చలసానికి మావోయిజం ఒక way of life!

 

 కూర్మనాథ్

ఒక శిఖరం కూలిపోయింది.
మా ఉత్తరాంధ్ర పెద్దదిక్కు పోయింది.
తెలుగు సాహిత్యం ఓ చుక్కానిని,
విప్లవోద్యమం ఓ సహచరుడ్ని కోల్పోయింది.
తెలుగు ప్రజలకి ఒక తోడు లేకుండాపోయింది.
యారాడ కొండ చిన్నబోయింది.

***
స్వార్ధంలేని మనిషి వుంటాడా? వ్యాపారమయమైన, వస్తుమయమైన ఈ ప్రపంచంలో స్వార్ధంలేకుండా వుండగలిగే అవకాశం వుందా? ఉందనే నిరూపించాడు ప్రసాద్. విప్లవాసాహిత్యోద్యమానికీ, మిత్రులకీ సీపీగా తెలిసిన చలసాని ప్రసాద్ తనని తాను రద్దు చేసుకుని బతికేడు. రెండు రాష్ట్రాల్లో వందలాదిమందికి ఆయన ఆప్తుడు. మానవసంబంధాలు నిలబెట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవ్వరైనా.

ఆయన పరిచయాల  విస్తృతి చూసి ఎవరైనా ఆశ్చర్యపడక తప్పదు. వరంగల్ రైల్వే స్టేషన్లో కావచ్చు, నాంపల్లి పోస్టాఫీసులో కావచ్చు, పుస్తక ప్రచురణ కేంద్రాల్లో కావచ్చు, పత్రికాఫీసుల్లో కావచ్చు, రచయితల్లో కావచ్చు – ఆయనకి విస్తారంగా పరిచయాలుండేవి. అవి ఏవో మొక్కుబడి పరిచయాలు కావు. ఒకసారి పరిచయం అయితే, ఆయన లేదా ఆమె ఇక ఎప్పటికీ మిత్రుడో, మిత్రురాలో.

జీవితమంతా సాహిత్యం, సాహిత్య ప్రచారం, విప్లవం, పౌరహక్కులు తప్ప ఇంకోటి తెలియని సీపీ. అత్యంత నిరాడంబరుడు. జీవితంలో ఒక్కసారికూడా దువ్వెన వాడని, ఒక్కసారికూడా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని, ఒక్క క్షణం కూడా టీవీ చూడని – సీపీ. ఆకలి దప్పులు లేనివాడు లేదా పట్టించుకోని వాడు. కానీ, ఆకలి దప్పులతో, అవసరాలతో వున్నవాళ్లని అనుక్షణం పట్టించుకున్నవాడు. సరిగ్గా యేనన్ ప్రసంగంలో మావో చెప్పినట్టు, నిజమైన మేధావి ప్రజల్లో ఒకడిగా, ఎలాటి బేషజాలు లేకుండా కలిసిపోవాలని చెప్పాడో, నిరాడంబరంగా వుండాలని చెప్పాడో, సీపీ సరిగ్గా అలా వుండేవాడు. మార్క్సిజాన్ని, మావోయిజాన్ని ఒక జీవిత విధానంగా మార్చుకుని, ఒక శ్వాసగా మార్చుకుని బతికినవాడు ప్రసాద్.

cp8

సీపీలేడన్న దుఖం రక్తంలోకి ఇంకుతున్నకొద్దీ ఆయన లేని లోటు లోతు పెరుగుతూ కనిపిస్తూవున్నది. ఏ కృష్ణా తీరాన్నుంచి ఎప్పుడు విశాఖ వచ్చాడోగాని ఉత్తరాంధ్రని సొంత వూరు చేసుకున్నాడు. శ్రీకాకుళం వుద్యమం ఆయన్నెంత కదిలించిందో, ఉత్తేజపరిచిందో, దిస్టర్బ్ చేసిందో ఆయన “ఈ విప్లవాగ్నులు ఎచటివని….” పాడినపుడు తెలుస్తుంది.
“మా ‘పంచాది’ ఎలావున్నాడు,” అని అడిగేవాడు, మా అమన్ గురించి అడుగుతూ. సీపీకి మనుషులు సతతహరితాలు. అంతిమంగా మనిషి నిలుస్తాడు అని నమ్మినవాడు.  అందుకే విప్లవోద్యమం ఒడిదుడుకులకు గురైనపుడు, సెట్ బేక్లకు గురైనపుడు, ఎదురుకాల్పుల్లో విప్లవకారులు మరణించినపుడు మ్రాన్పడి, దిగులుపడి ఏనాడూ కూచోలేదు. అసలు అలుపన్నదే, అనారోగ్యమన్నదే తెలియదు ప్రసాద్ కి.

పుస్తకాల మీద ప్రసాద్ కి ఎంత ప్రేమో చెప్పక్కర్లేదు. ఆయన ఇంట్లో మేడ మీద ఓ పెద్ద లైబ్రరీ.
వామపక్ష ఉద్యమాలకి, సాహిత్యానికి సంబంధించి ఎవరు ఏ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నా, ఎవరికి ఏ సందేహం వచ్చినా విశాఖలో ఆయనింటికి వెళ్ళాల్సిందే. ఎక్కడ ఏ పుస్తకం వుందని చెప్పడమే కాదు, ఏ పుస్తకంలో ఏముందో, ఎవరు ఏం చెప్పారో అలవోకగా చెప్పేసేవాడు. ఇక శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొకుల సాహిత్యం మీద ఆయనకున్న పట్టు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? ఆయనలేకుండా, వాళ్ళ సాహిత్య సర్వస్వాల ప్రచురణ ఊహించలేం.

అక్కడికెళ్లకుండా పని అయేది కాదు. ఓ మూడు సంవత్సరాలుగా లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసేడు – మా కొలీగ్  ఒకాయన ఇరవైఏళ్ల క్రితం తన దగ్గర తీసుకున్న పుస్తకాల గురించి. ఓ రోజు, రాసుకో ఏయే పుస్తకాలు తీసుకెళ్లాడో అని పేర్లు చెప్పేడు. అడిగేవా, ఇస్తానన్నాడా, ఎప్పుడిస్తాడట, అసలు ఇస్తాడా – అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేవాడు. మా కొలీగ్ రెస్పాన్స్ చాలా పూర్ గా వుండేది. వున్నాయనీ చెప్పేవాడు కాదు, లేవనీ చెప్పేవాడు కాదు. ఇస్తానని ఒకసారి, ఇంతకుముందే ఇచ్చేశానని ఇంకోసారి, వున్నాయో లేదోననీ చెప్పేవాడు.

మూడేళ్ళ గొడవ తర్వాత మొత్తానికి ఆ పుస్తకాల్లో కొన్నిటిని ఇచ్చేడు ఈ మధ్యనే. ఆ సంగతి ఫోన్లో వెంటనే చెప్తే ఎంత సంతోషించాడో! కానీ ఆ పుస్తకాలు చూసుకోకుండానే వెళ్లిపోయాడు.

నాకు ప్రసాద్ పరిచయం చోడవరం లైబ్రరీ స్టడీ మిత్రులు వర్మ, వేణుల ద్వారా. ఆ తర్వాత విశాఖలో జర్నలిజం చదువుతున్నపుడు పరిచయం కొంచెం పెరిగినా, అనుబంధం ఏర్పడింది మాత్రం నేను హైదారాబాద్ వచ్చాక, విరసంలో చేరేకే. తనకి ఇష్టమైన చిన్ని నా సహచరి అయ్యాక, ఎంత సంతోషించాడో.

***

ఫోటోలు: కూర్మనాధ్ 

మీ మాటలు

  1. Aranya Krishna says:

    ఒక అద్భుతమైన మానవ ప్రేమికుడాయన. మానవ సంబంధాల పట్ల ఒక అచంచల నిబద్ధత ఉన్న వ్యక్తి ఆయన.

  2. కూర్మనాథ్ … నిజమే ఒక మానవీయ శిఖరం నేలకొరిగింది .
    2003 ఫిబ్రవరి లో అనుకుంటా విజయ గారు (శ్రీమతి చలసాని ) పోయారు. అప్పుడే మొదటిసారి ప్రసాద్ గారిని చూశాను . భేష జాలు, లౌక్యం, మర్మం లేని ప్రసాద్ గారింటికి ఆ తర్వాత ఎన్నిసార్లు వెళ్లి ఉంటానో. ఒకసారి నా కాలు ఫాక్చర్ అయినప్పుడు (కృష్ణ బాయి గారితో కలిసి ) నన్ను పలకరించడానికి 4 అంతస్తులు మెట్లు ఎక్కి వచ్చిన దృశ్యమే కళ్ళముందు –
    ప్రసాద్ గారూ, మరోసారి ముద్దుగా “గాడిదా ” అని పిలవరూ ….

  3. Dr. Vani Devulapally says:

    “యారాడ కొండ చిన్న బోయింది” – కూర్మనాధ్ గారూ! చలసాని గారి లాంటి మానవ ప్రేమికుడి గూర్చిన మీ నెమరింత ఓ గొప్ప నివాళి !!

  4. దేవరకొండ says:

    పుస్తకాలమీదా ప్రజలమీదా ప్రసాద్ గార్కి ఉన్న మక్కువను చాలా లోతుగా అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని నా అభిప్రాయం. ఎన్నో సుగుణాలున్న ఎంతో మంది ఈ పుస్తకాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండడం మనకు నిత్యం అనుభవమే! బహుశ పుస్తకాల పట్ల క్రమశిక్షణ, ప్రజల పట్ల ప్రేమలను చిత్తశుద్ధితో అలవర్చుకోవడమే ఆ కర్మ యోగికి మనం ఇవ్వగలిగే అర్ధవంతమైన నివాళి అని కూడా నా అభిప్రాయం.

  5. Dr. Rajendra prasad Chimata says:

    దేవరకొండ గారి సూచనే నిజంగా ఆయనకు మనం ఇవ్వగల నివాళి

  6. Kranthi Prasanna says:

    చలసాని ప్రసాద్ గారు చనిపోయారని తెలియగానే నేను నాన్నతో కలిసి ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన్ని నేను పోయిన ఏడాది కాళీపట్నం రామారావు గారి 90 ఏళ్ళ పుట్టిన రోజు సభలో కలిసాను. నాన్న ఆయనకీ నన్ను పరిచయం చేయగానే ఆయన నమస్కారం చేసారు. అంత పెద్దాయన నాకు అలా నమస్కారం చేస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అది ఆయన సంస్కారం.
    మాస్టారూ .. ఈ ప్రపంచానికి తీరని నష్టం మీ మరణం. మంచివాళ్ళంతా ఇలా హడావుడిగా తిరిగి రాని లోకాలకి పయనం అయిపోతుంటే, మాకు మార్గదర్సకులెవరు ? మిమ్మల్ని నేను ఇంకొంచెం ముందుగా కలిసి ఉంటె బాగుండేది . మీగురించి నేను అందరికీ గర్వంగా చెప్తాను, మీలాంటి ఒక నిస్వార్ధపరుడు ని నేను చూసాను, కలిసాను , మాట్లాడాను..
    డబ్బులే అందరికి ఇపుడు సర్వస్వం అయిపోయాయి. కానీ చలసాని గారి దగ్గర ఒక వేరే ప్రపంచం ఉంది. అది పుస్తక ప్రపంచం. ఆయన ఇంటి నిండా ఎన్ని పుస్తకాలో .. 18000 దాకా నంబర్లు వేసి ఉన్నాయి. నంబర్లు వేయనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో నాకు ముందుగా కనిపించింది చలం రాసిన ప్రేమలేఖలు. ఇపుడు మా ఇంటిలో చలసాని గారి పుస్తకం ఒకటి ఉండిపోయింది. కాళీపట్నం రామారావు గారి కథల పుస్తకం.
    చలసాని గారి ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ అంతా న్యూస్ పేపర్ కట్టింగ్సే .

  7. తెలుగు కవిత్వ పరిణామంపై ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న ఇటీవల పరిచయమైన మిత్రుడు, సహోద్యోగి (సాక్షి పత్రిక సిటీ డెస్క్) తనకు తెలుగు కవిత్వ ధోరణులపై రెఫరెన్సు పుస్తకాలు కావాలని అడిగితే నాకు వెంటనే తట్టిన పేరు చలసాని ప్రసాద్. ఈ ప్రపంచంలో చాలామంది వద్ద బోలెడు పుస్తకాలు ఉంటాయి కానీ అవసరమైన వారికి ఎలాంటి భేషజాలు లేకుండా ఇవ్వడానికి అంగీకరించే, సహకరించే మొదటి వ్యక్తి చలసాని గారే, ఆయననే ముందుగా కలువండి అని చెప్పాను. ఇంతలోనే ఇలా అవుతుందనుకోలేదు.

    30 ఏళ్ల క్రితం తిరుపతి విరసం సాహిత్య సమావేశాల్లో తొలిసారి కలిశాను. తర్వాత జీవితంలో ఎదురైన అనేక పరిణామాల వల్ల (సుదీర్ఘ అజ్ఞాత జీవితం కూాడా వాటిలో ఒకటి) ఆయనను కలిసింది లేదు. కానీ ఈ 30 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన తిరుగాడని చోటు, మాట్లాడని వేదిక, చేయని ప్రసంగం ఉందంటే ఆశ్చర్యపడాల్సిందే.

    మధ్యతరగతి జీవితం నింపాదిగా గడిపే ఆర్థిక స్థితిగతుల్లో ఉండీ కూడా ఇస్త్రీ చేయని బట్టలను ధరించడం జీవిత కాల యజ్ఞంగా పాటించడమే ఆయన ఎలా బతికాడన్నది తెలుపుతుంది. నిరాడంబరత్వం అనేది ఎవరో చెబితే అలవర్చుకునేది కాదు కదా.. క్రమశిక్షణ ద్వారా నేర్చుకునేది అంతకన్నా కాదు. అదోక పురాజీవన విలువ. ఆయన దాన్ని చివరిదాకా పాటించారంతే…

Leave a Reply to రాజశేఖరరాజు Cancel reply

*