వినిపించనా ఈ పూట ఆ పాట…

శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

sp dattamala“ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం”

   అని పాడింది  ఎవరో తెలుసా? విస్సంరాజు రామకృష్ణగారు .

  భక్త తుకారాం చిత్రంలోని   “పాండురంగ నామం పరమపుణ్య ధామం” పాట.

 ఆయన పాటలు కూడా అంతే. ఇంకా చెప్పాలంటే బాపుగారి ముత్యాలముగ్గులో  

“ఎదో… ఏదో.. అన్నది ఈ మసక వెలుతురు,గూటి పడవలో విన్నది కొత్తపెళ్లికూతురు”

ఈ పాట ఎన్ని మార్లు విన్నా,  మళ్ళీ కొత్తగా ఉంటుంది.

ఆ చిత్ర కథానాయకుడు శ్రీధర్  స్టైల్ కి తగ్గట్టు పాడారు.

“ఎదో …ఏదో ” వినసొంపుగా ఉంటుంది.

భక్త తుకారాం లో ఘంటసాల గారు, రామకృష్ణ గారు ఇద్దరూ పాడారు. లోతైన పరిశీలన ఉంటేగాని ఎవరు ఏది పాడారు అనేది చెప్పడం  కష్టం. రామకృష్ణగారి పాట వింటే ఘంటసాల గారే పాడారా అన్నట్టు  ఉంటుంది . ఈయన్ని ఘంటసాల గారి ఏకలవ్య శిష్యుడు అంటారు.  ఘంటసాల గారి చివరి రోజుల్లో ఆయాసం వల్ల హై- పిచ్ అంటే  తారాస్థాయిలో స్వరపరిచిన పాటల్ని రామకృష్ణ గారే పుర్తిచేసారట. ఎవ్వరు గుర్తుపట్టలేదు. అలా 15 పాటలు ఉన్నాయ్. మచ్చుకి కొన్ని …కన్నకోడుకులో “తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి”, అల్లూరి సీతారామారాజులో “తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా “. కాని సినిమాలో ఆయన పేరు లేదు. ఈ విధంగా గురుదక్షిణ సమర్పించుకున్నారు అని చెప్పవచ్చు.

1974 లో ఘంటసాల మాస్టారు పరమపదించారు. ఆయన ఉన్నపుడే, 1972 నుంచే , రామకృష్ణ గారు సినిమాల్లో         నేపధ్య గానం  మొదలు పెట్టారు. ఘంటసాల గారి గొంతులా ఉన్నా, ఈయనకి రావాల్సిన పేరు వచ్చింది. ఆయన మొదటి  సినిమా  “విచిత్ర బంధం” లో పాడిన  “వయసే ఒక పూల తోట”. వాణిశ్రీ ఆట, రామకృష్ణ పాటతో హుషారుగా సాగుతుంది.

మహాకవి క్షేత్రయ్య లో, గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలలు  తన్మయత్వం తో క్షేత్రయ్య పాడినట్టు ఓ పాట ఉంటుంది,  ” ఆ రేపల్లె లోని గోపాలుడంట యే పిల్లనైన చూస్తే తంటా ..తలచుకుంటే ఆ జగడం కన్నులపంట ఓ ఓ ఓ మజా మజా కన్నులపంట” బలిపీఠం లో  భార్య అలికను తీర్చే పాట  “చందమామ రావే జాబిల్లి రావే “. “ఇదెక్కడి న్యాయం”  లో  “ఎపుడైనా యే క్షణమైనా ” మొత్తం పాటంతా  సుశీలగారు   పాడినా ముగింపు రామకృష్ణగారు ఇస్తారు.  ఒకే  చరణమైనా చాలా  బాగుంటుంది.

“భక్త కన్నప్ప” అనగానే రామకృష్ణ గుర్తొస్తారు. ” అరె సిన్నమీ ! మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఓ.. ఓ.. ఓ..  మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా అబ్బో సిగ్గా! మల్లెమొగ్గా అబ్బో సిగ్గా!”

కన్నప్ప ప్రేయసితో పాడుకునే పాట అద్భుతం.

బాపుగారు గోదావరినది నేపధ్యంలో తీసిన అందాలరాముడు లో చాలామట్టుకు రామకృష్ణ గారే పాడారు.

“కురిసే వెన్నెల్లో మెరిసే గోదారి లా

మెరిసే గోదారి లో విరబూసిన నురగ లా

నవ్వులారబోసే “పడుచు”న్నది

కలువపువ్వు వేయిరేకులతో విచ్చుకున్నది

పున్నమి ఎపుడెపుడా అని వేచియున్నది”

డాక్టర్ నారాయణరెడ్డి గారి రచనకు, బాపుగారి దృశ్య కావ్యానికి తన గాత్రంతో వన్నెలద్దారు. “విచ్చుకున్నది” అంటూ, కలువ విచ్చుకునే వైనం తన గొంతులో రంగరించి పాడారు. “ఇదా లోకం” సిన్మాలో “నీ మనసు నా మనసు ఏకమై ప్రతిజన్మలోన ఉందాము జతగా”  రామకృష్ణ గారి  పాట, శోభన్ బాబు ,శారద పైట చెంగుతో ఇద్దరు  చేసే విన్యాసాలు చూస్తూ పరవశించపోతాము.  ఈ పాట ఆడియో వింటే ఘంటసాల గారు పాడిన “సంగమం సంగమం అనురాగ సంగమం” గుర్తొస్తుంది. ఇక్కడ తేడా తెలుస్తుంది. ఘంటసాలగారి గొంతులో గాంభీర్యం…రామకృష్ణ గళంలో  లేతకొబ్బరి కమ్మదనం. “వసివాడి శశిచెడి వన్నెవాసీ లేక – విరహాన వనలక్ష్మి వేగిపిలుచూ/ పగిలి గుండెల దాక పొగలతో సెగలతో – దాహాన భూదేవి తపియించి పిలుచూ/రా, తొర తొరగా రా . . తొందరగా రా/ఓ దూరగగన విహారా ఓ శీతల వర్షాధారా/తరలిరా జలధరా . . కరుణించి కదలిరా తరలిరా జలధరా . . కరుణించి కదలిరా”      దేవులపల్లి రచనకు సాలూరు రాజేశ్వరరావు “రాగ మల్హార్ “లో స్వరపరచిన గీతాన్ని బాలుగారితో ఆలపించినప్పుడు నిజంగానే వర్షం కురిసిందట.  చిత్రం  అన్నదమ్ముల కథ.

అందాల రాముడు లో హరికథ  ” ధన్యుడనైతిని ఓ రామా! నా పుణ్యము పండెను ఓ రామ” వచనం చెప్పింది అక్కినేనిగారైతే పద్యాలు పాడింది  రామకృష్ణగారు.

యశోద కృష్ణ లో కూడా ఒక పాట ఉంది .

” నెల మూడు వానలు నిలిచి కురిశాయీ – పచ్చిక మేసి మన పశువులే బలిశాయీ దేశాన కరువు రాకుండాలిరా . . దేవేంద్రునకు పూజ చెయ్యాలిరా !”

భక్తి పాటలకు ఆయన గాత్రం  పుట్టినిల్లు అని చెప్పవచ్చు. “శ్యామ సుందరా  ప్రేమ మందిరా నీ నామమే వీనుల విందురా” “రామా  శ్రీరామా  జయ జయ రామా  రఘురామా””మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి”… మొదలైనవి  కరుణామయుడులో వినదగిన పాట ” పువ్వులకన్న పున్నమివెన్నెల కన్న  మిన్న అయినది పసిడి కుసుమం ”

దానవీరశూరకర్ణ , విశ్వనాథ నాయకుడు ,షిర్డీ సాయిబాబా మహత్యం ,వెంకటేశ్వర వైభవం, బ్రహ్మంగారి చరిత్ర మొదలైన వాటిల్లో పద్యాలు ,దండకాలు చాలానే ఉన్నాయ్.

“ఓహో చెలి ఓనా చెలి

ఇది తొలి పాట

ఒక చెలి పాట

వినిపించనా  ఈ పూట

ఆ  పాట”

దాసరి నారాయణరావుగారి దర్శకత్వం లో వచ్చిన కన్యాకుమారి చిత్రానికి పై పాట పాడారు, కాని ఎందుకో తీసేసారు.    చెప్పాలంటే మనము వినని పాట .

“ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర”

“అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం” ఇలాంటి పాటలను  ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరి వల్ల ,ఎదో ఒక సందర్బంలో కనెక్ట్ చేసుకుంటూనే ఉంటాము.

“రాముడేమ్మాన్నాడోయ్ …సీతా రాముడేమ్మాన్నాడోయ్”…

బ్రహ్మంగారి చరిత్ర లో “ఏమండి పండితులారా ”

ఇవి  వ్యంగ్యపు పాటలు . మొత్తానికి చెప్పాలంటే పాటల్లో చేయని  ప్రక్రియ, ప్రయోగము లేదు.భక్తి పాటలు ,యుగళ గీతాలు,పద్యాలు ,దండకాలు మొదలైనవి .

ఇక వ్యక్తిగత విషయానికి  వస్తే ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఘంటసాలగారి ఏకలవ్య శిష్యుడు అంటేనే అర్ధం చేసుకోవాలి ఎంత కష్టపడ్డారో. నిచ్చెన ఎక్కించినట్టే ఎక్కించి డబ్బున కింద పడేసింది సినీ రంగం. అంటే వైకుంటపాళీ ఆటలో మాదిరి, నిచ్చెన ఎక్కారు ,పాము కాటుకూ  గురయ్యారు. పది సంవత్సరాలే ఉన్నారు ఇండస్ట్రీలో . తరువాత అరకొర ఆవకాశాలు ఆ తర్వాత అవీ లేవు. మనిషి వ్యక్తిత్వం బయటపడేది కష్టాలు ,సమస్యలు వచ్చినపుడే. రామకృష్ణగారి ఆశావహ ధృక్పధం ఆయనకు తోడ్పడింది. భక్తీ గీతాల ఆల్బమ్స్ , వివిధ కన్సర్ట్స్ , టీవీ సీరియల్స్ లో నటన, లాంటి  వ్యాపకాలు సృష్టించుకున్నారు.

మా ఊర్లో ఉన్న శివాలయం లో రోజు ప్రొద్దున్న ,సాయంత్రం “శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో” రికార్డు వేసేవారు .అప్పుడు తెలిసేది కాదు ఎవరు పాడారో. తర్వాత అది విన్నపుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేవి. ఎపుడైనా ఆ గుడికి వెళ్తే రామకృష్ణగారు తప్పక గుర్తొస్తారు నాకు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. Suryam Ganti says:

  సూక్ష్మంగా చెప్పవలసింది అంతా చక్కగా వివరించారు దత్తమాలగారు .తెలుగు చిత్ర సీమ లో తనదంటూ ఒక ప్రత్యెక స్థానం సంపాదించుకొన్నారు రామకృష్ణ గారు .

 2. KRISHNA says:

  కూలంకుషంగా ఉంది. రామకృష్ణగారి గురించి పూర్తిగా విశ్లేషించారు. ఘంటసాల స్కూల్ అన్న టాగ్ ఉన్నప్పటికీ, తనదైన ముద్ర వేసిన గాయకుడు రామకృష్ణ, ఒక్క బీభత్స, రౌద్ర రస పాటలు మినహా మిగతా అన్ని పాటలను గొప్పగా పాడగల గాయకుడు ఆయన.

 3. ఇది తొలి పాట ఒక చెలి పాట. వినిపించనా ఈ పూట ఆ పాట…కన్యాకుమారి మూవీలో ఆ పాట పాడింది బాలుగారండి. ఆ పాట బాలు గారి బెస్ట్ సాంగ్స్ లో ఒకటి.

  • SP Dattamala says:

   ఇద్దరు పాడారు . రామకృష్ణ గారిది తీసేశారు అండి.

 4. bhagavantham says:

  రామకృష్ణగారి లాంటి వాళ్ళనే కాకుండా ఆయన లాంటి ఇంకొందరిని పాము కాటుకు గురి చేసిన ఆట పేరు వైకుంట పాళీ కాదేమో … వైకుంట ‘బాలీ’ ఏమో..

  • SP Dattamala says:

   :)

  • శ్రీనివాసుడు says:

   కచ్చితంగా వైకుంఠ ‘‘బాలీ’’ కాదు కైలాస ’’బాలీ‘‘. కొడుకు సినిమా తీసి ఏడు కోట్లు పోగొట్టేడని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పినట్లు గుర్తు. ఆ ఏడు కోట్లూ సంపాదించకపోతే ఎందరో గాయకులు కనుమరుగయ్యేవారు కారు, నూతన స్వరాలు ఎన్నో వచ్చేవి. ఈ గ్రహింపు ఇప్పటికైనా కైలాసపతి తనయునికి వచ్చినట్లు లేదు.

 5. ఓలేటి వెంకట సుబ్బారావు says:

  అమ్మా- కొంచం ఆలస్యం గా చూసాను నీ ( ఇలా పిలిస్తే అభ్యంతరం లేదు కదా ?!) వ్యాసాన్ని . అభిమాన గాయకుడు ముఖ్యంగా స్నేహశీలి అయిన శ్రీ విస్సంరాజు రామకృష్ణ స్మృతి కి ఇది అద్భుతమయిన నివాళి , రామకృష్ణ నాకూ చాలా ఆప్తుడు . వ్యాసం లో చక్కటి విశ్లేషణ ను చేసినందుకు మనసారా నిన్ను అభినందిస్తున్నాను -ఓలేటి వెంకట సుబ్బారావు అంకుల్/విజయవాడ

  • Dattamala says:

   వ్యాసం నచ్చినందుకు థాంక్స్ అంకుల్ ..బాగున్నారా :)

 6. suvarchala chintalacheruvu says:

  చాలా బాగుందండి. క్లుప్తతకు ప్రాధాన్యమిస్తూనే వివరంగా తెలియచేశారు. ప్రతి పాటా మీ అక్షరాలు మళ్లీ వినిపించాయి.

  • Dattamala says:

   సమయం లేక కొన్ని పాటలతో సరిపెట్టాల్సి వచ్చింది ..థాంక్స్ నచ్చినందుకు ….

 7. మంచి విషయాన్ని విశ్లేషించారు దత్తమాల గారు! రామకృష్ణ గారి పాట వినపడని గుడి ఉండదేమో.

  • Dattamala says:

   చిన్నపుడు ఆయన పాటతోనే మేల్కొలుపు :) థాంక్స్

 8. RAVINDRANATH NALAM says:

  మంచి గళానికి మధుర మైన నివాళి

  మరిన్ని పాటలను మీ అక్షరాల తో స్పృశించి మంచి వ్యాసాల తో మమ్మ్ములను అలరించాలి , దత్తమాల గారు

 9. చాల బాగా రాసారు.. రామ కృష్ణ గారికి ఇంకా అవకాశాలు ఒచ్చి ఉండాల్సిందేమో.. ఆయనకి ఆధునిక కాలం లో ఆయన పాటలకు ప్రాచుర్యం లేకపోవడం బాధాకరం.

Leave a Reply to Dattamala Cancel reply

*