‘నీ జీవితమే ఒరవడి!’

వి.వి.

vv.kara                విశాఖపట్నంలో  శ్రీశ్రీ  శతజయంతి సభల్లో  2010 ఏప్రిల్‌ 30,  మేడే రెండురోజులూ నిండా పదిహేనేళ్లు నిండని పసివాడు వేదికమీద, నలుగురిలో గొంతెత్తి పాడిన శ్రీశ్రీ గీతాలు వింటారా? అవి విరసం నిర్వహించిన సభలు. ఆ సభలకు ఆ వసివాడని పసిబాలుడు ఉపాధ్యాయుడైన తండ్రితో వచ్చాడు. తండ్రి డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌లో నలగొండజిల్లాలో సభ్యుడు.

 

మరో ప్రపంచం

మరో ప్రపంచం

మరో ప్రపంచం పిలిచింది

 

పదండి ముందుకు

పడండి త్రోసుకు

పోదాం, పోదాం పైపైకి

 

కదం తొక్కుతూ

పదం పాడుతూ

హృదంతరాళలం గర్జిస్తూ`

పదండి పోదాం

వినబడలేదా

మరోప్రపంచపు జలపాతం?

 

దారిపొడుగునా గుండెనెత్తురులు

తర్పణచేస్తూ పదండి ముందుకు!

 

బాటలునడచీ

పేటలుగడచీ

కోటలన్నిటిని దాటండి!

నదీనదాలూ

అడవులు, కొండలు

ఎడారులా మనకడ్డంకి?

..             ..             ..

ఎముకలు క్రుళ్లిన

వయస్సుమళ్లిన

సోమరులారా! చావండి!

నెత్తురుమండే

శక్తులు నిండే

సైనికులారా! రారండి!

 

ఈ గీతం ఇంకెవరో కాదు అప్పటికింకా పదిహేనేళ్లు నిండని వివేక్‌ పాడాడంటే ఇవ్వాళ ఎంత సాధికారికంగా పిలుపు ఇచ్చినట్లు, ప్రకటించినట్లు అనిపిస్తున్నది.

పరస్పరం సంఘర్షించిన

శక్తులలో చరిత్ర పుట్టెను`

అని ‘దేశచరిత్రలు’ కవిత చదివి వినిపించి ఆ పిల్లవాడు అందులోని లోపాలు కూడ చెప్పాడని అంటే అది ఇవ్వాళ మనకాశ్చర్యమనిపించదు.

ఏ దేశచరిత్ర చూచినా

ఏమున్నది గర్వకారణం?

అంటాడేమిటి శ్రీశ్రీ? ప్రజలు నిర్మించిన, నిర్మిస్తున్న చరిత్రపట్ల గౌరవం ఉండాలికదా అన్నాడంటే చండ్రరాజేశ్వరరావు పెట్టిన విమర్శ విని ఉన్నట్లా? చెంఘిజ్‌ఖాన్‌ గురించి నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’లో రాసింది మొదలు, తెన్నేటిసూరి ‘చెంఘిజ్‌ఖాన్‌’ నవల వరకు రాసిన విషయాలు తెలుసుకొని, చదివి ఉన్నాడు ఈ పిల్లవాడు. ఇంతకన్నా శ్రీశ్రీకి ఎక్కువే తెలిసిఉండాలికదా అని ఆశ్చర్యపోయాడు. అవునులే శ్రీశ్రీ, గాంధీని ఇందిరాగాంధీ (ఎమర్జెన్సీ)ని పొగిడినవాడే కదా అని కాస్త కటువుగానే అంటే పిట్టకొంచెం, కూతఘనం అనిపించింది.

ఒక వ్యక్తిని మరొక్కవ్యక్తీ,

ఒక జాతిని వేరొకజాతీ,

ఓడిరచే సాంఘిక ధర్మం

ఇంకానా? ఇకపై సాగదు.

 

చీనాలో రిక్షావాలా,

చెక్‌దేశపు గనిపనిమనిషి

ఐర్లాండున ఓడకళాసీ

అణగారిన ఆర్తులందరూ `

హాటెన్‌టాట్‌, జూలూ, నీగ్రో

ఖండాంతర నానాజాతులు

చారిత్రక యథార్థతత్వం

చాటిస్తారొక గొంతుకతో `

 

ఈ ఆఖరి నాలుగు చరణాలు మరింత పునరుక్తితో చదివాడు

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?

ఏ రాజ్యం ఎన్నాళ్లుందో

తారీఖులు,  దస్తావేజులు

ఇవి కావోయ్‌ చరిత్రకర్థం `

ఈ రాణీ ప్రేమపురాణం,

ఆ ముట్టడికైన ఖర్చులూ,

మతలబులూ, ఖైఫీయతులూ

ఇవి కావోయ్‌ చరిత్రసారం

ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడికాన్పించని

కథలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగనిసత్యం

 

నైలునదీ నాగరికతలో

సామాన్యుని జీవనమెట్టిది?

తాజ్‌మహల్‌ నిర్మాణానికి

రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

 

సామ్రాజ్యపు దండయాత్రలో

సామాన్యుల సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌,

అది మోసిన బోయీలెవ్వరు?

 

తక్షశిలా, పాటలిపుత్రం

మధ్యధరా సముద్రతీరం

హరప్పా మొహెంజొదారో

క్రో`మాన్యన్‌ గుహాముఖాల్లో `

 

చారిత్రక విభాతసంధ్యల

మానవకథ వికాసమెట్టిది?

ఏ దేశం ఏ కాలంలో

సాధించినదే పరమార్థం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం

ఏ శాస్త్రం? ఏ గాంధర్వం

ఏ వెల్గులకీ ప్రస్థానం?

ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

 

ఇవీ చారిత్రక భౌతికవాదం నుంచి వేయవలసిన ప్రశ్నలు అంటూనే  ‘పరమార్థం’లోని ఆధ్యాత్మిక వాసన చర్చిస్తే ‘ప్రస్థానం’ గూడా చర్చించాల్సే ఉంటుంది కానీ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలు పదాలకు ఉద్దేశాలవల్ల అర్థాలు మార్చినవని అనేవాడు. ఆ సభల్లోనే అని కాదు ` ఆ తర్వాత నాలుగేళ్లలో కలిసినపుడల్లా చర్చల్లో

ప్రశ్నలే, ప్రశ్నలే

జవాబులు సంతృప్తి పరచవు

 

మాకు గోడలు లేవు

గోడలను పగులగొట్టడమే మాపని

 

అలజడి మా జీవితం

ఆందోళన మా ఊపిరి

తిరుగుబాటు మా వేదాంతం

 

ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని ఉన్నా

ముందుదారి మాది

 

ఉన్నచోటు చాలును మీకు

ఇంకా వెనక్కి పోతామంటారు కూడా

మీలో  కొందరు

 

ముందుకు పోతాం మేం

ప్రపంచం మావెంట వస్తుంది

 

తృప్తిగా చచ్చిపోతారు మీరు

ప్రపంచం మిమ్మల్ని మరచిపోతుంది

 

అభిప్రాయాలకోసం

బాధలు లక్ష్యపెట్టనివాళ్లు

మాలోకి వస్తారు

 

అభిప్రాయాలు మార్చుకొని

సుఖాలు కామించేవాళ్లు

మీలోకి పోతారు

 

పందొమ్మిదేళ్లు నిండకుండా రాజ్యహింసకు బలి అయిన వివేక్‌ చితికి నిప్పుపెట్టి తిరిగివస్తున్నపుడు ఒక టీచర్‌ అతనితల్లి మాధవితో ‘వివేక్‌ ఇవ్వాటినుంచి మన ఆలోచనల్లో, ఆచరణలో జీవిస్తాడమ్మా’ అన్నాడు తన కన్నీళ్లతో ఆమె కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో

 

కొంతమంది యువకులు రాబోవుయుగం దూతలు

పావన నవజీవన బృందావన నిర్మాతలు

 

అని శ్రీశ్రీ ఇటువంటి విద్యార్థుల గురించే అన్నాడా?

 

పదిహేనో ఏట మాకందరికీ ఇట్లా పరిచయమైన ఈ విద్యార్థి ` అక్షరాలా ` 2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజుల ఉత్తేజం నుంచి పోరాట బాటలెంచుకున్నవాడు. అతడు లేని, పోరాడని, అరెస్టుకాని తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఏదైనా ఉందా? వీపుమీద పుస్తకాలమూట, కళ్లద్దాలచాటున నూతనప్రపంచ దృష్టి ` అతడొక నవనవోన్మేష అడాలసెంట్‌  వలె లేడూ`  ముఖ్యంగా రెండురెక్కలు పట్టుకొని ఈడ్చుకొని పోతున్న ఉక్కుశిరస్త్రాణాల సాయుధపోలీసుల మధ్యన ` చిరునవ్వుల బాలచంద్రుని వలె.

1934 నుంచీ 41 వరకు రాసిన ‘మహాప్రస్థానం’ మొదలైన గీతాలను శ్రీశ్రీ 1938లోనే అప్పటికే మరణించిన తన మిత్రుడు కొంపెల్ల జనార్దనరావుకు అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘మహాప్రస్థానం’ వెలువడిరది మాత్రం 1950లో.

కాని ఇవ్వాళ

ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు

కాగితంమీద ఒక మాటకు బలి అయితే,

కనబడని ఊహ నిన్ను కబళిస్తే….

అనడానికి లేదు. అంతమారింది లోకం` మంచికీ, చెడ్డకూ. సంచలనానికి, సంక్షోభానికీ, సంఘర్షణకు. అందరికీ కావాలి ` కాగితంమీద ఒక మాటకు బలి కావల్సిందేనా అని అడిగే మేధావులూ ఉన్నారు. వాళ్లకాళ్లకు డెక్కలు మొలిచాయి, వాళ్లనెత్తికి కొమ్ములలాగే. వాళ్లందరినీ ఆయన 2 జూన్‌ 2014 నాటికే పోల్చుకున్నాడు. అందుకే నాలుగునెలల్లోనే

నిన్న వదలిన పోరాటం

నేడు అందుకొనక తప్పదని

తన తోటి విద్యార్థి యువకులకు పిలుపునిస్తూ ఆయన విప్లవోద్యమంలోని అజ్ఞాతజీవితానికి వెళ్లిపోయాడు. ఆయనకు పోలవరం పాదయాత్ర దండకారణ్యం జైత్రయాత్రగా మార్చే స్వప్నం. అది సాకారంచేసే జనతన సర్కార్‌లోకి సాగిపోయాడు.

అడవులమీద ఆకాశం తొంగిచూస్తున్నప్పుడు

కొండల్లో ప్రతిధ్వనిస్తుంది నా గుండెల చప్పుడు

తెలుగు దేశంలో ఎక్కడున్నా నేను

నా తొలి యౌవనాన్ని పునర్జీవిస్తాను

అని శ్రీశ్రీ 1975లో అన్నాడు. అప్పుడు ఎమర్జెన్సీ రోజులు. నలబైఏళ్లు పోయాక 2015లో అప్రకటిత ఎమర్జెన్సీ కాలంలో వివేక్‌ అడవులమీద ఆకాశం తొంగిచూసినపుడు

కొండల్లో ప్రతిధ్వనించిన గుండెలచప్పుడయ్యాడు

బాలెంల సూర్యాపేట తెలంగాణ మట్టిలో తన తొలియవ్వనంలోనే కలిసిపోయాడు. కాని కలిసిపోయిన మరుక్షణం నుంచి మనమధ్యన పునర్జీవిస్తున్నాడు, మరింత ప్రాభవంతో `

అందుకే అంటున్నాం `

లేదు, నేస్తం! లేదు…

నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!

నిరుత్సాహాన్ని జయించడం

నీవల్లనే నేర్చుకుంటున్నాము!

ప్రతికూల శక్తులబలం మాకు తెలుసు,

భయం లేదులే అయినప్పటికీ! `

నీ సాహసం ఒక ఉదాహరణ!

నీ జీవితమే ఒరవడి!

 

(15 జూన్‌ శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా 12 జూన్‌ వివేక్‌ అమరత్వం గురించి)

15 జూన్‌ 2015

 

ఫోటో: కూర్మనాథ్‌ 

 శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా విశాఖపట్నంలో విరసం నిర్వహించిన ఊరేగింపు(2010)లో ఆదివాసులకోసం నినాదం రాసుకొని పాల్గొన్న వివేక్‌

మీ మాటలు

 1. అసాధారణ మనుషులు అసాధారణంగానే ఈ లోకాన్ని వీడతారా? ఎట్లాంటి మనిషి వివేక్! నిజమైన భవిష్యత్ నిర్మాత! అందుకే రాజ్యం భయపడింది. పిరికిదానిలా వెంటాడింది. ఖచ్చితంగా అతను ఒక వెలుగుదారి కావాలి. అతని ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలి. ఒక వీరుణ్ణి పరిచయం చేసిన వి.వి. గారికి అభినందనలు.

 2. Vijaya Babu,Koganti says:

  వివేక్ ఒక మరణం లేని నిత్య సూర్యుడు. నిజంగానే ముందుతరం దూత. అగ్జ్ఞానపు మొబైల్ ప్రపంచపు మత్తులో కొట్టుకుపోతున్న ఎముకలు కుళ్ళిన సోమరులకో చెంప పెట్టు. కర్తవ్య బోధకుడు. మొన్నటి ఆంధ్రజ్యోతి లోని మీ రచన , ఈ ప్రస్తుత నివాళి గుండెను కదిలిమ్చివేసాయి.

 3. srinivasu Gaddapati says:

  ఇంత చిన్న వయస్సులోనే జీవితాల్ని చదివి తన జీవితాన్ని త్యాగంచేసిన ధన్యజీవి కామ్రేడ్ వివేక్..
  జోహార్ కామ్రేడ్ వివేక్

 4. chandhu-thulasi says:

  కామ్రేడ్ వివేక్ ….అమర్ రహే

 5. chandhu-thulasi says:

  ఈ హైటెక్ యుగంలో…..తమ కొడుకు…గొప్ప(!?)చదువులు చదివి అమెరికా కో….లండన్ కో పోవాలని అనుకోకుండా….శ్రామికుల రాజ్యంకోసం త్యాగం చేసిన….వివేక్ తల్లిదండ్రులకు….పాదాభి వందనం.

 6. buchireddy gangula says:

  వివేక్ — లాల్ సలాం
  MISS..YOU.. BROTHER..
  ——————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*