కల్లలాడువేళ

 

భూపతిరాయుడు: సైనికుడుచరణదాసు: అతని స్నేహితుడుమంజీర: ఒకవేశ్య, ముగ్ధ

 

భూప:      (దర్పంగా) నల్లమల ఆటవికులతో జరిగిన యుద్ధం గుర్తుందా దాసూ! వాళ్ళెంత సాహసులో తెలుసుగా నీకు? మన ఆశ్వికదళానికి ముందెత్తున నా తెల్లగుర్రాన్ని దూకించగానే ఆ ఆటవికులెట్లా వణికిపోయారో చూశావుగా? వాళ్ళలో ఒక్కడికైనా నాకెదురొచ్చేందుకు ధైర్యం చాలిందా? అప్పుడు నేను విసిరిన బల్లెం దెబ్బకి వాళ్ళ నాయకుడి శిరస్త్రాణం పగిలి నేలమీద పడింది. వాళ్ళు తేరుకొని మళ్ళీ ఒక్కుమ్మడిగా దాడి కొచ్చేసరికి నేను నాకరవాలంతో వాళ్ళ నెదుర్కున్నాను. వరసలో మొదటి ఏడుగురినీ నా పంచకల్యాణి తొక్కేసింది. అదే ఊపులో నాకత్తి విసురుకు వాళ్ళ నాయకుడి తలతెగి నేలమీద పడింది. ఆసరికి మనవాళ్ళు నాకు తోడుగా యుద్ధరంగంలోకి వచ్చారు గానీ అప్పటికే శత్రువులు పారిపోవడం మొదలేశారు.

దాసు:      అదిసరే గండికోట బందిపోటు దొంగలతో చేసిన యుద్ధం సంగతో? అప్పుడు నువ్వు చేసిన సాహసం సామాన్యమైందా? ఒంటి చేత్తో వాళ్ళ నాయకుడిని ఓడించలేదూ?

భూప:      భలే గుర్తుచేశావు దాసూ! ఆ బందిపోట్ల నాయకుడు రాక్షసుడిలాగా ఉండేవాడు. పైగా వాడికి కత్తివిద్యలో గొప్ప నేర్పుండేది. మనవాళ్ళంటే వాడికి చాలా కసి. నాతో యుద్ధం చేసే మగవాడెవడో ముందుకు రమ్మని వాడు సవాలు చేశాడు. మనవాళ్ళు వాణ్ని చూస్తూనే వణికి పోయారు. అప్పటికి నేనింకా మామూలు సిపాయినే! వాడలా గేలి చేస్తుంటే నాకు పౌరుషం పొంగింది. మనవాళ్ళంతా నన్నాపాలని చూశారు. కానీ నేను వాళ్ళందరినీ విదిలించుకొని….

దాసు:      అట్లా నిన్నాపిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. పెద్ద పెద్ద యోధులని పేరున్నవాళ్ళంతా మూసుకు కూర్చుంటే నువ్వెందుకు అంత సాహసం చెయ్యడమని నాకనిపించింది. నీలాంటి వీరుణ్ణి కోల్పోవడమనే ఆలోచన నాకే కాదు, మన మిత్రులెవరికీ నచ్చలేదు.

భూప:      కానీ ఆక్షణంలో నేను మరేమీ ఆలోచించలేదు. కసిగా శత్రువు వైపు దూసుకెళ్ళాను. నేను ఉక్కు కవచం తోనూ, స్వర్ణాభరణాలతోనూ, గుండెల్లోంచి పొంగే శౌర్యం తోనూ అల్లా కదన రంగంలో కదులుతుంటే నన్ను గుర్తు పట్టిన సైన్యంలో రెండువైపులా పెద్ద ఉద్వేగం మొదలైంది. ఊరికే మాటవరసకి అడుగుతున్నాను దాసూ! సైనికులందరూ నన్ను ఎవరితో పోల్చారో గుర్తుందా?

దాసు:      ఇంకెవరు, సాక్షాత్తూ దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడితో తప్ప ఇతరులతో నిన్ను పోల్చగలరా ఎవరైనా? అద్భుతమైన నీ శిరస్త్రాణం, అభేద్యమైన నీకవచం… ఓహ్.. అది వర్ణన కందేది కాదు. నువ్వు కదులుతుంటే గాలిలో మెరుపులు మెరిసినట్టు కనిపించిందప్పుడు.

భూప:      కదా!? కత్తి కలపగానే నాతొలిదెబ్బకే వాడికి రక్తం చూపించాను. నాకూ వాడి కత్తివాదర తగిలి మోకాలి కింద చిన్న గాయమయిందనుకో! ఐనా నేను స్థైర్యం కోల్పోకుండా నాబల్లేన్ని గురిచూసి విసిరాను. అది వాడి కవచాన్ని ఛేదించుకొని గుండెలో లోతుగా గుచ్చుకు పోయింది. వాడు నాకాళ్ళ దగ్గర పడిపోయాడు. వాడి కళ్ళలో గాయం వల్ల కలిగిన బాధ కంటే నేనంత నేర్పుగా దెబ్బతీయగలిగానన్న ఆశ్చర్యమే ఎక్కువ కనిపించింది. నేను వాడి గుండెల మీద కాలుమోపి కొద్దిసేపు నుంచున్నాను. ఇంకప్పుడు చేయాల్సిన పని ఒక్కటే! వాడి తల నరికి వాడి గుండెల్లోంచి పెరికి బల్లేనికి వాడి తలను గుచ్చి మన వాళ్లకు అందించాను. వాడి తలనుంచి కారిన రక్తం నాశిరస్సును అభిషేకించింది. నేనలా వెనక్కి వస్తుంటే మనవాళ్ళు దిక్కులు దద్దరిల్లేలా చేసిన జయధ్వానాలు ఎలా ఉన్నాయో గుర్తుచేసుకో!

మంజీ:     (తిరస్కారంగా) ఊరుకో రాయుడూ! నువ్వు చెప్పే మాటలు విని చప్పట్లు కొట్టే వాళ్ళెవరూ లేరిక్కడ. నీ వీరగాథలు విని మైమరచిపోయి నేను నీతో పడుకుంటానను కుంటున్నావేమో! అదేం కుదరదు, నేపోతున్నా!

భూప:      అంతమాటనకు! నీకు కావాల్సినదానికంటే రెట్టింపిస్తా! దయచేసి పోవద్దు.

మంజీ:     నీలాంటి హంతకులతో నేను పడుకోలేను.

భూప:      అలా నన్ను చూసి భయపడకు మంజీరా! ఇదంతా ఎప్పుడో ఎక్కడో జరిగిన ముచ్చట. నేనిప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉన్నాను.

మంజీ:     ఐనాసరే, కుదరదు. నువ్వొక రాక్షసుడివి. ఆ బందిపోటు రక్తంతో నీ తల తడిసి పోయింది. అలాంటి నిన్ను కౌగలించుకొని ముద్దాడటమనే ఊహకే నావొళ్ళు జలదరిస్తోంది. లేదు, నీతో శృంగారం నావల్ల కాదు.

భూప:      నేను ఆయుధాలు ధరించి సైనికుడి వేషంలో నిలబడితే నువ్వు తప్పకుండా నన్ను ప్రేమిస్తావు.

మంజీ:     ఎందుకు, నువ్వు చెప్పిన కథల్లోని క్రౌర్యం నాకు జుగుప్స కల్గిస్తోంది. నువ్వు చంపిన వాళ్ళ ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. నువ్వు తల నరికిన ఆ బందిపోటు ఆత్మ కూడా వాటిలో ఉండే ఉంటుంది. నువ్వు చెప్పిన కథ వింటేనే ఇలా ఉందే, ఇక ఆ పోరాటం, ఆ రక్తం, మట్టిలో చెల్లాచెదురుగా పడిన ఆ శవాలూ, వాటిని చూస్తే …. అమ్మో, చచ్చూరుకుంటాను. చిన్న ఉడతను చంపితేనే నేను చూడలేను.

భూప:      ఇంత పిరికిదానివేంటి మంజూ! నాకథ నీకు చాలా ఉత్సాహాన్నిస్తుందనుకున్నాను.

మంజీ:     ఇట్లాంటి కథలు మనుషుల రక్తాన్ని పీల్చే మెరక వీథి రత్నపాపకో, దాని కూతుళ్ళకో చెప్పు. వాళ్ళకైతే అవి నువ్వనుకున్నట్టు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక ఈరాత్రికి భయంతో నాకు నిద్ర పట్టదు. మా అమ్మ దగ్గరికి పోయి పడుకుంటాను. రావే చిత్రా! సరే రాయుడూ! ఇక జనాన్ని చంపడం మానేసి చక్కగా ఇంటికెళ్ళు. (వెళ్ళిపోయింది)

భూప:      మంజూ… మంజీరా… ఆగు, అరె…. వెళ్ళిపోయింది.

దాసు:      అది నీ స్వయంకృతం. చిన్నపిల్లని, లేనిపోని కథలు కల్పించి చెప్పి బెదరగొట్టేసావు. నువ్వా కథ మొదలేసినప్పుడే ఆపిల్ల కళ్ళలో భయం కనబడింది. ఇక నువ్వా బందిపోటు తలనరికే ముచ్చట చెప్పేసరికి దాని ముఖం పాలిపోయి శరీరం వణకడం మొదలైంది.

భూప:      నావీరత్వం చూసి దానికి నామీద వ్యామోహం కలుగుతుందనుకున్నాను. అయినా అనవసరంగా ఆ బందిపోటు కథ వైపు నన్ను మరల్చింది నువ్వే!

దాసు:      నేనేదో నీకు సాయం చేద్దామనుకున్నాను. నువ్వేమో ఆపిల్ల అభిరుచి గమనించ కుండా మరీ శృతి మించావు. బందిపోటు తలనరకడం వరకూ పర్వాలేదు కానీ, ఆ తలని శూలానికి గుచ్చి పైకి లేపడం, ఆ రక్తంతో అభిషేకం… ప్ చ్ … అతి అయ్యింది.

భూప:      నిజమే, కథలో రక్తపు కంపు కొంచెం ఎక్కువైంది. మిగతా కథని బాగానే ఊహించాను కానీ, అక్కడే కొంచెం దెబ్బతింది. సరే, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో స్నేహితుడికి సాయం చేయాల్సిన బాధ్యత నీకు లేదా దాసూ! పో, పరుగెత్తుకెళ్ళి ఎలాగైనా నాతో పొందుకు దాన్ని వొప్పించు, నీకు పుణ్యముంటుంది.

దాసు:      అట్లాగైతే, నువ్వు చెప్పిన కథలన్నీ నిజం కాదనీ, ఆమె దృష్టిలో సాహసిగా కనిపించడానికి అల్లిన కట్టుకథలనీ నిజం చెప్పేస్తాను.

భూప:      అది మరీ ఘోరంగా ఉంటుందేమో దాసూ!

దాసు:      అదికాక ఇంకేం చెప్పినా ఆమె వెనక్కు రాదు. ఆలోచించుకో మిత్రమా, వీరుణ్ణని పించుకొని ద్వేషింపబడటమా, అబద్ధమాడానని తప్పొప్పుకొని ఆ సుందరిని పొందటమా? ఆలోచించుకో! నన్నడిగితే ఆమె పొందు కోసం నిజాన్ని ఒప్పుకోవడమే సమంజసం. ఒక సైనికుడు కోరుకొనే అందాలన్నీ ఆమెలో ఉన్నాయి. ఉన్నతమైన పయ్యెద, పట్టులా జారిపోయే మృదువైన ఊరుసంపద … నవ్వినప్పుడు గుంటలు పడే ఆ బుగ్గలు… ఓహ్… నువ్వీ పిచ్చి కథలు చెప్పక ముందు ఆ పిల్ల ఏమందో గుర్తుందా! బుగ్గలమీదే కాకుండా అంతకంటే ఆకర్షణీయమైన మరోగుంట తన దగ్గరుందంది. తలుచుకుంటేనే శరీరం పులకరిస్తోంది. నేను చెప్పినట్టు నువ్వు తప్పొప్పుకోకపోతే ఇక నీకీ రాత్రి విరహంతో జాగరణే!

భూప:      (సిగ్గుగా) నువ్వు చెప్పింది నిజమే! కానీ ఏది నిర్ణయించుకోవాలన్నా కష్టంగానే ఉంది. బుద్ధి వీరుడిగా ఉండిపొమ్మంటోంది, మనసేమో మంజీరను కోరుకుంటోంది. సరే, మధ్యేమార్గంగా నువ్వెళ్ళి నేను చెప్పిన కథలో కొద్దిగా అబద్ధాలూ అతిశయోక్తులూ ఉన్నాయని చెప్పు. అట్లాగని అంతా అబద్ధం కాదని చెప్పు. మంజీరని ఎలాగో ఒప్పించు.

 

మీ మాటలు

  1. సాని దగ్గర ప్రతాపం చూపించడానికి విటుడు ఎట్లాంటి పోసుకోలు కబుర్లు చెబుతాడో భూపతిరాయుడు పాత్రతో బాగా చెప్పించారు. అదే సమయంలో ఒక సాని అయ్యుండీ మంజీరలోని మానవత్వం గుబాళించే మనసునీ క్లుప్తంగా అయినా చక్కగా ఆవిష్కరించారు.

  2. మృత్యుంజయరావు says:

    ధన్యవాదాలు యజ్ఞమూర్తి గారూ!

మీ మాటలు

*