రెండు సమయాల్లోంచి..

బాలసుధాకర్ మౌళి

 

ఈ మంచు కురుస్తున్న ఉదయప్పూట –
చన్నీళ్ల స్నానం చేసి
టవల్ వొంటికి చుట్టుకుని
ఆ పిల్లాడు చేస్తున్న నాట్యం
ఏ నాట్యాచార్యుని నాట్యం కన్నా
తక్కువ కాదు –

నాట్యం వికసించాలంటే
ఏ గొప్ప వేదికో
వేలాది మంది కొట్టే చప్పట్లో
పొగడ్తలో
అవసరం లేదు
నాట్యంతో తన్మయత్వం చెందాలి –

నాట్యం వికసించడానికి
చిన్న పూరిపాకలోని చిన్న స్థలమే చాలు –

ఆ రైల్వే గేటు పక్కన
ఆ చిన్న పూరిపాకలో
వాళ్లమ్మ
పొయ్యి దగ్గర కూర్చుని టీ కాస్తుంది
నాన్న
మంటని ఎగేస్తాడు
ఆ పిల్లాడు నర్తిస్తూ వుంటాడు
టీ కొట్టుకి
వొచ్చిపోయేవాళ్లంతా
ఉదయం అప్పుడే ఉదయించడాన్ని
కళ్లారా
తన్మయత్వంతో
అక్కడే చూస్తుంటారు –

ఒకానొక వేసవి మధ్యాహ్నం
అక్కడ
ఆ రైల్వేగేటు పక్కన
పూరిపాక ఉండదు
పసిపాదాల పరవళ్లతో పరవశించిన
ఆ టీ ప్రియులూ ఉండరు
రోడ్డుని తవ్వి పోశాక
ఆ టీ కొట్టు బతుకులోంచి
ఉదయం మాయమైపోతుంది

*

కలత కలతగా ఉంది
ఆ పిల్లాడి నృత్యం
తెల్లారి అనుభవం
దూరం దూరం జరిగిపోతున్నట్టే ఉంటుంది
ఈ నేల మీద
మళ్లీ ఉక్కుపాదాల బరువే
మోపబడుతున్నట్టూ
అనిపిస్తూ అనిపిస్తూ ఉంది !

బాలసుధాకర్ మౌళి

*

మీ మాటలు

  1. విలాసాగరం రవీందర్ says:

    కవిత ముగింపు అద్భుతంగా ఉంది బాల సుధాకర్ మౌళి గారు. కంటిని తడి చేసింది

  2. m.viswanadhareddy says:

    నేల నుంచి దేహం నుంచి మనిషిని మనిషి తత్వాన్ని ఖాళీ చేస్తున్న వైనం .. విషాదభరితం

  3. అనుకుందాం .. ఆ పసివాడు ఎక్కడో నర్తిస్తూనే ఉంటాడని, వాళ్లమ్మ పొయ్యి దగ్గర కూర్చుని టీ కాస్తూనే ఉంటుందని , నాన్న
    మంటని ఎగేస్తూనే ఉంటాడని ..కళ్ళారా మరెవరో తన్మయత్వంతో చూస్తుంటారని అనుకుందాం !! ఈ కాస్త రైల్వే గేటు పక్కన మాత్రం మళ్లీ ఉక్కుపాదాల బరువే మోపబడుతున్నట్టు … నేల కోసం బాధ పడదాం _/\_ very touchy Sir :(

  4. devulapalli durgaprasad says:

    చాలా బాగుంది. మది తడి చేసే అక్షరాల జల్లు మీ కవిత. ఏమో ఆ పిల్లాడు బడిలో చేరి పోయి మరింత మెరుగైన జీవితం గడిపే దిశగా వెళ్లిపోయిందేమో ఆ కుటుంబం….

    • srinivasarao says:

      చాలా బాగా చెప్పారు దుర్గాప్రసాద్ గారు. ఆ అబ్బాయి బడిలో చేరిపోయి మరింత మెరుగైన జీవతం గడిపే దిశగా ఆ కుటుంబం వెళ్లిపోయిందేమో అన్న మీ వాక్యం చాలా బావుంది. గొప్ప ఆశావహముంది మీ వాక్యంలో. మౌళి …ఆ పాకలో ఆ కుటుంబం పడుతున్న కష్టాన్ని మరింతగా కవితలో వివరించి వుంటే బావున్ను అనిపించింది. రోడ్డును తవ్విపోసాక ఆ టికొట్టు బతుకులోంచి ఉదయం మాయమై పోతుంది అని అంటే అంతవరకూ ఆ కుటుంబం సౌక్యంగా ఉందనే అర్ధం ధ్వనిస్తుంది. ఎల్లకాలం ఆ కుటుంబం అలానే టీ లు అమ్ముకుంటూ వచ్చేవారి ముందు ఆ పిల్లడు నాట్యం చేస్తుంటే బావుంటుంది అనే అర్ధం మెండుగా ధ్వనిస్తుంది. దుర్గాప్రసాద్ గారు మీరు రచయతకు చేసే సూచన చాలా బావుంది. ధన్యవాదాలు.

  5. Aranya Krishna says:

    ఈ దేశంలో బాల్యానికి, నిరుపేద బాల్యానికి నెత్తిమీద బతుకుపోరాట కత్తి వేలాడుతుంటుంది. ఈ దేశంలో నిరుపేదలు చచ్చిపోయాక కానీ నిలకడగా ఆరడుగుల నేల దొరకదు.

మీ మాటలు

*