నాదాన్ పరిందే… ఘర్ ఆజా !

నిశీధి 

 

వాడు

వక్రాసనమో

వామనావతారమో

వంచనల రాజకీయ కులటై

వాచస్పతులని వాగ్బంధనంలో బిగదీస్తూనే ఉంటాడు

 

అప్పుడే

అమ్మల వడిలో

ఆడుకోవాల్సిన కొన్ని పసిగుడ్లు

అండా సెల్లోనో ఆకురాలని ఆడవుల్లోనో

అకారణంగా అదృశ్యమై అనంతమైపోతూ ఉంటాయి

 

అక్కడ

రిథింలెస్

రేవ్పార్టీల్లో నలిగిన

యూనివర్సిటీ కారిడార్లిప్పుడు

కుడిఎడమలు మరచి  మొత్తంగా మునగదీసుకున్న

గుండు సున్నాల్లా సర్కిల్స్లో  సపసాలు మరచి

కాక్టెయిల్ వ్యర్ధగీతాలు ఆవేశంలేని ఆక్రోశంతో  ఆలపిస్తూ ఉంటాయి

 

ఇక్కడ

గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లంలో

వేసినా కరగని కాఠిన్యాలు

కనిపించని మానసికరోగపు

మనోభావాలై పూచికపుల్లల్లా విరుగుతూ

సీరియల్ కన్నీళ్ళలోనో సిగారు ధూపంలోనో

ఎండిపోయిన బానిసల కళ్ళు చెమర్చడం మానేసి వట్టిపోతాయి

 

అప్పటికీ ,

కొన్ని హృదయాల్లో

ఖేదరాగాల భారంతో దాచిన నిప్పురవ్వ

బండబారిన అమానవత్వపు మంచుల్లో ఇరుక్కొని

అచేతనావస్థకి అనియంత్రిత జాగృతావస్థకి మధ్య వ్యధవాక్యంగా మిగిలిపోతుంది

 

కానేందుకో

నరజాతి చరిత్ర సమస్తం

పరపీడన పరాయణత్వమని

తేల్చి చెప్పిన కవి ఆత్మ మరో ఎర్రబడ్డ ఉదయానికి

కలవరపడుతూ సమాధిలోతుల్లో అస్థిమితంగా కదులుతూనే ఉంటుంది

 

నాదాన్ పరిందేలని

అన్యాయంగా మింగేసిన మరో రోజు

ఘనవారసత్వాల ఘర్ వాపసీలే తప్ప

ప్రియమయిన ఘర్ ఆజా పిలుపివ్వలేని

ఆశక్తతకి ఆచారంగానో విచారంగానో సిగ్గుపడుతూ

పరదా వేసుకున్న అబద్ధంలా తడబాటుగానో పొరపాటుగానో కొనసాగుతూనే ఉంటుంది

*

 

మీ మాటలు

  1. Shrutha keerthi says:

    ఖేదరాగాల భారంతో దాచిన నిప్పురవ్వ
    బండబారిన అమానవత్వపు మంచుల్లో ఇరుక్కొని
    అచేతనావస్థకి అనియంత్రిత జాగృతావస్థకి మధ్య వ్యధవాక్యంగా మిగిలిపోతుంది…
    సూపర్బ్ వర్డ్స్ నిశీధి గారు !!

  2. devi varma says:

    ఘనవారసత్వాల ఘర్ వాపసీలే తప్ప

    ప్రియమయిన ఘర్ ఆజా పిలుపివ్వలేని

    ఆశక్తతకి ఆచారంగానో విచారంగానో సిగ్గుపడుతూ

    పరదా వేసుకున్న అబద్ధంలా తడబాటుగానో పొరపాటుగానో కొనసాగుతూనే ఉంటుంది.

    అద్భుతంగా రాసారు నిశీ గారూ…

    కొన్ని పదాలకు అర్దాలు వెతుక్కుని అయినా చదవాలనిపించేలా వుంది.

    అద్భుతః

  3. జాస్తి.హరి శ్రీనివాస చౌదరి says:

    మీ భావావేశం , మీ కవిత రెండు నచ్చాయి నిశీది జీ , అందుకోండి మా ఈ లైక్ like

  4. లాస్య ప్రియ says:

    కనిపించని మానసికరోగపు

    మనోభావాలై పూచికపుల్లల్లా విరుగుతూ

    సీరియల్ కన్నీళ్ళలోనో సిగారు ధూపంలోనో

    ఎండిపోయిన బానిసల కళ్ళు చెమర్చడం మానేసి వట్టిపోతాయి….అద్భుతం …చక్కని పదచిత్రాలు …అంతే చక్కని భావావేశం …సూపర్బ్ మేడమ్

  5. నీహారిక says:

    “ఘర్ ఆజా”…..ఎంత అందమైన పదం ? ఇటువంటి పదాలు వాడడం మీకు మాత్రమే తెలుసు, నాకు తట్టనే లేదు !

  6. rambabu thota says:

    ఇక్కడ గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లంలో వేసినా కరగని కాఠిన్యాలు……. నిజమయిన కష్టాలకు, చావులకు కరగని మనసులు మృత సాంప్రదాయాల విషయంలో విరగడం, కల్పిత కష్టాల సీరియల్స్ కి కరగడం సమాజం మొత్తానికీ పట్టిన పిచ్చి

  7. Venu udugala says:

    గుడ్ వన్ నిషి గారు

  8. సమాజం నిద్రావస్తలోకి నెట్టబడుతున్న తీరును చర్నాకోలాతో కొట్టి చూపారు. ఎప్పట్లాగే మీరు మీరే..

  9. అష్టావక్రుడు దేశాన్నే కాదు ప్రపంచాన్నీ వక్రాసనం వేయించాడు. ఇది డెమోక్రాట్ల టోటల్ ఫెయిల్యూర్. ఫాసిస్టు, కార్పొరేట్, మతపిచ్చిగాళ్ల విజయం. ఈ దుర్మార్గాన్ని చూడలేక సమాధుల్లో అస్థమితంగా కదులుతున్న కవుల సుప్తాస్థికల సవ్వడిని వినిపించినందుకు థ్యాంక్స్ నిశీధి గారు.

  10. narayana sharma says:

    ఈ కవితకు సంబంధించినంత వరకు మీగొంతుకలో వైవిధ్యం ఉంది.. ఇందులో సృజనాత్మకమైన సమాసబంధాలను ఎక్కువగా ఉపయోగించారు..”కాక్టెయిల్ వ్యర్ధగీతాలు/ఖేదరాగాల భారం/బండబారిన అమానవత్వపు మంచు/అనియంత్రిత జాగృతావస్థ/వ్యధవాక్యం/ఎర్రబడ్డ ఉదయం/….ప్రతీ ఖండికాభాగం(Unit)ఒక్కోవాక్యం గా ఉండటం వలన వాక్యానికి యేదో గాంభీర్య శక్తి వచ్చింది..

    మంచి కవిత ధన్యవాదాలు.

  11. Dr. Vijaya Babu,Koganti says:

    “ఘనవారసత్వాల ఘర్ వాపసీలే తప్ప

    ప్రియమయిన ఘర్ ఆజా పిలుపివ్వలేని

    ఆశక్తతకి ఆచారంగానో విచారంగానో సిగ్గుపడుతూ

    పరదా వేసుకున్న అబద్ధంలా తడబాటుగానో పొరపాటుగానో కొనసాగుతూనే ఉంటుంది”

    చాల బాగుంది నిశీధిగారు.
    అభినందనలు.

Leave a Reply to నీహారిక Cancel reply

*