పాటకోసం చూశాను.. మాటలు వెంటాడాయి!

 

 నీరుకొండ అనూష

anushaనాకు ఏదైనా అనిపిస్తే బాధైనా, సంతోషమైనా సరే! ఎందుకో తెలియదు కానీ కారణాన్ని రాయాలనిపిస్తుంది. అలా రాతరూపంలో చూసుకుంటే ఏదో తెలియని సంతృప్తి. ఇలా ఏదో ఒకటి రాస్తూ ఉంటే.. రైటింగ్‌ స్కిల్స్‌ (రాత నైపుణ్యాలు) కూడా పెరుగుతాయనే ఉద్దేశం. అయితే కొద్ది కాలంగా ఏదో ఒకటి రాద్దామనుకున్నా.. ఏదో కారణంగా అది ఆగిపోవడమో, సగంలోనే ఆపేయడమో జరుగుతోంది. కానీ ఇప్పుడు కచ్చితంగా రాసితీరాలి అనే ఆలోచన కల్పించింది- ‘హమారీ అదూరీ కహానీ’ సినిమా.

మామూలుగా అయితే నేను సినిమా విశ్లేషకురాలిని కాదు. సాంకేతిక నైపుణ్యం, కథ ఇవన్నీ విశ్లేషించడమూ రాదు. ఒక సగటు ప్రేక్షకురాలినంతే! సినిమా నచ్చింది, నచ్చలేదు. ఫలానా చోట హీరో బాగా చేశాడు, లేదా ఫలానా ఆరిస్ట్‌ ఇలా చేసుంటే బాగుండేది వరకు మాత్రం చర్చించుకోగల పరిజ్ఞానం ఉందనుకుంటున్నా. అయితే ఈ సినిమా మాత్రం అక్కడితో ఆపేయాలనిపించలేదు. బహుశా ఎక్కువ అంశాలు నాకు నచ్చడమే కారణమేమో!

నాకు నచ్చిన అంశాలను చర్చించే ముందు స్థూలంగా కథను చూస్తే..

ఒక ముసలావిడ, పేరు వసుధ (విద్యాబాలన్‌) ఒక ప్రదేశంలో బస్సు  దిగడంతో  సినిమా మొదలవుతుంది. కొన్ని అడుగులు కష్టంగా వేసిన తరువాత పడిపోతుంది. తరువాత ఆమె చనిపోయినట్లుగా.. ఆమె అంత్యక్రియలు జరిగినట్లుగా చూపిస్తారు. మరోవైపు ఆమె భర్త హరి (రాజ్‌ కుమార్‌ యాదవ్‌) సైకియాట్రిస్ట్‌ దగ్గర తన భార్య తన దగ్గరకు వచ్చిందని.. ఏదో అడిగివెళ్లిపోయిందనీ చెబుతుంటాడు. ఆమె చనిపోయిన విషయాన్ని హరికి తెలియజేయడానికి అతని కోడలు తన దగ్గరకు వస్తుంది. ఆమె అస్తికలను తండ్రి చేతులమీదుగా నిమజ్జనం చేయించడం కొడుకుకు ఇష్టం ఉండదు. కానీ హరి మాత్రం ఆమె అస్థికలను దొంగిలించి, కొడుకు కోసం ఒక డైరీని వదిలిపెడతాడు. దీంతో కథ ప్లాష్‌బాక్‌ లోకి వెళుతుంది.

వసుధ ఒక హోటల్లో పూలు అమర్చే ఆవిడగా చేస్తుంటుంది. భర్త తనను వదిలేసి ఎక్కడికో వెళతాడు. కొడుకుతోపాటు ఆమె అతని కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఆరవ్‌ రూప్‌రెల్‌ (ఇమ్రాన్‌ హష్మి) పరిచయం అవుతాడు. అతను గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌కు యజమాని. ఆమె పని చేస్తున్న హోటల్‌ను కొనాలనుకుంటాడు. అందుకుగానూ అక్కడ పనిచేసేవారిని పరీక్షిస్తాడు. అప్పుడు వసుధ నిజాయతీ అతనికి నచ్చుతుంది. దీంతో ఆరవ్‌ తన దుబాయ్‌ లోని హోటల్లో పనిచేయడానికి ఆమెకు ఆఫర్‌ ఇస్తాడు. భర్త కోసం వేచిచూస్తున్నందువల్ల తను దానిని తిరస్కరిస్తుంది. అయినా ఆరవ్‌ ఆమె ఎప్పుడైనా ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చని చెబుతాడు. సరిగా అపుడే పోలీసుల ద్వారా తన భర్త అయిదుగురు అమెరికన్‌ జర్నలిస్టులను చంపాడనీ, అతనో టెర్రరిస్టనీ తెలుస్తుంది. దీంతో కొడుకు భవిష్యత్తు కోసం దుబాయ్‌ వెళుతుంది. అక్కడ వసుధ, ఆరవ్‌ లు ప్రేమలో పడతారు. పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్న క్రమంలో తిరిగి హరి వచ్చేస్తాడు. తను నిర్దోషినని చెబుతాడు. వసుధ తన ప్రేమ కథను చెబుతుంది. వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నపుడు పోలీసులు హరిని అరెస్ట్‌ చేసి తీసుకెళతారు. హరి వసుధను ఎలాగైనా ఆరవ్ తో కలవకుండా చేయడం కోసం కోర్టులో నేరాన్ని తనపై వేసుకుంటాడు. కానీ అందరి ముందూ మాత్రం వసుధ ఆనందం కోసం ఈ పని చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తాడు. అయితే వసుధ కోరిక మేరకు హరిని విడిపించడానికి ఆరవ్‌ ప్రయత్నిస్తాడు. అయితే హరిని ఆరవ్‌ విడిపిస్తాడా? చివరికి ఆరవ్‌, వసుధ కలుస్తారా అన్నది మిగిలిన కథ.

కథను ఈ విధంగా చూస్తే మాత్రం దీనిలో కొత్తగా ఏముందిలే అనిపిస్తుంది. కానీ చూపించిన విధానం, చెప్పిన విధానం కొత్తగా తోచాయి.

విద్యాబాలన్‌ జాతీయ అవార్డు గ్రహీత (డర్టీ పిక్చర్‌), మంచి నటి అని తెలుసు . అది కూడా వార్తా పత్రికల కథనాల ద్వారానే. ఆమె సినిమాలు నేను పెద్దగా చూడలేదు. డర్టీ పిక్చర్‌ కొద్దిగా మాత్రం చూశానంతే. అయితే వసుధగా ఆమె పాత్ర మాత్రం కంటనీరు తెప్పించకుండా ఉండదు. ఇక హీరో- ఇమ్రాన్‌ హష్మిపై నాకు అంత మంచి అభిప్రాయం కూడా లేదు (నటన విషయంగా). అందుకు ఆయన తీసిన సినిమాలే కారణమై ఉండొచ్చు. లేదా నటన కంటే వేరే అంశాలకే అతను ప్రసిద్ధమవడమూ కారణమవచ్చు. అయినా నేను ఈ సినిమాను చూడడానికి కారణం మాత్రం సినిమాలో ‘మై జానె యే వారు దూ..’ పాటే.

ఇక సినిమా విషయానికొస్తే.. మొదట ఆకట్టుకున్నది- పూలు అమర్చిన తరువాత హీరో మీకు మీ వృత్తిలో నచ్చనిది ఏది అని హీరోయిన్‌ను అడుగుతాడు. అపుడామె.. ‘పూలు చెట్లకు ఉన్నపుడే వాటికి అందం, వాటిని మనం సరిగా ఆస్వాదించేది కూడా అపుడే. వాటిని ఎవరి ఆనందం కోసమో, దేవుడి కోసమో తెంపడం నచ్చదు. కానీ ఈ వృత్తే నాకు అన్నం పెడుతోంది..’ అని చెబుతుంది. ఎంత నిజమో కదా!

తరువాత దుబాయ్‌లో.. హీరో ఒక గార్డెన్‌ ను చూపిస్తూ.. ‘దీనిని ఇంత అందంగా తీర్చిదిద్దినా ఏదో వెలితిగా ఉంది. దీనికేమైనా పరిష్కారం చెప్పగలవా?’ అని అడుగుతాడు. దానికి ఆమె..’ఇక్కడ చాలా అందమైన పూలున్నాయి. నిజమే.. కానీ, కృత్రిమతే దీనికి వెలితి. ఒక తోటైనా పూలైనా అందంగా కనిపించాలంటే సహజసిద్ధంగా ఉండాలి. దీనిలో అదే లోపించింది. మొక్క అన్నాక ఎండిన ఆకులు, పూలుండడం సహజం. అవే లేనపుడు ఎంత అందమైన పూలను పెట్టినా దాని అందం తెలియదు’ అని చెబుతుంది. ఇక్కడ అందం తెలియాలంటే దానిపక్కన అందవిహీనమైనది ఉండాలన్నది కాదు నా ఉద్దేశం. సృష్టిలో ప్రతి దానికీ ఓ అందం ఉంటుంది. కానీ అద్భుతమనో, అత్యద్భుతం అనో మనమనాలంటే.. అసలు అది కనిపించడానికీ, అనిపించడానికీ తగిన వాతావరణం ఉండాలి కదా! అనిపించింది. అలా నాకు ఆ సంభాషణ నచ్చింది. నిజానికి చూసే మనసుండాలే కానీ ఎండిన ఆకులోనూ ఎంతందం?!

humari-adhurio-kahani_640x480_61430566630

అన్నట్టూ చెప్పడం మరిచాను.. ఈ సినిమాలో అమల అక్కినేని హీరో తల్లిగా నటించారు. అసలు కథ మలుపు తిరగడంలో ఈమెదే ముఖ్య పాత్ర. ఒకరకంగా ఈమెదీ, వసుధ పాత్రదీ ఒకే నేపథ్యం. బహుశా హీరోకి హీరోయిన్‌ నచ్చడానికి ఇదీ ఒక కారణమై ఉండొచ్చనిపిస్తుంది.. బాగా ఆలోచిస్తే!  హీరోయిన్‌ తో సంభాషణలో ఒక మాటంటుంది.. ‘ప్రతి అమ్మాయికీ మన దేశంలో సీతలా ఉండమని చెబుతారు. సహనంతో, సౌశీల్యంతో ఉండాలంటారు. కానీ రాధలా ఉండమని ఎవరూ చెప్పరు.. రోజూ రాధకృష్ణులకు పూజలు చేసినా! ‘ అంటుంది. ‘భర్త ఎన్ని బాధలకు గురిచేసినా.. ఓర్చకోవాలంటారు.. కానీ ప్రేమ కరవైనపుడు దొరికిన దాన్ని అందిపుచ్చుకోమని ఎవరూ చెప్పరు.. ఎంత విచిత్రం! నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో.. బలవంతపు సీతలానా.. నచ్చిన రాధలానా?’ అని అడుగుతుంది. ఉన్నది కొంచెం పాత్రే అయినా అమల పాత్ర చాలా నచ్చుతుంది. అంత బాగా నటించారామే.

వసుధ ఆరవ్‌ గురించి తన భర్తకు చెప్పినపుడు.. అతను ఆమె తనను మోసం చేశావనీ, నా కోసం వేచి చూడలేదని తిడతాడు. నువ్వు అతనితో ప్రేమలో పడినపుడు నేను గుర్తుకు రాలేదా అని అడుగుతాడు.. అపుడామె.. ‘నీ గురించి ఏం గుర్తుంచుకోవాలి? భర్త అనే అధికారంతో.. యజమాని పశువుపై వేయించినట్టుగా బలవంతంగా వేయించిన ఈ పచ్చబొట్టా? ‘ అని అడుగుతుంది. మళ్లీ చివర్లో.. ‘నేను నీ దానినంటూ నా నుదుటిన బొట్టూ, మెడలో తాళి, చేతికి గాజులూ నీ పేరు పెట్టుకున్నావ్‌. మరి నా కోసమంటూ నీ దగ్గర ఏం పెట్టుకున్నావ్‌?’ అంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా అంశాలు నచ్చుతాయి. నిజానికి ఈ సినిమాకు ప్రాణం ఈ సంభాషణలే. పెద్దగా బుర్రకు పనిపెట్టేలా కాకుండా.. మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. రాజూ సింగ్ సంగీతం సినిమాకు ప్రాణం. ఇంకోటి నేను గమనించిందేమిటంటే.. గత కొన్ని సినిమాలు చూస్తుంటే.. హీరో, హీరోయిన్ల మధ్య స్టెప్పులతో, హోరెత్తే మ్యూజిక్‌ కంటే.. శ్రవణానందంగా, కథలో భాగంగా పాటలను జోడించడం బాలీవుడ్‌ లో ఎక్కువగా కనిపిస్తోంది. మనవాళ్లు కూడా దీనిని అనుసరించాలని కోరుకునేవాళ్లలోనేనూ ఒకదానిని.

చివరగా ఇంకొక్కట్టుండి పోయింది.. పూలు. ఈ సినిమా మొత్తంలో ఆరిస్ట్‌ లందరితో పోటీపడిన తెల్లపూలు. తెల్లని ఆరమ్‌ లిల్లీస్‌. చాలా బాగుంటాయి. కథ ప్రారంభం, ముగింపు వీటితోనే ఉంటుంది.

‘హమారీ అదూరీ కహానీ’ అంటే.. పూర్తవని కథ అని అర్థం. కానీ ఈ సినిమానే ఎప్పటినుంచో రాయాలనుకుని, పూర్తి చేయలేకపోతున్న నా వ్యాసాన్ని పూర్తి చేసేలా చేసింది. మొత్తానికి పూర్తవని కథతో నా వ్యాసం ముగిసిందన్నమాట.

*

మీ మాటలు

  1. విశ్లేషణ బాగుంది . సినిమా చూడలేదు కానీ మీరు రాసిన దాన్ని బట్టి చూస్తే సంభాషణలు చాలా బాగున్నాయి . ప్రాసలు, పంచ్ డైలాగ్స్ రాజ్యమేలుతున్న సమయంలో ఇటువంటి అర్థవంతమైన మాటలు మంచి అనుభూతిని అందిస్తాయి . ఒక్కోసారి విషాదంలోంఛీ అందం ,ఆనందం ఉద్భవిస్తుందని నిరూపించిందన్నమాట ఈ చలన చిత్రం .

  2. venkatarao Podapati says:

    చాలా బాగుంది.. కీప్‌ ఇట్‌ అప్‌.. బుజ్జి

  3. Suryam Ganti says:

    ఈ పూర్తి అవ్వని కధ తో మీరు ఏదో వ్రాయాలన్న కోరిక సఫలీకృతం చేసుకొన్నారు .చాల బాగుంది మీ రివ్యు .

  4. Vanaja Tatineni says:

    ఒక్కోసారి అంతే ! వ్రాయాలనుకున్నవి వ్రాయలేకపోతే లోపల ఉక్కపోతగా ఉంటుంది . చాలా చక్కగా వ్రాసారు. మీకు నచ్చిన విషయాన్ని హైలెట్ చేసి వ్రాస్తూనే నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశారు . నచ్చిన పాట వెంట మీ దృశ్య ప్రయాణం, తీరిన మీ కోరిక చాలా బావున్నాయి. అభినందనలు . :)

  5. Padma Sreeram says:

    సూపర్బ్. మీ విశ్లేషణ లో అది నచ్చింది ఇది నచ్చలేదు అనేది నిర్మొహమాటంగా చెప్పడం మాత్రం నాకు బోల్డు బాగా నచ్చేసింది. పురుషాధిక్యత బాలీవుడ్ మూవీస్ లో ఎక్కువగానే అంటే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో చూపుతారని మరో సారి రుజువు చేసిన మూవీ అన్నమాట …. రాధలా ఉంDAలన్నా కష్టమే … ఎMduకంటే రాధా కృష్ణులకు వివాహం కాలేదుగా … ఐ రోజుల్లో అటువంటి అనుబంధానికి సమాజపటిష్టత , మానసిక భద్రత కావాలంటే తాళి అనే పచ్చబొట్టుండాలేమో.. మొత్తానికి మీ విశ్లేషణ బాగుంది . నేను పెద్దగా సినిమాలు చూడను కానీ మీరు రాసిన దాన్ని బట్టి చూస్తే కొన్ని సినిమాలు సంభాషNaల కోసమైనా చూడాలి అనిపించింది ఒక్క క్షణం. ముగింపు లేని కధపై పూర్తైన మీ సినీ రివ్యూ చాలా బాగుంది..

  6. ఆపకుండా చదివించి , ఆ సినిమా చూడాలనిపించేలా చేసింది మీ సమీక్ష! ఆ సినిమా ఇంతకుముందు చూడాలనుకోకపోవడానికి మీరు రాసిన కారణాలే కారణం !

  7. vasavi pydi says:

    సినిమాచూడ లేదే అన్న బాధ మీ రివ్యు చదివాకా ఎక్కువైంది బాగా వ్రాసారు

  8. srivasthava says:

    మీ వ్యాసం చదివిన తరువాత ఈ మూవీ చూడాలనిపించింది

Leave a Reply to vasavi pydi Cancel reply

*