‘నాహం త్వమేవ’

డా. విజయ బాబు, కోగంటి

 

 

నీకువలె నా లోనూ

నిశ్శబ్దంగా విచ్చుకునే సుమ స్వప్నాలున్నై.

నీలో సప్తవర్ణాలు, సజీవ శుకపిక ధ్వానాలు!

నాలో లెక్కకు అందని రంగులు,

అనుక్షణం ఆరి మెరిసే అందని ఆశల మిణుగురులు!

నీలో గభీర సంగీత నాదాలు!

నావి నిరంతర కల్లోలిత నిస్పృహా నిస్సహాయతల

నిట్టూర్పులు,

నిబిడానలపు టుసూరు చిటపటలు!

నీకు మాటి మాటికీ

వసంత రాగాలు, గ్రీష్మాసవాలు,

వర్షస్నానాలు, శరచ్చంద్రికలు,

హేమంత శిశిరాల దాగుడుమూతలు,

రంగురంగుల ఆకుల దుశ్శాలువలు,

పూల కౌగిళ్ళు!

మరి నావో, కోరికల మృగతృష్ణలు,

నిత్య గ్రీష్మాలు,కామోద్రేక వర్షాలు,

పశ్చాత్తాపాల వరద వెల్లువలు,

అడియాసల శిశిరాలు.

నీకు ఎటుచూసినా షడృతువులే

మరి నాకో? నీ ఊహకే అందని చిత్ర ఋతుహేల!

కామం తో మొదలై మాత్సర్యం దాకా!

ఇవికూడా ఎపుడంటే అపుడే, వరసా వావీ లేకుండా, నాకే తెలియ కుండా!

నీవు సృష్టి కూడా తెలిసిన  ప్రకృతివి మాత్రమే,

నేను వికృతిని, మనిషిని,

నవ్వే తోడెలును, నవ్వలేని రాబందును కూడా.

అండజ, బిడజ తిర్యకులన్నీ నీలో విడివిడిగా నైతే

అన్నీ నాలో కలివిడిగా!

నేను అరాచకాన్ని, అవకాశవాదాన్ని కూడా!

నేనో భయచరాన్ని, అభయ చరాన్ని,

అర్ధం మారిన ఉభయ చరాన్ని కూడా!

అందుకే, నా2హం త్వమేవ!

koganti

 *

మీ మాటలు

 1. P.Ramanjaneyulu says:

  శ్రీ విజయబాబు గారు
  కవిత బాగుంది. ఐ మధ్య చుసిన కవితల్లో భిన్నంగా ఉంది. మనిషి స్వభావాన్ని బాగా ఆవిష్కరించారు.
  అభినందనలు.

 2. David Raju says:

  Vijay sir,
  Congrats once again for becoming a varied and prolific writer, expanding your creative horizon. Last month you made us laugh at the follishness of the superstitions and TV astrologers. This time , with more depth , you brought out ” A confession of a male chauvanist.”…. hats off.

 3. Dr. Vijaya Babu, Koganti says:

  శ్రీ రామాంజనేయులు గారు , శ్రీడేవిడ్ రాజు గారు
  మీ పరిశీలనకు , ప్రోత్సాహానికి , ప్రశంస కు ధన్యవాదాలు.

 4. దేవరకొండ says:

  ప్రాణం పోతేనే తప్ప ప్రకృతితొ మమేకం కాలేని అసహజ స్థితికి దిగజారిన మానవ నైజాన్నిచాల చక్కని భాషలో చెప్పిన డా. విజయ బాబు గారికి అభినందనలు.

 5. Dr. Vijaya Babu, Koganti says:

  ధన్యవాదాలు దేవరకొండ గారు.

 6. చాలా చక్కని కవిత విజయ్ గారు..ప్రకృతి కీ మనిషికీ మధ్యన తేడాలు చక్కగా చెప్పగలిగారు..నాకెందుకో ఇక్కడఈ కవితలో ప్రకృతి ని స్త్రీలాగ కూడా తీసుకోవచ్చనిపించింది..పదాల ఎంపిక అల్లిక పొందిక జలపాత ధార లా ఉంది..అభినందనలు..

 7. Vijay Koganti says:

  ధన్యవాదాలు సరళా మోహన్ గారు.

 8. sa rahim says:

  Good

మీ మాటలు

*