గోదావరీ, కుక్కతోకలూ..

 

సత్యమూర్తి

‘‘నేను జ్ఞానవాపి వద్దకు వెళ్లాను. దేవుడి కోసం వెతికాను కానీ కనుక్కోలేకపోయాను. మనసంతా అదోలాగా అనిపించింది. జ్ఞానవాపి పరిసరాలు మహరోతగా ఉన్నాయి. దక్షిణ ఇవ్వాలనిపించలేదు..’’

మహాత్మాగాంధీకి వారణాసిలో ఎదురైన అనుభవం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గోదావరి పుష్కరాల పేరుతో చేస్తున్న ప్రచారం జ్ఞానవాపి పరిసరాలకంటే రోత పుట్టిస్తోంది. పవిత్ర పుష్కర గోదాట్లో మునిగితే పుణ్యం పురుషార్థం(మహిళార్థం ఉండదు!) దక్కుతాయని ప్రభుత్వాలు రేడియోల్లో, టీవీల్లో, నానా ప్రచారసాధనాల్లో చేస్తున్న నానాయాగీ మన దేశం లౌకిక దేశం కాదని, పుణ్యస్నానాల, పిండప్రదానాల హిందూదేశమని ఢంకా బజాయిస్తోంది. గుణదల మేరీమాత ఉత్సవాలకు, కడప అమీన్ పీర్ దర్గా ఉరుసుకు మన లౌకిక ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారం చేసిన దాఖలాలు లేవుగా మరి!

మనది పేరుకే లౌకిక దేశమన్న సంగతి కొత్తేమీ కాదు కానీ.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పోటీపడి కీర్తికండూతితో అధికార పటిష్టత కోసం నిస్సిగ్గుగా తమ హిందుత్వాన్ని బహిరంగంగా చాటుకోవడం చూస్తుంటే కొనవూరిపితో ఉన్న లౌకికవిలువలకూ ముప్పు వచ్చిందని మరింత స్పష్టమవుతోంది. వాళ్లిద్దరిని ఎన్నుకున్న రెండు రాష్ట్రాల్లోని ముస్లింలు, క్రైస్తవులు ముక్కున వేలేసుకుని ‘మాకు మాంచి శాస్తి చేశారు’ అని గొణుక్కుంటున్నారు. క్రైస్తవుల పక్షమని చెప్పుకునే నాయకుడు కూడా గోదాట్లో మునకేయడం చూసి క్రైస్తవ సోదరులు సిగ్గుతో బిక్కచచ్చిపోతున్నారు. గత పుష్కరాల సంగతేమో కానీ ఇవి మాత్రం అసలు సిసలైన రాజకీయ పుష్కరాలు. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే తెలంగాణలో సగానికిపైగా జనం పుష్కరాల్లో మునిగారు. మొత్తం ఏపీ జనాభా అంతా మునిగిందని బాబు చెప్పడమే తరువాయి. పుష్కరాల డబ్బును జేబుల్లో వేసుకోకుండా పారదర్శకంగా ఖర్చుపెట్టామని చెప్పడానికి ఈ కాకిలెక్కలు తప్పనిసరి.

ఈ పుష్కరాలకు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ప్రచారం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రచారం కానే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న హిందుత్వవాదుల మెప్పుకోసం కేసీఆర్, చంద్రబాబులు ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన పన్నుల డబ్బుతో చేస్తున్న నీచమైన పందేరం. మెప్పుకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వీళ్ల ప్రచారానికి మోసపోయి గోదాట్లో మునగడానికి వెళ్లే జనానికి కూడా తొక్కిసలాట చావులు ప్రతిఫలంగా ముడుతుంటాయి. కేంద్రంలో సంఘ్ పరివార్ అధికారంలోకి రావడం, ఘర్ వాపసీ, యోగాపై ఊకదంపుడు ప్రచారం.. వీటన్నింటి నేపథ్యంలో పుష్కర ప్రచారాన్ని చూస్తే దాని వెనక ఉన్న మతాధిపత్య కోణాన్ని సులభంగా గుర్తించవచ్చు.

మతం ఇంటికే పరిమితం కాకపోవడం వల్ల వచ్చిన జాడ్యాలివి. చంద్రబాబు ఏపీ కొత్త రాజధాని భూమిపూజను కుటుంబకార్యక్రమంగా మార్చి పక్కా హిందూమత కార్యక్రమంలా జరిపినా, తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ బ్రాహ్మణ గవర్నర్ కు బహిరంగంగా బోర్లబడి కాళ్లుమొక్కినా,  మోడీ విదేశీ నేతలకు భగవగ్దీతను కానుకగా ఇచ్చినా, భగవద్గీతను జాతీయగ్రంథం చేయాలని సుష్మా స్వరాజ్ వాగినా, వాళ్లపై వేసిన పిటిషన్లను కోర్టులు కుంటిసాకులతో కొట్టేసినా.. అవన్నీ ఆ జాడ్యాల ఫలితాలే. పుష్కరాలపై ప్రభుత్వాలు చేస్తున్నది ప్రచారం కాదని, సమాచారం ఇవ్వడమేనని, అన్నిమతాలకు సమప్రాధాన్యత ఇవ్వడమే లౌకికవాదమని, ప్రజల మతవిశ్వాసాలకు అనుగుణంగా తగిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వాల బాధ్యత అని మన శ్రీశ్రీశ్రీ గౌరవనీయ హైకోర్టు మహగొప్పగా వాక్రుచ్చింది. అవునా..? లౌకికవాదమంటే అదా? మనకు తెలిదే! వెర్రినాయాళ్లం, ఇంతకాలం లౌకికవాదం అంటే రాజ్యం మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండడమే సుమా అని అనుకున్నామే (Secularism is the principle of the separation of government institutions and persons mandated to represent the state from religious institutions and religious dignitaries. Secularism the belief that religion should not be involved in the organization of society, education, etc.)

రిపబ్లిక్ డే సందర్భంగా పత్రికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లోని రాజ్యంగ పీఠిక చిత్రంలో సోషలిస్టు పదం లేదని మొన్నామధ్య గొడవ జరిగింది. అది సోషలిస్టు పదాన్ని చేర్చకముందటి రాజ్యంగ పీఠిక చిత్రమని, ‘పొరపాటు’ జరిగిపోయిందని ‘నైపుణ్యాల అభివృద్ధి’ సర్కారు సమర్థించుకుంది. దేశాన్ని హిందూదేశంగా చేసిపారేస్తామంటున్న సంఘ్ నేతల ఆశయసాధనకు ఇలాంటి ‘పొరపాట్ల’తో శాయశక్తులా సాయం చేయడం తమ విధి అని చెప్పకనే చెప్పింది. ఈ పీఠిక గొడవ సమయంలో.. రాజ్యంగ పీఠికలోంచి సోషలిస్టే కాదు, సెక్యులర్ పదాన్నీ పీకిపారేయాలని(అసమానతల హిందూదేశం అనే పదాలు పెట్టాలని!) హిందూవాదులు డిమాండ్ చేశారు. ఒకరకంగా చూస్తే వాళ్లన్నది సరైందేనేమో. మేకమెడ చన్నుల్లాంటి ఆ పదాలను తీసేస్తే పోయిందేమీ ఉండకపోవవచ్చు. పైగా ఆ పదాల అచ్చుకు కావాల్సిన కాయితం, ఇంకు ఖర్చు ఆదా అవుతుంది కూడా. ఆ ఆదా డబ్బు రాబోయే మరింత పవిత్ర పుష్కరాలకు అక్కరకొస్తుంది.

లౌకికవాదం అంటే మతాలకు అతీతమైంది కాదు, అన్ని మతాలతో అంటకాగేది అని మన నేతలు అద్భుత నిర్వచనమివ్వడమే కాకుండా దాన్ని అమలు కూడా చేయబట్టి చాలాకాలమే అయింది. పత్రికల్లో లౌకికవాదం అనే పదం చూసి, ‘లౌకికవాదం అంటే లౌక్యంగా మాట్లాడ్డం కాబోలు’ అని అనుకునే వెర్రిజనం కోట్లకొద్దీ ఉన్న డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్, రిపబ్లిక్ వగైరా విశేషణాల భారత దేశంలో మతఛాందసవాదులకు అడ్డేముంది?

Godavari-Pushkaralu

మతభేదాల్లేకుండా వసూలు చేస్తున్న పన్నుల్లోంచి కోట్ల డబ్బును ఒక మతకార్యక్రమం కోసం వెచ్చించడం అప్రజాస్వామికం, దుర్మార్గం. ఒక మతానికి అని అంటే హిందూమతానికే అని కాదు. ముస్లింల హజ్ యాత్ర సబ్సిడీలను, క్రైస్తవ మిషనరీలకు ఇస్తున్న నిధులను, రాయితీలను, ఇతర మతాలకు కూడా ఇస్తున్న నిధులను కూడా రద్దు చేయాలి. కోట్ల మంది ప్రజలు బతుకుతెరువు, సాగునీళ్లు, తాగునీళ్లు, మందుమాకులు, ఇళ్లు లేక అల్లాడుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న మన పేరుగొప్ప దేశంలో ఉత్తి‘పుణ్యానికి’కి కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేయకుండా అసలైన ప్రజాక్షేమానికి ఖర్చుపెట్టినప్పడే మనది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది.

అన్ని కోట్లమంది భక్తివిశ్వాసాలుగల పౌరులు వెళ్లే పుష్కరాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తే తప్పేంటి అని కొందరు అడుగుతున్నారు. దెయ్యాలు, చేతబడులను నమ్మేవాళ్లు కూడా దేశంలో కోట్లమంది ఉన్నారు. వాటి ప్రచారానికి కూడా కోట్ల తగలెయ్యాలి. పాత గుళ్లలో, కోటల్లో గుప్తనిధుల కోసం పలుగుపారతో వెళ్లేవాళ్లకు ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలివ్వాలి.

మన దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సామ్యవాద విలువలు పాశ్చాత్యదేశాల్లో మాదిరి క్రమానుగతంగా, ప్రజాపోరాటాల ద్వారా వచ్చినవి కావని, అరువుకు తెచ్చుకున్నవని, అందుకే అవి వెర్రితలలు వేస్తున్నాయనే అభిప్రాయం ఒకటుంది. పతంజలి నవలిక ‘పిలక తిరుగుడు పువ్వు’లో మేజిస్ట్రేటు అన్న మాటల ప్రస్తావన ఇక్కడ అసందర్భమేమీ కాదు.. “మన జ్ఞానానికి సార్ధకత లేదు.  మన విశ్వాసాల పైన మనకు నమ్మకం లేదు. మన విలువల పైన మనకు గౌరవం లేదు. మన దేవుళ్ళ పైన మనకు భక్తి లేదు. మన నాస్తికత్వం పైన మనకు విశ్వాసం లేదు. మన మీద గానీ, తోటి వాళ్ళ మీద గానీ మనకు మమకారం  లేదు. మన ప్రజాస్వామ్యం పైన మనకు అవగాహన కానీ గురి గానీ లేదు. మన జ్ఞానానికీ – విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ – ఆచరణకూ పొందిక లేదు..భూమి బల్ల పరుపుగా వున్నప్పుడే ఇలాంటి జీవితం కనపడుతుంది”

ఇది పాలకుల తప్పేకానీ ప్రజల తప్పుకాదు. ప్రజలకు ఎన్నుకోవడానికి మంచి నాయకులు లేరు. పైగా ఓటు వేయకపోవడం దేశద్రోహమని ప్రచారం చేస్తున్న నికృష్ట ప్రజాస్వామ్యమిది. మన ప్రజలు వెర్రివాళ్లే. కానీ ఎల్లకాలం అలాగే ఉండరు. వెర్రి కుదిరే కాలం వచ్చినప్పుడు తాము పట్టుకున్న కుక్కతోకలను వదలి సొంతంగా గోదారి ఈదకమానరు.

*

 

 

మీ మాటలు

  1. దేవరకొండ says:

    ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో ఇలాంటి ఖర్చులు ఎందుకు ప్రభుత్వాలు చేస్తున్నాయని ప్రశ్నించే ఇటువంటి వారి కంటే ఇంతమంది కోరుకునే కార్యక్రమానికి ఎందుకు చేయట్లేదని ప్రశ్నించే వారే ఎక్కువ ఉంటారు. మనది మెజారిటీని బట్టి పోయే యవ్వారం కాబట్టి మరలాగే కానివ్వాలంటారు మనం ఎన్నుకున్న మహా నాయకులు!

  2. someswara rao.c. says:

    సత్య మూర్తి రాసినది చదివాక ఆయన మీద చాలా జాలి కలిగింది. మీ లాంటి వారి కడుపులు ఇంకా కాలతాయని ప్రజలు కుహనా లౌకిక వాదులను ప్రోత్సహించే రోజులు పోయాయని తెలుసుకొంటే మీ పని మీరు చేసుకొంటూ హాయిగా ఉండ వచ్చు.

  3. Thirupalu says:

    /మొత్తం ఏపీ జనాభా అంతా మునిగిందని బాబు చెప్పడమే తరువాయి/
    ముంచారు గనుక మునగ కుండా ఎలా ఉంటారు ? ముంచటం ఏలిన వారి వంతు, మునగటం ప్రజల వంతు అయినపుడు తప్పుతుందా మునగ కుండా ఉండటం !
    /మన దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సామ్యవాద విలువలు/ ఇదేదో ఊక దంపుడు ఉపన్యాసం లా కనపడుతుంది. అయినా ప్రజలు ఆ మాత్రం పుణ్యం సంపాదించు కో నీరేమ్ ? పునర్జన్మ లో ఏ కుక్కలుగానో, పిల్లులుగానో పుట్టాలని మీ ఉద్దేశమా ? వారికి పునర్జన్మ లేని పుణ్యం సమ్పాదిమ్చికో నీరా ? రాజ్యాంగం మనుషులు రాసుకుంటే వచ్చేది. పుణ్యం మాత్రం సమ్పాదిమ్చుకుమ్టునే వస్తుంది. .. అయినా మీ గోల ప్రజలకర్ధం కాదు. వారిగోల మీకర్ధమ్ కాదు. ( వ్యంగ్యం కోసం)

  4. Dr.Vijaya Babu Koganti says:

    “కోట్ల మంది ప్రజలు బతుకుతెరువు, సాగునీళ్లు, తాగునీళ్లు, మందుమాకులు, ఇళ్లు లేక అల్లాడుతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న మన పేరుగొప్ప దేశంలో ఉత్తి‘పుణ్యానికి’కి కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేయకుండా అసలైన ప్రజాక్షేమానికి ఖర్చుపెట్టినప్పడే మనది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది.”

    Well said. But the people who should understand must have ‘time’ for reading and thinking!

  5. 1976 వరకు రాజ్యాంగంలో ` Sovereign Democratic Republic ‘ గా వున్నదాన్ని 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ` Sovereign , Socialist , Secular , Democratic Republic ‘ గా మార్చడం జరిగింది.
    సెక్యులర్ గా వున్న దేశం ఏ మతాన్ని గుర్తించగూడదు. ప్రజలు ఏ మతాన్ని అవలంబించడానికైనా వారికి స్వేచ్చ వుంది.ప్రభుత్వం శాంతి భద్రతలకు విఘాతం కలగనంతవరకు ఇందులో జోక్యం చేసుకోకూడదు.
    మనం ఒప్పుకున్నా , ఒప్పుకోకపోయినా , హిందూమతం అనేది వుందా , లేదా అనే చర్చను ప్రక్కన పెడితే , దేశంలో అత్యధికులు హిందూ దేవుళ్ళను కొలిచే వారే ! గత 40 సంవత్సరాలుగా దేవాలయాల నిర్మాణాలు , భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది.
    అందుకే ప్రభుత్వం ` దేవాదాయ శాఖ ‘ ను ఏర్పరచి , దేవాలయాల ఆదాయ , వ్యయాల పై ద్రుష్టి పెట్టింది.దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. ఇది రాజ్యాంగ విరుధ్ధం కాదా ? అలా అధికారం చెలాయించేటప్పుడు , ఆదాయం పెంచుకునే మార్గాల్లో ప్రచారం చేయడం తప్పెలా అవుతుంది ?
    దీనివల్ల ప్రభుత్వానికి మరో లాభం కూడా వుంది.ప్రజలు తమను కాపాడమని కనిపించని [ లేని ] దేవుడికి మొరపెట్టుకుంటారుగాని , తమను పట్టించుకోని ప్రభుత్వాలకు చెప్పుకోలేరుగదా ! కర్మ సిధ్ధాంతాన్ని నమ్మే దేశం గదా మనది !
    ప్రభుత్వాలు అమలు చేసే కార్యక్రమాలు మెజారిటీ ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోయినా , ప్రశ్నించేవారు వుండరు . ఇలాటి స్థితిలో ప్రజలను చైతన్యవంతం చేయవలసిన మేధావులు వారిని వెర్రివాళ్ళు అనడం , ఎపుడో ఏదో జరుగుతుందని ఆశించడం సరియైనదేనా !

    • manjari lakshmi says:

      బాగా రాసారు జయప్రకాశ్ గారు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక్క హిందూ దేవాలయాల మీదనే పనిచేస్తుందా. దీని గురించి నాకంతగా తెలియదు. గుళ్ళల్లో వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వమే తీసుకుంటుందా?

  6. buchi reddy gangula says:

    మూర్తి గారు
    చక్కగా చెప్పారు —సర్

    అంతా రాజకీయం — వోట్ల కోసం –ప్రజల్లో లేని పోనీ నమ్మకాలు కలిగిస్తూ —దండుగ ఖర్చులు ???
    మునిగిన వాళ్ళ పాపలు అన్ని గోదావరి లో కలిసి పోయాయి — యిక యిప్పుడు
    మొదలు య్యది కొత్త లెక్క ???
    మూర్తి గారు — రాజకీయాలు లేని దెక్కడ sir—
    పుష్కారాల సాహితీ పోటి ల లో డాక్టర్ ప్రతాప్ గారికి first..prize… పేస్ బుక్ లో చదివాను —
    ప్రతాప్ gaaru– మల్లిక్ gaaru– skybaba.. గారు సాహిత్యం పేరుతో ఏదో ఒక కార్యక్రమం —
    వార్తలు –విరాళా ల సేఖరణ —దండలు — సన్మానాలు —
    అసలు రాష్ట్రం లో కాని అమెరికా లో కాని తెలుగు బుక్స్ చదివే శాతం ఎంత ని ??
    విరాళాలు సేకరించే నేర్పు ఉండాలి —డబ్బు ఉంటె ఎన్ని రకాల భాగోతాలు అయినా
    చేయవచ్చు —జాతీయ తెలుగు సంగాల లో తెలుగు భాష — ఆచరణ లో ఉందా ??
    నీతులు ఎన్ని అయినా రాయ వచ్చు –చెప్పవచ్చు ?? ఆచరణ లో జీరో
    యీ mosaalu– రాజకీయాలు అన్ని రంగాల లో లేవా ??
    కవిత్వాలలో –కథల లో –అన్యాయాలు / మోసాలు ///చీకటి రాజ్యం —//దోచుకోవడం —
    సమానత్వం // సామాజిక న్యాయం —- ప్రజా సామ్యం దారి తప్పింది — అంటూ రాతలు —
    పూతలు ?????// ఆచరణ లో ????????????
    —————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  7. చందు తులసి says:

    హమ్మయ్య సత్యమూర్తి గారు బతికించారు….
    -తెలుగునాట కుక్కతోక పట్టుకునే వాళ్ళే కాదు…
    హేతువాద జీవులూ ఉన్నారని చాటి చెప్పారు.

  8. సమాచారం, ప్రచారం; భక్తి, మౌఢ్యాల మధ్య హద్దులే కరిగిపోతున్న పరిస్థితుల్లో మీ వ్యాసం ఓ ఊరట. మీకు అభినందనలు సత్యమూర్తి గారూ!

  9. sreeram velamuri says:

    పుష్కరాల వేడి వేసవి గాడ్పుల మధ్య ఒక చల్లని ఓదార్పు మీ వ్యాసం సత్యమూర్తి గారూ …అభినందనలు

Leave a Reply to manjari lakshmi Cancel reply

*