కవిత్వంలో ఉన్నంతసేపూ…

 

అరణ్యకృష్ణ

కవిత్వమెప్పుడూ ఓ అనుభూతుల వర్ష సమూహమే
సమాంతరంగా రాలే చినుకులన్నీ నేలజేరి
ఒకదాన్ని మరొకటి
ఘర్షిస్తూ కౌగిలిస్తూ సంగమిస్తూ ప్రవహించినట్లు
ఇష్టపడే ముద్దాడే వేటాడే వెంటాడే
జ్ఞాపకాల తాలూకు అనుభూతులన్నీ
నా ఉనికి మీద కురిసి నేనో కవితనై ప్రవహిస్తాను
అంతరంగ గర్భంలో నీళ్ళింకి
కుతకుతా ఉడుకుతున్న మట్టి మీదకి
నీటిమబ్బులు ఘీంకారధ్వానంతో
కుంభవృష్ఠిగా జారిపోతూ దబ్బున పడ్డట్లు
ఏ సుషుప్తి గర్భంలోనో సెగలు కక్కుతున్న విచలితదృశ్యాలేవో
నన్నో కవిసమయంగా పెనవేసుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
నా దేహం మీద వర్షం
నా ఉనికి మీద కవిత్వం కురిసి
రెండింటినీ పరిశుద్ధం చేస్తాయి
నిజం!
కవిత్వంలో ఉన్నంతసేపూ
వర్షంలో తడుస్తున్న భూమిలా
నేనూ అమలినంగా ఉంటాను
పేడపురుగుల మీద పూలచెట్ల మీద
సమానదయతో కురిసే వర్షంలా
నా కవిత్వం నిష్కల్మషంగా ఉంటుంది
కురవని మేఘాల్లాంటి దాచుకున్న కన్నీళ్ళన్నీ
మట్టి వాసనతో నెత్తుటి రంగుతో
కవిత్వమై విప్పారుతాయి
గుండె మీది ఆకురాలు కాలాల్ని తుడిచిపారేసి
కవిత్వం వానచెట్టులా ఎదుగుతుంది.
*
aranya

మీ మాటలు

 1. కురవని మేఘాల్లాంటి దాచుకున్న కన్నీళ్ళన్నీ
  మట్టి వాసనతో నెత్తుటి రంగుతో
  కవిత్వమై విప్పారుతాయి
  గుండె మీది ఆకురాలు కాలాల్ని తుడిచిపారేసి
  కవిత్వం వానచెట్టులా ఎదుగుతుంది…. చాలా బావుంది పోయెం అరణ్య క్రష్ణ గారు

 2. పద చిత్రాలు చాలా బాగున్నాయి . ముఖ్యంగా కవిత్వం వాన చెట్టులా ఎదగడం

 3. Madhavi Mirapa says:

  అరణ్య కృష్ణ గారు మా తరం మిస్ అయిన అధ్బుతమైన కవి. ఆయన కవిత్వంలో వేదన పచ్చి గాయాలనుంచి స్రవిస్తున్న రసి చేతితో తాకిన వారికి జుగుప్స గాను, మనసుతో తాకిన వారికి దుఖం గాను, అమ్మతనంతో తాకిన వారికి వేదన గాను ఉంటాయి . ఈ కవితనే కాకుండా ఆయన వేరే కవితలు చాల చదివే అదృష్టం మాలాంటి వాళ్లకు దక్కడం మా అదృష్టమని నిర్ద్వందంగా ఒప్పుకుని తీరాలి. అనేక గాయాల నుంచి పుట్టే ఆర్తనాదాలు , వేదనలు అయన కవిత్వపు వాన అయన మాటల్లోనే
  ”అంతరంగ గర్భంలో నీళ్ళింకి
  కుతకుతా ఉడుకుతున్న మట్టి మీదకి
  నీటిమబ్బులు ఘీంకారధ్వానంతో
  కుంభవృష్ఠిగా జారిపోతూ దబ్బున పడ్డట్లు
  ఏ సుషుప్తి గర్భంలోనో సెగలు కక్కుతున్న విచలితదృశ్యాలేవో
  నన్నో కవిసమయంగా పెనవేసుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి”
  ఇంతకంటే చెప్పడం అనవసరమేమో అనిపించేలా ఉంటుంది.

  అరణ్య కృష్ణ గారు మీ కవితలు మరిన్ని సారంగ లాంటి మేగజైన్ లో రావాలని నాలాంటి వాళ్ళు చాల మంది మీ కవిత్వ వేదనను అనుభుతించాలని, ఒక దిఖ్హార స్వరం ఘీంకార నాదంలా వినిపించాలని కోరుకుంటున్నాను.

 4. p v vijay kumar says:

  gud one

 5. Vanaja Tatineni says:

  పేడపురుగుల మీద పూలచెట్ల మీద
  సమానదయతో కురిసే వర్షంలా
  నా కవిత్వం నిష్కల్మషంగా ఉంటుంది..
  ఇలా నిష్కల్మషం గా ఉండే కవిత్వమే కావాలిపుడు

 6. Aruna.Gogulamandaa says:

  …కవిత్వంలో పరిశుద్ధతను పొందుకున్న ఈ కవిపుంగవుడి గురించి ఆయన ముందు కుప్పిగంతులకైనా పనికిరాని నేనేం చెప్పగలను?..శిరసానమామి అని నమస్కరించడం తప్ప…

  • Aranya Krishna says:

   ఓహ్! ధన్యవాదాలు అరుణ గారూ! అతి ఖచ్చితంగా అంత గొప్పవాడ్ని కాదు.

 7. Dr. Vani Devulapally says:

  కవిత్వం వాన చెట్టులా ఎదగడం ! ఊహిస్తేనే అద్భుతంగా ఉంది. అరణ్య కృష్ణ గారు ! పోయెమ్ చాలా బావుంది. అభినందనలు !!

 8. srinivas Gaddapati says:

  కవిత్వంలో ఉన్నంతసేపూ
  వర్షంలో తడుస్తున్న భూమిలా
  నేనూ అమలినంగా ఉంటాను

 9. Narayanaswamy says:

  కవిత్వంలో ఉన్నంతసేపూ
  వర్షంలో తడుస్తున్న భూమిలా
  నేనూ అమలినంగా ఉంటాను
  పేడపురుగుల మీద పూలచెట్ల మీద
  సమానదయతో కురిసే వర్షంలా
  నా కవిత్వం నిష్కల్మషంగా ఉంటుంది
  కురవని మేఘాల్లాంటి దాచుకున్న కన్నీళ్ళన్నీ
  మట్టి వాసనతో నెత్తుటి రంగుతో
  కవిత్వమై విప్పారుతాయి
  గుండె మీది ఆకురాలు కాలాల్ని తుడిచిపారేసి
  కవిత్వం వానచెట్టులా ఎదుగుతుంది.

  చాలా బాగుంది అరణ్యా! వెనక్కి వెళ్ళిన కెరటం మరింత బలంగా ముందుకొచ్చినట్టు అద్భుతంగా రాస్తున్నావు –
  అయితే ఒక్క చిన్న సూచన నువ్వు క్షమిస్తే – కొంచెం సంస్కృత పదాలు తగ్గిస్తే కవిత ఇంకా అందంగా ఉంటుందేమో ఆలోచించు!

  • Aranya Krishna says:

   ధన్యవాదాలు నారాయణ స్వామీ! నేనేమన్నా అనుకోవటం, క్షమించేయటమ్ అన్న ప్రసక్తే లేదు. ఇంతకూ మునుపటి నీ సూచనలన్నీ నాకు ఉపయోగపడినవే! ఐ కవితలో ఈస్థటిక్స్ కి ఉన్న ప్రాముఖ్యతని దృశ్ఠిలో పెట్టుకొని కొంత సంస్కృత పదాలు రాయాల్సి వచ్చింది. మిగతా కవితల్లో ఇలాంటి చాయలు లేకుండా జాగ్రత్త పడుతున్నాను.

 10. Narayanaswamy says:

  అవున్నిజమే – నీతో ఏకీభవిస్తున్నాను సంస్కృత పదాలు ధ్వని సౌన్దర్యాన్నిస్తాయి – అదే అందాన్ని వేరే రకంగానూ సాధించావచ్చా అని చూడాలేమో మనం? ఇది నాకు నేను వేసుకుంటున్న ప్రశ్నకోడా – సమాధానం కోసం దేవులాట కొనసాగాలి ….

  • Aranya Krishna says:

   భాష పటాటోపంగా వుండకూడదనే నియమం ఖచ్చితంగా ఉండాలి. ఆబ్సొలెట్ పదాలు వాడకూడదు కానీ “నాట్ సో అనూజ్యువల్” సంస్కృత పదాలు ఈస్థటిక్స్ దృశ్ట్యా వాడొచ్చేమో! నేనిప్పటికే ఒక కవితలో “మృత్యుశయ్య” ని చావు పడక అని మార్చాను. అదే కవితలో “గోమాత” బదులుగా “తల్లి ఆవు” అనే రాసాను. ఇలా ఒక కాన్షస్ ఎఫర్ట్ పెడుతున్నాను.

 11. THIRUPALU says:

  ఎక్సలెంట్, అబినందనలు అరణ్యకృష్ణగారు.

 12. రామానుజ రావు says:

  అరణ్య కృష్ణ గారు, మీ కవిత అద్భుతంగా వుంది. నేను చాలా వెనక బడి ఫొయ్నాని చెప్పడం అత్యంత నిజం.
  రామానుజ రావు

  • Aranya Krishna says:

   ధన్యవాదాలు రామానుజ రావు గారూ! మీరు వెనుకబడిపోయానంటే అంగీకరించలేను.

 13. narayana swamy says:

  చాలా బాగుంది అరణ్యా – మంచి పదచిత్రాలు మొత్తంగా ఒక అద్భుతమైన చిత్రం – మంచి కవిత అందించినందుకు నెనర్లు అరణ్యా

  • Aranya Krishna says:

   ధన్యవాదాలు స్వామీ! నీ ప్రశంస నాకు చాలా ప్రత్యేకం.

 14. Jayashree Naidu says:

  *** నా దేహం మీద వర్షం
  నా ఉనికి మీద కవిత్వం కురిసి
  రెండింటినీ పరిశుద్ధం చేస్తాయి ***

  పదాలని చదవడం, ఆ భావనల్ని అనుభవించడం – అదే సమయం లో దాన్ని ఒక దృశ్యం గా వీక్షించడం – మీ కవిత చదవడం అంటే ఇన్ని పనుల్ని ఏక కాలం లో చేయ్యడానికి ఒక రీడర్ గా సంసిద్ధ పరచుకోవడం.

  సూపర్బ్ కవిత అరణ్య కృష్ణ గారు

మీ మాటలు

*