రెండే ఋతువులు నాకెప్పుడూ!

నిషిగంధ 

సరే కానీ, ఇక్కడున్నట్టు వచ్చేయకూడదూ..

దిగుల్లేని తీరిక అస్సలుండదని తెలిసి
తలుపులన్నీ బార్లా తెరిచి
ఆ మూలా ఈ మూలా రెపరెపలాడుతున్న చీకట్లని
ఊడ్చి తుడిచేసి,
సగం రాసిన ఉత్తరాలన్నీ సర్దిపెట్టి,
వాకిట్లో గాలితెరలు వరుసగా వేలాడదీసుకుంటూ
అదేపనిగా ఎదురుచూడలేను కానీ..
గుమ్మానికి కనురెప్పల్ని అతికించి వదిలేస్తాను!

ఆకాశం ఆ కనిపించే నల్లటి కొండల వెనగ్గా వెళ్ళి
నీలాన్నికొంచెం కొంచెంగా ఒంపేసుకోకముందే
వచ్చేశావనుకో..
వస్తూ వస్తూ..
రహస్య రాత్రుళ్ళకి మనం
రాసీ పూసీ మిగిల్చేసిన రంగులూ తెచ్చేశావనుకో
కిటికీ అవతల ముడుచుకు కూర్చున్న సుదీర్ఘ శిశిరానికి
కాసిని ఊగే పూవులూ, ఎగిరే గువ్వలూ అద్దేస్తాను!

నువ్వొచ్చాక ఒకటి.. వచ్చి వెళ్ళాక మరొకటీ
రెండే ఋతువులు నాకెప్పుడూ!
గుర్తుంచుకుందామనుకుని కూడా మర్చిపోతావెందుకో !!

పచ్చిక పొరల మధ్య నించి ఓ పిల్లగాలి
చాలా సేపట్నించే కాళ్ళావేళ్ళా పడుతోంది
పొద్దుటి ఎండ తరపున క్షమాపణలు అడుగుతోంది
వెలుతురు నవ్వులు మోసుకుంటూ ఇక నువ్వు వచ్చేయొచ్చు!

అనుకున్నంత కష్టమేం కాదు కూడా!
అడగాలనిపించని ప్రశ్నల్నీ, అడుగులు పడనీయని అలసటనీ
కాస్త కాస్తా దాటుకుంటూ
కాసేపలా వచ్చి కూర్చుంటే చాలు..

బాకీ ఉన్న జీవితంలోంచి
మనవే అయిన పాటల్లో విచ్చుకునే పూల తోటల్నీ,
వాటినే అంటిపెట్టుకున్న ఇంకొన్ని మసక రాత్రిళ్ళనీ రాసిచ్చేస్తాను!
*

painting: Anupam Pal

మీ మాటలు

  1. “నువ్వొచ్చాక ఒకటి.. వచ్చి వెళ్ళాక మరొకటీ రెండే ఋతువులు నాకెప్పుడూ! ” , ”సరే కానీ, ఇక్కడున్నట్టు వచ్చేయకూడదూ..వెలుతురు నవ్వులు మోసుకుంటూ !” భద్రంగా దాచుకున్నాం నిషిగంధ గారూ మీ కవితని! అందమైన ‘మనవి’ని!

  2. rajaramt says:

    చాల బాగుంది నిషీగంధ గారు
    గుమ్మానికీ కనురెప్పల్ని అతికించి అనే మాట మీ మొత్తం కవిత.సింప్ల్య్ superb

  3. మంచి కవిత

  4. paresh n doshi says:

    వాకిట్లో గాలితెరలు వరుసగా వేలాడదీసుకుంటూ

    ఈ వాక్యం నన్ను ఆపేసింది. యెట్లా వస్తాయండి యిట్లాంటి వూహలు. చాలా నచ్చింది మీ కవిత.

  5. చాలా బావుంది నిషీ! పెందరాడే రమ్మని ఎంతందంగా పిలిచారు!!?

  6. ప్రసూన రవీంద్రన్ says:

    అబ్బా. భలే ఉంది నిషీ. చదువుతున్నంతసేపూ గాలి తెరలూ, పూల రేకులూ ఊగుతూనే ఉన్నాయి. చదివాక కూడా చాలా సేపు సువాసనలు చుట్టుకునే ఉన్నాయ్. అందమైన అనుభూతి.

  7. Mythili Abbaraju says:

    ”నువ్వొచ్చాక ఒకటి.. వచ్చి వెళ్ళాక మరొకటీ
    రెండే ఋతువులు నాకెప్పుడూ! ” …ఈ రెండు వాక్యాలే చాలు అసలు !! Scintillatingly romantic !

  8. Saikiran says:

    చాలా అద్భుతమైన కవిత నిషిగంధ గారు. మీ మునుపటి కవితలతో పోలిస్తే, నడక అద్భుతంగా ఓ ప్రవాహంలా సాగిపోయింది. నాకు చాలా చాలా నచ్చేసిన కవిత.

  9. n s murty says:

    నిషిగంధ గారూ,

    చాలా రోజులయింది వర్షం పడి … అనుకుంటుండగానే వర్షం పడ్డట్టు ఉంది…

    అభివాదములు

  10. ఈ కవిత్వం నిండా పదపరిమళాలె . అద్భుతం!!

  11. Dr.Vijaya Babu, Koganti says:

    Dear Nishi గారు
    చాల అందమైన కవిత. ‘ వచ్చేసావనుకో’ ‘ తెచ్చేసావనుకో’ అనే ఈ ప్రయోగాలు కొంచెం ఆవేగాన్ని పెంచాయి.
    “నువ్వొచ్చాక ఒకటి.. వచ్చి వెళ్ళాక మరొకటీ
    రెండే ఋతువులు నాకెప్పుడూ!
    గుర్తుంచుకుందామనుకుని కూడా మర్చిపోతావెందుకో !!” అందాన్ని పెంచిన వాక్యాల లో మాణిక్యాలు.

  12. Dr.Vijaya Babu, Koganti says:

    మరొక్క మాట. అనుపం పాల్ గారి చిత్రం మరింత సొబగు చేకూర్చింది.

  13. Krishna Keerty says:

    చదవడమే తప్ప ఇక్కడ కామెంట్ చేసే అర్హత లేదు కాని వాకిట్లో గాలి తెరలు వరుసగా వేలాడ తీయటం, కొండల వెనక ఆకాశం,కొంచెం కొంచెం గా నీలాన్ని ఒంపేసుకొవడం చాలా బాగుందండి!!! టైటిల్ లోనే మంచి ఇంట్రెస్ట్ పుట్టించారు

  14. నిషిగంధ says:

    రేఖా,
    రాజారామ్ గారు,
    భవానీ గారు,
    పరేష్ గారు,
    రాధ గారు,
    ప్రసూనా,
    మైథిలి గారు,
    సాయికిరణ్ గారు,
    మూర్తి గారు,
    చిదంబరరెడ్డి గారు,
    డా. విజయ బాబు గారు,
    కృష్ణ గారు…..

    అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. నా నాలుగు అక్షరాలు మిమ్మల్ని తాకి, మెప్పించగలగడం చాలా సంతోషంగా ఉంది!

    అసలు ఈ కవితకి అదనపు అర్ధం, అందం తీసుకురాగలిగిన ఒక అధ్బుతమైన పెయింటింగ్‌ని జత పరిచినందుకు సారంగ వారికి మరెన్నో కృతజ్ఞతలు!

  15. కథ చాలా బాగుంది చెపాల్సింది ఇంకా ఏమి లేదు

  16. చీకట్లను ఊడ్చి తుదిచేయడం …వాకిలి లో గాలి తెరలు వేలాడదీయటం…గుమ్మానికి కనురెప్పలు అతికించటం …రహస్య రాత్రుళ్ళకి రంగులు పూసేయడం …సుదీర్ఘ శిశిరానికి ఊగే పువ్వులు ..ఎగిరే గువ్వలు అద్దేయడం ….మీ పద అడవి సంపెగల పరిమళం మాకు గుమ్మేత్తించింది…నిషి గంధ గారు

  17. నిషిగంధ says:

    హృదయపూర్వక ధన్యవాదాలు, సరళ గారు.

  18. Prof P C Narasimha Reddy says:

    A sumptuous feast to the literati ! Prof P C Narasimha Reddy

  19. నిషిగంధ says:

    Thanks so much, Narasimha Reddy gaaru.

  20. p v vijay kumar says:

    Oh my goddd…i hav no words. How simplistic expression and how depth of feeling gets fusioned !!!!!!! Thanq for sharing is just not enough….

మీ మాటలు

*