వస్తువులు చెప్పే మన ఆత్మకథలు!

కందుకూరి రమేష్ బాబు

 

Kandukuri Rameshహ్యూమన్ ఎలిమెంట్ అన్నది ఫొటోగ్రఫిలో మంచి చర్చనీయాంశం.

ముఖ్యంగా భవనాలు, సౌధాలు, ఆలయాలు – వీటిని మనిషి ఉనికి లేకుండా తీయడంతో అవి బోసిపోయి కనబడతాయి. ఒక్కోసారి – ఒక్క మనిషి అయినా చాలు, అవి ప్రాణం పోసుకుని దివ్యంగా శోభిల్లుతాయి.
అట్లా మానవీయ అంశంతో తమ ఛాయాచిత్రకళను మరొక అడుగు ముందుకు వేయించిన ఫొటోగ్రాఫర్లు మనకు కొద్దిమంది ఉన్నారు. కానీ, చిత్రమేమిటంటే కొన్ని చిత్రాలు. వాటిలో హ్యూమన్ ఎలిమెంట్ అన్నది లేదన్న విమర్శా వస్తుంది. కొన్ని చిత్రాల్లో మానవాంశం మచ్చుకు కూడా లేదని అంటూ వుంటే నవ్వే వస్తుంది. ఉదాహరణకు ఈ చిత్రం చూడండి.
ఇందులో హ్యూమన్ ఎలిమెంట్ ఎక్కడుంది.
లేదు కదా!

అందుకే ఈ దృశ్యాదృశ్యం.+++

నిజమే.
ఇది వట్టి ఇస్త్రీ పెట్టె.
అంతేనా?

అవును.

+++

ఒక్క ఇస్త్రీ పెట్టే కాదు, చాలా వుంటాయి ఇలా.
మనం వాడుకుని తర్వాత వాడని సమయంలో ఇలా వదిలేసినవి లెక్కకు మిక్కిలే వుంటై.

ఒక్కోసారి దానికి గాలి అవసరమా, లేదా అని కూడా మనం గమనించం.
వెలుతురు అవసరమా వొద్దా అన్నది కూడా ఆలోచించం.
కానీ. అలా కింద వుంచుతాం లేదా తోసేస్తాం.

మంచం కిందికి కొన్ని,అటక మీదికి కొన్ని.
చాలా సార్లు అందుబాటులో వుంచుకునేంత దూరంలో పక్కకు పెడతాం లేదా నెడతాం.
ఇదొక్కటే కాదు, చాలా.+++

కిచెన్ లో కావచ్చు, డ్రాయింగ్ రూంలో కావచ్చు…
డ్రెస్సింగ్ టేబుల్ పై కావచ్చు, టీపాయి పైన కావచ్చు..
కంప్యూటర్ టేబుల్ పైన కావచ్చు లేదా ఆల్మారాలో కావచ్చు…
ఎన్నిటినో మనం అలా పక్కన పెడతాం.

ఎప్పుడైనా చూడండి.
మనిషిని చూసినట్టు చూడండి.
చూస్తే ఎప్పుడైనా అవి బికారిగా. నిరాశగా మీకు కనిపిస్తాయా?

పోనీ, ఉదాహరణకు ఒక వాడని ఒక గడియారం. అది షెల్పులో ఉంటుంది. చూడండి దాన్ని.
లోన ముళ్లు తిరుగుతూనే ఉంటుంది. కానీ దుమ్ముపట్టుకుని వుంటుంది. దాన్ని చెవికి ఆనించుకుని వింటే  అది చాన్నాళ్లుగా మనిషి కేసి కొట్టుకుంటూ వుంటుందని తెలుస్తుంది. తెలిసిందా?పోనీ కళ్లద్దాలే చూడండి.
వాటిని ధరించినప్పుడు వాటి ఉనికే మనకు తెలియదు.
కానీ, తీసాక వాటికి తలా ముక్కూ చెవులూ ఏవీ వుండవు.
ముడుచుకుని తమలోకి తామే తొంగి చూసుకుంటూ ఉంటై.

చూశారా?
ఎప్పుడైనా ధరించని కళ్లద్దాలకేసి తదేకంగా చూశారా?

ఎన్నడైనా, ఆ కళ్లద్దాలను రెగ్యులర్ గా పెట్టే ప్లేసులో కాకుండా అప్పుడప్పుడూ వేరే చోట పెట్టి వదిలేసినప్పుడు అవి మనకోసం వెతుకులాడాయని గమనించారా?

చెప్పులు.
తొడగని చెప్పులు, బూట్లు.
వాటి సంగతైతే ఇక చెప్పరాదు.
అవి మళ్లీ వేసుకోవాలనుకుంటే తుడవాలి.
తుడవాలంటే మనకే భయం.
అంత భయం ఎవరివల్ల?
మనవల్లే కదా?

కానీ, ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు ‘మానవాంశం’ లేదని మాత్రం అనిపిస్తుంది.
కానీ, ఆ మాట అవి అనాలి, మన గురించి.

+++

నిజం. ఎవరింటికైనా వెళితే ఇవన్నీ కనబడుతూ ఉంటై. ఆయా వస్తువులు మాట్లాడుతూ ఉంటై కూడా. తాము ఏం పని చేశామో చెప్పడానికి నోరు తెరుస్తూ ఉంటై. కానీ, యజమాని భయానికి అవి మూగబోతూ ఉంటై,  చిన్న పిల్లల్లానే.

అవును మరి. వాటితో మనం ముచ్చటించాలంటే పర్మిషన్ వంటిదేదో కావాలి. కానీ వొద్దంటారు. ‘అవెందుకు దించుతున్నవ్’  అని అడ్డుపడుతుంటారు. దాంతో వేర్వేరు చోట్ల నుంచి అనేకానేకం కెమెరా కంటికేసి భేలగా చూస్తూ ఉంటై. నిర్తిప్తంగా, నిస్సహాయంగా వాపోతాయి. పనిలో లేని లేదా ఒక్కోసారి పనికిరానివి అనుకునేవన్నీ ఇలా కెమెరా కంటికి అయిస్కాంతానికి ఇనుప రజను అతుక్కున్నట్టు అతుక్కుంటై.

ఇదంతా ఎందుకూ అంటే, ఫొటోగ్రఫీలో మానవాంశం అన్నదాని గురించి కొత్తగా చూసుకోవాలని!
నిజం. దృశ్యాదృశ్యం అందుకే!

+++

చెప్పులు, కళ్లద్దాలే కాదు, జడ పిన్నులు కూడా.
అవి డ్రెసింగ్ టేబుల్ దాటి ఒక్కోసారి వేరే చోటకు చేరుతాయి.
మరి ఏం చేస్తూ ఉంటై?
వెతుకుతూ ఉంటై!
ఒళ్లంతా కళ్లు చేసుకుని వెతుకుతై.

బీరువా.
అవును. దాన్నీ ఒకసారి తెరిచి చూడండి.
పట్టు చీరలు కావచ్చు, ఇతర చీరలు కావచ్చు.
ఒక పద్దతిలో అవన్నీ ఒద్దికైన స్త్రీల్లా మర్యాదా మన్ననలతో అలా నీరసిస్తూ ఉంటై.
బయటకు ఎప్పుడు వెళతామో తెలియని నిట్టూర్పు పోగులవి.

ఆభరణాలూ అంతే.
వాటిని ధరించినప్పటి వైభవం అవి యధావిధిగా పదిలంగా వుంచినప్పుడు కోల్పోతాయి. తమ స్త్రీలకోసం, తమను అందంగా అలంకరించుకుంటే చూసి మురిసే మనుషుల కోసం అవీ పడిగాపులు పడుతూ ఉంటై.

మళ్లీ ఈ ఇస్త్రీ పెట్టె.
దాన్ని వాడింతర్వాత, దానికి ఏ గాయమూ తగలకుండా నిలబెట్టడంలో మటుకు మాత్రం మనకు శ్రద్ధ వుంటుంది. కానీ, మంచం కింద అలా పెట్టడంలో ఉద్దేశ్యం ఏమిటి?

నిర్లక్ష్యం.
అమానుషం.

+++

నిజం. మానవాంశం అన్నది మనం ఫలానా స్థలంలో మనిషిని వెతకడంలోనే కాదు, ఆ ఫలనా వస్తువు మానవుడి కేసి వెతుకులాడటంలోనూ కానవస్తుంది.

అంతేకాదు, మనిషికి ఆ వస్తువుతో ఒక అనుబంధం ఎట్లయితే వుంటుందనుకుంటామో, తనను వాడుకున్న ఆ వస్తువుకూ తనదైన మానవాసక్తి ఒకటి మనిషితో ఏర్పడుతుంది. అందుకే చలన చిత్రంలో కంటే నిశ్చలన చిత్రంలో ఆ అంశం మనకు కానవస్తుంది. అందుకే ఈ చిత్రం.

మనిషి వినియోగించే ప్రతి అంశం, మానవ నిర్మితమైన ప్రతి వస్తూవూ హ్యూమన్ ఎలిమెంటే!
కాకపోతే ఇవతల, మనిషే ఇన్ హ్యూమన్ అవుతూ ఉండటం విషాదం. ఇంకా వ్విషాదం ఏమిటంటే, ఫలానా చిత్రంలో హ్యూమన్ ఎలిమెంట్ లోపించిందీ అని విమర్శించడం.

తన అవసరం తీరాక వాటి అవసరాన్ని అశ్రద్ధ చేస్తుండటమే ఆ ఐరనీ.
మనిషిని మనిషి కావచ్చు. మనిషి తన- పర వస్తువునూ కావచ్చు.
అదే ఈ దృశ్యాదృశ్యం.
*

మీ మాటలు

  1. అద్భుతంగా ఉంది. దాచుకుని మళ్లీ మళ్లీ చదవాల్సినది ఇది.

మీ మాటలు

*