం ఎలా వస్తాయి”.

  6. విలాసాగరం రవీందర్ says:

    బాగుంది అరణ్య గారు. వాస్తవ చిత్రాన్ని కళ్ళకు కట్టారు

  7. Sivakumara Sarma says:

    “జాతిద్రోహాల్ని ప్రశ్నించని క్షిపణిమహాత్మా!
    నువ్వు ఆదర్శాలు మాత్రమే మాట్లాడే నిజాయితీపరుడివి
    అందుకేనేమో
    దేశం మొత్తం నీ కలల క్షిపణి మీదెక్కి
    భ్రమల అంతరిక్షంలోకి చక్కర్లు కొడుతుంది.”
    “చచ్చిన వాడి కళ్లు చారెడు” అన్నది ఒక తెలుగు సామెత. దాని ఉద్దేశం, పోయినవాళ్ళ గూర్చి గొప్పగా మాట్లాడాలని! కానీ, ఈనాడు కనిపిస్తున్నది ఎవరి గోప్పదనాన్నయినా సరే తక్కువ చేసి మాట్లాడడం. ఐన్స్టీన్ ఇవాళ పోయుంటే, ఆయన మదర్ తెరెసా అంతగా సామాన్యుల సేవ చెయ్యలేదని, మదర్ తెరెసా పోయుంటే ఆవిడకి ఐన్స్టీన్ కున్నన్ని తెలివితేటలు లేవని, మహాత్మా గాంధీకి క్రికెట్ ఆడడమే రాదనీ, … ఎన్నిరకాలుగా వ్యాసాలూ, కవితలు రాయచ్చో! ఇప్పటికీ ఆలస్యం కాకపోయుండొచ్చు!

  8. సుజన says:

    “ప్రెసిడెంట్ ముస్లిం(అబ్దుల్ కలాం), ప్రధాని సిక్కు, యూపీయే చైర్ పర్సన్ క్రిస్టియన్, ముఖ్యమంత్రి క్రిస్టియన్(వైఎస్సార్)! ఈ దేశానికి ఏ గతి పట్టింది!” అంటూ అగ్రవర్ణ మేధావులు ముసుగులు తీసేసి ప్రైవేట్ గా అక్కసు వెళ్లగక్కిన రోజులు ఉన్నాయి. ముఖ్య పదవుల్లో ఒక్క హిందువు కూడా లేడని బాధపడ్డవర్గం వాళ్ళే ఇప్పుడు కలాం ను నెత్తిన పెట్టుకోవడం, ఆయన ఆదర్శప్రాయుడనడం విచిత్రమే. పోయినవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాలన్న సూక్తిని ఇప్పుడు వల్లించడం కూడా వింతే. ఈ వర్గం వాళ్ళు గాంధీ గురించి అంబేడ్కర్ గురించి ఇప్పటికీ ఎంత తిట్టిపోస్తారో తెలియాలంటే వాళ్ళ ప్రైవేట్ సంభాషణాల్ని వినాలి. “ఆ ‘గాంధీగాడు’ ఆ ‘అంబేడ్కర్ గాడు’ దేశాన్ని తగలేశారు!”

    • P V Vijay Kumar says:

      :) :)
      గుండె మీద చేయిపెట్టుకుని మాట్లాడితే ప్రతి అగ్ర కుల వ్యక్తికి తెలుసు how casteist this soceity అని. అవకాశం దొరికితే అక్కసు వెల్లగక్కడం సహజం …ప్రైవేట్ గానో…..పబ్లిక్ గానో !

    • Sivakumara Sarma says:

      ఒక వ్యక్తి వ్యాఖ్యలని ఆ వ్యక్తి అభిప్రాయాలుగా కాక ఒక వర్ణ, మత అభిప్రాయాలుగా తీసి పారేసే సంభాషణల మధ్యలో జొరబడ్డం నా పొరపాటు! ఇదొక echo chambar అనీ, ఇక్కడి అభిప్రాయాలని విమర్శించడం మాని ప్రశ్నించడం కూడా తగదనీ ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకముందు ఇలాంటి తప్పిదాన్ని చెయ్యను.

      • సుజన says:

        వర్ణానికీ, మతానికీ(సమాజం, దేశం, ప్రాంతం, సంస్కృతి మొదలైనవి కూడా వీటి పక్కన చేర్చవచ్చా?) సంబంధం లేకుండా ‘వ్యక్తి’ ఉంటాడనీ, అతనికి అభిప్రాయాలు ఉంటాయనీ మీ ఉద్దేశంలా ఉంది. అదే సూత్రాన్ని బట్టి చూస్తే “పోయినవాళ్ళ గూర్చి గొప్పగా మాట్లాడాలని! కానీ, ఈనాడు కనిపిస్తున్నది ఎవరి గోప్పదనాన్నయినా సరే తక్కువ చేసి మాట్లాడడం” అని మీరు అన్నది ‘వ్యక్తి’ గురించా, సమూహం గురించా? .క్లారిఫై చేయండి. సారంగలో కలాం పై రెండు వ్యాసాలు రాసిన విజయకుమార్ గారి అభిప్రాయాలను కలాం అభిమానులు ‘వ్యక్తి’ అభిప్రాయంగా తీసుకోలేదు. ఆయన వర్ణాన్ని, క్రిస్టియన్ అని తోచేలా ఆయన మతాన్ని కూడా డైరెక్టుగానో, ఇండైరెక్టుగానో తీసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? “ఇక్కడి అభిప్రాయాలని విమర్శించడం మాని ప్రశ్నించడం కూడా తగదనీ ఇప్పుడే తెలుసుకున్నాను”. విమర్శపై, ప్రశ్నించడంపై నిషేధం విధించడంలో ఎవరు ఆరితేరినవాళ్ళో నిజాయితీగా చెప్పండి. కలాం, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, వైయెస్సార్ ఒకే కాలంలో పదవుల్లో ఉన్నప్పుడు నేను పైన చెప్పినట్టు అగ్రవర్ణాలవారు ప్రైవేట్ గా బాధపడ్డారా లేదా, అగ్రవర్ణ కుటుంబాల్లో గాంధీ, అంబేడ్కర్ లను తిట్టుకోవడం నిజమా కాదా? అవుననో, కాదనో సూటిగా చెప్పండి.

      • Aranya Krishna says:

        శివకుమార శర్మ గారూ! ఎందుకంత తొందరగా నిస్పృహకు గురవుతారు? విమర్శని స్వీకరించండి సర్! ఈ రోజు ప్రజలకి ఆదర్శాలని కాలక్షేపం బఠానీల్లా అలవాటు చేయగలిగారు పాలకులు. వీళ్ళకు కావాల్సింది కేవలం సింబల్స్, లోతైన సీరియస్ ఆచరణ కాదు. కలాం బాబాల ముందు మోకరిల్లారు కాబట్టే ఆయన్ని మీరందరూ నెత్తికెత్తుకోగలుగుతున్నారు. ఆయన్ని గొప్ప సైంటిస్ట్ అంటున్నారు. ఆయనేం కనిబెట్టారో చెప్పగలరా? ఆయన కొన్ని ఆయుధ సంబంధ విధ్వంసకర ప్రాజెక్టులకు మేనేజర్ మాత్రమే. హి ఈజ్ అ గ్లోరిఫైడ్ గవర్నమెంట్ సర్వెంట్ ఎలేవేటేడ్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఐన్ స్టీన్ అయినా, మదర్ తెరీసా అయినా వారి జీవనసాఫాల్యం ఏ వర్గానికి పనికివచ్సిన్దనే ప్రశ్న నాబోటి వాళ్ళు ఎప్పటికీ వేస్తారు. “మహాత్మా గాంధీకి క్రికెట్ ఆడడమే రాదనీ, … ఎన్నిరకాలుగా వ్యాసాలూ, కవితలు రాయచ్చో! ఇప్పటికీ ఆలస్యం కాకపోయుండొచ్చు!” అన్నారు మీరు. ఇది సహృదయ సాహిత్య విమర్శా సర్? మళ్ళీ ఇక్కడుండలఎనని నిందేసి వెళ్ళిపోతారు మీరు. ఎన్ని చిన్నెలు నిజంగా మీవి! ఔరా!

  9. v. shanti prabodha says:

    కలల క్షిపణి మీదెక్కి అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టే కవిత్వం చదివి విసుగొస్తోంది. ఈ తరుణంలో వాస్తవ చిత్రణతో అద్బుతమైన మీ కవిత్వం సేద తీరుస్తోంది. ఆలోచింప చేస్తోంది. ధన్యవాదాలు మంచి కవిత అందించినందుకు .

  10. చాలా బాగుంది అరణ్యకృష్ణ గారూ! ‘ఆత్మఘోష అన్నం మెతుకు’దని మీరింత స్పష్టంగా చెప్తున్నా, కొందరు దానిని వ్యక్తి నింద గా మాత్రమే పరిగణించడం చాలా ఆశ్చర్యం గా ఉంది, కలాం గారు చూపే కలలు, చిన్నారు లందరూ కనగలిగితే మనకు అంతకంటే ఏం కావాలి? లేదు కనకనే కదా ఇలా ఆయన ఆదర్శాలలోని వైరుధ్యాన్ని గురించి చర్చించే అవసరం కలుగుతోంది.

  11. Aranya Krishna says:

    ధన్యవాదాలు కల్యాణి గారు! కలాం అయినా, సిబిఐ జెడి లక్ష్మీనారాయణ అయినా కొలను చాలక ఎగబడుతున్న చేప పిల్లలకి ఆదర్శాల ఎరలు.

  12. అరణ్య కృష్ణ గారు మంచి కవిత వినిపించినందుకు ధన్యవాదాలు.

    పేదరికం కొందరిని ఆత్మగౌరవం మరచిన యాచకులుగా చేస్తుంది, కొందరిని అంతరాత్మ నశించిన నేరస్తులుగా మార్చ్తతుంది. చాలామందిని పరిస్తితులకు తల వొంచి బతికే లా చేస్తుంది. ‘పేదవాని కోపం పెదవికి చేటు’, ‘మంచం ఉన్నంత కాలు చాపాలి ‘ లాంటి సామెతలు నేర్పే లోకజ్ఞానం ఇదే . అయితే పెట్టుబడి దారి వ్యవస్థ క్రమంగా బలపడుతూ , ఆధునిక రాజ్యాంగ ఆధారంగా క్రమంగా కొన్ని అవకాశాలు మెరుగు పడుతూ వున్న సందర్భంలో కొందరైనా పేదరికాన్ని చదువు ద్వారా నైపుణ్యాల ద్వారా అధిగమించ గలుగుతుంటారు. కలాం అలాంటి వారికి ఒక గొప్ప ఉదాహరణ. తమ చుట్తూ అమానవియమైన బలవత్తరమైన అసమ సమాజం ఉన్నదని, దాన్ని రెచ్చ గొట్తకుడదనె ఎరుక వీరికి ఉంటుంది. ఇలాంటి వారు సాంఘిక జీవనం లో ఉన్నత స్థానం కన్నా , వ్యవస్థ లో ఉన్నత స్థానం సాధించడం సులభం అని గ్రహిన్తారు. తమ ప్రాగ్మాటిసమ్ ను మానవతావాదం గా భ్రమ కు గురవుతుంటారు. వీరిది స్వచ్చంద దాస్యం. భయ విహ్వల వ్యాకులత ను కఠోర శ్రమ ద్వారా అధిగమించాలన్నదే వారి జీవన వ్యూహం. సంప్రదాయ సమాజ ఆగ్రహాన్ని లొంగుబాటు తో ఎదుర్కోవడమే వీరి జీవిత విషాదం.

    • Aranya Krishna says:

      ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. కలాం గారి లాంటి వారిని ఎలా అర్ధం చేసుకోవచ్చో మీ విశ్లేషణ అద్భుతంగా చెప్పింది. ధన్యవాదాలు.

  13. Aranya Krishna says:

    భార్గవగారూ! ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. కలాం గారి లాంటి వారిని ఎలా అర్ధం చేసుకోవచ్చో మీ విశ్లేషణ అద్భుతంగా చెప్పింది. ధన్యవాదాలు.

Leave a Reply to Aranya Krishna Cancel reply

*