దేశమంటే మట్టికాదు, మోపులు

కందుకూరి రమేష్ బాబు 

 

Kandukuri Rameshమనం నివసించే చోటు గురించి ఒకసారి ఆలోచించాలి. మనం బస్సెక్కే చోటు గురించి కూడా.
అక్కడెంతో యాక్టివిటీ వుంటుంది. ప్రయాణీకులమే. కానీ, వేచి చూడటమూ ఉంటుంది.

మనతోపాటు పలుగూ పారా ఉంటే అవి. మనం తీసుకెళ్లి అమ్మే చీపుర్లు వుంటే అవి. అవి కూడా ఎదిరిచూస్తూ ఉంటాయి.

అవీ మనతో పాటు నిలబడతాయనే చెప్పడం. చూపడం.

తొలిసారిగా మనిషెత్తుగా చీపుర్లు అలా ఒక కట్టగా కట్టి నిలబెట్టడం. ఒక మోపుగా పెట్టి పక్కన ముచ్చట్లలో లీనమవడం. అట్లా వాళ్లందరూ బస్సు రాక కోసం ఎదిరి చూడటం. అంతానూ చిత్రంగానే ఉండింది. అయితే, చూడగా చూడగా యధాలాపంగా మారిపోతాం. కొన్ని చూపులు అలవాటై ఆ తర్వాత ఆశ్చర్యం అదృశ్యమే అవుతుంది. అలా కాకుండా చేసేదే కళ.

తొలిసారిగా మనిషెత్తుగా ఆ చీపుర్లని చూసింతర్వాత వాటి అందం నెమలి పించంలా విరుస్తూ ఉండగా
హృదయం పుష్ఫమే అయింది. ఇక అప్పట్నుంచి చీపుర్లను చూస్తే అవి వికసించిన మట్టి మనుషల్లా, హిమాలయాలంత ఎత్తుగా అనిపించడం తత్ఫలితంగా ఒక పరిమళ భరిత సౌందర్యారాధన మొదలైంది. జీవితం ఒక్కపరి ఎదిగి ముగ్ధులను చేయడం మొదలెట్టింది.

ఆ మనుషులు. వాళ్ల వెంట పిల్లా జెల్లా. ఆ మోపులపై తువ్వాలలు. అంతానూ ఒక పరిసరాల విజ్ఞానం ఒకటి లీలగా మాయగా కమ్ముకుని ప్రతి వృత్తీ,వ్యాపకం చుట్టూ ఉండే జీవకళ అంతానూ మనోహరంగా గోచరించడం మొదలైంది. వాళ్లపట్ల గౌరవాభిమానాలు మున్నెన్నడూ లేనంతగా పెరిగి ప్రతి ఇంట్లో ఒక మూల నక్కి వుండే చీపురు  ఆత్మగౌరవంతో తలెత్తుకునేది ఇక్కడా అని తెలిసి అదొక దర్శనమే అయింది.

ఎవరి సన్నిధిలో వస్తువు తయారవుతుందో అది ఖార్ఖానా. అక్కడ ఆ వస్తువు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో నిలబడుతుందనీ అవగతం అయింది. ఎప్పుడైతే అది ఒకరి సొంతం అయిందా ఇక అది ఏదైనా చీపురే అయి తన పాత్ర వైభవం కోల్పోతుందనీ అర్థమైంది.

అందుకే స్వచ్ఛభారతం, స్వచ్ఛ హైదరాబాద్ వంటి పేర్లతో కూడిన యాక్టివిటీ అంటే చిరాకు. చీపురు పుల్లంత గౌరవం కూడా ఉండదు. నాకు మోపులు కావాలి. జీవన సంపుటులు కావాలి. అందుకే గురజాడ అన్నట్లు దేశమంటే మట్టికన్నా మనుషులని గుర్తుకు వస్తుంది. ఆ మనుషులను వాళ్ల వైభవోపేతమైన సృజనతో కలిపి చూడకపోతే వాళ్లు వెలవెల బోతారు. ఒకవేళ వాళ్లనిలా చూడటం రాకపోతే మనం నిజంగా పారిశుధ్య కార్మికులం అయి మనల్ని మనం ఊడ్చుకోవాలి. శుభ్రం చేసుకోవాలి. నిజం.

సరే.
నాకైతే ఇవి చీపుర్లే. వాళ్లు మోపులే.
వీటిని, వాళ్లనూ చూశాక ఇక నెమలి పింఛం నన్ను ఎన్నడూ లోబర్చుకోదేమో అని ఒక ఆనందం.

అన్నట్టు, ఈ నెలవంకలను, నెమలీకలను, వీళ్లంతా ఇట్లా మోపుకట్టిన ఆ రాశులను, అలా అలవోకగా తలపై వుంచుకుని వారు దబదబా బస్సెక్కి మళ్లీ వాటిని బస్సులో నిలపడమూ చూడాలి. అదొక చిత్రం. తర్వాత వాళ్లు ఈ నలభై నాలుగో నంబర్ బస్టాప్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాక అక్కడ అందరూ దిగుతారు. ఈసారి ఎవరి దారి వారిదే. అలా విడిపోవడమూ ఒక చిత్రం. ఒకటి కాదు, ఎన్నో చిత్రాలు. ఆ తర్వాతా చూడాలి. అదొక గొప్ప చిత్రం. మోపులోంచి ఒక్కొక్కటి అమ్మతూ వుంటే వాళ్ల తలభారం తగ్గుతూ ఉంటే అదొక అందమైన చిత్రం. దిగదుడుపు చిత్రం. చివరాఖరికి, ఒక్కో తల ఒక్క మోపుతో బయలెల్లి సాయంత్రానికల్లా కాళీగా వస్తుంటే తప్పక చూడాలి. అదొక అద్వితీయ చిత్రం.

ఇట్లా దృశ్యాదృశ్యంలో జీవితాలు మహోన్నతంగా ఆవిష్కారం అవుతూ ఉంటై. యధావిధిగా సద్దుమణిగి విశ్రాంతి తీసుకుంటాయి. మళ్లీ తెల్లవారుతుంది. బస్టాపు పరిసరాల్లో మళ్లీ చెట్లు మొలిచినట్లు, చీపురు కట్టలు. వాటి పక్కన ముచ్చట్లు. బస్సుకోసం మళ్లీ వేచి చూపులు.

భారతదేశంలో సామాన్యుల చిత్రయాత్ర ముగియదు.
సశేషం.

*

మీ మాటలు

  1. దేవరకొండ says:

    దే శ మంటే మట్టి, మనుషులు, మట్టి మనుషులు…అంతా కలిసి! ఏసీ మాల్స్ లో బార్ కోడింగ్ చేయబడి mrp కి అమ్ముడవుతున్న చీపుళ్ళు తమ నిర్మాతల దగ్గర వున్నప్పుడు వున్న ‘జీవాన్ని’ ఫోటో లోనూ వ్యాఖ్య లోనూ ఒడిసి పట్టిన రమేష్ బాబు గార్కి అభినందనలు.

  2. N.RAJANI says:

    మీ చీపుర్లు చూడగానే బస్సు స్టాప్ లలో బస్సు లలో చూసే వే ల వేల దృశ్యాలు కళ్ళ ముందు కనిపించాయి. కచ్చితంగా మన నిత్య జీవితంలోని ప్రతిదీ కావ్య వస్తువవుతుంది శ్రీ శ్రీ చెప్పినట్టు కాదే దీ కవిత కనర్హం . బాగుంది రమేష్ గారు. ఈ ప్రేరణతో నేను ఏ మైనా రాయాలనుకుంటున్నా

    • kandukuri ramesh babu says:

      ఒక చిత్రం లేదా ఈ దృశ్యాదృశ్యం కొద్ది ప్రేరణ ఇచ్చినా ఆనందం. వ్యక్తం చేసినందుకు చాల థాంక్స్ రజని గారు.

మీ మాటలు

*