దేహాలు –దేవాలయాలు – కొన్ని సందేహాలు

కొండేపూడి నిర్మల 

 

nirmalaమధ్యప్రదేశ్ లో ఏడేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదన్ లాల్, కోర్టులో శిక్ష ఖరారయన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులతో రాజీ పడ్డాడు. దీ౦తో నిందితునికి విధించిన ఏడాది జైలు శిక్ష సరిపోతుందంటూ హైకోర్టు  అతని విడుదలకు ఆదేశించీంది. ( నేరస్తుల పట్ల కోర్టులు ఎంత సహోదర ప్రేమతో వుంటాయో మనకి తెలుసు.). దీనిపై  మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి౦ది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు  మాత్రం అత్యాచార కేసుల్లో రాజీ ఒప్పందాలు చెల్లవని, మెతక వైఖరిని ప్రదర్శించడం,  నిందితులను రాజీకి అనుమతించడ౦ తీవ్రమైన తప్పిదమని అది మహిళల ఆత్మగౌరవాన్ని కీంచపరఛడమే అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

ఇంతవరకు బానేవుంది.. మధ్యప్రదేశ్ హైకోర్టు కంటే మన సుప్రీకోర్టు కొ౦చెం విచక్షణతో వ్యవహరించింది  అని సంతృప్తి కూడా కలిగింది.

ఎందుకంటే అవిచ్చినంగా నడుస్తున్న కాఫ్ పంచాయితీల దగ్గర నుంచి సుప్రీ౦కోర్టు దాకా అత్యాచార బాధితురాల్ని, ఆ నేరం  చేసినవడు లగ్గం చేసుకు౦టే  న్యాయం జరుగిపోయినట్టే భావిస్తాయి.  . “గృహ ప్రవేశం”  సినిమా ఇదే కధా వస్తువుతో  350 రోజులు ఆడింది. కర్తవ్యం లో ఒక పోలీసు ఆఫీసరు  దగ్గరుండి బాధితురాలికి నేరస్థుడితో పెళ్లి జరిపిస్తుంది. చివరికి ఆ పెళ్ళిలో కూడా నేరస్థుడూ అతని తండ్రీ కలిసి  బాధితురాలిపై హత్యా ప్రయత్నం చేస్తారు . అయినా ఆ ప్రయత్నాన్ని  ఆ పోలీసు ఆఫీసరు తెలుసుకుని కాపాడి “ కలకాల౦ కలిసి వుండ “ మని ఆశీర్వదిస్తు౦ది. ఇలాంటివన్నీ  జనం కళ్ళకి అసహజంగా కాకుండా ఆనందబాష్పాలతో తిలకించేలా చెయ్యడానికి ఒక భావజాల౦ వుంది . మధ్యయుగాలకు చెందినట్టు కనిపించే ఈ భావజాలాన్ని చదువూ వివేకం , సాంకేతిక పరిజ్ణానమ్ ఏవీ మార్చలేవు.  అందుకు ఒక  చిన్న ఉదాహరణగా   పై కేసులో సంచలనాత్మక తీర్పు ఇచ్చిన న్యాయాకోవిదులు    అత్యాచారాల గురి౦చి  ఇచ్చిన నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు. ఏమిటా నిర్వచనం ;

“ఆత్యాచారానికి పాల్పడటం  అంటే దేహాన్ని దేవాలయంగా భావించే మహిళపై దాడి చేయడమే . దానివల్ల అత్యాచార బాధితులు మాన మర్యాదలు కోల్పోతారు. అది వారి ప్రాణాలను హరించడంతో  సమానం. ‘

తీర్పు  హేతు బద్ధంగానూ ,  నిర్వచనం దానికి భిన్నంగా వుండటానికి వెనకగల కారణ౦ నాకు చాలా  ఆసక్తి కలిగించింది.  పై మాటలు  స్త్రీలందరి దేహ దేవాలయాల శీలా సంపదల  గురించి న్యాయమూర్తులూంగారు   అంటున్నప్పటీకీ సందర్భం మాత్రం ఏడేళ్ళ పాప గురించే.  అదృష్టవశాత్తూ అంత లావు భావజాల౦ ఆ పాప కెలాగూ అర్ధాంకాదు.

ఆ మాటకొస్తే తన శరీర నిర్మాణమేమిటో , ఎవడు ఎందుకు  దాడిచేశాడో,  అసలు ఏం జరిగిందో తెలుసుకునే౦త వయసుకూడా లేదు. తెల్సిందల్లా  భయానకమైన దాడి, గాయాలు, రక్తస్రావం. మానసికంగా ఒక దిగ్భ్రాంతి. ఇలాంటప్పుడు తక్షణమే వైద్యం జరగాలి. వైద్యమ౦టే  ఆస్పత్రిలో వుంచి కట్టుకట్టడం మాత్రమే కాదు.  ఏ పరిసరాలు, సంఘటనలు, మనుషులు ఆమెని అంత భీతావహురాల్ని  చేశాయో దానికి దూరంగా వుంచడం , .కుటుంబం ,సమాజం ఆమె పట్ల సానుభూతి  కాకుండా సహానుభూతి కలిగివుండటం, . క్రమక్రమంగా ఆమె మనసుని  చదువు వైపు , ఆటలపాటలవైపు, ఆమె కిష్టమయిన మరో వ్యాపక౦ వైపు మళ్ళీంచడం- ఇవి కదా  జరగాలి.. వీటివల్ల మాత్రమే బాధితురాలు కోలుకోవడానికి అవకాశం వుంది. అదే సమయంలో  నేరస్థుడికి చట్టబద్ధంగా  విచారణ, రిమాండ్ , శిక్ష ఇలాంటి లాంటివన్నీ జరగాలి.

అంటే అటు ఆ పాపకి జరిగిన అన్యాయానికి, ఇటు నేరస్థుడి చర్యకీ చట్టం  బాధ్యత వహించాలి.  కానీ  వాస్తవంలో ఏం జరుగుతోంది? ఆ  నేరస్థుడ్ని తెచ్చి బాధితురాలితో పెళ్ళి చెయ్యడం జరుగుతోంది.  దీనివల్ల ఒకసారి అత్యాచారం చేసినవాడికి జీవితాంతమూ అత్యాచారం చెయ్యడానికి బోనస్ లాంటిది  దొరుకడంలేదూ| తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పోరాట౦ చేయాల్సిన బాధిత కుటుంబానికి  నేరస్థుడే మీసాలు తిప్పుతూ అల్లుడవుతాడు. ఎటువంటి శిక్షా, పరివర్తనా లేకుండా అటువంటి నేర ప్రవృత్తి గలవాడిని  ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబంలో  ఇతర బాలికలకు , స్త్రీలకు రక్షణ కరువయ్యే ప్రమాదం లేకపోలేదు.. బాధితురాలు సైతం తన ప్రాధమిక , మానవ హక్కులమీద దాడిచేసినవాడ్ని జైలుకి పంపడానికి బదులు ప్రేమిస్తూ, సేవలు చేస్తూ , వారసుల్ని కనివ్వాలి. ఇంత రోతను భరించినా సరే ఆమె ప్రాణానికి రక్షణ వుందో లేదో తెలీదు. అప్పుడు గృహహింస బాధితురాలి చిట్టాలో ఆమే పేరు నమోదవుతుంది.  ఇన్ని చట్ట విరుద్ధ , అప్రజాస్వామ్య , పౌరుష హీన చర్యలన్నిటికీ సదరు  స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధతో అల్లిన భావజాలమే కారణం.

ప్రస్తావన కోసం మళ్ళీ నిర్వచనాన్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం

స్త్రీలు  తమ శరీరాల్ని దేవాలయాలుగా భావిస్తారని సామాజం భావిస్తుందిట..  ముస్లిం స్త్రీలయితే మసీదులుగా , క్రైస్తవ స్త్రీలయితే చర్చీలుగా భావించుకోవచ్చు. పోనీ కాస్సేపు నిరర్ధకమయిన ఈ పోలికతోనే ఆలోచిద్దాం. మామూలుగా దేవాలయాల్లో  ఒక పశువు బురదకాళ్లతో అడుగుపెడితే ( రేపిస్టుని నోరులేని పశువుతో పోల్చడం  నా కీష్టంలేదు ) ఏం చేస్తారు? అప్పుడు ఆ ప్రాంతమంతా శుద్ధి చేసి సంప్రోక్షం చేస్తారు. దాంతో పవిత్రత తన్నుకుంటూ వచ్చి తీరుతుంది.. కానీ స్త్రీల విషయంలో ఒకసారి పోయిన పవిత్రత మళ్ళీ రాదు. కాబట్టి ఎవడైతే నేరం చేశాడో వాడే ఆమెని చేపట్టాలి.  అలా చేపట్టేలోపు ఆమే  మాన మర్యాదలు ప్లస్ ప్రాణం కూడా పోయినట్టే భావించుకోవాలి. ఎవదైనా చేపట్టీన తర్వాత అలా భావించనవసరంలేదు.  తాళి కట్టీన తుచ్చుడే రక రకాలుగా భావిస్తాడు కనక. 

అయ్యా | బాబూ | మేము మీ సాటి మానవుల౦, మీరు ఆపాదిస్తున్న  దైవత్వాలూ, పవిత్రతలూ వద్దే వద్దు. రాజ్యాంగం మాకు ప్రసాదించిన   హక్కుల మీద ఎవరేనా దాడి చేసినప్పుడు సకాల౦లో  స్పందించండి, చాలు-  అని మహిళలు ఎప్పటినుంచో తల బాదుకుంటున్నారు. అది మాత్రం జరగడంలేదు.

*

 

మీ మాటలు

 1. Thirupalu says:

  /… అది మాత్రం జరగడంలేదు./
  అది జరిగితే ఇది పేజా సామ్యం ఎందుకు అవుతుంది? ఇది చదివిన పవిత్ర భక్తులు ముక్కు మీద వేలేసుకో గలరు! అమ్మో! స్త్రీలను దేవాలయంతో పోల్చడం తప్పు పట్టటాన్ని విడ్డూరముగా అవక్కాయ అయిపో గలరు. చెప్పిన నాలుగు మాటలు చాలా పదునుగా వున్నాయి. అయినా ఈ భావ జాలాన్నుమ్డి బయటడమ్ ఎప్పటికి సాధ్యమో?

 2. Doctor Nalini says:

  అవును నిర్మలా , మనకి దైవత్వాలూ వద్దు , పూజలూ వద్దు . మన హక్కులు మనకి ఇస్తూ , మనల్ని తోటి మనుషులుగా బతకనిస్తే చాలు . అయినా ఎవరో ఇచ్చేది ఏమిటి ? మనమే పోరాడి సాధించుకుందాం . చేయి చేయి కలుపుదాం .
  ఒకప్పుడు ఘర్ లాంటి సినిమాల్లో భర్త చేయుతని చూపించారు. తనూజ వేసిన ఒక బెంగాలీ సినిమాలో ఆమె , ఆమె తండ్రి కలిసి అపరాదులకి శిక్ష పడే వరకు చేసిన పోరాటాన్ని చూపించారు . సునీత కృష్ణన్ లాంటి వీరులు అననుకూల పరిస్థితుల్ని తమకి అనుకూలంగా మలుచుకుని పని చేయడం చూస్తున్నాం . అందుకే , ఆశని కోల్పోవద్దు . కలిసి ఎదిరిద్దాం , మన గొంతులు వినిపిద్దాం.

 3. Phoenix says:

  అయ్యా | బాబూ | మేము మీ సాటి మానవుల౦, మీరు ఆపాదిస్తున్న దైవత్వాలూ, పవిత్రతలూ వద్దే వద్దు. రాజ్యాంగం మాకు ప్రసాదించిన హక్కుల మీద ఎవరేనా దాడి చేసినప్పుడు సకాల౦లో స్పందించండి, చాలు- అని మహిళలు ఎప్పటినుంచో తల బాదుకుంటున్నారు. అది మాత్రం జరగడంలేదు.

  కదా! పవిత్రతని మన సమాజాలు అణచివేతకి మార్గంగా వాడుకుంటాయి.

 4. buchi reddy gangula says:

  స్త్రీ లు తమ శరీరాల ను దేవా ల యా ల తో —సరి అయిన అబిప్రాయం కాదను కుంటాను

  స్వేఛ్చ // సమానత్వం — లేక యిప్పటి కి స్త్రీ లు — మైనస్ — తక్కువ — అని తలుస్తూ

  చూస్తూ ఉన్న తిరు లో — మార్పు రావాలి —
  ఆర్థికం గా — విద్యా పరం గా స్త్రీ లు ఎదుగాలి — కుల మత పట్టింపులు లేన్నప్పుడు
  కొంత మార్పు ను చూడ గలమని అనుకు ఉంటాను —- మొదలు స్త్రీ ల మనస్సు లో
  వాళ్ళ చూపుల్లో — వాళ్ళ చేతల్లో — వాళ్ళ ఆలోచనల్లో — మార్పు రావాలి
  బాబాల // జియ్యం గారల ఉపదేశాల ను నమ్మకూడదు —upvaasaalu-
  మొక్కులు —భర్త అయిషు కోసం పూజలు — అన్ని పోవాలి

  13 నెలలు గడిచినా తెలంగాణా ప్రభుత్వం లో — స్త్రీ కాబినెట్ లో లేదు –??
  ఎందుకో ?? దేనికో ???

  చక్కగా చెప్పారు నిర్మల గారు —-
  ———————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 5. నీహారిక says:

  @బుచ్చిరెడ్డి గారు,

  స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు కదండీ ? చేవెళ్ళ చెల్లెమ్మ చేసిన సంతకాలు చూసిన తరువాత ఆడవాళ్ళని మంత్రులుగా తీసుకునే ధైర్యం ఎవరు చేస్తారు ? తెలంగాణాలో మంత్రి అయే స్థాయి ఉన్న నాయకురాళ్ళు లేరు.ఆంధ్రా లో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేరు.ఎవరైతే ఏమిటి మంత్రి పదవిలో ఆడవాళ్ళు ఉండితీరాలన్న ఉదారస్వభావం కే సీ ఆర్ గారికి లేకపోవడం మంచిదే !

 6. buchireddy gangula says:

  ని హారిక గారు

  పద్మ గారు డిప్యూటీ స్పీకర్ —-??
  అనుభవం — దేనికండి — నారాయణ Andhra కాబినెట్ లో ఉప ముఖ్యమంత్రి ???
  రాజీవ్ గాంధి primeminister….. రేపు Rahul ???ఆంద్ర లో lokesh–c.m..??
  మీకు తెలుసు — మన ప్రజా సామ్యం లో నాయకులు కావాడానికి ఏ qualifications…అంటూ
  అవసరం లేదు
  యి రోజుల్లో ప్రతిది వ్యాపారం గా —
  సాహిత్యం కూడా వ్యాపారం గా మారిపోయింది— యి రోజు పేస్ బుక్ లో స్కై బాబా గారి
  పోస్టింగ్స్ చూశాను — మైనారిటీ సాహిత్యం అంటూ ఉపన్యాసాలు యిస్తాదట — ప్లస్ ఏదో
  పేపర్ కోసం — ఒక్క జిల్లాలో నే 80000 రూపాయిలు విరాళాలు సేకరించాడట —దానికి సంఘిశెట్టి శ్రీనివాస్ గారి మద్దతు —- skybaba– కన్నా గొప్ప రచయితలు తెలుగు సాహిత్యం లో లేకపోలేదు — అఫ్సర్ gaaru–యాకూబ్ gaaru– సలీం గారు –రహంతుల్లా గారు — షా జ హాన gaaru– ఎందరో ఉన్నారు –సాహితీ పరుల కు honesty..sinceraity.. vision.. లు ఉండాలి — అంతా రాజకియెం
  నిజాలు చెప్పడానికి భయం దేనికండి ??
  skybaba..is..so..so.writer… ( ready..for..reply..)
  ———————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 7. Rajasekhar says:

  దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః అని అందరి దేహాల గురించీ అన్ని జీవాత్మల గురించీ చెప్పబడింది. కేవలం స్త్రీల గురించి కాదు. స్త్రీలు ప్రత్యేకంగా దేవతలని ఏ హిందూగ్రంథమూ పేర్కొనడం లేదు. ఈ అభిప్రాయం ఎలా ప్రచారంలోకొచ్చిందో తెలీకుండా ఉంది. హిందూమతంలో పురుషదేవతలతో పాటు స్త్రీదేవతలు కూడా ఉన్నారు. కానీ స్త్రీలంతా దేవతలని ఎక్కడా రాయలేదు. ఇహపోతే స్త్రీలని మగవాళ్ళలాంటి మామూలు మనుషులుగా చూడడానికి స్త్రీవాదులే వ్యతిరేకం.

మీ మాటలు

*