పాటల పడవెళ్ళి పోయిందిరా…!

 

ముళ్ళపూడి సుబ్బారావు

Srmతెలుగు సినీ సంగీతం పట్ల అభిరుచి ఉన్నవారికి పరిచయం అవసరంలేని పేరు రామకృష్ణ. (పూర్తి పేరు వి.రామకృష్ణదాస్). తెలుగు సిని సంగీతంలో (హింది సీమలో కూడా) స్వర్ణ యుగంగా చెప్పబడే అరవైలు, డెబ్భై లలో, డెబ్భయ్యవ దశకంలో నేపధ్య గాయకుడిగా గాఢమైన ముద్ర వేసిన గాయకుడు రామకృష్ణ. చిత్రరంగ ప్రవేశం తోనే అగ్రనటునకు నేపధ్య గానం చేసే అవకాశం లభించింది.అనతికాలంలోనే అగ్రనటులందరికీ పాటలు పాడే అవకాశాలు అందుకున్నాడు. ఐదారు సంవత్సరాలు నేపధ్య గాయకుడిగా మంచి స్థితి అనుభవింఛాడు.

రామకృష్ణ కు అవకాశాలు రావడానికి, గాయకుడిగా అతని ప్రస్థానం,దాని భూమిక ను పరిశించదలిస్తే అనేకవిషయాలు అవలోకించాలి.

తెలుగు సినిమా పాట-ఘంటసాల ఘరానా:

ఘరానా అనే పదానికి  తెలుగులో వాడుకలో ఉన్న అర్ధం గొప్పదేం కాదు. ఐతే హిందూస్తానీ సంగీతంలో ఘరానా అనేది గాయకుల, సంగీతకారుల బాణీని,సాంప్రదాయాన్ని  సూచించేది.అందులో ప్రాంతం కూడా కలసి ఉంటుంది.(ఉదా:  పటియాలా ఘరానా,ఆగ్రా ఘరానా). తెలుగు సినిమా పాటలకు సంబంధించి ఘంటసాల ఘరానా 70లవరకూ రాజ్యమేలింది. ఘంటసాల ఇదివరకటంత ఉత్సాహం గా పాడలేకపోవటం తో అదే తరహా లో సాగే ఆమోదయోగ్యమైన యువ స్వరం అవసరం సీనియర్ నటులకు కలిగింది. బాలూ ఘరానా ఇంకా వేళ్ళునుకునే స్థితిలోనే ఉంది. ఘంటసాల బాణీకి అలవాటుపడి ఉన్న ప్రేక్షకులు,శ్రోతలు అందుకు భిన్నమైన స్టైల్ ను ఇష్టపడతారా అనేదానిపై అందరికి అనుమానాలున్నాయి. ఘంటసాల కు భిన్నమైన పంథాలోనే సాగుదామని బాలు నిర్ణయించుకున్నట్టు అప్పటి బాలు పాటలు ఉంటాయి. ఎన్.టి.ఆర్, ఏ ఎన్నార్ లు బాలు తో ప్రయత్నించారు కాని బాలు ను ఘంటసాల కు ప్రత్యమ్నాయంగా చూడలేకపోయారు.  ఆ వెతుకులాటలో ఏ ఎన్నార్ కు రామకృష్ణలో ఘంటసాల ఘరానా కనపడి ఉండవచ్చు.

ఘంటసాల బాణీలోనే, ఘంటసాలతో పాటు కొన్ని సినిమాలకు ప్రముఖ హీరో లకు పాడటం,అవి ప్రేక్షకామోదం పొందటం వల్ల ఘంటసాల కు కొనసాగింపుగా రామకృష్ణ ముందుకు వచ్చాడు. ఫ్రఖ్యాత గాయని సుశీల చుట్టరికంకూడా ఈ ఎదుగుదలకు కొంత దోహదపడి ఉండవచ్చు.

హిందీ సినిమ సంగితంలో ఇదే తరహా ను గమనించవచ్చు. నలభైలనుండీ 1990 వరకూ హిందీ పాటల్ని గమనిస్తే ప్రముఖంగా వినిపించే స్వరాలు ..కె.ఎల్ సైగల్, ముఖేష్, మహమ్మద్ రఫి,కిశోర్ కుమార్ లవి.

స్టార్ స్టేటస్ అనుభవించిన ప్రతీ గాయకుడుకి తర్వాత కాలంలో ఆయన్ని అనుకరిస్తూ పాడే గాయకులు ఉంటారు. కొన్నిసార్లు ప్రధాన గాయకుడు పాడుతున్నపుడే అనుకరణలు కూడా కొనసాగుతాయి. హిందీ చిత్రసీమలో ఆరకం గా సైగల్ ను ఆయన తర్వాత వచ్చిన ముఖేష్, కిశోర్ లు అనుకరించారు. తర్వాత ఇద్దరూ తమ సొంత బాణీ ని ఏర్పరచుకున్నారు.

ముఖేష్  క్లోన్ గా ఆయన కొడుకు నితిన్ ముఖేష్, అంతకు ముందే (1969) గాయకుడిగా పరిచయమైన మన్ హర్ ఉధాస్ ని చెబుతారు.మహేంద్ర కపూర్ మొదటి రోజుల్లో పాడిన కొన్ని పాటలు జాగ్రత్త గా వినకపోతే రఫీ పాటలే అనుకునేంత సామీప్యత ఉంటుంది. రఫీ తరహా లో అన్వర్ (హం సె కా బూల్…. జనతా హవల్దార్) , జస్పాల్ సింగ్ (గీత్ గాతా చల్) రఫీ ఫీల్డ్ లో ఉన్నపుడే వచ్చారు. రఫీ మరణం తర్వాత, ఆ స్లాట్ ను భర్తీ చేయడం లో వచ్చిన  షబ్బీర్ కుమార్, మహమ్మద్ అజీజ్ ఆతర్వాత ఉదిత్ నారాయణ్, సోను నిగం రఫీ క్లోన్స్ గా ముద్ర పడ్డారు.కిశోర్ కుమార్ కు క్లోన్స్ గా కుమార్ సాను, అభిజీత్ కొనసాగారు. కిశోర్ కొడుకు అమిత్ కుమార్ గాయకుడైన కిశోర్ ను పూర్తిగా ఇమిటేట్ చేసినట్టు కనపడదు.

అలాగే తెలుగు లో ఘంటసాల కు ప్రత్యమ్నాయంగా రామకృష్ణను ప్రోత్సహించడటాన్ని చూడాల్సి ఉంటుంది.ఘంటసాల పాటలు పాడుతున్నపుడే రామకృష్ణ చిత్రరంగ ప్రవేశం జరగటం, ఘంటసాల తొ కలిసి చిత్రంలో పాటలు పంచుకోవడం, కొన్ని పాటల్లో ఘంటసాల తో (విత్ అవుట్ క్రెడిట్స్) పాడటం,( తింటే గారెలే తినాలి వింటే భారం వినాలి- కన్న కొడుకు (1973)  -రామ కృష్ణ ఇంటర్వ్యూ) వంటివి ఇక్కడి ప్రత్యేకం. రారా మా ఇంటికి  నిదురరాదు నా కంటికి (దొరబాబు 1974) పాటలో పల్లవి రామకృష్ణ పాడింది చరణాలు ఘంటసాల పాడింది సినిమాలో వినిపిస్తుంది.

తెలుగు సినిమాలలో 1950 నుండి 1980 వరకు కథానాయకులకు నేపధ్యగానాన్ని తరచిచూస్తే మూడు దశలు గమనించవచ్చు.అవి

1950 -1973    ఘంటసాల కాలం

యాభయ్యవ దశకం ప్రారంభంలోనే తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ డం ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రూపంలో  ప్రవేశించింది.తొలి రోజుల్లో ఇద్దరూ పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాల్లొ నటించినా వాటిని పంచుకున్నట్టుగా రామారావు జానపద, పౌరాణిక చిత్రాల్లోనూ, నాగేశ్వరరావు సాంఘిక చిత్రాల్లో ను రాణించారు.సాంఘిక చిత్రాల్లో రామారావు నటించినా, ఇరువురి ముద్రల మధ్య స్పష్టమైన తేడా కనిపించేది. వారి దర్శకులువేరు,నిర్మాతలు వేరు,నిర్మాతలు వేరు,సంగీత దర్శకులు వేరు. ఐతే వారిరువురికి సంబంధించి ఒక సామాన్యమైన విషయం వారి నెపధ్య గాయకుడు ఘంటసాల ఒక్కరే కావడం.సినీ నేపధ్య  గాయకులు అదేకాలంలో పి.బి.శ్రీనివాస్, ఎ.ఎం.రాజా, మాధవపెద్ది మొదలైనవారున్నా,  కాంతారావు,జగ్గయ్య,హరనాథ్  వంటి హీరోలు ఎన్.టీయార్, ఏ.ఎన్నార్ లకు ఎలా పోటీ కాలేదో ఘంటసాల కు  కూడా పోటి కాలేదు. ఆయన మాత్రమే ఆరంగంలో సూపర్ స్టార్. ఘంటసాల సూపర్ స్టార్ డం ఇంచుమించు ఆయన మరణానికి కొద్ది కాలంముందువరకూ, ఆయన పాటలు పాడగలిగేంతవరకూ అంటే 72/73 వరకూ కొనసాగింది.గాయకునిగానే కాక విజయవంతమైన సంగీత దర్శకునిగా కూడా( 100 కు పైగా చిత్రాలకు) కొనసాగారు.

1977  నుండిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కాలం

డెబ్భై ఏడవ సంవత్సరం వచ్చేసరికి తెలుగులో ఎన్.టి.ఆర్, ఏ ఎన్నార్ తో పాటు కృష్ణ,శోభన్ బాబులు తో కలిసి టాప్ ఫోర్ హీరోలుగా ఉన్నార్.కృష్ణం రాజు హీరో గా ఉనికి చాటుకుంటూ సొంత సినిమాల సక్సెస్ తో ఐదో స్టార్ గా మారుతున్నారు. ఐతే ఈ ఐదుగురు హీరోలకూ నేపధ్య గానం చేస్తున్న ఒకే ఒక ప్లే బాక్ సింగర్ మాత్రం బాలు గా పిలువబడే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల నేపధ్య గాయకుడిగా అప్రతిహతంగా వెలుగుతున్నపుడు అప్పడప్పుడూ వినపడె పి.బి.శ్రీనివాస్,ఏ ఏం రాజా, మధవపెద్ది, పిఠాపురం లాగానే ఇప్పుడూ కొన్ని గొంతులు ..రామకృష్ణ,ఆనంద్, మాధవపెద్ది రమేష్ వంటివి వినిపిస్తుంటాయి. (అప్పుడప్పుడూ జేసు దాసు వంటి పర భాష గాయకుని గొంతు).  కథానాయకుడు ఎవరైనా, సినిమా క్లాస్ ఐనా మాస్ ఐనా, కుటుంబపరమైన, సామాజికపరైనా, సంగీతభరితమైనా, గూఢచారి తరహా ఈన అన్ని మగపాత్రలకూ ఒకటే స్వరం నేపధ్య గానం చేస్తుంది. డెబ్భై నాటికి కృష్ణకు మాత్రమే పాడుతూ ఏక కంఠుడు గా ఉన్న బాలు పంచకంఠుడు గా, తర్వాత దశ కంఠుడు(వి.ఏ.కే మాటల్లో) మారి గాయకునిగా  నెంబర్ వన్ స్టేటస్ అనుభవిస్తున్నారు.

ఐతే ఘంటసాల నుండి స్టార్‌డం ను బాల సుబ్రహ్మణ్యం ఎలా పొందాడు? డెబ్భై రెండు నుండి డెబ్భై ఏడు వరకు తెలుగు కథానాయకులకు సంబంధించి నేపధ్య  సంగీత ప్రపంచం లో ఏమిజరిగింది?

1972 -1977

అరవయ్యవ దశకం మధ్య భాగంలో నటద్వయం మధ్య వయసుకు వచ్చారు.ఆ సమయంలోనే కొత్తనటులు హీరోలుగా ప్రవేశించసాగారు. అప్పటికి కొద్ది కాలంముందుగా శోభన్ బాబు ప్రవేశించి ఉన్నాడు, కృష్ణ, రామమోహన్,రామకృష్ణ, కృష్ణం రాజు హీరోలు గా పరిచయమయ్యారు. నేపధ్య గాయకులు గా ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, కె.బి.కె మోహన్ రాజు వంటివారు వేళ్ళునుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే కొత్తగా పరిచయమైన కథానాయకులు, గాయకులు అప్పటికి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నటద్వయానికి , ఘంటసాల కు పూర్తిస్థాయి పోటీ కాలేదు కానీ అలాకావొచ్చన్న సంకేతాలు కనిపించసాగాయి..

ఆలా తెరపైన, తెరవెనుక కూడా పాతకొత్త కళాకారులు రంగం మీద ఉన్నారు. వీరి మధ్య స్పర్థ అప్రకటితంగానూ, అంతర్గతంగానూ 1970 వరకూకొనసాగింది.

1965-70 మధ్య ఘంటసాల కొత్త హీరోలకు పాడటం, ఎన్ టీయార్,ఎ.ఎన్నార్ లు కొత్త గాయకులతో పాడించుకోవటం జరిగింది. ఎన్.టి.ఆర్ కు పి.బి.శ్రీనివాస్(ఆడబ్రతుకు),ఎస్.పి.బాలు (కోడలు దిద్దిన కాపురం, చిట్టిచెల్లెలు)పాడారు. అలాగే మహమ్మద్ రఫీ తో కూడా ఎన్.టి.ఆర్ పాడించారు (తల్లాపెళ్ళామా,భలే తమ్ము డు). ఏ.ఎన్నార్ కు పి.బి శ్రీనివాస్(ప్రేమించిచూడు), ఎస్.పి. బాలు(ఇద్దరమ్మాయిలు)పాడారు. ఐతే రెగ్యులర్ గా మాత్రంఘంటశాలే పాడెవారు. అలాగే కృష్ణ కు  కూడా ఘంటసాల కొద్దిరోజులు పాడారు. క్రమంగా కృష్ణకు పర్మినెంటు నేపధ్యగాయకుడుగా బాలు ఢెబ్బైకి ముందే స్థిరపడిపోయాడు. శోభన్ బాబు కు ఎస్.పి అప్పుడప్పుడూ పాడినా (కొన్ని పెద్దహిట్స్ కూడా ఉన్నాయి. ఊదా: చెల్లెలి కాపురం, మానవుడు దానవుడు, పుట్టినిల్లు మెట్టినిల్లు), ఘంటసాల చివరి వరకూ (ఖైదీ బాబాయి1974) పాడుతూనే ఉన్నారు.

70 తర్వాత ఘంటసాల పాటల్ని దగ్గరగా గమనిస్తే, గొంతు లో అలసట, ఊపిరి భారంగా తీసుకోవడం తెలిసిపోసాగింది. యువ హీరోలతో పోటిపడాల్సి వచ్చినె మధ్యవయస్కులైన నటద్వయం కొత్త గొంతు కోసం అన్వేషిస్తుంది.

ఆ సంధి కాలంలో ఏ ఎన్నార్ కు రామకృష్ణ రూపంలో ఒక సమాధానం దొరికింది. ఆల్ ఇండియా రేడియో కోసం చిత్తరంజన్ (కొన్ని సినిమా పాటలు పాడాడు) దర్శకత్వంలో  కే బి కే మోహన్ రాజు పాడవలసిన పాటలు ఆయన దొరకకపోవటంతో రామకృష్ణ అనే నూతన గాయకునితో కొన్ని పాటలు పాడించారు. (కుటుంబ నియంత్రణ ప్రచారం కోసం). ఆ పాటలు ఏ ఎన్నార్ సారధీస్టూడియో లో విన్నారు. ఆతని గొంతు లో ఉన్న ఘంటసాల సామీప్యత వల్ల కావచ్చు ఏ ఎన్నార్ కు అతని గొంతు నచ్చింది. నిర్మాణంలో ఉన్న తన చిత్రంలో పాడటానికి అడిగారు. రామకృష్ణ అప్పటికి చదువు పూర్తికాలేదు. పరీక్షలు అయ్యేదాక ఆగి తర్వాత అతనితో విచిత్రకుటుంలో రెండు పాటలు పాడించారు. ఏ ఎన్నార్ కు విచిత్రకుటుంబం సినిమా(విజేత నవల చిత్రరూపం) నే అప్పటివరకూ ఏ ఎన్నార్ సినిమా లకు కొంత విరుద్ధమైన పంధా లో ఉంటుంది.(హీరో యిన్ ను బలాత్కరించడం). అందులోనూ కొత్త గాయకునికి ప్రయత్నించడం విశేషమైనదే. కొత్తగాయకుని పాటలకు ఏ ఎన్నార్ కు నేపధ్య గానం గా శ్రోతల ప్రేక్షకుల ఆమోదం లభీంచింది.

విచిత్ర బంధం తర్వాత ఏ ఎన్నార్ కు ఘంటసాల తో పాటు రామకృష్ణ కూడా ప్లే బాక్ సింగర్ గా కొనసాగారు.ఆలాగె 73,74 సంవత్సరాలలో వచ్చినె పల్లెటూరి బావ, భక్తతుకారాం, దొరబాబు, బంగారుకలలు సినిమాలో కొన్నిపాటలు ఘంటసాల కొన్ని పాటలు రామకృష్ణ పాడారు. ( గతంలో ఏ ఎన్నార్,ఎన్.టి.ఆర్ కలిసినటించిన చిత్రాలలో ఇద్దరికి ప్లే బాక్ ఘంటశాలే కొనిసార్లు ఒకేపాటలో కూడా గమనించవచ్చు)

ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ నేపధ్యగానం చేయడం ధనమా? దైవమా? చిత్రంతో మొదలయ్యింది. తర్వాత ‘పల్లెటూరి చిన్నోడు ‘ లో ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ పాడారు.72 లో వచ్చిన కులగౌరవం లో బాలు ఎన్.టి.ఆర్ కు పాడారు. 73 లో వచ్చిన ఐదు  డైరెక్ట్ సినిమాలల్లో  నాలుగు సినిమాలల్లో ఘంటసాల పాటలే ఉన్నయి. 74 లొ వచ్చిన ఆరు సినిమాల్లో ఎన్.టి.ఆర్ కు  ఘంటసాల తో పాటు రామకృష్ణ ఒక సినిమాలో,బాలు  రెండు సినిమాలోపాడారు. అలా ఎన్.టి.ఆర్ రామకృష్ణను ఘంటసాలకు ప్రత్యమ్నాయం గా అప్పటికి చూడలేదు.

కృష్ణ కు తొలిరోజుల్లో ఘంటసాల పాటలు పాడినా తర్వాత తర్వాత బాలు కృష్ణకు పూర్తి స్థాయి గాయకుడై పోయాడు.  73 లో మమత, శ్రీవారు మావారు చిత్రాల్లో  రామకృష్ణ, కృష్ణకు నేపధ్య గానం చేశారు.

ఏ ఎన్నార్ తర్వాత రామకృష్ణను పూర్తిస్థాయి గాయకూడిగా అవకాశమిచ్చింది శోభన్ బాబు. విచిత్ర బంధం సినిమాలో పాటలు మద్రాస్ (ఇప్పటి చెన్నై) జెమినీ స్టూడియో లో విని హైదరాబాద్ నుండి తిరిగి మద్రాస్ పిలిపించారు. 73 లో ఆరు సినిమాల్లో 74 లో నాలుగు సినిమాల్లో శోభన్ బాబు కు రామకృష్ణ పాటలు పాడారు. 75 లో రెండు సినిమాల్లొ పాడారు.

అలా ఢెబ్బై మూడు,నాలుగు, ఐదు సంవత్సరాలలో అప్పటికి టాప్ ఫోర్ గా చెప్పబడే నలుగురు హీరోలకీ రామకృష్ణ పాటలు పాడారు. ఆ మూడు సంవత్సరాలలో నలుగురుకీ పాటలు పాడింది రామకృష్ణ ఒకరే.

75 లోనె ఎన్.టి.ఆర్ కొత్త ఇమేజి కు రూపకల్పన జరిగింది. కొత్త నిర్మాత అశ్వినీదత్ , దర్శకుడు బాపయ్య (ఎన్ టీ ఆర్ తో తొలిసారి) తొ ఎన్.టి.ఆర్ ను ఎదురులేని మనిషి సినిమాలొ ట్రెండీ గా చూపించారు. పాటలు, పాటల చిత్రీకరణ కొత్తపుంతలు తొక్కాయి. 1970 లో రైతు బిడ్డలో ఎన్.టి ఆర్ కు తమ్మునిగా నటించిన జగ్గయ్య ఈ సినిమాలోను తమ్ముడే. ఐతే ఆ సినిమాలో జగ్గయ్య కు బాలు పాడారు. ఈ సినిమాకి వచ్చేసరికి అన్న పాత్రకి బాలు పాడారు. (ఆలస్యంగా 76 వ సంవత్సరం విడుదలైన ఎన్.టి.ఆర్ చిత్రం మంచికి మరో పేరు (సి.ఎస్. రావు (దర్శకుడు), ఎస్.రాజేశ్వరరావు (సంగీతం), రామకృష్ణ(నేపధ్య గానం))సినిమాకు ,ఎదురులేని మనిషి సినిమాకు పూర్తి వైరుధ్యం కనిపిస్తుంది.)

అలా75 లో శోభన్ బాబు , ఎన్.టి.ఆర్ కు బాలు పూర్తిస్థాయి గాయకుడిగా స్థిరపడి పోయారు .  కృష్ణకు మొదటినుండి పూర్తిస్థాయి గాయకుడిగా కొనసాగుతూనె ఉన్నారు.

76 లో ఎ.ఎన్నార్ తిరిగి నటించడంమొదలైనాక వచ్చిన మహాకవి క్షేత్రయ్య, మహాత్ముడు, సెక్రెటరీ సినిమాలకు రామకృష్ణ నే నేపధ్యగాయకుడిగా  కొనసాగాడు.77 లో చక్రధారి సినిమాకు పూర్తి పాటలు ఎ.ఎన్నార్ కు పాడారు.

అదే సంవత్సరం ‘ఆలు మగలు’ సినిమాకు చాలా కాలం తర్వాత బాలు ఏ.ఎన్నార్ కు ప్లే బాక్ పాడారు. త ర్వాత వచ్చిన ఆత్మీయుడు ,రాజారమేష్ సినిమాలో కూడా పూర్తిగా బాలూ పాటలే చిత్రంలో వినిపిస్తాయి.

అలా 77 వ సంవత్సరానికి బాలు టాప్ ఫోర్ హీరోలకు పాడే సూపర్ సింగర్ గా బాలు మారిపోయాడు.

రామకృష్ణకు సంబంధించినంతవరకూ డెబ్భై రెండు తో మొదలై డెబ్భై ఏడు వరకూ గాయకుడి గా తెలుగు చలన చిత్ర సీమలో మంచి దశగా చెప్పుకోవచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు- రామకృష్ణ

రామకృష్ణ ఏ ఎన్నార్ కు 72 నుండి 78 వరకు పాడిన సినిమాలు పదిహేను.వీటిలొ పన్నెండు సినిమాలు సాంఘికాలు, మూడు సినిమాలు హిస్టారికల్ అందునా భక్తి పరమైన సినిమాలు.సాంఘిక చిత్రాలలో నలభై ఏడు పాటలు, భక్తి పరమైన మూడు చిత్రాలలో ఇరవై ఎనిమిది పాటలు/పదాలు/శ్లోకాలు పాడారు.72 నుండి ఘంటసాల బ్రతికున్నంతకాలం ఏ ఎన్నార్ కు రెండు మినహా అన్ని చిత్రాలలోనూ ఘంటసాల తో పాటలు పంచుకున్నారు. అలాంటి సినిమాలు విచిత్రబంధం, పల్లెటూరి బావ,భక్త తుకారాం,ప్రేమలు పెళ్ళిళ్ళు,దొరబాబు,బంగారు కలలు.అందాల రాముడు చిత్రంలో మాత్రం అన్ని పాటలు రామకృష్ణనే పాడారు. మంచివాడు చిత్రంలో అన్ని ఘంటసాల పాటలే ఉన్నాయి.

డెబ్భై ఐదు లో ఏ ఎన్నార్ చిత్రాలు రిలీజు కాలేదు. డెబ్భై ఆరు –ఏడు సంవత్సరాలలో వచ్చిన సెక్రెటరీ,మహాత్ముడు, మహాకవి క్షేత్రయ్య, చక్రధారి లో ఏ ఎన్నార్ కు రామకృష్ణనే పాడారు.

77లోనే వచ్చిన ఆలుమగలు సినిమాలో బాలు మరోసారి ఏ ఎన్నార్ కు ప్లే బాక్ పాడటం ప్రారంభించారు. అందులోనూ ఒక పాట రామకృష్ణ పాడినా బాలు పాడిన పాటలు జనాదరణపొందాయి.ప్రత్యేకంగా ‘ఎరక్క పోయి వచ్చాను ‘ పాట బాగా హిట్ అయ్యింది. పాటలో బాలూ ఏ ఎన్నార్ స్వరంలోని మానరిజాల్ని అంతకుమున్నెన్నడూ లేనంతగా పలికింఛాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఎ ఎన్నార్ సినిమా ఆత్మీయుడు లో పూర్తిగా బాలు నే పాడారు. 77లోనే వచ్చినె రాజా రమేష్ చిత్రంలో ఒక పాట రామకృష్ణ జానకి పాడిన పాట రికార్డ్ గా విడుదల అయ్యింది. కానీ చిత్రంలో అదే పాట బాలు సుశీల పాడింది చిత్రీకరించబడింది.

తిరిగి 78 లో వచ్చిన రామకృష్ణులు, దాసరి ఏ ఏన్నార్ ల తొలి కాంబినేషన్ లో వచ్చిన దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రాల్లో ఏ ఎన్నార్ కు రామకృష్ణ పూర్తిగా ప్లే బాక్ ఇచ్చారు.

సాంఘిక చిత్రాలలో పాటలు:

తొలిచిత్రం విచిత్రబంధం లో పాడిన ‘వయసే ఒక పూలతోట’, ‘చిక్కావుచేతిలో చిలకమ్మ’  రెండూ గాయకునిగా రామకృష్ణకు గుర్తింపు తెచ్చాయి. పల్లెటూరి బావ ‘ఒసే వయ్యారి రంగి’ హుషారైన వెర్షను పాడారు. 73 లో బాపు దర్శకత్వంలో బాపు రమణల స్వంత చిత్రం ‘అందాల రాముడు ‘ లొ అన్ని పాటలూ రామకృష్ణ తో పాడించారు. ఈ సినిమాలో పాటల్ని బాలు తో పాడించాలనుకున్నారు. భాపు రమనలకు బాలూ బహు ఇష్టుడు. కొద్ది సంవత్సరాలక్రింతం వచ్చిన ‘బంగారు పిచ్చిక ‘ చిత్రంలో హీరో గా బాలు ను తొలుత అనుకున్నారు కూడా. బహుశా ఏ ఎన్నార్ ఇష్టం మేరకు రామకృష్ణ కు ఈ అవకాశం వచ్చివుండవచ్చు. ఛిత్ర జయాపజయాలు ఏమైనా ఆడియో పరంగా అందాల రాముడు పెద్ద సక్సెస్. ఘంటసాల బ్రతికి ఉన్నపుడే ఎ ఎన్నార్ కు పూర్తి గా రామకృష్ణ పాడటం ఈ ఒక్క చిత్రంలోనే.

74 సంవత్సరంలో ఏ ఎన్నార్ ను కొత్త కోణంలో మాస్ హీరో గా చూపిన దొరబాబు చిత్రం లో రామకృష్ణ నాలుగు పాటలు ( ఒద్దు ఒద్దు అనొద్దు, నీకు నాకు పెళ్ళంటె,ఒంటరిగా ఉన్నాను,అమ్మమ్మో గుంటడు ) పాడారు.బంగారు కలలు లొ రెండు డ్యూయెట్లు (చెక్కిలి మీద కెంపులు, నీకన్నులలో నే చూశాను లే), ప్రేమలు పెళ్ళిళ్ళు లో అన్ని పాటలు (రెండు డ్యూయెట్లు, ఒక సోలో) పాడారు. అరోగ్య కారణాలలతో ఏ ఎన్నార్ సినిమాలు 75 లో ఏమీ సినిమాలు చేయలేదు. 76 లో సెక్రెటరీ(టీజింగు సాంగ్, డ్యూయేట్లు, సోలో) ,మహాత్ముడు(డ్యూయెట్లు, ప్రబోధగీతం)  సినిమాలో పాడారు.

77 లో సాంఘికచిత్రాలో ఒక్క ఆలుమగలు (ఒక్క రిద్దరుగ మారేది) లో ఒక్కపాట మినహా వేరే చిత్రాలో పాడలేదు.

78 లో రెండు రామకృష్ణులు సినిమాలో పాడిన ఐదు పాటల్లో ఒక్కటే డ్యూయెట్టు మిగతా నాలుగూ బాలూ తోనూ మిగతావారితోనూ కలిపి పాడినవే. ఏ ఎన్నార్ కి రామకృష్ణ ఆఖరి గా పాడినది “దేవదాసు మళ్ళీ పుట్టాడు “ లో నే. రామకృష్ణను బాగా ప్రోత్సహించిన ఎస్. రాజేశ్వరరావు ఈ సినిమాకు సంగీత దర్శకుడు. దేవదాసు సినిమాకు సీక్వెల్ (బహుశా భారతచలన చిత్ర పరిశ్రమలో తొలి సీక్వెల్ కావచ్చు) దాసరి ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. సంగీత పరంగా చిత్రం విజయవంతమే. మూడు డ్యూయెట్లు, ఒక అంతర్నాటకం, రెండు విషాద భరిత సోలోలు ..అన్నీ మంచి పాటలే, శ్రోతలకు చేరువైనవే.

ఈ చిత్రంతర్వాత, ఏ ఏన్నార్ నటించిన మల్టి స్టారర్ సినిమాల్లో కూడా రామకృష్ణ కు అవకాశం రాలేదు. హేమాహేమీలు సినిమాలో ఇద్దరు హీరో లకి కలిపిన ఒకపాట లో ఆనంద్ ఏ ఎన్నార్ కు ప్లే బాక్ పాడారు.

భక్తి పరమైన సినిమాలు

భక్త తుకారాం

తుకారాం (1608-1650) మహారాష్ట్ర కు చెందిన పాండురంగ విఠలుని భక్తుడు,వాగ్గేయకారుడు. ఈతని రచనా ప్రక్రియ ‘అభంగాలు’. తుకారాం కథ సినీ పరిశ్రమను ముందు నుంచీ ఆకర్షిస్తూనే ఉంది. 1936 లో మరాఠీ భాషలో  తుకారాం సినిమా వచ్చింది. తుకారాం గా తెలుగులోనూ వచ్చింది .1963 లో కన్నడంలో రాజ్ కుమార్ తుకారాం గా నటించిన చిత్రం విడుదలయ్యింది. అందులో పి.బి.శ్రినివాస్ రాజ్ కుమార్ కు నేపధ్య గానం చేశారు.

1973 లో అంజలీ పిక్చర్స్ పతాకం పై  సంగీత దర్శకుడు ఆదినారాయణరావు అంజలి దంపతులు  ఈ  సినిమా తెలుగులో నిర్మించారు . పాటలు వీటూరి,దాశరధి  రాశారు. ఘంటసాల ఐదు పాటలు (ఘనాఘన సుందరా, బలే బలే అందాలూ,చిందులు వేయకురా,ఉన్నావా అసలున్నావా, సరి సరి ) పాడారు. శాంతారాం సినిమా అమర్ భూపాలి లో ఘన శ్యామ సుందరా పాట ప్రభావం ఘనాఘన సుందరా పాటపై ఉంది. చిత్రీకరణలో కూడా ఆ చాయలు ఉంటాయి. ఘంటసాల అలభ్యత వల్ల మిగతా పాటలు రామకృష్ణ తో ట్రాక్ గా రికార్డ్ చేశారని తరవాత ఘంటసాల వాటిని విని వాటిని తిరిగిపాడాల్సిన అవసరంలేదన్నారని చెబుతారు. రామకృష్ణపాడిన పాటలు, అభంగాల ఆధారంగా దాశరధి  రాసిన గీతాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. శ్యామసుందరా ప్రేమ మందిరా,  పిలుపు వినగలేవా,కరుణామయా దేవా వంటి ఎనిమిది పాటలు రామకృష్ణ పాడారు.ఖండికలు గా పాడిన అభంగ అధారిత గీతాలను ఏ ఎన్నార్ పైనే కాక అవి ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోవడాన్ని వివిధ వ్యక్తులపై చిత్రీకరించారు.

మహాకవి క్షేత్రయ్య

కృష్ణా మండలానికి చెందిన మువ్వ గ్రామస్థుడు గా చెప్పబడె వరదయ్య కూడా వాగ్గేయ కారుడె. ఈతని కవితాప్రక్రియ “పదం “. ఎక్కువ పదాలు మువ్వ గోపాల మకుటంతో రచించాడు. ఈ రచనలు అభినయానికి అనువుగాఉన్న శృంగారభరిత పదాలు. ఈతని జన్మస్థలానికి చేరువగానున్న కూచిపూడి గ్రామంలో ప్రాచుర్యంలో ఉన్న కూచిపూడి నృత్యకారులు ఈ పడాలను వారి నర్తనంలో వాడుకున్నారు.వరదయ్య అనేక క్షేత్రాలను దర్శిస్తూ క్షేత్రయ్య గామారి తమిళ దేశంలో ఉన్న తెలుగు రాజుల ఆస్థానంలో కొంతకాలం ఉన్నడు. గోలకొండ పాదుషా ఆస్థానాన్నీ దర్శించాడు. నాలుగు వేలపైగా ఈయన రాసిన పదాలలో నాలుగు వందలలోపే లభ్యమౌతున్నయి.

ఈ తని కథను భక్తతుకారాం తరువాత అంజలీ దంపతులు నిర్మించారు. ఏ ఎన్నార్ ఆరోగ్యనిమిత్తం తీసుకున్న విరామం తరువాత ఈ చిత్రంలో నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడిగా ప్రారంభమైన చిత్రం ఆయన మరణం తర్వాత సి.ఎస్.రావు దర్శకత్వంలో పూర్తి అయ్యింది. తుకారాం జీవితంలో ఉన్నంత నాటకీయత వరదయ్య కథ లో లేదు.ఇది భక్తి రస ప్రధానమైన చిత్రమూ కాదు. క్షేత్రయ్య పద రచయితే కాని కావ్యాలు వంటివి రాసిన వాడు కాదు. రాసిన పదాలు అన్నమయ్య, రామదాసు ల్లా భక్తిపూరితాలూ కావు. వాణిజ్య పరంగా అనేక కారణాలవల్ల చిత్రంవిజయవంతం కాలేదు. అందువల్ల అద్భుతమైన ఈ చిత్ర సంగీతం ప్రజలకు అవ్వాల్సినంత చేరువ అకాలేదు.

నేపధ్య గాయకుడిగా రామకృష్ణకు ఈ చిత్రం మేలుబంతి. రేపల్లె లోని గోపాలుడంట, జాబిల్లి చూసేను నిన్ను నన్ను, చల్లగా నెలకొన వయ్యా వంటి పాటలు కాకుండా , రామకృష్ణ పాడిన క్షేత్రయ్య పదాలు ప్రత్యేకంగా ఎన్నదగ్గవి.

పదాలను స్వరబద్ధం చేయటానికి ఆరుద్ర, ఆదినారాయణరావు ఆంధ్ర దేశం లో అనేక ప్రాంతాలలో ఈ పదాలకు నర్తించే వారిని సంప్రదించారు. వి ఏ.కే రంగారావు గారి మాటల్లో “వి రామకృష్ణ పగిడీ లో కలికితురాయి అయిన ఆనంద భైరవి రాగ పదం ‘శ్రీపతి సుతు బారికి ‘, నాట్య సుందరి స్వప్న సుందరి పాడిన ‘చేడెరో నా సామికి’ పాటలు మణిపూసలు,ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం ఆ పాటలు ప్రజల ఆదరణనోచుకొనక పోవడానికి కొంత కారణం “.

rama1

మరో రెండు మనోరంజకమైన పదాలు  “ఎటువంటి మోహమో కాని ” “వదరక పోవే” రామకృష్ణ గొప్పగా గానంచేశారు. మొదటిది గోలకొండ పాదుషా కొలువులో భామ నృత్యంచేస్తుంటే క్షేత్రయ్య పాడుతాడు. రెండవది విజయరాఘవుని (మధుర) సంస్థానంలో క్షేత్రయ్య అభినయిస్తూ పాడుతాడు. వదరక పోవే పదం ఆఖరి పంక్తులు తాత్వికత తో కూడి అప్పటివరకు ఆ పదం పట్ల ఏర్పడుతున్న భావననూ ఆసాంతం వేరే వైపుకు తీసుకెళ్ళి పోతుంది. (ఈ పదం తోపోల్చదగిన ఒక హిందీ పాట మన్నడే గానం చేసింది ” లాగా చునిరీ మే దాగ్..చుపావూ కైసే….దీని ఆఖరి పంక్తులు ఓ దునియా మేరి బాబుల్ కా ఘర్ ఏ దునియా ససురాల్”). ఇదే పదం బాలమురళీకృష్ణ గానంచేసింది(సినిమాకు కాదు)లభ్యమౌతూ ఉంది. పోలిక కోసమని కాకుండా సినిమా సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి తేడాగమనించడానికి ఒక ఉదహరణగా రెంటినీ వినవచ్చు.

రామకృష్ణ మొత్తం పదిహేను పదాలు ఇందులో పాడాదు. ఇవి అచ్చ తెలుగు కవితాపదాలు, తెలుగు వారికి బాగా పరిచితమై, తమవి అనుకోదగిన వాద్యాలతో కూడి అద్భుతానుభవాన్ని కలగ జేస్తాయి.

 

చక్రధారి

కన్నడ రాజకుమార్ ప్రధాన పాత్రధారి గా భక్త కుంబార చిత్రం వచ్చింది. విజయవంతమైన ఆ చిత్రాన్ని ఎం ఆర్ అనూరాధాదేవి కి రాజ్ కుమార్ సూచించారు. ఆ చిత్రాన్నే చక్రధారి చిత్రంగా నిర్మించారు. ఛక్రధారి పేరుతోనే ఒకసారి, భక్త కుంబార పేరు తోనూ ఆ కథ అంతకుముందు సినిమా గా వచ్చింది.చక్రధారి గా వచ్చిన తమిళ సినిమాలో నాగయ్య కుంబార పాత్ర పోషించారు. కుంబార వృత్తి రీత్యా కుమ్మరి.విఠలుని భక్తుడు. మరాఠా ప్రాంతానికి చెందినవాడు. హరి కీర్తనా తన్మయత్వంలో కాళ్ళకింద తన బిడ్డ నలిగిపోతున్నా చూసుకోలేనివాడు. వ్రతభంగమయ్యిందని చేతులు ఖండించుకున్నవాడు. అశక్తుడైన తన కు హరే వచ్చి సేవలు చేస్తే ,హరి ని గుర్తించలేనందుకు తపించాడు.

అంతటి భక్తుని కథ జనరంజకంగా తీస్తే ప్రేక్షకుల శ్రోతల కళ్ళకు చెవులకు పండగే.

తెలుగు లో చక్రధారి కన్నడ భక్త కుంబార కు అణువణువునా రీమేక్కే. రెంటికి సంగీత దర్శకుడు జి.కె.వెంకటెష్. పాటల వరసలూ ఇంచుమించు ఒక్కటె. స్వతహాగా రాజ్ కుమార్ గాయకుడు. కొన్ని యేళ్ళగా తన పాటలు తానే పాడుకుంటున్నారు. కాని ఈ చిత్రం లో అన్ని పాటలు రాజ్ కుమార్ కు పి.బి.శ్రీనివాస్ పాడారు.తెలుగు లో ఆ పాటలన్నింటినీ అదే వరసలలో రామకృష్ణపాడారు. విఠలా విఠలా పాండురంగ విఠలా అనే ఒక్కపాట (కథానాయకునికి కాదు) కన్నడంలో బాలు పాడారు. తెలుగు లో అదే పాట గాయకుడు ఆనంద్ పాటగా రిలీజ్ అయ్యి బహుళ ప్రచుర్యంపొందింది. ఐతే సినిమా లో బాలు స్వరంతో సత్యనారాయణ పై చిత్రీకరించబడింది.

కన్నడంలో పాడిన పి.బి శ్రీనివాస్ పాటలు, తెలుగులో రామకృష్ణ పాటలూ అన్నీ కర్ణపేయాలే. మార్దవమైన,సాత్వికమైన, భక్తిభావనతో సాగే ఇరు స్వరాలూ సంగీతప్రియుల్ని అలరిస్తాయి.

తుకారాం,కుంభార్ పాత్రలు మరాఠీ ప్రాంతానికి చెందినవి. సినిమాలుగా అనేక పర్యాయాలు తెర పై వచ్చినవి. అందులోని పాటలు వేరే కవులతో రాయబడ్డవి. సంగీత పరంగా భక్త తుకారాం లో కొంత పాతచిత్రాల ప్రభావం ఉంది, చక్రధారి పూర్తిగా కన్నడచిత్ర సంగీతమే. ఈ రకంగా చూస్తే క్షేత్రయ్య కథాపరంగా, రచనల పరంగా, సంగీతపరంగా పూర్తి తెలుగు సినిమా.

ఏ ఎన్నార్ కు రామకృష్ణ పాడిన మిగతా సాంఘిక చిత్రాల పాటలతో పోలిస్తే ఈ మూడు సినిమాలలో పాటలు ఉన్నత శ్రేణికి చెందినవే.

 

ఎన్.టి.ఆర్ రామకృష్ణ

రామకృష్ణ ఎన్.టి.ఆర్ కు సాంఘిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు, చారిత్రత్మక చిత్రాలలో కలసి సుమారు 13 చిత్రాలలో పాడారు.

సాంఘిక చిత్రాలు:

ఎన్ టి ఆర్ కు రామకృష్ణ తొలిసారి ధనమా దైవమా చిత్రం లో పాటలు పాడారు. అ ది సంగీత దర్శకుడు టి.వి.రాజు కు ఆఖరి చిత్రం. ఓక శ్లోకం తో కలిపి ఐదు పాటలు ఆ సినిమా లో పాడారు. ఘంటసాలకొరకై స్వరబద్ధం చేయబడిన పాటలని అవి విన్నప్పుడు అనిపించేలానే పాటలు ఉంటాయి. చిత్రము, పాటలు కూడా హిట్ కాలేదు.

దిలీప్ కుమార్ హీరో గా నటించిన హిందీ సినిమా గోపి ఆధారంగా తెలుగులో వచ్చిన పల్లెటూరి చిన్నోడు సినిమాలో ఒక పాట(పల్లెటూరి చినావాడే) రామకృష్ణ పాడారు. ఈ సినిమానూ హిట్ కాలెదు. 75లో వచ్చిన రాముని మించిన రాముడు చిత్రంలో (ఎన్.టి.ఆర్ రెండు పాత్రల్లో ఒక పాత్రకు) ఒక పాట బాలు తో కలసి (‘అందరిదీ ఈ విజయం’) ఒక పాట పాడారు.76 లో రిలీజ్ ఐన మంచికి మరోపేరు సినిమా లొ అన్ని పాటలు పాడారు. ఆ సినిమా ఎన్.టి.ఆర్ తో సి.ఎస్.రావు కు ఆఖరి చిత్రం. అలాగే ఎస్.రాజేశ్వరరావు ఎన్.టి.ఆర్ కాంబినేషన్ కు కూడా అదే ఆఖరి చిత్రం. అప్పటి ట్రెండు కు తగ్గ్గట్టు లేని ఆ చిత్రం విజయవంతం కాలేదు.77 లో విడుదలైన మా ఇద్దరికథ చిత్రం (రెండు పాత్రలలో ఒక పాత్రకు) లో రెండు పాటలు పాడారు. ఈ చిత్రంకూడా విజయవంతం కాలేదు. మావారి మంచితనం (1979 దో అంజానే తెలుగు రూపం) లో ఒక పాట పాడారు. ఇదీ సక్సెస్ కాలేదు. రామకృష్ణ ఎన్.టీ.ఆర్ కు పాడిన మొదటి సినిమా ధనమా? దైవమా? చిత్రంలో ‘నాడు వైదేహీ పాటలో ఎన్.టి.ఆర్ మాటలు పాటలో ఉంటాయి. అదేవిధంగా ఎన్.టి.ఆర్ కు రామకృష్ణ సాంఘికచిత్రాలలో ఆఖరి పాట ‘మావారి మంచితనం’ లో ‘చెంచితా పాటలో కూడా రామకృష్ణ గొంతుతోపాటు ఎన్.టి.ఆర్ మాటలు కూడా వినిపిస్తాయి.

ఐతే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంఘిక చిత్రాలలో ఏ చిత్రంకూడా పెద్దగా విజయవంతం కాలేదు.

పౌరాణిక చిత్రాలు:

75 లో వచ్చిన మాయామశ్చీంద్ర సినిమాలో ఒక పాట( రారా రజనీకరా) రామకృష్ణ పాడారు. 77 వ సంవత్సరం జనవరి లో విడుదలైన దానవీర శూర కర్ణ సినిమాలో శ్రీ కృష్ణ పాత్రకు  రామకృష్ణ పాడిన తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయాలలో పద్యాలు ప్రజల మన్నన పొందాయి. ఈ పద్యాలు తెలుగులో అప్పటికి మూడు చిత్రాలలో ఉపయోగించారు. పూర్తిగా పద్యాలపైనే అధారపడి వచ్చిన చిత్రం ‘శ్రీకృష్ణ రాయబారం’  సినిమాలో అప్పటి ప్రముఖ గాయకులు, రంగస్థల గాయకులతో పద్యాలు పాడించారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లేరు. తర్వాత 67 లో వచ్చినె శ్రీ కృష్ణావతారం లో ఇవే పద్యాలు ఘంటసాల తో పాడించారు. మళ్ళీ శ్రీకృష్ణ సత్య సినిమాలో ఇవే పద్యాలు ఘంటసాల, ఎస్.పి. బాలు తో పాడించారు. రెండు సినిమాలలో ఇవి ఎన్.టి.ఆర్ పైనే చిత్రీకరించారు. దాన వీర శూర కర్ణ నిర్మించేటప్పుడు ఈ పద్యాలను వినియోగించుకోవాలని అవి పాడటానికి అప్పటి ప్రముఖ గాయకులు ,స్టేజి కళాకారులనూ ఎన్.టి.ఆర్ పరిశీలించారని, ఎస్. రాజేశ్వరరావు సలహా మేరకు రామకృష్ణను ప్రయత్నించి ఎన్.టి.ఆర్ తృప్తి చెందారని రామకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘ఎక్కడనుండి రాక ఇటకు’ పద్యంతో మొదలై ‘ఏ మూల దాగనే ఈ ధర్మ పన్నాలు’ వరకు పదిహేను పద్యాలు రామకృష్ణ పాడారు. ఈ పద్యాలు ఎన్.టి.ఆర్ తదితర నటుల సంభాషణలతో కలిపి రికార్డ్ గా విడుదలై ప్రజలకు చేరాయి. ( షణ్ముఖి ఆంజనేయరాజు పద్యాలు రికార్డ్గా విడుదలై  పొందినట్టి గుర్తింపు కర్ణలో ఈ పద్యాలు పొందాయి).

rama2

సినిమాలో వచ్చిన ఒక పద్యం ‘సంతోషమ్మున సంధిసేయుదురే ‘  రఘురామయ్య(శ్రీ కృష్ణ రాయబారం), ఘంటసాల (శ్రీకృష్ణావతారం), ఎస్.పి.బాలసుబ్రహ్మ ణ్యం (శ్రీకృష్ణ సత్య), రామకృష్ణ (దాన వీర శూర కర్ణ) నోట వినటం ఒక చిత్రమైన అనుభవం.

దాన వీర శూర కర్ణ చిత్రం విజయవంతం కావడానికి అనేక ఇతర కారణాలతో పాటు ఈ పద్యాలు కూడా కారణ మయ్యాయి. ఈ చిత్రం తర్వాత ఎన్.టి.ఆర్ రామకృష్ణకు తను తీసే ప్రతీ పౌరాణిక చిత్రంలోనూ అవకాశమిస్తానని మాట ఇచ్చారట (రామకృష్ణ ఇంటర్వ్యూ).  ఐతే కర్ణ చిత్రం వచ్చిన తర్వాత ఎన్.టి.ఆర్ పౌరాణికం ‘విరాటపర్వం’లో రామకృష్ణ పాటలు లేవు. తర్వాత వచ్చిన శ్రీ రామ పట్టాభిషేకం లో పాటలు రామకృష్ణ పాడారు. శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం లో  రమేష్,ఆనంద్ ల తొ కలిసి సుప్రభాతం  వరకూ రామకృష్ణ గానం చేసారు. తర్వాత చాలా రోజులతరువాత ఎన్.టి.ఆర్ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర (రవింద్ర జైన్ సంగీత దర్శకత్వం) లో రామకృష్ణ , నటుడు బాలకృష్ణ కు హరిశ్చంద్ర పాత్రకు కొన్ని పద్యాలు పాడారు. ఐతే ఇవి బహుళ ప్రచుర్యంలో ఉన్న బలిజేపల్లి, జాషువ పద్యాలు కాకపోవటం తో  సరైన గుర్తింపు రాలేదు. చిత్రం పరాజయం, చిత్రం పాటలతో విడుదలైన కేసెట్టు లో ఈ పద్యాలు లేకపోవడం కూడ దీనికి కారణం.

 

చారిత్రక చిత్రాలు

ఎన్.టి.ఆర్ చారిత్రక చిత్రాలు వేములవాడ భీమకవి (1976) లో ఒక పాట(అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను)  రామకృష్ణ పాడారు. వీరబ్రహ్మేంద్ర  స్వామి చరిత్ర(1984) లో బ్రహ్మంగారి తత్వాలు కొస రాజు రాయగా రామకృష్ణ పాడారు. చిత్రం పెద్ద విజయం సాధించింది. రామకృష్ణ పాడిన తత్వాలు ఇప్పటికి గ్రామ సీమల్లో మైకు సెట్ల లో వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్.టి.ఆర్ 94 లో నిర్మించిన శ్రీ నాథ కవి సార్వభౌమ చిత్రంలో రామకృష్ణ పాటలు లేవు.ఐతే ఈ సినిమా కోసం తన గానంతో ,పెండ్యాల స్వరకల్పనలో పద్యాలు రికార్డ్ చేశారని అవి సి.నారాయణరెడ్డి సమక్షంలో విని ఎన్.టి.ఆర్ చాలా ఇష్టపడ్డారని రామకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

(మిగతా వచ్చే వారం)

మీ మాటలు

  1. ముళ్ళపూడి సుబ్బారావు says:

    పై వ్యాసంలో భక్త తుకారాం పాటలలో “సరి సరి” పాటకు బదులు గా “పూజకు వేళాయెరా” ఉండాలి.నాదృష్టికి తెచ్చిన గొరుసు జగదీశ్వర రెడ్డి కి కృతజ్ఞతలు.

  2. డియర్ సుబ్బారావ్ గారు

    మీ వ్యాసం విశ్లేశణాత్మకమ్గా , ఉపయుక్తమైన సమాచారంతో చాలా బాగుంది.అభినందనలు.

    శివ (కలం పేరు)

    బి.వి.శివ ప్రసాద్

  3. ముళ్ళపూడి సుబ్బారావు says:

    ధన్యవాదాలు ప్రసాద్ గారు

  4. Rachamalla Upendar says:

    మీ వ్యాసం ఛాలా బాగుంది. అలనాటి సంగతులు కళ్ళకు కట్టినట్లు తెలిపారు.

  5. sreeram velamuri says:

    అధ్బుతమైన సమాచారం ఇచ్చారు సుబ్బారావు గారూ,అభినందనలు

  6. Thank u.subbarao gaaru…

Leave a Reply to sreeram velamuri Cancel reply

*