శ్రావ్యంగా ‘శబ్దిం’చిన సంగీతం 

భవాని ఫణి 
bhavani phani.The Sound of music! 
చలన చిత్రం(1965) చూసినప్పుడు దృశ్యకావ్యం అనే పదానికి నిజమైన అర్థం తెలుస్తుంది . తరం నించి తరానికి ఆస్తిపాస్తులు ఇచ్చినంత ప్రేమగా ఈ చలన చిత్రంపై ప్రేమని కూడా వారసత్వ సంపదగా ఎందుకు అందిస్తారో  అర్థమవుతుంది . ఒక గొప్ప అనుభూతి గుండెల్లో గూడు కట్టుకుని పది కాలాలు పదిలంగా నిలిచిపోతుంది .. సంగీతం ఎంత సౌందర్యవంతమో మరోసారి అనుభవంలోకి వస్తుంది . భావాలకి పదాల రెక్కలు తొడిగి, సంగీత సామ్రాజ్యంలోకి విడిచిపెట్టినప్పుడు వెలువడే ఓ ఆహ్లాదకరమైన స్వేచ్ఛ అనబడే రెక్కల తాలుకూ చప్పుడు రివ్వుమంటూ గుండెల్లోకి దూసుకొస్తుంది .
ఆత్మకథ ఆధారంగా నిర్మించిన చిత్రమైనప్పటికీ కథలో మార్పులు చేసి నాటకీయత జోడించడం వల్ల దీన్ని ఒక కల్పిత కథగా తీసుకోవడమే మంచిది . ఈ చిత్రానికి ఆయువుపట్టు ఇందులోనే పాటలే . ప్రతి మాటా పాటే అయినా కృత్రిమత్వం కనిపించదు. సంగీతమెంత ప్రకాశవంతమో  ,ఆ ధ్వనిహారంలో కుదురుకున్న అక్షరాలు కూడా కలిసికట్టుగా అంతే కాంతివంతంగా మెరుస్తాయి.
మేరియా ఒక సాధారణమైన స్త్రీ .
సన్యాసినిగా మారాలన్న కోరికతో ఒక క్రైస్తవ మఠంలో శిక్షణ పొందుతూ ఉంటుంది .
కానీ ఆమె మనసు, ఆమెని రోజంతా పర్వతాల్లోనే విహరించమంటుంది .
చీకటి పడిపోయి , నక్షత్రాలు వచ్చేసి ఇక చాల్లే వెళ్లెళ్లమంటున్నా
పచ్చని నీడలేవో ఆమెని తమతోనే ఉండి పొమ్మంటాయి.
ఆమె ఆగుతుంది , వింటుంది.
ఆ పర్వతాలు ఏళ్ల తరబడి వాటిలో దాచుకున్న సంగీతాన్ని ఆమెకి వినిపిస్తాయి .
అలా విన్న ప్రతి పాటనీ పాడమంటూ ఆమె హృదయం  మరీ మరీ మారాం చేస్తుంది .
అంతే కాక ఆమె చిన్ని హృదయం పక్షి రెక్కల్లా కొట్టుకోవాలనుకుంటుంది .
కొలనులోంచి వృక్షాల మీదకి ఉదయిస్తానంటుంది.
చిరుగాలి మోసుకొచ్చే చర్చి గంటల చిరుధ్వనికి మెల్లగా నిట్టూర్చమంటుంది.
రాళ్ల పైకెక్కి జారిపడే సెలయేటి ప్రవాహంలా బిగ్గరగా నవ్వుకోవాలంటుంది. .
ఇంకా ఎన్నెన్నో అల్లరి పనులు చెయ్యమని గొడవ చేస్తుంది .  .
అందుకే ఆమెని ఒంటరితనం ఆవరించినపుడు పర్వతాల్లోకి వెళ్తుంది .
మునుపు విన్నవేవో మళ్లీ మళ్లీ వింటుంది .
ఆ సంగీత ధ్వనుల ఆశీర్వాదాలతో ఆమె పాడుతూనే ఉంటుంది .
నిజానికి ఆమె ఎవరు? ఏమిటి ? అనేది మఠంలోని సన్యాసినుల మాట(పాట)ల్లో అయితే  ఇలా అందంగా ఆవిష్కరింపబడుతుంది .
మేఘాన్ని పట్టుకుని ఎవరైనా నేలకి నొక్కిపెట్టగలరా?
ఎవరైనా చంద్రకిరణాన్ని అరచేతిలో ఆపగలరా?
కెరటాన్ని ఇసుక మీద నిలిపి ఉంచగలరా?
మేరియా కూడా అంతే మరి . మరి మేరియా అనే ఈ సమస్యని  ఎలా పరిష్కరించాలి . అందుకే ఆమెని కొన్ని రోజులు మఠానికి దూరంగా ఉంచాలని నిర్ణయించుకుని ఒక కెప్టెన్ ఇంటికి పంపుతారు సన్యాసినులు  . కెప్టెన్ జార్జ్, భార్యని పోగొట్టుకుని తన ఏడుగురు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు . ఆ పిల్లల సంరక్షణ బాధ్యత స్వీకరించేందుకు ఆమె ఆ ఇంటికి వస్తుంది . ఆ అల్లరి పిల్లల్ని ఆకట్టుకుని మచ్చిక చేసుకుంటుంది .
బాధలోనో , భయంలోనో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందో పిల్లలకి ఇలా చెప్తుంది
గులాబీలపై నీటి చుక్కల్నీ, పిల్లిపిల్లల మెత్తదనాన్నీ తలుచుకుంటుందట
ఎప్పుడో కనురెప్పలపైన పడిన మంచు ముత్యాలని మననం చేసుకుంటుందట
వసంత కాలంలోకి కరిగిపోయే తెల్లని శీతలాన్ని స్ఫురణకి తెచ్చుకుంటుందట
తమ రెక్కల మీద చందమామని మోసుకెళ్లే పెద్ద పక్షుల గుంపుని జ్ఞాపకంగా పిలుస్తుందట
…………
అలా ఆమె బాధలో ఉన్నప్పుడు తనకిష్టమైన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుందట.
వాళ్ల భయాల్ని పోగొట్టడంతో సరిపెట్టుకోక, ఆనందంగా జీవించడమెలాగో నేర్పుతుంది . తప్పిపోయిన వారి బాల్యాన్ని తెచ్చి మళ్లీ  వాళ్లకే బహుమానంగా ఇస్తుంది. సంగీతంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తుంది . అప్పుడొచ్చే  డో-రే-మీ పాట గురించి తెలుసుకోవాలంటే వినడమొక్కటే మార్గం .
ఆ క్రమంలోనే ఎప్పుడో ఆ పిల్లల తండ్రి జార్జ్ తో  ప్రేమలో పడుతుంది . తప్పు చేస్తున్నానన్న భావంతో, తిరిగి మఠానికి వెళ్లి తన సమస్యని  ముఖ్య సన్యాసినితో చెప్పుకుంటుంది .అప్పుడామె, మగవాడ్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించనట్టు కాదే! అని నవ్వుతుంది . మేరియాకి ఇలా సలహా ఇస్తుంది .
ప్రతి పర్వతాన్నీ ఎక్కాలాట
ప్రతి ప్రవాహంలోకీ దిగి చూడాలట.
ప్రతి ఇంద్రధనుస్సునీ అనుసరించాలట.
ఇవ్వగలిగినంత ప్రేమని కోరుకునే స్వప్నాన్ని చేరుకునేవరకు
తెలిసిన ప్రతి దారిలోనూ నడవాలట .
ఆ పరిష్కారమార్గానికి తృప్తి చెందిన మేరియా, మళ్లీ జార్జ్ దగ్గరికి వచ్చి అతని ప్రేమని కూడా పొందుతుంది . అందుకు కారణం కూడా ఒక పాటలా ఇలా చెబుతుంది .
ఏమీ లేకపోవడంలోంచి ఏమీ రాదట.
తన చెడ్డ బాల్యంలోనో, దుర్భరమైన యవ్వనంలోనో ఏదో మంచి పని చేసి ఉంటుందట.
అందుకే ఆమె అతని ప్రేమని పొందగలిగిందట.
ఆ ప్రేమ ఫలించి వాళ్లు వివాహం చేసుకోవడం. సన్యాసిని కావాలని కలలు కన్న మేరియా, జార్జ్ భార్యగా , ఏడుగురు పిల్లల తల్లిగా మారి  పరిపూర్ణమైన జీవితాన్ని పొందడం చాలా సాధారణమైన కథే . కానీ ఈ చలన చిత్రాన్ని అసాధారణంగా మార్చినవి మాత్రం సంగీతం , సాహిత్యమే . ఆ సంగీత ప్రవాహంలో మునకలు వేస్తూ, మధ్య మధ్యలో నీటి బిందువుల్లా వేళ్లసందుల్లోంచి జారిపోయే సాహిత్యపు చల్లదనాన్ని అనుభవించడం ఎంత బాగుంటుందో అనుభవించినప్పుడే తెలుస్తుంది. అలాగే ఫేర్వెల్ పాట , సిక్స్ టీన్ గోయింగ్ ఆన్ సెవెంటీన్ పాట … చెప్పాలంటే ఆసలన్ని పాటలూ అద్భుతం అనేకంటే వాటి గురించి చెప్పడానికి మరో పదం లేదు. అందుకే ఈ శ్రావ్యమైన సంగీతధ్వని, తరంగాల తరగలుగా చాలా కాలం పాటు మన జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది . .

మీ మాటలు

  1. ఈ సినిమా నేను చాలా ఏళ్ళ క్రితం చూసాను. భలే నచ్చింది. ఇంటి కొచ్చినా ఆ సంగీతం వెంటాడుతున్నట్లనిపించింది. కానీ ఆ పాటల్లోని మాటలు అప్పుడు అర్ధం కాలేదు. ఇప్పుడు మీరు చెపుతుంటే అర్ధమైంది. ధన్యవాదాలు.

  2. నా విశ్లేషణ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది . ధన్యవాదాలు

  3. P Mohan says:

    భవానీగారు పరిచయం కవితాత్మకంగా చాలా బావుంది.
    పదేళ్ల కిందట చూశానీ సినిమాను. మళ్లీ చూడాలనిపించేలా రాశారు. థ్యాంక్స్.

  4. మోహన్ గారూ ధన్యవాదాలండీ , మీ అభినందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది .

  5. Sudha Srinath says:

    మీ ఈ లేఖనం ఎన్నో ఏళ్ళ క్రితం చూసి చాలా మెచ్చిన సినెమాని మళ్ళీ కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. భవానిగారూ! It was, indeed, happiness revisited. థ్యాంక్సండి.

    • ఈ చిన్ని రచన ద్వారా మీ జ్ఞాపకాల్లోకి తొంగి చూడగలగడం సంతృప్తి కలిగించింది . తెలియపరిచినందుకు ధన్యవాదాలు సుధ గారూ

Leave a Reply to Sudha Srinath Cancel reply

*