మా ఊరి తొవ్వ

విలాసాగరం రవీందర్

నేను పదోదిల లాగుదొడిగినప్పుడు మా ఊరికి కన్నారానికి
రెండు గంటల తొవ్వ

సుక్కదెగిపడ్డట్టు అచ్చే ఎర్రబస్సు

పోరగాండ్లు బొట్టగాండ్లు ముసలోళ్ళు వయిసోళ్ళకు అదొక  పుష్పక విమానం

యాభై మంది వట్టే దాంట్ల వందమందిమైనా
సోపతిగాళ్ళ  లెక్క సదురుకుంట  కూసునుడు

అత్తుంటే పోతుంటే
అటూ ఇటూ పక్కలకు
పిందె కాయలతోని
నవ్వుకుంట కనబడే మామిడి చెట్లు

ఎర్రపూల గుల్మర్ చెట్లు కదులుకుంట
వక్కడ వక్కడ నవ్వుడు

తీరొక్క చెట్ల
బంగరు పూల నాట్యం
మన్సు పిట్టలెక్క బస్సు చుట్టూ తిరుగుడు

ఎండకాలంల ఎండతెలిసేది గాదు
ఏసీ రూంలకేని పోతున్నట్టు
చెట్ల ఆకుల పందిరేసి నీడ

వాన కాలంల రోడ్డుపొంటి
నిండు కుండోలె వున్న కోపులల్ల
నీళ్లు జూసుకుంట పోతంటే
ఈత గొట్టబుద్దవుడు

పోంగ రొండు గంటలు
పచ్చదనంలో గడిచి పోయేది
రాంగ రొండు గంటలు
చిమ్మ చీకట్ల
తొవ్వ
సుక్కలెక్క గనబడేది

ఏ రాతిరయినా నిమ్మలముండేది
బస్సెక్కినమంటే ఇంట్ల గూసున్నట్టే…

నాలుగ్గంటలయినా
నాలుగు నిముషాల లెక్క గడిచేది
పొయినట్టుండేది గాదు !
అచ్చినట్టుండేది గాదు !!

♧♧♧

పచ్చీస్ సాల్
గిర్రున తిర్గినంక
తొవ్వ పొంటి
చెట్లు మాయమయినయి
ఇనుప కంచెలు మొలిచినయి

కోట్లాది పువ్వుల మొక్కల్ని బొండిగ పిస్కి
నాలుగు రాస్తాల నడుమ
గన్నేరు మొక్కల కింద పాతరేసిండ్రు

పచ్చదనమంతా
నాల్గు వరుసల
రాజీవ్ రహదారి కడుపుల బొందవెట్టి
పైకేని నల్లటి నాగుంబాములా తారేసిండ్రు

ఎర్రబస్సు ఎండల ఎల్సి
పాతసమానయింది

కొత్తగా
రొండు, మూడు నాల్గు పయ్యల బండ్లు
పుట్టుకచ్చినయి
గీరెలు బూమ్మీద ఆనుడేలేదు
తుఫాను గాలోలె ఉరుకుడే

రెండు దిక్కులా
ఒక్క సెయ్యి తో పట్టుకొని
గాల్లె దేలుకుంట
సర్కస్ ల జంతువుల లెక్క బోవుడు

పైకేని ఎండ
పొయ్యిల మంటలెక్క గాల్తది
కింద సీటు
జారుడుబండలెక్క జారుతది
చెయ్యి పట్టు ఇడిసినవా
నూకలు చెల్లినట్లే
రాతిరికి పొయ్యి ఎలుగది

కాళ్లకు గీరెలు కట్టుకున్నట్టు
రయ్యన పోవుడు పెరిగింది
గాని
పానాల మీద ఆశ తగ్గింది

ఇప్పుడు
మా ఊరు బెజ్జంకి కి కన్నారం కు
నలపై నిముషాల తొవ్వ !
కానీ
మనుసుకు మాత్రం
నలబయి గంటల్లెక్క…

*

మీ మాటలు

  1. vijay kumar says:

    superb flow….

    • విలాసాగరం రవీందర్ says:

      ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు.

    • విలాసాగరం రవీందర్ says:

      Dhanyavadalu విజయ కుమార్ garu

  2. Narayanaswamy says:

    కవిత మంచిగుంది – తెలంగాణ భాష లొ తియ్యగ చేదైన విషయాన్ని చెప్పింది – అస్తవ్యస్తమైన అభివృద్ధి మన మూలాల్ని సమధి చేసి మనకు చేదైన అనుభూతుల్ని గ్నాపకాలని మిగులుస్తుంది

    • విలాసాగరం రవీందర్ says:

      నారాయణ స్వామి గారు మిరన్నది నిజమే. ధన్యవాదాలు.

  3. Jayashree Naidu says:

    ప్రకృతి లోని వికృతిని చిత్రిక పట్టారు…
    అద్భుతం గా వుంది కవిత విలాసాగారం రవీందర్ గారు

    • విలాసాగరం రవీందర్ says:

      ధన్యవాదాలు జయశ్రీ నాయుడు గారు

  4. నిశీధి says:

    పాతికేళ్ళ జీవితం కళ్ళ ముందుకు తెచ్చేసారు , ప్రతి ఇమేజి ఇమాజినేషన్ చేసుకొనే విధంగా మలచిన కవిత కంటే అందమయిన వాక్యాలు ఏముంటాయి ? కుడోస్ .

    • విలాసాగరం రవీందర్ says:

      నిశీది గారు ధన్యవాదాలు

  5. N Venugopal says:

    రవీందర్…

    చాల చాల బాగుంది. ఆలస్యంగా చూశాను క్షమించాలి. కన్నారం ప్రకృతీ మనుషులూ కూడ అద్భుతం. నలబై ఏళ్లుగా కన్నారాన్ని ప్రేమిస్తున్నాను. మీ కవిత చూస్తే కళ్లలో నీళ్లు నిండాయి. బెజ్జారం శివార్లలో చిందిన మిత్రుల నెత్తుటి జ్ఞాపకాలూ ఎన్నో… ఆర్ద్రమైన కవిత రాసినందుకు కృతజ్ఞతలు….

    • విలాసాగరం రవీందర్ says:

      వేణుగోపాల్ గారు ధన్యవాదాలు

  6. Chala bagundi ravinder garu

Leave a Reply to నిశీధి Cancel reply

*