ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల …

జయశ్రీ నాయుడు 

 

jayasriవేసవి చివరికి వచ్చేశాం. ఋతుపవనాలొచ్చేశాయంటున్నారు. వర్షాకాలం మొదలయ్యే వేళల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులు బరువుగా నిలిచి చూస్తుంటే, రాబోయే వానదేవుడికి వింజామరలా చల్లని గాలి హాయిగొలిపే వేళల్లో, ఏదో చెట్టుకొమ్మలకి పొడవాటి వుయ్యాల తాళ్ళు వేలాడుతూ, ఆ ఉయ్యాలలో కూర్చొని కాలిపట్టీలు అందం వెలుగుతుంటే, అలవోకగా ఆ మబ్బుల్ని తాకాలన్న ఠీవిగా ఉయ్యాలలూగే సోయగాల్ని ఊహకు తెచ్చే కవిత,  ఈ వారం కవిత ఇది –  కె శివారెడ్డి గారి ” ఊహల్లోంచి ఊహల్లోకి”

కవికి ఊహ ఒక ఉయ్యాల…

ఆదిశ చివరనుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిల పడ్డ అరసున్నాలా…
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ

గ్రామీణ దృశ్యాన్ని మనముందుంచే ట్రంకు పెట్టె వాసనలూ, కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ – మనకిప్పుడు స్ఫురణకు రావడం కష్టమే. కానీ ఆ వర్ణనతో ఒక దృశ్యం మనోఫలకం మీద ఊపిరి పోసుకుంటుంది. విశాలంగా విస్తరించిన చెట్టు కొమ్మల్లో  కొత్తపరికిణీలో  ఊయలలూగే  నవయవ్వన సౌందర్య సామ్రాజ్ఞి కనిపిస్తుంది మనకిక్కడ.

నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు …

అచ్చమైన గ్రామీణ సంప్రదాయ ప్రతిబింబాలీ పదాలు. బావా మరదళ్ళ మధ్యన కొంత చనువును పెంచే అనేక సందర్భాల్లో ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఇది. వానలే మనకు జీవనామృతాలు.   గ్రామాల్లో తొలకరి వానల మెసెంజర్ తూనీగ. కవి చిన్ననాటి నుంచీ వెంట తెచ్చుకున్న  గ్రామీణ సౌందర్యం, అతని సౌందర్య పిపాస తరువాతి పంక్తుల్లో ఫ్రేము కట్టినట్టు కనిపిస్తుంది.

” బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ” 

ఇది ఒక తరం తో ఆగిపోయే రమణీయ భావన కాదు. తరతరాలకీ కొనసాగింపు. వర్ష ఋతువు ఆరంభం జీవన పాత్రనూ సౌందర్యంతో నింపుతుంది. ఆకాశపు ఆ కొస నుంచీ ఈ కొసవరకూ తిరగేసిన సున్నా వంటి ఉద్వేగపు తరంగం ఉయ్యాలతో పాటే ప్రయాణిస్తూ వుంటుంది.  ఆ నవయవ్వన శృంగారదృశ్యావతరణాన్ని చూసి దిక్పాలకులకే కన్ను కుడుతుందంటాడు.  ఉయ్యాల ఒక విధంగా కవి హృదయతరంగం కూడా. ఆ పల్లె నుంచీ ఈ పల్లెకీ, ఈ అడవి నుంచీ ఆ అడవికీ ప్రయాణించే అతని లోని సౌందర్యాన్వేషణ. ఎక్కడో ఏ మూలలోనో వెలిగే సౌందర్యాన్ని నింపుకోవాలనే తపన.

అద్దంలో నెలవంక

” ఇప్పటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభయ్యేళ్ళప్పుడు కూడ
వెర్రిగా చిన్న పిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది”  అంటాడు.

ఊహ మనలోని సృజనాత్మకతకి ప్రాణాధారం. ఎంతటి సౌందర్య సృజనైనా, యాంత్రిక క్రియాశీలతైనా మర్రి విత్తంటి సూక్ష్మ ఆలోచనా తరంగం – అదే – ఊహతోనే మొదలయ్యేది. ఆ ఊహ ఆలోచనా హర్మ్యాలు నిర్మించుకుని, కార్య రూపంలోకి దాల్చిన తర్వాత సాధించే విజయాలు మనిషిని అందరి గౌరవానికి పాత్రుడయ్యేంత ఎత్తులో నిలబెడతాయి.
” భూమ్యాకాశాల మధ్యనున్న సమస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ
ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు”  అని కోరుకుంటాడు.

జీవితం ఒక ఎడతెగని ప్రయాణం. వాస్తవాలు నేల మీద నడిపిస్తుంటే ఊహలు ఆకాశాన్నే నేస్తమంటాయి. ఊహలో వున్న ఉద్విగ్నత వాస్తవం లో వుండకపోవచ్చు. అందుకే ఊహకు పట్టం కట్టి, నిరంతర యాత్రికుడివి కమ్మంటున్నాడు. కవి తన వారసత్వం గా తన పద్యాన్ని వదిలి వెళితే, తర్వాత తరాలు ఆ పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకుని నిరంతరం ఊగవచ్చంటాడు. ఎంతటి ఆశావహ దృక్పథమో! ఎంతటి సౌందర్యావిష్కరణకైనా మొదలు ఒక చిన్న ఊహలోనే ఉంది. అది కవితైనా, కథ అయినా, మోనాలిసా మందహాసమైనా మైనా మరింకేదైనా. నిరంతరం అన్వేషణే జీవితానికి మనం బహూకరించగలిగే జవసత్వాలు.

కవితా సంకలనం పేరు:  నా కలలనది అంచున
  కవి: కె శివారెడ్డి
  కవిత శీర్షిక  : ఊహల్లోంచి ఊహల్లోకి 

ఊహల్లోంచి ఊహల్లోకి ఉయ్యాల
గాల్లోంచి గాల్లోకి ఉయ్యాల

ఆ దిశ చివర నుంచి ఈ దిశ చివరిదాకా ఉయ్యాల
వెల్లకిలా పడ్డ అరసున్నాలా
ఈ పక్కనుంచి ఆ పక్కకి దూసుకెళ్ళేటప్పుడు
ఒక్క సారి పొడుగాటి జడ భూమిని తాకుతూ వెళిపోతుంది
పరికిణీ కుచ్చిళ్ళు నేలను ముద్దిడుకుంటూ వెడతాయి
ఎక్కడో భూమి గర్భం లో సముద్రం గుండెల్లో
ఒక వణుకు మొదలవుతుంది
లోకమంతా ఉయ్యాలలూగుతుంది

************
 గలగలా పొంగే నవ్వులోంచి కన్నీళ్ళు
విచిత్రం! ఎత్తైన చెట్ల వేళ్ళు భూమిలో బలంగా
ఉయ్యాల వేళ్ళు చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగా,
కొత్త పరికిణీ ట్రంకుపెట్టె వాసనలూ
కావిడి పెట్టె బంగారు నగల మాగిన రంగూ –
కొత్తగా వేసుకున్న పైట పాము; జర్రున జారటాలూ
 ఏం చేయాలో తోచని కంగారూ పిచ్చి చూపులూ
దయకూడుకుంటున్న కళ్ళ పర్యావరణాలూ
ఎటు చూసినా పూలే పూలు; పూల జాతర్ల జ్ఞాపకాల రవళి
అక్కడ ఉయ్యాల మీద ఆకాశంలో తెలుతూ మా అక్క ఉంది
నా బుల్లి ప్రియురాలు ఉంది

*****
నా కళ్ళు ఉయ్యాలతో పాటు అటూ ఇటూ
ఇటూ అటూ ఊగీ ఊగీ తూగీ తూగీ తూలిపోతున్నాయి
తూనీగల్లా వాలుతున్నాయి కనిపించే జీవన మైదానమంతా
ఉయ్యాల కొయ్యకి కట్టిన తాడు పట్టుకుని
వరుసైన వాడెవడో ఊపుతుంటాడు

బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు
అప్పుడప్పుడు అరచేతులకేసి చూసుకొని
మురిపెంగా ముసి ముసిగా నవ్వుకుంటుంటాడు ఇప్పటికీ
దిక్పాలకులంతా వచ్చి చుట్టూ నుంచుంటారు
పైనున్న దేవతలంతా
వెర్రి ముఖాలేసుకుని నోట్లో వేళ్ళు పెట్టుకుని చూస్తుంటారు
” ఏమందం ఏమందం ఏమానందం ఏమానందం’ అని;

************

ఇప్పటికీ ఊహల ఉయ్యాలనెక్కి ఊగుతుంటాను
ఈ ఊరునుంచి ఆ ఊరికి ఆ యేటినుంచి ఈ యేటికీ
ఈ అడవి నుంచి ఆ అడవికీ ఈ పల్లెనుంచి ఆ పల్లెకీ
ఆ పల్లె నుంచి ఈ పల్లెకీ
ఇపాటికీ గుండెల్లో ఉయ్యాల కదులుతూనే ఉంది
యాభై యేళ్ళప్పుడు కూడా
వెర్రిగా చిన్నపిల్లాణ్ణి చేసి తిప్పుతూనే ఉంది
ఉన్నన్నాళ్ళు ఊగుతూనే ఉంటాను

నే వెళ్ళిపోయాక
నా పద్యాల వేళ్ళ చివర్లు పట్టుకొని
నిరంతరం ఊగుతుంటారు మీరు హాయిగా
కిందనుంచి పైకీ పైనుంచి కిందకీ;
షేక్స్పియర్ అన్నట్టు
భూమ్యాకాశాల మధ్యనున్న సంస్తాన్ని చూస్తూ
అనుశీలిస్తూ అనుభవిస్తూ ఆకారాన్నిస్తూ

ఊపిరి ఆగవచ్చునేమో కానీ
ఉయ్యాల ఆగకూడదు గుండెల్లోని ఉయ్యాల ఆగకూడదు

*

మీ మాటలు

 1. Mythili abbaraju says:

  అందంగా వేసిన బొమ్మకి ఇంకా చక్కటి పటం కట్టి చూపించారు మీరు , ఎప్పటిలాగే…

 2. నందిరాజు రాధాకృష్ణ says:

  “వరుసైన వాడెవడో ఊపుతుంటాడు” …
  –బావా మరదళ్ళ మధ్యన కొంత చనువును పెంచే అనేక సందర్భాల్లో ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఇది. (చక్కని పద అర్ధం..)
  “బహుశా – ఉయ్యాలతో పాటు ఇప్పటికీ ఊగుతుంటాడు”…
  —-ఇది ఒక తరం తో ఆగిపోయే రమణీయ భావన కాదు. తరతరాలకీ కొనసాగింపు. (ఉయ్యాల ఒక విధంగా కవి హృదయతరంగం కూడా.. నిజం కదా)
  “ఊపిరి ఆగవచ్చునేమో కానీ
  ఉయ్యాల ఆగకూడదు”…
  –నిరంతరం అన్వేషణే జీవితానికి మనం బహూకరించగలిగే జవసత్వాలు.(అంతర్లీన భావనలు..)
  కవులందరినీ చదవలేని వాళ్ళకు ఆ కవితలను కళ్లకు అద్ది మనసులో ముద్రిస్తున్నారు.. మీ విశ్లేషణల్లో ఇది నాలుగోది నేనుచదివింది…

 3. Jayashree Naidu says:

  నందిరాజు రాధాకృష్ణ గారు

  పెద్దలుగా మీ ఆత్మీయతా పూర్వక అభినందలు ఎప్పుడూ ఆనందకరమే
  ప్రతి వాక్యాన్నీ చదివి మనసారా మీరు అనుభూతించిన స్పందన కనపిస్తుంది.
  మీ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను మరిన్ని మంచి విశ్లేషణలతో…. _/\_

 4. కెక్యూబ్ వర్మ says:

  మీవిశ్లేషణతో మరల మరల చదవాలనిపించేలా రాస్తున్నారు మేడం ధన్యవాదాలు

 5. balasudhakar says:

  కవిత మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తది. విశ్లేషణ నచ్చింది.

 6. Siddenky Yadagiri says:

  poem chaaaaaala baundi sir

మీ మాటలు

*