కళాయోధుడికి వందేళ్లు -1

పి.మోహన్ 

 

P Mohanచిత్తప్రసాద్ కు జాతకాలపై నమ్మకం లేదు. తను బతికి ఉండగా పట్టని అదృష్టం చచ్చాక పడుతుందన్న భ్రమ అసలే లేదు. దున్నపోతులు పాలించే ఈ దేశం తన పిచ్చి బొమ్మలను గుర్తించుకుని, తన వందేళ్ల బర్త్ డే జరుపుకుని, నివాళి అర్పిస్తుందన్న వెర్రి ఆశ అసలే లేదు. అయినా చిత్తప్రసాద్ ఇప్పుడు ఎవడిక్కావాలి? మదరిండియాను ‘మేకిన్ ఇండియా’ కంతల గుడిసెలో ఎఫ్డీఐల కాషాయ పడకపై అంకుల్ శామ్, చైనా డ్రాగన్, యూరప్ గద్దలకు ఏకకాలంలో తార్చేస్తున్న స్వదేశీ జాగరణ మహావానరాలకు ఆ ఆ కల్తీలేని ఎర్ర దేశభక్తుడి పుట్టిన రోజుతో ఏం పని? కళ్లే కాదు సర్వాంగాలూ లొట్ట పోయిన గోతికాడి నకిలీ ఎర్రమనుషులకు ఆ ఒకనాటి తమ సహచరుడి సమరస్వప్నాలు ఏ జూదానికి పనికొస్తాయి? నిమిషానికి కాదు క్షణానికో రంగు మార్చే ఊసరవెల్లులు అతగాడి బ్లాక్ అండ్ వైట్ నిప్పుల జెండాలను ఏం చేసుకుంటాయి?

కానీ, చిత్తప్రసాద్ మహామోహంతో, నరనరానా ప్రేమించిన ఈ లోకంలో దున్నపోతులు, మహావానరాలు, నక్కలు, ఊసరవెల్లులే కాదు.. మనుషులు కూడా ఉన్నారు. అతని మాదిరే సాటి మనిషి కష్టానికి కన్నీరుమున్నీరయ్యేవాళ్లు, కళ మార్కెట్ కోసం కాదని, మనిషిని మనిషిగా నిలబెట్టేందుకని నమ్మేవాళ్లు, నమ్మకం కోసం నునువెచ్చని నెత్తుటిని ధారపోస్తున్నవాళ్లూ ఉన్నారు. చిత్తప్రసాద్ వాళ్లకు అవసరం! చెప్పలేనంత అవసరం. శత్రువు గుండెను గెరిల్లా బాంబులా పేల్చే అతని బొమ్మలు వాళ్లకు కావాలి. కలలను, కన్నీళ్లను, అక్కసును, ఆక్రోశాన్ని, కసిని, క్రోధాన్ని మహోగ్రంగా వెళ్లగక్కే ఆ నిప్పుకణికలు వాళ్లకు కావాలి. వాటి కథలూ, గాథలూ వాళ్లకు కావాలి. చిత్తను తెలుసుకోవడమంటే మన గుండెతడిని మనం పరీక్షించుకోవడం. మన భయాన్ని, పిరికితనాన్ని, నంగితనాన్ని వదలించుకుని మన పిడికిళ్లను మరింతగా బిగించడం. వందేళ్ల చిత్త బతుకు చిత్రాల గ్యాలరీని నేటి మన చివికిన బతుకు కళ్లతో చూద్దాం రండి!

1 (3)

చిత్త ఆధునిక భారతీయ కళాసరోవరంలో పూచిన ఒకే ఒక ఎర్రకలువ. దాని రేకులు ఎంత మెత్తనో అంత పదును. ఒక్కో రేకుది ఒక్కో పరిమళం. ఒకటి బొమ్మలు వేస్తుంది, ఒకటి పాడుతుంది. ఒకటి కవితలు, కథలు రాస్తుంది. అది జనం పువ్వు. కష్టజీవుల కళల పంట. అది వాళ్లు నవ్వితే నవ్వుతుంది, దుఃఖపడితే కలతపడుతుంది. ఆగ్రహిస్తే కత్తుల పువ్వయిపోయి వాళ్ల చేతుల్లో ఆయుధంలా మారిపోతుంది. అందుకే బడాబాబులకు అదంటే గుండెదడ. బడుగుజీవులకు గోర్వెచ్చని గుండెపాట.

కళను అర్థం చేసుకోకూడదని, అనుభవించాలని అంటారు మహానుభావులు. చిత్త విషయంలో ఈ మాటకు అర్థం లేదు. అతని చిత్రాలు అర్థం, అనుభవాల మేలుకలయిక.

‘..నేను చెప్పేది నీకర్థం కావడం లేదని అనుకుంటున్నానమ్మా! అయినా, మాటలు ప్రతిభావాన్నీ చేరవేస్తాయా? ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, మిత్రుడు ఎరిక్ మాట్లాడే డేనిష్.. అందరినీ అడిగి చూశాను.. మనుషుల ప్రగాఢమైన సుఖదుఃఖాలను, తృప్తి, అసంతృప్తులను, శాంతిని, క్రోధాన్ని సరిగ్గా చేరవేయగల మార్గాలను ఇంతవరకూ ఏ భాషా కనుక్కోలేదు’ అని అమ్మకు రాసిన లేఖలో అంటాడు చిత్త. భాషలు చెయ్యలేని ఆ పనిని అతని చిత్రాలు చేశాయి. 

చిత్తప్రసాద్ 1915 జూన్ 21న పశ్చిమ బెంగాల్ లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో నైహాతిలో పుట్టాడు. తల్లిదండ్రులు ఇందుమతీ దేవి, చారుచంద్ర భట్టాచార్య. చారుచంద్ర ప్రభుత్వోద్యోగి. పియానో వాయించేవాడు. ఇందుమతి కవిత్వం రాసేది, పాటలూ పాడేది. పుస్తకాలంటే పిచ్చిప్రేమ. ఈ పిచ్చి కొడుక్కీ సోకింది. పుస్తక సేకరణ సామ్రాజ్య నిర్మాణం వంటిదంటాడు చిత్త. అతనికి తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా అంతకుమించిన సాహితీసంస్కారాన్ని, బీదలపట్ల సానుభూతిని, నమ్మిన విలువల కోసం రాజీలేనితనాన్ని అందించారు. చిత్తకు ఒక చెల్లెలు. పేరు గౌరి. ‘దాదామోషి’ ఆ పిల్లను చెల్లి అని కాకుండా ముద్దుగా అక్కాయ్ అని పిలిచేవాడు. చారుచంద్ర ఉద్యోగరీత్యా మిడ్నపూర్, చిట్టగాంగ్ లలో కాపురమున్నాడు. చిత్త ఇంటర్, డిగ్రీ చిట్టగాంగ్ ఆ ఊళ్లలోనే పూర్తి చేశాడు.

 

బెంగాల్ విద్యావేత్త  ప్రొఫెసర్ జోగేశ్ చంద్ర రాయ్(1859-1952) లైబ్రరీ చిత్తకు చిత్రలోకాన్ని పరిచయం చేసింది. కుర్రాడు సాయంత్రం పూట జోగేశ్ పుస్తకాలను తుడిచి, సర్దిపెట్టేవాడు. అందుకు ప్రతిఫలంగా ఆ పెద్దాయన ‘ప్రభాషి’, ‘భరతబర్ష’ వంటి పత్రికల్లో వచ్చే బొమ్మలను ఇచ్చేవాడు. ఓ రోజు వాటర్ కలర్స్ బాక్సు కానుకగా ఇచ్చాడు. చిత్త బొమ్మల్లో మునిగి తేలాడు. జోగేశ్ తనను సొంత మనవడిలా చూసుకున్నాడని అంటాడు చిత్త.

3 (4)

1930వ దశకంలో బెంగాల్ విప్లవాగ్నులతో కుతుకుత ఉడుకుతుండేది. చిట్టగాంగ్ ఆయుధాగారంపై సమర్ సేన్ దండు ముట్టడి, తర్వాత విప్లవకారులను బ్రిటిష్ వాళ్లు వేటాడి చంపడం.. బ్రిటిష్ తొత్తుల ఇళ్లపై అనుశీన్ సమితి దాడులు… ఇవన్నీ చిత్త చుట్టుపక్కలే జరిగాయి. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఫాసిస్టులు బెంగాల్ పొరుగున ఉన్న బర్మాను ఆక్రమించారు. చిట్టగాంగ్, కలకత్తాలపై బాంబులు వేశారు. చిత్త రాజకీయాల్లోకి రాక తప్పలేదు. రహస్య కమ్యూనిస్టు రైతు సంఘాలతో పరిచయమైంది. జపాన్ దాడిని వ్యతిరేకిస్తూ చిత్త వేసిన పోస్టర్లను గ్రామం పక్కన పొలంలో కర్రలు పాతి, తడికలకు అతికించి ప్రదర్శించారు. అక్షరమ్ముక్క తెలియని జనం కూడా వాటిని చూసి మెచ్చుకున్నారు. అది అతని తొలి ఎగ్జిబిషన్. కొండంత స్ఫూర్తని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వేడుక.

చిత్త నిజానికి శిల్పికావాలనుకున్నాడు. కానీ ఆ కళాశిక్షణా గట్రా ఖరీదు వ్యవహారం కావడంతో చిత్రకళతో సరిపెట్టుకున్నాడు. బొమ్మల పిచ్చితో కలకత్తా వెళ్లాడు. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ చేశాడు. రాజకీయాల్లో తలదూర్చనని హామీ ఇస్తేనే సీటిస్తానన్నాడు. చిత్త నిరాకరించి బయటికొచ్చేశాడు. తన ఆరాధ్యుడైన నందలాల్ బోస్ కళాపాఠాలు బోధిస్తున్న శాంతినికేతన్ కు వెళ్లాడు. రవీంద్రనాథ్ టాగూర్ ముందు కూర్చుని అతని బొమ్మను చకచకా గీసిచ్చాడు. టాగూరు, నందలాల్ ఇద్దరూ భేష్ అన్నారు. ‘నీకు మేం నేర్పేదేమీ లేదు, కాలం వృథా చెయ్యకుండా వెళ్లిపో, మమ్మల్ని మించిపోతావు!’ అని భుజం తట్టారు. చిత్త స్వయంకృషితో కళాసాధన చేశాడు. ఉడ్ కట్లు, లినోకట్లు, ఆయిల్స్, వాటర్ కలర్స్.. ఏది పట్టుకున్నా కళ్లు చెదిరే బొమ్మ తయారై బోలెడు ముచ్చట్లు చెప్పేది. చిత్త 1938లో రంగుల్లో వేసుకున్న స్వీయచిత్రంలో అతని నవకాశల యువపేశల స్వప్నకాంతులను చూడొచ్చు.

2 (4)

చిత్త 1937-38 లో కమ్యూనిస్టులకు మరింత దగ్గరయ్యాడు. బ్రాహ్మణ్నని గుర్తుచేసే భట్టాచార్య తోకను కత్తిరించుకున్నాడు. జంధ్యప్సోసను తెంచేశాడు. అవసరమున్నప్పుడు జంధ్యప్సోసను, నగానట్ర, పట్టుచీరలను బహు అందంగా తగిలించుకుని, అవసరం లేనప్పుడు బీరువాల్లో అతి జాగ్రత్తగా దాచుకుంటూ, తోకలను, కొమ్ములను భద్రంగా మోసుకు తిరిగే నేటి ‘వీరవిప్లవ కమ్యూనిస్టులు’ చిత్తను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదా ?

40వ దశకంలో దేశం విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలతో కోట్ల వాల్టుల ఎర్రలైటులా ప్రకాశించింది. ఒక పక్క క్విట్ ఇండియా రణన్నినాదాలు.. మరోపక్క తెభాగా, పునప్రా వాయలార్, తెలంగాణా సాయుధ పోరాటాలు బ్రిటిష్ వాళ్లకు, వాళ్ల తొత్తు కుక్కలకు చుక్కలు చూపించాయి. సాంస్కృతిక కళారంగాల్లోనూ కొత్త విలువలు, ఆదర్శాలు పురివిప్పి నాట్యమాడాయి. ఫాసిస్టు వ్యతిరేక రచయితల, కళాకారుల సంఘం(ఏఎఫ్ డబ్ల్యూఏ), అభ్యుదయ రచయితల సంఘం(పీడబ్ల్యూఏ), భారత ప్రజానాట్యమండలి(ఇప్టా) అన్నీ నూతన మానవుడిని కలగంటూ పలవరింతలు పోయాయి. చిత్త కూడా రూపారూపాల్లో కలలుగన్నాడు. కమ్యూనిస్టుల దళపతి పీసీ జోషి చిత్తలోని కార్యకర్తనే కాక కళాకారుడినీ గుర్తించాడు.  పూర్తికాలం కార్యకర్తగా బాంబేకి పంపాడు.

కమ్యూనిస్టు పార్టీ పత్రికలైన ‘పీపుల్స్ వార్’, ‘జనయుద్ధ’లకు, బులెటిన్లకు ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం, రైతు, కార్మిక సంఘాలకు పోస్టర్లు రూపొందించడం చిత్త పని. ‘ప్రచార కళే’ అయినా కళావిలువల్లో ఎక్కడా రాజీపడకపోవడం చిత్త సాధించిన అరుదైన విజయం. ‘ప్రచార కళ’ అనేది మోటుగా చెప్పాలంటే తప్పుడుమాట. ఎందుకంటే కళను ప్రచారం కోసమే సృజిస్తారు కాబట్టి. ప్రచార కళా, మామూలు కళా అని రెండు రకాలు ఉండవు. కళకు కళాసౌందర్యవిలువలే ప్రమాణం. కళ ఎక్కడున్నా కళే. ‘ప్రచారం’లో ఉన్నంత మాత్రాన కళ కళ కాకుండా పోదు. మనిషి కళను ఎరిగింది మొదలు దాని లక్ష్యమంతా ప్రచారమే. ఆదిమానవులు గుహల్లో గీసిన బొమ్మలు, అధునిక మానవులు గుళ్లలో వేసిన బొమ్మలు, నవాధునిక మానవులు ఎక్కడెక్కడో వేస్తున్న బొమ్మలు.. వీటన్నింటి ఉద్దేశం తమ భావాలను ఎదుటి మనిషికి చెప్పుకోవడం. కాఫ్కాలు, వైల్డులు, డాలీలు, పొలాక్ లు తమ రచనలను, చిత్రాలను సృజించిది నేలమాళిగల్లో, భోషాణాల్లో ఎవరికంటా పడకుండా దాచిపెట్టుకోవడానికి కాదు. చిత్త బొమ్మలు బండగా, అందవికారంగా ఉంటాయని పైకి చెప్పకున్నా కొంతమంది కళాభిమానుల లోపలి అభిప్రాయం. ‘కళలో గుణం(కేరక్టర్) లేకపోవడం ఉంటుంది కానీ అందవికారమనేది అసలుండదు’ అని అంటాడు ఫ్రెంచి మహాశిల్పి అగస్త్ రోదా.

                     మిగతా వచ్చేవారం.

 

 

 

 

మీ మాటలు

 1. మోహన్ గారు
  చిత్రకళారంగంనుంచి ఎవరయినా చిత్తప్రసాద్ గురించి స్పందిస్తరోలేదోనని ఎదురు చూస్తున్న నాకు మీ స్పందన ఎంతో ఆనందాన్ని కల్గించింది. జూన్ ప్రజాసాహితి ముఖచిత్రం చిత్తప్రసాద్ దే .21 న విజయవాడలో ఆయన చిత్రాల ప్రదర్సన ఒక ఆర్ట్ గేలరీ లో జనసాహితి ఏర్పాటు చేసింది ,మొగల్రాజపురం మధు మాలక్ష్మి చాంబర్స్ 4 వ అంతస్తులో . మోహన్ ప్రారంభిస్తారు, ఉదయం 10.30 నుండి సాయంత్రం 7 వరకు, 5-30 కు సభ. టీవీ, మోహన్,రవిబాబు,దివికుమార్,డాక్టర్ అరుణ మొ.వారు మాట్లాడతారు . మీకు వీలైతే రండి, మాట్లాడుదురు. మీ అడ్రస్ నా ఈమెయిలు కి పంపితే ప్రజాసాహితి పంపిస్తాను.
  రవిబాబు కొత్తపల్లి

 2. narsan b says:

  రోజుకింత తోలు మందమౌతున్న కాలమిది. మీ అంకుశం పోట్లు ఎ మేరకు కదిలిస్తాయో …
  మీకెంత మంటగా ఉంది బాబూ ..వచ్చే వారం కోసం ఎదిరిచూస్తుంటా …

 3. ధన్యవాదాలు రవిబాబు గారూ,
  నేను పీజీలో ఉన్నప్పుడు ప్రజా సాహితిలో వచ్చిన చిత్త కరువు బొమ్మను కాపీ చేశాను. చిత్త ప్రదర్శనకు రావాలనే ఉంది కానీ వీలు కుదరడం లేదు. ఈ ఏడాదిలో వీలయితే చిత్తపై చిన్న బుక్లెట్ తెద్దామని ప్రయత్నిస్తున్న.

 4. Thirupalu says:

  చిత్తప్రసాద్ గురించి తెలియజేసినందుకు ధన్య వాదాలు.

 5. ధన్యవాదాలు నర్సన్ గారూ,
  ఇంకొన్ని రోజులు చూడండి..ఒంట్లో రక్తమాంసాలు, ఎముకలు వగైరా ఏమీ మిగలనంతగా తోలు మన్దమెక్కి పోతుంది. జూన్ 21 యోగ డే కనుక చిత్త బర్త్ డే ఇక జనానికి తెలియదు. శరీర కష్టంతో రోజూ యోగాకు మించి యోగ చేస్తున్న జనానికి కూర్చుంటే లేవలేని గడ్కారి, అమిత్ షా బాపతు గాళ్ళు యోగ చేయాలని చెప్పడం ఈ అంతర్జాతీయ యోగ జోక్.

 6. Doctor Nalini says:

  చిత్తప్రసాద్ కళని, చిత్తశుద్ధిని చక్కగా పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు . ‘రసగుల్లా రాజ్యం ‘ అనే ఆయన కథని సమత రోషిని అనువదిస్తే, దాన్ని నాటకీకరించి, కొన్ని ప్రదర్సనలు ఇచ్చాము . 2015 నాటికి 100 ప్రదర్సనలు పూర్తి చేద్దామంటే కుదరలేదు . నేటి రాజకీయం మీద అది గొప్ప సెటైర్! ఆయన బొమ్మలు వేయడమే కాక , మురికివాడల పిల్లల కోసం తోలుబొమ్మలాటలు ఆడించే వాడని , గొప్ప కథలు కూడా రాసారని గుర్తు చేసుకుందాం . నలుపు తెలుపుల గాడతని ఎత్తి చూపిన మహనీయుడుగా ,వైరుధ్యాల సమాజం మీద బాణం ఎక్కుపెట్టిన వీరుడుగా , ప్రజా పోరాటాల కొమ్ముకాసిన యోధుడుగా ఆయన ఎప్పుడూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే వుంటాడు .

 7. నిశీధి says:

  చిత్తప్రసాద్ గురించి మీ మాటల్లో చదువుకోవటం గొప్పగా ఉంది . మీ శైలి లో ఎక్దం ఒక మూడు నాలుగు వందల పేజీల పుస్తకం అయినా ఇట్టే చదివేయొచ్చు . కుడోస్

 8. N Venugopal says:

  చాల బాగుంది మోహన్ … ఎప్పట్లాగే అనుకో.

  చిత్తప్రసాద్ బొమ్మలు సృజన ముఖచిత్రంగా రెండు మూడు సార్లు వేశాం. నా నవలా సమయం ముఖచిత్రంగా కూడ ఒక బొమ్మ వాడుకున్నాను. నిజంగా చిత్తప్రసాద్ ఇవాళ మనం తలచుకుంటున్నదానికన్న ఎన్నోరెట్లు ఎక్కువగా తలచుకోవలసిన అపురూపమైన ప్రజా కళాకారుడు. ఈ శతజయంతి వేళ నీ ప్రయత్నానికి అభినందనలు, కృతజ్ఞతలు….

 9. తిరుపాలు, నళిని, వేణగోపాల్, నళిని గార్లకు ధన్యవాదాలు.
  చిత్తను గుర్తుచేసుకునే అవకాశమిచ్చినందుకు సారంగకు రుణపడి ఉందాం.

 10. కె.కె. రామయ్య says:

  ప్రపంచ ప్రఖ్యాత డచ్చి చిత్రకారుడు విన్సెంట్ వ్యాన్గో జీవిత నవల ‘లస్ట్ ఫర్ లైఫ్’ ను ‘జీవన లాలస’ గా అనువదిస్తున్న పి.మోహన్ గారూ! ఆధునిక భారతీయ కళాసరోవరంలో పూచిన ఒకే ఒక ఎర్రకలువ చిత్తప్రసాద్ e-పుస్తకాలు పుస్తక మిత్ర అనిల్ బత్తుల గారి సౌజన్యమ్ తో వారి గూగుల్ డ్రైవ్ లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు

  https://drive.google.com/folderview?id=0B9EUWtnwNUZlb3VOTmZyRzdCR2M&usp=drive_web

  • శ్రీనివాసుడు says:

   ఆహా! ఇది ‘‘చిత్త’’ సంపూర్ణ సేకరణ కావచ్చునేమో! బోలెడు నెనర్లు రామయ్యా గారూ! మీరు ఈ మధ్యన ఇస్తున్న లంకెలన్నింటికీ ఒకేసారి చెబుదామని ఆగేను. అందుకోండి నెనర్ల గుట్టలు /\…. /\,,,,,,/\……/\……./\…../\,,,/\,,,,/\,,,/\

 11. satyanarayana says:

  Coincidence , కె కె రామయ్యగా రూ , నేనూ నిన్నే చిత్తప్రసాద్ గారి గురించి, పోస్ట్ చూశాను . చాలా గొప్ప చిత్రకారుడు .
  నేనూ Vincent Van Gogh ,చిత్రాలు చూసి మురిసిపోతాను .

మీ మాటలు

*