బొట్టు

ఎండ్లూరి మానస

 

manasa endluri“ఒక్ఖ రోజు డ్రైవర్ లేని పాపానికి పూజ సామాను తెమ్మంటే ఏదీ సరిగ్ఘ తేలేదు. పటిక బెల్లం తెమ్మంటే తాటి బెల్లం తెచ్చారు. కేజీ నుపప్పు అని రాస్తే పావు కేజీ నే తెచ్చారు. ఏవిటి చేస్కోటానికిట? తెలిసి తెలిసి చేయరాని తప్పు చేసి ఇప్పుడనుకునేం లాభం?నాది బుద్ధి తక్కువ. మళ్ళీ నేనే మార్కెట్ కెళ్ళాలి!”

అసలే కాలేజీ టైం అయిపోతుందని హడావిడిగా తయారవుతున్న కామాక్షికి సరిగ్గా బయల్దేరేటప్పుడే ఇలాంటి ఆటంకాలు ఎదురవుతాయి పాపం! రేపు వరలక్ష్మి వ్రతం. ఈ రోజు  సాయంత్రం ఆమె పని చేసే డిగ్రీ మహిళా కళాశాలలో స్టాఫ్ మీటింగ్ పెట్టాలి. ప్రిన్సిపాల్ ఆమే కాబట్టి తప్పించుకునే ప్రశ్నే లేదు. ఇంటికొచ్చేసరికి ఏ ఏడో ఎనిమిదో అవుతుంది. అలసట! నీరసం! అందులోనూ ఆమె కార్ డ్రైవర్ సెలవు! ఈ కష్టాలన్నీ తలచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది కామాక్షికి!!

“నువ్విచ్చిన లిస్టే కదా కామాక్షి, పట్టుకెళ్ళి ఇచ్చాను. వాడవే ఇచ్చాడు”. జరిగింది పెద్ద సమస్య కాదన్నట్టు కార్ తాళాలు గోడకి తగిలిస్తూ అన్నాడు భర్త సుబ్రహ్మణ్యం.

“ఇస్తాడు!వాడికేం నొప్పిట? రెండు రెట్లు డబ్బులూ నొక్కుతాడు వెధవ ! చూసేవాళ్ళు మిమ్మల్ని ‘దేవుడు’ అని ఇందుకే అంటారు కాబోలు!! కాని కుటుంబానికి కావాల్సింది ‘భర్త’! దేవుడ్ని నేనేం చేస్కోను? ఉన్న కోటిమంది చాలదన్నట్టు! ఇంటికి, ఇల్లాలికేంకావాలి? పిల్లల్ని ఏ బళ్ళో చదివించాలి? ఏం చదివించాలి? ఏ బట్టలు వేయాలి ?ఏం తినిపించాలి?…ఇవన్నీ దేవుళ్ళు చేయరు!పెళ్ళాంతో బాటు మొగుడు కూడా చెయ్యాల్సుంటుంది. నా ఖర్మ కాలి ఈ ఇంట్లో మొగుడున్నా అన్నీ నేనే చేస్కుని ఛావాలి! నా పిల్లలకి, వాళ్ళ ఇంటి పేర్లకి తప్ప దేనికి పనికొచ్చారుట? బ్యాంకు ఉజ్జోగం, ఇల్లు తప్ప మరొక్కటి తెలిస్తే ఒట్టు! ‘మంచోడు మంచోడు’ అంటే మా నాన్నారు  ఒక్క గెంతు గెంతి ఈ పెళ్లి చేసారు. ఎన్నేళ్ళు గడిచినా ‘మంచోడు’ మంచోడి లానే ఉన్నారు గాని భర్తగా, తండ్రిగా మారనేలేదు! ఛ! ఇప్పుడు నే కాలేజీకెళ్ళాలి గా!మళ్ళా తాళాలు తగిలించేస్తారేవిటి? ఇలా తగలబెట్టండి.” మొహం చిట్లిస్తూ విసురుగా సుబ్రహ్మణ్యం చేతిలోంచి తాళాలు లాక్కుంది కామాక్షి.

సుబ్రహ్మణ్యం ఎదో పక్క గ్రహం నుంచి వచ్చిన వాడిలా ఏ స్పందనా లేకుండా తన పని తను చేసుకుపోతున్నాడు.

‘డ్రైవర్ లేడు, పెళ్ళాన్ని కాలేజీలో దింపుదామన్న ఆలోచనే రాదు ఈ మనిషికి!’ మనసులో తిట్టుకుంటూ “హలో!మీ టూ వీలర్ మీద ఎంత దుమ్ముందో చూసారా? అది కూడా నేనే చెప్పాలా?”

భర్త మీద అరుస్తూ కార్లో హ్యాండ్ బాగ్, లంచ్ బాక్స్ పెట్టుకుంది కామాక్షి.

“చూసాను కామాక్షి, ఇప్పుడే తుడిచేస్తాను.పాత గుడ్డ ఎక్కడుందో వెతుకుతున్నా.” ఎప్పటిలా అమాయకంగా సమాధానమిచ్చాడు సుబ్రహ్మణ్యం.

“చాలు! ఇహ మూస్తారా నోరు? నా ఫోన్ మోగుతోంది.” హ్యాండ్ బాగ్లోంచి తన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతుంది కామాక్షి…

“హలో! గరికపాటి గారు ఎలా ఉన్నారు? చాలా రోజులకి ఫోన్ చేసారే?” ఆయన గొంతు కొద్దిగా కామాక్షి కోపాన్ని పక్కన పెట్టింది.

dot1

“ఆ! బావున్నానండి.మీరు, సారు, పిల్లలు బావున్నారా?”

“ఆ! మావులే గా!పిల్లలిద్దరూ అమెరికా లోనే చదువుకుంటున్నారు. మేవిక్కడ! వాళ్ళక్కడ! ఏవిటి మీ లేటెస్ట్ నవల?ఈ మద్జ పెద్దగా రాస్తున్నట్టు లేరు?”

“కాస్త ఇంటి పనుల్లో పడి తీరిక దొరకడం లేదండి! మా ఆవిడ పెద్దగా చదువుకోలేదు. మీకు తెలిసిందే గా! పిల్లల చదువులూ అవీ నేనే చూస్కోవాలి! ఇప్పుడా పని మీదే ఫోన్ చేసాను. పెద్ద పాప ఆశ ఇంటర్ పాసైంది. బిటెక్ లో జాయిన్ చేయమంటుంది కానీ నాకు అంత సంపాదనెక్కడిది?! ఎప్పుడో ఒక్క నవల రాస్తే నాలుగు డబ్బులొస్తాయి గాని చేసే సబ్ ఎడిటర్ ఉద్యోగం చిన్నదేగా! అందుకే అమ్మాయిని మీ కాలేజీలో డిగ్రీ చేర్పిద్దామని..”

“సరే సరే! అంతగా చెప్పాలేవిటండి? ఎంత గొప్ప నవలలు రాసారు మీరు! మర్చిపోగలమా మీ ‘ఆకాంక్ష’, ‘సంధ్య వేళలో ఎదురీత’ ముక్ష్యంగా మీ ‘పది ప్రమాణాలు’! ఇంకా ఎన్నో! మీ వీరాభిమానిని! అమ్మాయిని తీసుకుని వచ్చేయండి. తప్పకుండా తనకిష్టమైన గ్రూప్ లోనే సీట్ చూస్తాను. ప్రముఖ నవలా రచయత కూతురు మా కాలేజీ పిల్ల అంటే మాకు గర్వంగా ఉంటుంది. పైగా కాలేజీ ఫంక్షన్స్ కి మిమ్మల్నే వక్తగా అధితి గా పిలవచ్చును!ఎప్పుడొస్తారు? ఒక గంటలో వచ్చేస్తారా కాలేజీ కి?”

తనకిష్టమైన రచయిత గరికపాటి సుందర్ ని చూడాలని ఉవ్విళ్ళూరుతుంది కామాక్షి. ఆయన నవలలకి ప్రాణం పెడుతుంది. ఎప్పుడో ఎదో సాహిత్య సభ లో పరిచయమైంది తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే మాట్లాడింది. ఎంతో ఆత్మీయంగా, స్త్రీల పట్ల గౌరవంగా మాట్లాడుతాడు. సుబ్రహ్మణ్యం అంత కాకపోయినా కాస్త అందగాడే! అమాయకుడైన చేతగాని అందగాడికంటే; చిన్న జీతగాడై, కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ,అద్భుతమైన నవలలు రాసే తెలివైన సంసారి నయం అన్న అభిప్రాయం కలిగేది సుందర్ తో మాట్లాడిన ప్రతిసారి! పైగా పేరు కూడా మనిషికి తగ్గట్టే వినసొంపుగా ఉంటుంది. ఆయన కూతురు తన కాలేజీ లోనే చేరితే అడపాదడపా ఆయన కనపడతాడన్న చిన్న ఆలోచన.

ఆమె ఆలోచనల్ని చెదిరిస్తూ “లేదండి కామాక్షి గారు క్షమించాలి!ఇవ్వాళ విజయవాడ లో ఒక సాహిత్య సభ కి పిలిచారు. ఎవరిదో కథా సంపుటి ఆవిష్కరించించాలి. ఆ పని మీద వెళుతున్నాను. మళ్ళీ రేపు సెలవు కదా! సీట్లు ఉంటాయో అయిపోతాయో అని మా పాపని, వాళ్ళమ్మని పంపిస్తున్నాను. కొంచెం ఈ సాయం చేసిపెట్టాలి.”

‘హ్! నా మొగుడల్లె రోజూ ఇంటికి ఆఫీసుకి మధ్యలో మాత్రమే కొట్టుమిట్టాడే టెన్నిస్ బంతా ఈయన?ఎన్నో పనులుంటాయి!’ అనుకుని “తప్పకుండా అండి.ఇక గరికపాటి వారి గాలి వీస్తుంది మా కళాశాలలో! ఉంటానండి.కాలేజీ కి బయల్దేరుతున్నాను.” అని ముగించి మెల్లగా కార్ స్టార్ట్ చేసి ముందుకి సాగింది కామాక్షి. సుబ్రహ్మణ్యం కనీసం ఆమె వెళ్లేది గమనించలేదు. ఆమె ‘ వెళ్ళొస్తానని’ చెప్పడం ఎప్పుడో మానేసింది.

కామాక్షి కార్ నడిపి చాలా రోజులైంది.అందువల్ల కాస్త ఆలస్యంగా చేరుకుంది. ఆమె ఆఫీసు రూమ్ కి వెళ్ళే సరికి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అడ్మిషన్స్ అవుతుండడంతో కళాశాల విద్యార్దినులతో, వారి తల్లిదండ్రులతో చాలా రద్దీగా ఉంది. కామాక్షి పనులు మొదలు పెట్టేలోపే అటెండర్ ఒక చీటీ ఇచ్చాడు. మడతలు విప్పి చూస్తే ‘గరికపాటి సుందర్’ అని ఉంది. వెంటనే వాళ్ళని లోనికి పంపించమంది .  అటెండర్ బయటకు వెళ్ళగానే తన కళ్ళజోడు , ముంగురులు సర్దుకుని పెదాలు తడిచేసుకుని చేత్తో పెన్ పట్టుకుని అవసరం లేకున్నా ఎదురుగా ఉన్న కాగితాల మీద ఎదో రాస్తున్నట్టు భంగిమ పెట్టింది. గరికపాటి వారి భార్యా కూతురు లోనికి రావడం గమనించి కాగితాలలోంచి ముఖం పైకెత్తి నివ్వెరబోయింది!! వాళ్ళిద్దరూ ఆమె ముందుకొచ్చి నిలబడ్డారు. కూర్చోమని చెప్పడానికి బదులు ఆమే ఆశ్చర్యంతో లేచి నిలబడింది. అర నిమిషం పాటు నిశ్శబ్దం!ఇక చేసేది లేక కామాక్షి తేరుకుని “మీరూ…?” అని అడిగింది అనుమానంగా.

సుందర్ భార్య, కూతురు నమస్కరించారు.

“గుడ్ మార్నింగ్ మేడం!మై నేమ్ ఈజ్ గరికపాటి ఆశాజ్యోతి . డాడీ మిమ్మల్ని కలవమన్నారు. ఈవిడ మా అమ్మగారు కరుణ.నేను ఇంటర్ మీడియట్ యం పి సి నైంటి టు పర్సెంట్ తో పాసైయ్యను మేడం. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ బి యస్ సి కెమిస్ట్రీ. మిగతా గ్రూప్స్ లో ఆల్రెడీ సీట్స్ అయిపోయంట మేడం.

‘ఇక చెప్పాల్సింది మీరే’ అన్నట్టు కామాక్షి సమాధానం కోసం ఎదురు చూస్తుంది ఆశాజ్యోతి. కరుణ ప్రేక్షక ప్రాతకే పరిమితమైంది.

కామాక్షి వాళ్ళని ఎగా దిగా చూసి “ నీ సర్టిఫికెట్స్ ఇలా ఇవ్వమ్మా” అని అడిగింది.

ఆశా జ్యోతి చాలా ఆశ గా ఫైల్ ఇచ్చింది. కామాక్షి కూర్చోలేదు, వాళ్ళని కుర్చోబెట్టలేదు. సర్టిఫికెట్స్ అన్నీ జాగ్రత్తగా చూస్తుంది… ‘స్కూల్ ,ట్రాన్స్ఫర్,మైగ్రేషన్…ఆ…కాస్ట్! దొరికింది.’

కామాక్షి మనసులోనే నిర్ణయం ధృడంగా తీసుకుంది.

అందంగా నవ్వుతూ “సారీ రా తల్లీ! కెమిస్ట్రీ లో సీట్స్ ఇందాకే అయిపోయాయి. సివిక్స్, హిస్టరీ లో ఆఖరి సీట్స్ ఉన్నాయి. కానీ అవి కూడా ఉంటాయో లేదో చెప్పలేం. నాన్నగారితో నేను మాట్లాడుతాను. వేరే కాలేజీ లో సీట్స్ ఉన్నాయేమో నేనే కనుక్కుని చెప్తాను . ఆల్ ది బెస్ట్ అమ్మా!” అని చెప్పి ఫైల్ వెనక్కి ఇచ్చేసి ‘వెళ్ళండి’ అనే నమస్కారం చేసింది.

ఆశా జ్యోతి ఆశలు అడియాసలై ఆమె నుదుటి మీద లేని కుంకుమ బొట్టు కళ్ళల్లోంచి కన్నీటి బొట్టై రాలింది. వాళ్ళు వెనుతిరగగానే కామాక్షి గబగబా ఫోన్ ఆన్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ తీసి ‘జి’ లో గరికపాటి నెంబర్ డిలీట్ చేసింది. అతన్ని కలిసిన రెండు సార్లు మొహానికి బొట్టెందుకు  లేదో ఇప్పుడు అర్ధమైంది! ఈ గరికపాటి ఆమె అనుకున్న ‘ఘనాపాటి’ కాదని తెలుసుకుంది.

*

 

 

 

మీ మాటలు

 1. సురేష్ కుమార్ దిగుమర్థి says:

  మానస,
  ఉత్కంఠభరితమైన కధనంతో వాస్తమాన్ని చాచి కొట్టినంతగా చెప్పిన కధ ఇది. You have done an excellent job of writing.

 2. sathish thipparapu says:

  కులం అంటే రిజర్వేషన్స్ అని కుళ్ళుకు చస్తున్నారు- వాళ్ళు ‘తక్కువ ‘ అనుకునే కులం కి ఎక్కువ అనుకునే వాళ్ళు.

  వాళ్ళకు చెప్పి చెప్పొచ్చు. చెప్పుతో చెప్పొచ్చు. ..
  కానీ మీరు చాలా చక్కగా చెప్పారు!
  ధన్యుణ్ణి!

 3. mercy margaret says:

  చివరి వరకు ఒక ఉత్కంట మానస .. నా జీవితంలోని కొన్ని అనుభవాలు కూడా కనిపించాయి ఈ కథ చదివాక .. కామాక్షి లాంటి వాళ్ళ మొహం పై కప్పుకున్న తెరను లాగినట్టుంది కథ .. కీప్ గోయింగ్

 4. ఎండ్లూరి మానస says:

  అందరికీ ధన్యవాదాలు…! దళితులు ఆధునిక కాలంలో ఎదురుకుంటున్న వివక్ష ఎలా ఉంటుందో తెలిపే ప్రయత్నం చేశాను. నచ్చినందుకు సంతోషం.

 5. దేవరకొండ says:

  బొట్టు…కథ పేరు రెండు వైపులా పదునున్న కత్తిలా వుంది. ఎందుకంటే బొట్టు వుండడం వల్ల రావలసిన ఉద్యోగాలు రాకుండా పోయిన కథలు కూడా చాలానే వున్నాయి! అయితే కథా పరంగా అన్ని మార్కులొచ్చిన ఆశా జ్యోతికి సీటు రానంత కాలేజీల కరువేమీ వాస్తవానికి లేదు. మా కాలేజీలో చేరు, మా కాలేజీలో చేరు అంటూ విద్యా వర్తకులు వెంట పడే ఈ రోజుల్లో ఇలాంటి కథ అసహజంగా అనిపించింది. అయితే మంచి కథనం!

 6. Krishna Veni Chari says:

  చాలా బాగుంది మానసా.

 7. కథ ఇతివృత్తం మంచిదే,కానీ కేవలం ‘బొట్టు’లేదని తిరస్కరించే రోజులుపోయాయి. ప్రస్తుతం అంతా కంప్యూటర్ల మాయం కదా !
  ఇక్కడ బొట్టు-కాటుక ప్రస్తావన ఉండదు ,కాని ఇంకోరూపంలో వేధింపులు ఉండొచ్చు,వీటికీ అంతగా ఆస్కారం లేదిప్పుడు.
  కథాగమనం అంటారా ఫరవాలేదు …ఇంకా బాగా రాయడానికి ప్రయత్నించండి.అభినందనలు.
  సూచన–బొట్టు లేకపోవడానికి కారణాలు కూడా అనేకం .

 8. ఎండ్లూరి మానస says:

  బొట్టు ఉన్న వారికంటే లేని వారు పోగొట్టుకున్న అవకాశాలు ఎదురుకుంటున్న వివక్ష ఎక్కువ. free seat వచ్చినా, engineering చదివే విద్యార్థి ఖర్చులు మామూలు degree చదివే విద్యార్థి ఖర్చుల కన్నా ఎక్కువే ఉంటాయి.అతని పెద్ద కూతురు ఆశ గరించే కాక మిగతా కుటుంబాన్నీ దృష్టి లో పెట్టుకుని ఆర్థిక స్థితి అనుమతించక తీసుకున్న నిర్ణయం. ఇది వాస్తవం లోంచి పుట్టిన కథ. computers ఆధునికతను పెంచాయి గాని మానవత్వాన్ని పెంచలేదు.కులం పేరును బట్టి ఇళ్ళు అద్దెకు ఇచ్చే అలవాటుని మార్చలేదు.INTERVIEWS లో కులాన్ని బట్టి మాటతీరు మార్చే రోజులు వచ్చాయి. పూర్వం అంటరానితనంతో వేధిస్తే ఇప్పుడు అందమైన నవ్వుతో వివక్ష చూపే రోజులు వచ్చాయి. ప్రతిభను కులం కోణంలో చూసి, ఇంటి పేరుతో పప్పు లో కాలేసి నాలుక్కరుచుకునే కామాక్షులు బొట్టు లేని వారికే కనబడుతుంటారు.

  • suvarchala chintalacheruvu says:

   మెరిట్ లో సీట్ ఎప్పుడూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లోనే వస్తున్నాయి కదా మానసా! అక్కడ అందరికీ సమానమైన ఫీజులే! ఇక ప్రెవేటు కాలేజీల్లో తమ తమ ఇష్టాన్ని బట్టి చేరుతారు. పైగా వారికొచ్చిన ర్యాంక్ బట్టే ఫీజు అదీ ఉంటుంది అక్కడ కూడా! (మేనేజ్ మెంట్ సీటు కదా అదీ)

 9. akbar mohammad says:

  కథ బావుంది . మరెన్నో కథలు రాయాలి , అల్ ది బెస్ట్ మానస గారు.

 10. ’బొట్టు’ కంటెంపరరీ కాదని చెప్పలేం. బొట్టుకు విలువ మారి ఉండవచ్చు కానీ మనుష్యులకు విలువ మారలేదు. మానస కధలో ‘ఇంటి పేరు’ కలిగించిన గందరగోళాన్ని ’బొట్టు’ పరిష్కరించింది. ఇది వాస్తవంలోనుండి వచ్చింది కాబట్టి ’బొట్టు’ దగ్గర ఆగింది. మరికొందరి అనుభవాలలో ఇంకో దగ్గర ఆగుతుంది. ’బొట్టు’ అంతం కాదు, ఆరంభమూ కాదు. గతమూ, వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా.

 11. chandh-thulasi says:

  అవును బొట్టు అంతమూ కాదు….ఆరంభమూ కాదు….మానస గారూ కథ ఓకే…..కీపిటప్

 12. buchi reddy gangula says:

  మానస గారు
  అమెరికా అయినా — అమలాపురం అయినా —
  ఏ దేశం ఎగినా — ఎందు కాలిడినా —-ఎక్కడ అయినా కుల మత పట్టింపులు
  లేక పోలే దు — అమెరికా కు వచ్చినా — ప్రవాసుల కు ముస్లిమ్స్ అంటే పరాయి వాళ్ళు —
  శత్రువులు — లాగ ఫీల్ అవుతూ వాదిస్తారు ??? చదువుకున్న దద్దమ్మలు ??
  మారింది ఎక్కడ ???
  ఆర్థిక సమా నత్వం రానంత వరకు —-?????? అంతే
  ———————-కథ బాగుంది
  ————————————————————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 13. skybaaba says:

  నా ఓటు మానస కే !
  ఇంకా పెద్ద కథలు కూడా రాయాలని కోరుతూ…

 14. Aranya Krishna says:

  ఒక మంచి బలమైన కథా వస్తువు. చక్కటి కథన నైపుణ్యం. కానీ బలహీనమైన ముగింపు. ఇళ్ళు అద్దెకివ్వటం లో కనబడే వివక్షని ఇలా కళాశాల సీటు విషయానికి అన్వయించారేమోనని అనిపించింది. ఏమైనా మానస భవిష్యత్తులో ఒక మంచి రచయిత్రి కాగలదన్న హామీని ఈ కథ ఇస్తుంది.

 15. Madhavi Mirapa says:

  ఇది నేను లేట్ గా చూసాను మానస చాల బాగా రాసింది. దళితుల కధలు ఇంకా రాయాలని ఆశిస్తున్నాను… ఆల్ డి బెస్ట్ మానస… ఫర్ డి దళిత్ ఉమెన్ రైటర్…

 16. బావుందండి మీ కథ నిజంగా బిట్టు కథలో కుటుంబం లో ప్రేమను చూపిస్తే,ఈప్పుడు సమాజాన్ని చూపించారు,ఈప్పంతినుంచి
  నేను
  మీ ప్రియ పాటకురాల్ని

 17. Wilson Sudhakar Thullimalli says:

  ” బొట్టు ” కథ గురించి ఎంత రాసినా తక్కువే. మానసకు కంగ్రాట్స్. ‘ ఈ రోజుల్లో కూడా బొట్లు లేకపోవడం వల్ల వివక్ష ఉంటుందా ‘ అనేవాళ్ళకు అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది కథకాదు. కొందరు అనుభవిస్తున్న క్షోభ. బొట్లు లేని బొమ్మలు వేయనందుకే చిత్రకారుడు బాపుకు నీరాజనాలు. టాయిలేట్లమీద మీద కూడా బొట్టున్న బొమ్మలే. హైదరాబాద్లో మా అపార్ట్మెంట్ ఎదురుగా ఒక వైశ్య కుటుంబం ఉంటుంది. మేము ఎదురైతే ఇప్పటికీ వాళ్ళు వెనక్కి వెళ్లి కొంచెంసేపు ఉండి మళ్ళీ బయలుదేరతారు. ఇది రోజువారీ మా అనుభవాలు. మేము వారికి ఎందులోనూ తక్కువ కాదు. వారు మాకు ఏ విషయంలో ఎక్కువ కాదు.
  నావరకు స్వానుభవాలు ఎన్నో. 94లో అనుకుంటాను. హైదరాబాద్ లో ఆలిండియా రేడియో వారి ‘ ” ప్రోగ్రాం ఎగ్జెక్యూటివ్” ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లకు వెళ్లాం. మొదలి నాగభూషణ శర్మ, ఫ్లూట్ వాయించే శ్రీనివాసన్ బాచ్ ఇంటర్వ్యూ బోర్డులో వున్నారు. అప్పుడు చూడాలి జరిగిన డ్రామా. అప్పుడు ఎంపికయ్యింది మొత్తం బొట్లు బాచ్. నిజానికి మొత్తం లిస్ట్లో అన్ని అర్హతలు వున్నవాళ్ళం నేనూ మా ఆవిడ. విదేశీ రేడియో స్టేషన్లో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్గా చేసిన అనుభవం మాది. మా యావిడ కూడా బొట్టుపెట్టుకోకుండానే వెళ్ళింది. ఆమాటకొస్తే గతంలో ఆకాశవాణిలో జరిగిన ఎంపికలమీద రిసర్చ్ చేస్తే ఎన్నో చిత్రవిచిత్ర మైన విషయాలు బయటపడతాయి. ఇది మంచి కథ.

 18. వనజ తాతినేని says:

  కామాక్షి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
  చాలా బాగా వ్రాసారు . మరిన్ని వ్రాస్తూ ఉండండి . అభినందనలు

 19. chaithanya says:

  బొట్టు చుట్టూ ఉండే పాలిటిక్స్ ని ఎంత బాగా రాసావ్! చాల బావుంది.. సూపర్.

 20. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా త్వరలో ..
  కాకపోతే , ఈ రోజుల్లో ఇటువంటి వివక్షత ఉందంటే నమ్మలేము. వివక్ష ఎక్కడుందో దానిమీదే సూటిగా రాసి ఉంటె ఇంకా బాగుండేది .

 21. చాల బావుంది..

 22. అంతరాలు ప్రతిచోట వుంటాయి . ఒకే ఇంట్లో . మొగుడు పెళ్ళాం కూడా అతీతులు కాదు. నీకు నువ్వు గొప్ప . నాకనేను మరీ గొప్ప.,అందరూ ఆమోదించాలిసిన అవసరం లేదు .కధ బావుంది.మనసు లేక పోతే బొట్టు వున్నా లేకపోయినా సీట్ రాదు.

 23. manasa yendluri says:

  అందరికీ ధన్యవాదాలు

 24. suvarchala chintalacheruvu says:

  అవును మంచి మనసు ఉన్నట్లైతే బొట్టు తో సంబంధమే లేదు.
  ఈ అంతరాలు మనుషులన్దరికీ విభిన్నమైన అంశాలలో ఉంటూనే ఉన్నాయి. కులం ప్రసక్తే లేకుండా కూడా! “అందాల రాముడు” సినిమాలో “మనిషి మనిషికి కుదరదూ” అనే పాట సాహిత్యం లా.
  ఇక వివక్ష ఈ రోజుల్లో చదువు విషయంలో ఉండటం లేదు. అందునా గవర్నమెంట్ కాలేజీల్లో ! ఒకవైపు తెలివైన పిల్లల్ని కార్పోరేట్ కళాశాలలు కూడా చేర్చుకోటానికి ముందుకువస్తున్నాయి.
  కథనం బాగుంది మానసా! ఇన్తకూ కామాక్షి ఎందుకు వాళ్లిద్దర్నీ చూసి లేచి నిల్చున్దో అర్ధం కాలేదు! అయినా గరికిపాటి ని కలిసినప్పుడు బొట్టుపెట్టుకొని కనిపించలేదు అని రాశారు. ఎల్లవేళలా మగవాళ్లు బొట్టు పెట్టుకుంటారనేమీ లేదు కదా!
  ఆల్ డి బెస్ట్..

 25. బాగుంది……

 26. Daya Ramadevi says:

  అక్క క‌థ బాగుంది.
  టెక్నాల‌జీ ఎంత పెరిగినా మ‌నుషుల మ‌ధ్య అంత‌రాలు మాత్రం త‌గ్గ‌డంలేదు.
  ఇంకా కొత్త కోణాల‌లో వివ‌క్ష‌త పెరుగుతూనేవుంది.
  …..ద‌యా ర‌మాదేవి.

మీ మాటలు

*