తడి ఆరని ఉత్తరాలు

మధు పెమ్మరాజు

 

madhu_picగోడపై ఉన్న డెకరేషన్ ఫ్రేములో “A picture is worth a thousand words” అనే కొటేషన్ ఏళ్ళుగా చూస్తున్నాను, చదివిన ప్రతీసారి భలే గొప్ప భావనని అనిపించేది. తాతయ్య మాష్టారి మొదటి ఉత్తరం చదివాకా ఆ అభిప్రాయం శాశ్వతంగా చెరిగిపోయింది. ఆర్ద్రత నిండిన మనిషి కలం పడితే జాలువారేవి అక్షరాలు కావు.. తడి, తడిగా తాకే పద చిత్రాలు- మట్టి మనుషులు, దుమ్ము రేగుతున్న వీధులు, చీమిడి ముక్కు బడి పిల్లలు, నేలకొరిగిన సైనికుడు…అందుకేనేమో ఈ మధ్యన డెకరేషన్ ఫ్రేములో “A letter is worth countless pictures’ అని కనిపిస్తోంది.

వియత్నాం అంతర్గత సమస్యపై అమెరికా జోక్యాన్ని ఇతర దేశాలతో పాటు, అమెరికా వాసులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న రోజలు. ఆ సమయంలో మాష్టారు బోస్టన్ యునివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా పని చేసేవారు. స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రజాస్వామ్యం అంటూ ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా ద్వంద్వ వైఖరికి నిరసనగా విద్యార్థి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు, ఆ అధ్యాయం మాష్టారు గమనాన్ని మలుపు తిప్పిన మైలురాయి.

పల్లె జీవుల కష్టాలను కడ తీర్చడానికి వినోబా చేసిన కృషి మాష్టారుని ప్రభావితం చేసింది, వారి స్పూర్తితో మాతృదేశం తిరిగివచ్చి వెనుకబడ్డ ప్రాంతాల స్థితి గతులను అర్ధం చేసుకుందుకు రెండేళ్ళ పాటు దేశమంతటా కాలినడకన తిరిగారు. సమస్యల పట్ల అవగాహన ఏర్పడ్డాకా ఓ మారుమూల ప్రాంతంలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ రోజు నుండి విద్య, ఆర్ధిక ప్రతిపత్తి, పౌర హక్కులు వంటి ఎన్నో మౌలికమైన అంశాలపై ప్రజా పోరాటాలు శాంతియుతంగా జరిపి పీడిత వర్గాలను గెలిపింఛి, ‘ఆంధ్ర గాంధీ’ గా పేరు పొందారు.

ఒకసారి “మాష్టారు! ఈ ఏడాది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి, ఎలా తట్టుకుంటున్నారు?” అని యధాలాపంగా అడిగాను.

“బయట కొత్త తార్రోడ్డు వేస్తున్నారు. కొన్ని వారాలుగా కూలివాళ్ళు మండుటెండలో ఆగకుండా పని చేస్తున్నారు, ఫ్యాన్ కింద కూర్చుని వాళ్ళని చూస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టు ఉంది. లేచి కాస్త మంచి నీళ్ళు ఇవ్వడమో, కాసిన్ని కాలక్షేపం కబుర్లు చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. రోజు, రోజుకీ ఆ కాంట్రాక్టర్ మీద కోపం పెరిగిపోతోంది, కనికరం లేకుండా రక్తం మరిగే ఎండలో ఎలా పని చేయిస్తున్నాడో?…..కాస్త ఎండ తగ్గాకా లైట్లు పెట్టి పని చేయించచ్చు కదా? ఇలా కొనసాగితే పాపం ఏ వడదెబ్బో తగిలి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రభుత్వం కాస్త పూనుకుని ఇలాంటివి జరగకుండా లేబర్ లా మార్చాలి” అని జవాబిచ్చారు.

‘కూలివాడి ఎండ’ అనే పొసగని పదాలని మొదటిసారి విన్నాను. ఆ మొహం లేని మనుషులు రోడ్డు మరమత్తు చేస్తుంటే ఎన్నో సార్లు చూసాను, రద్దీలో నా సమయం వ్యర్ధమయిందని తిట్టుకుంటూ చూసాను. కొత్త తార్రోడ్డు పక్కన కూడా చూసాను, నున్నటి నల్లదనాన్ని తాకిన మత్తులో పడి పట్టించుకోలేదు. అయినా కనిపించని మొహాలని పట్టి, పట్టి పోల్చుకోవాలనే తాపత్రయం, తీరిక నాకు లేవు. నేను మెట్లెక్కే తొందరలో ఉన్నాను, దూరాలు దాటాలనే ఆత్రుతతో ఉన్నాను. కూలివాడికి ఎండా.. వానా తేడా తెలుస్తుందా? దుమ్ములో పుట్టి, ధూళిలో తిరిగి మట్టిలో కరిగిపోయే వారి కోసం వృధా ఆలోచనలు ఎందుకని సమర్ధించుకున్నాను.

నా కళ్ళకి ఎదురుగా కిట, కిట కిటికీలు – సూటు, స్టెతస్కోప్, నల్ల కోటు వేసుకున్నవాడు చూపులకి చిక్కుతాడు, ఆ పక్కనే పనిచేస్తున్న కూలివాడు కనబడడు. పనిని బట్టి మనిషి విలువని అంచనా కట్టే వారికి ‘కూలివాడి ఎండ’ అత్యవసరమైన పదం. మాష్టారు ఉత్తరాలు మరుగున పడిన మానవీయ విలువలు వెలికి తీసి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకునేలా చేస్తాయి.

నేను ఈ రోజు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఏ సంబంధం లేని ఈ ఊరుకి నలభై ఏళ్ళ క్రితం చేరుకున్నాను. ఒకసారి డిగ్రీ కాలేజీలో ప్రసంగించడానికి వెళ్ళినపుడు శేఖర్ పరిచయమయ్యాడు. అతనిది మగ దిక్కులేని పెద్ద, పేద కుటుంబం.

శేఖర్ డిగ్రీ పూర్తి కాగానే పట్టుదలగా చదివి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకు ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు నుండి కుటుంబ బరువు బాధ్యతలు ఇష్టంగా స్వీకరించాడు. ప్రమోషన్ అవకాశాలు ఎన్నొచ్చినా అన్నీ వద్దనుకుని ఉన్న ఊళ్లో క్లర్కుగా ఉండిపోయాడు. ఏడాది క్రితం ఆరోగ్యం బాగోలేదని డాక్టర్కి చూపించుకుంటే కాన్సర్ అని తేలింది. క్రమం, క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఈ నెల 18వ తారీఖున చనిపోయాడు. శేఖర్ మరణం నన్ను బాగా కృంగదీసింది. ఈ ఊరు వచ్చిన రోజు నుండి శేఖర్ నాకు కొండంత అండగా ఉండేవాడు. బాలబడి ప్రాజెక్టులు ముందుండి నడిపించేవాడు, రిక్షా కాలనీ పిల్లలకి పాఠాలు చెప్పడం, శోధన కార్యకలాపాలు చూసుకోవడం తప్ప వేరే జీవితం లేకుండా గడిపాడు.

శేఖర్ సంస్మరణార్ధం మొన్న ఆదివారం ఒక సభ ఏర్పాటు చేసాము, దాని తాలుకు ఫోటోలు నీకు పంపుతున్నాను.

పెరిగిన వేగం నైతిక విలువలని తిరగరాసింది. అవకాశాలు అందిపుచ్చుకుని అంచలంచలుగా ఎదిగేవాడు సమర్ధుడు. బంధాలకి, సమాజ బాధ్యతలకి కట్టుబడేవాడు చేతకానివాడు. అంతా రాచమార్గంపై అప్రమత్తంగా నడుస్తుంటే, అదే చూరుని వేళ్ళాడిన శేఖర్ ప్రాక్టికల్ మనిషి కాదు, అర్ధం లేని ఆశయాలకి ఉదాహరణ.

ఫోటోలలో జనసందోహాన్ని చూస్తుంటే శేఖర్ ఓడిపోయిన మనిషిలా అనిపించలేదు, గెలుపు, ఓటములకి దూరంగా అందనంత ఎత్తులో ఎగురుతున్న విహంగంలా అనిపించాడు. వయసు మనిషి జీవితానికి కొలమానం కాదు. సార్ధకతతో జీవించే మనిషి, ప్రతి క్షణం నూరేళ్ళు జీవించినట్లే! శేఖర్ విద్యార్థులలో ఒక శాతం మంది అతని స్ఫూర్తి పొందినా అతను ఆశించిన లక్ష్యం చేరుకున్నట్లే…

క్రితం సారి నువ్వు, నాన్నగారు చాకలిపేట బాలబడికి వచ్చారు గుర్తుందా? అప్పట్లో అది పాకలో ఉండేది, మొన్నీ మధ్యనే కొత్త బిల్డింగ్లోకి మారింది. రాబోయే ఆగష్టు 15 పండుగ కొత్త బడిలో జరుపుకుంటాము. నువ్వు, నాన్నగారు తప్పకుండా రావాలి.

నిరుపేద పిల్లలకి చదువు పట్ల ఆసక్తిని పెంచాలి, కూలి పనులు చేసుకునే తల్లి, తండ్రులకి భారం కాకుండా పౌష్టిక ఆహారం అందించాలి, డ్రాప్ ఔట్లు తగ్గించాలి అనే ఆశయంతో ‘బాలబడి’ని రూపుదిద్దారు. సహజ అభ్యాసన వాతావరణంలో, ఉత్తేజపరిచే ఆటపాటల ఆదర్శ విద్యా విధానంగా దేశమంతటా మన్ననలు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం శోధన సంస్థ ఆధ్వర్యంలో 18 జిల్లాలలో బాలబడులను విజయవంతంగా నిర్వహిస్తోంది.

మాష్టారు మితబాషి, మాట్లాడినా పెద్దగా హావభావాలు చూపించరు. బాలబడి పాక నుండి సిమెంట్ గదిలో స్థిరపడిందనే వార్త పంచుకునేటపుడు మాత్రం చిన్న పిల్లల ఉత్సాహం చూపిస్తారు. వారి నేతృత్వంలో ఎన్నో పాకలు, ఆశయాలు స్థిరత్వాన్ని పొందాయి. ఉక్కు సంకల్పం గల వారి మనసులు వెన్నలా సున్నితంగా ఉంటాయని ఎక్కడో చదివాను, మాష్టారులో ఆ గుణాన్ని ప్రత్యక్షంగా చూసాను.

నీకు కధలంటే ఇష్టం కదూ.. మొన్న రాజేష్ సొంత దస్తూరీతో ఒక కధ పంపాడు, అది నీకు పంపుతున్నాను, వీలున్నపుడు చదువు. అసలు రాజేష్ ఎవరో చెప్పనేలేదు కదూ? రాజేష్ IIT మద్రాస్లో ఇంజనీరింగ్ చేసాడు. కాలేజీ రోజుల నుండి ఆహార భద్రత అనే అంశం అతన్ని తొలుస్తూ ఉండేది. ఎప్పుడు మాట్లాడినా అదే అంశంపై సుదీర్ఘంగా చర్చించేవాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధికి వ్యవసాయం, పర్యావరణం లాంటి సంబంధంలేని విషయాల పట్ల ఆసక్తి ఎలా కలిగిందా అని?

ప్రపంచంలో బీడుగా మారుతున్న నేల నిముష, నిముషానికి పెరిగిపోతోంది. మరో వైపు జనాభా పెరుగుదల, ఆహార అవసరాలు అదుపు తప్పాయి. ఇదొక విపత్కర పరిస్థితి!!. ఎవరో ఒకరు పూనుకోకపోతే పరిస్థితి చేజారిపోతుందనేవాడు. ఈ జటిలమైన సమస్యలను అధిగమించాలంటే రెండే రెండు మార్గాలు – అడవులను చదును చెయ్యడం లేక బీడు భూములని సేద్యానికి పనికొచ్చేలా చెయ్యడం. రెండవ, మెరుగైన మార్గాన్ని తన జీవితాశయంగా మార్చుకుని ఉన్నత చదువులు, అమెరికా ఉద్యోగావకాశాలు వద్దనుకుని, పెళ్లి మానుకుని కర్ణాటకలోని మారు మూల బీడు ప్రాంతాలలో ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. పనికిరాని నేలని పచ్చగా మార్చి హరిత విప్లవం సాధించాడు.

మేధావులు ప్రపంచానికి చాలా అవసరం. వారి తెలివి తేటలు మారు మూల ప్రాంతాలకి కుదువ పెడితే మనం రెండు రకాల నష్టాలు చూడవలసివస్తుంది- వారు ఎదగరు, దేశాన్ని ముందుకి నడపరు. అంతగా సహాయం చెయ్యాలంటే విరాళాలు రూపంలోనో, సలహాలు రూపంలోనో పరోక్షంగా సహాయం చెయ్యొచ్చు కదా?

దేశాన్ని పీడిస్తున్న సమస్యలు నిత్య యవ్వనంతో, నవనవలాడుతూ ఉంటాయి. చాలా మటుకు ప్రజలు శాంతి కాముకులు వార్తా పత్రికలలో మొహం దాచుకుంటారు తప్ప సమస్యల జోలికి రారు. కొందరు మేధావులు వాటిని విడమర్చి, విశ్లేషించి, విభేదించి తమ తర్కాన్ని, పరిజ్ఞానాన్ని పది మందికి ప్రదర్శిస్తూ ఉంటారు, వారికి సమస్య ఒక ఆట వస్తువు. భావుకత, విప్లవ భావాలు కలగలిసిన బహు కొద్దిమంది పట్టు వదలక కవితో, వ్యాసమో రాసి, అది పత్రికలో అచ్చు పడగానే తమ బాధ్యత తీరిందని చేతులు దులుపుకుంటారు. ఎక్కడో రాజేష్ లాంటి వారు తమ జీవితాలని ఇంధనంగా మార్చి సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. వారు రాతల కంటే, మాటల కంటే, చేతలని నమ్ముకుని అహర్నిశలు నిశ్సబ్దంగా శ్రమిస్తూ ఉంటారు. అసలు వారి వల్లే ప్రకృతిలో ఇంకా పచ్చదనం మిగిలి ఉందేమో?

మాష్టారు! నెల జీతం చేతికి రాకపోతే వణికిపోతాను. మీరు అంత మంచి ఉద్యోగం, విదేశీ అవకాశం తేలిగ్గా ఎలా వదిలేసారు? మీరు జీవితాన్ని పేద ప్రజలకి అంకితం చెయ్యడం చాలా గొప్ప విషయం

ఒక మనిషి పుట్టి పెరుగుతున్నపుడు కొన్ని ముఖ్య సంఘటనలు ఆ వ్యక్తి గమనాన్ని నిర్దేశిస్తుంటాయి. ఆ సంఘటనలను మానవాతీత శక్తి నిర్దేశిస్తుందేమో? ఆ సంఘటనలు జరగకపోతే అ జీవి ప్రయాణంలో విచిత్ర మలుపులు వచ్చేవి కావేమో? ఈ ప్రశ్నలకి నాకు జవాబులు ఇంకా దొరకలేదు.

మనిషి తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తన పరిమితమైన ఆలోచనా పరిధిలో తీసుకోవడం సరైన విషయం కాదేమో అనిపిస్తుంది. అతని స్పృహలోకి రాని అంతర్గత ఎరుకకి అవకాశం ఇవ్వాలెమో? అలా జరిగితే ఒక శుభోదయాన సూర్యుడు కొత్త వెలుగుతో కనిపిస్తాడు. ఆ వెలుగులో తన పాత జీవితాన్ని పక్కన పెట్టి, కొత్త వెలుగులోకి పయనమై వెళ్ళిపోతాడు. పాత జీవితపు చాయలు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా బంధాలుగా ఉండవు. అప్పుడు అతడు లోకం కోసం, బంధువర్గం కోసం జీవించడు. ‘తన’ కోసమే జీవిస్తాడు. ఇది అర్ధం కాని మనుషులు అతను పరులు కోసం త్యాగం చేశాడనో, పరులపై ప్రేమతో జీవిస్తున్నాడో అనుకోవచ్చు. అది పెద్ద భ్రమ.
మాష్టారూ! తోటమాలి కలం పడితే ఆ రాతలకి మట్టి వాసన, నేల స్వచ్చత, వేర్ల లోతు ఉంటుంది, అందుకే మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. మీ ఉత్తరాలలో వ్యక్తులు అక్షరాలు దిద్దిస్తూ, ఆత్మ స్థైర్యం పెంచుతూ ఎడారిలో గులాబీలు పూయిస్తున్నారు. నేను నావైపు సూటిగా నడిచే అంకెల మనిషిని- జీతమిచ్చే కంపెనీ లాభాలు పెంచాలనో, ఖర్చులు తగ్గించాలనో సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు రాయిస్తూ ఉంటాను, ఒక్కోసారి అవే ఖర్చుల లెక్కలు చురకత్తులుగా మారి వేటు వేస్తే కొత్త కత్తి వెతుక్కుంటాను తప్ప చుట్టూ చూడను, చూసినా నా చుట్టూ నేనే కనపడతాను.

నిజానికి అంకెలకందని మీలాంటి వ్యక్తులు నాకు అర్ధం కారు. అందుకే మీ ఉత్తరాలు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాను, ఎన్నిసార్లు చదివినా బావుంటాయి తప్ప అర్ధం కావు, భాష వస్తే సరిపోదు కద… భావన నిండాలంటే అనుభవం కావాలి. ఏసీ గదులకి అలవాటైన నాజూకు శరీరం నడిరోడ్డుపై నిలబడదు, ఇక అనుభవం ఎలా వస్తుంది? అందుకే విశాలమైన పంజరంలో వెచ్చగా ఒదిగి ఎగిరే మెళుకువల గురించి కలలు కంటూ ఉంటాను, కలలు వాటంతట అవే నిజమవుతాయని కొత్త కలలు కంటూ ఉంటాను…

***

మీ మాటలు

  1. నిశీధి says:

    విశాలమైన పంజరంలో వెచ్చగా ఒదిగి ఎగిరే మెళుకువల గురించి కలలు కంటూ ఉంటాను, కలలు వాటంతట అవే నిజమవుతాయని కొత్త కలలు కంటూ ఉంటాను…హ్మ్మం అద్దంలో మసక ప్రతిబింభం దిగులుగా చూస్తున్నట్లు ఉంది . మనసు విప్పి రాయటమూ ఒక ఆర్టే కదా .

  2. Vanaja Tatineni says:

    గుడ్ స్టొరీ . మళ్ళీ మళ్ళీ చదవాలి. చదివించాలి . మాస్టారి ఉత్తరాలు ఇంకా ఉంటె బావుండును అనిపించింది .

మీ మాటలు

*