పుస్తకాలూ, ప్రజల మధ్య చలసాని!

 నారాయణస్వామి వెంకట యోగి

  మా ఆఫీసు లో నాతో పాటు పనిచేసే అనిల్ అనే మిత్రుడు నెలరోజుల సెలవుపై వైజాగ్ వెళ్ళి,  వచ్చీ రాగానే ‘సార్ మీకో సర్ప్రైజ్ ఉంది’ అంటూ ఒక పాకెట్ తెచ్చి యిచ్చాడు. విప్పి చూద్దును కదా ‘సాహిత్య సమాలోచన’ కృష్ణా బాయి  గారి పుస్తకం, అందులో అందమైన దస్తూరి తో కృష్ణక్క ఉత్తరం – ఒక ఐదారు వాక్యాలతో మరో ఉత్తరం – ‘స్వామీ యెలా ఉన్నావ్ విద్యా పిల్లలూ  యెలా ఉన్నారు – ఈ ఒక్క పుస్తకం మా వదిన కోసం పంపి హెల్ప్ చెయ్యి – నినూ యెప్పటికీ మరవం’ అంటూ – వెనక నిన్నెట్ల్లా భరిస్తుందో అమ్మాయి అంటూ ఒక చురక – తనకు మాత్రమే సాధ్యమయ్యే పలకరింపు  వాక్యాలు – ప్రసాద్ గారి ఉత్తరం – చాలా సంతోషపడ్డా – గత దినాల స్మృతులన్నీ ఒక్క సారి చుట్టుముట్టినయి –

వెంటనే ఫోన్ చేసా వైజాగ్ కి – ‘యేమి నారాయణస్వామీ పూర్తిగా అమెరికనైజ్ అయిపోయావా  – ఇంక అక్కడే ఉండిపోతావా ‘   చాలా ఆత్మీయంగా,  హాయిగా పలకరింపు – ‘లేదండీ …’ అని నేనేదో అనబోతుంటే ‘అండీ యేమిటి నీ బొంద కొత్తగా ..’ అని ప్రేమగా చీవాట్లు – అదే చనువు అదే ఆత్మీయత అదే ఆర్తి గొంతులో..  యే మాత్రం మారలేదు – తనకి 83 యేండ్లు అంటే నమ్మ బుద్ది కాలేదు – పసి పిల్ల వాడిలా మాటలు – ఒక నాలుగైదు పుస్తకాల పేర్లు చెప్పి ఇవి వెతికి పంపు వెంటనే – వదిన (కృష్ణక్క) అడిగిన పుస్తకం వెంటనే పంపు – అని చనువుగా పురమాయింపు – పుస్తకాలు పంపాక ఫోన్ చేస్తే ‘అందినయి పుస్తకాలు చాలా థేంక్స్ – యెప్పుడొస్తావు ఇండియాకు – వచ్చేటప్పుడు మరిన్ని పుస్తకాలు తీసుకు వద్దువు కాని ‘ – పుస్తకాలే పుస్తకాలే ఇంకా యేమీ యెప్పుడూ అడగ లేదు,  కోరుకోనూ లేదు –

2005 లో అప్పటి వై ఎస్సార్ ప్రభుత్వం చర్చల ప్రహసనం ముగించి ‘ఎంకౌంటర్’ ల వేడి  నెత్తురు చిందించి ,  విరసం నిషేధించినప్పుడు, నిషేధం  యెత్తివేయాలని (అప్పుడు వీవీ ని కూడా జైల్లో పెట్టారు‌ )   సం తకాల సేకరణ కోసం శివారెడ్డి గారూ , వేణూ  నేనూ, యెం. టీ. వాసుదేవన్ నాయర్, కే. సచ్చిదానందన్ ల సంతకాల సేకరణ కోసం వెళ్ళినప్పుడు కలిసాం ప్రసాద్ గారిని – (నేనప్పుడే యేడేళ్ళ ప్రవాసం తర్వాత ఇండియా వెళ్ళి ఉండినాను) – ఒక డొక్కు స్కూటర్ వేసుకొని వచ్చారు – అదే ఇస్త్రీ లేని ముడుతల అంగీ , పాంటూ , బుజానికి సంచీ , లావుపాటి మసక కళ్ళద్దాలు – యేమివోయి స్వామీ యెప్పుడొచ్చావు – రాగానే నిషేధమా – నాకు సన్ ట్సు ‘ఆర్ట్ ఆఫ్ వార్ ‘ఒరిజినల్ స్పెషల్ ఎడిషన్ కావాలి – సంపాదించి పంపు యెట్లయినా ‘ – అప్పుడూ పుస్తకమే అడిగారు.

1984 లో శ్రీకాకుళం (మాకివలస) విరసం మహాసభల్లో చూసాను మొదటి సారి ప్రసాద్ గారిని – నేనంతకు ముందు సంవత్సరమే విరసం లో చేరాను. అప్పల్నాయ్డు గారి అధ్వర్యం లో చాలా గొప్పగా అద్భుతంగా జరిగినయి ఆ సభలు – అక్కడే నేను విరసం మహామహులందరినీ కలిసాను – కేవీ ఆర్, త్రిమరా, ప్రసాద్ ,సురా, అప్పల్నాయ్డు – ఇంకా చాలా మందిని మొదటి సారి కలిసేను –
సభ ప్రారంభం లో విరసం జెండా యెగరేసినాక

‘యెత్తినాం విరసం జెండా
అలలలుగా వరదలొత్తు
పోరు పోరు జెండా’
అధ్బుతమైన మమేకతతో ఆర్తితో నిండిన కంఠస్వరం తో కళ్ళు మూసుకుని గానం చేస్తుంటే ‘ఆయనే చలసాని ప్రసాద్’ అని చెప్పారెవరో – అప్పట్నుండీ ప్రతి విరసం సభలో సమావేశం లో రుద్రజ్వాల రాసిన పతాక గీతం ప్రసాద్ గారు పాడాల్సిందే!

‘సుబ్బారావు పాణిగ్రాహి సంధించిన కళల త్రోవ
మా యెన్నెస్ ప్రకాశరావ్ మండించిన కథనంలో ..
పరిటాలా రాములన్న ప్రతిఘటనా మార్గంలో
మా చెర యేతం పట్టిన విప్లవాల గానంలో ‘

గొప్ప తాదాత్మ్యం తో పాడే వారు ప్రసాద్ గారు – నాకూ నేర్పించండి పాట అంటూ వెంట పడ్డాను ఆయన వెంట – అప్పుడు నాకు 18 యేండ్లు – నవ్వి బుజం తట్టి ఓ తప్పకుండా అన్నారాయన ఆత్మీయంగా –

తర్వాత సభలో

‘ఈ విప్లవాగ్నులు యెచ్చటివని అడిగితే
శ్రీకాళం వైపు చూడమని చెప్పాలి
వెంపటాపు సత్యమెవరని అడిగితే
గిరిజనుల సత్యమని గొప్పగా చెప్పాలి

సత్యమూ మాస్టారు స్థానమెచటని అడుగ
గిరిజనుల హృదయాలు గుర్తుగా చూపాలి’

కళ్ళు పూర్తిగా మూసుకుని ఒక చేత్తో బల్ల మీద దరువేస్తూ మూసిన కళ్ళ వెనుక తడి ఉబుకుతుండగా చాలా ఆర్ద్రంగా గొప్పగా గానం చేసారు ప్రసాదు గారు. సభ అంతా పూర్తి నిశ్శబ్దంగా లీనమై పోయి విన్నారా పాటను. పాట తర్వాత నినాదాలు మిన్నంటాయి. అట్లే మరో పాట కూడా పాడే వారు – నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ తనకు మాత్రమే సాధ్యమయ్యే గొంతు తో పలికే వింతయిన గమకాలతో పాడే వారు ‘స్టాలినో నీ యెర్ర సైన్యం ఫాసిజ వినాశ సైన్యం ‘ అంటూ – ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి ఉద్యమాల్లో ఉన్న అపారమైన అనుభవం ప్రసాద్ గారిది.

పల్లెర్లమూడిలో విరసం తరగతులు నిర్వహించినప్పుడు మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం – గతితార్కిక చారిత్రిక భౌతిక వాదాల పైన పాఠం చెప్పారు ప్రసాద్ గారు. అంత సంక్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యేట్లు ‘in a nut-shell’ అనే పద్దతి లో గొప్పగా చెప్పారు పాఠాన్ని. నేనూ,  నా మిత్రుడూ సన్నిహితుడూ ఐన అమరుడు    మాధవస్వామీ పాల్గొన్నాం ఆ తరగతుల్లో – మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం  పునాదులేసింది ప్రసాద్ గారే. ఆ మొత్తం తరగతులైనన్ని రోజులూ మేమొకటి గమనించాం – ప్రసాద్ గారు గాడంగా యెప్పుడూ నిద్రపోయే వారు కాదు – వారిది పిట్ట కునుకే ! ఒక నాలుగైదు నిమిషాలు ఉన్నచోటే కూర్చునే కళ్ళుమూసుకుని కునికే వారు – తర్వాత మళ్ళీ యథాతథంగా చురుగ్గా ఉత్సాహంగా పనిచేసే వారు !

ప్రసాద్ గారు శ్రీ శ్రీ కి,  శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యానికీ పర్యాయ పదం మా దృష్టిలో – శ్రీ శ్రీ అంటే వల్లమాలిన ప్రేమ – చిన్నపిల్లాడై పోయే వారు  శ్రీ శ్రీ పేరు చెపితే – ఈగ వాలినా  సహించే వారు కాదు – ఆయన యెప్పుడు యేది మాట్లాడినా రాసినా తప్పకుండా ఒక్క సారైనా శ్రీ శ్రీ కవితా వాక్యమో వచన వాక్యమో తప్పకుండా దొర్లుతుంది – శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యం ప్రచురణ మొత్తం తన బుజాల మీద వేసుకున్నాడు – డబ్బుల సేకరణ దగ్గర్నుండీ, కవర్ పేజి డిజైన్ , ప్రూ ఫులూ, ఫుట్ నోట్సూ – సమస్తం ఆయనే – ఒక్కడే నెరవేర్చాడు అంటే అతిశయోక్తి కాదు –  సినిమా వాళ్లతో చాలా సంబంధాలుండేవి తనకి –తెలుగు సినిమా రంగంలో కొంత అభ్యుదయ భావాలున్న వారితోనే (ప్రత్యగాత్మ, కే.బి. తిలక్ తదితరులతో ..) సంబంధాలు – కొన్ని సినిమాలకి సహాయ దర్శకత్వం కూడా చేసారని విన్నాను – శ్రీశ్రీ  సమగ్ర  సాహిత్యం ప్రచురణ లో ప్రసాద్ గారు యెవరినీ ఇబ్బంది పెట్టలేదు – తన స్వంతపని లాగానే (యే విరసం పనైనా తాను అట్లే చేసేవారు గొప్ప కమిట్మెంటు తో డెడికేషన్ తో) అలుపెరుగకుండా చిరునవ్వుతో చేసారు – బాగా గుర్తు హైద్రాబాదు లో ఒకసారి కలిసినప్పుడు శ్రీ శ్రీ అనువాదం చేసిన 1968 ఫ్రెంచి విద్యార్థుల ఉద్యమం గురించిన గొప్ప పుస్తకం ‘రెక్క విప్పిన రివల్యూషన్’(The beginning of the End – Angelo Quattrochi) పుస్తకాన్నిచ్చి  – ‘యెట్లా వచ్చింది’ అని కనుబొమలెగరేసుకుంటూ కళ్లలో కించిత్తు సంతృప్తితో కూడిన గర్వం కదలాడుతుంటే అడిగారు – నిజంగా చాలా గొప్పగా అద్భుతంగా ప్రచురించబడిందా పుస్తకం.

విరసం సభలకే మరోమారు వైజాగ్ వెళ్ళీనప్పుడు ప్రసాద్ గారింటికి వెళ్ళాను. పుస్తకాలు,  పుస్తకాలు,  యెటు చూసినా పుస్తకాలే! విశాఖ సముద్రం ప్రసాదు గారింట్లో ఉన్నట్టనిపించిది – షెల్ఫ్ లో శ్రీ శ్రీ లండన్ మహాప్రస్థానం కనబడింది – ఆత్రంగా,  ఆకలిగా తీసుకుని చూడ్డం మొదలు బెట్టా! నా కళ్లలో వెలుగే చూసారో, పుస్తకా న్ని అంత వెల పెట్టి కొనుక్కోలేని నా అశక్తతనే గమనించారో  – ‘మా నారాయణస్వామికి ప్రేమతో’ అని రాసి సంతకం పెట్టి యిచ్చారా పుస్తకాన్ని – తనివితీరా శ్రీ శ్రీ నీ,  ప్రసాదు గారినీ  నీళ్ళు నిండిన కళ్ళతో గుండెలకు హత్తుకున్నా!

విరసం సంస్థాపక సభ్యులూ, జీవితాంతం నమ్మినదానికోసం నిలబడ్డ వారూ, అత్యంత సాధారణ జీవితం గడపిన వారూ, యెటువంటి ఆడంబరాలకూ, పటాటోపాలకు  పోకుండా చాలా సాదా సీదా గా జీవితాన్నీ , సాహిత్యసృజనూ కొనసాగించిన మహానుభావులు ప్రసాదు గారు. యెందరో రచయితలను ప్రచురించారు, వెన్ను దట్టి  ప్రోత్సహించారు – తాను స్వయంగా రాసిందానికన్నా యెక్కువగా,  ఆణిముత్యాల్లాం టి సాహిత్యాన్ని ప్రచురించారు విశాఖలో , తెలుగు నేలపైనా  విప్లవ సాహిత్యానికి మూలస్థంభంలా నిలబడ్దారు – యెంత సాదా సీదాగా ఉండే వారో అంతే సింపిల్ గా మాట్లాడినట్టున్నా గొప్ప లోతైన అర్థాన్నిచ్చేట్టుగా మాట్లాడే వారు – ‘ఆంధ్రప్రదేశ్ ఒక అందమైన అబద్ధం తెలంగాణ ఒక నిష్ఠూరమైన నిజం’ లాటి ఆణిముత్యాల్లాంటి వాక్యాలెన్నో ఆయన ముఖత చాలా యథాలాపంగా వచ్చేవి.

కేవలం పుస్తకాలే కాదు జీవితాన్ని, సమాజాన్నీ , ప్రజా ఉద్యమాలనీ క్షుణ్ణంగా చదివి పీడిత ప్రజా పక్షపాత ప్రాపంచిక దృక్పథాన్ని అణువణువునా వంటబట్టించుకుని అడుగడుగునా ఆచరించి చూపిన వారు ప్రసాద్ గారు. ఆయన ‘గాడిదా’ అని కానీ మరో రకంగా కానీ తిట్టినా చాలా ముద్దుగా ఉండేది. ఆక్షేపణీయంగా అసలు ఉండేది కాదు. ఆయన పాటలేకుండా విరసం సభలు ప్రారంభమవడం ఊహించడం కష్టంగా ఉన్నది. శ్రీ శ్రీ గురించి యెవరు యెక్కడ మాట్లాడినా వెంటనే స్పందించే వారు. ఆ మధ్య ఒడిస్సిస్ యెలైటిస్ ‘పిచ్చి దానిమ్మ చెట్టు’ పద్యాన్ని విన్నకోట అనువాదం చేస్తే వెంటనే స్పందించి ఇది శ్రీ శ్రీ యెప్పుడో అనువాదం చేసాడు – రవిశంకర్ అనువాదం కొంచెం తేడాగా ఉంది అంటూ స్పందించారు. సాహిత్యం , విరసం తదితర అంశాల మీద జరిగిన సుదీర్ఘ చర్చ లో వేల్చేరు తదితరులతో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీ శ్రీ నిజమైన జయంతి యేప్రిల్ 30 అని చాలా పరిశోధించి నిర్ధారించారు. ఈ యేడాది,  ఆ రోజు వివిధలో విలువైన శ్రీ శ్రీ స్మృతులెన్నో పంచుకున్నారు. బహుశ అదేనేమో ఆయన చివరి ప్రచురితం.

నవంబర్ లో వచ్చేటప్పుడు తీసుకురా అని నాకో పుస్తకాల జాబితానిచ్చారు  ప్రసాదు గారు. అప్పల్నాయ్డు  గారితో పంపిద్దామనుకున్నా పుస్తకాలు.   నవంబర్ రాకముందే హడావిడిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తలుచుకుంటే గుండె బరువెక్కుతోంది. కళ్లలో నీళ్ళు నిండుతున్నయి. రావిశాస్త్రి అంటే విపరీతమైన అభిమానం  ప్రసాదు గారికి.  రావిశాస్త్రి కథల్లోని, శ్రీ శ్రీ కవిత్వం లోని  అథోజగత్సహోదరులకోసం. పతితులు, భ్రష్టులూ, బాధాసర్పదష్టులకోసం,  జీవితాంతం సాహిత్య, సాంస్కృతిక సామాజిక రంగాల్లో కృషి చేసిన ప్రసాదు గారు అందరి హృదయాల్లోనూ , ప్రజల నాలుకల పైనా యెప్పుడూ జీవించే ఉంటారు. ఆయనకూ ,  అసాధారణమైనదీ  అయిన ఆయన జీవన శైలికీ మరణం లేదు.

*

మీ మాటలు

 1. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  విరసానికి చలసాని శాశ్వత చిరునామా. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు చక్కగా వెల్లడి చేశారు. మంచి వ్యాసం.

 2. Delhi Subrahmanyam says:

  చాలా విలువయిన కొత్త సంగతులతో రాసిన మంచి నివాళి .

 3. Ramana Yadavalli says:

  ఇరవై నాలుగ్గంటల్లో చలసానిపై నాలుగో వ్యాసం! చదువుతుంటే గుండె బరువెక్కిపోతుంది. థాంక్యూ ‘సారంగ’!

 4. Delhi Subrahmanyam says:

  రమణ గారు చెప్పినట్టు నిజంగా గుండె బరువెక్కి కళ్ళమ్మట నీళ్ళోచ్చినాయి .

 5. buchireddy gangula says:

  అందరి వ్యాసాలూ ( చలసాని గారి ఫై ) భాగున్నాయి
  విప్లవ కవి కి జోహార్లు
  కన్నీళ్ళు కార్చడం తప్ప ?????
  —————————————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 6. ఎ.కె.ప్రభాకర్ says:

  కా.చలసాని ( శ్రీ శ్రీ ) ప్రసాద్ వ్యక్తిత్వంపై ఆత్మీయమైన వెలుగు ప్రసరింప జేసిన నారాయణ స్వామికి మప్పిదాలు.CPకి అరుణారుణ జోహార్లు.

 7. చలసాని మూర్తిమత్వాన్ని ఆవిష్కరించిన నారాయణ swamy గారికి అభినందనలు …sikhamani

 8. attada appalnaidu says:

  స్వామి గారు చాలా బాగా చలసానిని ఆవిష్కరించారు.నేను ఇక్కడ అమెరికాలో ఉండడం చలసానిని కడసారి చూపు చూడలేక పోవడం చాల దుఃఖంగా ఉంది. ఈ దుర్వార్త గూడా మీకు నేనే చెప్పినట్టుంది. మొన్ననే మనం చలసానినీ,అతని పాటల్నీ తలచుకున్నం. ఇంతలో … విరసం మూల స్తంభాల్లో ఒకరు చలసాని….విప్లవ సాహిత్యోద్యమానికే తీరని లోటు..

 9. Thirupalu says:

  మంచి నివాళి .

 10. Dr. Rajendra prasad Chimata says:

  చలసాని గారు ఎంత మందికి ఆప్తులో,ఎంత గొప్ప వ్యక్తిత్వమో. మీ ఆత్మీయ పరిచయం ఆయన గురించి సమీపంగా తెలియని వారికి తెలిసేలా మీ బాధ పంచుకున్నారు.

 11. sivalakshmi says:

  స్వామీ,
  మీ జ్ఞాపకాలు ఎన్నెన్నో జ్ఞాపకాలను గుర్తు తెస్తున్నాయి.అసలు కళ్ళు పూడుకుపోతున్నాయి.కబురు తెలిసీ తెలియగానే జనమందరూ నాలుగు వైపులనుంచి రైళ్ళూ,బస్సులూ,ఏది బడితే అది పట్టుకుని చేరిపోయారు. ఎటు చూస్తే అటు దుఃఖం.నిరుపేద కూలీ నాలీ చేసుకునే జనం ఎంతెంత దూరాల్నించో పోటెత్తారు.కంటతడి పెట్టనివారే లేరు.చాలా గొప్పవాళ్ళని మనం భవిష్యత్తులో చూడగలమేమో గాని మనం కలలు గనే నూతన మానవుడు మానవ సంబంధాల్ని నిలబెట్టుకునే విధానానికి కొండగుర్తు మాత్రం ప్రసాదంకులే!ఇటీవల అంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో నవ్వుతూ చాలా జీవ కళ ఉట్టిపడుతూ కనిపించారు చూడండి అచ్చం అలాగే ప్రేమగా మనల్ని పలకరిస్తూ ఉన్నట్లే ఉన్నారు.అసలు మర్చిపోలేకపోతున్నా!

 12. చలసాని గారిని గుండెలకు హత్తుకున్న మీ వాక్యాలు కళ్ళలో నీళ్ళు తెప్పించాయి సర్. మరపురాని మనిషి.

మీ మాటలు

*