అలవోకగా అక్షర ప్రాణవాయువు!

జయశ్రీ నాయుడు
jayasriఅక్షరాల్లోంచి గుప్పుమనే మట్టి పరిమళం ఎప్పుడైనా నేత్రాలనుంచి నాసికకు చేరిందా
పరిమళం నుంచి ఉద్వేగంలా గుండెకి పాకి, మట్టిని పిడికిట పట్టిన ప్రాణాల పంతపు పంచప్రాణాల్ని చూపించిందా… 
ఈ అక్షరాల అనుభూతికి ఎన్ని మాటల తూకపు రాళ్ళు నింపినా ఇంకా అనుభూతించ వలసింది ఏదోమిగిలే వుందని, మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. నాకు ఎదురైన ప్రతి గాలిపలకరింతలోనూ, పాదాన్ని ఈ తట్టే మట్టి స్పర్శామాత్రపు సంభాషణలోనూ చరిత్రని చదవడానికి ప్రయత్నించాను. ఏ క్షణాన ఈ కవిత నా కళ్ళ గుమ్మం ముందు నిలిచిందో గానీ, నాకు నేనే ఒక నిరంతర అక్షరార్థ యాత్రని అనుభవించాను.
అలవోకగా నన్ను తన ప్రతి రేణువులోనూ కలిపేసుకుంటూ, జాగమీది పానాన్ని బర్వు బర్వుగా చాటి చెప్పే అక్షరమవ్వడం ఒక కొత్త అనుభూతి. ఇప్పటికి నాకు నేనుగా ఎన్ని సార్లు చదువుకున్నా ఏదో తెలియని రిథం వుంది  ఈకవితలో. ప్రతి పదం లోనూ, భావం లోనూ నందిని సిధారెడ్డి కవిగా అలవోకగా అక్షర ప్రాణవాయువుని పరిచిన కవిత  –  పుట్టువడి
ఒక జాతి తీరుతెన్నుల్ని ఒక కవికన్నా మిన్నగా ఎవరూ చెప్పలేరు. తత్సమ తద్భవాల్లేని పదాల్లో మొదటి పంక్తి నుంచే కవిత చెంగు చెంగునా సాగుతుంది.
జాగతీరే అట్ల 
 
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు 
కువారం లేదు
ఇక కుటిలమూ, కువారమూ లేని చోట సహజత్వానికి కొరతేముంటుందీ?
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం…
నిలువెల్లా ఉరకలేసే ఉద్యమ స్ఫూర్తికి అద్దాలీ అక్షరాలు. దాదాపు 2007 లో ముద్రణలో విడుదలైన అక్షర పగడాలివి.
ఉద్రాక్ష పూలు పూసినంత  సహజంగా
మాటలు పూస్తుంటయి 
అవును ఉద్రాక్షపూలు అనడం లో ఎంతటి పల్లెతనపు అందముందో అక్షర పగడాలనుకోవడంలోనూ అంతే సహజత్వముందీ. కళ్ళు అక్షరాల వెంట పరుగెత్తినంత సహజంగా భావం మనలో ప్రవహించడం మొదలవుతుంది. మరో అనువాదం అక్ఖరలేని కవితా పాయలివి. పాదాలు తడుపుకున్నంత సహజంగా తడి మనసుని ఆక్రమించడం మొదలవుతుంది.  ఆత్మకు మరో అర్థం చెపుతాడు కవి ఇలా…
nadi
బట్టలు ఇడిసినట్లు 
శరీరాన్ని ఇడిసిపెత్తేది ఆత్మ కాదు
ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
మరింత చొచ్చుకెళ్ళే పల్లెతనం చూడండీ
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
ముందువెనుకలు ఆలోచించని ఉడుకుదనపు రక్తం. ఎండల్నీ వానల్నీ కరువు కాటకాల్నీ భరించిన సహనం. ఆ మట్టినుంచి పుట్టుకొచ్చిన జాతి కి చావుని సైతం లెక్ఖచెయ్యని మొండితనమే ఆస్తి. 
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా 
నమ్ముకం ఆరిపోదు
 బండెంక బండి కట్టి పోరాటమైన సామాన్యుడు కనిపిస్తాడు. తెలంగాణా ఉద్యమ దినాల్లో వచ్చిన ప్రతి వార్తా ఉద్వేగం అప్పటి ఆకాంక్షా తీవ్రతలకు పునాదుల్నీ ఈ అక్షరాలు చూపిస్తున్నాయి.  తను పుట్టిన మట్టి మీద ఎంత మమకారమంటే, ప్రాణం విడవడానికైనా సిద్ధమే. ప్రాణం విడిచాక కూడా ఆ మట్టిని విడవని ఆత్మలివి. పూర్వీకుల ఆత్మలన్నీ మమేకమైన నేల లో పెరిగిన జాతి తేటదనాన్ని, రోషాన్ని, స్నేహాన్ని, వెనుతిరిగి ఆలోచించని సూటి దనాన్ని పచ్చికలా పరిచిన మాటల వరిచేలిది.
కవితా సంకలం పేరు: నది పుట్టువడి 
కవి పేరు: నందిని సిధారెడ్డి
కవిత శీర్షికపుట్టువడి
 nandini
జాగ తీరే అట్ల
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు
కువారం లేదు
కుండబద్దలుకొట్టినట్టు
కడిగేసుడే ఎరుక
బాధయినా బరువయినా
ఎత్తుకున్నంక మోసుడే
జివునం పోయినా సరే
జిద్దుకు నిలవడ్తం
ఇటుపొద్దు అటు పొడిసినా
ఇజ్జత్ ఇడిసేది లేదు
బట్టలు ఇడిసినట్టు
శరీరాన్ని ఇడిసిపెట్టేది ఆత్మ కాదు
 ఎల్లెడల మనిషిని ఎడబాయనిదే ఆత్మ
ఉద్రాక్షపూలు పూసినంత సహజంగ
మాటలు పూస్తుంటయి
వరిచేండ్ల మీది గాడ్పువలె
స్వచ్చంగా
వాసన వాసనగా వచ్చిపోతుంటం
దాలిలో పాలు కాగబెట్టినవాండ్లం
అనుభవాలు కాగబెట్టి పోస్తం
పండ్లమ్మెతందుకయినా తండ్లాడుతం
చేదబాయి గిరక లెక్క
ఇరాం లేకుంట గిరగిర తిరుగుతనే ఉంటం
 గవ్వ ఆందాని లేకపోయినా
గాలికతలు ఎరుగం
ఎవలు కారని తెలిసినా
మేం కాకుంట ఉండలేం
ఎత ఎవలదయినా
ఏడ్వకుంట ఉండలేం
కోపం ఆపుకోలేక
నాలికయినా కొరుక్కుంటం
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిసినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే
దిగుట్లె దీపం ఆరిపోయినా
నమ్ముకం ఆరిపోదు
జాగ మీద పానం
పానమిడిసినా జాగిడువం
ఈ జాగ తీరే అట్ల
ఈడ పుట్టి పెరిగిన మనిషి తీరే గట్ల
ఈ జాగల
బర్వు బర్వుగ తిరిగే
పూర్వీకుల ఆత్మలుంటయి
*

మీ మాటలు

 1. erathi sathyanarayana says:

  కవిత తెలంగాణా మాట్లాడినట్టుంది.తెలంగాణా నేల రంగు,వాసన , గాలి ఊరు ఏ మాత్రం ఎరిగిన ఎవరికైనా తమకే తెలియని తమ ఎద లోతుల్లోంచి ఎదో చెమ్మ ఎగ చిమ్మి కళ్ళల్లో పారాడుతుంటుంది . గుండె అంటె ఈ కవితలా ఉంటుందేమో!!

  • Jayashree Naidu says:

   థాంక్యూ సత్యనారాయణ గారు …
   మీరన్న మాట నిజమే
   కొన్ని కవితలు తాము పుట్టిన నేలని గాలినీ వెంట తెచ్చుకుంటాయి తమ పదాల్లో
   అదే ఈ కవిత ని ప్రయేకమ్గా నిలబెట్టింది

 2. rajani patibandla says:

  జయశ్రీ గారు సిధా రెడ్డి కవిత్వం మరోసారి రుచి చూపినందుకు కృతగ్జ్నతలు వెంటనే పుస్తకం కొనుక్కుంటాను

  • Jayashree Naidu says:

   థాంక్యూ రజని పాటిబండ్ల గారు
   ఒక కవికి తన రచనలు స్మరిమ్పబడటమ్ కన్నా గొప్ప సన్మానం వుంటుంది అనుకోను
   తప్పకుండా చదవండి

 3. devika rani says:

  సిధారెడ్డి గారి అద్భుత కవితను అత్యద్భుతంగా పరిచయం చేశారు..ధన్యవాదాలు..

 4. Jayashree Naidu says:

  థాంక్యూ దేవిక

మీ మాటలు

*