బూతు కన్నా యమ డేంజర్… ఎస్కేపిజం!

 ‘‘బృహస్పతి’’

 

(తెలుగు సినీరంగంలో పాత ఒరవడి ఒకటి ఇప్పుడు కొత్తగా మొదలైంది. వందల కోట్లపెట్టుబడులకు తోడు అందివచ్చిన అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో భారీ చిత్రాలను హాలీవుడ్ చిత్రాలకు దీటుగా నిర్మిస్తున్నారు. దీనికి మనం గర్వించాలి. ఈ చిత్రాల కథలు, తీరుతెన్నులను చూసి అప్రమత్తం కూడా కావాలి. 65 ఏళ్ల కిందటే ఈ సమస్యపై ‘‘బృహస్పతి’’ కలంపేరుతో ఒకరు తెలుగు స్వతంత్ర వారపత్రిక(1949 సెప్టెంబర్ 16 సంచిక)లో  కళాక్షేత్రం శీర్షిక కింద రాసిన వ్యాసం ఇది. సేకరణ: వికాస్)

 

చాలా ఏళ్ల క్రితం కొత్తగా మార్క్సిజం అవగాహన చేసుకుంటున్న నా మిత్రుడొకడికి ధర్మసందేహం కలిగింది: ‘‘జన సామాన్యం(అప్పట్లో) నాదియా స్టంటు చిత్రాలు ఎగబడి చూస్తున్నారు గదా, అదే నిజమైన  ప్రజాకళ అనుకోవద్దా? వాటిని అల్పసంఖ్యాకులైన మనవంటి మేధావులు తిట్టటం ప్రజాసామాన్యానికీ వారి అభిరుచులకూ ద్రోహం కాదా?’’

ఈ ప్రశ్నకు నాకు అప్పట్లో తోచిన సమాధానం: ‘‘మేధావులు ప్రజాస్వామ్యాన్ని అభిమానించవచ్చు గాని వారి దారిద్ర్యాన్నీ తక్కువ అభిరుచులనూ అభిమానించనవసరం లేదు. ప్రజాసామాన్యం జీవితంలో అవసరమైన మార్పులు తెచ్చేదెవరు? వారిని అభిమానించే మేధావులే’’

ఇవాళ కూడా ప్రజాసామాన్యం ప్రకటించే తక్కువ తరగతి అభిరుచులు సమస్యగానే ఉన్నాయి. వాళ్లిప్పుడు ‘నాదియా’ స్టంటు చిత్రాలు చూడడం లేదుగాని ‘జానపద’ కుంటి చిత్రాలు చూస్తున్నారు. ప్రజల అభిరుచి అంతేననే సమాధానంతో తృప్తిపడనవసరం లేదు.

కళాభిరుచిలో కూడా ఇతర విషయాలలోలాగే, వ్యక్తి వైఖరీ, సముదాయ వైఖరీ ఉన్నాయి. ఈ తారతమ్యం అర్థం చేసుకోకపోతే, వెనక నా మిత్రుడికి వచ్చినట్లే అనేకమందికి అనేక ధర్మసందేహాలు కలిగి, తప్పుడు సిద్ధాంతాలు ప్రచారంలోకి వస్తాయి- ఇప్పుడు వస్తున్నాయి కూడానూ. ఇటువంటి సిద్ధాంతాలు మచ్చుకు ఒకటి, రెండు మనవి చేస్తాను.

ప్రజలకు నచ్చటమే అభ్యుదయ కళకు గీటురాయిగా పెట్టుకోవడం గురించి ఇంతకుముందే చెప్పాను. ఇంకో సిద్ధాంతమేమిటంటే, మధ్యతరగతి వాళ్ల అభిరుచులు మంచివి కనక, ఆ అభిరుచులను ఏదో విధంగా ప్రజాసామాన్యానికి అంటగట్టి అదే ప్రజాభిరుచి చేయాలని. మరో అభిప్రాయమేమిటంటే ప్రజాసామాన్యానికి కూడా కళలా అని!

ఇటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించేవాళ్లు గ్రహించని విషయమేమిటంటే, ప్రజాసామాన్యానికి కళలతో అవసరం ఉండటమే కాక, కళలను ఆస్వాదించే శక్తి కూడా ఉన్నదని. వారికి లేని శక్తి ఏమిటంటే, ‘‘శిల్పం కోసం శిల్పాన్నీ’’, ‘‘పాండిత్యం కోసం పాండిత్యాన్నీ’’ ఆరాధించటం. మధ్యతరగతి వాళ్ల అభిరుచులలో ఈ రెండు అంశాలూ తప్పిస్తే అవే ప్రజాసామాన్యం యొక్క అభిరుచులు కూడానూ. ఈ వ్యత్యాసం ఉన్నంతమాత్రం చేత ప్రజలకు కళలవసరం లేదని గాని, అవగాహన కావనిగాని భావించనవసరం లేదు. శిల్పనైపుణ్యాన్నీ, పాండితీ ప్రకర్షనూ చూసి ఆనందించటమే కళల యొక్క పరమార్థాన్ని గుర్తించటమని మధ్యతరగతివారు సంతృప్తి చెందనవసరం అంతకన్నా లేదు.

maya mahal

అయితే ఈ  మాట అనుకున్నంత మాత్రం చేత ‘నాదియా’, ‘జానపద’ చిత్రాల సమస్య తేలదు. ఈ చిత్రాలను జనసామాన్యం ఎందుకు ఎగబడి చూస్తున్నారు? శిల్పం గాని, పాండిత్యం గాని లేకపోవటం మించి వీటిలో ఇంకేమైనా ఉందా? లేదు! వీటిని కళాపిసాసతో ప్రజలు చూడడం కూడా లేదు. నిత్యజీవితం దుర్భరమైన ప్రజ తన చుట్టూ ఉన్న సాంఘిక వాతావరణాన్ని మరవడానికి ఈ అభూతకల్పనల శరణుజొచ్చుతున్నది. దీన్ని ‘‘ఎస్కేపిజం’’ అంటున్నాం. కానీ ఇందులో ‘‘ఎస్కేపిజం’’ కన్న కూడా విశేషమైన అంశం ఒకటుంది. అదేమింటంటే వ్యక్తి ప్రేరణలను తృప్తిపరచుకోవటం. ఇది అచ్చంగా ప్రజాసామాన్యం సొత్తు కాదు. ప్రబంధాలలోని పచ్చి శృంగారం ఆప్యాయంగా పఠించేవారంతా కవితా ప్రియత్వంతో ప్రేరేపించబడ్డవాళ్లే ననుకోనవసరం లేదు. అనేకమంది మేధావులు ఈ విధంగా వ్యక్తిగతమైన ఆనందాన్ని పొందుతారు కనక వాళ్లలో నిజమైన కళాపిపాస లేదనటం కూడా తప్పే.

‘‘ఎస్కేపిజం’’ కూడా వ్యక్తిగత ప్రేరణే. దాన్ని మధ్యతరగతివాళ్లు కూడా అలవంబిస్తారు. అయితే కళల ద్వారా ‘‘ఎస్కేపిజం’’ వాంఛించినప్పుడు మధ్యతరగతివాళ్లు శిల్పానికి భంగం రాకుండా చూస్తారు. సామాన్య ప్రజలకు అది అవసరం లేదు.

యుద్ధం జరుగుతున్న కాలంలో ‘‘ఆర్సినిక్ అండ్ ఓల్డులేస్’’ అనే నాటకం అమెరికాలోనూ, ఇంగ్లండులోనూ కూడా అతి విజయవంతంగా నడిచింది. ఆ నాటకంలో ఒక పిచ్చివాళ్ల కుటుంబం ఉంటుంది. వాళ్లలో ఇద్దరు వయసుమళ్లిన స్త్రీలు ఎంతో సద్బుద్ధితో జీవితంలో ఆనందం కోల్పోయిన ముసలి వాళ్లను చేరదీసి హత్యచేసి ఎంతో భక్తిశ్రద్ధలతో వారికి రహస్యంగా ఉత్తరక్రియలు చేస్తూ ఉంటారు. ఈ నాటకంలో శిల్పసమృద్ధికేమీ లోటు లేదుగానీ కళాప్రయోజనం మృగ్యం. అయినా ప్రజలు- అన్ని తరగతుల వాళ్లూ- ఈ నాటకం చూడటానికి వేలం వెర్రిగా ఎగబడ్డారు. యుద్ధకాల జీవితం గురించి మరచిపోవటానికీ, హత్యలు చేసేవాళ్లను చూసి నవ్వుకోవటానికీ ఈ నాటకం మంచి అవకాశం ఇచ్చింది.

ఈ పనినే ప్రస్తుతం ‘జానపద’ చిత్రాలు కూడా చేస్తున్నాయి. ఈ చిత్రాలను మధ్యతరగతి మేధావులు సహించలేకుండా ఉన్నారంటే వారందరూ ‘ఎస్కేపిజం’ కోరనివాళ్లని భావించరాదు. అందులో చాలా మంది ఈ చిత్రాలతో శిల్పసౌష్ఠవం ఉంటే తప్పక ఆనందించగలరు. అందువల్ల, ఏతావాతా, తేలేదేమంటే, కొందరు ప్రాజ్ఞులు ‘జానపద’ చిత్రాలనూ, వాటిని చూసే అల్పసంఖ్యాక ప్రజలనూ తిట్టటానికి నిజమైన కారణం కళాభిమానం కాదు, ప్రజాభిమానమూ కాదు.

కాని ఈ ‘జానపద’ చిత్రాలకు విరుద్ధంగా తీవ్రమైన ప్రచారం జరిగి వీటిని నిర్మూలించవలసిన అవసరం ఉంది. ఇది ప్రజాజీవితాన్ని విధ్వంసం చేసే యుద్ధకాలం కాదు, ప్రజాజీవితం నిర్మాణం కావలసిన కాలం;  ప్రజలు తమ జీవిత సమస్యల నుంచి పరారీ కావలసిన కాలం కాదు, వాటిని దృఢంగా ఎదుర్కోవలసిన కాలం. నైతికంగా తాగుడు ఎటువంటిదో ఈ తుచ్ఛమైన ‘జానపద’ చిత్రాలూ అటువంటివే. వీటి ద్వారా సాంఘిక ప్రయోజనం సాధ్యమవుతుందని ఎంత మతిమాలిన ప్రభుత్వం కూడా అనలేదు. అయినా అసంఖ్యాక ప్రజలు తాత్కాలిక ఆనందం కోసరం ఈ చిత్రాల మీద అంతులేని డబ్బు ఖర్చు చేస్తున్నారు. కాని ప్రభుత్వాన్ని నిషేధించమంటే ఈ చిత్రాలను నిషేధించదు. చిత్రనిర్మాణం ఒక పరిశ్రమ. పరిశ్రమలంటే మన ప్రభుత్వానికి భక్తివిశ్వాసాలు జాస్తి.  పెట్టుబడిదార్ల లాభాలు అతి పవిత్రమైనవి. ప్రజాక్షేమం కన్న పెట్టుబడిదార్ల లాభాలు అత్యంత పవిత్రమైనవి. ప్రభుత్వం గీసిన నీతినియమాల గిరిలో ఉండి చిత్రనిర్మాతలు ఎంత పనికిమాలిన చిత్రాలైనా తీయవచ్చు.

నన్నడిగితే చిత్రాలలో ‘‘బూతు’’ కన్నా ‘‘ఎస్కేపిజం’’ చాలా ప్రమాదకరమైనది. ‘‘ఎస్కేపిజం’’ కాకబోతే ‘‘బూతు’’లో తప్పేమీ లేదు. సినిమా చిత్రాలు చూసే వాళ్లంతా నిన్ననే కళ్లు తెరచిన పసిపాపలు కారు.

చిత్రనిర్మాతల లాభకాంక్షకూ కళాప్రయోజనానికీ ఉన్నది కేవలం బాదనారాయణ సంబంధం. ప్రజలలో ఉండే చైతన్యాన్ని అణచిపెట్టి, వారి మౌఢ్యాన్ని బలపరచే కళలను కళాభిమానులైన మేధావులు తీవ్రంగా నిరసించవలసి ఉన్నది. ఈ పనిని పత్రికలు కూడా దీక్షగా సాగించాలి.

*

 

 

 

 

మీ మాటలు

  1. Chimata Rajendra Prasad says:

    చిత్రనిర్మాణం ఒక పరిశ్రమ. పరిశ్రమలంటే మన ప్రభుత్వానికి భక్తివిశ్వాసాలు జాస్తి. పెట్టుబడిదార్ల లాభాలు అతి పవిత్రమైనవి. ప్రజాక్షేమం కన్న పెట్టుబడిదార్ల లాభాలు అత్యంత పవిత్రమైనవి. ప్రభుత్వం గీసిన నీతినియమాల గిరిలో ఉండి చిత్రనిర్మాతలు ఎంత పనికిమాలిన చిత్రాలైనా తీయవచ్చు.
    The writers of 1940s were thinking more progressively than today. The situation has become worse today.

  2. సరైన సమయంలో సరైన వ్యాసం….హాలీవుడ్ చీకిపారేసిన…..చైనా సినిమా గోకి పారేసిన లాంటి గ్రాఫిక్స్ తో …..మనమూ హాలీవుడ్ రేంజికి వెళ్ళామని శునకానందం పొందుతున్నారు….

    –నిజమే….ఈ గ్రాఫిక్ సినిమాలు…(.జానపద) డ్రగ్స్ కన్నా డేంజర్ ….

    -మనమూ అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలంటే కావాల్సింది చీకి పారేసిన గ్రాఫిక్స్ కాదు…..కొత్తగా ఆలోచించడం….
    -కలర్ ఆఫ్ ప్యారడైజ్ …లాంటి సినిమాలో ఏ గ్రాఫిక్స్ ఉన్నాయి……?
    మా చిన్నపుడు కత్తి కాంతారావు సినిమాలు చూసి….మేం కూడా కట్టెలతో యుద్ధాలు చేసే వాళ్ళం….
    -మన వాళ్ళ సినిమాలు కూడా….300′ అవతార్ లాంటి సినిమాలు చూసి చేస్తున్న కత్తి యుద్ధాలు తప్ప మరోటి కాదు….

  3. buchi reddy gangula says:

    chandh… గారి ఒపీనియన్ తో నేను ఎకిబవిస్తాను
    123 కోట్ల తో రాజమౌళి సినిమా విడుదల —భారతం పోలిక లో ఉంటుందట —
    రాజమౌళి — సత్యజిత్ రాయి — శ్యాం బె న గేల్ కాదు —మామూలు టికెట్ ధర వేయి రూపాయి లు ?? యింకా యీ రోజుల్లో యీ లాంటి సినిమాలు ???యిప్పటికి దేవుళ్ళ కథల ను
    encourage… చేస్తున్న పత్రిక లు —అటు నవరత్న కూర్మ లాంటి సినిమాలు ???
    తెలుగు రాష్ట్రాల లో — దొరల వారసత్వ పాల న లో —-???
    జగమే మాయ — అని పాడుకుంటూ —-
    ————————————————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  4. దేవరకొండ says:

    ఇదీ వ్యాసమంటే! ఇలాంటి వ్యాసాలే రావాలి, అవి చెప్పే భావజాలం సామాన్య ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పట్లో పత్రికలమీద కొంత భ్రమ ఉండేదని, ఉత్తరోత్తరా పత్రికలను కూడా పెట్టుబడి మింగేసిందని నిట్టూర్చాకా, ఇక్కడ గమనించవలసినది ఏమంటే వందల కోట్లతో ఇలాంటి సినిమాలు నిర్మిస్తున్నారంటే, తాగుడు, 5 స్టార్ వ్యభి చారం, గుర్రపు పందాలు, పేకాట క్లబ్బులు, లాటరీలు ఇంకా ఎన్నెన్నో ‘పరిశ్రమల్లో’ పనిచేసే కార్మికుల పట్ల ప్రభుత్వాలకున్న సానుభూతి. పన్నుల రూపంలో ఎంత వచ్చినా ఎన్ని కుటుంబాలు చితికి పోయినా, అయిదేళ్లకోసారి ఓటేసి మళ్ళీ మత్తులో మునిగిపోయే ప్రజల ఇష్టమే శిరోధార్యం. వాళ్ళ సంక్షేమం తో పనిలేదు. ఇంకా ‘పవిత్ర’ ముసుగులో వున్న ‘పరిశ్రమ’ క్రికెట్టు. ఇవన్నీ ప్రజల్ని సర్వ నాశనం చేయడానికి, ఆత్మగౌరవంలేని దద్దమ్మలుగా ఓట్లు వేయడానికి తప్ప మరెందుకు పనికిరాని జీవచ్చవాలుగా ఉంచడానికి దోపిడీ పార్టీలకు బాగా ఉపయోగపడే లంపెన్ వ్యవస్థలు. కూలి చేసుకునే తల్లితండ్రులనుండి, తాము స్వయంగా బాల కార్మికులుగా సంపాదించిన సొమ్ము నుండి ఖర్చు పెట్టి అభిమాన హీరోలకు ఫ్లెక్సీలు పెడుతున్న అమాయక యువతరాన్ని ఏ సినిమా రక్షిస్తుంది? ఏ హీరో ఆదుకుంటాడు? ఇలా ‘బృహస్పతి’ వంటి రచయితలూ, ఇటువంటి పత్రికలూ తప్ప? ఇలాంటి వ్యాసాన్ని వెదికి పట్టుకుని సరయిన సమయంలో అందించిన వికాస్ ను ఎంత అభినందించినా తక్కువే!

  5. pavan santhosh says:

    జానపద ధోరణులు ఊహాశక్తిని అభివృద్ధి చేస్తాయి, సాంఘికమైన వస్తువులతో చెప్పినట్టే వీటితోనూ వస్తుపరంగా ఏం చెప్పాలన్నా చెప్పవచ్చు, సమర్థత ఉండాలే కానీ. ఈ కబుర్లతోనే తెలుగు సాహిత్యంలో ఊహ చంపేశారు, తెలుగు పిల్లలకు సృజన వికసించకుండా చేశారు. మళ్ళీ అవే కబుర్లు మొదలయ్యాయి. తస్మాత్ జాగ్రత్త.

  6. N Venugopal says:

    అభిప్రాయాలు, వ్యక్తీకరణలు, వాక్యనిర్మాణం చూస్తే ఇది స్పష్టంగా కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన వ్యాసం అనిపిస్తున్నది. అయితే విరసం ప్రచురించిన కొకు రచనా ప్రపంచం 14 (సినిమా వ్యాసాలు – 1), 15 (సినిమా వ్యాసాలు – 2) సంపుటాలలో ఈ వ్యాసం లేదు. అందువల్ల రచయిత కుటుంబరావు కాదా అని అనుమానించవలసి వస్తున్నది. అదనపు సమాచారం తెలిసిన వారెవరైనా పంచుకుంటే బాగుంటుంది….

    • Thirupalu says:

      మీరన్నది నిజం సర్

    • వికాస్ says:

      వేణుగారు,
      ఈ వ్యాసాన్ని అనుకోకుండా చూసినప్పుడు కొకునే రాశాడేమోనని నాకూ అనిపించింది. కొకు సమగ్రసాహిత్య సంపుటాలకు సహసంపాదకత్వం వహించిన క్రిష్ణాబాయి గారికి ఫోన్ చేశాను, కొకునే రాశాడా అని. బృహస్పతిపేరుతో కొకు రాసినట్లు తెలియదే అన్నారావిడ. కొకు భార్య వరూధిని గారిని అడిగితే తెలుస్తుందేమో, అడుగుతాను అని చెప్పారు. తెలుగు స్వతంత్ర పత్రికలో బృహస్పతి కలం పేరుతో సినిమాలు, నాటకాలపై ఇంకొన్ని వ్యాసాలు కొకు శైలికి దగ్గరగా ఉన్నాయి. అయితే అవి ఈ వ్యాసమంత ఘాటుగా లేవు. కొన్నయితే మరీ పేలవంగా, వార్తల్లా ఉన్నాయి. ఇవన్నీ చూశాక.. ‘జానపద’ చిత్రాల పీడ అనే ఈ వ్యాసాన్ని కొకు కాకుండా ఎవరో కమ్యూనిస్టు రచయిత రాసి ఉంటాడేమోననిపిస్తోంది. ఈ వ్యాసాలు కొకువే అయితే కొకు సాహిత్యానికి చేర్పు అయినట్లే.

  7. Chimata Rajendra Prasad says:

    వేణు!
    నాకూ అలాగే అనిపిస్తోంది

  8. Mythili abbaraju says:

    వ్యాసం రాసింది కొకు అనేదానిలో అనుమానం లేదు. సంపుటాలు వచ్చేప్పటికి జీవించి ఉన్నా చేర్చి ఉండేవారు కాదేమో. మంచి learner కనుక అభిప్రాయాలను revise చేసుకుంటూ వచ్చారు. చందమామను తీర్చిదిద్దినది జీవిక కోసమే అయి ఉన్నా , తన పేరును బయట పెట్టుకోకపోయినా – అంత’ ప్రమాదకరపు ఎస్కేపిజాన్ని ‘ సహించి ఊరుకున్నారు కాదా ? [ ఆ పత్రికని పెద్దవాళ్ళూ చదువుకునేవారు ]

    కాగా , All work- no play వల్ల ఏమీ ఒరగదని నాకు గట్టి అనుమానం…..

  9. Naveen Namboori says:

     సినిమా నిర్మాణంలో భారీతనం ఉంటే సరిపోదు, కథా కథనాలలో నవ్యత ఉండాలని చెప్పడం వ్యాస సేకర్త ఉద్దేశం అయితే దానితో ఏకీభవించక తప్పదు. కానీ ఈ వ్యాసం 1949 నాటి పరిస్థితులను ప్రతిబింబించి ఉండొచ్చేమో గాని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించాలని చూడడం పెద్దగా అతికినట్టు నాకనిపించడం లేదు. ఒక పాత చింతకాయ నిర్వచనంతో కట్టి పడేసి మేధావుల దృక్కోణంలోంచి ఓవర్ ఎనలైజ్ చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. ఎస్కేపిస్టు సినిమా మీద ఏవగింపు ఉంటే అలాంటి ఒక సినిమా పోస్టరు ఎరవేసి ఈ వ్యాసం చదివించాలని చూడడం దేనికిందికొస్తుంది? రెండొందల కోట్ల రూపాయల సొంత డబ్బుతో సినిమా తీయడం ఏ విధంగా నేరం? పాపం మేధావులంతా చందా వేసుకుని సత్యజిత్ రేలను మరింతమందిని తయారుచేయలేక పోయారా? సినిమా పరమార్థమేమిటనే ప్రశ్నకు జవాబు వెదికితే ఇలాంటి హ్రస్వదృష్టితో కూడిన తీర్పులు, తీర్మానాలు ఉండవు. అన్నిరకాల సినిమాలు అవసరమే. ఇటీవల వేరే దేశాల్లో తీయబడ్డ  ‘ఎ సెపరేషన్’, ‘వింటర్ స్లీప్’, ‘ఈడా’ లాంటి  సినిమాలు చూస్తే మనవాళ్ళు కూడా  అలాంటి సినిమాలు తీస్తే ఎంత బావుణ్ణో కదా అనిపించడం సహజం. కానీ దానర్థం ఒక తరహా సినిమాలకు ఒక లేబుల్ తగిలించి వాటి అవసరం లేదనడం కాదు. రాజమౌళి ఒక కమర్షియల్ దర్శకుడు. భావోద్వేగాలను తారాస్థాయిలో చూపడం మీద ఆధారపడి మాత్రమే సినిమా తీస్తానని బాహాటంగానే చెబుతున్నప్పుడు, బాహుబలి లాంటి సినిమాలో కథా కథనాలను కొత్తపుంతలు తొక్కించి ఉంటాడని అస్సలు అనుకోను. కానీ అలాంటి సినిమాలు ఎందుకు తీయాలంటే – భారతదేశం మంగళ్‌యాన్ వంటి ప్రాజెక్టు ఎందుకు చేపట్టాలో – అందుకు. ఏదో ఒక విషయంలో ఒక చిన్న ముందడుగు వేయడం మనబోటి దేశానికి గొప్ప విజయం కిందే లెక్క.  ఎస్కేపిస్టు సినిమాలు తీయడం మానేస్తే భారతదేశంలో మేధావుల శాతం అమాంతంగా పెరిగిపోతుందా? ప్రపంచంలో ఏ దేశంలో అలాంటి సినిమాలు తీయకూడదన్న పాలిసీ ఉందో కాస్త ఎవరైనా సెలవిస్తే బావుంటుంది. పక్కనున్న చైనా సహా. 

    • వికాస్ says:

      నవీన్ గారు,
      మీ అభిప్రాయాల్లో వైరుధ్యాలు ఉన్నాయి. ఒక పక్క అన్ని సినిమాలు అవసరమేనంటూ మరోపక్క సత్యజిత్ రే సినిమాపై వెటకారం చల్లారు. మేధావుల సినిమాలు ప్రజలకు వ్యతిరేకం అని మీరెందుకనుకుంటున్నారు? మీరు చెప్పిన ‘ఎ సెపరేషన్’, ‘వింటర్ స్లీప్’లు మేధావుల చిత్రాలనేనుకుంటా. చార్లీ చాప్లిన్ చిత్రాలు మేధావుల చిత్రాలా, ప్రజల చిత్రాలా? ‘‘బృహస్పతి’’ తన వ్యాసంలో జానపద అనే పదాన్ని కోట్స్ లో ఉంచడం గమనించండి. జానపదం పేరుతో జనజీవితంతో ఏమాత్రం సంబంధంలేని నిరర్థక సినిమాలపైనే ఆయన దాడి చేశారు. నవ్యత అంటే కేవలం గ్రాఫిక్స్, సెట్టింగులేనా? ‘జానపద’ కుంటి చిత్రాలను నిషేధించాలని ‘‘బృహస్పతి’’ అనడం అతిగా ఉన్నా మొత్తంగా ఆయన వ్యాసంలోని స్ఫూర్తిని మీరే కాదు, వ్యాసాన్ని విమర్శిస్తున్నవారందరూ పట్టించుకోవడం లేదు. లేకపోతే ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారు. ముక్కవాసన కొడుతున్న కొత్త ఆవకాయకంటే పులుపు తగ్గని పాత చింతకాయ పచ్చడే మేలు. కూలిసైనికులందరూ చంపుడు పందెమాడి రాజుకు రాజ్యాన్నిదక్కించడం, బ్రాహ్మల కాళ్లకు మొక్కడం, మధ్యమధ్యన దేవుడి మాయలు, లీలలు.. ఇవన్నీ కొత్త ‘ఊహలు’ అయితే అవి జనానికి వద్దే వద్దండి.

      రెండొందల కోట్ల సినిమా సంగతి. అన్ని కోట్లు ’సొంత డబ్బు’ ఎలా అవుతాయనేది వేరే ప్రశ్న.మోసం లేకుండా వ్యాపారం ఉండదు. ఆ సినిమాకు 120 కోట్లే ఖర్చుపెట్టారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమా తీసిన రామోజీ ఫిలిమ్ సిటీలో చాలా మాయలు జరిగాయని ఫిలిమ్నగర్ వర్గాల భోగట్టా. స్టూడియోను వాడుకున్నందు దాని అధినేత డబ్బు పుచ్చుకోకుండా తనకు రావాల్సిన డబ్బును ఆ సినిమా పెట్టుబడిగా కలిసేసుకోమన్నాడట. ప్రభాష్ పారితోషం 24 కోట్లు, తమన్నా, అనుష్కల ఇతర నటుల పారితోషికాలు కలిపి 30, 40 కోట్లు ఉన్నాయట. మిగతా కాకిలెక్కలన్నీ కలిపి 200 కోట్లు. ఇక మీడియాలో నెలరోజులుగా జర్నలిస్టులను మచ్చిన చేసుకుని శరపరంపరగా వదిలిన హైప్ బాణాల సంగతి చెప్పక్కర్లేదు.

Leave a Reply to pavan santhosh Cancel reply

*