చావుపుటక లేనిదమ్మ నేస్తమన్నది…!

 

వంగూరి చిట్టెన్ రాజు

chitten raju“మామా” అని నన్ను అతనూ, “దాసూ” అని నేను అతన్నీ ఆత్మీయంగా సంబోధించుకోవడం 1970 కంటే ముందే ప్రారంభం అయి నలభై ఏళ్ల పైగానే కొనసాగింది. అప్పటికి అతను ఇంకా సినిమాలలో పాడ లేదు. ఆతని మేన మామ పి.ఆర్.కె. రావు అనే కిష్టప్ప, నేనూ బొంబాయి ఐ.ఐ.టి.లో క్లాస్ మేట్స్ మాత్రమే కాక అత్యంత సన్నిహితులం. ఆ కిష్టప్ప గాయని పి. సుశీల తమ్ముడు అని మా స్నేహం బాగా కుదురుకున్న ఆరు నెలల తరువాత ఏదో మాటల సందర్భంలో తెలిసింది. అతని పెద్దక్క రత్తక్క గారి అబ్బాయే ఈ రామకృష్ణ దాసు.

హైదరాబాదు వెళ్ళినప్పుడు రావుతో రత్తక్క, బావ గారు రంగ సాయి వాళ్ళింటికి వెళ్ళినపుడు మా కంటే కొంచెం చిన్నవాడే అయిన దాసు పరిచయం అయ్యాడు. ఆ క్షణం నుంచీ రావు తో పాటు నన్ను కూడా “మామా” అనే పిలవడం మొదలుపెట్టి మా కుటుంబంలో కలిసిపోయాడు. అప్పటికే ఘంటసాల బాణీ అలవాటు చేసుకుని, పునాదులు గట్టిపడడం కోసం శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నిజానికి అతని చెల్లెలు (పేరు మర్చిపోయాను) అచ్చు సుశీల గారి లా బాగా పాడేది. ఆ రోజుల్లో మరో మిత్రుడు టి.పి. కిషోర్ గాడి పెళ్ళికి నేనూ, రావూ, దాసూ మగ పెళ్లి వారి తరఫున ఏదో ఊరు వెళ్లాం. (మంచి రచయిత, నటుడు అయిన ఈ కిషోర్ పదిహేనేళ్ళ క్రితం హఠాత్తుగా పోయాడు). ఆ పెళ్ళిలో దాసు ఘంటసాల గారి “శేషశైలా వాస” తో మొదలుపెట్టి చాలా పాటలు హాయిగా పాడాడు. అది ఇప్పటికీ నాకు మరపురాని జ్ఞాపకమే!

ఆ తరువాతో, ముందో గుర్తు లేదు కానీ రావు పెళ్ళికి నేనూ, కిషోరు గాడూ మద్రాసు వెళ్లాం. మేనరికమే కాబట్టి ఆ పెళ్లి పి. సుశీల గారి ఇంట్లోనే జరిగింది. మే ఇద్దరం పెళ్లి కొడుకు స్నేహితులమే అయినా భయం, భయంగా కూచుంటే దాసు మమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు.

ఆ తరువాత ఘంటసాల గారు బతికున్న రోజులలోనే (1972 అనుకుంటాను) అతను సినిమాలలో పాడడం మొదలు పెట్టి “అపర ఘంట సాల” గా పేరు తెచ్చుకున్నాడు. “మా రామకృష్ణయ్య ఉన్నంత కాలం నా పాటని ఎవరూ మర్చిపోలేరు” అని ఘంటసాల వారే స్వయంగా అన్నారంటే రామకృష్ణ ప్రతిభ ఎంతటిదో తెలుస్తోంది. “ఘంటసాల గారు పోయినప్పుడు మొదటి దండ వేసిన వాణ్ణి నేనే” అని నాతో ఎంతో బాధపడుతూ చెప్పాడు దాసు ఒక సారి. ఘంటసాల గారి లాగానే రామకృష్ణ కూడా గొంతు కేన్సర్ తోటే మరణించాడంటే నమ్మబుద్ది కావడం లేదు.

playback_singer_0

అతను సినిమాలలో బాగా పేరు తెచ్చుకుని బిజీగా ఉంటున్నా, నేను ఎప్పుడైనా మద్రాసు వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళేవాడిని. ఆ విధంగా మా పరిచయం అడపా , తడపా చాలా ఏళ్ళే కొనసాగింది. 1989 లో హ్యూస్టన్ లో తానా కి ఫై.సుశీల తో రామకృష్ణ ప్రధాన గాయకుడి గా పూర్తి ఆర్కేష్ట్రా తో వచ్చాడు. నాకు తెలిసీ అదే అతను మొదటి సారి అమెరికా రావడం అప్పుడు “చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడా” తో కార్యక్రమం ప్రారంభించి సుశీల గారితో చాలా బాగా పాడాడు రామకృష్ణ. అప్పటి నుంచీ కాస్త రెగ్యులర్  టచ్ లోనే ఉండే వాళ్ళం. ఎప్పుడు అమెరికా వచ్చినా ఎక్కడి నుంచో ఫోన్ చేసే వాడు.

1998 లో అనుకుంటాను. ఓ రోజు దాసు నుంచి ఫోన్ వచ్చింది.”మామా, నేనూ నీ అభిమాన గాయకుడు దాసు ని” అనుకుంటూ.
ఎక్కడి నుంచి, దాసూ, అమెరికా లో ఉన్నావా” అని అడిగాను.” అవును మామా. డిట్రాయిట్ లో మన చెరుకూరి రమా దేవి గారి ఇంట్లో ఉన్నాను.” అన్నాడు. “ఎన్నాళ్లుంటావు. టూర్ మీద వచ్చావా?” అని అడిగాను. “అక్కడే కొంప ములిగింది మామా, అందుకే నిన్ను పిలుస్తున్నాను. నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం” అని అసలు సంగతి వివరించాడు.

అసలు ఏం జరిగింది అంటే తానా లో పాడడానికి అతన్ని ఒక మ్యూజిక్ ట్రూప్ వాళ్ళు ప్రధాన గాయకుడి గా తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం అయ్యాక అమెరికాలో ఇతర నగరాలలో కూడా జరిగే కార్యక్రమాలకి కూడా ఇతన్ని తీసుకెళ్ళాలి కానీ ఎందుకో రామకృష్ణ ని డ్రాప్ చేసి ఇండియా వెళ్ళిపో అన్నారుట. దానికి అసలు కారణం ఆ ట్రూప్ నాయకుడు కూడా పాటగాడే కాబట్టి ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులు మిగుల్చుకోవచ్చును కదా! “చచ్చేటంత ఖర్చు, శ్రమా పడి వచ్చాను మామా, నాలుగు ప్రోగ్రాములు కూడా చేసుకోకుండా వెనక్కి పోడం ఎలా?” అని దాసు నా సలహా అడిగాడు.” సరేలే, ముందు మా హ్యూస్టన్ వచ్చేసి మా ఇంట్లో ఉండు. ఎన్ని ప్రోగ్రాములు పెట్టించగలనో అప్పుడు చూద్దాం” అని రామకృష్ణ ని హ్యూస్టన్ ఆహ్వానించాను.

అప్పుడు మా ఇంట్లో మూడు నెలలు ఉండి, మా కుటుంబంలో ఒకడుగా, మా పిల్లలకి “రామకృష్ణ అంకుల్” గా స్థిరపడిపోయాడు రామకృష్ణ దాసు.  ఆ రోజుల్లో అతనికి మా ఊళ్లో ఉన్న ఔత్సాహిక గాయనీ మణులు మణి శాస్త్రి, శారద ఆకునూరి, ఉమా మంత్రవాది మొదలైన వారికి పరిచయం చేసి రక రకాల కారణాలతో టెక్సస్ లోనూ ఇతర చోట్లా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యగలిగాను. చంద్ర కాంత, డేవిడ్ కోర్ట్నీ లు ఎంతో సహకరించారు. వాటిల్లో ఓ చిన్న హౌస్ కాన్సెర్ట్ ఫోటో ఒక్కటే నా దగ్గర ఉంది. ఇందుతో జత పరుస్తున్న ఆ ఫోటోలో రామకృష్ణ కి తబలా సహకారం అందిస్తున్నది రఘు చక్రవర్తి.  ఆ మూడు నెలల సహవాసం లోనూ రామకృష్ణ ఎన్నెన్నో సినిమా సంగతులు నాతో పంచుకునే వాడు.

V. Ramakrsihna

కానీ ఎన్నడూ అతని నోట తప్పుడు మాటలు విన లేదు. “దాన, వీర, శూర కర్ణ” సినిమాలో పాడినప్పుడు ఎన్టీ ఆర్ తో అనుభవాలు, ఎస్. రాజేశ్వర రావు గారి తో మహా బలిపురం పిక్నిక్ వివరాలు మొదలైనవి మంచి రసవత్తరంగా వివరించే వాడు..తను కూడా మళ్ళీ , మళ్ళీ ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ. ఒక సారి రామకృష్ణ నీ, ముత్యాల పద్మశ్రీ , సుప్రసిద్ద గాయని అవసరాల అనసూయ గారిని నేను అప్రస్తుత ప్రసంగం చేసిన నాగఫణి శర్మ గారి అష్టావధానం కార్యక్రమానికి డాలస్ తీసుకెళ్ళాను. ఆ మూడు గంటలూ రామకృష్ణ’ ఓపికగా కూచుని “మామా, ఈ ఒక్క రోజునే చాలా తెలుగు నేర్చేసుకున్నాను. అష్టావధానం గురించి వినడమే కానీ చూడ్డం ఇదే మొదటి సారి. ఇంకా నయం. నన్ను ఆ పైన కుర్చీలో పృచ్చకుడిగా  కూచోబెట్టావు కాదు. కొంప ములిగిపోవును.” అన్నాడు నవ్వుతూ. అంత సింపుల్ మనిషి అతను. మొత్తానికి ఆ మూడు నెలలూ అయ్యాక, ప్రోగ్రాములు పూర్తి చేసుకుని ఇండియా వెళ్తున్నప్పుడు “ఏం దాసూ, ఇప్పుడు పరవా లేదా, నాలుగు రాళ్ళు సంపాదించుకున్నావా?” అని నేను అడగగానే “పరవా లేదు మామా, మా ఇంట్లో ఓ కిటికీకి నీ పేరు పెట్టుకుంటాను” అన్నాడు. ఆ రోజుల్లోనే అనుకుంటాను దాసు కొత్త ఇల్లు హైదరాబాదు లో కట్టుకున్నది. అందుకే ఆ చమత్కారం.

ఆ తరువాత మేము ఒక సారి ఇండియా వెళ్ళినప్పుడు మా అబ్బాయి, అమ్మయిలు “రామకృష్ణ అంకుల్ ని చూద్దామ్” అనగానే వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్లి, భార్య జ్యోతి ని, కొడుకు హీరో సాయి కిరణ్ నీ కూడా కలిశాం. అప్పుడు త్యాగరాజ గాన సభలో మా అమ్మాయిలు చేసిన కూచిపూడి కార్యక్రమానికి దాసు నెల్లూరు లో ప్రోగ్రాం ఉండి రాలేక పోయాడు కానీ జ్యోతి, సాయి కిరణ్ వచ్చారు.

ఈ మధ్య ఫేస్ బుక్ వచ్చాక మరి కాస్త రెగ్యులర్ గానే మాట్లాడుకుంటున్నాం కానీ రామకృష్ణ అనారోగ్యం సంగతి గురించి తెలియ లేదు. “మాంచి అమెరికా టూర్ పెట్టించు మామా” అన్నది ఆ మధ్య అతని ఆఖరి కోరిక. ఆ కోరిక తీరకుండానే నా అభిమాన గాయకుడు, చిరకాల మిత్రుడు రామకృష్ణ దాసు వెనక్కి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.

*

మీ మాటలు

  1. Krishna Keerty says:

    చాలా బాధా కరమైన విషయం. ఉన్న అతి కొద్ది మంది మంచి గాయకులలో ఒకరు మన కిక లేరు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను.

  2. Ramesh Kalapatapu says:

    We lost a legendary singer…..

  3. శివ శివ శంకర పాటతోనే వంశధార నది శ్రీముఖలింగం క్షేత్రం మా ప్రాంతం వారికి గుర్తుకు వస్తాయి అంతటి మహత్తరమైన పాట భక్త కన్నప్ప లో పాడిన రామకృష్ణ ధన్యుడు .

    యర్నాగుల సుధాకరరావు
    సీనియర్ జర్నలిస్ట్ మరియు ఫిక్షన్ రైటర్
    9985265313

  4. ఓలేటి వెంకట సుబ్బారావు says:

    ఆప్తులు శ్రీ చిట్టెంరాజు గారికి- మీ వ్యాసం మన రామకృష్ణ స్మృతికి అద్భుతమయిన నివాళి . అందులో మీరు పంచుకున్న మీ జ్ఞాపకాలను స్పృశిస్తే – నా కళ్ళు చెమరుస్తున్నాయి . రామకృష్ణ చూపే ఆత్మీయత ను మళ్ళీ జ్యోతి , సాయీ కిరణ్ , లత మాటలలో గమనించవచ్చును – ఆ కుటుంబం తో ఏర్పరచుకున్న అనుబంధం , ఆత్మీయత అనుభవైకవేద్యం . ఘంటసాల పాట లాగే, రామకృష్ణ వినయము, వాత్సల్యము , స్నేహశీలత , గానమాధుర్యము అజరామరాలు , .

  5. Y.V.Ramana says:

    ఘంటసాల diabetes చికిత్స కోసం నాటుమందులు వాడిన కారణంగా వచ్చిన complications వల్ల మరణించారు – throat cancer తో కాదు.

  6. ఓలేటి శ్రీనివాసభాను says:

    డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాల్నీ, సినిమాపాటల్నీ విపరీతంగా ఇష్టపడే దశలో ఆయన పాట పరిచయమయింది .హృదయానికి దగ్గరగా వస్తున్నవేళ అది క్రమంగా తెర మరుగవ్వడం, ఇప్పుడు పూర్తిగా కనుమరుగవ్వడం చాలా బాధాకరం హృదయానికి హత్తుకునేలాగా రాశారు. నిజం చెప్పాలంటే నిన్న (16-7-2015) రోజంతా మనసెందుకో బరువుగా తోచింది . రామకృష్ణగారి ఇంటర్వ్యూలు చూస్తూ గడిపెను . ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను .

  7. ఓలేటి శ్రీనివాసభాను says:

    హృదయానికి హత్తుకునేలాగా రాశారు. నిజం చెప్పాలంటే నిన్న (16-7-2015) రోజంతా మనసెందుకో బరువుగా తోచింది . రామకృష్ణగారి ఇంటర్వ్యూలు చూస్తూ గడిపెను . సినిమాల్నీ, సినిమా పాటల్నీ విపరీతంగా అభిమానించే ఆ తొలి నాటి (డిగ్రీ చదువుతున్న )రోజుల్లో ఆయన పాట పరిచయమై, హృదయానికి దగ్గరగా వస్తూ , కారణాంతరాల వల్ల తెరమరుగయితే, ఇప్పుడు ఏకంగా మనిషే కనుమరుగు కావడం బాధాకరం.

  8. గాయకుడు రామకృష్ణ గారితో మీ జ్ఞాపకాలను హృద్యంగా రాశారు. ఆయన పాటలు ప్రసారం చేస్తూ రేడియోలో ‘రామకృష్ణ దాసు’ అని ప్రకటించేవారనుకుంటాను.

    రామకృష్ణ గొంతులో తెలియని మాధుర్యం ఉంటుంది. భక్త తుకారంలో ‘పాండురంగనామం’ పాట ఎంత శ్రావ్యంగా ఉంటుందో! కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఓ మిత్రుడితో కలిసి వెళ్ళి కలిసినపుడు ఈ పాట సంగతే ప్రస్తావించాను. ఆప్యాయంగా మాట్లాడారు.

    ఆయన మధురగీతాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ముత్యాల ముగ్గులోని ‘ఏదో ఏదో అన్నది’ , కన్నవారి కలలు సినిమాలోని ‘మధువొలకబోసే..’ , అందాల రాముడులోని ‘కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా..’ మొదలైన పాటలు ఎప్పటికీ మరపురావు. ఘంటసాల తర్వాత పద్యాలను ఆకట్టుకునేలా పాడిన నేపథ్య గాయకుంటే చప్పున రామకృష్ణ పేరు గుర్తొస్తుంది.

  9. Dr Duggaraju Srinivasa Rao says:

    సారంగ లో గాయకుడూ రామకృష్ణ గురున్చ్గి బాగా రాసారు . సారంగ గురుంచి నాకు ఇప్పుడే తెలిసింది. ఇక ముందు చదువుతాను.

  10. Satyanandam Kolluri says:

    Thanks for the informative and touching note. Yesterday and today I felt so sorry while listening / reading about the great singer Ramakrishna Garu. May his soul rest in peace.

  11. Ramesh tuniki says:

    వే అరె దీప్ల్య్ మౌర్నింగ్ అబౌట్ ఔర్ ఎవర్గ్రీన్ సింగర్ రామకృష్ణ సర్,మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ pEAce

  12. కె.కె. రామయ్య says:

    గాన కోకిల పి. సుశీలకు కొడుకు వరుసైన, ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి శిష్యుడైన వి.రామకృష్ణ (విస్వంరాజు రామకృష్ణ ) తొలిచిత్రం విచిత్ర బంధం తో ( 1972 ‘చిక్కావు చేతిలో చిలకమ్మా, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ’ ) ఘంటసాల గాయక వారసుడొచ్చాడనిపించాడు. ఘంటసాల తరువాత ఆయన గొంతులా ఉండే రామకృష్ణ పాటలు, ఆకట్టుకునేలా పాడిన పద్యాలు ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి. ‘అల్లూరి సీతారామరాజు’లోని ‘తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా’ పాటను వాళ్లిద్దరూ కలిసి పాడారు.

    భక్తతుకారం (ఘనా ఘన సుందరా, పిలుపు వినగలేవా ), భక్త కన్నప్ప (శివ శివ శంకరా), దానవీరశూర కర్ణ, వీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర, (శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ), మహాకవి క్షేత్రయ్య (చల్లగా నెలకొనవయ్యా తిల్ల గోవిందరాజా , జాబిలీ చూసేను నిన్ను నన్నుఓలమ్మా నాకెంతో సిగ్గాయే), ‘తాత మనవడు’ (అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం), శారద (శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ ), కృష్ణవేణి (కృష్ణవేణి తెలుగింటి విరిబోణి ), ముత్యాల ముగ్గు ( ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు ), అందాలరాముడు (ఎదగడాని కెందుకురా తొందరా), కన్నవారి కలలు (‘మధువొలకబోసే నీ చిలిపి కళ్లు’), అమరదీపం, బలిపీఠం (చందమామ రావె జాబిల్లి రావె ) వంటి ఎన్నో చిత్రాల్లో ( రెండు వంద చిత్రాలకు ఐదువేలకు పైగా పాటలతో ) తన సుమధుర గాత్రంతో ప్రేక్షకుల మదిని ఓలలాడించిన రామకృష్ణ కు సినీ ఇండస్ట్రీలో ఉండే రాజకీయాల వల్ల టేలెంట్ కు తగిన అవకాశాలు రాలేదనే చెప్పాలి.

    సినీ గాయకుడు రామకృష్ణ స్మృతికి అద్భుతమైన నివాళి వ్యాసం రాసిన వంగూరి చిట్టెన్ రాజు గారికి ధన్యవాదాలు.

  13. Chada v sastry says:

    ఏమిటో మేము యువకులగా ఉన్నప్పుడు ఆనందం పంచి ఇచ్చిన ఒక్కొక్కరూ ఇలా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది.
    నేను 70-80లలో పార్వతీపురంలో చదువుకున్నప్పుడు పాటల వినాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది. రోజులో ఏదో మధ్యాహ్నం ఒక సారి రాత్రి ఒక సారి విశాఖ ఆకాశవాణి లో అరగంట ప్రోగ్రాంలు వచ్చేవి. వాటిలో కూడా కొత్త పాటలు వేసేవారు కాదు.
    ఆ రోజుల్లోనే కన్నవారికలలు శోభన్ గారి సినీమా రిలీజ్. నేను కృష్ణ అభిమానిని నా స్నేహితుడు శోభన్ అభిమాని. ఈ సినీమాలో పాటలు చాలా బాగున్నాయని విశాఖలో సినీమా చూసి వచ్చిన స్నేహితులు చెప్పారు. మా వాడు ఎలాగైనా ఈ పాటలు వినాలని అనుకొని మా స్నహితులం అంతా చందాలు వేసుకొని LP రికార్డు కొని పద్మశ్రీ ధియేటర్ బండి వాడికి డబ్బులు ఇచ్చి వేయించుకొని విన్నాం. రామకృష్ణ గారు ఆ సినీమాలో పాడిన పాటలన్నీ అద్భుతం. మధువొలక బోసే, ఒక నాటిమాట కాదు లాటి పాటలు ఎన్న సార్లు విన్నామో లెక్కలేదు..రామకృష్ణ గారు అంతటి ఆనందాల్ని అనుభుతులను పంచారు.వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుతూ…

  14. D G Ramarao says:

    మీ వ్యాసం చాలా బాగుంది ఎక్కడో ఉన్న మీరు రామక్రిష్ణ తో అంత పరిచయము కలిగి ఉండటమూ, ఆయన్ను గూర్చి
    ఆత్మీయంగా వ్రాయడం ముదావహం. రామకృష్ణ గారిది చాలా గంభీరమైన, బరువైన గాత్రం ఘంటసాలగారి కంఠం
    అంత లోతు, మాధుర్యం కలది. ఆయన అంతగా పేరు సంపాదించకపోడానికి కారణం, ఆయన కంఠంలో అపశ్రుతి ఉంది.
    అది ఆయన జయించ లేకపోయారు ఛివరి వరకు ఆలోపం అలానే ఉంది. సంగీతంలో ప్రవేశమున్నవారు లోపం వంటనే
    గుర్తిస్తారు లేకపోతే ఆయన ఘంటసాల వారసుడైయేవాడు.

    తణుకు దేవరకొండ గంగాధరరామారావు

  15. మీ నివాళి హృద్యంగా ఉంది సర్. ఆయన పాడిన పాటలు మర్చిపోలేనివి. ఆయన్ని ఒక పాడుతా తీయగా ప్రోగ్రాంలో చూసినప్పుడే ఎందుకో తెలియకుండానే మనసు బరువైపోయింది. అయ్యో పాటలు పాడలేకపోతున్నారే అనే బాధ వల్లేమో తెలియదు. ఆయన పాడిన “ఏదో ఏదో అన్నది” పాట (నాకు చాలా ఇష్టమైన పాట) నిన్నటి వరకూ ఎన్ని సార్లు విన్నానో వార్త తెలిసినప్పటినుండీ… ఆయనకి నమస్సుమాంజలులు :(

  16. laxmi.ps says:

    ఎన్నో అయన గురించి తెలియని విశేషాలు బాగా చెప్పారు సర్ , ఒక మంచి గాయకుడిని మనదేశం కోల్పోయింది. ఆయనకి త్రోట్ కెన్సరన్నమాట చాలా బాధ కలించింది . అశ్రు తర్పణ నివాళి ఇస్తూ mugistunnAnu

  17. గాత్రం తాలూకు ఆనవాళ్ళు శాశ్వతం కనుక అందునున్న మాధ్యుర్యాన్ని పంచిన వారి ఉనికి అందుకున్న వారి నిర్వచనం తో చిరకాలం నిలుస్తుంది. మీ నివాళి ప్రత్యేకం గా చెప్పుకునే తీరులో ఉంది. దేహపు అంతిమ స్థితి లో ఆవేదన లేని వారు ధన్యులు. నెనర్లు.

  18. వాసుదేవ్ says:

    నిజంగానే ఓ కళాకారుణ్ణి మిస్సవ్వటం అంటే ఏంటో తెలిసొచ్చే నిజం రామకృష్ణ గారి లోటు….ఎక్కడో చెమ్మని వెతుక్కునేలా ఉంది రాజుగారు మీ వ్యాసం. మీ జ్ఞాపకాల స్పర్శ.

మీ మాటలు

*