మహోజ్వల జానపద నవల “మృత్యులోయ”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

సాహిత్యంలో బాలసాహిత్యం ఓ అవిభాజ్యమైన అంగం. పిల్లల మానసిక వికాసానికి బాలసాహిత్యం ఇతోధికంగా దోహదం చేస్తుంది. పిల్లలో ఉత్సుకతని రేకెత్తించి, విజ్ఞానాన్ని అందిస్తుంది. వీటితో పాటు భాషాజ్ఞానమూ అబ్బేలా చేస్తుంది.

పిల్లలలో ఊహాశక్తిని పెంపొందిస్తూ, చక్కని నడవడి నేర్పే కథల కోసం ఒకప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బుజ్జాయి… వంటి పత్రికలు ఉండేవి. చందమామ చదవని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. చందమామ పత్రిక అంతలా జనాదరణ పొందడానికి వ్యవస్థాపకుల విలువలు ఒక కారణమైతే, చక్కని కథలని ఎంచి పత్రికని పరిపుష్టం చేసిన సంపాదకుల దూరదృష్టి, వివేకం మరో కారణం.

పిల్లలను, పెద్దలనూ ఆకట్టుకునేలా చందమామని తీర్చిదిద్దడంలో శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పాత్ర విస్మరించలేనిది. పత్రిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, చందమామలో 12 జానపద సీరియల్స్ వ్రాసి ప్రచురించారు. ఒక్క చందమామలోనే కాదు, బొమ్మరిల్లు, యువ, స్నేహబాల, ప్రమోద వంటి పత్రికలలో జానపద నవలలు ధారావాహికంగా వెలువరించారు.

మృత్యులోయ’ నవల బొమ్మరిల్లు ప్రారంభసంచిక (1971) నుంచి 39 నెలలపాటు (1974) ధారావాహికంగా ప్రచురింపబడింది. జానపద నవలలంటే, రాజులు, రాణులు, రాజకుమారులు, రాకుమార్తెలు, మంత్రులు, మంత్రి కుమారులు, సైన్యాధికారులు, దండనాయకులు, విదూషకులు, కుట్రలు, కుతంత్రాలు, అడవులు, జంతువులు, మాయలు, మంత్రాలు, మాంత్రికులు, ఋషులు, మరుగుజ్జులు, మహాకాయులు… ఇలా ఓ కొత్త ప్రపంచంలోకి పాఠకులను తీసుకువెడతాయి. ఈ నవల కూడా అలాంటిదే.

లలాటమనే దేశాన్ని యశోవంతుడనే రాజు ధర్మబద్ధంగా పాలిస్తూంటాడు. మంత్రి జయవర్మ రాజుకి అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. రాజు గారి శూరత్వానికి, మంత్రిగారి వ్యూహచతురతకి జడిసిన పొరుగు రాజులు లలాటం మీదకి దండెత్తాలని ఉన్నా, వెనుకడుగు వేస్తుంటారు. రాజకుమారుడు యశపాలుడు, మంత్రి కుమారుడు జయకేతుడు అనుంగు మిత్రులు. రాచవిద్యలు, యుద్ధవిద్యలన్నింటిలోను ప్రావీణ్యం సంపాదించుకున్న యువకులు. తమ నైపుణ్యాలను కదనరంగంలో ప్రదర్శించే వీలు లేక, అడవిలో వేటకి వెళ్ళి, తమ విద్యలను మెరుగుపెట్టుకుంటూ ఉంటారు. అలా ఓ సారి అరణ్యంలో వేటకి వెళ్ళి, ప్రమాదానికి గురై, మృత్యులోయలోకి జారిపోతారు. పేరులోనే మృత్యువున్న ఆ లోయలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు, చిత్రవిచిత్రమైన జంతువులు, పక్షులు, నరవానరాలు, రాక్షసులు ఎదురయినా ఆ లోయలోంచి వారు బయటపడిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Dasari Subrahmanyam

***

ఆ లోయ ఎంత భయంకరంగా ఉంటుందంటే… “ఆ ప్రదేశమంతా అంతంగా లోతులేని మడుగులతో, వాటి మధ్య చిన్న చిన్న దిబ్బల మీద ఎత్తుగా పెరిగిన రెల్లు పొదలతో, చెట్లతో, రకరకాల పక్షులతో భీకరంగా వున్నది”.

ఈ లోయలోంచి బయట పడే మార్గం కోసం వెతుకుతారు యశపాలుడూ, జయకేతుడు.

“ఒకసారి యీ లోయలోకి వచ్చి పడిన వాళ్ళు తిరిగి బయటపడడం అంటూ జరగదు. చుట్టూ నిటారుగా వున్న కొండలు చూశారా? వాటిని పాకి పైకి పోవడం ఉడుములాంటి జంతువుకైనా సాధ్యం కాదు” అంటాడు, వీళ్ళిద్దరికన్నా ముందుగానే ప్రమాదవశాత్తు లోయలో పడిన విదూషకుడు.

“ఈ మృత్యులోయ లోంచి పైకి వెళ్ళేందుకు ఎక్కడో ఒకచోట సొరంగమార్గం లాటిది వుండకపోదు” అంటాడు యశపాలుడు ఆశావక దృక్పథంతో.

***

“పాముల కన్నా, క్రూరమృగాల కన్నా పగబట్టిన మనిషి ప్రమాదం. ఈ మృత్యులోయలో భల్లూకనాయకుడి వంటి వాళ్ళను వేళ్ల మీద లెక్కించవచ్చు. క్రూరత్వంలో వాడు రాక్షసి మృగాన్ని మించినవాడు.” అంటుంది సర్పవతి, భల్లూక నాయకుడు అపహరించ ప్రయత్నించిన సర్పజాతి నాయకుడి కూతురు. భల్లూక నాయకుడిని చంపి తమ దేశానికి వెళ్ళిపోతాం అని చెప్పిన జయకేతుడి మాటలు విని ఆశ్చర్య పోతుంది.

“ఈ మృత్యులోయలోంచి బయటకి పోవటమా? అదెలా సాధ్యం? మార్గం ఎక్కడున్నది?” అని అడుగుతుంది.

“మార్గం లేకపోతే, మేం సృష్టించి, మా దేశానికి తిరిగి పోతాం…” అంటాడు యశపాలుడు. తమ శక్తి సామర్థ్యాల మీద అమితమైన విశ్వాసం!

 

***

F1

రాక్షసుడి విదూషకుడైన ముసలివాడికి భల్లూక జాతి వాళ్ళ ప్రవర్తనలో ఏదో మోసం వున్నట్లు అనుమానం కలిగింది. సర్పవతిని ఎత్తుకుపోతున్న వాళ్ళ వైపు నుంచి, ఆ పిల్ల పేరూ, రక్షించమన్న పిలుపూ ఎలా వస్తుంది?  ఆ కంఠస్వరాలు యశపాల జయకేతులవి కావు. బహుశా, భల్లూక జాతివాళ్ళు తమను రెండుగా చీలదీసి తరువాత తేలిగ్గా హతమార్చేందుకు ఏదో ఎత్తు వేసి వుంటారు.

ప్రమాదాలు చుట్టు ముట్టినప్పుడు, సంయమనం కోల్పోకపోతే, దాన్నుంచి బయటపడే ఉపాయం సులువుగా తడుతుంది.

***

ఒకటా రెండా, ఇలా నవలంతా ఎన్నో ఘటనలు. ప్రమాదాలని, అడ్డంకులని కథానాయకులు సానుకుల దృక్పథంతో ఎదుర్కునే తీరు.. నేటి వ్యక్తిత్వ వికాస సూత్రాలకు సరిపోతాయి.

సాహిత్యం ఏదైనా మంచి చెడుల సమ్మేళానాన్ని ప్రతిబించించి, చెడును విసర్జించి, మంచిని స్వీకరించమనే చెబుతుంది. ఈ కథా అంతే. పాత్రధారులలో మంచి వాళ్ళుంటారు చెడ్డవాళ్ళుంటారు. మంచికి చెడుకీ మధ్య పోరాటం ఉంటుంది. అంతిమంగా చెడుపై మంచి విజయం సాధిస్తుంది. ఏ దేశపు సాహిత్యమైన చెప్పేది ఇదే.

మాయలు మంత్రాలు, రాక్షసులు, విచిత్రమైన జంతువులు.. ఇవన్నీ ప్రతీకాత్మకమైనవి. రెండు తలల మహాసర్పం, నరవ్యాఘ్రం వంటి జీవులు కల్పనే కావచ్చు… కాని ఆయా పాత్రలను సృష్టించడం వెనుక ఓ నీతి ఉంది. పిల్లల ఎదిగి, జీవితాన్ని అవగతం చేసుకునే వయసొచ్చే సరికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, కష్టం నష్టం, భీతి, భయం, దిగులు, నిరాశ వంటి ప్రతికూల లక్షణాలు కూడా ఇలాంటి కల్పితాలేనని, ఎటువంటి స్థితిలోనూ ధైర్యం కోల్పోకుండా స్థిమితంగా ఉంటే విజయం తధ్యమని గ్రహిస్తారు.

అలాగే, తాము ఎంతటి ప్రమాదంలో ఉన్నా, తోటివారిని కాపాడడానికి చివరిదాకా ప్రయత్నించడం గొప్ప లక్షణం. ఈ నవలలోని నాయకులు కనపర్చిన అనేక సానుకూల దృక్పథాలలో అదీ ఒకటి.

మంత్రాలు, మాయలు ప్రయోగించడం – తమ లక్ష్యం చేరుకోడానికి అడ్డదారులు తొక్కడం లాంటిది. గొప్ప విలువలున్న వ్యక్తులు కూడా అప్పుడప్పుడు మాయమంత్రాల బారిన పడి తమ విద్వత్తును, పాండిత్యాన్ని నాశనం చేసుకుంటారు. విజయానికి అడ్డదారులు లేవని చెబుతుంది ఈ నవల.

Mryutyuloya Front Cover

నిత్యం ప్రమాదాలతో పోరాడుతున్నా, ఆశావాదం విడువరు కథానాయకులిద్దరూ. చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయి, జీవితాన్ని విషాదభరితం చేసుకునే వ్యక్తులు ఈ పాత్రల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. పాఠకులలో ఉత్కంఠ రేకెత్తించే ఈ నవల పిల్లలకి, పెద్దలకి సైతం ఎన్నో జీవిత పాఠాలు చెబుతుంది.

ఈ నవలకి కథానుగుణంగా గీసిన బొమ్మలు అదనపు ఆకర్షణ. అద్భుతమైన కథనానికి అందమైన బొమ్మలను గీసింది ఎం. కె. బాషా, ఎం.ఆర్.ఎన్. ప్రసాదరావులు.

వాహిని బుక్ ట్రస్ట్, మంచి పుస్తకం వారు సంయుక్తంగా ప్రచురించిన “మృత్యులోయ” అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుని పుస్తకాన్ని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు. 312 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-

~

 

మీ మాటలు

  1. భలే మంచి నవలని పరిచయం చేసారండి. ఈ నవల నాకు చాలా ఇష్టం. ఆ జానపద నవలలు చదివడంలో ఉండే ఆనందమే వేరు. ఏదో అద్భుతమైన నిష్కల్మషమైన ప్రపంచంలోకి వెఌపోయినట్టుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దాసరి సుబ్రహ్మణ్యం గారివి.

  2. Mythili abbaraju says:

    భలే నవల ! ఖడ్గవర్మా జీవదత్తుల [ రాతిరథం, యక్షపర్వతం ( చందమామ ) ] తర్వాత యశపాలుడూ జయకేతుడూ…

    ఈ నవలలో ఆరుకాళ్ళ ముసలీ ..ద్రాక్షసారాయం తాగితే పులిగా మారిపోవటం [ ఉడుంబు ? ] కథ … ! ఆ బొమ్మలూ ఎంత బావుంటాయో ఒరిజినల్ బొమ్మరిల్లులోవి

    థాంక్ యూ అండీ

  3. చాలా రోజుల పాటు రాత్రిళ్ళు ఉడుంబు పులిగా మారిపోయే బొమ్మ, చంద్రోదయం ఔతుంటే వాడు కొంచెం కొంచెంగా పులైపోవడం గుర్తొచ్చేది. అంతే, హడలు పుట్టి గాలి దూరలేనంత టైటుగా దుప్పటి ముసుగుతన్ని మళ్ళీ తెల్లగా తెల్లారాకే అందులోంచి బైటికి రావడం. :-)

    ఆరుకాళ్ళ మొసలి సృష్టికర్త రసాయన భట్టు అని గుర్తు. చిన్నప్పుడు కొనుక్కోలేకపోయిన పుస్తకాల లిస్టులో మృత్యులోయ పాకెట్ సైజు బుక్స్ (రెండు భాగాలు) వుండేవి.

Leave a Reply to prasuna ravindran Cancel reply

*