ఆనందమే అప్పటి చివరి ఉనికి!

మైథిలి అబ్బరాజు 

 

mythili

అసలు వెళ్ళిందైతే ప్రభా ఆత్రే ని చూద్దామని, విందామని. వలసవెళ్ళిన  శీతల నగరం లో చౌడయ్య గారి పేరిట ఫిడేలు ఆకారం లో కట్టిన హాలు. తిరిగి చూస్తుంటేనే కడుపునిండిపోతూ ఉంది. మర్యాదా వినయమూ ఉట్టిపడే నిర్వాహకులు హెగ్డే గారు అనుకూల పవనం లాగా ఉన్నారు. ధ్వని సరిగ్గా ఉందో లేదో సరి చూసుకుంటున్నారొక విద్వాంసులు, సితార్ పట్టుకుని , పక్క వాద్యాలతో..వయొలిన్ మరీ పెద్దగా ఉందనుకున్నాను . త్యాగరాజ ఉత్సవాల్లో పెద్ద కచేరీ కి ముందర ఔత్సాహికులకి అవకాశం ఇస్తూ ఉంటారు, వాళ్ళ సంగీతం ముగిసేవేళకి అంతా చేరుకుంటారని. వీళ్ళూ అటువంటివారే కాబోలు !

సరిగ్గా అయిదున్నర కి కార్యక్రమం మొదలైంది. పరిచయాలలో తెలిసింది ఆ ఫలానా వారు రవిశంకర్ శిష్యులని ..ఓహో, సరేలే అనుకున్నాను- ఆవిడ ఆయన భార్యేనట, విదేశీయురాలట…అయితే ఏమిటట ? మనవాళ్ళు కాకపోతే సరి, ఊరికే మెచ్చుకునిపోతామనే  prejudice  నాలోపల భేషుగ్గా పనిచేస్తోంది. ఇంతకూ అది వయొలిన్ కాదు చెలో[ cello ]  అట, ఇద్దరూ జుగల్ బందీ వాయిస్తారట…తొందరగా ముగించేస్తే బావుండును, ప్రభా ఆత్రే రావద్దూ ?

మొదలైంది వాదనం….మధువంతి, ముందుగా – సితార్ తోబాటు ఎవరో పక్కనుంచి మంద్రం లో ఆలపిస్తున్నారు , వెతికితే ఇంకెవరూ లేరు . కాసేపటికి తెలిసింది, అది చెలో…అచ్చం మానవకంఠానికి మల్లే వినిపిస్తోంది. నేర్చుకుని ఉన్న కాస్త పరిజ్ఞానం లో , అలా వాయిద్యాన్ని పలికించటం అపురూపమైన విషయమని తెలుసును – అలా చేయగలిగితేనే గొప్ప అని ఏమీ కాదుగాని . సారంగీ వాయిస్తే అస్తమానం అది ఎవరో పాడుతున్నట్లే ఉంటుంది , ఇప్పుడు ఇది.

ఆయన , శుభేంద్ర రావు గారు – నిదానంగా , మట్టసంగా వాయిస్తున్నారు , కొంచెం predictable  గా కూడానేమో. విద్వత్తుకీ మాధుర్యానికీ  వెలితేమీ లేదు. కాసేపటికి ఆపి ఆవిడకి అవకాశం ఇచ్చారు. అమాయకంగా అందుకున్నారు ఆవిడ, కమాను తోబాటు  సభలో ఉన్న వెయ్యిమంది చేతులూ… లాక్కుపోయి దివ్యలోకాలలో  పడేశారు. జన్మించినప్పటినుంచీ ఎరిగిఉండనట్లుగా,  జన్మ ఎత్తింది అందుకేనన్నట్లుగా  మా అంతస్తంత్రులు కంపించిపోతున్నాయి .  ఏ ప్రక్రియో ఏ కల్పనో ఏ స్వరవిశేషమో ఎవరికైనా పట్టిందా… నిండా మునిగిఉన్నవారికి చలివేస్తుందా ? చంద్రకాంత శిల అయి  ఘనీభవించిన ఆ కొంతకాలం తర్వాత ఆమె అప్పటికి ఆపారు..ఒక్క ఉదుటున ఇక్కడికి వచ్చిపడ్డవారి చేతులు కలుసుకుని అదేపని గా మోగాయి. వెనక్కి చూసుకున్నప్పుడు భారతసంగీతచాలనం  తో మిళితమై  symphony    కదలికలు allegro, adagio ల  ఛాయలు   తెలిశాయి

‘’ She was taught by the God himself ‘’ అని ఆవిడ గురువులలో ఒకరైన హరిప్రసాద్ చౌరాసియా  అన్నారట , అవునేమో కాని ఆవిడ ఇంకా పైవారేమో – సరస్వతీ విపంచి ? కచ్ఛపి ?

ఆవిడ సాస్కియా రావ్  డి – హాస్  ,  నెదర్లాండ్స్ లో ethnomusicology  చదువుకుని ఆ లంకె పట్టుకుని ఇక్కడి  సంగీతం కోసం వచ్చారు.

ఆయన కొంచెం మురిశారు, ఇంకొంచెం ఉడుక్కున్నారు బహుశా , అప్పుడు కదుపుకున్నారు తన తీగలని – మృదువుగా, క్రూరంగా – చిత్రంగా … అవి- ‘  లోల మధుకరాళు లూ  ,  నీలోత్పల మాల లూ’ అయి..వెంట వెంట మమ్మల్ని డోలలూపుతూ . అవును ఆ సంగీతం ఊయలే, కదిలించి, వెనక్కి తెచ్చి, తిరిగి కదిలించి…శరీర స్పృహ పోగల ప్రయాణమయితే కాదు –  అది  కలువపువ్వుల   డోల , సౌరభాల లీల- నిజమేలే, అయినా చాలు , ఆవిడ ఏరీ ?

subh

ఆయన నిజంగా గొప్పగా వాయించారు  … ఆవిడ ఆరాధన పొరలిపోయే కవళికలతో ఆస్వాదించారు , మా వైపు తిరిగి ” వినండి వినండి ..మీ పుణ్యం సుమా ఇది ” అంటున్నారు చూపులతో.  ఆయన వాయిస్తూంటే ఒక అన్యస్వరం వచ్చింది , కావాలనే వేశారేమో – ఆ తర్వాత ఆవిడ , వీలు కల్పించుకుని మరీ ఆ స్వరం వేశారు. సాంత్వన అంది – ” కాదేమోగాని, ఒకవేళ ఆయన పొరబాటు చేసిఉన్నా ఆవిడ దాన్ని మళ్ళీ చేసి సరైనదిగా స్థిరపరుస్తారు, అంత ప్రేమ ” అని.

ప్రేమించుకున్న ఇద్దరు , ఆ  ఇష్టాన్ని పక్కపక్కనే కూర్చుని చెప్పుకోవటం లో సౌందర్యం ఎంత ఉంటుందో చెప్పలేను. ఆ సంభాషణ సంగీతం లో అయితే ? లోకోత్తరమైన అనుభవం- మేము పొందాము… ఏడు ఊర్థ్వ  లోకాల మేరన విశ్వం మొత్తమూ రెండయి  విడివడి తీరిగ్గా ముచ్చటించుకుంటూ ఉంటే..   ఆవిడతో కలిసిపాడినప్పుడు ఆయనా అమర్త్యుడి లాగే ఉన్నారు.

తర్వాత, ‘ గతి ‘ ..తబలా విద్వాంసుల మొహం లో విశ్వనాథ అన్నట్లు , కళ్ళు, ముక్కు , నోరు – ఏవీ లేవు, అంతా  ఆనందమే.

మధ్యలో ఆయన ప్రకటించబోయారు – ” ఈ కచేరీ ని ఎవరికి అంకితం చేస్తున్నానంటే ..” చెప్పలేక కన్నీరు మున్నీరయారు. ఆవిడ మమతగా ఆయన బుజం పట్టుకుని ఊరడించి , అప్పుడు  అందుకుని  చెప్పారు ఆయన తండ్రి గారికి అని. ఆయన గతించారట-  ఈ మధ్యేనేమో- శుభేంద్ర  గారి శిరస్సు ముండితమై ఉంది.  ఆయన –  ఎన్.ఆర్. రామా రావు గారు,  రవిశంకర్ కు మొదటి శిష్యులలో ఒకరని , శుభేంద్ర రావు గారి సాధన అంతా ఆయన సంకల్పమేనని , ఆ తర్వాత చదివాను.

తర్వాతి రాగం చారుకేశి..వ్యాకులంగా ప్రారంభించారు ఆయన. మామూలుగా అయితే ఏమోగాని ఇప్పుడు ఆ విషాదాన్ని ఆవిడ చెదరగొట్టి తీరాలి, అలాగే చేశారు… చారుకేశి లో పలికించగలిగినంత సంతోషమంతా అక్కడ ప్రత్యక్షమైంది.

రెండే రాగాలు..అంతే.

ఆ తర్వాత అంతటి ప్రభా ఆత్రే పాట రక్తి కట్టనే లేదు. అంతకుముందరి యుగళం ఆవిష్కరించి వెళ్ళిన అలౌకికత్వాన్ని ఆవిడ కొనసాగించలేకపోయారు , అందుకని .

 

 

మీ మాటలు

  1. Dr.Vijaya Babu, Koganti says:

    “వినండి వినండి ..మీ పుణ్యం సుమా ఇది ”
    అవును మైథిలి గారూ , ముమ్మాటికీ మీదే, ఈ అపూర్వానందాన్ని నేరుగా మాతో పంచుకున్నందుకు ధన్య వాదాలు.

    • Mythili abbaraju says:

      చాలా సంతోషం విజయ్ బాబు గారూ !!!!!

      • G. Sathish Paul says:

        Melodious crescendo transcending sensibilities, benumbing all sensations and transporting to sheer celestial exhilaration –
        Indebted to you indeed !!

        -సతీష్ పాల్

      • Mythili abbaraju says:

        Thank you so much Sathish Paul garu

  2. subbalakshmi says:

    చాలా చాలా ధన్యవాదములు మైథిలిగారు.మీ ఆనందాన్ని మాకు కూడా పంచినందుకు

  3. ” … ‘ఏడు’ ఊర్థ్వ లోకాల మేరన విశ్వం మొత్తమూ రెండయి విడివడి తీరిగ్గా ముచ్చటించుకుంటూ ఉంటే.. ఆవిడతో కలిసిపాడినప్పుడు ఆయనా అమర్త్యుడి లాగే ఉన్నారు.” _/\_ _/\_ విని ఆనందించి దాచుకోకుండా ఆ అమృతాన్ని పట్టితెచ్చి మాకందరికీ పంచిన మీకు చాలా కృతజ్ఞతలు, చాలా చాలా మార్దవంగా వుంది వ్యాసమంతా !!

  4. Kuppili Padma says:

    ‘ఆవిడతో కలిసిపాడినప్పుడు ఆయనా అమర్త్యుడి లాగే ఉన్నారు’ – యెంతటి జీవనానందం మైథిలి గారు. మీ అక్షర సుస్వరాన్ని మనసుతో విన్నాను. Thank you.

  5. Sitharentala says:

    Preminchukunna iddaru aa ishtaanni pakkapakka Kuchuni cheppukovadam adee sangeethamlo(Bhasha).loukikam+aloukikam. Abba adbhutha padaprayogaalu.pushpa Dola,sourabhala leela,perfect words!Thank you !

  6. Mani Kopalle says:

    చాలా బాగుందండి మీ ” ఆనందమే అప్పటి ఉనికి” ఆర్టికిల్. వీడియో చూస్తూ సంగీతం విన్నాను. బాగుంది. మీరు వెళ్ళింది ఎక్కడ ఎప్పుడు….ప్రభాత్ రే గారి గ్రామఫోన్ రికార్డులు వుండేవి మాయింట్లో. ఆ రోజుల్లో రికార్డు ప్లేయర్ లో యల్. పి. రికార్డులు ప్లే చేసి వినేవాళ్ళం. థాంక్యూ మైధిలిగారు.

    • Mythili abbaraju says:

      ఓ…అవునా అండీ ..ప్రభా ఆత్రే నాకు కొంత ఆలస్యంగానే తెలిసారు…

      ఈ జూన్ 7 న , బెంగుళూరు లో

      థాంక్ యూ అండీ

  7. ప్రేమించుకున్న ఇద్దరు , ఆ ఇష్టాన్ని పక్కపక్కనే కూర్చుని చెప్పుకోవటం లో సౌందర్యం ఎంత ఉంటుందో చెప్పలేను… ఇది మాత్రం భలే నిజం. అందునా ఇద్దరు కళాకారులు, ఇంకా భలే !! ఒకే ఇష్టాన్ని, అది కళో, ప్రేమో , ప్రదేశమో , భావనో , రుచో , వాసనో ఏదైనా వ్యక్తీకరించుకోవటం అద్భుతం !! మీ టపా లో ముందు యూట్యూబ్ నొక్కి చదవటం మొదలు పెట్టాను. ఆశ్చర్యం గా రోమాంచితం అయ్యింది … తంత్రీ నాదనికేమో అనుకున్నా , చదువుతున్న అద్భుతానికని కొంచం సేపయ్యాక తెలుసుకున్నా. అరుదుగా దేవుని ముందు కలిగే శరీర కంపన, చక్కని దృశ్యం చూస్తే కలిగే మానసిక ఉల్లాసం, అనుకున్న పని చేస్తే కలిగే తృప్తి, అన్నీ కలగలిసిన భావనలు. ఆ సంగీత విందు అంత అందంగా,రుచిగా, ఆహ్లాదంగా ఉంది మీ వర్ణన. చదివిన మాతో బాటు, అంత భావుకత ఒలక బోసిన మనమంతా ధన్యులమే !!

    • Mythili abbaraju says:

      ఎంత ఆహ్లాదమయమైన ఆశ్చర్యాన్నో ఇచ్చింది మీ వ్యాఖ్య..థాంక్ యూ నరసింహారావు గారూ _/\_

  8. సువర్చల చింతలచెరువు says:

    ఏడు ఊర్థ్వ లోకాల మేరన విశ్వం మొత్తమూ రెండయి విడివడి తీరిగ్గా ముచ్చటించుకుంటూ ఉంటే.. ఆ అద్వైతాత్మని మనోదృష్టితో తిలకించాల్సిందే!
    ఏవో దివ్యలోకాల పరిమళం ఆ రాగాలలో సమ్మిళితమైన క్షణాల మీ ఉనికి మహత్తరమైనది. ఆ సమయాన,మిమ్మల్ని స్పర్శించినా చాలు..మాకూ ఆ అనుభవమే ప్రాప్తమౌతుంది. ఇది నిజం! అందుకేనా ఏం ఆ అవకాశం మాకులేక, ఈ ఆనందమే అప్పటి చివరి ఉనికిగా అందించారు?

    • Mythili abbaraju says:

      ఎంత మృదువు గా ఉందో మీ స్పందన…థాంక్ యూ సువర్చల గారూ

  9. N Venugopal says:

    మైథిలి గారూ,

    ఏదైనా చదివినప్పుడు ఆనందమో, విచారమో, ఆలోచనో, దుఃఖమో కలుగుతాయి గాని వాటన్నిటితో పాటు రచయిత మీద అసూయ కలగడం మొదటిసారి అనుభవించానండీ. ఆ అద్బుతాన్ని చూడగలిగిన, చవిచూడగలిగిన, వీనుల విందు చేసుకోగలిగిన, దాన్ని అంతే అందంగా మాతో పంచుకోగలిగిన మీ అదృష్టానికి ఈర్ష్య కలుగుతున్నదండీ…

  10. SasiSri says:

    అత్యద్భుతంగా ఉంది సుబేంద్ర ,సస్కియ గార్ల సంగీత కార్యక్రమం . మనసును ఆహ్లాద పరచింది .అంతే గొప్పగా ఉంది మీ రైట్ అప్ .అభినందనలు

  11. మైథిలీ, మీరు అనుభవించిన దివ్యానుభూతిని మాకు కూడా ఈ వ్యాసరూపేణా పంచారు.

  12. Mythili abbaraju says:

    My pleasure andee

  13. శ్రీరామ్ వేలమూరి says:

    ప్రేమించుకున్న ఇద్దరు , ఆ ఇష్టాన్ని పక్కపక్కనే కూర్చుని చెప్పుకోవటం లో సౌందర్యం ఎంత ఉంటుందో చెప్పలేను. ఆ సంభాషణ సంగీతం లో అయితే ? …. అద్భుతం మైధిలి గారూ .. మీకు మరోసారి అభినందనలు

    • Mythili abbaraju says:

      చాలా సంతోషం శ్రీ రామ్ గారూ , థాంక్ యూ

  14. చాలా అద్భుతంగా రాశారు. బెంగుళూరు వైట్ ఫీల్డ్ లో ని భగవాన్ సత్యసాయి బాబా ఆశ్రమం లో వీకేండ్ లో పెద్ద సంగీత విద్వాంసులు కచేరిలు సాయంతం పూట ఇస్తూంటారు. సంగీతం అంటే అభిరుచి ఉన్నవారు దానికి హాజరు కావచ్చు.

    ఈ క్రింది వెబ్ సైట్ లో ఎంతో మంది గొప్ప సంగీత విదాంసుల కచేరిల రికార్డింగ్ లు,వార్తల వివరాలు ఉన్నాయి. వీలు చూసుకొని వెబ్ సైట్ను చూడండి.

    http://chowdaiahandparvati.blogspot.in/

  15. S. Narayanaswamy says:

    I always felt that Cello would be best suited for Indian music, especially Carnatic music.

  16. PURUSHOTHAMA RAO RAVELA says:

    మండించే గ్రీష్మంలో ఓ మలయమారుతం వీచిన అనుభూతి
    హిమశీతల వాతావరణంలో ఒక నులివెచ్చని స్పర్శ తనువును తాకిన
    తృప్తి మీ రచన కలిగించింది శుభాశీస్సులు..
    మనసుతో మాటాడగలిగినందుకు మమతనురాగాలను వర్షించినందుకు

Leave a Reply to శ్రీరామ్ వేలమూరి Cancel reply

*