ఎప్పటికప్పుడు నిన్ను….

ప్రవీణా కొల్లి
నాకు  తెలిసిన మహా   అద్భుతానివి  నువ్వు
ఏ క్షణంలో ఎలా  ఆసీనమవుతావో
మరుక్షణానికి  ఎప్పుడు వీడ్కోలు చెపుతావో
తెలీనట్టే ఉంటుంది నీ గమనం.
నీ ఛాయలను తడిమితే చాలు
జీవించిన కాలాలు కళ్ళలో  మెదులుతూ
తెరలుతెరలుగా రెపరెపలాడతాయి.
అంచులలో నుంచీ  జారిపోబోతున్న చుక్కలా
నిలిచిన  నిన్ను
ఒడిసి పట్టుకోనూ  లేను
నిన్ను  వదిలిపోనూ లేను.
నీలోనే  తచ్చాడుతూ
నన్ను  వెతుక్కుంటూ  ఉంటాను.
దొరికినదేదీ  నిలకడైనది కాదని
స్థిరమైన  అర్థాలేవీ జీవితంలో ఉండవని
రేపటి  శోధనను వదలవద్దని చెప్పి పోతావ్.
రావొద్దని  నిన్ను ప్రాధేయపడిన క్షణాలను
నిర్దాక్షిణ్యంగా  పక్కకు  తన్నేస్తావ్
పెద్ద పెద్ద అంగలతో నా  వాకిలిని  చిత్తడి చిత్తడి చేస్తావ్
అల్లకల్లోలాలను  నాలో నింపి
ఎండుటాకులపై అడుగులేస్తూ
నింపాదిగా వెళ్లిపోతావ్
ఆకారాలను నాలో చెక్కిన
నిరాకార శిల్పివి  నువ్వు.
ఉలి  పోటులకు నిన్ను ద్వేషించనూలేను
కొన్ని  ఆకృతులకు  నిన్ను  ప్రేమించనూ  లేను.
 సూత్రధారివీ   నువ్వే
మహమ్మారివీ  నువ్వే
గొప్ప  స్నేహానివి  నువ్వే
అంతుపట్టని  శేషానివీ  నువ్వే.
ఎప్పటికప్పుడు  నిన్ను హత్తుకోగలిగితే
జీవితాన్ని ప్రేమించకపోవటానికి  ఒక్క కారణమన్నా మిగలదు  కదూ!
వేళ్ళ  సంధుల్లో  నుంచీ జారిపోతున్న నీకు వీడ్కోలు చెప్పగలిగితే
లోతుగా జీవించిన క్షణాలెన్నో మిగులుతాయి కదూ!
praveena

మీ మాటలు

  1. చాలా బావుంది ప్రవీణ గారూ. “ఎప్పటికప్పుడు నిన్ను హత్తుకోగలిగితే
    జీవితాన్ని ప్రేమించకపోవటానికి ఒక్క కారణమన్నా మిగలదు కదూ!” బావుంది.

  2. అద్భుతమైన ‘ ఫ్లో ‘ ప్రవీణ గారూ!

  3. కవిత బాగుందండీ

  4. “అంచులలో నుంచీ జారిపోబోతున్న చుక్కలా
    నిలిచిన నిన్ను
    ఒడిసి పట్టుకోనూ లేను
    నిన్ను వదిలిపోనూ లేను.”

    చక్కగా ఫోటో తీసి చూపినట్టు రాశారు! బ్యూటిఫుల్!!

  5. ఫోటో.. భలే భలే. Thank you థంక్ యు భాస్కర్ గారు :)

  6. sreelatha says:

    Chala bavundi praveenagaru mee kavitha.

  7. వహవా !!

  8. Sathyavathi says:

    చాల బాగుంది అభినందనలు ప్రవీణ

  9. balasudhakar says:

    కవిత నిర్మాణం, భావం నచ్చింది ప్రవీణ గారూ..

  10. Dr. Vani Devulapally says:

    కవిత బావుందండి ప్రవీణ గారు !

  11. ఎప్పటికప్పుడు నిన్ను హత్తుకోగలిగితే
    జీవితాన్ని ప్రేమించకపోవటానికి ఒక్క కారణమన్నా మిగలదు కదూ!

Leave a Reply to Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் Cancel reply

*