వారిజాక్షులందు…

 

పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింట్లోకి ప్రవేశించేటప్పటికి అమ్మ సింకు దగ్గర నిలబడి అంట్లు తోముతూ “అబద్ధాలు… అన్నీ అబద్ధాలే… అన్ని అబద్ధాలు చెప్పడానికి అసలు నోరెట్లా వస్తుందో…” అని గొణుక్కుంటోంది.

“అబ్బ! నాకావలసిన విషయం నీ కెట్లా తెలిసిందమ్మా?” అడిగాను ఆశ్చర్యంగా.

“ఎంతసేపైంది వచ్చి? నాన్న స్టేషన్ కి వచ్చారు. కనిపించారా, చూసుకోకుండా నీ అంతట నువ్వే వచ్చేశావా?” విసుగ్గా అడిగింది అమ్మ నా మాటలు పట్టించుకోకుండా.

“నేను తోముతాలేమ్మా” అంటూ రంగి గొంతు వినిపించడంతో అమ్మ వెనక్కి తిరిగి రంగివైపు కోపంగా ఒక చూపు చూసి విసురుగా చేతిలో ఉన్న గిన్నెని సింకులోకి విసిరేసి చేతులుకూడా కడుక్కోకుండానే వంటింట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. రంగి తలవంచుకుని సింకుదగ్గరికి వచ్చి అంట్లు దొడ్లో వేసుకుని తోమడానికి కూర్చుంది. రంగి దొడ్లోకి వెళ్ళగానే అమ్మ వంటింట్లోకి వచ్చింది. స్థాణువులా నిలబడిపోయిన నేను తేరుకుని “నాన్నే తీసుకొచ్చారు. బయట వరండాలో కూర్చుని పేపరు చూస్తున్నారు” అన్నాను ఇందాకెప్పుడో అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానంగా.

“మొహం కడుక్కురా, కాఫీ కలుపుతాను” అంది అమ్మ సీరియస్ గా.

నేను మొహం కడుక్కుని వచ్చేటప్పటికి అమ్మ కాఫీ కలిపి నాలుగు గ్లాసుల్లో పోసింది. నన్ను చూడగానే ఒక గ్లాసు ఎత్తి ఠప్ మని గట్టుమీద పెట్టి “అది తీసుకెళ్ళి రంగికిచ్చి నువ్వొకటి తీసుకో” అని చెప్పి మిగతా రెండు గ్లాసులు తీసుకుని వంటింట్లోంచి బయటికి వెళ్ళింది.

నేను దొడ్లో కెళ్ళి “ఇదుగో రంగీ కాఫీ” అన్నాను.

రంగి తలెత్తి నావైపు చూసి, నా చేతిలోంచి కాఫీ గ్లాసు తీసుకుని ఠక్కున తల వంచేసుకుంది.

నేను నా కాఫీగ్లాసు తీసుకుని వెళ్ళేటప్పటికి అమ్మ నాన్నకి కాఫీ ఇచ్చి వచ్చి హాల్లో కూర్చుంది.

“ఏంటమ్మా, ఎవరిమీద అంత కోపం?” అడిగాను అమ్మ పక్కనే కూర్చుంటూ.

“ఆ రంగి… చెప్పేవన్నీ అబద్ధాలే…” ఉక్రోషంగా అని ఆయాసపడుతూ ఆగింది అమ్మ.

“అంత ఆవేశ పడకమ్మా! అసలేం జరిగిందో చెప్పు” అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అడిగాను.

chinnakatha

“నిన్నా మొన్నా రాలేదు. అంతకు ముందురోజు మధ్యాహ్నం తొందరగా వచ్చి గబగబా పని చేస్తుంటే ‘ఏంటే అంత తొందర ‘ అని అడిగాను. ‘పిల్లాడికి జ్వరమొచ్చింది, ఒళ్ళు పేలిపోతోంది. డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి ‘ అని హడావిడి పడింది. అప్పటికీ నా కనుమానమొచ్చి అడగనే అడిగాను ‘రేప్పొద్దున్న వస్తావా, ఎగర గొడతావా?’ అని. ‘ఎందుకు రానమ్మా! డాక్టరుకు చూపించి బిళ్ళలేస్తే పొద్దుటికి జ్వరం తగ్గదా ఏంటి?’ అంటూ నమ్మబలికింది. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరి వెళ్ళు ‘ అంటే ‘డాక్టరు వెళ్ళిపోతే కష్టమమ్మా, పొద్దున్నే చీకటితోటే వచ్చేస్తాగా’ అంటూ నన్నింకో మాట మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోయింది. గవర్నమెంటు హాస్పిటలుకు వెళ్తారు కాబోలు” చివరి మాటలో వెటకారం రంగరించి అంది అమ్మ.

ఇందాక రంగి కళ్ళలో కనిపించిన సన్నటి నీటిపొర గుర్తుకొచ్చి “పాపం, పిల్లాడి కెట్లా ఉందో. ఆ మాటైనా అడక్కుండా నువ్వు దానిమీద చిరాకు పడ్డావు” సానుభూతిగా అన్నాను.

“జ్వరమూ కాదు పాడూ కాదు. అన్నీ అబద్ధాలే. ఎప్పుడూ ఇట్లాంటి అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. తెలిసీ నేనే పిచ్చిమొహంలా ప్రతిసారీ నమ్మి మోసపోతుంటాను” అక్కసుగా అంది అమ్మ.

‘ఊ! అబద్ధం దగ్గరి కొచ్చింది అమ్మ. ఇంక నేను మొదలుపెట్టాలి ‘ అనుకుంటుండగానే అమ్మే అడిగింది “ఇందాక ‘నా క్కావలసిన విషయం నీ కెట్లా తెలిసింది ‘ అన్నావు, ఏంటది?” అని.

“నేను యూనివర్సిటీలో ‘మానవ జీవితంలో అబద్ధం పా త్ర ‘ అన్న విషయం మీద పత్రం సమర్పించాలి. రంగి చెప్పేవన్నీ అబద్ధాలే అని నువ్వెప్పుడూ చెప్తుంటావు కదా! అందుకే నిన్ను, రంగిని ఇంటర్వ్యూ చెయ్యాలని వచ్చాను.”

“నన్నేం ఇంటర్వ్యూ చేస్తావులే! నాకేం చేతనవుతుంది దానిలా గోడకట్టినట్టు అబద్ధాలు చెప్పడం. దాన్ని చెయ్యి ఇంటర్వ్యూ… ఇప్పుడే పలకరించకు. పని మానేసి నీతో కబుర్లు పెట్టుక్కూచుంటుంది. ఇంటికెళ్ళేముందు మాట్లాడు” అంది అమ్మ.

రంగి పని పూర్తిచేసుకుని వెళ్ళే సమయానికి గేటుదగ్గర కాపలాకాసి పలకరించాను “ఏం రంగీ! పిల్లాడి కెట్లా ఉంది?” అంటూ.

“సుమారుగా ఉందమ్మా. ఇప్పుడెల్లి గంజి కాచి పొయ్యాలి” అని చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

“అదంతే, దొరకదు” అంది అమ్మ నా వెనక నిలబడి.

“సరే! వాళ్ళింటికే వెళ్ళి మాట్లాడి వస్తాను. నాక్కావలసిన సమాచారం నేను సేకరించుకోవాలి కదా” అన్నాను.

“నాన్న మిల్లు కెళ్ళాక ఇద్దరం వెళదాంలే. ఒక్కదానివే ఏం వెళ్తావు” అంది అమ్మ.

“నువ్వొస్తే చెప్పే విషయాలు కూడా చెప్పదు. ఈ ఊరేం నాకు కొత్తా? ఏం ఫర్వాలేదు. వెళ్తాన్లే” అని అమ్మకి సమాధానం చెప్పి తయారవడం మొదలుపెట్టాను.

పనులన్నీ పూర్తి చేసుకుని, టిఫిను చేసి, రంగివాళ్ళ ఇంటికి దారి అమ్మనడిగి సరిగ్గా తెలుసుకున్నాను.

“చీటికిమాటికి అబద్ధాలు చెప్పకుండా దాన్ని కాస్త సంస్కరించు” నిరసనగా అంది అమ్మ నేను బయలుదేరుతుంటే.

“ప్రయత్నిస్తాను” అన్నాను అమ్మ చెప్పేదాంట్లో ఎంత నిజముందో అని ఆలోచిస్తూ.

నన్నంత దూరంలో చూస్తూనే ఎదురొచ్చింది రంగి “ఏంటమ్మాయిగారూ, ఇటొచ్చారు?” అంటూ.

“నీతో మాట్లాడాలని, మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను” అన్నాను.

రంగి నన్ను వాళ్ళ గుడిసె దగ్గరికి తీసుకెళ్ళి పీట వేసి కూర్చోమని తనూ నా ఎదురుగా నేలమీద కూర్చుంది.”వీడేనా నీ కొడుకు?” అన్నాను గుడిసెముందు చిన్న కారుబొమ్మని నెట్టుకుంటూ ఆడుకుంటున్న పిల్లాణ్ణి చూస్తూ.

“అవునమ్మా” అంది రంగి తల దించుకుని.

అంతలో వాడు నా దగ్గరికొచ్చి కారుబొమ్మని నా మొహమ్మీదికి పట్టుకుని “మా అత్త కొనిచ్చింది” అన్నాడు.

“మట్టిలో ఆడుతున్నావేంటి? జ్వరం తగ్గిందా?” అనడిగాను వాణ్ణి.

“నాకు జొరమేంటి? మా అత్తోళ్ళ ఊరెళ్ళొచ్చాం” అన్నాడు వాడు నావైపు, రంగివైపు మార్చి మార్చి చూస్తూ.

“ఫోరా! నువ్వవతలికి ఫో” అంటూ వాణ్ణి కసిరికొట్టింది రంగి. వాడు దూరంగా వెళ్ళి మళ్ళీ తన ఆట మొదలుపెట్టాడు.

‘రంగి అబద్ధం చెప్పింది ‘ అని అమ్మ అన్న మాట మీద నాకు అప్పటిదాకా ఉన్న అనుమానం తొలగిపోయింది.

“అబద్ధం ఎందుకు చెప్పావు?” సూటిగా రంగిని అడిగాను. ఏం మాట్లాడకుండా కూర్చుంది రంగి.

“నిజం చెప్పు రంగీ! నేను నిన్నేమీ అనను. పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పడానికి నీకు మనసెట్లా ఒప్పింది?” బాధగా అడిగాను.

“ఏం చెప్పమంటారమ్మా? మా ఆడబిడ్డ కూతురు పెద్దపిల్లైతే పంక్చను కెళ్ళాం…”

“పిల్లాడికి జ్వరమని చెప్పావు. పొద్దున్నే చీకటితో వస్తానని చెప్పావు. అన్ని అబద్ధాలు చెప్పే బదులు ‘ఊరెళ్ళాలి, రెండు రోజులు రాను ‘ అని చెప్తే అమ్మ కాదంటుందా?” రంగి మాట పూర్తి కాకుండానే అడ్డుపడ్డాను.

రంగి నావైపు విచిత్రంగా చూసింది. “ఎందు క్కాదనరమ్మా? మా అక్క కూతురు పెద్దదైనప్పుడు మీ రన్నట్టే అంతా నిజమే సెప్పాను. ‘రెండురోజులెల్లి ఏంసేత్తావు? ఓపూటెల్లి ఎంటనే వచ్చెయ్’ అన్నారమ్మా అమ్మగారు. ‘పంక్చను, పంక్చను అంటూ అందరూ అట్టహాసాలు నేర్సుకున్నారు ‘ అంటూ తీసిపారేసి మాట్టాడారమ్మా. ఏమ్మా! మాకు మాత్రం సరదా లుండవా? ఆళ్ళు రెండురోజు లుండేట్టు రమ్మని పిలిత్తే ఓ పూటుండి దులిపేసుకుని ఎట్టా వచ్చేత్తామమ్మా?”

“రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని.రెండు రోజులు ఎందుకున్నావు అని కాదు.”

“అమ్మగా రేం తక్కువ కాదమ్మా. పసిగట్టేశారు. ‘పొట్టుపొయ్యిలో పొట్టు కూరేసి ఎల్లు’ అన్నారు. ఏడేల్లబట్టి సేత్తున్నాను మీ ఇంట్లో పని. పనికి మాట్టాడుకున్నప్పుడు పొట్టుపొయ్యికి పొట్టుకూరేపని సెప్పలేదు అమ్మగారు. అయినా పెతిరోజూ ఆ పనికూడా సేత్తూనే ఉన్నాను. నాకు తెలీకడుగుతాను, ఈ రోజుల్లో పొట్టుపొయ్యి వాడేదెవరమ్మా? మిల్లునించి పొట్టు ఊరికే వస్తుంది, కూరడానికి నేనున్నానని కాకపోతే. అప్పటికీ అమ్మగారు ఇబ్బంది పడతారు, ఒకడుగు ముందొచ్చి పొయ్యిపని సేసేద్దామనే అనుకున్నానమ్మా. నాకు ఇంట్లో పని తెమలకపాయె.”

 

“అబ్బా, రంగీ! నేనడిగేది అబద్ధం ఎందుకు చెప్పావు అని. పొట్టుపొయ్యిలో పొట్టెందుకు కూరలేదు అని కాదు” కాస్త విసుగ్గా అన్నాను.

“రేప్పొద్దున్న రాను అని సెప్పాననుకోమ్మా, పొట్టుకూరేసిపో అనడమే కాదు, రేప్పొద్దున్నవార ఇప్పుడే ఇల్లు తడిగుడ్డ పెట్టెల్లు అంటారమ్మా. ఎవరైనా ఒకేరోజు రెండుపూటలా ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటారామ్మా?”

“రంగీ, ఇల్లు తడిగుడ్డ ఎందుకు పెట్టలేదు అని కాదు నేనడిగింది, అబద్ధమెందుకు చెప్పావు?” కాస్త కోపంగా అన్నాను.

“పోనీ అమ్మగారి మాటెందుకు తీసిపారెయ్యాలి, అన్నిపనులూ సేసిపెట్టే ఎల్దామంటే ఆలెస్సమైపోద్ది. రైలెల్లిపోద్ది.”

“పిల్లాడికి జ్వరమని అబద్ధమెందుకు చెప్పావు?” అసహనంగా అరిచాను.

“డాక్టరెల్లిపోతారు, తొరగా ఎల్లాలి అని సెప్పబట్టే రైలందుకున్నామమ్మా. రైలెల్లిపోద్ది, తొరగా ఎల్లాలి అని సెప్తే అమ్మగారు ‘రైలెల్లిపోతే బస్సులో ఎల్లండి ‘ అంటారమ్మా. రైలు చార్జీ లెక్కడ? బస్సు చార్జీ లెక్కడ? రైలు టేసను మాకు దగ్గర. బస్టాండుకు పోవాలంటే ఆటో ఎక్కాల. మా ఆడబిడ్డోల్లూల్లో కూడా టేసనే దగ్గరమ్మా. బస్సులో ఎల్తే మల్లీ అక్కడకూడా ఆటో ఎక్కాల. ఉన్న డబ్బంతా బస్సులకి, ఆటోలకే పోస్తే… పిల్లచేతిలో ఏదేనా పెట్టాల గదమ్మా. మాకు మాత్రం ప్రేమలు, అబిమానాలు ఉండవా?”

‘తనని అబద్ధం చెప్పే పరిస్థితుల్లోకి అమ్మే నెడుతోంది’ అని చాలా తెలివిగా తెలియజేస్తోంది రంగి  అనిపించింది నాకు. ఏది ఏమైనా ‘అబద్ధం చెప్పడం తప్పు ‘ అన్న పాఠం రంగికి నేర్పాలన్న పట్టుదలతో “అబద్ధమెందుకు చెప్పావు అని అడిగినందుకు చాలా చాలా చెప్పావు రంగీ. కానీ అబద్ధం చెప్పడం తప్పని నీకు తెలీదా? ఇప్పటిదాకా అబద్ధా లాడకూడదు అని ఎవరూ నీకు చెప్పలేదా?” అని అడిగాను.

“మా ఇళ్ళకాడ గుళ్ళో పురానకాలచ్చేపం సెప్పే పంతులుగారు సెప్తూనే ఉంటారమ్మా ‘అబద్దమాడ్డం తప్పు, పాపం’ అని. ఆ పంతులుగారే ఇత్త… పేన… మాన… ఇంకేందో… అప్పుడంతా అబద్దమాడితే తప్పులేదని కూడా సెప్పారమ్మా.”

‘బాబోయ్! భాగవతాన్ని తీసుకొచ్చేసింది. ఇది సామాన్యురాలు కాదు ‘ అనుకున్నాను. ఏం మాట్లాడాలో అర్థంకాక దిక్కులు చూస్తుంటే తనే చెప్పడం మొదలుపెట్టింది రంగి.

“నేను అబద్దమాడితే అబద్దమెందుకాడావ్, అబద్దమెందుకాడావ్ అని ఇన్ని సార్లు అంటున్నారు గానమ్మా… నేను అంట్లు తోమడం పూర్తిచేసి, తోమినచోటంతా కడిగేసి ‘అమ్మయ్య, పనైపోయింది, ఇంక ఇంటి కెల్లొచ్చు ‘ అనుకుంటుంటే అమ్మగారు ‘ఒక్క గిన్నుంది, అదొక్కటీ తోమిచ్చేసెల్లవే’ అంటారమ్మా. గిన్నె ఒక్కటే గానమ్మా, దాంతోబాటు పళ్ళేలు, గెంటెలు, గలాసులు కూడా ఏత్తారమ్మా. మరప్పుడు అమ్మగారు నిజం సెప్పినట్టా? అబద్దం సెప్పినట్టా?”

కాస్త ఆగి దీర్ఘంగా ఊపిరి తీసుకుని మళ్ళీ ఎత్తుకుంది రంగి. “పనంతా పూర్తి సేసుకుని గేటుదాకా ఎల్లిపోయాక ఎనక్కి పిలుత్తారమ్మా అమ్మగారు. ‘ఉల్లిపాయలు అయిపోయాయి. కాస్త తెచ్చిపెట్టి ఎల్లవే’ అంటారమ్మా. లోపలికెల్లి సంచి, డబ్బులతోబాటు పది సరుకులు రాసిన పట్టీ తెచ్చి చేతిలో పెడతారమ్మా. అప్పు డమ్మగారు అబద్దం ఆడినట్టు కాదామ్మా?”

రంగి లాజిక్ చూసి బిత్తర పోయాన్నేను. ఆ షాక్ లోంచి నేను బయటపడేలోపే చివరి అస్త్రాన్ని ప్రయోగించింది.

“ఏం బంగమైందని అమ్మగారు ఆ అబద్దాలాడతన్నారమ్మా?” సూటిగా నన్నే చూస్తూ ప్రశ్నించింది రంగి.

రంగిని నేను చేసిన ఇంటర్వ్యూతో నా పేపరు ఎటో ఎగిరిపోయింది.

‘ఇప్పుడు నేను సంస్కరించవలసింది ఎవర్ని?’ అన్న ప్రశ్న నా ముందు కొండలా నిలబడింది.

మీ మాటలు

  1. కథ బాగుందండీ , తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అంటే ఇదే .

  2. వనజ తాతినేని says:

    ఎంత సాగదీసినా అబద్దం నిజమే మాట్లాడింది. బావుందండి .

మీ మాటలు

*