ఒక గుండెతడి మనిషి

 

పి.మోహన్

P Mohan‘‘మీ రాయలసీమ వాళ్లు మీరూ, గారూ అని పిలవరు కదా. మరి నువ్వేమిటోయ్ నన్ను మీరూ, గీరూ అంటావు? చక్కగా మీ కడపోళ్ల మాదిరి నువ్వు అనో, లేకపోతే అందర్లా సీపీ అనో ఏకవచనంలో పిలవబ్బాయ్!’’

చలసాని ప్రసాద్ పదేళ్ల కిందట వాళ్లింట్లో నాతో అన్నమాటలివి. అప్పటికి ఆయన వయసు 73, నా వయసు 26. చలసాని స్నేహం, ప్రేమానురాగాలు ఎంత కమ్మనివో ఈ ఒక్క ఉదాహరణ చాలనకుంటా. అలాంటి చలసాని శాశ్వతంగా దూరం కావడం తెలుగు సాహిత్య ప్రేమికులకు, వ్యవస్థలో మార్పు కోరేవాళ్లకు తీరని లోటు. అదృష్టంపై నాకు నమ్మకం లేదు కాని, ఆయన ప్రేమానురాగాలు పంచుకున్న వాళ్లంత అదృష్టవంతులు ఈ లోకంలో ఉండరు. ఆ అదృష్టం నాకు కాసింతే దక్కింది.

కాలేజీ రోజుల్లో శ్రీశ్రీ సాహిత్య సర్వస్వ సంపుటాలపై చలసాని, కృష్ణాబాయిల పేర్లు చూసి వాళ్లను కలవాలని ఆరాటపడేవాడిని. వాళ్లు విరసం సభల్లో పరిచయమైన కొత్తలో నాకు మామూలుగానే తొలుత వయోవృద్ధుల్లా కనిపించారు. అందుకే గౌరవంతోనే కాకుండా కాస్త భయంతోనూ ఉండేవాడిని. తర్వాత అర్థమైందేమంటే వాళ్లు కల్మశం లేని చిన్నపిల్లలని, మా తరానికంటే ఆధునికులనీ. అప్పట్లో కృష్ణక్కకు రాసే ఉత్తరాల్లో కృష్ణాబాయి గారూ అని రాసేవాడిని. ఆమె ‘‘నాపేరు ‘కృష్ణాబాయి గారూ’ కాదు కృష్ణాబాయి మాత్రమే. అలాగే రాయి’’ అని రాసింది. చలసానికి కూడా ఉత్తరాలు రాసేవాడిని కానీ చాలా తక్కువ. ఆయన ఉత్తరాలు బ్రహ్మరాతలో ఉండేవి. అందుకే అవసరమైతే ఫోన్లో మాట్లాడేవాడిని.

2004లో పుస్తకాల పనిపై విజయవాడ వెళ్లినప్పుడు ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఎవరిదో స్కూటర్ పై వాళ్లింటికీ వీళ్లింటికీ తిప్పాడు. 2006లో విరసంపై నిషేధం ఎత్తేశాక విజయవాడలో సర్వసభ్య సమావేశం జరిగింది. నిర్బంధపు పచ్చి గాయాలు, హాస్టల్ తిండి తెచ్చిన అల్సర్ తో వెళ్లాను. సమావేశం తర్వాత మిత్రుల సలహాపై చికిత్స కోసం విశాఖ వెళ్లాను. చలసాని ఇంట్లో వారం రోజులున్నాను. చలసాని నన్ను స్కూటర్ పై మూడు, నాలుగు రోజులు వరుసగా కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లకు, తెలిసినవాళ్లకు ఫోన్లు చేశాడు. ఆస్పత్రిలో వార్డువార్డూ తిప్పి ఎండోస్కోపీ, రక్తపరీక్షలు వగైరా చేయించాడు. ఓ పక్క పరీక్షలు.. మరోపక్క  వెయింటింగ్ బల్లపై కూచుని ఏవోవో ఎర్ర పాటలు పాడుతూ ఆయన. మధ్యలో మందులు తీసుకొస్తూ, మా వాణ్ని జాగ్రత్తగా చూడాలని డాక్టర్లతో చెప్పిందే చెబుతూ. నాకు కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆయన నాకు పెద్ద రచయితలా, నాయకుడిలా కాకుండా మనసెరిగి మసలుకునే బాల్యమిత్రుడిలా కనిపించాడు. అప్పట్లో నేను కావాలని దూరం చేసుకున్న నాన్న, అన్నయ్యలు ఆయన రూపెత్తినట్లు అనిపించింది.

చలసాని ఇంట్లో ఉన్నవారం రోజులూ ఆయన తెచ్చిపెట్టే టిఫిన్లు, ఇంటి భోజనంతోపాటు  ఆయనింట్లోని పుస్తకాలతో విందుభోజనం చేశాను. ఇళ్లంతా ఎక్కడ చూసినా పుస్తకాలే. మేడ అయితే లైబ్రరీనే. వేలాది ఇంగ్లిష్, తెలుగు పుస్తకాలు. ఆర్ట్ అంటే పిచ్చి కనుక ఆ పుస్తకాల కోసం అరలన్నీ గాలించి 15 ఆర్ట్ పుస్తకాలు, 10 చరిత్ర, రాజకీయాల పుస్తకాలు ఏరుకున్నాను. ఒక అరలో కొక్కోకం వంటి పుస్తకాలు కనిపించాయి. ‘ఇవేంటి, ఇక్కడా?’ అని ఆశ్చర్యంగా అడిగితే, ‘ఏం, వాటిలో జ్ఞానం లేదా?’ అంటూ నవ్వాడాయన. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక మేడపైకెళ్లి లైబ్రరీని గాలించేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు చలసాని అక్కగారు వచ్చారు. ఆమెతో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ముచ్చట్లు చెప్పించుకోవడం మరో ముచ్చట.

తిండిలో, బట్టల్లో చలసాని నిరాడంబరత గురించి అప్పటికే కొంత విన్న నేను ఆ వారం రోజులూ ప్రత్యక్షంగా చూశాను. రచయితలంటే మడత నలగని ఖద్దరు బట్టలు వేసుకునేవాళ్లని అనంతపురంలో ఓ వెటకారం ఉండేది. ఇప్పుడూ ఉందేమో. ఇస్త్రీ చేయని బట్టల చలసానిని చూస్తూ ఉంటే ఆ రచయితలు కళ్లముందు కదిలేవారు. వస్త్రధారణ వ్యక్తిగతం కావొచ్చు కానీ, వ్యక్తిగతానికి, రాజకీయాలకు అణువంత తేడా చూపని చలసాని నిబద్ధత గురించి చెప్పడానికే ఈ పోలిక.

ఆస్పత్రిలో చూపించుకున్న తర్వాత తిరిగి అనంతపురం బయల్దేరాను. దాదాపు 30 పుస్తకాలను కర్రల సంచిలో సర్దుకున్నాను. పుస్తకాల విషయంలో చలసాని గట్టి లెక్కల మనిషి. ‘పుస్తకాలతో పనైపోయాక తిరిగి పంపిస్తేనే తీసుకెళ్లు. ముందు ఆ పుస్తకాల పేర్లు, రచయితల పేర్లు ఓ కాగితంలో రాసివ్వు’ అని అడిగాడు. సరేనని రాసిచ్చాను. మందులు కొనిచ్చి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, చేతిలో ఐదొందలు డబ్బు పెట్టాడు. తర్వాత స్కూటర్ పై ఎక్కించుకుని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి, తనే టికెట్ కొని, రైల్లో కూర్చోబెట్టాడు. రైలు కదులుతుండగా టాటా చెప్పాడు. నేనూ టాటా చెప్పాను. ఆయన ఫ్లాట్ ఫామ్ పై కనుమరుగు అవుతూ ఉంటే అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న కన్నీళ్లు మౌనంగా గట్లు తెంచుకున్నాయి.

తర్వాత ఆయనను హైదరాబాద్ సభల్లో చూశాను కానీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం లేకపోయింది. తన పుస్తకాలు తనకివ్వలేదని అలిగాడు కూడా. అలక తీర్చడానికి ఆ పుస్తకాలను సీతమ్మధార ఇంటి అడ్రసు పంపించాను. నేను గతంలో ఇస్తానని చెప్పిన నా సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను ఇవ్వలేదని చాలాసార్లు నిష్టూరమాడాడు. సెట్టి లక్ష్మీనరసింహం ‘రవివర్మ చిత్రమాలికలు’ పుస్తకం జిరాక్సు కాపీని ఆయనకు గత ఏడాది పంపించాను. దాన్ని పునర్ముద్రిస్తే ఎలా ఉంటుందని, మీరు టీకా టిప్పణీ రాస్తారా అని అడిగాను. ముందు పుస్తకం చూద్దామని, సెట్టి వారసులు విశాఖలో ఉన్నారని, వారి సాయం తీసుకుందామని అన్నాడు. నెలకిందట ఆ పుస్తకం గురించే ఆయన కృష్ణక్కతో మాట్లాడాడట. కృష్ణక్క ఫోన్ చేసి.. ‘నువ్వు చలసానితో ఏదో పుస్తకం గురించి చెప్పావుట. ఏంటా పుస్తకం? తనకు గుర్తుకురావడం లేదు’ అని చెప్పింది.

ప్రేమానురాగాలకు కొనసాగింపు ఇవ్వని పరమయాంత్రికతలో కొట్టుకుపోవడం వల్ల చలసానితో కలిసి తిరిగే భాగ్యం దక్కలేదు. కృష్ణక్క పుస్తకావిష్కరణ సభలో ఆయనను చివరిసారిగా చూసి, నా ‘డావిన్సీ’ పుస్తకం ఇచ్చాను. జాగ్రత్తగా సంచిలో వేసుకున్నాడు, భిక్ష అందుకునే బౌద్ధసన్యాసిలా.

బతుకు తెరువు సుడిలో కొట్టుపోతూ ఆయనను కడసారి చూసుకునే భాగ్యానికి కూడా నోచుకోలేకపోయాను. వీలైతే ఇప్పుడే ఆయన మరీమరీ కోరిన సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను విశాఖ తీసుకెళ్లి ఆయన చెంత ఉంచాలనిపిస్తోంది. దేని విలువైనా అది ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలుస్తుంది. చలసాని కూడా అంతే. ఆయన విలువేమిటో విరసానికి, తెలుగు సాహిత్యలోకానికి, సమాజానికి ఇకపై మరింత బాగా తెలుస్తుంది. చలసాని పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. శ్రీశ్రీ, కొ.కొ. సాహిత్యసర్వస్వాల కోసం తన రచనావ్యాసంగాన్ని త్యాగం చేసి, విరసం, ప్రజాపోరాటాల కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిగా కరిగించుకున్నాడు. ఆ పని చేస్తే నాకేంటి లాభం? అని ఆలోచించే వర్తమానంలో చలసాని లాంటి వ్యక్తులు అరుదు. చలసాని విరసం నాయకుడు, కార్యకర్త, దాహం తీరని సాహిత్యపిసాసి. ఇంకా ఏమిటేమిటో కావచ్చు. కానీ తొలుత ఆయన సాటిమనిషిని ప్రేమగా దగ్గరికి తీసుకునే గుండెతడి మనిషి. ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన నన్ను వెంటేసుకుని తిరిగిన కేజీహెచ్ ఆస్పత్రి జ్ఞాపకాలు మాత్రం నిత్యనూతనంగా ఉన్నాయి.

*

మీ మాటలు

 1. కల్లూరి భాస్కరం says:

  మోహన్ గారూ…చలసాని ప్రసాద్ గారితో మీ వ్యక్తిగత అనుబంధాన్ని, అనుభవాన్ని ఆర్ద్రంగా చెప్పారు. దగ్గరగా చూస్తే కానీ మనుషుల వ్యక్తిత్వాలూ, విలువా తెలియవు. మీరన్నట్టు ఈ యాంత్రిక జీవన జనారణ్యంలో మనం కోల్పోయింది మనుషుల్ని దగ్గరగా చూసే అవకాశమే. అందుకే ఈ ప్రపంచం వాసయోగ్యం కాకుండా పోతోంది.
  చలసాని గారిని నేను ఎనభై దశకం నుంచీ ఎరిగినా అది ముఖపరిచయమే కానీ, గాఢమైన పరిచయం కాదు. ఆయనను ఎప్పుడు చూసినా ఒకే భావన కలిగేది. ఆయన వయసును జయించారు. నిత్యోత్సాహి. నిరంతర కార్యశీలి.. చివరిసారి మూడేళ్ళ క్రితం చూసినప్పుడూ అదే అనిపించింది.

 2. Ramana Yadavalli says:

  “దేని విలువైనా అది ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలుస్తుంది. చలసాని కూడా అంతే. ఆయన విలువేమిటో విరసానికి, తెలుగు సాహిత్యలోకానికి, సమాజానికి ఇకపై మరింత బాగా తెలుస్తుంది.”

  అవున్నిజం.

 3. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  మోహన్ గారూ! మీరు చలసాని గురించి రాసిన వ్యాసం చదువుతుంటే గతించి పోయిన మిత్రులు చాలామంది గుర్తొస్తున్నారు. వాళ్ళు నాకు సీనియర్లు. నాకు శ్రీ శ్రీ, దేవులపల్లి వెంకటేశ్వరరావుల సాహిత్యాన్ని పరిచయం చేసిన వాళ్ళు. నన్ను అన్నివేళలా ప్రేమించిన వాళ్ళు.

 4. Thirupalu says:

  //ఒక అరలో కొక్కోకం వంటి పుస్తకాలు కనిపించాయి. ‘ఇవేంటి, ఇక్కడా?’ అని ఆశ్చర్యంగా అడిగితే, ‘ఏం, వాటిలో జ్ఞానం లేదా?’ //
  ఎక్కడో చదివినట్లు గుర్తు. మానవ సమాజపు ప్రతి అంగులాన్ని పరిశొదిమ్చని వాడు మార్క్సిస్టు కాదని. ఇక్కడ రంగనాయకమ్మ గారు గుర్తుకుస్తున్నారు. ఆయన కోకు గారి బుద్ధి కొలత వాదాన్ని వారి రచనలో చేర్చడం గురించిన ప్రస్తావన గుర్తుకొస్తుంది.

మీ మాటలు

*