ఆంధ్రా యూనివర్సిటీలో చదువులూ-సమ్మెలూ

వంగూరి చిట్టెన్ రాజు 

 

chitten rajuనేను పరాయి ఊరైన విశాఖ పట్నం లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటప్పుడు నా సరికొత్త అనుభవం విద్యార్థుల సమ్మెలలో ప్రత్యక్షంగా పాల్గొనడం ఒకటి, యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో పాల్గొనడం మరొకటి. ఈ రెండూ నాకు అంతకు ముందు ఎన్నడూ అనుభవం లేని విషయాలే.

మొదటి సమ్మెకి కారణం ఒక సినిమా హాలులో జరిగిన సంఘటన. వైజాగ్ లో వీరభద్ర రావు అనే కాంట్రాక్టర్ తన భార్యతో అప్పటి పూర్ణా టాకీసు లో సినిమాకి వెళ్లాడు. వాళ్ళ సీటు వెనకాలే కూచున్న ఆంధ్రా యూనివర్సిటీ కుర్రాళ్ళు ఎప్పటి లాగానే ఏవేవో చిన్న చిన్న డైలాగులతో ఆవిడని ఏడిపించడంతో సరిపెట్టుకోకుండా ఓ కుర్రాడు చీకట్లో వెనకాల నుంచి ఆవిడ భుజం మీద చెయ్యి కూడా వేశాడు.  దాంతో అంత వరకూ ఓపికగా భరించిన డబ్బున్న ఆ మధ్య వయస్సు కాంట్రాక్టర్ కి బాగా కోపం వచ్చి, ఆ విద్యార్థిని బయటకి లాక్కొచ్చి చితక్కొట్టాడు. తీరా చూస్తే ఆ కుర్రాడు యూనివర్సిటీలో ఓ విద్యార్థి నాయకుడు. ఇంకే ముందీ. ఆ రాత్రికి రాత్రే అందరినీ పోగేసి ఆ మర్నాడు కాంట్రాక్టర్ దౌర్జన్యానికి నిరసనగా విద్యార్థులు సమ్మె ప్రకటించి, పెద్ద ఊరేగింపుతో ఆ కాంట్రాక్టర్ ఇంటి ముందు తిష్ట వేశారు. ఆయన చేత క్షమాపణ చెప్పించుకున్నారో లేదో తెలియదు కానీ అసలు ఏమిటో , ఎందుకో మాకు తెలియక పోయినా నా బోటి గాళ్ళని హాస్టల్ లో ఉండనివ్వ కుండా సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఆ విధంగా నేను నా ప్రమేయమూ, ప్రయత్నమూ లేకుండానే విద్యార్థి సమ్మె లో ఒక సమిధని అయ్యాను.  అసలు సినిమా హాలులో జరిగిన విషయం తరువాత తెలిసింది.

ఇక రెండోది కేంపస్ లోనే దీపావళి సమయంలో జరిగిన ఉదంతం. కొంత మంది విద్యార్థులు ఎప్పటి లాగానే తారా జువ్వలకి నిప్పు అంటించి సద్ధర్మ సదనో మరోటో హాస్టల్ ఎదురుగుండా రోడ్డు మీద పోటీలు పడ్డారు. అందులో ఒక తారా జువ్వ ఎక్కడో పైన రెండో అంతస్తు నుండి తమాషా చూస్తున్న ఓ విద్యార్థి కేసి దూసుకు పోయి కంటి లో గుచ్చుకుంది. ఆ దారుణానికి భయ పడి పోయి అర్జంటుగా అతన్ని ఔట్ గేట్ దగ్గర ఉన్న క్లినిక్ కి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ మార్తాండ శాస్త్రి   అనే యూనివర్సిటీ డాక్టరు వెంటనే కన్ను ట్రీట్ చెయ్యడం మానేసి ఆ తారా జువ్వల పోటీ వాళ్ళని, ఆ చోద్యం ఎందుకు చూస్తున్నావు, బుద్ది లేదా, అనుభవించు అనీ అందరినీ తిట్టడం మొదలెట్టాడు.

ఇలాంటి ప్రవర్తన ఆయని కొత్త కాదుట. ఎవరైనా  విద్యార్థి ఏ కడుపు నొప్పి కో మందు కోసం వెడితే “నువ్వు వెధవ హోటల్లో దోశలు ఎందుకు తిన్నావూ?” “వెధవ అర్థ రాత్రి దాకా సినిమాలు ఎందుకు చూస్తావూ?” అనుకుంటూ రోగానికి మందు ఇవ్వకుండా  తిట్ల దండకం అందుకుంటాడు కాబట్టి ఆయన మీద అప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సారి ఈ సీరియస్ కేసు కూడా పట్టించుకోక పోవడంతో సహా విద్యార్థులు అతన్ని వెంటనే కెజిహెచ్ హాస్పిటల్ కి హుటాహుటిన తీసుకెళ్ళారు. అతను హాస్పిటల్ లో ఉండగా ఇంచు మించు అప్పటికప్పుడే ఈ వార్త దావానలం లా పాకి పోయి తెల్లారే సరికల్లా మొత్తం యూనివర్సిటీ ఆ డాక్టర్ ని డిస్మిస్ చెయ్యాలని పెద్ద సమ్మె మొదలు పెట్టారు. అందులో నేను కూడా ఊరంతా తిరిగాను. అధికారులు విధి లేక ఆ డాక్టర్ ని డిస్మిస్ చేశారు. పాపం ఆ విద్యార్థికి ఒక కన్ను తీసేసి గాజు కన్ను పెట్టవలసి వచ్చింది.

ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ విద్యార్థి ఎవరో అప్పుడు నాకు తెలియదు కానీ 1975 లో హ్యూస్టన్ లో ఉన్న పది మంది తెలుగు వాళ్ళం “రావు” గారు అనే ఒకాయన ఇంట్లో కలుసుకుని కబుర్లు  చెప్పుకుంటూ ఉంటే ఎందుకో మాటల సందర్భంలో అంధ్రా యునివర్సిటీ ప్రసక్తి వచ్చింది. ఆ నాటి డాక్టర్ మార్తాండ శాస్త్రి గారి దగ్గర బంధువు ఒకాయన ఆ పార్టీ లో ఉన్నారు. అప్పుడు దీపావళి నాటి ఆ సంఘటనా, మా సమ్మె విషయాలూ నేను పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఎంతో మిత భాషి అయిన రావు గారు మెల్లగా ఆ నాడు తారాజువ్వ ధాటికి కంట్లో దెబ్బ తిని ఆ సమ్మెకి కారకుడైన విద్యార్థి తనే అని  వెల్లడించిన జ్ఞాపకం. కానీ వివరాలు అడగడానికి భయం వేసి, నేను మళ్ళీ ఆ టాపిక్ ఎప్పుడూ మాట్లాడ లేదు. అందు చేత అది ఏమాత వరకూ నిజమో నిజంగా నాకు ఇప్పటికీ తెలియదు.

ఈ రావు గారు మటుకు ఆంధ్రా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని, అమెరికా వచ్చినట్టు ఖచ్చితంగా తెలుసు. ఆయన అప్పుడు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద కంప్యూటర్ కంపెనీ అయిన ఒక మామూలు సైంటిస్ట్ గా చేరి, తొలి కంప్యూటర్ మెమొరీ చిప్స్ (8 K సైజు నుంచి 18 K సైజుకి) ఎక్కువ సైజు తయారు చేసే పద్ధతి కనిపెట్టి,  వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆ సందర్భంగా అప్పుడే మొదలు పెట్టిన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి తరఫున ఆయనకి ఒక అభినందన సభ ఏర్పాటు చేశాం. ఈ రోజుల్లో ఏదో రాజకీయ కారణం ఉంటే తప్ప అటువంటి నిజమైన గుర్తింపులు అసాధ్యం. ఆ దంపతులు హ్యూస్టన్ లో ఉండే రోజులలో వారి కుటుంబం చాలా ఆత్మీయమైన మిత్రులు.

Slide Rule

ఇంజనీరింగ్ కాలేజీలో చేరగానే నా జీవితంలో అంతర్భాగం అయిపోయినవి స్లైడ్ రూల్ & టీ స్క్వేర్.  డాక్టర్లకి మెడలో స్టెత స్కోప్ లా ఈ రెండూ ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థి భుజాల మీద వేళ్ళాడుతూ ఉండవలసినదే! ఈ రోజుల్లో వాళ్ళు చూసి ఉండని ఆ రెండిటి బొమ్మలూ ఇక్కడ జత పరుస్తున్నాను. ఇందులో స్లైడ్ రూల్ అనేది ప్రపంచవ్యాప్తంగానే అందరూ వాడే అత్యద్భుతమైన, అత్యవసరమైన “లెక్కలు చేసే పరికరం”. లెక్కలు అంటే మామూలు కూడికలూ, తీసివేతలే కాదు, ఎంతో క్లిష్టమైన ఈక్వేషన్స్, కేలుక్యులస్, లాగరిథమ్స్, అల్గారిథమ్స్, ఆల్జీబ్రా, ట్రిగానామెట్రీ, స్క్వేర్ రూట్స్, ఎక్ష్పోనెన్శియల్స్, ఒకటేమిటి, అన్నీనూ. 1620 ప్రాంతాలలో జాన్ లేపియర్ అనే ఆయన కనిపెట్టిన “లాగరిథమ్స్” అనే లెక్కల ప్రక్రియ ఆధారంగా కనిపెట్టబడిన ఈ స్లైడ్ రూల్ అంచెలంచెలుగా ఎదుగుతూ, అన్ని శతాబ్దాలగా శాస్తీయ పురోగతికి మూల కారణంగా నిలబడింది. అంతెందుకు 1969 లో ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లు చంద్రుడి మీద కాలు పెట్టడానికి క్షణాల ముందు కంప్యూటర్ ని నమ్మడం ఇష్టం లేక ఆఖరి క్షణాలలో చెయ్య వలసిన లెక్కలు ఈ స్లైడ్ రూల్ మీదే చేశారు.

కానీ క్రమక్రమంగా ఎలెక్ట్రానిక్ కేలుక్యులేటర్లు తయారు అయి, 1965 లో HP-9100 తో మొదలు పెట్టి, హ్యూస్టన్ లోని  Texas Instruments  అనే కంపెనీ వారు 1976 లో తక్కువ ఖర్చుకి TI-30 అనే పాకెట్ సైజ్ సైంటిఫిక్ కేలుక్యులేటర్ ప్రవేశపెట్ట గానే ఈ స్లైడ్ రూల్ శకం అంతరించి పోయింది. అప్పటికి రెండేళ్ళ క్రితం నేను ఆప్యాయంగా అమెరికా తెచ్చుకున్న ఆ స్లైడ్ రూల్ ఎక్కడో మా అటక మీదో, మా తమ్ముడి దగ్గరో దాక్కుని ఉంటుంది.  అన్నట్టు  పైన చెప్పిన రావు గారు ఘన విజయాలు సాధించినది ఈ Texas Instruments కంపెనీ లోనే. అలాగే నా ఆప్త మిత్రుడు స్వర్గీయ అనిల్ కుమార్ కూడా ఆ కంపెనీ లోనే సుమారు పదేళ్ళు పని చేశాడు. కాలక్రమేణా కంప్యూటర్ టెక్నాలజీ అత్యంత వేగవంతమైన అభివృద్ది కారణం గా ఆ కంపెనీ వెనకబడి పోయి ఇప్పుడు అది నామ మాత్రం గానే మిగిలింది. ఇక ఆ టీ స్క్వేర్ ప్రధాన “ఆయుధంగా”, రక రకాల ఇతర ప్లాస్టిక్ పరికరాల తో బిల్డింగ్ డ్రాయింగ్, మెషీన్ డ్రాయింగ్ మొదలైన సబ్జెక్టుల లో బొమ్మలు గీసే వాళ్ళం. అది మటుకు నేను అమెరికా తీసుకు రాలేదు.

ఇక చదువు విషయానికి వస్తే చెప్పుకో దగ్గ విశేషాలు అంతగా లేవు కానీ ఒక్క సంగతి బాగా గుర్తుంది. ఓ సారి ఇంటెగ్రల్ కేలుక్యులస్ అనే చాలా కష్టమైన లెక్కల సబ్జెక్ట్ పరీక్షకి బాగానే చదివాను కానీ, మా 5వ బ్లాక్ హాస్టల్ నుంచి పరీక్ష హాల్ కి నడుస్తూ వెళ్ళే అర గంట లోనూ అంత వరకూ చదవడానికి టైము లేని వన్నీ నడుస్తూనే బట్టీ పట్టేశాను. తీరా పరీక్షలో నేను అంతకు ముందు పది రోజులు చదివినవేవీ లేవు సరి కదా, ఆ ఆఖరి అర గంటలో చదివి బట్టీ పట్టేసినవన్నీ ఉన్నాయి. ఇకనేం. టక టకా రాసేసి గట్టెక్క గలిగాను. లేక పొతే ఖచ్చితంగా ఆ రోజు సున్నా మార్కులు వచ్చేవి.

ఇక ఆ ఏడాదీ సినిమాలు బాగానే చూసే వాళ్ళం. సమస్య అల్లా సాయంత్రం ఎనిమిది దాటాక నెంబర్ టెన్ బస్సు ఉండేది కాదు. యూనివర్సిటీ కి వెళ్ళడానికి అదొక్కటే బస్సు.  ఆటోలు ఇంకా ఇండియాలో మార్కెట్ లో లేవు. రిక్షా వాళ్ళు “అప్పు నాగ నేం బాబూ” అని యూనివర్సిటీకి రిక్షా కట్టే వారు కాదు. అంచేత మేము హాయిగా సినిమా చూసి, ఏ “చడగాస్” లోనో, ఎల్లమ్మ తోట దగ్గర వసంత విహార్ లోనో భోజనం చేసేసి, గవర్నర్ బంగాళా మీదుగా రెండు గంటలు కొండెక్కి యూనివర్సిటీకి నడిచి వెళ్ళిపోయే వాళ్ళం.  నేను వైజాగ్ లో ఉన్నన్నాళ్ళూ  అక్కడికి దగ్గర అనకాపల్లి శివారు లో ఉన్న కశింకోట లో ఉండే మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన, శంకరం బాబయ్య లని రెండు , మూడు నెలలకోసారో,  పండగలకో వెళ్తూ ఉండే వాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో వైజాగ్ నుంచి కాకినాడ చాలా దూర ప్రయాణం బాబూ అనుకునే వాళ్ళం. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది. అలాగే మా బాబయ్య కూడా ఒకటి రెండు సార్లు మా హాస్టల్ కి వచ్చి నా బాగోగులు  చూసి మా నాన్న గారికి ఉత్తరం రాసే వాడు.

ఆంధ్రా యూనివర్సిటీ లో నా మొదటి సంవత్సరం ప్రిన్సిపాల్ దేవగుప్తాపు సీతాపతి రావు గారు.   ఆయన టంగుటూరి సూర్య కుమారికి దగ్గర బంధువు, మద్రాసు లో మా చిన్నన్నయ్యకి బాగా తెలిసిన వారే అవడంతో  ఎక్కువ ఇబ్బంది లేకుండానే విశాఖపట్నం నుంచి కాకినాడ కాలేజ్ కి టాన్స్ ఫర్ చేయించుకున్నాను. దాంతో ఆంద్రా యూనివర్సిటీ కేంపస్ లో నా చదువు పూర్తి అయింది. ఓ ఏడాది హాస్టల్ చదువు తరువాత మళ్ళీ ఇంట్లో అమ్మా, నాన్న ల దగ్గరే ఉండి చదువు కొనసాగించే అవకాశం వచ్చింది. ఒక సారి స్వతంత్రంగా బతకడానికి అలవాటుపడ్డాక, మళ్ళీ ఇంటికెళ్ళి చదువుకోడానికి నేను అభ్యంతరం చెప్పకపోవడం  చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది…ఇప్పుడు తలుచుకుంటే..నాక్కూడా ఆశ్చర్యం గానే ఉంది!

కాకినాడ లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసే నాలుగేళ్ల ప్రహసనం…మరో సారి.

*

 

 

మీ మాటలు

  1. buchireddy gangula says:

    Andhra అయినా తెలంగాణా అయినా –అన్ని university.. ల లో అదే తిరు — అదే పోకడ —
    అదే విధానం —-సమ్మెలు –ర్యాగింగ్ లు — ప్రేమలు — కొట్టుకో వ డా లు —-
    అంతటా రంగు — రుచి — వాసన –ఒక్కటే ???
    కొత్త ద న 0 ఏముందని ???????????

    *****మంచి సమాజం ఎర్పాడాలంటే మంచి సాహిత్యం రావాలి .–మంచి సాహిత్యం
    రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి — మంచి సాహిత్య విమర్శ రావాలంటే
    విమర్శ కూడా విమర్శ కు గురి కావాలి *****
    —— కొడవటిగంటి –కో —- గారి మాటలు —-

    ఒక పాటకునిగా నా ఒపీనియన్
    ———————————————————————————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  2. వంగూరి చిట్టెన్ రాజు says:

    నేను వ్రాసినది యాభై ఏళ్ల క్రితం జరిగిన విశేషాలు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు అన్నీ రాజకీయ పార్టీల అధీనంలో ఎప్పుడు , ఎందుకు సమ్మె చెయ్యాలో, రాజకీయ ప్రయోజనం ఏమిటో దాన్ని బట్టి నడుచుకుంటున్నాయి కానీ స్వయం ప్రతిపత్తి లేదేమో అని నా అనుమానం.

  3. buchireddy gangula says:

    సర్
    రాజకీయాలు లే ని దెప్పుడు ??— యీ రాజకీయాలు ఒక పద్ధతి ప్ర కారం — తరాన్ని —
    సమాజాన్ని –దేశాన్ని ఒ ట్టి బీడుగా — మార్చ ని ధీ –ఎప్పుడు
    raajaiyaalu— rowdiism… గ్రూప్లు లు — అగ్రకులాల జు లుం —కులమత పట్టింపులు —
    అన్ని లేక పోలేదు —
    ప్రతి ఒక్కరి జీవితం లో — అనుభవాలు –అనుబూతులు —సమస్యలు –కష్టాలు — కన్నీళ్ళు
    ఆకలి అరుపులు — తెగిన స్లిప్పేర్స్ కు పిన్నిసుల తో అలంకరణ లు — గోడ దూకుడులు —
    అన్ని ఉంటాయి —( రాసుకుంటే ___– ప్ర చు రిస్తే )
    ( మంత్రి గారి మరదలు సమర్థ అయితే న్యూస్ —సినిమా హీరో ఉచ్చపోస్తే సెన్సేషన్ ప్రకటన —పుష్కర స్నాల తో పాపాలు తోలిగిపోవును –అంటూ అటు టి వి ల లో –పత్రికల్లో
    వార్తలు — ఆర్టికల్స్ )— యిది నేటి వ్యవస్థ తిరు — నాడు — –// నేడు
    మారింది ఎప్పుడు ??? ఎన్నడు అని ???
    ———————————————————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  4. B. Rama Naidu says:

    సర్, నిజంగా మీ జ్ఞాపకాలు నన్ను 1979-81 రోజులకు తీసుకెళ్ళాయి. it is లైఫ్ లాంగ్ నస్తాలిగియా. ఓపెన్ ఎయిర్ ధియేటర్ ఇంకాఉంది.

మీ మాటలు

*