రావే కోడల రట్టడి కోడల…

Avineni Bhaskar

   అవినేని భాస్కర్ 

మనిషి జీవితంలోని అన్ని సన్నివేశాలకీ సంకీర్తనలు రాశాడు అన్నమయ్య. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ పరమాత్మ అవతారాన్నే చూశాడు. మేమేనా ఆ సంసారంలో కొట్టుమిట్టాడాల్సినది? మీరూ రండి అని దేవుళ్ళని చేయిపట్టి లౌకిక జీవితంలోకి లాక్కొచ్చి మానవ జీవితంలోని కష్టనష్టాలను దేవుళ్ళకి ఆపాదించాడు. అలా చెయ్యడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, “మనకే కాదు దేవుళ్ళకైనా సంసార జీవితం సులువుగా సాగట్లేదు” అని చెప్పి విరక్తి కలగనియ్యకుండ ధైర్యాన్ని కలిగించడమే.

అన్నమయ్య ఎన్నో యుగళగీతాలు (డ్యూయట్లు) రాశాడు. కొన్ని బావా-మరదళ్ళు పాడుకునేవి, కొన్ని నాయికా-నాయకులు పాడుకునేవి, కొన్ని గొల్లెత-గొల్లడు పాడుకునేవి, కొన్ని నాయిక-దూతికలు పాడుకునేవి. ఈ కీర్తన అత్తా-కోడలు పడుకునే డ్యూయట్.
అత్తా-కోడళ్ళ గొడవలు నేటి మెగా సీరియల్ల బిజినెస్ కోసం పుట్టినవి కావు. ఆదిలక్ష్మి అత్తయిన రోజునుండే ఉందని సాటి చెప్పడానికే ఈ కీర్తన రాశాడేమో. బ్రహ్మదేవుడు మహావిష్ణువు బొడ్డులోనుండి పుట్టాడు. కావున బ్రహ్మ మహాలక్ష్మి-విష్ణువుల కొడుకు. బ్రహ్మ భార్య సరస్వతి, మహాలక్ష్మికి కోడలు. మహాలక్ష్మి సిరి(డబ్బు)కి ప్రతిరూపం. సరస్వతి చదువులతల్లి, కళలకు ప్రతిరూపం.
ఈ భాషేంటి ఇలా ఉంది? సరస్వతీ, మహాలక్ష్మీ ఇలా దెప్పుకుంటారా అని ప్రశ్నించేవారికి – అన్నమయ్య సరస్వతినీ, మహాలక్ష్మినీ ఒక సామాన్య కుటుంబంలోని ఆడవాళ్ళుగా చిత్రీకరించాడు. అంటే దేవుళ్ళను సామాన్య ప్రజలకు దగ్గర చేయడం అన్నమయ్య ఉద్దేశం. దేవుళ్ళంటే ఎక్కడో సామాన్యులకందనంత ఎత్తులో ఉంటారన్న భ్రమని పోగొట్టి పామరులకు దగ్గర చేసేరీతిలో పలు జానపద కీర్తనలు రచించాడు. ఈ కీర్తన కూడా అలాంటొక జానపద శైలిలో రాయబడినదే. కావున భాష, భావం ప్రజల జీవితాల్లోనుండే తీసుకున్నాడు.
ఎంతటి వాళ్లైనా అత్తాకోడళ్ళుగా ఉన్నప్పుడు చిన్నచిన్న కోపతాపాలు, పోటీలు తప్పవనడానికి ఈ కీర్తన నిదర్శనం. పైకి ఎంత సఖ్యతగా కనిపించే అత్తా-కోడళ్ళకైనా లోలోపల పోటీ, భయం ఉంటుంది. కొడుకుని తననుండి దూరం చేసేస్తుందేమో అన్న భయంతో అత్త, మొగుడు అమ్మచాడు అబ్బాయిలాగే (momma’s boy లా)  ఉంటే నన్ను ప్రేమించడేమో అన్న అనుమానంతో కోడలు మెలుగుతుంటారు. ఎవరిఅభద్రత(insecurities) వాళ్ళవి! ఎవరికి వారు ఆధిపత్యం(domination)  ప్రదర్శిస్తారు. నేను నీ మొగుడికి తల్లిని అని అత్త హెచ్చులుపోతే, నీ కొడుక్కి పెళ్ళాన్ని అని కోడలు గర్వం ప్రదర్శిస్తూ ఉంటుంది.
annamayya
ఆ అత్తాకోడళ్ళకి గొడవలొస్తే ఎలా దెప్పుకుంటారో వినండి.
|| అత్త: సుశీల || కోడలు: వాణి జయరాం || స్వరకల్పన : గుంటి నాగేశ్వర నాయుడు||
పల్లవి
రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులు నీతోఁజాలును
 
చరణాలు
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా 
 
ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా
 
బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని –
నడ్డగించుకొంటివత్తయ్యా
 
మూలం : తాళ్ళపాక సాహిత్యం వాల్యూం 5, పుట : 286
తాత్పర్యం ( Explanation ) :
రావే పరువుమాలిన కోడలా అని అత్తయ్య చురకేస్తే, పోవే అత్తయ్యా! నీతో సఖ్యత నాకొద్దు అని కోడలంటుంది. [ కోడలు ఎవరీ కంటా, నోటా పడకుండ గుట్టుగా ఉంటే ఆ ఇంటికి గౌరవం! అదేం విపరీతమో అందరు నీ గురించే పలవరిస్తున్నారు. ఇంటిపరువు రచ్చకెక్కింది అని కోడలు సరస్వతిని దెప్పుతుంది అత్త మహాలక్ష్మి. ఆరాధన భావానికీ, అడ్డగోలు మాటలకీ తేడా తెలియని నీతో నాకేంటి మాటలు పోవే అత్తయ్యా అని మహాలక్ష్మిని తిప్పికొడుతుంది కోడలు ]
పండితులు, కవుల రూపంలో రాజుల ముందర సంకోచించకుండ ప్రసంగాలూ, ప్రదర్శనలూ చేస్తూ ఉంటావు ఏం మనిషివి నువ్వు అని అత్త అడిగితే… అవును మరి! నన్ననే ముందు నీ కథేంటో చూసుకో అత్తయ్యా! అంకెలరూపంలో ధనవంతుల ఇళ్ళలో తిరుగుతావుగా? బురదలో పుట్టిన తామర పువ్వులాంటి ముఖమూ నువ్వూ అని కోడలు ఎదురు ప్రశ్నేస్తుంది. [కవులు పండితులకి ప్రభలిచ్చేది సరస్వతి. వారు ఎప్పుడూ రాజులదగ్గరా, కలిగినవారిదగ్గరా చేరి తమ పాండిత్యాన్ని గర్వంగా, ఠీవిగా ప్రదర్శిస్తు ఉంటారు. సిరికి దేవత మహాలక్ష్మి. డబ్బు అందరిదగ్గరా చేరదు. కొందరు దొడ్డవారిళ్ళల్లో అంకెలతో కొలవబడుతూ ఉంటుంది. ఇక్కడ “పంకజముఖి” అని సంభోదించడంలో చమత్కారమైన తిట్టు దాగుంది. పంకజం బురదలో పుడుతుంది కదా?]

ఇక్కడా అక్కడ అని సిగ్గుశరములేకుండ నలుగురైదుమంది మగవాళ్ళ సాంగత్యంలో ఉంటావు అని అత్త దెప్పితే, వాడకు పదిమంది దగ్గర చేరి వాళ్ళ మధ్యనే ఉంటావు నువ్వేం తక్కువా? అంటోంది కోడలు. [ ఏగురు అంటే ఐదుగురు అని అర్థం. వాడకు నలుగురు, ఐదుగురు పండితులు ఉంటారు. సరస్వతి వాళ్ళనే కటాక్షించి ఆదుకుంటుంది అని భావం. సిరి అయినా అంతే అందరిదగ్గరా చేరదు. ఏ కొందరిచెంతో మాత్రమే ఉంటుంది].

ఏం చూసుకుని నీకంత టెక్కు? మా ఆయన బొడ్డున పుట్టిన పిల్లాడు బ్రహ్మకి ఒక పిల్లని తెచ్చి పెళ్ళి చేసిపెడదాం అని ఏమీలేని నిన్ను పోనీలే అని కోడలిగా తెచ్చుకున్నాను అని మహాలక్ష్మి సరస్వతిని చిన్నబుచ్చింది. నన్నంత మాటంటావా? నువ్వేమో పెద్ద గొప్పా? కొండపైన మహరాజులా ఆనందంగా జీవిస్తున్న అమాయక చక్రవర్తిని మాయచేసి నీ వలలో వేసుకున్నావు అని కోడలు అత్తని నిలదీస్తుంది.
కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :
రట్టడి = అపకీర్తి, పరువుమాలిన
పొందులు = సఖ్యత, స్నేహము
రంకెలువేయుచు = ప్రగల్భాలు పలుకుతు, హెచ్చులుపోతూ, గర్జనలు చేస్తూ
కొంకుకొసరు = సంకోచము, సిగ్గుశరము
పంకజముఖి = (బురదలోపుట్టిన) తామర పువ్వులాంటి ముఖము
దొడ్డవారిండ్ల = కలవారిళ్ళలో, ధనికులైనవారి ఇళ్ళలో

అంకెల = అంకెల రూపంలో

ఈడాడ = ఇక్కడా అక్కడా, ఇటు అటు
ఏగురు = ఐదుగురు, అయిదుమంది,
మొగలతో = మగవారితో
ఆడాడ = అక్కడక్కడ
బొడ్డున = నాభిలో, బొడ్డులో
పూప = శిశువు, పిల్లవాడు (ఇక్కడ బ్రహ్మ అని అర్థం)
గొడ్డేరు = గుత్తకు, వేలం
గుడ్డము = కొండ, క్షేత్రము

అడ్డగించు = బలవంతంగా సొంతంచేసుకోవడం

మీ మాటలు

  1. ఆర్.దమయంతి. says:

    నిజానికి కీర్తనలో నాకు కొన్ని పదాలు అర్ధం కాలేదు. నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నా.
    కానీ, చివర్లో సాహిత్యాన్ని చక్కగా అర్ధాలతో సహా వివరించి, మా వంటి పామరుల సందేహాలన్నీ చక చకా తీర్చేసారు.
    నాకు చాలా నచ్చింది కీర్తన. మురిపెంగా అనిపించింది కూడా.
    ధన్యవాదాలు భాస్కర్ గారు.

మీ మాటలు

*