ఆ ఊహే నిజమైతే…బాహుబలి!

మోహన్ రావిపాటి 

 

పెరట్లో నులక మంచం పడుకొని  మీద నాన్న చెప్పే రాజకుమారుడి కథ వింటూ , చుక్కలు చూస్తూ , ఆ చుక్కలు దాటుకుంటూ మనం నిర్మించుకున్న ఊహాలోకం లో పాత్రలన్నీ ఒక్కసారి  కళ్ళముదు మెదిలితే తట్టుకోగలమా !!

“అనగనగా రాజుగారు, ఆ రాజు గారి మీద ఆయన తమ్ముడి కుట్ర, రాజుగారికి కి పుట్టిన బిడ్డ ను అడవిలో వదిలేస్తే. ఒక పేదరాసి పెద్దమ్మ, ఆ బిడ్డడ్ని పెంచి పెద్ద చేస్తే, ఆ బిడ్డ పెరిగి ప్రజా కంటక పరిపాలన చేస్తున్న బాబాయి తో యుద్దం చేసి   చంపి ప్రజలందరికి సమ్మకమైన పరిపాలన ఇవ్వటం “ ఎంత చిన్న కథ ?? కానీ నాన్న ఇలా చెప్పాడా !! లేదే !!

ఆ రాజ్య సౌందర్యం, అక్కడి ఉద్యానవనాలు, రాజభవనాలు, హంసతూలికా తల్పాలు, , వింజామర వీచికలు,ఒక్కటా….. రెండా !! నాన్న చెప్తుంటే ఆ రాజ్యం నా కళ్ళముందు నేను నిర్మించుకున్న ఊహాలోకంలో మొత్తం కనిపించేది, కానీ దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా నిజ జీవితంలో  చూడగలనా ! నా ఊహలన్నిటికీ ప్రాణం పోసి నా కళ్ళ ముందు కనిపిస్తుంటే అందులో నేను ఇప్పుడు ఏ భవనం ముందు నుంచోవాలి ?? ఏ ఉద్యానవన విహారం చెయ్యాలి??

దట్టమైన అడవిలో అటు ఇటు పరుగెడుతున్న లేళ్ళు, జింకలు, పురివిప్పు ఆడుతున్న నెమళ్ళు. సెలయేళ్ళు  అంతెత్తు  నుండి కిందకు దూకుతున్న జలపాతాలు,  ఆకాశాన్ని అంటుతున్న కొండలు,  వీటిలో నేను నిజంగా ప్రవేశించినప్పుడు నేను ఏ చెట్టు కింద ఆగుతాను, ఏ సెలయేట్లో స్నానం చేస్తాను ?? ఏ జలపాతం కింద నిలువెల్లా తడుస్తాను ??

రాకుమారుడు కత్తి దూసి పోరాడుతుంటే ఆ అగ్గిరవ్వలకు   గడ్డ కట్టిన హిమనగవులు కరిగి  నేలకు జారుతుంటే నేనక్కడ ఉండగలనా ?? ,పొగరు బట్టిన  అడవి దున్న ను  ఒక్క చేత్తో నిలవరించగల చేవ , తెగువ ఉన్న యువరాజు దాని కొమ్ములు వంచి నేల మీద పడేస్తే రేగిన దుమ్ము నా కంట్లో పడినప్పుడు , నేను నిజంగా కళ్ళు ముయ్యగలనా !!  మదించిన ఏనుగు కుంభస్థలం మీద ఒక్క మోదు మోది దాన్ని నేలకూల్చిన్నప్పుడు నా కళ్ళముందు అంత పెద్ద ఏనుగు ప్రాణాలోదిలేసినప్పుడు, నేనక్కడ నిజంగా ఉండగలనా ??

యుద్ద తంత్రాలను అన్నీ ఔపాసొన పట్టి , యుద్ద యంత్రాల సహాయంతో శత్రువుల మధ్య అగ్నిగోళాలు తో మంటలు మండిస్తుంటే శత్రువుల హాహాకారాలు నా చెవుల్లో వినిపిస్తుంటే , నా నోటి నుండి జయ జయ ధ్వానాలు నిలవిరించుకోవటం నాకు సాధ్యమా !! ఎప్పుడూ ఎవ్వరూ కనీ వినీ ఎరుగని యుద్దవ్యూహాలను అమలు పరచి శత్రువు ను తుదముట్టించే అవకాశం వచ్చి కూడా, తన ప్రజల రక్షించటం కోసం ఒక్క క్షణం ఆగి , మరు క్షణంలో వ్యూహాన్ని మార్చి శత్రువును చంపేసిన రాజకుమారుడు నా కళ్ళముందు నడుస్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకోకుండా ఆపటం నాకు సాధ్యమా ??

ఇవన్నీ ఊహాలోకంలో నాన్న చెప్పిన కథ కాదు, నా కళ్ళముందు రాజమౌళి సృష్టించిన ఒక లోకం, ఆయన సృష్టించిన మాహిష్మతి రాజ్యం, దాని చుట్టూ అల్లుకున్న కథ, చందమామ కథ చదవటం చాలా తేలిక, ఆ కథ ను మన ఊహాలోకంలో సృష్టించుకోవటం కూడా తేలికే . కానీ ఆ సృష్టి ని నిజం చెయ్యాలంటే అది రాజమౌళి కే చెల్లింది . భారతీయ సినిమా చరిత్రలో ఇదో ప్రత్యేకమైన సినిమా . ఈ సినిమా విడుదల కు ముందు మూడు రోజులనుండి ఇండియా లో ఏ ఇద్దరు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు . అంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నిజంగా ఒక అధ్బుతమే .

మాహిష్మతి రాజమాత అయిన శివగామి (రమ్యకృష్ణ) ఒక చిన్న బిడ్డని రక్షించి ఒక గిరిజన తెగకు చెందిన వారికి ఇస్తుంది , అక్కడ పెరిగి పెద్ద అయిన శివుడు (ప్రభాస్ ) ఆ అడవిలో గూడెం పక్కన ఉన్న ఎక్కడో ఆకాశం నుండి పడుతున్నట్లు ఉరికే జలపాతం కేసి చూస్తూ ఆ కొండను ఎక్కాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు . ఒకరోజు ఆ జలపాతం పై నుండి ఒక మాస్క్ ఒకటి కింద పడుతుంది దానితో పైన ఎవరో ఉన్నారు అని నిర్దారించుకొని కష్టపడి ఆ కొండ ఎక్కి అక్కడ అవంతిక (తమన్నా) ని కలుస్తాడు,  తమన్నా కొంత మంది అనుచరులతో కలిసి మాహిష్మతి రాజ్యంలో బందీ గా ఉన్న దేవసేన (అనుష్కా) ను రక్షించాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది, ఆమె ఆశయ సాధన కోసం శివుడు బయల్దేరి మాహిష్మతి రాజ్యానికి వెళ్తాడు

మాహిష్మతి రాజ్యానికి అధిపతి అయిన భల్లలదేవ (దగ్గుబాటి రానా)  చేతిలో బందీగా ఉన్న దేవసేన ను విడిపించుకొనే ప్రయత్నంలో యువరాజు ( అడవి శేష్ ) ను చంపేస్తాడు శివుడు . అదే క్రమంలో శివుడు కట్టప్ప ( సత్యరాజ్ ) కూడా తలపడబోతాడు, కానీ శివుడిని చూసిన కట్టప్ప “బాహుబలి “ అని సంభోధించటంతో ఆగిపోతాడు, .మాహిష్మతి రాజ్య ప్రజలందరూ బాహుబలి ని దేవుడిలా ఎందుకు కొలుస్తారు ?? అసలు ఆ బాహుబలి ఎవరు ?? అన్నది శివుడికి వివరిస్తాడు కట్టప్ప

ఇది సాధారణ కథే , కానీ దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం, ప్రతి ఫ్రేమ్ అధ్బుతంగా ఉంటుంది, తెరపై సినిమా లా కాకుండా మన కళ్ళముందు జరుగుతున్నట్లు ఉంటుంది . ముఖ్యంగా ఆ జలపాత దృశ్యాలు, రాజ సౌధాలు, యుద్ద దృశాలు ఇంతకు ముందు ఎప్పుడు ఏ ఇండియన్ సినిమాలోనూ చూసి ఉండము, హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి, . ఇలా విజువల్స్ తో  మనల్ని రెండున్నరగంటల పాటు కట్టిపడేస్తుంది

నటీనటుల గురించి చెప్పాలంటే, ముందుగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ గురించి, రాజమాత గా ఆమె కళ్ళతో నటించిన తీరు అధ్బుతం, ముఖ్యంగా రాజద్రోహి ని ఒక్కవేటుతో చంపిన వెంటనే కనీసం షాట్ కట్ కాకుండా బిడ్డను లాలించిన సమయంలో ఆ రెండు విరుద్దమైన భావాలను ఒకేసారి పండించిన తీరు చూస్తే నిజంగా ఆమె ఎంత గొప్ప నటో మనకు అర్దం అవుతుంది, ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సత్యరాజ్ గురించి, రాజు మీద ద్వేషం, రాజ సింహాసనం మీద గౌరవం, అటు ద్వేషాన్ని , ఇటు గౌరవాన్ని రెండిటినీ ఒకరి మీదే చూపించే పాత్ర. అందులో సత్య రాజ్ నటన అధ్బుతం, ఆ తర్వాత రానా, కళ్ళతోనే క్రూరత్వాన్ని చూపించాడు, ఇక ప్రభాస్ అటు శివుడిగా, ఇటు బాహుబలి గా రెండిటి మధ్య వేరియేషన్ స్పష్టంగా చూపగలిగాడు, కాకపోతే వాచకం ఇంకొంచెం గంభీరంగా ఉంటే బాగుండేది,ముఖ్యంగా బాహుబలి పాత్ర కు సరిపడా వాచకం ప్రబాస్ గొంతు కు లేకపోవటం కొంచెం నిరుత్సాహ పరిచేదే . నాజర్ కు ఇలాంటి పాత్రలు కొత్త కాదు, తనకు అలవాటు అయిన పాత్రను తేలిగ్గా నడిపించేశాడు, ఇక అనూష్కా, మొదటి భాగంలో అనుష్కా కి నటించటానికి పెద్ద స్కోప్ లేదు, ఆమె కనిపించేదే ఒక 10 నిమిషాలు, ఉన్నది మూడు డైలాగ్స్,ఇక తమన్నా విషయానికి వస్తే , తమన్నా బాగా నటించలేదు అని చెప్పలేము కానీ, మిగతా వారి నటన ముందు కొంచెం తేలిపోయింది, ముఖ్యంగా కత్తి యుద్దం చేస్తున్నపుడు, ఆ ఆగ్రహం, కోపం కళ్ళలో కనిపించలేదు, దానికి తోడు పర్సనాలిటి కూడా గ్లామర్ హీరోయిన్ కి సరిపోయేదే కానీ ఇలా ఒక వారియర్ కి పనికి వచ్చే పర్సనాలిటీ కాకపోవటం కూడా ఒక కారణం.

ఇక సాంకేతిక విషయాలకు వస్తే ఇది ఖచ్చితంగా హాలివుడ్ లో వార్ సినిమాలతో పోల్చాలి, సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ ఒక వండర్ క్రియేట్ చేశాడు, కళా దర్శకుడిగా శిబూసిరిల్  ఒక అందమైన లోకాన్ని సృష్టించాడు, కీరవాణి హాలీవుడ్ స్థాయిలో నేపధ్య సంగీతాన్ని ఇవ్వలేకపోయినా, అద్భుతంగానే ఇచ్చాడు. పీటర్ హెయిన్స్ పోరాటాలు,సినిమాకు నిజంగా ప్రాణం పోశాయి. యుద్ద దృశ్యాలు, ఆ యుద్ద యంత్రాలు, మహాద్భుతం అని చెప్పాలి,

కాకపోతే ఈ సినిమా రెండు భాగాలు గా ఉండటం, ఇది మొదటి భాగం కావటంతో కథ మధ్యలో ఆగిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక సినిమా ఇంటర్వెల్ వరకు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, క్యారక్టర్స్,క్యారక్టరైజేషన్స్ , వాటి సెటప్ , ఇవన్నీ అయిపోయి అసలు కథలోకి వెళ్లకుండానే సినిమా అయిపోతుంది , ఇది ప్రేక్షకుడిని కొద్దిగా అసంతృప్తి కి గురి చేసినా, చూస్తున్నంత సేపు మరో లోకంలో ఉంటాడు . పూర్తి కథ తెలియయాలంటే రెండవ భాగం కోసం ఎదురు చూడాల్సిందే,

చిన్నప్పుడు మా నాన్న కూడా అంతే ఒకే రోజు కథ మొత్తం చెప్పే వాడు కాదు, సగం చెప్పి, మిగతా సగం నువ్వు ఊహించు అని చెప్పి, మరిసటి రోజు నా ఊహాలు విని, అప్పుడు మిగతా కథ పూర్తి చేసేవాడు, ఈ సినిమా అయిపోగానే నాకు అదే గుర్తు వచ్చింది ,

అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నా, ఇది భారతీయ తెరపై ఒక అద్భుతమైన సినిమా అనే చెప్పాలి, అందరూ ఒకసారైనా చూడాల్సిన సినిమా.

*

మీ మాటలు

  1. sunita gedela says:

    actually after knowing the talk of the movie i have dropped my interest to watch bahubali. but your review rejuvanated my interest to watch this movie. beautiful description.

    • mohan.ravipati says:

      తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను

  2. రాజమౌళి వీరాభిమాని అయితే తప్ప ఇలా రాయలేడు. ఒక తిరోగామి సినిమాని వంద కోట్ల రూపాయలు పైగా ఖర్చుపెట్టి తియ్యడం ఒక తప్పయితే, సగం (కథ) సినిమాని చూపించి ప్రేక్షకుల్ని మోసం చెయ్యడం ఇంకో తప్పు. చాలా పాత్రలు అసంపూర్తిగా, అర్థం పర్థం లేకుండా కనిపిస్తే, ప్రారంభ సన్నివేశం నుంచి ఎన్నో సన్నివేశాలకు చివరి దాకా కొనసాగింపులు ఉండవు. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించవు. ఆ సమాధానాల కోసం రెండో భాగం చూడండి.. అని చెప్పడం ఇంకో తప్పు. ఆ రెండో భాగం ఇంకో ఏడాది తర్వాత వస్తుందని స్వయంగా రాజమౌళి చెప్పారు. అంటే సమాధానాల కోసం ఇంకో ఏడాది ఆగాలా? ఒకవేళ ఆ రెండో భాగం రాకపోతే ఈ సినిమా ఓ అసంపూర్ణ కథలా మిగిలిపోయినట్లేగా. ‘బాహుబలి’ దృశ్యపరంగా ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. కానీ విషయపరంగా అధమ స్థాయిలో ఉందనేని వాస్తవం.

    • mohan.ravipati says:

      నేను రాజమౌళి గారి అభిమానికి కానండి, తెలుగు సినీ అభిమానిని మాత్రమే , సినీ విమర్శకుడుగా సినిమాను సమీక్షించాను, ఆ కథ తిరోగమన కథా, పురోగమన కథా అనేది నాకు సంబధించిన విషయం కాదు, ఇక మీరన్నట్లు ఆయనే ఇది రెండు భాగాల సినిమా అని చెప్పాడు కాబట్టి, ఇప్పుడు చూసింది మొదటి బాగమే కాబట్టి అందులో సమస్య లేదనే నా అభిప్రాయం, మీ స్పందనకు ధన్యవాదాలు

    • సినేమా చాలా బాగుంది. ఒకసారి తప్పక చూడవచ్చు. సినేమా కథ చాలా సింపుల్. చందమామలో ఎన్నో కథలు చదివి ఉంటాం. రెండో భాగం కూడా ఈపాటికే తీసి ఉంటారు. వచ్చే సంవత్సరం తప్పక విడుదల అవుతుందనుకొంటాను.

      పురోగామి సినేమాలు చూడాలనుకొనే వారు, వందల రూపాయలు ఖర్చు చేసుకొని, సినేమా హాలుకి వెళ్ళి చూడటం ఎందుకు? 1950-1990 మధ్యకాలంలో తీసిన సినేమాలు రోజు టివిలో వస్తునే ఉన్నాయి కదా! :)

      • mohan.ravipati says:

        ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది అండి, పురోగామి, తిరోగామి అని సినిమాలు ఉండవు, ఏదైనా మనం ఎలా అర్ధం చేసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది

  3. well explained without revealing much about the film… Nice write up sir👍👍👍

  4. vydehi murthy says:

    Excellent write up.

  5. రాజమౌళి నిజంగా ఆ లోకం సృష్టించాడో లేదో తెలియదు కాని మీ సమీక్ష చదువుతుంటే ఆ చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి.. చాలా బాగా రాసారు…

    • mohan.ravipati says:

      నాకైతే సినిమా ఒక చందమామ కథ కు , దృశ్య రూపం ఇచ్చినట్లే అనిపించింది సార్

  6. sunkara sreenivasarao says:

    మోహన్, మీ రివ్వు చదివాను. రివ్వు తో కుడా పాఠకుడు దృశ్యాలని ఉహించుకునెలా రాసారు. స్పష్టత, సూటిగా చెప్పటం మీ విధానం అని తెలుసు. మరో సారి ఒప్పుకోక తప్పదు. కీప్ గోయింగ్.

  7. Venkat Malleswara says:

    Your review writing skills and review on this movie is as good as this movie….
    Loved reading it end to end…

  8. devi varma says:

    చాలా బాగా రాసారు. నా చిన్నతనం , చందమామ కధలు గుర్తొచ్చాయి.

  9. mohan.ravipati says:

    సినిమా కూడా ఒక చందమామ కథ కు దృశ్యరూపమే కదండి ! ధన్యవాదాలు

  10. Vengala bhaskar says:

    చాలా బావున్నది మీ రివ్యూ

  11. Inthaki chudamantaara vaddantaara? Prabhas voice nakkuda nijanga nchaledu. Nenevarniiii ani adigepudu assalu nachaledu. inkaa gaambheeryam avasaram.
    The waybyou wrote is awesome sir.

  12. bapineedu says:

    సినిమా చాల బాగా తీసారు కానీ సామాన్య ప్రెక్షకుదు చాల అసంతృప్తిగా ఉంది కారణం సేరియల్ల లా తరువాత బాగం వత్చే వారం

  13. vasavi pydi says:

    సినిమా రివ్యు బాగా వ్రాసారు నెల్లూరు లీల మహల్ లో హాలివుడ్ సినిమాలు చూచి మన తెలుగు సినిమా ఆ స్థాయి కి ఎప్పుడు వెళ్తుందో అని ఎదురు చూసే నాలాంటిఅభిమానులు ఎందరో పొంగిపోయుంటారుసినిమాకికథ కన్నా స్క్రీన్ ప్లే అద్భుతం గ ఉంటె
    చూడడానికి బాగుంటుంది

    • mohan.ravipati says:

      మార్కెట్ దృష్ట్యా మనం ఆ స్థాయికి ఇన్ని రోజులు వెళ్లలేకపోయామండి, ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది, బహుశా మనం ఆ స్థాయికి రాబోయే కొద్ది సంవత్సరాలలో ఎదుగుతామనే అనుకుంటున్నాను , యా ! మీరన్నది నిజమే, కథ కన్నా స్ర్కీన్ ప్లే ముఖ్యం

  14. చందు తులసి says:

    రాజమౌళి సీరియల్ తీసి వచ్చాడు కాబట్టి……ఇలా బాహుబలిని రెండు భాగాలుగా తీయాలనుకున్నాడనుకుంటా…..
    – ఏదైనా ముగింపు అసంపూర్తిగా ముగించడం అన్యాయం…
    -నా కైతే సినిమా కన్నా …..మీ రివ్యూ బాగా అనిపించింది.

    • mohan.ravipati says:

      మీరన్నది నిజమే, ప్రేక్షకుడు అసంతృప్తి గా ఫీల్ అయ్యాడు , కాకపోతే ముందుగానే రెండు భాగాలు అని చెప్పాడు కాబట్టి , మనం ఎదురు చూడక తప్పదు , మీ కామెంట్ కు ధన్యవాదాలు

  15. రాజమౌళి ఏ భాషలో ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా చిన్నప్పుడు అమరచిత్ర కథలు ఎక్కువగా చదివిన అనుభవం గురించే చెప్పారు కానీ చందమామ కథలు చదివినట్లు చెప్పలేదనుకుంటాను. తన మగధీర సినిమా మనోహరంగా, చందమామ కథలా ఉందని అప్పట్లో చాలామంది అభిప్రాయాలు చెబితే చందమామ పత్రిక నిజమైన అభిమానులు ఇది చందమామ కథేనా అంటూ ఛీత్కరించిన విషయం కూడా తెలుసు. తర్వాత ఈగతో అద్భుతమే చేశాడు. ఎంతగా అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా భాషా భేదాలు లేకుండా కోట్లాదిమందిని ఈగ సినిమా పరిచయ భాగంతోటే మంత్రముగ్ధులను చేసిన ఘనత రాజమౌళిది. ఇక బాహుబలిలో కథ, కథనం ఎక్కడుందీ అంటూ విమర్శించిన సమీక్షకులందరికీ ఏకవాక్యంతోటే జవాబిచ్చాడు. ఇది కథా ప్రాధాన్యం కాదు దృశ్యప్రాధాన్యం ఉన్న సినిమా అని..
    నాకు తెలిసి తెలుగులో వి. మధుసూధనరావు దర్శకత్వం వహించిన వీరాభిమన్యు నిజంగానే ఒక దృశ్య అద్భుతం. గ్రాఫిక్స్ అనే పదం కూడా ఎవరికీ తెలీని రోజుల్లో ఈ సినిమాలో చూపిన స్పెషల్ ఎఫెక్ట్స్ నిజంగా కంటికింపైన మనోహర దృశ్యమాలికలే. అయితే వీరాభిమన్యులా, మాయాబజారులా, శ్రీకృష్ణ పాండవీయంలా, నర్తనశాలలా మనసును పరవశింపజేసే గుణాన్ని తెలుగు సినిమాలు ఏనాడో పోగొట్టుకున్నాయి. కానీ విమర్శకులు ఎన్ని లోపాలు వెతుకుతున్నా, అలనాటి మంత్రనగరి సరిహద్దులను తనదైన రూపంలో చూపిస్తున్న ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళినే అని చెప్పాలి.
    లోపరహితంగా మీరు చేసిన బాహుబలి పరిచయం కూడా మనోహరంగానే ఉంది. ప్రపంచంమంతా బాహుబలిని వివిధ భాషల్లో చూస్తోంది కాని టికెట్ దొరక్కపోవడం, బ్లాక్ టికెట్లు తీసుకోకూడదనుకోవడంతో హైదరాబాద్‌లో ఉండి కూడా చూడలేకపోతున్నాం. కాస్త రద్దీ తగ్గాక తప్పక చూస్తాము. అంతవరకు బాహుబలిపై నో కామెంట్.
    ఒక్కటి మాత్రం నిజం. సినిమా చూడకూడదు అనుకున్నవాళ్ళను కూడా చూడమని ప్రోత్సహించేంత ఆకర్షణీయంగా మీరు పరిచయం చేశారు. నేనింకా చూడని ఆ కొత్త కాదు కాదు.. పాత లోకాలను మీ పరిచయం లోనే చూపించేశారు. అందుకు అభినందనలు.

  16. రివ్యూ బాగుంది

  17. P.V. Rao says:

    Aascharyam .

  18. Hari Tungala says:

    బాహుబలి సినిమా మీద పెరిగిన అంచనాల వల్ల కాని, మీడియా క్రియేట్ చేసిన హైప్ వల్ల కానీ సినిమా ని వెంటనే చూడాలనిపించి నిన్న ఫస్ట్ షోకి వెళ్ళాను.

    నేను సినిమా చూసిన తర్వాత చదివిన రివ్యూలు నన్ను సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే మొదటిసారిగా ఈ రివ్యూ రాస్తున్నాను. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చనివాళ్ళు దయచేసి ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని గుర్తుంచుకోండి.

    ఇక కథలోకి వెళ్తే….

    సినిమా మాహిష్మతి రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ఎంట్రీతో ప్రారంభం అవుతుంది. ప్రాణ హానితో సైనికుల నుండి తప్పించుకున్న శివగామి ఒక బిడ్డతో సహా నదిలో పడిపోతుంది. మహేంద్ర బాహుబలి అనే పేరున్న ఆ బాలుడిని రక్షించాలంటూ దేవుడ్ని వేడుకుంటుంది. సైనికుల చేతిలో గాయపడిన శివగామి బిడ్డను నీటిలో మోస్తూ ప్రాణాలు కోల్పోతుంది. అలా నీటిలో బిడ్డతో సహా కొట్టుకుపోతున్న శివగామిని అక్కడే ఉండే అంబలి అనే గిరిజన గ్రామ ప్రజలు కాపాడతారు. ఆ బిడ్డను పిల్లలు లేని ఆ గ్రామ నాయకురాలు సంగ శివుడు(ప్రభాస్) అనే పేరుతో పెంచి పెద్దచేస్తుంది. అక్కడున్న కొండపైన ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం శివుడితో పాటు పెరిగి పెద్దదవుతుంది. ఆ క్రమంలో చాలాసార్లు ఆ కొండను ఎక్కటానికి ప్రయత్నించి విఫలమవుతాడు శివుడు. ఓ రోజు కొండపైనుండి వచ్చే జలపాతంలో ఓ మాస్క్ కొట్టుకువచ్చి శివుడికి దొరుకుతుంది. కొండపైనుండి ఆ ముసుగు వచ్చింది కనుక అక్కడేవరో ఉన్నారనే భావనతో ఉంటాడు. చివరకి అది ఒక అమ్మాయిది అని గుర్తించి ఆమెను చూడాలనే కుతూహలంతో కొండను ఎక్కేస్తాడు. అక్కడ కొంత మంది అవంతిక(తమన్నా)ను చంపాలనుకోవడం, వారు చివరికి ఆమె చేతిలోనే చావడం జరిగిపోతాయి. అవంతిక మరియు ఇంకొంతమంది కలిసి మాహిష్మతి రాజ్యానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేస్తుంటారు. మాహిష్మతి రాజ్యంలో 25ఏళ్ళుగా బంధీగా ఉన్న దేవసేన(అనుష్క)ను విడిపించటమే వీళ్ళ లక్ష్యం. అవంతికను చూసిన శివుడు ఆమెను ఇష్టపడతాడు, ఓ సందర్భంలో తన ప్రేమను అవంతికకి తెలియజేస్తాడు. ఆమె కూడా శివుడి ప్రేమను అంగీకరించినప్పటికీ, తన లక్ష్యం మాహిష్మతి రాజ్యంలో భల్లాలదేవుని(రాణా) వద్ద బంధీగా ఉన్న దేవసేనను రక్షించడమే అని చెబుతుంది. దాంతో శివుడు మహిష్మతి రాజ్యంలో బంధీగా ఉన్న దేవసేనను విడిపించడానికి వెళతాడు. దేవసేనను విడిపించి తీసుకెళ్తుండగా భల్లాల దేవుని కుమారుడైన మాహిష్మతి యువరాజు అడ్దుకుంటాడు. ఈ ఘటనలో మాహిష్మతి యువరాజు దేవసేన మీద చేయి చేసుకుంటాడు. కోపోద్రిక్తుడైన శివుడు మాహిష్మతి యువరాజును చంపబోతుండగా, మాహిష్మతి సింహాసనానికి బానిస ఐన కట్టప్ప(సత్యరాజ్) అడ్డుపడి యువరాజును రక్షించే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. ఈ గొడవ జరుగుతూ ఉండగా శివుడుని వెతుక్కుంటూ అతని తల్లిదండ్రులు, అంబలి గ్రామ ప్రజలు, దేవసేనని విడిపించి తీసుకురావటానికి వెళ్ళిన శివుడికి సహాయం చేయటానికని బయలుదేరిన అవంతిక మరియు ఆమె బృంద సభ్యులు కూడా అక్కడికి చేరుకుంటారు. ఈ గొడవలో కట్టప్ప శివుడిని బాహుబలిగా గుర్తించి అతని ముందు మోకరిల్లి బాహుబలి అని అరచి శివుడి పాదాన్ని తన తలపై పెట్టుకుంటాడు. ఈ గొడవ కారణంగా అందరికీ శివుడే తమ రాజు అమరేంద్ర బాహుబలి కుమారుడు మహేంద్ర బాహుబలి అని తెలిసి అందరూ అతనికి మోకరిల్లుతారు.

    ఇదేమీ అర్థం కాని శివుడు “నా తల్లి కళ్ళు నన్నెందుకలా దీనంగా చూస్తున్నాయి, నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి, ఆమెను చూస్తే నా కళ్ళలో రక్తం కారుతోంది ఎందుకు? నేనెవరిని? ” అని కట్టప్పని అడుగుతాడు.

    అప్పుడు కట్టప్ప ” నువ్వు మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి” అంటూ ఫ్లాష్ బాక్ చెప్పటం మొదలెడతాడు.

    మాహిష్మతి రాజుకు ఇద్దరు కొడుకులు. బిజ్జల దేవుడు(నాజర్), అమరేంద్ర బాహుబలి తండ్రి. బిజ్జల దేవుడు పెద్దవాడైనప్పటికీ అతని అంగవైకల్యం కారణంగా అమరేంద్ర బాహుబలి తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. బిజ్జల దేవుని భార్య శివగామి(రమ్యకృష్ణ). వారి కుమారుడు భల్లాల దేవుడు(రానా). అకస్మాత్తుగా రాజు అయిన అమరేంద్ర బాహుబలి తండ్రి చనిపోతాడు. రాణి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. శివగామే అతనికి బాహుబలి అని నామకరణం చేస్తుంది. ఐతే రాజు లేని రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటానికి రాజ్యంలోని కొంతమంది కుట్ర చేస్తారు. శివగామి ఈ కుట్రలను భగ్నం చేస్తుంది.

    రాజుకి కొడుకు పుట్టాడని తెలియని బిజ్జల దేవుడు తన కొడుకు భల్లాలదేవుని రాజుగా ప్రకటించమని శివగామిని అడుగుతాడు. అప్పుడు శివగామి బాహుబలిని చూపించి ఇద్దరూ తన కొడుకులేనని, ఇద్దరూ పెరిగిన తరువాత వారిలో బలవంతుడు రాజు అవుతాడని ప్రకటిస్తుంది. వారిద్దరూ పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరూ సమాన బలం కలవారిగా నిలుస్తారు. ఇద్దరిలో ఎవరిని రాజుని చేయాలన్న సందిగ్థంలో ఉండగా కాలకేయుడు మాహిష్మతిపై దండయాత్ర చేస్తాడు. కాలకేయుడిని ఎవరైతే చంపుతారో వారిని రాజుని చేద్దామని బిజ్జలదేవుడు చెబుతాడు. శివగామి అందుకు అంగీకరిస్తుంది. ఐతే యుద్ధంలో కాలకేయుడు భల్లాల దేవుని చేతిలో చనిపోయినప్పటికీ యుద్ధంలో జరిగిన సంఘటన కారణంగా బాహుబలిని రాజుగా ప్రకటిస్తుంది శివగామి. టోటల్ గా ఇదీ ఫ్లాష్ బాక్.

    ఇక వర్తమానంలోకి వస్తే ఈ కథ విన్న సంగ “ఆ మహానుభావున్ని ఒక్కసారి చూడాలని ఉంది అంటుంది”.
    దానికి కట్టప్ప ఆ దేవుడు జీవించిలేడు. చనిపోయాడు. తానే వెన్నుపోటు పొడిచి చంపేశాను అని చెబుతాడు. ఇక్కడితో సినిమా అయిపోతుంది. మిగతా భాగం 2016 లో చూడండి అని చెబుతాడు.

    ★ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నప్పటికీ అక్కడక్కడ నాసిరకంగా అనిపిస్తాయి.
    ★ ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెంథిల్ కుమార్ పనితనం గురించి. వంక పెట్టడానికేం లేదు. చాలా బాగుంది.
    ★ కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలాచోట్ల పరవాలేదనిపించినా కొన్నిచోట్ల తేలిపోయింది.
    ★ పీటర్ హెయిన్స్ స్టంట్స్ కూడా అంత అద్భుతంగా ఏమీ లేవు.
    ★ ఎడిటింగ్ విషయంలో కొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది.
    ★ చాలా సాధారణమైన కథ అయినప్పటకీ రాజమౌళి కథనం విషయంలో సక్సెస్ కాలేకపోయాడు.
    ★ కథను నడిపించే విధానం చాలా పేలవంగా ఉంది. కథతో పాటు ఎమోషన్స్ ని ఎక్కడా కారీ చేయలేదు.
    ★ కథని అసంపూర్ణంగా ముగించాడు.
    ★ కథ, కథనం విషయంలో రాజమౌళి ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది.
    ★ చాలా వరకు మగధీర తో పోలిక ఉన్నట్లు అనిపిస్తుంది.
    మగధీరలో రాంచరణ్ హెలికాప్టర్ నుండి లోయలో పడటంతో కథ ప్రారంభమవుతుంది. ఇక్కడ లోయలోంచి కొండ ఎక్కడంతో కథ ప్రారంభమవుతుంది.
    అక్కడ షేర్ ఖాన్ తో యుద్ధ సన్నివేశం పెడితే, ఇక్కడ కాలకేయ తో పెట్టాడు.
    కానీ మగధీరలో మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఇక్కడ అవి మిస్సయ్యాయి.
    అక్కడ కాల భైరవ పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. కానీ ఇక్కడ బాహుబలి పాత్ర తేలిపోయినట్టుగా ఉంది. పాత్రను సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు.
    ★ మగధీరలో కాలభైరవుడికి, షేర్‌ఖాన్‌కి మధ్య డైలాగుల వల్ల ఆ పాత్రలు గొప్పవిగా ఎలివేట్ అయ్యాయి. కానీ ఇక్కడ డైలాగ్స్ మిస్సయ్యాయి. సో పాత్రలు తేలిపోయాయి.
    ★ కాలకేయుని భాష ని వేరే భాషగా చూపించాడు. కానీ ఆ ప్రయోగం సక్సెస్ అయినట్లు అనిపించదు.
    ★ బాహుబలి పాత్ర కంటే భల్లాలదేవుని పాత్రే బాగా ఎలివేట్ అయినట్లు అనిపిస్తుంది.
    ★ ఉన్నది కొంచెం సేపే ఐనా శివగామిగా రమ్యకృష్ణ నటన అదుర్స్. కానీ రమ్యకృష్ణ లాంటి నటిని శివగామి పాత్రలో చూపించినపుడు ఆ పాత్ర పరిధిని ఇంకొంచెం పెంచితే బాగుండేది.
    ★ భల్లాల దేవునిగా రాణా నటన బాగుంది.
    ★ ప్రభాస్ నటన సో సో గా అనిపిస్తుంది. శివుడిగా, బాహుబలిగా ప్రభాస్ తన నటనని నిరూపించుకునే అవకాశం సరిగా దక్కలేదేమో అనిపిస్తుంది.
    ★ తమన్నా నటన బాగుంది.
    ★ సత్యరాజ్, నాజర్, తనికెళ్ళ భరణిల నటన బాగుంది.
    ★ భల్లాల దేవుని కొడుకుగా అడవి శేషు కారెక్టర్ శివుడి చేతిలో చావటానికే అన్నట్లు ఉంది. అంతకు మించి ఆ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత కనిపించదు.
    ★ దేవసేన పాత్ర పరిధి ఏమిటో ఈ సినిమాలో అర్థం కాదు. ఆ పాత్ర నిడివి చాలా తక్కువ. ఈ పాత్రకు అనుష్క ఎందుకు ఒప్పుకుందో తెలియదు. ఒకవేళ సెకండ్ పార్ట్‌లో ఈ పాత్రకి ఏమైనా ప్రాధాన్యత ఉందేమో చూడాలి.
    ★ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది.
    ★ సెకండ్ హాఫ్‌లో వచ్చే కాలకేయునితో యుద్ధం కావాలని బలవంతంగా పెట్టినట్లు ఉంది కానీ సిట్యుయేషన్ డిమాండ్ చేసినట్లు అనిపించదు.
    ★ చావటానికి సిద్ధపడి ఒక లక్ష్యం కోసం పనిచేసే ఒక యోధురాలు తనకు తెలియకుండా తన ఒంటి మీద పచ్చబొట్లు పొడుస్తుంటే గుర్తించలేకపోవటం, అలాగే తనకి తను ఒక ఆడపిల్ల అని గుర్తు చేయగానే ఏ పరిచయమూ లేని ఒక అపరిచితునితో ప్రేమలో పడిపోవటం ఏమిటో లాజిక్ కి అందని ప్రశ్న.
    ★ అలాగే ఏ యుద్ధ విద్యలూ నేర్చుకోకుండా ఒక సామాన్య గిరిజన గ్రామంలో పెరిగిన వ్యక్తి భల్లాల దేవుని వంటి ఒక మహా బలవంతుడైన రాజు పాలనలో ఉన్న రాజ్యంతో ఎలా తలపడతాడు. అదే వ్యక్తి కట్టప్ప లాంటి యోధున్ని ఎలా ఓడించాడో రాజమౌళికే తెలియాలి.
    ★ మాహిష్మతి సింహాసనానికి బానిస ఐన కట్టప్ప ఆ రాజ్యానికి సైన్యాధిపతి ఎలా అయ్యాడు?
    ★ వెన్నుపోటుతో అమరేంద్ర బాహుబలిని చంపిన కట్టప్ప దేవసేనకు ఎందుకు విధేయత చూపుతాడు?
    ★ బానిసకు రాజు పట్ల గౌరవం ఎందుకు ఉంటుంది?
    ★ మాహిష్మతి సింహాసనానికి బానిస ఐన కట్టప్ప మహేంద్ర బాహుబలి పాదాలకు మొక్కటం రాజద్రోహం కాదా? మాట ఇచ్చాం ఈ జన్మకి ఇంతే అన్న కట్టప్ప మాట తప్పటం కాదా?
    ★ దొంగల కోట గురించి గొప్పగా చెప్పినా, అక్కడ పెద్ద సీన్ ఉంటుంది అని ఊహించిన ప్రేక్షకుడికి పెద్ద నిరాశే మిగిలింది. పైగా అక్కడ అవసరం లేని క్లబ్ సాంగ్ ఒకటి.
    ★ మగధీర లో రాంచరణ్ వాయిస్ అతనికి ప్లస్ ఐతే ఈ సినిమాలో ప్రభాస్ కి వాయిస్ మైనస్.
    ★ అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా మగధీరలో రంచరణ్ కి ప్లస్ ఐతే, ప్రభాస్ కి మైనస్.

    వీటిలో కొన్నింటికి సెకండ్ పార్ట్‌లో సమాధానం దొరకచ్చు.

    ఇది సినిమా చూసాక నా టోటల్ రివ్యూ.

  19. Sasi Sri says:

    నిజంగా మీ రివ్యూలో చెప్పిన విధంగానే నాకు అనిపించింది మోహన్. చిన్నప్పుడు చదివిన చందమామ కథేదో దృశ్యకావ్యమై అలరిస్తున్నట్లే అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు.కథ విషయమై సెకండ్ హాఫ్ చూస్తేగానీ ఒక నిర్ణయానికి రాలేమేమో అనిపించింది.అన్ని పాత్రలకూ ప్రాధాన్యత సమంగా ఇవ్వడం చేత హీరో రోల్ కి కొంత ప్రాధాన్యత తగ్గింది. అంతేగాని ప్రభాస్ నటనలో లోపంలేదు(గొంతులో గాంభీర్యత లేదు అనే విషయం మాత్రం నిజం). టెక్నికల్ గా చాలా బాగుంది.బయటికి వచ్చేశాక కూడా సినిమా మూడ్ నుంచి బయటపడలేము. బయటికి కనిపించేంత లూప్ హోల్స్ లేవు.చూడదగ్గ సినిమా. గుడ్ రైట్ అప్.

  20. buchi reddy gangula says:

    గ న్ని కోట్లు —waste.of.money…
    చందమామ కథలా ఉంది ——ఒక్క మంచి సినిమా అంటూ యీ మధ్య రావడం లేదు .
    55–60 ఏళ్ళ నటులు హీరో లు —
    బాలయ్య లెజెండ్ — సింహ — పులి ????హె రో ఇన్ — మ ను మరాలుగా కనిపిస్తూ —
    ఎగురుడు — దు ను కు లు —double..meaning..పాటలు ???చెత్త డై లాగులు —- ఐటెం సాంగ్
    అంటూ boddlu…చూపిస్తూ —-అది సినిమా —???
    రాజమౌళి — సత్యజిత్ రాయ్ — శ్యంబె నగల్ కా దు —-అంత సీను లేదు — ప్రచారం ఎక్కువ — పోజు లేక్కువ — ఎక్కువ మంది వర్మ గారి స్టూడెంట్స్ ఏ —
    మూడు నాలుగు రివ్యూ లు చదివాను — వాళ్ళు యిచ్చిన రేటింగ్ 3/5 ?????

    ———————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  21. Chimata Rajendra Prasad says:

    నేను నిన్ననే ఈ సినిమా చూశా. రాజశేఖర రాజు గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా. సినిమాలో పాత్రల స్వభావాలూ, ఇలా ఎలా జరగుతుందీ,అలా ఎలా, ఇలాంటి ఆలోచనలు పక్కకు పెట్టి అమ్మ చెబుతున్న కథ వింటున్న, చందమామలో కథను ప్రశ్నించకుండా చదివే చిన్న పిల్లాడిలా చూస్తే అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. అద్భుతంగా ఊహించడం, దాన్నిప్రత్యక్షంగా చూపించడం అందుకు పడ్డ శ్రమ, భారత దేశ ప్రజలు గుర్తించారు, నీరాజనాలు పడుతున్నారు. ఉత్తర భారతంలో తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన రాజమౌళికి మనఃపూర్వక అభినందనలు. బాలీవుడ్ లో ఎవరైనా రాజమౌళితో సరి తూగగలరా అనేచర్చజరుగుతోందీ అంటే ఆయన చేరుకొన్న స్థాయికి తెలుగు వాళ్ళందరు గర్వించాలి.

  22. దాదాపు వారం తర్వాత ఇక్కడ వ్యాఖ్యలు చూస్తున్నాను. ఒక సినిమాపై భిన్నకోణాలు ఎలా ఉంటాయో ఇక్కడి వ్యాఖ్యలే గొప్పగా చూపిస్తున్నాయి. హరి తుంగాల గారు ఈ సినిమాలోని లోపాలను పూసగుచ్చినట్లు పట్టి తమ వ్యాఖ్యలో చూపారు. బాహుబలి సినిమా తొలి రోజు చూసిన ప్రేక్షకుల్లో ఒకరు మాట్లాడుతూ… ఏమప్పా కత్తులు, పోరాటాలు, జలపాతాలు, మంచు కొండ చూపించి ఇది సినిమా అంటారా? కథ ఎక్కడ ఏడ్చింది? దీనికోసం మేం ఇంత ఖర్చుపెట్టుకుని థియేటర్లకు రావాలా అంటూ ఏకిపడేశారు. ఘటనలను ఒకటిగా గుదిగుచ్చి కలిపినట్లుంది తప్ప చేసిన ప్రచారానికి తగిన పటుత్వంతో కథ లేదని చాలామందే అంటున్నారు.
    కానీ ఈ సినిమా ఏదో మాయ చేస్తోంది. తొలి రోజు తెలుగు సమీక్షల్లో, థియేటర్లనుండి బయటకు వస్తున్న జనం స్పందనలో నెగటివ్ అభిప్రాయాలు ఎన్ని వచ్చినా విడుదలైన రెండో రోజు నుంచే దేశవ్యాప్తంగా అద్భుతం సంభవించింది. కలెక్షన్ల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది రికార్డు సృష్టించినప్పటికీ తెలుగు నేలమీద కంటే తమిళ, మలయాళ, హిందీ ప్రాంతాల్లో ఈ చిత్రం చూసినవారిని నివ్వెరపరుస్తోందని రోజూ చూస్తున్న వార్తలూ, ప్రసారాలూ చెబుతున్నాయి.
    రాజమౌళి గత చిత్రాలతో పోలిస్తే కథ చాలా బలహీనంగా ఉందన్నది బహుశా నిజమే కావచ్చు కానీ అటు చరిత్ర, ఇటు పౌరాణికం అనిపించుకోని కల్పితగాథగా బాహుబలి తెలుగేతర ప్రాంతాలను మంత్రముగ్ధులను చేస్తోంది. “ఉత్తర భారతంలో తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన రాజమౌళి” అంటూ చిమట రాజేంద్రప్రసాద్ గారు చేసిన వ్యాఖ్య మట్టుకు నిజం. 30 ఏళ్ళ క్రితం హిమ్మత్ వాలా తర్వాత అంతకు మించిన స్థాయిలో తెలుగు దర్శకుడు ఉత్తరభారతం మొత్తంమీద తన ప్రభావం చూపటం ఇదే తొలిసారనుకుంటాను. హిందీ టీవీ చానల్స్ ఇంత పెద్ద ఎత్తున రోజుల తరబడి బాహుబలి భారీతనం గురించి దాని భారతీయ రూపం గురించి ప్రశంసించటం ఇప్పుడే జరుగుతోంది. అందుకే బాహుబలి ఏదో మాయ చేస్తోందనటం. రాజమౌళి తన కలను అద్భుతంగా మార్కెట్ చేసుకున్నారంటేనే బాగుంటుంది. అంతకుమించి ఇది సగటు ప్రజానీకానికి కలిగించే ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చు. తన భేషజాన్ని తప్ప ఇతర భాషా ప్రాంతాలను గుర్తించని తమిళ చిత్రం రంగం, ప్రజలు బాహుబలిని చూస్తూ వెర్రెత్తిపోతున్నారని వార్తలు. ఈ కోణం నుంచి చూస్తే ఇది మామూలు సినిమా కాదు. 10 రోజుల్లో 350 కోట్లు వసూళ్లు అనే వార్త వినడానికే మైండ్ బ్లోయింగ్ గా ఉంది.
    తెలుగు చిత్రసీమలో, సమాజంలో కులాధిక్యతలు, వర్గ భేషజాల ప్రభావాలు ఈ సినిమా హైప్‌ లోనూ చోటు చేసుకుంటున్నాయని మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలిపై అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యాఖ్యానించటం కూడా వివాదాస్పదం అయి తీరుతుంది. కాని వీటిని పట్టించుకోకుండా సినిమాను ఒకసారి చూస్తే పోయె.

    బాహుబలి సినిమా గురించి ఒక తెలుగు టీవీ ఛానల్లో వచ్చిన ఈ భీకర హైప్ గురించి కింది లింకులో చూడవచ్చు.

  23. వినోదాన్ని వినోదంగానే చూడాలి. కథల్ని కథలుగానే చూడాలి. ఐడియాలజీ దృష్టితో చూడకూడదు. ఎన్ని లోపాలున్నా బాహుబలి ఏదో ఓ కొత్తదనాన్ని ప్రజలకి అందిస్తోంది. లేకపోతే ప్రపంచ జనం ఉత్తిపుణ్యానికి 350 కోట్ల రూపాయలు (ఇప్పటి దాకా) కుమ్మరించరు. “ఆ జనమంతా మూర్ఖులు, మనం మాత్రమే తెలివైనవాళ్ళం” అనుకోవడం కరెక్టు కాదు.

  24. వావ్ సూపర్బ్ అన్న…..

Leave a Reply to mohan.ravipati Cancel reply

*