వినికిడి వున్న హృదయమే…..

కందుకూరి రమేష్ బాబు
Kandukuri Ramesh
శ్రవణం.
నిజం.అక్కనో చెల్లో వదిననో – మరెవరో.
తమ్ముడో అన్నో మరిదో – మరెవరో.

ఎవరో ఇద్దరు.
జన సముద్రంలో ఒక శంఖం.
వినిపిస్తూ ఉంటుంది, వింటే!

జనసమ్మర్దంలో ఇద్దరు, ఇలా దారి చేసుకుని సాగుతూ ఉంటే వారి వెంట ముచ్చట ఒకటి పూమాలలో దారంలా కనెక్ట్ అయ్యే వుంటుంది. దారి పొడవునా మాటల మూటలు. రకరకాల పుష్పాలు.
అవును మరి. ఏమేం మాట్లాడుకుంటారో మనకేం ఎరుక!

మాట- ముచ్చట మాత్రం నిజం.
అదే ఈ చిత్రం.

మాట- ముచ్చట.
భారం తెలియనీయని బాటసారి.
అందుకే ఈ చిత్రం.

నిజానికి ఫొటోగ్రఫిలో ఒక్కో భావం వ్యక్తం అవుతూ ఉంటుంటే చిత్రం మరింత ముచ్చటగా పరివ్యాప్తం అవుతుంది. కాకపోతే చూసే దృష్టి వుండాలి. వినగలిగే హృదయం వుండాలి. ఈ బొమ్మనే చూడండి. చూస్తూ ఉంటే మీరు నిదానంగా వాళ్లని అర్థం చేసుకుంటారు. ఆదరిస్తారు. డిస్ట్ర్రబ్ చేయకుండా తప్పుకుంటారు లేదా వాళ్లలో మీరే లీనమై ఏం మాట్లాడుకుంటున్నారో విన్నా వినగలుగుతారు లేదా మీ వినికిడి జ్ఞానంలోంచి, జ్ఞాపకాల దొంతరలోంచి ఒక మూట వొదులై అందలి పువ్వులు బయటకి రాలిపడ్డట్టు ఏవేవో మనసును లోలోన చుట్టుముడతై లేదా ఎన్నడో ఎవరితోనో మీరు పెట్టిన ముచ్చట్లు ఎదలో దాగిన వెన్నల్లా అలుముకుని సేద తీరుస్తయ్ లేదా ఏమీ లేదు. వెళ్లండి, వేరే పేజీకి వెళ్లండి. మీతో పని లేదు మాకు!

అవును మరి.
వినే ఓపిక ఉంటే వినాలి. లేకపోతే వెళ్లాలి.

వినికిడి బాగుంటుంది.
ఒక ఛాయా చిత్రకారుడికి ఇట్లాంటి ఫొటోలు దొరకడమూ ఒక వినికిడి జ్ఞానమే!

చాలా బావుంటుంది.

ఈ చిత్రం పనిగట్టుకుని తీసింది కాదు.
తీసే క్రమంలో పని సఫలమైతే దొరికిన కానుక.
అది మరీ బావుంటుంది.

ఎంత బావున్నారు వాళ్లు?
మరెంత ఆత్మీయంగా ఉన్నారిద్దరూ!
అందంగా లేదునా ఆ బంధం?

ఇష్టముంటేనే బంధం.
లేకపోతే ఖైదు.

వాళ్లు.

ఎవరికి ఏమవుతారో తెలియదు.
కానీ, ఆ ముచ్చట చూడు, వాళ్లనెలా కలిపిందో!
లేదా ఆ కలుపు చూడండి. ముచ్చట పెట్టించింది?
దృశ్యాదృశ్యం అంటే అదే. చూడటం.

ఎంత దగ్గరి వాళ్లయితే అంత హాయిగా మాట్లాడుకుంటూ పోతారు!

ఎటు వెళుతున్నారో అడగాల్సిన అవసరం లేదు.
తెలుసు.

తెలిసి చేసే ప్రయాణంలో ఆ ముచ్చట ఉంటుంది.
ఆ నమ్మికా, స్థిమితమూ జరూరుగా వుంటుంది.

వారలా వెళ్లడంలో ఒక చూపూ ఉంది. తమకు తెలిసిన దారీ వుంది. జనసమ్మర్దంలో తమ ఉనికిని తాము కాపాడుకునే స్థితి ఒకటి, రణగొణ ధ్వనుల్లోనూ తమ గొంతును తాము వినిపించునే అద్వితీయ స్థితి ఒకటి అలవోకగా వారికి అబ్బింది మరి! ఎందుకూ అంటే చంకలోని మూటలా ఒక బిలాంగింగ్ నెస్ ఉంది మరి!  అందుకే మాటలూ ఉన్నయ్.

మళ్లీ చూడండి.
తీరుబడితో చూడండి.
వారికి ఉన్నంత తీరుబడే చిత్రీకరిస్తున్న వ్యక్తికీ వుండాలి.
అప్పుడే మానవ సంబంధాల్లో శ్రవణేంద్రియం నిర్వహించే మహత్తర ఇట్లా దృశ్యమానమై కాలంతో పాటు ఆ ముచ్చట సాగేలా చేస్తుంది.

అభిమానం. సోదర భావం. సాన్నిహిత్యం. ఒక బంధం.
ఏదో…

చూస్తూనే ఉండండి.
ఒక కన్ సర్న్.

చూస్తూనే ఉండండి.
బయటకు కూడా…
మనుషుల ప్రవర్తనలోని అందచందాలని!
ముచ్చట్లలో ఉండగా లేదా వినికిడిలో వుండగా వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని!
ఎంతో బావుంటుంది.

కానీ, చూడం.
నిజం.

ఎందుకంటే, నిప్పుకోడిలా తలను దాచుకోవడం తప్పా మనుషులు బయటకి రారు. జీవితాలను అస్సలు పరికించరు. అందుకే ఛాయా చిత్రలేఖనం ఒక గొప్ప సౌలభ్యం అని నొక్కి చెప్పాలనిపిస్తుంది. మన జీవితాలు మనవే కాదనుకునే దృక్పథం ఒకటుండాలి. అవతలి వాళ్ల జీవితాలు కూడా వావి వరసలతో కూడినవి మాత్రమే కాదన్న స్పృహా ఉండాలి. సంబంధం కాదు, వట్టి బంధం. అంతే. నిజం. వాళ్లను చూస్తున్నప్పుడు కూడా రిలేషన్ గురించి వెతక్కండి. ఒకరికి ఒకరు ఏమవుతారో ఆలోచించకుండా మనుషుల అందమైన ప్రవర్తనను గమనించండి. జీవితాన్ని దర్శించండి. అపుడు నిజగానే సర్వసామాన్యమైన అనుభవాల దొంతర ఇట్లా ఒక చక్కటి దృశ్యమానంగా శోభిల్లుతుంది.

నమ్మండి.

అన్నట్టు, ఈ చిత్రం సమ్మక్క సారక్క జాతరలో తీసింది.
మేడారం. 2012.

అక్కడికి లక్షలాది జనం, కోట్లాది జనం వస్తారు.
అంత జాతరలో కనీసం ఇద్దరినైనా సరిగ్గా చూడలేకపోతే ఆ ఛాయా చిత్రలేఖనం నిజంగా ‘జాతరే’ అవుతుంది. అవును. కనీసం ‘ఇద్దర్ని’ చూడగలిగితే అప్పుడది ‘దర్శనం’ అవుతుంది.

ఈ సూత్రం తెలిస్తే ఆగుతాం.
నది ప్రవహిస్తూ ఉంటే తప్పుకుంటాం.

ఒక శంఖం దొరుకుతుంది.
అదే ఈ దృశ్యాదృశ్యం.

ఇంతకీ వారెవరనుకున్నారు?
బహుశా అతడు జంపన్న అమె సమ్మక్క.
ఒక అనాది బంధం.

*

మీ మాటలు

 1. Vijaya Karra says:

  బ్యూటిఫుల్! నిజంగా “ఈ చిత్రం పనిగట్టుకుని తీసింది కాదు. అభిమానం. సోదర భావం. సాన్నిహిత్యం. ఒక బంధం.” ఓ నిజం.

  • kandukuri ramesh babu says:

   నిజం. కెమెరా కన్నులోంచి కన్ను పెట్టి చూస్తే కనిపించేవి చాలా తక్కువ. అలా చూస్తూ ఉన్నప్పుడు పని గట్టుకుని మనల్ని ఆకర్శిస్తారు ఇలా. థాంక్సండీ.

 2. M.Somasekhararao says:

  వినికిడి ఉన్న హృదయం …. ఎంత మంచి దృశ్యం…మీరు విన్న శబ్దం మాకు కంటి కి కనపడేటట్లు ….అంత బాగా వ్రాసారు.

  “జ్ఞాపకాల దొంతరలోంచి ఒక మూట వొదులై అందలి పువ్వులు బయటకి రాలిపడ్డట్టు ఏవేవో మనసును లోలోన చుట్టుముడతై లేదా ఎన్నడో ఎవరితోనో మీరు పెట్టిన ముచ్చట్లు ఎదలో దాగిన వెన్నల్లా అలుముకుని సేద తీరుస్తయ్….జీవితాన్ని దర్శించండి. అపుడు నిజగానే సర్వసామాన్యమైన అనుభవాల దొంతర ఇట్లా ఒక చక్కటి దృశ్యమానంగా శోభిల్లుతుంది.”

  • kandukuri ramesh babu says:

   వట్టి ఫొటో పెడితే చాలని తొలుత అంటే లేదన్నారు అఫ్సర్ గారు. తానే దృశ్యాదృశ్యం అన్న శీర్షికా సూచించారు. దాంతో దృశ్యం అందిస్తూ అదృశ్యంగా ఉన్న భావాల జీవన ఛాయలను పరుచుకుంటూ పోతున్నాను. విన్నందుకు ధన్యవాదాలండీ.

 3. sasi kala says:

  దృశ్యం మామూలు అయినా మీ భావన గా మారి అక్షరం గా మారే క్రమం నాకు చాలా చక్కగా కనిపిస్తుంది .
  మామూలుగా చూసే ది వేరు , మనసున్న కన్నులతో చూసేది వేరు . అభినందనలు .

 4. kandukuri ramesh babu says:

  క్రమం గురించి చక్కగా చెప్పారు. నిజం. ఒకటెనుక ఒకటి ఎట్లా కలుస్తాయో ఎంజాయ్ చేస్తున్నాను. రాస్తున్న ప్రతి పదం, వాక్యం, భావం నాలాగా చాలామంది ఆస్వాదిస్తుంటారని ఎరుక అవుతుంటే ఉత్సాహం పెరుగుతోంది. మరింత సూక్ష్మ దర్శినిలా పనిచేయాలనిపిస్తోంది. థాంక్స్ శశి కళ గారు.

మీ మాటలు

*