అమ్మ ఆమె

శారద శివపురపు
ఒకప్పుడు ఆమె అన్నపూర్ణ
ఆమె కడుపున పుట్టిందంతా బంగారమే
చేతులు సృష్టించిందంతా అద్భుతమే
చూపులు వర్షించిందంతా అమృతమే
అలుపెరుగక నేర్పిందంతా జీవన సారాంశమే.
కానీ అందరికోసం ఆమె
శరీరంలోంచి ఉబికిన ఉప్పటి నదులు
దుఖసాగరమైన సంగతే కాదు,
ఎప్పటికీ నిశ్చలంగా, విశ్రాంతిగా
పారలేదన్న సంగతి గ్రహించామా?
ప్రవహిస్తూ, ప్రవహిస్తూ కొండంచునుండి
తోయబడి జారిపడే జలపాతంలా
మన మనసుల బండ రాళ్ళపై పడి పడి,
తనను తాను గాయపర్చుకున్న విషయం
గమనించామా?
జీవన గ్రీష్మంలో, ఎండిన నదిలా నిలిచినపుడు
ఏ హృదయపు తడీ ఆమెను తాకలేదే,
ఏ చల్లని స్పర్శా ఆమెను సేద తీర్చలేదే,
ఎపుడైనా కనిపించే ఆమె చిరునవ్వుల్లో
సంతోషం లేదన్న విషయమే పట్టలేదే?
అమ్మ అంటే వాడుకున్నాకా పారేసే వస్తువేకదా మనకి ?
కాకికి పెట్టే పిండం తన్నుకుపోయే గద్దల్లా
పులి వేటాడిన మాంసం కోసం నక్కల్లా
మనల్ని ఆమె గమనించినా
స్పందించే మృదుత్వాలీ గుండెలకి లేవు.
ఆమె చేతి గోరు ముద్దలు తిన్న నోళ్ళు
ఆమె చేతి వేళ్ళ ప్రేమను జీర్ణించుకోలేదు.
ఆమె చేయందుకుని నిలబడ్డ రోజులు
ఆమె సాయం చేస్తే నిలదొక్కుకున్న సమయాలు
జ్ఞాపకం వస్తే ఆలస్యం చేయకుండా
తప్పొప్పుల లెక్కలేవో తేల్చాలనుకోకుండా
ఆదరణ నిండిన కంఠంతో ఒకసారి పలకరించో
ప్రేమగా ఒక సారి కౌగిలించుకునో చూడు
సంతోషంతో చుట్టుకునే ఆమె చేతులు
పాలిపోయిన గాజు కళ్ళల్లోని మెరుపులు
సన్నగా ఎర్రబడే తెల్లటి బుగ్గలు
నీ పాపాయిని గుర్తు చేయక మానవు.
అవి చాలవా నువు తృప్తిగా కళ్ళు మూసుకుని
వెళ్ళిపోయేటపుడు తలచుకోడానికి
అంతకంటే భరోసా ఏమున్నది….
కొండెక్కుతున్నపుడు నీ దీపానికి?
*
sarada shivapurapu

మీ మాటలు

 1. చాలా బావుంది పోయెం శారద గారు

 2. Aranya Krishna says:

  మన మానవ సంబంధాలలో అత్యంత దారుణంగా దోపిడీకి గురయ్యేది అమ్మే. భౌతికంగా జన్మనిచ్చిన తల్లిచుట్టూ మనం భావజాలపు సాలెగూళ్ళు చాలానే అల్లాం. అమ్మ అంటే నిజానికి త్యాగం కాదు. అమ్మ అంటే బలిపశువు. వాడుకున్నన్నాళ్ళూ ఆమే చేత చాకిరీ చేయించుకొని ఆమెకి శక్తుడికిపోగానే నిర్లక్ష్యం చేస్తాం. మన సంబంధాలలో ఆర్ధికాంశాల్ని సానుకూలంగా ప్రభావితం చేయలేని పనికిరాని పౌరాణిక విలువలే తప్ప కృతజ్ఞత అనే మానవ సంస్కారం చాలా తక్కువ వుంటుంది. అందుకే అమ్మ భారమౌతుంది.

  “జీవన గ్రీష్మంలో, ఎండిన నదిలా నిలిచినపుడు
  ఏ హృదయపు తడీ ఆమెను తాకలేదే,
  ఏ చల్లని స్పర్శా ఆమెను సేద తీర్చలేదే,
  ఎపుడైనా కనిపించే ఆమె చిరునవ్వుల్లో
  సంతోషం లేదన్న విషయమే పట్టలేదే?
  అమ్మ అంటే వాడుకున్నాకా పారేసే వస్తువేకదా మనకి ?” బాగా చెప్పారు శారద గారు.

 3. Sharada Sivapurapu says:

  ధన్యవాదాలు వాణి, ధన్యవాదాలు అరణ్య కృష్ణ గారూ

 4. విలాసాగరం రవీందర్ says:

  మీ కవిత బాగుంది శారద గారు. పనిముట్లమై రోజు రోజుకు
  మానవ సంబంధాల అనుబంధాలను పూర్తిగా మరిచిపోతున్నం…

 5. sharada Sivapurapu says:

  ధన్యవాదాలు రవీందర్ విలాసాగరం గారు

మీ మాటలు

*