ఆ చిత్రాల ముందు తుపాకులు కొయ్య బొమ్మలే!

పి. మోహన్ 

P Mohanకరువు బొమ్మల తర్వాత చిత్తప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలాడు. ఢంకను వాయిస్తున్న మనిషి బొమ్మతో ‘ఇప్టా’కు లోగో వేశాడు. 1943లో లెనిన్ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు విద్యార్థి సంఘం తరఫున 43 మంది దేశవిదేశ కమ్యూనిస్టు యోధుల చిత్రాలతో ఓ ఆల్బమ్ తయారు చేసి పార్టీకి అందించాడు. ఇందులో మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావో మొదలుకొని, పుచ్చలపల్లి సుందరయ్య వరకు ఉన్నారు.

1944 మార్చి 12, 13న విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభకు చిత్త హాజరయ్యాడు. ఎన్నో చిత్రాలు గీశాడు. ఎర్రజెండాలు కడుతున్నవాళ్లను, వంటలు వండుతు వాళ్లను, లంబాడాల నాట్యాలను.. ప్రతి సందర్భాన్నీ చిత్రిక పట్టాడు. తెలుగు రైతుల హావభావాలను, ఆశనిరాశలను తెలుగువాడే వేశాడని భ్రమపడేలా పరిచయం చేశాడు. సభలను విహంగవీక్షణంలో చూపుతూ గీసిన స్కెచ్చులో ఓ బ్యానర్ పై ‘కయ్యూరు కామ్రేడ్స్ గేట్’ అని తెలుగులో రాశాడు. కయ్యూరు అమరవీరులపై చిత్త అంతకుముందే ఓ బొమ్మ వేశాడు. కేరళలోని కయ్యూరు గ్రామంలో 1942లో భూస్వాములపై కమ్యూనిస్టుల నాయకత్వలో రైతాంగం తిరగబడింది. ఓ పోలీసు చనిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణచేసింది. నలుగురు యువ రైతునాయకులను ఉరితీసింది. చిత్త ఆ నలుగురిని ఉరితీస్తున్న దృశ్యాన్ని ఒకపక్క.. నేలకొరిగిన వీరుడి చేతిలోని జెండాను చేతికి తీసుకుని సమున్నతంగా పట్టుకున్న మహిళను మరోపక్క చిత్రించాడు. చిత్రం మధ్యలో ఆ వీరుడికి కమలంతో నివాళి అర్పిస్తూ, అతని పోరు వారసత్వాన్ని ఆవాహన చేసుకుంటున్న బాలుడిని నుంచోబెట్టాడు.

R0189P049-011-2318KB

R0189P049-011-2318KB

భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి(1946 -51) చిత్త చిత్ర హారతులు పట్టాడు. యావద్దేశానికి ఆశాకిరణంలా జ్వలించిన ఈ పోరాటంపై వేసిన బొమ్మల్లో వర్గకసి నిప్పులను కురిపించాడు. కాయకష్టంతో చేవదేరిన తెలంగాణ రైతు ధిక్కారాన్ని, త్యాగాన్ని నలుపు తెలుపుల్లోనే ఎర్రజెండాల్లా రెపరెపలాడించాడు. బ్రిటిష్ పాలకులు, వాళ్ల కీలుబొమ్మ నిజాం, అతగాడి రజాకార్ ముష్కరులు, యూనియన్ సైన్యం కలసికట్టుగా సాగించిన దారుణమారణకాండలో నెత్తురోడిన తెలంగాణను గుండెల్లోకి పొదువుకుని దాని వేదనను, ఆక్రోశాన్ని రికార్డు చేశాడు. సంకెళ్లు తెంచుకుంటున్న రైతులను, శత్రువు గుండెకు గురిపెడుతున్న గెరిల్లాలను, సుత్తీకొడవలి గురుతుగ ఉన్న జెండాలతో సాగిసోతున్న ఆబాలగోపాలాన్ని, రజకార్ల, యూనియన్ సైనికుల అకృత్యాలకు, అత్యాచారాలకు బలైన పల్లెజనాన్ని.. పోరాటంలోని ప్రతి సందర్భాన్నీ చిత్త ఒక నవలాకారుడిలా రూపబద్ధం చేశాడు.

ఒక చిత్రకారుడు సాయుధ గెరిల్లాలతో కలసి తిరిగి బొమ్మలేయడం మన దేశ కళాచరిత్రలో అపూర్వఘట్టం. నాటి తెలుగు ప్రజాచిత్రకారులకు చిత్త ఒక ఆదర్శం. మాగోఖలే, గిడుతూరి సూర్యం తదితరులు వేసిన తెలంగాణ సాయుధరైతు పోరాట చిత్రాలకు, కార్టూన్లకు చిత్త బొమ్మలే స్ఫూర్తి. ఈ పోరాటాన్ని గానం చేసిన గంగినేని వెంకటేశ్వరావు ‘ఉదయిని’కి చిత్త ఆరు చిత్తరువులు అందించాడు. చిత్తకు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ తెలియకున్నాఅందులోని చాలా కవితలకు అతడు చిత్రానువాదం చేశాడు! చిత్త బొమ్మలు నాటి ‘అభ్యుదయ’, ‘నవయుగ’ వంటి తెలుగు పత్రికల్లోనూ వచ్చాయి.

abyudaya

అభ్యుదయ పత్రిక 1948 ఆగస్టు సంచిక చిత్త వేసిన శ్రామికజంట ముఖచిత్రంలో వెలువడింది. అందులో ఆ బొమ్మ గురించి, చిత్త కళాసారాంశం గురించి ఇలా రాశారు.. ‘స్త్రీ పురుషుల సమిష్టి కృషి ఫలితంగా మానవ జీవితం సుఖవంతమూ, శోభావంతమూ ఔతుంది. పరిశ్రమలో, ఫలానుభవంలో సమాన భాగస్వాములైన స్త్రీపురుషులు ఒకవంక ప్రకృతి సంపదను స్వాధీనం చేసుకుంటారు. గనులు త్రవ్వుతారు. పంటలు పండిస్తారు. తాము శాస్త్రజగత్తును శోధించి సృష్టించిన యంత్రాల సహాయంతో తమ శ్రమశక్తిని సద్వినియోగం చేస్తారు. తమ హృదయాన్ని, మేధస్సును విశ్వంలోని గుప్తరహస్యాలను గ్రహించటానికి ప్రయోగిస్తారు. జంతువైన నరుడు, జగత్తునిండా వ్యాపించి, మానవుడుగా దివ్యమూర్తిగా వికసించటానికి చేసే సమిష్టి కృషికి, ప్రపంచాభ్యుదయానికి చిహ్నంగా ప్రఖ్యాత చిత్రకారుడు చిత్తప్రసాద్ ఈ చిత్రాన్ని రచించాడు.’

చిత్తకు తెలుగువాళ్లతో 1950ల తర్వాత కూడా అనుబంధం కొనసాగింది. 1959లో ముత్యం రాజు, సంజురాజే అనే ఇద్దరు తెలుగు గిరిజనుల బొమ్మలను చిత్త స్పాట్ లో గీశాడు. ఆ బొమ్మలున్న కాగితంపై వాళ్లు తెలుగుప్రాంత గిరిజన వైద్యులు, వేటగాళ్లు అని, గోండులు కావచ్చని రాసుకున్నాడు.

joy

చిత్త 1946 నుంచి బాంబేలో స్థిరపడ్డాడు. పరాయి పాలకులను గడగడలాడించిన 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటును, దాన్ని ఉక్కుపాదంతో అణచేసిన వైనాన్ని బొమ్మకట్టాడు. సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ మాత్రమే మద్దతిచ్చినా, ఇది దేశ సమస్య కాబట్టి కాంగ్రెస్, ముస్లిం లీగులు కూడా కలసి రావాలని ఆ చిత్రాల్లో సుత్తీ కొడవలి జెండాల పక్కన వాటి జెండాలనూ అమర్చాడు. వీటిలోనే కాదు చాలా సమ్మెల చిత్రాల్లో చిత్త ఈ మూడు పార్టీల ఐక్యత అవసరాన్ని గొంతు చించుకుని చెప్పాడు. గాంధీ రాజకీయపరంగా బద్ధశత్రువైనా అతని జనాకర్షణ శక్తి చిత్తనూ లాక్కుంది. గాంధీ నిరాయుధ మార్చింగ్  దృశ్యాలను, అతని ధ్యానదృశ్యాలను చిత్త రాజకీయ శత్రుత్వం, వ్యంగ్యం, వెటకారం గట్రా ఏవీ లేకుండా అత్యంత మానవీయంగా చూపాడు. అతి సమీపం నుంచి చూసిన నేవీ తిరుగుబాటు అతన్ని చాలా ఏళ్లు వెంటాడింది. 1962లో దీనిపై ఓ పెద్ద వర్ణచిత్రం వేశాడు. హార్బర్లో నేలకొరిగిన వీరులు, పోలీసుల దమనకాండ, మౌనంగా చూస్తున్న సామాన్య జనంతో ఆ చిత్రం నాటి పోరాటాన్ని మాటలు అక్కర్లేకుండా వివరిస్తుంది.

1946 నాటి చరిత్రాత్మక పోస్టల్ సమ్మె, 1975 నాటి రైల్వే సమ్మె, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటం.. ఇలా ప్రతి చారిత్రక జనోద్యమాన్నీ చిత్ర బొమ్మల్లోకి అనువాదం చేశాడు. హోంరూల్, జలియన్ వాలాబాగ్, క్విట్ ఇండియా వంటి భారత స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను ‘పీపుల్స్ ఏజ్’ పత్రికలో ‘ఇండియా ఇన్ రివోల్ట్’ బొమ్మల్లో చూపాడు. చేయిపట్టుకుని కవాతు చేయించే ఈ బొమ్మలతోపాటు శత్రుమూకలను తుపాకులకంటే ఎక్కువ జడిపించే కార్టూన్లనూ వందలకొద్దీ గీశాడు. శ్రమజీవుల కష్టఫలాన్ని తన్నుకుపోయే దేశవిదేశాల గద్దలు, వాటికి కాపలాకాసే పోలీసు జాగిలాలు, గాంధీ టోపీల కుర్చీ తోడేళ్లు, నల్లబజారు పందికొక్కులు.. నానా పీడకజాతులను బట్టలను విప్పదీసి నడిరోడ్డుపైన నిలబెట్టాడు. దామీ, డేవిడ్ లో, థామస్ నాస్త్, జార్జ్ గ్రాజ్ వంటి విశ్వవిఖ్యాత కార్టూనిస్టుల, కేరికేచరిస్టుల ప్రభావం చిత్త కార్టూన్లలో మనవైన భావభౌతిక దరిద్రాలను, దాస్యాలను అద్దుకుని వెక్కిరిస్తుంది.

chitta

1947లో దేశం పెనంలోంచి పొయ్యిలో పడింది. స్వాతంత్ర్యం మామిడిపళ్లు పెదబాబుల ఇళ్లకే చేరాయి. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు చేవచచ్చి, శాంతియుత పరివర్తన అగడ్తలోకి జారిపోయాయి. చాలామంది కమ్యూనిస్టులు రంగులమారి నెవురయ్య సోషలిజం మాయలో పడిపోయారు. చిత్త తెగ ఆరాధించిన పీసీ జోషి కూడా మెత్తబడ్డాడు. 1948లో కలకత్తాలో జరిగిన పార్టీ మహాసభల్లో రణదివే వర్గం జోషిని పక్కన పెట్టేసి సాయుధ పోరాటమే తమ మార్గమంది. ఈ వ్యవహారం కుట్రపూరితంగా, కక్షగట్టినట్టు సాగడంతో చిత్త చలించిపోయాడు. రణదివేను కూడా తర్వాత అతివాద దుస్సాహసికుడంటూ పార్టీ నాయకత్వం నుంచి తప్పించారు. పార్టీలో ఇలాంటి తడబాట్లు, ఆధిపత్య రాజకీయాలు, అభ్యుదయ కళాకారుల సంఘాల్లోకి పిలక బ్రాహ్మణుల, స్వార్థపరుల చేరికలు, సినిమాల్లోకి అభ్యుదయ కవిగాయకనటకుల వలసలు, దేశవిభజన నెత్తుటేర్లు, మతకలహాలు.. చిత్త సున్నిత హృదయాన్ని కోతపెట్టాయి. పార్టీతో అనుబంధం తగ్గించుకున్నాడు.

కానీ పార్టీ రాజకీయాలపై విశ్వాసం రవంత కూడా సడల్లేదు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అదివరకటికంటే జోరుగా సాగుతున్న దోపిడీపీడనలపై మరింత కసి రేగింది. ‘యే ఆజాదీ జూటా హై’ అన్న నమ్మకం బలపడిపోయింది. ‘బాబ్బాబూ, మా గడ్డకు స్వాతంత్ర్యం ఇవ్వండయ్యా అని కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వాడిని దేబిరించిన కాలం ఎంత పాడుకాలం! దీనికి బదులు స్వాతంత్ర్యాన్ని ఎదురుబొదురుగా కొట్లాడి, చచ్చి తెచ్చుకుని ఉండుంటే అదేమంత పెద్ద పొరపాటు, అమానవీయం అయ్యేదా?’ అని తల్లికి రాసిన లేఖలో ఆక్రోశించాడు. ‘రెండు నాలుకల నాయకులు రాజ్యమేలుతున్నారు. ఈ దేశానికి చరిత్రపై ఇంకెంతమాత్రం ఆసక్తి లేదు, ఒట్టి గాసిప్ లపై తప్ప. అబ్బాస్ ఏదో సినిమా కథను కాపీ కొట్టాడని మొన్న వార్తలొచ్చాయి. గాసిప్ చాలు. ఇక ఉంటాను’ అని లక్నోలోని ఆప్తమిత్రుడు మురళీ గుప్తాకు రాసిన లేఖలో చీదరించుకున్నాడు.

రెండో ప్రపంచ యుద్ధంతో గుణపాఠం నేర్చుకున్న ప్రపంచం తర్వాత శాంతిమంత్రం పఠించింది. అయితే అన్నిరోగాలకూ అదే మందని ప్రచారం చేశారు. వర్గపోరాటాన్ని చాపచుట్టేశారు. 1952లో కలకత్తాలో ఇండియన్ పీస్ కాంగ్రెస్ జరిగింది. చిత్త ఆ ఉద్యమంలోని రాజకీయాలకు కాకుండా సందేశానికే ఆకర్షితుడయ్యాడు. లోకమంతా శాంతిసౌభాగ్యాలు విలసిల్లాలని బోలెడు బొమ్మలు గీశాడు. 1950 దశకం నాటి అతని చాలా చిత్రాల్లో వీరోచిత పోరాటాలు కాస్త పక్కకు తప్పుకున్నాయి. వాటికి బదులు రెక్కలు విప్పిన శాంతి పావురాలు, మతసామరస్య సందేశాలు, పిల్లాపెద్దల ఆటపాటలు, ఆలుమగల కౌగిళ్లు, తల్లీపిల్లల ముద్దుమురిపాలు, పాడిపంటలు, పశుపక్ష్యాదులు చేరి చూపరుల మనసు వీణలను కమ్మగా మీటాయి. ఆ కల్మషం లేని మనుషులు ఇంతలేసి కళ్లతో మనవంక చూస్తూ మీరూ మాలాగే పచ్చగా బతకండర్రా బాబూ అని చెబుతుంటారు.

 

‘లవర్స్’ పేరుతో చిత్త చెక్కిన ప్రణయ గాథలు అపురూపం. స్త్రీపురుష సంగమాన్ని ప్రింట్లలోనే కాదు, పెయింటింగుల్లోనూ అంతనంత ప్రేమావేశంతో చిత్రించిన భారతీయ చిత్రకారులు అరుదు. ఆ లినోకట్లలోని వలపులు ఒట్టి దైహిక కలయికలు కావు, రెండు మనసుల గాఢ సంగమాలు. ఒకచోట తెలినలుపుల గదిలో ఊపిరాడని కౌగిలింతల్లో, ముద్దుల్లో లోకం మరచిపోయిన జంట కనిపిస్తుంది. మరోచోట పచ్చికబయళ్లలో పడుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కనిపిస్తుంది. మరోచోట.. కడుపుతో ఉన్న సహచరిని దగ్గరికి తీసుకుంటున్న మనిషి కనిపిస్తాడు. మరోచోట కడుపుపంటను తనివితీరా చూసుకుంటూ మురిసిపోతున్న జంట తారసపడుతుంది. సిగ్గులేని శృంగారం, ఆత్మాభివ్యక్తి పేర్లతో నేటి కళాకారులు కుబేరులకు వేలం వేసి అమ్ముకుంటున్నమర్మాంగాల బొమ్మలను చూసి తలదించుకునేవాళ్లు.. చిత్త ప్రణయచిత్రాలను తల ఎత్తుకుని సగర్వంగా చూడగలరు. చిత్త కల్మషం లేని కళాభివ్యక్తికి ఇది నిదర్శనం. తన చిత్రసుందరులను కూళలకిచ్చి అప్పుడప్పుడు  కూడు తినని కమ్యూనిస్టు పోతన.. చిత్త.

cartoon

చిత్త వలపు చిత్రాల్లో చాలా వాటిలో అతని పోలికలున్న పురుషుడు కనిపిస్తాడు. పెద్ద నుదరు, పొడవాటి ముక్కు, విల్లుల్లాంటి కనుబొమలు, అనురాగ దరహాసాలు.. అన్నీ చిత్తపోలికలే. అతడు చిత్త అయితే మరి అతని ప్రేయసి ఎవరు? ప్రేమాస్పదుడైన చిత్తను ఇష్టపడని ఆడమనిషి ఉండదని అతని మిత్రులు గుంభనంగా చెబుతారు. అతడు ఒకామెను గాఢంగా ప్రేమించాడని, అయితే ఆమె పెళ్లి చేసుకుని యూరప్ వెళ్లిపోయిందని అంటారు. పెళ్లి చేసుకోని చిత్త కూడా ఏమంటున్నాడో మురళికి రాసిన ఉత్తరంలోంచి వినండి.. ‘నేను సునీల్, దేవీ(మిత్రులు) వంటి వాడిని కానని నాకు తెలుసు. తండ్రి ఆస్తిపై బతికే పరాన్నభుక్కూనూ కాను. దుఃఖమన్న సౌఖ్యానికి కూడా నోచుకోలేదు నేను. ఓ గ్లాసు మందుతోనో, తాత్కాలిక ప్రేయసితోనే వెచ్చపడే సుఖమూ లేదు. అయితే నేను సన్యాసిని కూడా కాను. నాకు మా అమ్మంటే, మానవత అంటే, ఈ దేశమంటే తగని ప్రేమ. నేను ఈ దేశపు స్త్రీని ప్రేమిస్తాను. నా దేశంలోని ఎంతోమంది స్నేహితులను గాఢంగా ప్రేమిస్తాను. పెయింటింగ్ వేయడాన్ని, పెయింటింగులను చూడడాన్ని ప్రేమిస్తాను..’

అతనికి పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ల కోసం చిట్టిపొట్టి కథలు రాసి బొమ్మలేశాడు. ‘రసగుల్లా కింగ్ డమ్’ పేరుతో బడాబాబులకు చురుక్కుమనిపించే కథలు రాశాడు. కొన్ని బెంగాలీ కథలను  తిరగరాసి, బొమ్మలేశాడు. కల్లాకపటం తెలియని పిల్లల ఆటపాటలపై చిత్రాలతో పద్యాలు అల్లాడు. ఆ బుజ్జికన్నలను కాగితప్పడవలతో, సంతలో కొన్న ఏనుగు బొమ్మలతో, లక్కపిడతలతో ఆడించాడు. ఆవుపైకెక్కించి పిప్పిప్పీలను ఊదించాడు. పావురాలతో, చేపలతో ఆడించాడు. వాళ్లతో లేగదూడలకు ముద్దుముద్దుగా గడ్డిపరకలు తినిపించి కేరింతలు కొట్టాడు. వీళ్లంతా కష్టాల కొలిమి సెగ సోకని పిల్లలు. ఆ సెగలో మాడిమసైపోయే పిల్లలూ చిత్త లోగిళ్లలో కన్నీటి వరదలై కనిపిస్తారు. తిండిలేక బక్కచిక్కిన పిల్లలను, ఆకలి కోపంతో పిచ్చెత్తి రాయి గురిపెట్టిన చిన్నారిని, బూటుపాలిష్ తో కనలిపోయే చిట్టిచేతులను, చిరుదొంగతనాలతో జైలుకెళ్తున్న బాల‘నేరస్తుల’ను, తల్లిదండ్రులు పనికెళ్లగా, పసికందులను చూసుకుంటూ వంటావార్పుల్లో మునిపోయిన ‘పెద్ద’లను, ఇళ్లులేక ఫుట్ పాత్ లపై పడుకున్న చిన్నారులను, మశూచితో అల్లాడుతున్న పసిదేహాలను.. కళ్లు తడయ్యేలా చూపాడు. అంతేనా.. గోడలపై క్విట్ ఇండియా నినాదాలు రాసి, తెల్లోడి పోలీసులను హడలగొట్టే చిచ్చుబుడ్లను, తల్లిదండ్రుల వెంట సుత్తీకొడవళ్లు, ఎర్రజెండాలు పట్టుకుని కదిలే బాలయోధులను కూడా బొమ్మకట్టాడు.

beedi

చిత్త బాలకార్మికుల చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధం.  ‘చిల్ర్డన్ వితౌట్ ఫెయిరీ టేల్స్’ పేరుతో చేసిన ఈ లినోకట్లు పిల్లల ప్రపంచాన్ని పెద్దలు ఎంత కర్కశంగా కాలరాస్తున్నారో చెబుతాయి. అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు బీడీలు చుట్టడం, తల్లిఒడిలో నిదురపోవాల్సిన పిలగాడు బూట్ పాలిష్ తో అలసి రోడ్డుపైనే పడుకోవడం, బొమ్మలతో ఆడుకోవాల్సిన పిల్లలు విదూషకులై పొట్టకూటికి కోతిని ఆడించడం, సాముగరిడీలు చేయడం.. చందమామ కథలకెక్కని ఇలాంటి మరెన్నో వ్యథాగాథలకు చిత్త రూపమిచ్చి ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిఫెన్స్ ఆఫ్ చిల్డ్రన్స్’ కు అంకితం చేశాడు. వీటిని యూనిసెఫ్ డెన్మార్క్ కమిటీ 1969లో పుస్తకంగా తీసుకొచ్చింది. డెన్మార్క్, చెకొస్లవేకియా, టర్కీ.. మరెన్నో దేశాల రచయుతలు భారత్ పై రాసిన పుస్తకాలకు కవర్ పేజీ బొమ్మలు అందించాడు.

చిత్తకు మూగజీవులన్నా ప్రాణం. పిల్లులను, కుక్కలను పెంచుకునేవాడు. అవీ మనలాంటివేనని ముద్దు చేసేవాడు. ‘నికార్సైన బాధ, సంతోషం, శాంతి మనిషికి మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. ఆకలిదప్పికలు, రాగద్వేషాలు జీవరాసులన్నింటికి  ప్రకృతి సహజమైనవి. అందుకే మనం జంతువుల సుఖదుఃఖాలను, మొక్కల దాహార్తిని, పూల ఉల్లాసాన్ని సహానుభూతితో గ్రహించగలం.. అవి కూడా మనలాగే జీవితంలో ఒక క్షణకాలాన్ని కోల్పోయినా భోరున విలపిస్తాయి.. వాటిలో ఏదీ ఈ అందమైన లోకం నుంచి వెళ్లాలని అనుకోదు..’ అని తల్లికి రాశాడు చిత్త.

bezwada sabha

పార్టీ పనులు లేకపోవడంతో చిత్త కు అనేక వ్యాపకాలు మొదలయ్యాయి. అంధేరీ మురికివాడలోని రూబీ టెర్రేస్ లో అంధేరా ఒంటరి గది చిత్త ఆవాసం. అందులోనే వేలాది లినోకట్లు, పేస్టల్స్, పెయింటింగులూ వేశాడు. కవితలు, కథలు, నాటకాలు రాశాడు. కిటికీ ముందు రెండుమూడు పూలకుండీలు, కిటికీ పక్కన చెక్కపై పుస్తకాలు, దానికింది చెక్కపై కీలుబొమ్మలు, భయపెట్టే ఇండోనేసియా డ్యాన్స్ మాస్కులు, ఓ మూల మంచం, వంటసమయంలో మంచం కింది నుంచి బయటి, వంటయిపోయాక మంచం కిందికి వెళ్లే  వంటసామాన్లు, చిత్రాలు, ఓ పిల్లి, పంచలో రెండు కుక్కలు, పక్కిళ్ల వాళ్లతో కలసి వాడుకునే బాత్రూమ్, ఇంకాస్త బయట కాస్త పసిరిక.. చుట్టుపక్కల అతిసామాన్య మానవులు.. ఇవీ చిత్త బతికిన పరిసరాలు.

telengana

తెలంగాణా

రేషన్ షాపులో గోధుమపిండి, కిరసనాయిల్, చిరిగిన బనీను, లుంగీ, రెండు జతల బట్టలు, వారానికో అప్పు, అప్పుడప్పుడు ఎండుచేపలు, ఉర్లగడ్డల కూర, కాస్త డబ్బుంటే గ్లాసెడు మందుచుక్క, డబ్బుల్లేనప్పుడు పస్తులు, ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలు, పుస్తకపఠనం, మిత్రులతో కబుర్లు, వాళ్లతో కలసి ‘బ్రిడ్జ్ ఆఫ్ రివర్ క్వాయ్’, ‘పథేర్ పాంచాలి’ లాంటి సినిమాలకు వెళ్లడం, తల్లికి, చెల్లికి రాజకీయాలు, సాహిత్యం రంగరించి రాసే మమతల లేఖలు, సోమరి ఉదయాల్లో పోస్టమేన్ కోసం ఎదురుచూపులు.. చిత్త జీవితం కడవరకూ సాగిపోయిందిలా.

– ముగింపు వచ్చేవారం

మీ మాటలు

  1. N Venugopal says:

    మోహన్

    ఎప్పట్లాగే కంట తడి పెట్టించావు. చాల చాల బాగుంది. కృతజ్ఞతలు.

    రెండు చిన్న విషయాలు: 1. రైల్వే సమ్మె 1975 కాదు, 1974. 2. చిత్తప్రసాద్ బెజవాడలో మొగల్రాజపురం కొండలను కూడ చిత్రించాడని విన్నాను. అసలు ఇప్పుడు పెవిలియన్ గ్రౌండ్స్ ఉన్నచోట కూడ ఆ రైతు మహాసభలు జరిగినప్పుడు ఒక కొండ ఉండేదట…

  2. మంజరి లక్ష్మి says:

    చాలా బాగుంది.

  3. Dr. Vijaya Babu, Koganti says:

    ఒక గొప్ప వ్యక్తిని కళ్ళకు కడుతూ పరిచయం చేశారు. ఇలాటివి పిల్లలకు పాఠాలు గా ఉండాలి. ముగింపు కోసం ఎదురుచూస్తూ… అభినందనలు

  4. P Mohan says:

    వేణుగోపాల్, మంజరి లక్ష్మి, విజయబాబు గార్లకు ధన్యవాదాలు.
    చిత్తను తలచుకుంటే ఝంఝామారుతం, మలయమారుతం కలసి కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన చరిత్రను, కళాసంపదను మనం భద్రపరచి ఇవ్వకపోతే భావితరాలు మనల్నిక్షమించవు.

మీ మాటలు

*