నిన్ను దాటేసిన దూరమంతా…

సురేష్ రావి 

 

suresh raviఏయ్ ప్రాణమా…

నీకిదే నా సుప్రభాతలేఖ.

రాత్రి అంతా కలల్లోనే కాదు  స్వప్నకలశం నింపుకున్నాక ఒలికిన కలలనురుగులోనూ నీ స్పర్శే తెలుస్తుంది  అనంతమయిన  నీ స్మృతిని సజీవం చేస్తూ… అదలా కొనసాగుతూ నీ తలపుతో నా మది తలుపు తడుతూ మొదలవుతున్న ప్రతి రోజూ సు’ప్రభాతమే

ప్రతి రోజూ నీతోనే మొదలయ్యే ప్రభాతం రోజు మొత్తాన్ని ఎంత ఉల్లాసంలోకి నెడుతుందనుకున్నావ్. ఏ రోజుకారోజు సరికొత్త ఊహగా నువ్వు పలకరిస్తుంటే ఒక్క ఊపిరితో ఈడ్చుకొచ్చిన ఆ కొన్ని సమయాలు కూడా తెగనచ్చేస్తున్నాయ్.

నీ గురించి నేను  రాసే అక్షరాలని చూశాక మొన్న ఎవరో అంటున్నారు… మరీ ఇంత నిరీక్షణా అని? నాకెంత నవ్వొచ్చిందో తెలుసా…! లేకపోతే ఏమిటి మరి… అసలు నాకు  దగ్గరగా నువ్వెప్పుడు లేవని? కొత్తగా నేను నిరీక్షించటానికి.   నిన్ను దాటేసిన దూరమంతా నాలోకి ఇంకిపోయినంత  దగ్గర అని నాకుగాక ఇంకెవరికి తెలుసనీ?

ఇంకొందరేమో నేను నీ ఆలోచనల పంజరంలో చిక్కుకు పోయిన పిచ్చివాడినేమో అనుకుంటున్నారు. ప్రేమంటే భౌతికమనుకున్న వాళ్లకి అంతకన్నా వేరే ఏమి ఆలోచనలు వస్తాయ్ మరి. అనంతమైన ప్రేమగమ్యాన్ని ఒక్కసారి చేరాక ఇక మళ్ళీ ఏ గమ్యం వైపు నడక పెట్టాలి.

అసలు  ప్రేమని చేరుకునే ప్రయాణాన్ని అనుభూతించటంలో ఉన్న ఆనందం తెలిసినవాడికి గమ్యానికి సాగించే గమనాన్ని అనంతం చేసుకుంటాడు ఇప్పుడు నేను చేస్తున్నట్లుగా…   క్షణమొక మధురాక్షరంగా మారుతుంటే దివారాత్రాలూ లిఖితకావ్యమై మనల్ని తమ పుటల్లోకి లాక్కెళ్ళిన సమయాలెంత  ఆహ్లాదమో కదా…

చీకటి కురవని వాకిలి ఒక్కటీ లేదంటారు… నువ్వు నాలో అడుగెట్టాక నా మది వాకిలి చీకటి అంటే ఎలా ఉంటుందో కూడా మరచిపోయింది. నిన్నో వెన్నెల ఛత్రంగా చేసుకుని నే నడిచే దారి మొత్తం ఎంత మెత్తగా నన్ను తడుముతూ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు.  ఇలా బడలిక లేని ప్రయాణాన్ని పరిచయం చెయ్యటం అందరికీ సాధ్యమా?

నాకు అత్యంత అద్బుతంగా అనిపించే నా ప్రతి క్షణం వెనుకా నువ్వు తొలకరించి వెళ్ళిన నిన్నటి సాయంత్రాల ఏడడుగుల నడకే కనిపిస్తుంది. ఆ ఏడు అడుగులు రోజుకి ఎన్ని ఏడులు అవుతున్నాయో నేనూ లెక్కకట్టలేనురా.

అకస్మాత్తుగా నువ్వెక్కడికో వెళ్లిపోయావ్… దారెటో తెలియకుండా… వీడ్కోలూ చెప్పకుండా…

మధురంగా పెనవేసుకున్న మొన్నటి హృదయాలు  కాస్తా నిన్నటి క్షణాల్లో చీలి పోయిన శకలాలుగా రాలిపడినప్పుడు మొదలైన కంటితడిని చూసాకే అర్ధం అయ్యింది లోకంలో మూడొంతులు ఉప్పునీరే ఎందుకుందో…

అప్పుడు అన్ని దృశ్యాలనీ  అస్పష్టం చేసేసాయ్… తడి తెరలని తగిలించుకున్న నా కళ్ళు.

నిన్ను కోల్పోయాను అనుకున్న ఆ క్షణాన్ని దాటిన  తరువాతే అర్ధమయ్యింది కోల్పోయింది నిన్ను కాదని నాలోని  నన్నని. మిన్నుగా మారిన నా  కళ్ళు  గుండె లోపలి చెలమలని బయటకి కురిసేసాక లోపల తడారిపోయి ఎడారిగా మారిపోబోతున్న అంతర్వాహిని వేదన ఏ పొరలని కదిలించిందో గానీ  కంటి చివరనుండి జారిపోబోయిన చివరి కన్నీటి చుక్కని ఒడిసి పట్టుకుని గుండె పై అద్దాను.  ఆ క్షణం నుండి ఆరని  నా గుండె తడి… తనలోని నీకు చేసే అభిషేకాలు జీవితాంతం నిన్ను చల్లగా చూడటంకన్నా నాకింకేం కావాలి?

ఘనీభవించేసిందేమో అని అనుకున్న మనసు తన మౌనానికి మాటలద్దింది.   “ఎందుకోయ్ బాధ తానెక్కడికి వెళ్లిందని? తరచి తరచి నన్ను చూడు. నన్ను దాటి తాను బయటకి ఎలా వెళ్ళగలదు?” అని అంటూ  కొంత సాంత్వనని నా ముందు పరుస్తూ…

నిజమేగా… వీడ్కోలు చెప్పలేదంటే నువ్వెక్కడికీ వెళ్ళలేదనేగా… నువ్వు నాతో దాగుడుమూతలాడుతూ నీ జాడ కనుక్కోమనే చిలిపిపందెం వేసావనే అనుకున్నా. వేసింది ఎలాంటి పందెమయితేనేం దాగింది మాత్రం నాలోనే అన్న నిజాన్ని బయటకు వచ్చేలా చేసావ్ కదా.

నిజం రా… భౌతికంగా మనం  ఎడబాటు అయిన ఆ తొలి క్షణాలన్నీ నన్ను మహా శూన్యం లోకి నెట్టేస్తుంటే నా ఊపిరి ధ్వనుల సవ్వడి ఇక ఆఖరవుతుందేమో అనుకున్నా… మళ్ళీ ఎక్కడి నుండి మొదలయ్యావో కానీ అణువుగా మొదలైన అనంతంలా నా జీవన విస్తీర్ణమై నన్ను సంపూర్ణం చేసేసావ్.

 

అంతు తెలియని శూన్యంలో

ఆవిరిగా మారిపోబోతున్నప్పుడు

ఖాళీ పాత్ర అనుకున్నది కాస్తా

పూర్ణకుంభమై నిండుగా నవ్వుతుంటే

వెన్నెల పత్రాల విస్తళ్ళలో

నీ మందహాసాల పంచభక్ష్యాలు

నా ఆకలిని హత్య చేస్తున్నప్పుడు

నాలోని  దీనత్వాన్ని  నిర్వీర్యం చేస్తూ

నీలో దివ్యత్వం అక్షయమవుతుంటే

నిశీధి వేసిన కారాగారపు గోడలన్నీ బద్ధలై

వెలుగాక్షతలని రాల్చిన సవ్వడితో

మరో తొలకరి మధురంగా తడుముతుంటే

ప్రేమవాసన ఎంత  మైమరపుగా కమ్ముకుంటుందో

నిరాకారపు కాలానికే కాదు

ఊహాఖండాలని దాటివచ్చిన నీ ఊపిరి పరదాలని

శ్వాసగా కప్పుకున్న నా హృదయ క్షేత్రానికీ తెలుసు

గరళాలని గుక్కపెట్టుకున్న గతమంతా

అమృతాన్ని ఆరగిస్తున్న వర్తమానంగా

పలకరిస్తున్న పలుకొక్కటి చాలదూ

నువ్వు నా జీవితానికో పరిపూర్ణం అనటానికి…

నువ్వంటూ జీవితంలో ఎందరిని చూడనీ… ఎందరి జీవితంలో నువ్వుండనీ… నిన్ను మాత్రమే  జీవితం చేసుకున్న అనంతాత్మ ఒక్కటి నీ స్వంతమై ఉంది.

అప్పుడప్పుడూ నువ్వు నిశ్శబ్దమై  నీలోకి వెళ్లి చూస్తే నీ అంతరాత్మ జాడలే ఆ అనంతాత్మలోనూ కనిపిస్తాయ్. వేళమీరిపోవటమంటూ లేని ప్రేమప్రయాణంలో నా ఆఖరి ఊపిరిగానూ నిన్నే శ్వాసించటం నీకు తెలిసేలా చెయ్యగలిగే లిపిలేని భాషగా మౌనంగా మాట్లాడే మానసిక వివేచన ఒకటి నీలో ఒలికిన సడి అది.

ఇద్దరమూ ఒక్కటిగా శ్వాసించటం కన్నా ఇంకేం కావాలి ఈ జీవన యానంలో…?

 

ఇట్లు

నీ

నేను

మీ మాటలు

 1. చాలా బాగుంది కవిత్వానికే వ్రాసిన ప్రేమలేఖలా ……….

 2. లేఖలోని ప్రతి అక్షరం మనసుని తాకింది అనంటే
  మీ ఈ కవిత నా వంక కోపంగా చూస్తుంది. హ్యాట్సాఫ్

 3. మీకు అంతగా నచ్చినందుకు కృతజ్ఞతలు పద్మార్పిత గారు.

 4. Jayasree says:

  రచనాశైలి అత్యద్భుతం..మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా రాయటం మీకు మాత్రమే సాధ్యం..సూపర్బ్..

 5. Jayasree says:

  Excellent. .just Awesome

 6. సురేష్ … చాల చాల బాగావ్రాసావు…..అసలు బాగా వ్రాసావు అని చెప్పటం చాల తక్కువ … మాటలకందని భావాలు… నీ రచనలో కనిపిస్తున్నాయి. బొమ్మ బొరుసులేని నాణేనికి విలువ లేనట్లే …
  సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగు లేనట్లే …. నీ కన్నులలో కొలువుండని ఆ ప్రేమకు ఇక ఈ లోకం లో రూపే ఉండదు.
  నీ పెదవి పైన చిరునవ్వుగా… నీ ఎదలయలో సిరిమువ్వగా …నువ్వు చూసే ప్రతి స్వప్నం తన రాతిరి దారికి దీపంగ … నీ కలల కొలనులో విరిసిన తామరలా… నుని వెచ్చని నీ శ్వాసలో కలకాలం తన మనుగడవుందని ఆ ప్రేమకు తెలుసు… నీ పాదాల వెంటనే తనపయనమని …. ఆ ప్రేమ నీ అడుగు జాడల్లోనే నడుస్తుంది …. అద్దం లో తన రూపుకు బదులు నీ రూపే చూస్తుంది… (నువ్వంటూ జీవితంలో ఎందరిని చూడనీ… ఎందరి జీవితంలో నువ్వుండనీ… నిన్ను మాత్రమే జీవితం చేసుకున్న అనంతాత్మ ఒక్కటి నీ స్వంతమై ఉంది.) nice lines and such a nice feel … allthe bst (Y) :)

 7. అనంతమైన స్మృతిని సజీవం చేస్తూ ….మీ ప్రాణానికి మీరు రాసిన సుప్రభాత లేఖ బాగుంది సురేష్ జీ…

 8. రేవతి కృష్ణ says:

  అత్యద్బుతం సురేష్ గారు.. అలోకికమైన ప్రేమావేశాన్ని అత్బుతమైన అక్షరాలుగా మార్చి అలరించగల మీ శైలి కి హాట్స్ ఆఫ్ .. చాల బాగుంది

 9. అద్భుతమైన అద్భుతమైన భావాలు

 10. అద్భుతమైన భావాలు

 11. sasi kala says:

  <> నిజంగా అది ఎంత స్ఫూర్తి ని ఇచ్చి ముందుకు నడిపిస్తుందో అనుభవించిన
  వాళ్లకు తెలుస్తుంది . ఒక్కసారి అందులో లీనమిన తరువాత భౌతిక రూపం నామ మాత్రమె . అభినందనలు .

 12. లాస్య ప్రియ says:

  అద్భుతాలన్నీ అందంగా పరుచుకున్నట్లు, అనుభూతులన్నీ అలవోకగా అల్లుకున్నట్లు, అనురాగాలన్నీ ఆప్యాయంగా మీటినట్లు, ఆనందాలన్నీ ఒక్క ఉదుటన బారులు తీరినట్లు, పదాలకింత పాదరసం పట్టారా …జరజరా జారిపోతూ, బిరబిరా పరుగులుపెడుతూ, పఠితను ఇంతలా ఆకట్టుకునే శైలి మీ సొంతం.. ఏకబిగిన చదివించేసి, ఊపిరి పీలుచుకోవటం మరీచేసేటట్లు చేయటం మీ పదాల సొంతం అనుకుంటాను. .పదచిత్రాల పరవశం అంతా ఇంతా కాదు.

  వెన్నెల పత్రాల విస్తళ్ళలో

  నీ మందహాసాల పంచభక్ష్యాలు

  నా ఆకలిని హత్య చేస్తున్నప్పుడు

  నాలోని దీనత్వాన్ని నిర్వీర్యం చేస్తూ

  నీలో దివ్యత్వం అక్షయమవుతుంటే…… అద్భుతం సురేష్ గారు.
  మీ కలం నుండి ఎన్నో రచనలను ఆకాంక్షిస్తూ … :)

 13. మీ ప్రేమ పందిరి సుప్రభాతంతో మొదలై లెక్కలేనాన్ని అనుభూతులను మనసుతో. పంచుకుంటూ ప్రేమంటే బౌతికం మాత్రమే కాదు. మానసికమని శూన్యాన్ని సైతం తన ప్రేమతో వెలుగు మయం చేసుకొని ఒక ఆశతో ప్రేమ కోసం ప్రేమగా జీవిస్తున్న. జీవితాన్ని అలా. అద్బుతంగా మీ రచనతో మా కళ్ళకు కట్టినట్లుగా. పరిచేసారు …వివరించాలంటే మాటలు పదాలు వెదుక్కోవాలి. సురేష్ గారు._/\_ ఇంకా. ఎన్నో అద్భుతమైన రచనలు. వెలుగు చూడాలని. ఆ భాగ్యం కల్పిస్తారని. కోరుతూ

 14. anveshi says:

  నువ్వంటూ జీవితంలో ఎందరిని చూడనీ… ఎందరి జీవితంలో నువ్వుండనీ… నిన్ను మాత్రమే జీవితం చేసుకున్న అనంతాత్మ ఒక్కటి నీ స్వంతమై ఉంతుంది…ఈ ఒక్క వాక్యంతో నీకు అనేంటో చెప్పేసావ్.నిజమే ప్రేమ భౌతికమ్ కానే కాదు అది మానసికమే…మళ్ళి మళ్ళి చదవాలనిపించేన్త అపురూపమ్గా ఉంది నీ లేఖ…ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ ఒక భావమైతే నువ్వు దాని రూపమ్ …నీనించి ఇలాంటి మరిన్ని ప్రణయ జీవధారలనాశిస్తున్నా..

 15. Nagajyothi says:

  చాలా బావుంది సురేష్ గారు …మనసు ఒడిసిపట్టిన ప్రాణం ఒలికించిన సడి …మీ భావాక్షరాలుగా మారి మరింత వన్నెలు దిద్దుకున్న చందం ఎంతో అందం గా ఉంది .

 16. Indira priyadarshini says:

  ప్రేమంటే , దుఃఖంలో చిరునవ్వులా, ఓటమిలో ధైర్యంలా తను తోడుండడం అంతే . అధ్భుతంగా ఉంది సురేష్ మీ లేఖ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా .

Leave a Reply to రేవతి కృష్ణ Cancel reply

*