పల్లవించవా నా గొంతులో….

కవితా చక్ర

 

కళ. ఒక తపస్సు…

కళ. ఒక ధ్యానం..!

కళ. జీవన్ముక్తి సోపానం…!!

కళ కి సేవచేయడమూ కళేనేమో…!!

సినీ సంగీత విశ్వంలో వీరెప్పుడూ ధ్రువ తారే!

అవును.

ఆయన సంగీతం.. మిన్నంటే అల!

ఆయన బాణీ గుండెల్లో విరబూసే తీయని వెన్నెల!

వీరి పాట వింటూంటే మనసు తీగకు అనుభూతి పూవు పూయాల్సిందే!

వీరి స్వరాస్వాదనలో గుభాళింపు హృదయం అలౌకిక రాగ లోకాలలో విహరించాల్సిందే!.

అది ఏ తీగ పూవైనా, ఉత్తేజ పరిచే కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు అయినా, సరిగమల గలగలలైనా…

వీరి ప్రేమ, ఆప్యాయత మాటల్లో వర్ణనాతీతం! పాటల్లో కొంతవరకు వ్యక్తపరచొచ్చేమో..!

స్వరబ్రహ్మ లైన ఎమ్మెస్, ఇళయరాజా గారి పాటలు వింటూ ఈ పాటల పై మక్కువ ఏర్పడి,  గొంతుక రెక్కలు విప్పుకుని స్వర విహారం చేస్తున్నప్పుడు  వారిని కలిసి ఆశీస్సులు పొందాలన్న తపన ఎక్కువైంది.

అనుకున్నదే తడవు, స్వరాంజలి టీమ్ తో వెళ్లి సంగీత దిగ్గజాల్ని కలవడం నా సుకృతం. ఒక్కసారి మరపు రాని ఆ స్వర క్షణాలని మళ్ళీ పంచుకోవాలనుకుంటున్నాను.

జూన్ 2, 2014, చెన్నై లో వారి ఇంటి ముందు మా కార్ సరిగ్గా సాయత్రం ఆరు గంటలకి ఆగింది. అప్పటికే అప్పాయింట్మెంట్ తీస్కున్నందున, వారి పీ.ఏ ఎదురొచ్చారు. వారి ఇంటి గేటు కి పక్కగా..’ఎమ్మెస్.విశ్వనాథన్’ అని మాత్రమే రాసి ఉంది. గేట్ లోకి ప్రవేశించగానే ధూప దీప సువాసనలు. లోపలి నుండి హారతి, గంటల శబ్దాలు. సాయంకాల పూజా సమయం అనుకున్నాను. మొదటి అంతస్తులో వారి నివాసం. ముందు ఒక సిటౌట్! మరో ఇద్దరెవరో కూర్చుని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి, “ఒక పది నిముషాలు కూర్చోండి సార్ పూజలో ఉన్నారు” అని తమిళ్ లో చెప్పి వెళ్ళాడు.

ఒక్కో క్షణం ఉద్విగ్నంగా గడుస్తుంది. అప్పటికే నా బృందానికి వారి ముందు పాడే పాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి, మరింతగా ప్రిపేర్ చేస్తున్నా.

ఒకటి, రెండు,మూడు!! లెక్క పెట్టుకుంటున్న అంకెలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది ఆ క్షణం! లోపలి నుండి పిలుపు రానే వచ్చింది!

ఆనందం, ఉద్విగ్నం, ఆరాధన అన్నీ భావాలు మేళవించిన భావన నా కంటిలో చెమ్మై నిండుకుంది వారిని చూడగానే…!!

DSC_0146

తెల్లని వస్త్రాల్లో దివ్యమంగళ స్వరూపం.. ప్రశాంతత వారి చిరునవ్వులో, పరమేశ్వర విబూది వారి గొంతుక ని అద్దిందేమో! అందుకే అపర సరస్వతి వారిని ముద్దు బిడ్డలా అక్కున జేర్చుకుంది. ఎనిమిది పదుల నిండైన రూపం! కల్లా కపటం లేని స్వచ్చమైన చల్లని చూపు. అన్నిటినీ మించి వారి కాళ్ళ లో కాంతి! ఒక అద్భుతాన్ని చూస్తున్నానా అన్న ఏమరపాటు లో నేను. మమ్మల్ని చూసి, వారు లేచి ఆహ్వానించారు. సాష్టాంగ ప్రమాణాలయ్యాక, స్వరాంజలి మోటో గట్రా వారికి వినిపించాను. ఆశీర్వదించారు.

ఆ తరవాత నా బృందం చే వారి పాట లు పాడిస్తుంటే వారి ఆనందం చెప్పలేను. అన్నీ విన్నాక నాతో ఒక్క మాట చెప్పారు…”ఇంత చక్కటి కార్యక్రమాలకి హైదరాబాద్ రాలేనేమో..చెన్నై లో ఏర్పాటు చేస్తే చూడాలని ఉంది”

వారి ఆకాంక్ష!

నా అసమర్థత! జోడించిన చేతులతో “మీ ఆశీర్వాదం తప్పకుండా” అన్నాను.

వారు కంపోసింగ్ చేసిన రోజులను తలచుకున్నారు. వారి సంతోషం లో తెలియని లోటు గమనించాను.

అలా ఒక గంట సరదాగా పాడుతూ మాట్లాడుతూనే ఉన్నాం. సమయానికి జాలి, దయ ఉండవు కదా! ఆ స్వర ఘడియలు రెప్పపాటు లో కరిగిపోయాయి.

ఒక అద్భుతమైన అనుభూతిని గుండెల నిండా నింపుకుని వెను దిరిగాము.

వారి స్వర సీమలోకి కాస్త తొంగి చూస్తే…

**                                 **                       **

 

వీరి పూర్తి పేరు, మనయంగాథ్ సుబ్రహ్మణ్యన్ విశ్వనాథన్. విశ్వనాథన్ జూన్ 24, 1928 తేదీన జన్మించారు.

పదేళ్ళ చిన్నారి ప్రాయం లోనే నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకున్నారు. పదమూడేళ్ల వయసులోనే మూడు గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి అందరి ప్రశంసలు పొందారు. జైలు డే రోజు ఖైదీలతో “హరిశ్చంద్ర” నాటకం వేయించారు, అందులో లోహితాస్యునిగా విశ్వనాధన్ అదరగొట్టేశారు. దానితో ఖైదీలందరూ సినిమాలలో ప్రయత్నించమంటూ ప్రోత్సహించారు.

మొదట సినిమాల్లో వేషాలు వేయాలన్న కుతూహలంతో 1941వ సంవత్సరంలో విజయదశమిన మద్రాసులో తొలిసారి పాదం మోపాడు విశ్వనాధన్. మేనమామ సహాయంతో, జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎమ్.సుందరం చెట్టియార్, మొహిద్దీన్ లను కలిశారు. న్యూటోన్ స్టూడియాలో మేకప్ టెస్ట్ చేశారు. అయితే…ఆ వేషానికి తను నప్పడని కాదనడంతో, తిరిగి వెనక్కి రాలేక, అక్కడే ఆఫీస్ బాయ్ లా పని చేస్తూనే, మరో పక్క జూపిటర్ సంస్థ తీసిన “కుబేర కుచేల” సినిమాలో సేవకునిగా చిన్న వేషం వేశారు. నటుడు కావడానికి తన ఆకారము, పర్సనాలిటి సరిపోదని తనకే అర్ధమైపోయింది. అందుకే సంగీత విభాగంలోనే కృషి చేసి పైకి రావాలని నిర్ణయించుకున్నారు విశ్వనాథన్.

సేలంలో మోడ్రన్ థియేటర్స్ అనే సంస్థలో సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ ఉన్నారని తెలుసుకొని వెళ్లి కలిశారు. విశ్వనాధన్ తో ఓ పాట పాడించుకున్న మహదేవన్ గారు, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టుగా ఆ ఒక్క పాట తోనే విశ్వనాధన్ లోని ప్రతిభని గుర్తించి, సరాసరి సెంట్రల్ స్టూడియోకి వెళితే అక్కడ పని దొరుకుతుంది అని చెప్పారు. సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకునిగా ఉన్నఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు గారి ట్రూపులో హార్మోనిస్ట్ గా చేరారు విశ్వనాథన్. అక్కడే “రామమూర్తి” (తిరుచారాపల్లి కృష్ణస్వామి రామమూర్తి) తో స్నేహం ఏర్పడింది.

అలా చాలా రోజులు సుబ్బరామన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు ఇద్దరూ.. సుబ్బరామన్ దగ్గర ఉన్నప్పుడే ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి, టి.జి.లింగప్ప, గోవర్ధనం పరిచయమయ్యారు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఎమ్జీఅర్ హీరోగా “జనోవా” అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. ఒకే రోజు నాలుగు పాటలు చేసి, అవి సాయంత్రం సుబ్బరామన్ కు వినిపిద్దామని అనుకున్నాడు. కాని ఈలోపే వినకూడని వార్త వినాల్సి వచ్చింది, సుబ్బరామన్ చనిపోయారు అని! అప్పటికే సుబ్బరామన్ చేతిలో ఏడు సినిమాల దాకా ఉన్నాయి. వాటిని విశ్వనాధన్ – రామమూర్తి లు కలిసి పూర్తిచేసారు. అప్పటికే సుబ్బరామన్ దేవదాసు సినిమాకి 7 పాటలకు బాణీలు చేశారు. మిగిలిన రెండు పాటలు “జగమే మాయ బ్రతుకే మాయ”, బాలసరస్వతి పాడిన “ఇంత తెలిసియుండి” అను పాటలను కూడా స్వరపరిచారు. ఇలా సుబ్బరామన్ ఒప్పుకున్న తెలుగు, తమిళం చిత్రాలను ఎంతో చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి సంగీత దర్శకత్వం చేశారు. విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం – 3, తెలుగులో 70) పైగా స్వర సారధ్యం వహించారు.

**              **                        **

ఒక సంగీత దిగ్గజం ఇహలోకం లో నేల రాలోచ్చు గాక, సంగీతాకాశంలో మీరెప్పుడూ కాంతి పుంజమే!

కళ్ళలో ఉన్నవేవో కన్నులకే తెలిసినా..

దేవుడే ఇచ్చిన వీధి ఒక్కటే అయినా..

విధి చేయు వింతలెన్నయినా గాక,

మీరెప్పుడూ మా సంగీత విశ్వంలో స్వర నవ్వుల రేడే!

మీ బాణీ లో విరబూసిన స్వర పుష్పాలెన్నో…

మీ స్వరాలాపనలో ఆఘ్రాణించిన పరిమళాలెన్నో..

మీ పాట మూగవోయిన గొంతుకల్లో పల్లవిస్తోంటే మాటల్లేవు, మీ పాట ను పాడే గొంతుకను రెండు అశ్రు నయనాలు తడిమేసే వేళా….

తండ్రీ…!! మీకిదే అశ్రు నివాళి.

*

మీ మాటలు

 1. శాస్త్రి చాడా says:

  సరిగమలు గలగలలు
  ప్రియుడే సంగీతమ
  ప్రియురాలె నాట్యము…

  పదహారేళ్ళకూ నీలో నాలో…

  దేవుడే ఇచ్చాడు వీది ఒక్కటి..

  ఇలా…
  ఆయన పాట ప్రతీదీ ఒక అమృతగుళిక..

  ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ …

 2. దేవరకొండ says:

  ఇక నుంచీ…
  నీ స్వరం విన్నప్పుడు
  ఓ గిరి శిఖరం కూలిన చప్పుడు!
  **
  అభిమానుల అందరి గొంతూ తానై ఇంత వెంటనే అశృనివాళి సమర్పించిన ‘కవితా చక్ర’ గార్కి, ‘సారంగ’కు ఎమ్మెస్ అభిమానులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 3. ఎం .ఎస్ . విశ్వనాథన్ గారు ఇక లేరని విని మూగవోయిన నా గుండె మీ నివాళి చదివిన తర్వాత మళ్ళీ పలికింది – ఆయన చిరంజీవని చెప్పింది.
  ఎం . ఎస్ + కె . వి. మహదేవన్ లు తెలుగు వారికి దొరికిన సంగీత నిధులు – పాతికేళ్ళ వయసులోనే “ఇంత తెలిసి ఉండి ఈ గుణమేలరా ” (బాలమ్మ , దేవదాసు ) జావఌకి బాణీ కట్టారంటే ఎం.ఎస్. ఏమిటొ అర్థం చేసుకోవచ్చు – గొరుసు

 4. chandhu-thulasi says:

  గాలికదుపు లేదు……కడలికి అంతు లేదు
  గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా……..

  మనం ఎంత రాసినా….ఎంత చెప్పినా ఒక్క పాటకు సరిపోదు….

  కవితాచక్ర గారికి ….సారంగ కు ధన్యవాదములు

 5. కొట్టం రామకృష్ణారెడ్డి says:

  కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
  రాళ్ళలో ఉన్నదేదో రాళ్ళకెలా తెలుసు

  విశ్వనాథన్ గారి గురించి నాలో ఉన్నది నాకే తెలుసు.

  • తహిరో says:

   నిజమే … విశ్వనాథన్ గురించి మీలో ఉన్నది మీకు తెలుసని మేము వొప్పుకుంటున్నాము – మీలోనే దాచుకోవడం దేనికి ? ఆ ఉన్నదేదో ప్రపంచానికి కూడా తెలపండి సారూ – మేం భీ తెలుసుకుని సంతోషిస్తాము.

 6. శ్రీరామ్ వేలమూరి says:

  అభినందనలు .. అద్భుతమైన నివాళి

మీ మాటలు

*