కుంచెకి ఆయుధ భాష నేర్పినవాడు!

పి. మోహన్

 

P Mohanచిత్తప్రసాద్ స్నేహశీలి. దేశంలోనే కాదు నానా దేశాల్లో బోలెడు మంది మిత్రులు. డెన్మార్క్ వామపక్ష కవి ఎరిక్ స్టీనస్, చెకొస్లవేకియా ఇంజినీరు ఇంగ్ ఫ్రాంటిసెక్ సలబా, ప్రాగ్ లోని ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మిలోస్లావ్ క్రాసా, సీపీఐ కార్యకర్త తారా యాజ్ఞిక్, ఆమె భర్త, పిల్లలు, పీసీ జోషి సహచరి కల్పనా దత్తా, బెంగాల్ కరువును, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కెమెరాలో బంధించిన సునీల్ జనా, లక్నో ‘బ్రదర్’ మురళీ గుప్తా, ఎంఎఫ్ హుస్సేన్.. ఇలాంటి కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో చిత్త కలసి తిరిగేవాడు. వీళ్లలో చాలామంది కలిగినవాళ్లు. చిత్త నోరు తెరిచి అడగాలేకానీ వేలు గుమ్మరించగలవాళ్లు. కానీ చిత్త ఎన్నడూ అలా గుమ్మరించుకోలేదు. చిత్తకు కొండంత అత్మాభిమానమని, డబ్బు సాయం చేస్తామంటే చిన్నబుచ్చుకునేవాడని, జాలిపడితే కోపగించుకునేవాడని మిత్రులంటారు.

‘నేను తొలిసారి చిత్త లినోకట్లు చూడగానే ముగ్ధుడిని అయిపోయాను. వాటిలో మతగాథల బొమ్మలు కాకుండా సాదాసీదా బతుకు, పేదల బాధలు ఉన్నాయి. ఇక అప్పట్నుంచి ఏ వారాంతమూ నేను అతన్ని విడిచి ఉండలేదు. అతని గదికి వెళ్లేవాడిని, లేకపోతే మా ఇంటికి పిలిచేవాడిని. కానీ అతడు దుర్భర పేదరికంతో బాధపడుతున్నాడని, పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని చాలా నెలల తర్వాత తెలిసింది. ఆత్మాభిమానంతో అతడు ఆ సంగతిని బయటపడనివ్వలేదు. తన బొమ్మలను నాకు అమ్మడానికీ ప్రయత్నించలేదు. నేనే అతని పరిస్థితి అర్థం చేసుకుని కొన్ని బొమ్మలను కొనడానికి ప్రయత్నించేవాడిని. కానీ అతడు మొండివాడు. బొమ్మల ఖరీదు చెప్పకపోవడంతో పెద్ద చిక్కొచ్చేది. అందుకే నాకు తోచినంత చ్చేవాడిని. అతని జేబులో కాసిని డబ్బులు కుక్కడానికి నానా యాతనా పడేవాడిని.. కొన్నిసార్లు తలప్రాణం తోకకొచ్చేది. డబ్బుసాయంతో మన స్నేహాన్ని కించపరుస్తావా అని కేకేలేసేవాడు..’ అని చెప్పాడు మిత్రుడు సలబా.

‘డబ్బు సంపాదించడానికే బాంబేకి వచ్చి ఉంటే ఎప్పుడో సంపాదించి ఉండేవాడినమ్మా. మార్కెట్ ప్రకారం నడిచే ఉద్యోగాలు నాకు సరిపడవు కనుకే ఉద్యోగం చేయలేదు… చాలామంది కేవలం పెయింటింగులు వేసే మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బాంబేల్లో ఇళ్లు, కార్లు కొనిపడేస్తున్నారు. దీని వెనక ఉన్న మతలబు ఏంటంటే, ధనికులకు తగ్గట్టు మారిపోవడం, ఆత్మగౌరవాన్ని మంటగలుపుకోవడం, కళాసృజనలో దగా చేసుకోవడం. నాకు ఆ దారి తొక్కాల్సిన అగత్యం లేదు..’ అని తల్లికి రాశాడు చిత్త. అతని మదినిండా బొమ్మలు.. బొమ్మలు.. అవికూడా బాధల పాటల పల్లవిని వినిపించే గాఢమైన నలుపుతెలుపు బొమ్మలు..  ఆ బొమ్మలతోనే తను బతకాలి. బొమ్మల్లో రాజీపడకూడదు. కానీ వాటితోనే బతకాలి. ఎంతొస్తే అంత. చేతికష్టంతో నిజాయితీగా బతకాలి. ముంబై పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ కు, బెంగాల్, డెన్మార్క్, చెకొస్లవేకియాల్లోని పబ్లిషింగ్ కంపెనీలకు బొమ్మలు వేశాడు. బాంబేలోని లిటిల్ బ్యాలే ట్రూప్ కు స్క్రీన్లు, క్యాస్ట్యూములూ అందించాడు. బిమల్ రాయ్ కళాఖండం ‘దో బీగా జమీన్’ సినిమాకు లోగో వేశాడు. 1958లో ఎవరో అడిగితే పాల్ రాబ్సన్ జయంతికి నిలువెత్తు పెయింటింగ్ వేశాడు. ఏది వేసినా తనకిష్టమైందే వేశాడు.

struggle

చిత్త వర్ణచిత్రాలు కూడా అతని లినోకట్లంత శక్తిమంతంగా ఉంటాయి. 1938నాటి స్వీయచిత్రంలో ఆలోచనామగ్నుడై కనిపిస్తాడు(ఈ చిత్రం ఈ వ్యాసం తొలిభాగంలో ఉంది). పార్టీ పరిచయాల్లోకి వస్తున్న ఆ యువకుడి ముఖంలో, నేపథ్యంలో అరుణకాంతి అలుముకుపోయింది. వర్ణచిత్రాల్లోనూ అతడు శ్రమైక జీవన సౌందర్యానికే పట్టంగట్టాడు. పోరాటాలనే కాకుండా సంతాల్, కాశ్మీరీ అతివల నృత్యాలను, బాంబే రేవు పడవలను, నగర శివార్లలోని పచ్చిక బయళ్లనూ పరిచయం చేశాడు. చిత్త రంగుల ఆడాళ్ల బొమ్మలు క్యూబిజం, ఫావిజం ప్రభావాలతో పికాసో, మతీస్ లను గుర్తుకుతెస్తాయి. కానీ ఆ మనుషుల హావభావాల్లో అసలుసిసలు భారతీయ ఉట్టిపడుతుంటుంది. చిత్త పంటపొలాలు, పూలగుత్తుల బొమ్మలు అతనివని తెలుసుకోకుండా చూస్తే వ్యాన్గో వేసిన చిత్రాలేమో అనిపిస్తుంది. కానీ చిత్తకు తాను వ్యాన్గోను కానని తెలుసు. ‘నా గురించి నేను ఎక్కువ ఊహించుకుంటున్నానని నువ్వు పొరపడొద్దు మిత్రమా! నేనందుకు పూర్తి భిన్నం. నేను వ్యాన్గో అంత ప్రతిభావంతుడిని కానన్న సంగతి అందరికంటే నాకే బాగా తెలుసు. కాను కనుకే నా జీవితం, మనసూ ఈ దేశ విప్లవపోరాటాల్లో నిమగ్నమైపోయాయి..’ అంటూ మురళికి తనను ఆవిష్కరించుకున్నాడు.

1950 దశకం మధ్యలో చిత్త పపెట్ షోలపై మళ్లాడు. వ్యాపారంపై బాంబేకి వచ్చిన చెక్ మిత్రుడు సలబా పపెట్ షోలు వేస్తుండేవాడు. చిత్తకూ నేర్పాడు. తన దేశానికి వెళ్లిపోతూ పపెట్ సామగ్రినంతా చిత్తకు ఇచ్చేశాడు. చిత్త కూడా కొబ్బరి చిప్పలు, గుడ్డపేలికలు వంటి వాటితో కీలుబొమ్మలు(పపెట్స్) సొంతంగా తయారు చేసుకున్నాడు. తన ట్రూప్ కు ‘ఖేలాఘర్’ అని పేరుపెట్టుకున్నాడు. షోల కోసం కథలూ, పాటలూ రాసుకున్నాడు. ఈ బొమ్మలాట కోసం చుట్టుపక్కలున్న మురికివాడల పిల్లలు చిత్త చుట్టూ మూగేవాళ్లు. చిత్త వాళ్లకు కూడా బొమ్మలాడించడం నేర్పాడు. వాళ్లకు కథలు వినిపిస్తూ ఆ బొమ్మలు ఆడించి, నవ్వుల్లో తేలించేవాడు. వచ్చే కాస్త డబ్బునూ ఈ షోలకు ఖర్చుపెట్టేసి ఉత్త చేతులతో మిగిలిపోయేవాడు. ‘నా దగ్గర ఓ మంచి టేప్ రికార్డర్ ఉండుంటే ఈ షోలలో నాకింక అడ్డేముంది’ అని అన్నాడు చిత్త. అతడు తన బొమ్మలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడని అంటాడు సునీల్ జనా. చిత్త ఫొటోలు కూడా తీసేవాడు. మిత్రులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. కొండకోనల్లో మిత్రులను నుంచోబెట్టి ఫొటోలు తీసేవాడు.

puppets

చిత్త భారతదేశ చరిత్రలో కీలక ఘట్టాలను చూపుతూ బొమ్మలతో పుస్తకం తేవాలనుకున్నాడు. చాలా చిత్రాలు వేశాడు. పబ్లిషర్లు ముందుకురావడం, ముందుకొచ్చిన వాళ్లు డబ్బులివ్వకపోవడంతో ఆ పని ఆగిపోయింది. సలబా సాయం చేస్తానన్నాడు. అయితే వరదల్లో ఆ బొమ్మలు కొట్టుకుపోవడంతో చరిత్ర బొమ్మలు కాలగర్భంలో కలిసిపోయాయి. రామాయణాన్ని బొమ్మలకెత్తే పనికూడా డబ్బు కష్టాలతో ఆగిపోయింది. రామాయణాన్ని ఒక కథలాగే చూసిన చిత్త ఆ బొమ్మలను చాలా సరళంగా, జానపద చిత్రాల శైలిలో వేశాడు. ఇన్ని కష్టాల నడుమ.. తను ఆరాధించే నందలాల్ బోస్ తన లినోకట్లను చూసి మెచ్చుకోవడం, మురికివాడల పిల్లలకు చిట్టిపొట్టి కథలు చెప్పించి నవ్వించడం, ఆడించడం వంటి అల్పసంతోషాలూ ఉన్నాయి.

పార్టీకి దూరమై ఇలాంటి ఎన్ని కళావ్యాసంగాల్లో మునిగినా రాజకీయాలు ఎప్పటికప్పుడు విశ్వరూపంలా ముందుకొచ్చి నిలిచేవి. ఇక మళ్లీ బొమ్మల్లో కార్మికకర్షకులు, రిక్షావాలాలు, విప్లవకారులు ప్రత్యక్షమయ్యేవాళ్లు.

‘జీవితాన్నిపూర్తిగా కళకు అంకింతం చేసి, రాజకీయాలను పక్కకు నెట్టాలని ఎంత బలంగా ప్రయత్నిస్తున్నానో అంత బలంగా ఈ దేశప్రజల రాజకీయాలు తిరిగి నన్ను పట్టుకుంటున్నాయి. అదంతే. కళాకారుడు మనిషి. అంతకు మించి మరేమీ కాదు. తను పుట్టినగడ్డకు అతడు బద్ధుడు. ఈ సంగతి అతనికి తెలిసినా, తెలియకపోయినా అతడు ఈ దేశజనుల జీవితంలో భాగం.. ప్రతి కళాకారుడూ త్వరగానో, ఆలస్యంగానో, తెలిసో  తెలియకుండానో తన నైతిక, రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసి తీరతాడు. నైతికవాదుల, రాజకీయ సంస్కర్తల సంప్రదాయాన్ని నేను నా కళలో ఆచరించి చూపాను. ప్రజలకు అండగా నిలబడ్డమంటే కళకూ అండగా నిలబడ్డమే. కళావ్యాసంగం అంటే మత్యువును బలంకొద్దీ తిరస్కరించమే… రెండో ప్రపంచ యుద్ధం నన్ను సంప్రదాయకళల ప్రభావం నుంచి బయటికి రప్పించింది. నా కుంచెను పదునైన ఆయుధంలా తయారు చేసుకునేలా మార్చింది. నా కళా ఆశయాలు సమకాలీన ప్రపంచంతో సంలీనమయ్యాయి. కళ అనేది నా ఒక్కడి ఆయుధం, కళాకారుడి స్వీయ అభివ్యక్తి ప్రకటన సాధనం మాత్రమే కాదని, అతడు జీవిస్తున్న సంఘపు ఆయుధం కూడా అని అర్థం చేసుకున్నాను. ఆ సంఘంలో అతనితోపాటు, తోటి మనుషుల స్వీయ అభివ్యక్తులు కూడా ఉంటాయి’ అంటాడు చిత్త.

తలకిందుల వ్యవస్థపై అతని ధిక్కారం కేవలం బొమ్మలకే పరిమితం కాలేదు. ఓసారి శివసేన కార్యకర్తలు బాంబేలో బందు చేసి, అంగళ్లను మూయించడానికి చిత్త ఉంటున్న వీధికి వచ్చారు. అతడు కోపంతో వాళ్లముందుకు దూసుకెళ్లాడు. ‘ఏమిటీ దౌర్జన్యం? బందులతో జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ముందు ఇక్కన్నుంచి వెళ్లిపోండి’ అని కేకేలేశాడు. వాళ్లు నోరుమూసుకుని వెళ్లిపోయారు. మరో ముచ్చట చిత్త మాటల్లోనే వినండి. 1959లో ‘‘రక్షణమంత్రి మీనన్ ఎన్నికల ప్రచారం కోసం మా వీధికి వచ్చాడు. దేశం కోసం పనిచేయాలంటూ జనానికి అర్థం కాని ఇంగ్లిష్ లో ఊదరగొట్టాడు. ‘అయ్యా, మీరు చెప్పేది బాగానే ఉంది కానీ, ఈ గడ్డు పరిస్థితుల్లో మేమెలా పనిచెయ్యాలో చెప్పండి’ అని అడిగాను. ‘నీతో తర్వాత మాట్లాడతా’ అని చెప్పి మళ్లీ ఉపన్యాసం దంచేశాడు. తర్వాత ఓ పోలీసు ‘అతడు కమ్యూనిస్టు సర్’ అని మీనన్ కు బిగ్గరగా చెప్పాడు. మీనన్ ముఖంలో భయపు ఛాయలు. ఉపన్యాసం అయిపోయాక కారులో తుర్రుమన్నాడు..’

girl

చిత్తప్రసాద్ అంటే సంతోషంగా ఉండేవాడని అర్థం. ఈ చిత్తప్రసాద్ సార్థకనామధేయుడు కాదు. తన సంతోషాన్ని తృణప్రాయంగా ఎంచి సామాన్యుల ఈతిబాధలను బొమ్మకట్టడానికి తన బతుకును కొవ్వొత్తిలా కరిగించుకుని అసమాన కళాకాంతులు వెదజల్లాడు. మనిషి మనిషిగా బతకాలని సమసమాజ స్వప్నాల్లో పలవరింతలు పోయి తన బాగోగులను మరచిపోయాడు. ‘ప్రకృతి కోతిని మనిషిగా మారుస్తూ.. మానవజాతిని నిరంతరం పునర్నవం చేస్తోంది. అయితే మానవజాతి ఇప్పటికీ కోతిలా వ్యర్థవ్యాపకాలనే ఇష్టపడుతోంది. ఒక పనిచేసే ముందు కాస్త ఆగి, ఆలోచించే ఓపిక లేదు దానికి. దానికి అది కావాలి, ఇది కావాలి, ప్రతిదీ కావాలి.. తనకు దక్కిన దానితో అది తృప్తిడడం లేదు. ప్రతిదాన్నీ కొరికి అవతల పడేస్తోంది. గబగబా మింగింది అరగడం లేదు, అయినా నిరంతరం ఆకలే దానికి. మనిషి మనసులో అసంతృప్తి అనే అజీర్తి ఉంది. స్వార్థపరుడికి రెండే రోగాలు.. దురాశ, అసంతృప్తి.. ’ అని తల్లితో వాపోయాడు చిత్త.

నిత్యదరిద్రం, నిర్నిద్ర రాత్రులు, అనారోగ్యం, ప్రతిదానికి కలతపడిపోవడం, ఇల్లు ఖాళీ చేయాలంటూ యజమాని హెచ్చరికలు.. అన్నీకలసి చిత్తను శారీరకంగా కుంగదీశాయి. అసలు వయసుకంటే పది, పదిహేనేళ్లు పెద్దగా కనిపించేవాడు. 70వ దశకంలో తిండికి చాలా ఇబ్బందిపడ్డాడు. అదివరకు బొమ్మలకొచ్చిన డబ్బుల్లో పదోపరకో తల్లికి పంపుతుండేవాడు. ఇప్పుడు తనకే కష్టంగా ఉంది. ఆదుకునేవాళ్లున్నారు కానీ ఏనుగంత ఆత్మాభిమానం కనుక ఆకలికేకలు రూబీ టెర్రేస్ గది నుంచి బయటికి వినిపించేవి కావు. అరకొరా పనులతోనే కాలం వెళ్లబుచ్చేవాడు. డబ్బు విషయంలో చిత్త ఎంత ‘మొండివాడో’ చూడండి..

chittaprosadఓసారి ప్రముఖ కళావిమర్శకుడు, రచయిత ముల్క్ రాజ్ ఆనంద్.. చిత్త బొమ్మలను అతనికి తెలియకుండా  ఏదో విదేశీ పత్రికకు పంపాడు. అవి అచ్చయ్యాయి. చిత్తకు సంగతి తెలిసి కడిగేశాడు. ఆ పత్రిక పేరున్న పత్రిక కనుక అడిగి డబ్బులిప్పించమన్నాడు. ముల్క్ రాజ్ ‘వాళ్లివ్వరుగాని నా జేబులోంచి ఈ వంద ఇస్తున్నా, తీసుకో’ అని మనియార్డర్ పంపాడు. చిత్త తిప్పికొట్టాడు. తనకు రావాల్సింది ఐదొందలని, కక్కి తీరాల్సిందేనని పట్టుపట్టాడు. ఇదే చిత్త చెకొస్లవేకియా పబ్లిషింగ్ కంపెనీకి మరోరకంగా షాకిచ్చాడు. ఆ కంపెనీ చిత్తతో కవర్ పేజీలు, ఇలస్ట్రేషన్లు వేయించుకుని చెక్కు పంపింది. చిత్త ఆ మొత్తాన్ని చూసి నిప్పులు తొక్కి వెనక్కి తిప్పిపంపాడు. తనకు రావాల్సినదానికంటే పదింతలు ఎక్కువిచ్చారని, తను తీసుకోనని రాసి పంపాడు. కంపెనీ తలపట్టుకుంది. తమ దేశంలోని మార్కెట్ ప్రకారమే డబ్బు ఇచ్చామని, అంతకంటే తక్కువిస్తే మోసం చేశారంటూ అధికారులు తమను ఇబ్బందిపెడతారని రాసింది. చిత్త వెనక్కి తగ్గలేదు. చివరికి అతడు బొమ్మలను వాపసు తీసుకుంటాడనే భయంతో కంపెనీ ఏవో తంటాలు పడి చిత్త అడిగిన తక్కువ డబ్బు ఇచ్చేసింది. ఇంత అమాయకుడు ఇప్పుడు తన బొమ్మలకు లక్షలు విలువకడుతున్న నేటి ఆర్ట్ మార్కెట్ ను చూసుంటే గుండెపగిలి చచ్చుండేవాడు.

చిత్త చిత్రాలను మనవాళ్లకన్నా విదేశీయులే ఎక్కువ కొన్నారు. చిత్త ఊరికే డబ్బిస్తే తీసుకోడు కనుక కొందరు బొమ్మలను వేరేవాళ్లకు అమ్మిపెడతామని చెప్పి తామే ఉంచుకుని డబ్బులిచ్చారు. అతని చిత్రాలు మన దేశంలోకంటే విదేశాల్లోనే ఎక్కువ ఉన్నాయని ఒక అంచనా. అతడు బతికుండగా జరిగిన రెండే రెండు సోలో ఎగ్జిబిషన్లలో మొదటిది 1956లో చెకొస్లవేకియా రాజధాని ప్రాగ్ లోనే జరిగింది, నాటి మన తోలుమందం పాలకుల పరువు తీస్తూ. రెండోది 1964లో కలకత్తాలో జరిగింది. 1972లో చిత్త జీవితం, కళపై చెక్ దేశీయుడు పావెల్ హాబుల్ ‘కన్ఫెషన్స్’ పేరుతో 15 నిమిషాల డాక్యుమెంటరీ తీశాడు. అందులో చిత్త తన కళ, రాజకీయాలు, సమాజం గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. శాంతి ఉద్యమానికి ఇది దోహదమంటూ డాక్యుమెంటరీకి వరల్డ్ పీస్ కౌన్సిల్ అవార్డు కూడా వచ్చిది.

చెకొస్లవేకియా వాసులు చిత్తను తమవాడే అన్నంతగా అభిమానించారు. చేవచచ్చిన స్వతంత్ర భారతావనిలో అతని కళకు గౌరవం దక్కకున్నా, నిత్యం పోరాటాలతో వెల్లువెత్తిన తూర్పు యూరప్ దేశాల్లో అతని బొమ్మలకు జనం గుండెల్లో దాచుకున్నారు. అతని బొమ్మలను పత్రికల్లో అచ్చేసుకున్నారు. తమ పుస్తకాలకు ఎక్కడో దేశాల అవతల ఉన్న అతన్ని వెతికిపట్టుకుని బొమ్మలు వేయించుకున్నారు. అతని కవితలను అనువదించుకుని మురిసిపోయారు. అతన్ని ఎలాగైనా తమ దేశానికి తీసుకెళ్లాలని సలబా విశ్వప్రయత్నాలు చేశాడు. చిత్తతో పపెట్ షో ఇప్పించేందుకు ప్రయత్నించాడు. క్రాసా డబ్బు సర్దాడు. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ చిత్తకు చెక్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఖర్చులు పెట్టడానికి హామీదారు కావాల్సి వచ్చింది. సలబా బాంబేలో తనకు తెలిసిన ఒకతన్ని హామీదారుగా ఉండమన్నాడు. అతడు సరేనన్నాడు.

 

డాక్యుమెంట్లపై సంతకాల కోసం చిత్తను అతని దగ్గరికి పంపాడు సలబా. ఆ హామీదారు మాటల మధ్యలో ‘నా దయవల్లే నువ్వుపోతున్నావు..’ ధోరణిలో కించపరచేలా మాట్లాడ్డంతో చిత్త సర్రున అక్కన్నుంచి వచ్చేశాడు. ప్రయాణం ఆగిపోయింది. మరోసారి 1965లో చెక్ పపెట్రీ గ్రూప్ ‘రోదోస్త్’ కళాకారిణి ఇవా వోడికోవా ద్వారా ప్రయత్నించాడు సలబా. ఆమె భారత్ కు వచ్చినప్పుడు చిత్తను కలసి ప్రయాణానికి ఏర్పాట్లు, అనుమతులు అన్నీ సిద్ధం చేసింది. ఆమె ఏదో పనిపై ఇండోనేసియా వెళ్లి విమానంలో తిరిగొస్తూ కైరోలో విమానం కూలడంతో చనిపోయింది. తను చెక్ ను చూసే భాగ్యానికి నోచుకోలేదంటూ సలబాకు లేఖ రాశాడు చిత్త. సలబా చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ప్రయాణానికి అన్నీ సిద్ధమయ్యాక ప్రయాణించాల్సినవాడు లోకంలో లేకుండా పోయాడు.

1976 ప్రాంతంలో చిత్తకు బ్రాంకైటిస్ సోకింది. దాదాపు 32 ఏళ్లపాటు బాంబేలో బతికి, అక్కడి మనుషుల సుఖదుఃఖాలు పంచుకుని, వాటిని బొమ్మల్లోకి తర్జుమా చేసిన ఆ అపురూప కళావేత్తను పట్టించుకునే నాథుడే లేకపోయాడు ఆ మహానగరంలో. చెల్లి గౌరి బాంబే వచ్చి అన్నను కలకత్తా తీసుకెళ్లింది. తన దేశప్రజల ఆరాటపోరాటాలను నాలుగు దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా చిత్రికపట్టి, కన్నీటి వరదలు పారించి, గుండెనెత్తురులు ఉప్పొంగించి.. ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వన్ అండ్ ఓన్లీ చిత్త 1978 నవంబర్ 13న కలకత్తాలోని శరత్ బోస్ రోడ్డులో ఉన్న రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాన్ జనరల్ హాస్పిటల్లో 63వ ఏట పరమ అనామకంగా కన్నుమూశాడు.

1979లో ప్రాగ్ లో, కలకత్తాలో అతన్ని స్మరించుకుంటూ ఎగ్జిబిషన్లు పెట్టారు. తర్వాత ప్రాగ్, ఢిల్లీ, హైదరాబాద్ లలో అతని బొమ్మలు ప్రదర్శించారు. 2011లో ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ అతని చాలా బొమ్మలను సేకరించి ఢిల్లీ, ముంబై, కలకత్తాల్లో ఎగ్జిబిషన్లు పెట్టింది.

చిత్త దేశానికి ఇచ్చినదానితో పోలిస్తే దేశం అతనికిచ్చింది శూన్యం. ‘నా పెయింటింగులను ఇంట్లో ఉంచుకోవడం నీకు కష్టమవుతుందమ్మా. వాటిని గంగానదిలో వదిలెయ్’ అని చిత్త తన చెల్లితో అన్నాడంటే ఈ దేశం అతని కళను అతడు బతికి ఉన్నప్పుడు ఎంత గొప్పగా గౌరవించిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ కరువుకు బలైన మిడ్నపూర్ లోని స్వాతంత్ర్య వీరులను తలచుకుంటూ చిత్త తన ‘ హంగ్రీ బెంగాల్’లో.. ‘నిన్న మన స్వాతంత్ర్యం కోసం తెగించి పోరాడిన దేహాలను ఇప్పుడు కుక్కలు, రాబందులు పీక్కుతుంటున్నాయి. ఒక దేశం తన యోధులకు అర్పించే నివాళి ఇదేనా?’ అని ఆక్రోశించాడు.

చిత్త చరిత్రను, అని ప్రజాకళాసంపదను కన్నెత్తి చూడదల్చుకోని నేటి మన పేరుగొప్ప ప్రజాస్వామ్య పాలకులు అతనికి అర్పిస్తున్న నివాళి అంతకంటే ఘనంగా ఉందా? రవీంద్రనాథ్ టాగూరు వందో జయంతినే కాకుండా 150వ జయంతినీ కోట్లు ఖర్చుపెట్టి జరుపుకుని, అతని ‘వెర్రిమొర్రి’ బొమ్మలను దేశమంతటా తిప్పారు మూడేళ్లకిందట యూపీఏ పాలకులు. దేశజనుల బాహ్యాంతరంగాలను, దారిద్ర్యాన్ని, మౌనవేదనను ఉట్టిపడే భారతీయతతో అనితరసాధ్యంగా వర్ణమయం చేసిన అమృతమూర్తి అమృతా షేర్గిల్ శత జయంతి పండుగను అతిజాగ్రత్తగా మరచిపోయారు. అమృత బొమ్మలకంటే ప్రమాదరకమైన బొమ్మలు సంధించిన చిత్త వందో జయంతిని అతడు నరనరానా ద్వేషించిన నాగపూర్ నాజీ పాలకులు పట్టించుకుంటారనుకోవడం భ్రమ.

blue flowers

చిత్త పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. బడుగుజీవుల సుఖసంతోషాల కోసం తపనపడ్డాడు. తన కళతో వాళ్ల కన్నీరు తుడిచి, వాళ్లతో జెండాలు, బందూకులు పట్టించి దోపిడీపీడకుల గుండెలపైన కదం తొక్కించాడు. చిత్త ఆదర్శాలు, విలువలు ఏమాత్రం ‘గిట్టుబాటు’ కాని వ్యవహారాలు కనుక అతనికి వారసులు లేరు. ‘భారత్ లో గ్రాఫిక్ కళలు, ఇప్పటికీ నిరాశాపూరితంగా, బలహీనంగా ఉన్నాయి. ప్రచారం, ఆదర్శాల వంటివాటిపై కళాకారులు మొగ్గుచూపకపోవడం కారణం కావచ్చు’ అని చిత్త 1958లో అన్నాడు. నేటికి తేడా ఏమైనా ఉందా? చిత్త రాజకీయ విశ్వాసాలు, వాటిపట్ల అతని నిబద్ధత వల్లే అతనికి బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ‘మెయిన్ స్ట్రీమ్ ఆర్ట్’ లో ఎన్నడూ చోటు దక్కలేదు.

చిత్త కలలు ఇంకా ఫలించలేదు. ఆన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం, కరువంటూ కాటకమంటూ కనుపించని కాలాలు చాలా చాలా దూరంలో ఉన్నాయి. లినోలపై, కేన్వాసులపై చిత్త గొంతుచించుకుని శఠించిన దుర్మార్గాలు, దోపిడీపీడనలు ప్రజాస్వామ్యం, దేశభక్తి ముసుగుల కింద కోట్లరెట్లు పెచ్చరిల్లి జనాన్ని కాల్చుకుతింటున్నాయి. ఆనాడు ఒక్క బెంగాల్లోనే కరువైతే, నేడు దేశమంతా తిండిగుడ్డనీడల కరువులు. ‘96 కోట్ల సెల్ ఫోన్లు’,   అధికారిక దొంగలెక్కల ప్రకారమే 40 కోట్ల మంది నిత్యదరిద్రులు ఉన్న ఘన భారతావనిలో ఈ కరువులతో నల్ల, తెల్ల కుబేరులను బలుపెక్కిస్తూ మన జీడీపీ, తలసరి ఆదాయం తెగ వాచిపోతున్నాయి. చిత్త తుపాకులు, గొడ్డళ్లు ఎక్కుపెట్టిన విదేశీగద్దలు నల్లదొరల ఆహ్వానాలతో మందలుమందలుగా ఎగిరొచ్చి మాయారూపాల్లో ఈ గడ్డ సరిసంపదలను తన్నుకుపోతున్నాయి.

అతడు తిరుగాడి బొమ్మలు వేసిన బెజవాడ నేలతల్లిని ‘రాజధాని’ మంత్రగాడు చెరపట్టాడు. చిత్తను రగిలించి, మురిపించిన సాయుధపోరుసీమలో నయా నిజాంలు తుపాకుల అండతో కొత్త గడీలు కడుతున్నారు. నైజాము సర్కరోన్ని గోల్కండా ఖిల్లా కింద గోరీ కడతామని యుద్ధగీతికలతో గర్జించిన ప్రజాకవుల, కళాకారుల వారసులు పెరుగన్నం కోసం కొత్త నిజాం పంచన చేరి అతన్ని స్తోత్రపాఠాలతో ముంచెత్తుతూ మహోన్నత పోరాట వారసత్వాన్ని పెంటకుప్పలో బొందపెడుతున్నారు. చిత్త ద్వేషించిన నిరంకుశ, స్వార్థకపటాల క్రీనీడలు మరింత ముదిరి మదరిండియా అంతటా గాఢాంధకారం అలుముకుంది.

మరి ఈ చీకటి తొలగిపోదా? అడుగు కదిపితే చాలు కత్తులు దూసి నెత్తురోడిస్తున్న ఈ తిమిరానికి అంతం లేదా? చిత్త తన నిశాగంధి(‘నైట్-కాక్టస్) కవితలో ఏమంటున్నాడో వినండి..

‘ఈ కటికచీకటి రాత్రి కదలబారుతుంది

అంతవరకు నేనిక్కడ చేయాల్సిందొకటే

ఈ తిమిరాన్ని వెలిగించి

పరిమళాలతో ముంచెత్తడం..

*

 

 

మీ మాటలు

 1. Dr. Vijaya Babu, Koganti says:

  Simply Excellent Mohan ji

 2. N Venugopal says:

  మోహన్

  చిత్తప్రసాద్ కూ నీకూ తల వంచి సవినయ వందనం.

  విచారజలధి నిండిన కళ్లతో నీకూ చిత్తప్రసాద్ కూ క్షమాపణలు.

  మన నేల సృష్టించిన ప్రతిభ పట్ల గర్వంతో నీకూ చిత్తప్రసాద్ కూ కృతజ్ఞతలు.

  • P Mohan says:

   వేణు సర్,
   నాకూ కళ్లు తడయ్యాయి. మీ వందనం, క్షమాపణలు అందుకేనంత అర్హుణ్నికాను నేను. చిత్తప్రసాద్ శతజయంతి సందర్భంగా ఓ చిన్నపుస్తకాన్ని కూడా తీసుకురాలేకపోయినందుకు, పోతున్నందుకు నన్ను నేనే క్షమించుకోలేకుండా ఉన్నాను. చిత్తను సమకాలమువారే కాదు భావితరాలూ గుర్తించకుండా అపురూప కళను మరచిపోతున్నాయనే బాధ.

 3. buchi reddy gangula says:

  యిద్దరికీ నా సాల్యుట్స్ —???
  ********************************************
  బుచ్చి రెడ్డి గంగుల

 4. P Mohan says:

  విజయబాబు, బుచ్చిరెడ్డిగార్లకు ధన్యవాదాలు

 5. మంజరి లక్ష్మి says:

  చాలా బాగా రాసారండీ. మీరు రాసింది చదువుతుంటే కళ్లంబడి నీళ్లొచ్చాయి. చిత్త ప్రసాద్ గారి గొప్పతనం మీ మాటల్లో తెలుసుకోగలిగినందుకు కృతజ్ఞతలు.

 6. Thirupalu says:

  కళ్ళ నీల్లు తెప్పించారు.

 7. Wonderful article, thanx mohan garu,pl send your email id to…denchanala@yahoo.com

మీ మాటలు

*