Love in Summer!

వై.వి.రమణ
 
ramanaవేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం. ఎండ పెళపెళ్ళాడుతూ మండుతుంది, వడగాల్పు భగభగలాడుతూ వీస్తుంది. సూర్యుడు ఫ్యాక్షనిష్టు లీడర్లా మొరటుగా, కోపంగా వున్నాడు. రోడ్లన్నీ ఖాళీగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నయ్. ఆ సమయంలో ఎవరైనా జనాభా లెక్కల డిపార్టుమెంటువాళ్ళు లెక్కలు కడితే భారద్దేశ జనాభా ఫిన్లాండు కన్నా తక్కువ అని తేల్చేస్తారు!
వీధిలో మూలగా ఒక చిన్న ఇల్లు, చిన్నదైనా ముచ్చటగా వుంది. అది ఒక ప్రముఖ తెలుగు రచయితగారిది. గదిలో ఏసీ మెత్తగా, నిశ్సబ్దంగా పన్జేస్తుంది. గది చల్లగా వుంది. రచయితగారు ఎర్రగా వున్నారు, బుర్రగా వున్నారు. వారి జులపాల జుట్టు ఏసీ గాలికి నుదుటి మీద అలలా అలాఅలా కదుల్తుంది. వారి తెల్లని జుబ్బా, పైజమా బట్టల సబ్బు ఎడ్వర్టైజ్‌మెంటులా తళతళా మెరుస్తున్నయ్.
రచయితగారు తెలుగు రచనా రంగంలో సుప్రసిద్ధులు. వారు పదుల సంఖ్యలో పుస్తకాలు రచించారు, వేల సంఖ్యలో పుస్తకాలు అమ్ముకున్నారు. మార్కెట్ అవసరాలకి తగ్గట్టుగా కథలు రాయడంలో వారు నిష్టాతులు. సమయానుకూలంగా పాలకోవాల్లాంటి ప్రేమ కథలు రాయగలరు, కషాయంలాంటి విషాద కథలూ వినిపించగలరు. అవసరమైతే – మిర్చిబజ్జీలాంటి విప్లవ కథలతో భగభగా జ్వలించగలరు, అన్నార్తుల ఆకలి కేకలతో కేకుల్లాంటి కవితలు బేక్ చేసి హృదయాల్ని ద్రవింప చెయ్యగలరు, దగాపడ్డ దళితుల దుర్దశని దుఃఖభరితంగా వర్ణించనూగలరు. వారి కలానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వారొక సంపూర్ణ రచయిత. ప్రస్తుతం వారి కలం నుండి ఒక చిక్కని ప్రేమ కథ మెత్తగా జాలువారుతుంది.
ఆమె మెరుపు తీగ, కలువ బాల. అందంలో ఐశ్వర్యారాయ్, చందంలో కాంచనమాల. నవ్వితే మధుబాల, నవ్వకపోతే నర్గీస్. పేరు రాధ. ఆమెకు డబ్బున్నవాళ్ళన్నా, ఆకర్షణీయమైన మగవాళ్ళన్నా మిక్కిలి ఆసక్తి. ఈ రెండూ వున్నవాళ్ళ పట్ల మరింత మిక్కిలి ఆసక్తి. డబ్బులేని జీవితం నీళ్ళులేని కొబ్బరి బోండాం వంటిదని ఆమె నమ్మకం.
అతను ఆరడగులవాడు, తెల్లతోలువాడు, దండిగా డబ్బున్నవాడు, ఖరీదైన కారున్నవాడు, ఎల్లప్పుడూ డిజైనర్ దుస్తులే ధరించువాడు, శోభన్‌బాబు విగ్గులాంటి జుట్టుగలవాడు. దగ్గితే ధర్మేంద్రలా, దగ్గకపోతే అమీర్ ఖాన్‌లా వుంటానని అనుకుంటూ వుంటాడు. పేరు కృష్ణ. ప్రేమ లేని జీవితం జీడిపఫ్ఫు లేని పాయసం వంటిదని నమ్మినందున.. అందమైన అమ్మాయిల మెరుపు కళ్ళల్లో ప్రేమను వెతుక్కుంటుంటాడు.
గత కొన్నిరోజులుగా రాధ, కృష్ణ – తీవ్రంగా, తీక్షణంగా ప్రేమించుకుంటున్నారు. రోజూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని పది గంటలు కబుర్లు చెప్పుకుంటూ మైమరచిపోతారు. ఇంకో పది గంటలు ఫేస్బుక్కులో ఛాటింగ్ చేసుకుని పులకించిపోతారు. ఆ మిగిలిన నాలుగ్గంటలూ వాట్సప్పులో మెసేజిలు పంపుకుంటూ సంబరపడిపోతారు.
‘ప్రేమ’ – ఒక  మధుర భావన!
‘ప్రేమ’ – ఒక మది పులకరింత!
రాధ కృష్ణని చూసినప్పుడు సిగ్గుతో గువ్వలా (గవ్వ కాదు) అయిపోతుంది. బుగ్గలు సిగ్గుతో ఎలర్జిక్ రాష్ వచ్చినట్లు ఎర్రగా అయిపోతాయి. రాధ సిగ్గుల మొగ్గైనప్పుడు కృష్ణకి ప్రపంచాన్నే జయించినంత గర్వం, ఆనందం.
అంచేత –
‘ఆహా! ఏమి నా అదృష్టం, ఈ చిన్నది నా ప్రేయసి అగుట నా పూర్వజన్మ సుకృతం.’ పాత తెలుగు సినిమా జానపద హీరో స్టైల్లో అనుకుంటాడు కృష్ణ.
ఇలా ఒకళ్ళనొకళ్ళు తీవ్రమైన ప్రేమతో కొద్దిసేపు చూసుకున్న పిమ్మట, రాధ కృష్ణ కౌగిలిలో ఒదిగిపోయింది.
సృష్టిలో అత్యంత తీయనైనది ఏమి? – ప్రేమ!
ప్రపంచంలో అమూల్యమైనది ఏమి? – ప్రేమ! ప్రేమ!!
భూమండలాన్ని గిరగిరా తిప్పేది, పడిపోకుండా నిలబెట్టేది ఏమి? – ప్రేమ! ప్రేమ!! ప్రేమ!!!
సందేహం లేదు. ప్రేమ అనునది పెసరట్టు కన్నా రుచికరమైనది, తిరుపతి లడ్డు కన్నా తీయనైనది, కొత్తావకాయ కన్నా ఘాటైనది.
ఓయీ తుచ్ఛ మానవా! నిత్యావసర వస్తువుల రేట్లు, నిరుద్యోగం, అవినీతి, నేరాలు – పెరిగిపోతూనే వుంటాయి. అది ప్రకృతి ధర్మం. అందువల్ల నీవా పనికి మాలిన విషయాల గూర్చి కలత చెందకు. ప్రేమతో హృదయాల్ని కొల్లగొట్టు. ప్రేమతో ప్రపంచాన్ని జయించు!
అందువల్ల – ప్రేమించు! బాగా ప్రేమించు! ప్రేమని మనసారా గ్రోలుము, ఆస్వాదింపుము! ప్రేమ నీ జీవితాన్నే మార్చేస్తుంది. మానవ జీవితం చిన్నది, పొట్టిది, పెళుసుది.. ప్రేమంచి దానికి సార్ధకత చేకూర్చుకో!
ఇంతలో –
‘టప్’ – కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది. క్రమేపి చల్లదనం తగ్గసాగింది. రచయితగారికి ఇబ్బందిగా అనిపించింది. కానీ వారు కథ రాయడం ఆపలేదు (తుచ్ఛమైన కరెంటు వారి కలాన్ని ఆపలేదు).
ఆరోజు కృష్ణని చూసిన రాధ (రోజూ పడే) సిగ్గు పళ్ళేదు, బుగ్గలు మొగ్గలెయ్యలేదు.
మొహం చిట్లించాడు కృష్ణ.
‘ఐ ఫోన్ కొనిమ్మని నిన్ననే కదా అడిగింది? ఈలోపే సిగ్గు పట్టం మానెయ్యాలా? ఈ అమ్మాయిలింతే, వీళ్ళవన్నీ ఎమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రేమలు! రాజకీయ నాయకుల్లో నీతీ, అమ్మాయిల్లో ప్రేమ.. ఎడారిలో ఎండమావి వంటివి.’
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలా మొహం మాడ్చుకుంది రాధ.
‘గిఫ్టు కొనివ్వలేడు గానీ, రోషానికి మాత్రం తక్కువ లేదు. తెల్ల దొరసానమ్మని నల్ల బానిస చూస్తున్నట్లు దేబిరిస్తూ ఎట్లా చూస్తున్నాడో కదా! ఓడిపోయిన పొలిటీషయన్ని, ఒట్టిపోయిన ప్రియుణ్ని సాధ్యమైనంత తొందరగా ఒదుల్చుకోమన్నారు పెద్దలు.’ అనుకుంది రాధ.
ఇప్పుడు గది వేడిగా అయ్యింది. ఉక్కపోతగా వుంది. రచయితగారికి బాగా చికాగ్గా వుంది. అయినా వారు రాస్తూనే వున్నారు (కరెంటు తుచ్ఛమైంది కాదు)!
ఏవిటీ ప్రేమ గొప్ప? తిని అరగని ప్రతి గాడిదా ప్రేమ, ప్రేమ అంటూ కలవరించడమే! ప్రేమ ఒక జ్వరం, ప్రేమ ఒక గజ్జి, ప్రేమ ఒక స్వైన్ ఫ్లూ, ఒక డెంగీ, ఒక ఎబోలా. సామాన్య ప్రజలు ఉక్కపోతతో, చెమటల్తో నానా ఇబ్బందులు పడుతుంటే – ఈ ప్రేమికులు మాత్రం ‘ప్రేమ! ప్రేమ!’ అంటూ కలవరిస్తుంటారు, పూనకం వచ్చినాళ్ళలా పలవరిస్తుంటారు.
ఓయ్ భజరంగ్ దళ్ కార్యకర్తలూ! ఒక్క వేలెంటేన్స్ డే రోజునే కాదయ్యా, మీరు ప్రతిరోజూ ప్రేమికుల్ని తంతూనే వుండండి! మాతృభూమిని శతృసంస్కృతి నుండి రక్షించండి!!
అబ్బా! ఈ ఉక్క భరించడం కష్టమే! చెమటకి జుబ్బా తడిసిపొయింది. వామ్మో! కుంపట్లో కూర్చున్నట్లుగా వుందిరా దేవుడోయ్ (కరెంటు ఎంతో ఉన్నతమైనది)!
‘ప్రేమికులకి బుద్ధి లేదు, ప్రేమకి అర్ధం లేదు. ప్రేమికులకి నిర్భయ చట్టాన్ని వర్తింపజెయ్యాలి, జైల్లో కుక్కాలి, ఉరి తియ్యాలి. భారద్దేశానికి తక్షణ సమస్య యేమి? ఎండ, ఉక్కపోత, చెమట! అయ్యా రాజకీయ నాయకులూ! ఇప్పుడు ప్రజలక్కావల్సింది స్మార్ట్ సిటీలు కాదండీ! కోల్డ్ సిటీస్! ఇదే అసలైన సమస్య. నా దేశ ప్రజలారా! రండి – వేసవికి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం! రండి – ఉక్కపోత మహమ్మారిని తరిమేద్దాం! రండి – చెమటని పారద్రోలుదాం! రండి – పోరాడితే పొయ్యేదేం లేదు, చెమటకంపు తప్ప! విప్లవం జిందాబాద్! ప్రభుత్వం ముర్దాబాద్!’
ఇంతలో –
‘టప్’ – కరెంటొచ్చింది. ‘బయ్’ – ఏసీ పంజెయ్యడం మొదలెట్టింది. చల్లగాలి రచయితగారి ముఖానికి పిల్ల తెమ్మరలా తగిలింది. చెమటకి తడిసిన వారి జులపాల జుట్టు ఆనందంగా, ఉత్సాహంగా ఎగెరెగిరి పడసాగింది. రచయితగారు రెణ్ణిమిషాలపాటు ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూ పరవశంగా కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపటికి వారి శరీరం చల్లబడింది. మరి కొద్దిసేపటికి ఉత్సాహంగా రాయడం కొనసాగించారు.
పవిత్రమైన ప్రేమకి కరెంటుకోత అడ్డు కాదు, కారాదు. కృష్ణ రాధని ప్రేమగా, మురిపెంగా చూశాడు. ‘అయ్యో! నా ప్రేయసిని అపార్ధం చేసుకున్నానే! ఎంత తప్పు చేశాను! స్వగృహ ఫుడ్స్ వారి ఖరీదైన జీడిపప్పు పాకం వంటి రాధ ప్రేమని, అలగా జనం తినే చౌకబారు వేరుశెనగ పప్పుండగా భావించానే!’
‘రాధీ! నన్ను క్షమించు.’
రాధ కృష్ణని చూసింది. ఆ చూపులో కిలోల్లెక్కన  ప్రేముంది, టన్నుల్లెక్కన ఆరాధనుంది. ‘అయ్యో! కిన్లే వాటరంత ఖరీదైన వ్యక్తిని మునిసిపాలిటీ కుళాయి నీళ్ళంతటి చీప్ మనిషనుకున్నానే! నా ప్రియుడు ప్రేమికులకే ప్రేమికుడు – ప్రేమశ్రీ, ప్రేమభూషణ్, ప్రేమరత్న. ప్రియతమా! నిన్నెంత తప్పుగా అర్ధం చేసుకున్నాను!’
‘క్రిష్! నన్ను క్షమించు.’ అంటూ ప్రియుని వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది రాధ.
ప్రేమ – స్వచ్చం, ప్రేమ – నిజం, ప్రేమ – అమర్ రహే, ప్రేమ – జిందాబాద్.
జైహింద్!
*

మీ మాటలు

  1. వనజ తాతినేని says:

    రచయిత గారిని యద్దనపూడి వర్ణించినంత వర్ణించారు. :) కానీ రచయిత రచన మాత్రం కరంట్ కోతకి ముడివేసేసి మలుపులు తిప్పేసారు.

    సౌకర్యాలు లేనప్పుడే నిజాలు బయట పడతాయని భలే చెప్పారండీ .

    ” ఈ అమ్మాయిలింతే, వీళ్ళవన్నీ ఎమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రేమలు! రాజకీయ నాయకుల్లో నీతీ, అమ్మాయిల్లో ప్రేమ.. ఎడారిలో ఎండమావి వంటివి.” బాగా పేలింది .

    మొత్తానికి మీ రచన నా చేత జిందాబాద్ అనిపించింది .

మీ మాటలు

*