అరణ్య  రహస్యం

 రామా చంద్రమౌళి

Ramachandramouli

అంతస్సంబంధమేమిటో  తెలియదు  కాని

రాత్రి కురిసిన  ముసురులో  తడుస్తూ  సూర్యుడుదయిస్తూంటాడుగదా

అరణ్యం  నిద్రిస్తున్న  నాలోకి  మెల్లగా  ప్రవేశిస్తూ  ఒక  మెలకువగా  మారుతుంది

పాదాలను  అడవిలోని  దారి  పిలుస్తూంటుంది

ఇటు  లోయ .. అటు  శిఖరం .. ఎవరు  పెట్టారో పేరు .. గార్నెట్ వ్యాలీ

ఇల్లేమో.. వుడ్స్  ఎడ్జ్ .. అడవి  అంచుపై  ఒక  వీధి

మనుషులెవరూ  కనబడరు .. ఎప్పుడో  ఒకరిద్దరు  వృద్ధ  దంపతులు

అమెరికన్స్ .. చేతిలో  కాఫీ  కప్పులు .. మరో  చేతిలో  కుక్క గొలుసు

ముఖంపై  పొంగిపొర్లే  చిరునవ్వు ..’ హై ‘ అని  ఆత్మీయ పలకరింత

ఎవరో  అపరిచితులే .. కాని  మనందరం   ప్రాథమికంగా  మనుషులంకదా  అన్న  ప్రాణస్పర్స

తప్పకుండా  ఎప్పటికైనా  విడిపోవలసిన  మనుషులమైన   మనం

కలుసుకున్న ఈ  మధుర  క్షణాన్ని ‘సెలబ్రేట్ ‘ చేసుకుందాం  అన్నట్టు  నవ్వుమెరుపు

ఎదురుగా యాభై  అడుగుల  ఎత్తుతో  ఆకుపచ్చని  స్వర్గాన్ని  మోస్తూ .. చిక్కగా  చెట్లు

ఒంటరిగా  నడుస్తూంటాను. . వెంట పక్షుల సంగీతాన్నీ .. సెలయేరు  శృతినీ .. ఒక  అభౌతిక  నిశ్శబ్దాన్నీ   వెంటేసుకుని

నా లోపలినుండి.. నాకే  తెలియని  ఎవరో  పురామానవుడు  ఆవులిస్తూ .. మేల్కొంటూ.. పరవశిస్తూ

నేనుకాని  నేను  నడుస్తూ

హద్దులనూ.. ఎల్లలనూ.. చెరిపేస్తూ.. ఒకే  ఆకాశంకింది  జీవసంపదనంతా  ఆలింగనం  చేసుకుంటున్నట్టు

ఒక  నీటిబాతు  ధ్వని .. పిచ్చుక  కిచ కిచ .. పక్షుల  రెక్కల చప్పుడు –

ఎక్కడి  పెన్సెల్వేనియా.. ఎక్కడి  వరంగల్లు .. ఐనా  భూమి  ఒక్కటే కదా  అన్న  ఆదిస్పృహ

మొదటిరోజు.. మెల్లగా  నడుస్తూ  బాటలొకొచ్చి  చిన్ని తాబేలు .. గోధుమరంగు డిప్పతో..తలపైకెత్తి

పలకరిస్తోందా.. అది .. ఏ భాష

అటుప్రక్క  కళ్ళు  మిటకరిస్తూ .. చెవులు  రిక్కించి  జింక .. నిలబడి .. ఆ  చూపులదే భాష

వెళ్ళిపోతూంటాను  వృక్షాలను  దాటుకుంటూ.,

జ్ఞాపకమొస్తూంటుంది .. పెన్సెల్వేనియా.. ద  స్టేట్  ఆఫ్  వాల్లీస్  అండ్  హిల్స్ .. అని

అన్నీ కొండలూ..శిఖరాలే మనిషిలోలా..కనబడనివీ..కనబడేవీ..చూడాలంతే కనబడేదాకా

ఒంటరిగా ఒక కర్ర బెంచీ..సన్నని సెలయేరు ప్రక్కన..ఎవరు పెట్టారో మహాత్ముడు

పిలుస్తోంది..రా కూర్చోమని..అతిథినికదా

చుట్టూ  మనుషులు  ప్రకృతిని  పదిలంగా  సంపదలా  దాచుకున్నట్టు .. పచ్చని  గడ్డితివాచీ

నగ్న పాదాలకు నేలను తాకాలనీ.. గడ్డిని  ముద్దాడాలని  ఎంత  తహతహో

పురా దాహం .. యుగయుగాల  అలసట .. ప్రకృతిలోకి  పునర్విముక్తకాంక్ష

నగ్నంగా  వచ్చినవాడా .. మళ్ళీ  నగ్నమైపోవడమే  అని ..హెచ్చరిక

మధ్య  ఈ  బూట్లొకటి .. అడ్డు ..  తొలగించాలి

కోడిపిల్లకూ.. గాలికీ మధ్య ..పెంకు.. ఛేదనం.. అనివార్యమేకదా

అరగంట .. ముప్పావు .. ఉహూ.. విడిచి వెళ్ళలేను

నెల్సన్  డి  క్లేటన్ స్మారక వనం .. అని బోర్డ్

అక్షరాలను  తడుముతాను  ప్రేమగా.. ఎందుకో  కళ్ళలో  నీళ్ళు  చిప్పిళ్ళుతాయి.

నాకు  తెలియకుండానే  ఆ  అరవై  అడుగుల  మాపెల్  చెట్టు   కాండాన్ని  చేతితో  స్పర్శిస్తాను

ఎవరో  యుగాలుగా  తస్సిస్తున్న  మునిని  తాకినట్టు  విద్యుత్  జలదరింత

2

మర్నాడు  మళ్ళీ వెళ్తాను

ఎప్పుడు  తెల్లవారుతుందా  అని  ఎదురు  చూచీ చూచీ

మంచు కురుస్తున్న  రాత్రంతా  అడవి  పిలుపే

ఆకులు  పిలుస్తాయి .. కొమ్మలు  పిలుస్తాయి . . నేల  పిలుస్తూంటుంది .. ఆకాశం  పిలుస్తూంటుంది

నా  తాబేలు .. నా జింక  .. నా  పిచ్చుక .. నా  నీటిబాతు .. నా కుందేలు

నా సెలయేరు .. నా  నిశ్శబ్ద  సంగీతం .. నా  మాపెల్ చెట్టు

ఒడ్డున  నా   ఖాళీ  కర్ర   బెంచీ

నా  అడుగులకోసం  ఎదురుచూచే  నా  కాలిబాట

నా  లోయ . . నా  శిఖరం..నాలో  నేనే  ప్రతిధ్వనిస్తున్నట్టు  నాతోనే  నేను

పేరుకు  ఉదయపు  నడకే .. మార్నింగ్  వాక్

వ్యసనమైపోతోంది  అడవి .. అల్లుకుపొతోంది  అరణ్యం

మనిషినీ ..  మనసునూ.. హృదయాన్నీ ..  అత్మనూ

ప్రతిరోజూ

పిలిచినట్టే  బాటపైకి  తాబేలు  నడిచొస్తుంది ..  జింక  దిబ్బపై  నిలబడి   పలకరిస్తుంది

గడ్డిపై  అల్లరల్లరి  చేస్తూ  పిచ్చుకలు  కచేరీ  చేస్తాయి

సెలయేరు  వేగాన్ని  పెంచుకుని  ఉరికొస్తుంది  నా  కుర్చీ దగ్గరికి

పైనుండి  అకాశమేమో.. నవ్వుతూంటుంది .. పిచ్చి అడవీ .. పిచ్చి మనిషీ .. అని

ఔను .. జీవితాన్ని  జీవవంతంగా  జీవించడం  ఒక  పిచ్చేగదా

3

వెళ్ళిపోవాలిక

వచ్చినవాడెప్పటికైనా  వెళ్ళిపోవాలికదా

వీడ్కోలు .. నా  స్నేహితుల్లారా.. నా  వృక్షాల్లారా.. నా  నేలా.. నా   పెన్సెల్వేనియా   గాలీ

ఇన్ని  రాత్రులు   నన్ను  అల్లుకుని

ప్రతి  ఉదయం  మేల్కొలిపి  తల్లి  పిలిచినట్టు   నన్ను   స్వాగతించిన   అరణ్యమా  నీకు  వీడ్కోలు

చివరి  రోజు .. చివరి  నడక .. చివరి స్పర్శ

చూపులు  తాబేలును  వెదుకుతాయి . .  జింక  కోసం  తహ తహ

సెలయేటి  పాటేది  .. నీటిబాతు  చప్పుడేది

నన్ను  ఒడిలో  కూర్చోపెట్టుకున్న  నా   ఖాళీ   కర్ర కుర్చీ  ఏది

వెదుకులాట .. తడుములాట .. తండ్లాట

అడవిలోకి  వెళ్ళిన   నాలోకి  అడవే  ప్రవేశించి .. ఆక్రమించిన  తర్వాత

అడవిని  పిడికెడు  గుండెల్లో   ధరించివస్తున్న . . దాచుకుని  వస్తున్న  నాలో

ఎంత  దుఃఖమో.. ఎంత  శూన్యమో.. సముద్రమంత .. ఆకాశమంత –

 

   ( అమెరికా..  పెన్సెల్వేనియాలోని   గార్నెట్ లోయ .. వుడ్స్   ఎడ్జ్ లోని  నా  కూతురు ‘ పవన ‘ ఇంట్లో పదిహేను రోజులుండి .. ప్రక్కనున్న   అడవితో  పెంచుకున్న   అద్భుతానుబంధాన్ని  దుఃఖోద్వేగంతో  స్మరించుకుంటూ )

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Poem is really good.
    It is a good memory, the time we all spend together at my home.
    Especially the walking bench picture, which is attached to the poem.
    Good Poem. We all like it very much.

  2. Sai from Pennsylvania says:

    This piece superbly captures the peaceful yet lively spirit of the forest in Garnet Valley, PA. I am reminded of this poem’s powerful words and meaning every time I walk on the trail.

  3. N Venugopal says:

    చంద్రమౌళి గారూ,

    చాల చాల బాగుంది. నిసర్గ సౌందర్యాన్ని అపురూపమైన, ఆర్ద్రమైన అభివ్యక్తితో అలంకరించారు… కృతజ్ఞతలు.. ఏడేళ్ల కింద అమెరికా పడమటి కొస నుంచి తూర్పు కొసదాకా ప్రకృతి సౌందర్యం చూస్తూ పులకిస్తూ ఎక్కడికక్కడ రాసి పెట్టుకుని, (నేను కవిని కాననే నమ్మకంతో) పూర్తి చేయని డజన్లకొద్దీ కవిత్వపు ముక్కల్ని పూర్తి చేయమని మీ కవిత ఒత్తిడి చేస్తున్నది…

    • raamaa chandramouli says:

      వేణూ..కవి తనను తానూ కోల్పోయి వస్తువులో లీనమైనప్పటి తాదాత్మ్య సంలీనత మీకు తెలియంది కాదు.అప్పుడు కవి రాయడు..వస్తువే అతిక్రమిస్తూ రాయిస్తుంది ఒక నిగ్రహాతీత ఆవేశాన్ని ఉద్దీపింపజేస్తూ.ధన్యవాదాలు.

      – మౌళి

  4. N.RAJANI says:

    చంద్ర మౌళి గారు మీరు గడిపిన ఆ అరణ్య ప్రాంతాన్ని మేము చుసిన అనుభూతిని కలిగించారు. ధన్యవాదాలు.

  5. Ch.pavani says:

    Chandramouligaroo…mito batu memu aranyamlo nadicham.mi spandanalanne mammalni cherayi..enta gadipina tanivi teerani soundaryam Prakruthi okate.haddulalu cheripesi oke akasamkindi jeevasampadananta pogesi andincharu.vadiliraleni mi badha maa manasulni kammeskundi. Ainaa badha baundi…..

  6. విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం…

    ప్రకృతి వొడిలో పరవశించిన మనసులో ఎగసిన విశ్వాత్మభావతరంగాలు మానసవీణానాదాలై అవి అక్షరాలుగా ఘనీభవిస్తే… అదే అరణ్య రహస్యం _/\_ థాంక్ యూ, సర్!

  7. amara jyothi says:

    జీవితాన్ని జీవవంతంగా జీవించడం , జీవిమ్పచేయడం తెలిసిన కవి రాసిన kavita Aranya rahasyam నవ చైతన్యాన్ని నింపింది అడవిని చూస్తూ పరవసత్వంతో లీనమై మమేకమై ప్రకృతి సౌందర్యాన్ని ఒడిసి పట్టుకుని కవితా రూపంలో అరణ్య రహస్యాన్ని చూపి కవితా హృదయుల్ని పరవశులను చేసిన ప్రముఖ కవి రామా చంద్ర మౌ
    ళి గారికి అభివందనాలు.

  8. కనిపించని ప్రాణం జీవమై కదిలినట్లు అరణ్యంతో మమేకమైన కవి అంతరంగం రహస్యాన్ని బహిర్గతం చేయటం ఆనందంగా వుంది . ధన్యవాదములు .

  9. raamaa chandramouli says:

    ‘అరణ్య రహస్యం’ కవితపై అభిమానంతో వ్యాఖానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    -మౌళి

  10. buchireddy gangula says:

    excellent..గా ఉంది సర్

    —————————బుచ్చి రెడ్డి గంగుల

    • raamaa chandramouli says:

      అన్నా..బుచ్చిరెడ్దిగారూ..మీకు నా కవిత నచ్చడం ఎంత ఆనందకరమో..ధన్యవాదాలు
      – మౌళి

  11. reading this is a revelation at several levels…it cuts through the invisible layers that wrap us up in a world of visible I-ness and it gets developed, how we cling to it only to realize everything has to pass away… An engrossing exploration of within with the prop the forest provided…the externals are proven props till such time the world within gains more meaning and strength… it even prompted me into a spontaneous translation into English…thnq, shri raamaa chandramouli and thnq saaranga…

  12. raamaa chandramouli says:

    ఇందిర గారూ,

    మీ సున్నితమైన స్పందనకు ధన్యవాదాలు.ఇంగ్లీష్ లోకి అనువదించినందుకు కృతజ్ఞతలు.

    – మౌళి

Leave a Reply to raamaa chandramouli Cancel reply

*